Thursday, 10 April 2025
ఇతి గుహ్యతమం శాస్త్రం
ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ।
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్ కృతకృత్యశ్చ భారత॥20॥
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశాధ్యాయః
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!అతిరహస్యమయిన ఈ శాస్త్రాన్ని నీ కోసమే చెప్పాను.ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు,గ్రహించిన వాడు జ్ఞాని అవుతాడు.వాడి జన్మ ధన్యం అవుతుంది.వాడు కృతార్థుడు అవుతాడు.ఇందులో సందేహం లేదు.
యో మామేవ మసమ్మూఢో.
యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం।
స సర్వ విద్భజతి మాం సర్వభవేన భారత॥19॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్పీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇక్కడ గందరగోళం ఏమీలేదు.ఎలాంటి అనుమానాలు,సంశయాలు,శంకలు,గిలులు లేకుండా నన్నే పరమాత్మగా గుర్తించాలి.అర్థం చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి.ఎందుకంటే నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు.అతడు అన్ని విధాలా నా శరణులోకి వస్తాడు.నన్నే సేవిస్తాడు.ముక్తి పథంలో పయనిస్తాడు.
Wednesday, 9 April 2025
యస్మాత్ క్షరమతీతోఽహం
యస్మాత్ క్షరమతీతోఽహం అక్షరాదపి చోత్తమః।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః॥18॥
శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు క్షరులు,అక్షరుల గురించి చెప్పాను కదా!నేను వీళ్ళందరి కంటే అతీతుడను.అలా అతీతుడను కాబట్టే లోకంలోను,వేదాలలోనూ నన్ను పరమాత్మ అని,పురుషోత్తముడు అని కీర్తిస్తుంటారు.
Tuesday, 8 April 2025
ఉత్తమః పురుషస్త్వన్యః
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః।
యో లోకత్రయమావిశ్యబిభర్త్యవ్యయ ఈశ్వరః॥17॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నేను క్షరులు,అక్షరులు గురించి చెప్పాను కదా!ఈ ఇద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.ఎందుకంటే అతడే ఈ మూడు లోకాలనూ వ్యాపించి ఉన్నాడు.ఈ యావత్ సృష్టిని పోషిస్తున్నాడు.అతడు అక్షయుడు.అతడు నాశరహితుడు.అతడే సర్వాంతర్యామి.
Monday, 7 April 2025
ద్వావిమౌ పురుషౌ లోకే
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ।
క్షర స్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే॥16॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఒకరు క్షరులు,ఇంకొకరు అక్షరులు.ప్రాపంచిక మయిన భూతాలన్నిటినీ క్షరులు అంటారు.కూటస్తుడు అయిన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు.
Sunday, 6 April 2025
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ।
వేదైశ్య సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి సకలం చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అసలు విషయం చెబుతున్నాను,విను.అందరిలో నేనే అంతర్గతంగా,అంతరాత్మగా ఉన్నాను.జ్ఞాపకం,జ్ఞానం,మరపు,అవివేకం ఇలా అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి.సర్వం నేనే అయి ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను.నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.నేనే వేదవేత్తను.విశ్వంలో ప్రతిది నాలోనే పుట్టాలి,నా వల్లే ఎదగాలి,నాలోనే లయ, లీనం కావాలి.
అహం వైశ్వానరో భూత్వా
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం॥14॥
శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఈ యావత్ సృష్టిలోని సర్వ జీవుల శరీరాలలో జఠరాగ్ని రూపంలో ఉంటాను.జీవులు తినే నాలుగు రకాల ఆహారాలను ప్రాణాపాన వాయువులతో కూడి నేనే పక్వంచేస్తున్నాను.
అంటే ఆ పరమాత్మ మనం తీసుకునే ఆహారం కూడా సరిగ్గా అరిగి మనకు శక్తి చేకూరేలా చేస్తున్నాడు.ఇవంతా మనం అడిగేతేనో,బతిమాలాడితేనో చేయటం లేదు.తనకు తానుగా చేస్తున్నాడు.మన మంచి చెడ్డ చూసుకుంటున్నాడు.అలాంటిది అతని శరణు కోరితే ఇంకెంత మేలు చేస్తాడో ఊహించారా?
Saturday, 5 April 2025
గామావిశ్య చ భూతాని
గామావిశ్య చ భూతాని ధారాయామ్యహమోజసా।
పుష్ణామి చౌషధీ స్సర్వాః సోమో భూత్వా రసాత్మకః॥13॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుొషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!నేను నా శక్తి చేత భూమి యందు ప్రవేశించి సర్వ భూతాలను ధరిస్తున్నాను.నేనే రస స్వరూపుడు అయిన చంద్రుడు అయి అన్ని సస్యాలను పోషిస్తున్నాను.అంటే అన్నీ ఫలదాయకము అయ్యేలా కృషి చేస్తున్నాను.సులభంగా చెప్పాలి అంటే సమస్త ప్రాణి కోటి వృద్థి,అభివృద్థిలో నా ప్రమేయం అడుగడుగునా ఉంది.
Friday, 4 April 2025
యదాదిత్య గతం తేజో
యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఽఖిలం।
యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్॥12॥శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అన్నిటికీ కర్త,కర్మ,క్రియలను నేనే అని అర్థం చేసుకో.ఈ సర్వ జగత్తునూ తేజోమయం చేసే వెలుగును ఇచ్చేది సూర్యుడు,చంద్రుడు అని నీకు తెలుసు కదా.నీకు ఇంకో ముఖ్యమయిన విషయం చెబుతాను.ఆ సూర్య చంద్రుల తేజస్సు నాదే.నేనే వాటికి ఆ తేజస్సును పంచాను.
యతంతో యోగినశ్చైనం
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితం।
యతంతోఽప్య కృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః॥11॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!మనం ఏ పని చేసినా చిత్త శుద్థితో చేయాలి.యాంత్రికంగా చేశాము అంటే చేశాము అనే రకంగా ఉండకూడదు.సత్ఫలితం దక్కాలంటే చిల్లర వేషాలు వేయకూడదు.వంద శాతం మన మనసు,బుద్ధిని పెట్టాలి.జ్ఞాన సిద్థులు మాత్రమే ఎందుకు తెలుసుకోగలుగుతారు అంటే వారికి ఆత్మానుభూతిని పొందే అభ్యాసం ఉంటుంది కాబట్టి.అదే చిత్తశుద్థి లేని వారు ఎంత అభ్యాసం చేసినా ఫలితం శూన్యం.వారికి సృష్టి విలాసం కానరాదు.
Wednesday, 2 April 2025
ఉత్ర్కామంతం స్థితం వాపి
ఉత్ర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం।
విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః॥10॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి నిజాలు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు చెప్పాను కదా!జీవుడు దేహాన్ని త్యజిస్తాడని.మళ్ళీ గుణప్రభావం వల్ల మరో దేహాన్ని పొందుతాడని.ఆ దేహంలో కొన్నాళ్ళు అనుభవిస్తాడు,మనం మాములుగా బట్టలు మార్చుకున్నట్లు.ఇలాంటి విషయాలు మూర్ఖులు అయినవాళ్ళు అర్థం చేసుకోలేరు.ఎందుకంటే వాళ్ళకు అంత పరిపక్వత వుండదు.ఎంత సేపూ భౌతికమయిన వాంఛలగురించే ఆలోచిస్తారు కావున.ఇలా ఆధ్యాత్మక పరమయిన విషయాలను జ్ఞానసిద్ధులు మాత్రమే తెలుసుకుని,అర్థం చేసుకోగలుగుతారు.
Tuesday, 1 April 2025
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే॥9॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలాగ అంటున్నాడు.అర్జునా!జీవుడు అంటే ఆత్మ అని అర్థం అవుతుందా?చెవులు,కళ్ళు,చర్మం,నాలుక,ముక్కు పంచేంద్రియాలు.మనసు వీటి పైన ఆధారపడి వుంటుంది.జీవుడు పంచేంద్రియాలను ఆశ్రయించిన మనసును సహాయంగా తీసుకుని శబ్దరూప రస స్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు.
Subscribe to:
Posts (Atom)