Sunday, 24 November 2024
కార్య కారణకర్తృత్వే
కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే।
పురుషః స్సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే॥21॥శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ప్రకృతి దేహేంద్రియాల కర్తృత్వాలకు హేతువుగా చెప్పబడుతున్నది.అలాగే సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు హేతువుగా చెప్పబడుతున్నాడు.
Friday, 22 November 2024
ప్రకృతిం పురుషం చైవ
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావసి।
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్॥20॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
అర్జునుడికి అర్థం అయేటట్లు చెప్పేదానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఈ ప్రకృతి,పురుషుడు అనేవి సృష్టిలో ఎప్పటినుంచి ఉన్నాయో ఎవరూ చెప్పలేరు.అవి ఎవరూ చెప్పలేనంత,ఎవరూ ఊహించలేనంత అనాదివి.ఆ విషయం ముందు అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.మనం నిత్యం చూసే,అనుభవించే దేహేంద్రియ వికారాలు,త్రిగుణాలు,సుఖదుఃఖాదులు అన్నీ ఈ ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి.అన్నిటి పుట్టుకకూ ఈ ప్రకృతే మూలాథారం.
Thursday, 21 November 2024
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్యోతిషామపి తద్జ్యోతిః తమసః పర ముచ్యతే।
జ్ఞాయం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్॥18॥
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః।
మద్భక్త ఏత ద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే॥19॥
శ్రీమద్భగవద్గీత... త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!ఈ పరబ్రహ్మము అనేది సూర్యుడికి,అలాగే అగ్నికి కూడా తేజస్సును ఇస్తుంది.అది చీకటికి అందనంతగా,అల్లంతదూరంలో ఉంటుంది.దానినే జ్ఞానం అని అంటారు.అదే జ్ఞేయం.అనగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన,తెలుసుకోదగిన విషయం అని అర్థం.ఈ పరబ్రహ్మని జ్ఞానంతో మాత్రమే పొందగలము.సర్వ ప్రాణికోటి యొక్క హృదయాంతరాళలో అంతర్యామిగా ఉండేది ఈ పరబ్రహ్మమే.
అర్జునా!ఇప్పుడు నీకు క్షేత్రము,జ్ఞానము,జ్ఞేయము గురించి సవివరంగా,సంగ్రహంగా చెప్పాను.ఈ మూడింటి గురించి తెలుసుకున్నవాడే నాకు భక్తుడై,మోక్షాన్ని పొందగలడు.
Tuesday, 19 November 2024
అవిభక్తం చ భూతేషు
అవిభక్తం చ భూతేషు విభక్త మివ చ స్థితం।
భూతభర్తృ చ తర్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ॥17॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఆ పరమాత్మ ఆకాశంలాగా అఖండమై ఉంటుంది.పరిపూర్ణమై ఉంటుంది.అయినా కూడా చరాచర జగత్తులోని సర్వ భూతాలలోనూ విభక్తమయినదానిలాగా కనపడుతుంది.అంటే వేరు చేయలేనిదిగా,సర్వప్రాణికోటితో మమేకమై ఉంటుంది.అదే సర్వ భూతాలను పోషిస్తుంది.అలానే దిగమ్రింగుతుంది.మరల పునఃసృష్టి చేసేది కూడా అదే.అంటే ఈ సృష్టి అంతా ఆ పరమాత్మ చెప్పు చేతల్లో ఉంది.
Monday, 18 November 2024
బహిరంతశ్చ భూతానాం
బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ।
సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్॥16॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
అర్జునుడికి కృష్ణుడు ఓపికగా,అర్థం అయ్యేలా చెబుతున్నాడు.అర్జునా!ఈ పరబ్రహ్మము అనేది అన్ని భూతాలకు లోపల ఉంటుంది.అంతేకాదు! ఇది సర్వభూతాలకూ బయటకూడా ఉంటుంది.చరాచర స్వరూపం అదే.అయినా దానిని తెలుసుకోవడం అసాధ్యము.ఎందుకంటే అది అత్యంత సూక్ష్మమయినది.దానిని అథ్యయనం చేసి ,అర్థం చేసుకుని,గుర్తించిన వారికి అతి చేరువలో ఉంటుంది.అజ్ఞానులకు,మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడేవారికి అందనంత దూరంలో ఉంటుంది.
Saturday, 16 November 2024
సర్వేంద్రియ గుణాభాసం
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం।
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ॥15॥
శ్రీమద్భగవద్గీత... త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఆ పరబ్రహ్మత్వం అనేది వుందే,అది ఎవరికీ అంత సులభంగా అర్థం కాదు.అది సర్వేంద్రియాలలో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది.కానీ కలవదు.దేనితో కలిసి వుండకపోయినా,అన్నిటినీ ధారణపోషణలు చేస్తూ ఉంటుంది.నిర్గుణమై ఉండి కూడా గుణాలను అనుభవించేది అదే.ఈ విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి,తెలుసుకోవాలి.
Thursday, 14 November 2024
సర్వతః పాణిపాదం తత్
సర్వతః పాణిపాదం తత్ సర్వతోఽక్షి శిరోముఖం।
సర్వత శ్శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి॥14॥
శ్రీమగ్భగవద్గీత....త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు ఈ ప్రకారం వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడు నేను సనాతనమయిన పరబ్రహ్మము అని చెప్పాను కదా.దానికి ఎటు చూసినా కాళ్ళు,చేతులు,తలలు,ముఖాలు,చెవులు ఉంటాయి.అది ఈ విశ్వం మొత్తం శాఖోఽపశాఖలుగా వ్యాపించి ఉంటుంది.అది లేని ప్రదేశం ఈ భూమండలంలో ఎంత వెదికినా కానరాదు.
Wednesday, 13 November 2024
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వాఽమృత మశ్నుతే।
అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నా స దుచ్యతే॥13॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు తెలుసుకునేదానికి ఏది యోగ్యమయినదో చెబుతాను.అలాగే దేనిని తెలుసుకుంటే మోక్షం సమకూరుతుందో కూడా చెబుతాను.అది సనాతనమైన పరబ్రహ్మము.దానిని సత్పదార్థమని చెప్పలేము.అలాగని అసత్పదార్థమనికూడా చెప్పలేము.
Monday, 11 November 2024
అసక్తి రనభిష్వంగః
అసక్తి రనభిష్వంగః పుత్రదారగృహాదిషు।
నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు॥10॥
మయి చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణీ।
వివిక్తదేశ సేవిత్వం అరతి ర్జనసంసది॥11॥
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనం।
ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోఽన్యథా॥12॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు చెపుతున్నాడు.అర్జునా!భార్య,పుత్రులు,ఇంకా ఇంట్లో ఉండే మిగిలిన సభ్యులు,ఇల్లు,వాకిలి,పొలము,పుట్రల పైన మమకారము పెంచుకోకూడదు.శుభాన్ని,అశుభాన్ని సమంగా చూడగలగాలి.అన్ని రకాల ఆలోచనలు,ఆక్రోశాలు,అనుమానాలు,అసహనాలు,ఆవేదనలు వదిలి నా యందు అనన్యమయిన భక్తి కలిగి ఉండాలి.ఏకాంతవాసం చెయ్యాలి.జన సమూహాలకు దూరంగా ఉండాలి.నిరంతరం ఆత్మజ్ఞానం,తత్త్వజ్ఞానం,ఆత్మశోధనల విచారణ చేస్తూఉండాలి.పైన ఉదహరించినవి అన్నీ కలిపి జ్ఞానం అని చెప్తారు.దీనికి విభిన్నంగా,అడ్డంగా ఉండేవి అన్నీ అజ్ఞానానికి ప్రతీకలు అంటారు.
అమానిత్వమదంభిత్వం
అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం।
ఆచార్యోపాసనం శౌచం స్థైర్య మాత్మవినిగ్రహః॥8॥
ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ।
జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనమ్॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!అభిమానము,డంబము లేకుండా ఉండాలి.అహింస,ఓర్పు,కపటం లేకుండా ఉండటం కావాలి.గురుసేవ,శుచిత్వం,నిశ్చలత,ఆత్మ నిగ్రహం అతి ముఖ్యం.ఇంద్రియ విషయాలపై వైరాగ్యం పెంచుకోవాలి.అహంకారం,అహంభావం మచ్చుకైనా కానరాకుండా ఉండాలి.చావుపుట్టుకలను సమంగా చూడగలగాలి.వృద్థాప్యం,వ్యాధుల వలన వచ్చే వ్యథలకు అతీతంగా ఉండాలి.సంసార జీవనంలో మనకు ఎదురయ్యే ఒడుదుడుకులను,సుఖదుఃఖాలను నిమిత్తమాత్రంగా స్వీకరించ గలగాలి.
Sunday, 10 November 2024
మహాభూతా న్యహంకారో
మహాభూతా న్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ।
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియ గోచరాః॥6॥
ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్॥7॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరణగా చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!పంచభూతాలు,అహంకారం,బుద్ధి,మూలప్రకృతి,కర్మేంద్రియాలు,జ్ఞానేంద్రియాలు,మనస్సు అనేవి క్షేత్రమని చెప్పబడే విషయాలు.ఇవి కాకుండా ఇంద్రియ విషయాలు అయిన శబ్దం,స్పర్శ,రూపం,రసం,గంథాలు,ఇచ్ఛాద్వేషాలు,సుఖదుఃఖాలు,దేహేంద్రియ సమూహం కూడా కేత్రానికి సంబంథించినవే.ఇకపోతే తెలివి,ధైర్యం కూడా ఇదే కోవకు చెందుతాయి.పైన ఉదహరించినవి అన్నీ కూడా క్షేత్రమని క్లుప్తంగా చెప్పబడింది.
అంటే మన శరీరానికి ,మనసుకు,మస్తిష్కానికీ సంబంథం
ఉన్న ప్రతి విషయం క్షేత్రమే.కాబట్టి దీనికి సంబంథించిన ప్రతి చిన్న విషయం మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.
Saturday, 9 November 2024
ఋషిభి ర్బహుధా గీతం
ఋషిభి ర్బహుధా గీతం ఛందోభిర్విథైః పృథక్।
బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుః మద్భిర్వినిశ్తితైః॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు ఇలా చెపుతున్నాడు.అర్జునా!ఋషులు క్షేత్రం అంటే ఏంది,క్షేత్రజ్ఞం అంటే ఏంది అని చెప్పారు.వాటి గుణగణాలు,స్వరూపాలు,స్వభావాలను అనేక రకాలుగా వివరించారు.బ్రహ్మసూత్రాలు వాటిల్లో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే విపులంగా అన్నిటినీ వివరించాయి.
Friday, 8 November 2024
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్।
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు॥4॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి సవివరంగా చెప్పేదానికి ఉపక్రమించాడు.అర్జునా!నీకు చాలా అనుమానాలు ఉన్నాయని నాకు తెలుస్తూ వుంది.నీకు క్షేత్రం ఎటువంటిదో చెబుతాను.దానికి ఎలాంటి ఆకార వికారాలు ఉన్నాయో కూడా వివరిస్తాను.అవి అసలు దేనివల్ల,ఏ విధంగా కలుగుతున్నాయో కూడా చెబుతాను.ఎవరిని క్షేత్రజ్ఞుడు అంటారో చెబుతాను.వాడు ఎవడు,ఎటువంటివాడు,ఎలా ఉంటాడు,ఎలా వ్యవహరిస్తాడు అనేది విశదీకరిస్తాను.
Thursday, 7 November 2024
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
క్షేత్రజ్ఞం చాపి మాంవిద్ధి సర్వ క్షేత్రేషు భారత!
క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ॥3॥
శ్రీనద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు ఇలా అంటున్నాడు.అన్ని క్షేత్రాలలోను నేను ఉంటాను.అంటే ఈ భూమి మీద వుండే ప్రతి ప్రాణిలోను నేను నివసిస్తాను.కాబట్టి నేనే ఆ క్షేత్రజ్ఞుడిని అని తెలుసుకో!ఈ దేహం,దీని ప్రవర్తనను నిర్దేశించే నన్ను తెలుసుకునే ప్రయత్నంచెయ్యి.క్షేత్రం అనే దేహాన్ని,దాని దిశానిర్దేశం చేసే క్షేత్రజ్ఞుడు అయిన నన్ను కనుక్కోవడమే నిజమయిన జ్ఞానము.అదే యదార్థ జ్ఞానమని నా ప్రగాఢ నమ్మకం.
Wednesday, 6 November 2024
ఇదం శరీరం కౌంతేయ
శ్రీభగవానువాచ....
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమి త్యభిధీయతే।
ఏతద్యోవేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥2॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి చెపుతున్నాడు.కౌంతేయా!మనకున్న ఈ దేహాన్ని క్షేత్రం అని అంటారు.ఈ క్షేత్రం గురించి తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు.
Tuesday, 5 November 2024
ప్రకృతిం పురుషః చైవ
అర్జున ఉవాచ...
ప్రకృతిం పురుషః చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ।
ఏతద్వేదితు మిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ॥1॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
అర్జునుడికి అనుమానంవచ్చింది.కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా! ప్రకృతి అంటే ఏంది?పురుషుడు అంటే ఏంది?క్షేత్రము అంటే అర్థం కావటం లేదు.క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు?జ్ఞానము అంటే ఏందో చెప్తావా? జ్ఞేయముకు అర్థం విశదీకరిస్తావా?
Monday, 4 November 2024
యే తు ధర్మ్యామృతమిదం
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే।
శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేఽతీవ మే ప్రియాః॥20॥
ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోఽధ్యాయః
కృష్ణుడు చెపుతున్నాడు.అర్జునా!నేను చెప్పాను కదా ధర్మాన్ని ఎలా అనుష్టించాలో.ఇది కష్టమే కానీ ఆచరించాలి.దీనిని విశ్వసించాలి.నన్నే నమ్మి ఉపాసన చెయ్యాలి.పైన పేర్కొన్న విథివిథానాలను నమ్మి,ఆచరించేవాడు నాకు మిక్కిలి ప్రియమయిన భక్తుడు.
ఇట్లు ఉపనిషత్తు,బ్రహ్మవిద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమయిన భగవద్గీతలో భక్తియోగమను పండ్రెండవ అధ్యాయము సమాప్తము.
Sunday, 3 November 2024
సమశ్శత్రౌ చ మిత్రే చ
సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః।
శీతోష్ణ సుఖ దుఃఖేషు సమ స్సంగ వివర్జితః॥18॥
తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్।
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః॥19॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.శత్రువులు అయినా,మిత్రువులు అయినా మనం ఒకేలాగా చూడగలగాలి.ఆఖరికి మనంఅందరం ఒకటే కదా!మనలని గౌరవించినా,అవమానపరిచినా సహేతుకంగానే తీసుకోవాలి.చలి అయినా వేడి అయినా సమంగా చూడాలి.ఎండైనా,వానైనా ఒకేలాగా భావించాలి.కష్టాలను,సుఖాలను జీవితంలోకి ఒకేరకంగా స్వీకరించాలి.సుఖాలు వస్తే అంతా మనగొప్పే అని అనుకొని గర్వానికి పోవడం,కష్టాలు వస్తేఅంత వేరేవాళ్ళ తప్పు అని నిందవేసి కృంగిపోవటం మానుకోవాలి.కోరికల చిట్టాను బాగా తగ్గించాలి.కోరికలకు దూరంగా,వీలయితే అసలు లేకుండా ఉండాలి.మనంఅల్ప సంతోషులుగా ఉండాలి.అంటే దొరికిన దానితో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి.మౌనమే ఆభరణంగా ఉండాలి.స్థిరంగా ఉండాలి.సుస్థిరచిత్తంతో ఉండాలి.ఇలాంటి భక్తుడే నాకు ఇష్టుడు,ప్రియుడు.
Saturday, 2 November 2024
యో న హృష్యతి న ద్వేష్టి
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి।
శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య స్స మే ప్రియః॥17॥
శ్రీమద్భగవద్గీత..ద్వాదశాధ్యాయము
భక్తియోగము
భగవంతుడు ఇలా చెపుతున్నాడు.అర్జునా!నాకు లెక్కలు వేసుకునే వాళ్ళు వద్దు.ఏమి లెక్కలు అని అడుగుతావా? చెపుతాను విను.సంతోషం దుఃఖంకి లెక్కలు వేసుకోకూడదు.ఇది శుభం,అది అశుభం అని వ్యత్యాసం చూపించకూడదు.ఏది సుముఖం,ఏది వ్యతిరేకం అనే తేడాలు,గణనం వేసుకోకూడదు.ఈ లెక్కలలో ఎవరికి నూటికి సున్నా వస్తుందో,వారే నాకు ప్రియమయిన భక్తులు.అంటే మన జీవితాలలోకి తొంగిచూసే ప్రతి విషయాన్ని మనస్పూర్తిగా స్వీకరించగలగాలి.ఇది ఎక్కువ,అది తక్కువ,ఇది కష్టం,అది ఇష్టం అని వేరువేరుగా చూడకూడదు.
Friday, 1 November 2024
అనపేక్షః శుచిర్ధక్షః
అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః।
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః॥16॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!నా భక్తుడు ఎలాంటి కోరికలు లేనివాడు అయివుండాలి.అంతేనా!అతని మనస్సు కూడా అద్దంలాగా తేటతెల్లంగా ఉండాలి.పరిశుద్ధమయిన మనసు కలిగి ఉండాలి.సమర్థవంతంగా ఉండగలగాలి.ఇన్ని వున్నా తటస్థంగా ఉండగలగటం నేర్చుకోవాలి.దిగులు,విచారం,అన్యాసక్తంగా ఉండకూడదు.వ్యాకులమయిన మనసుతో ఉండకూడదు.ఎలాంటి ఫలితం ఆశించకుండా తన కర్మలను,కర్తవ్యాలను చేసుకుంటూ పోతుండాలి.అంటే కర్మఫల,కర్తృత్వఫల రహితుడుగా ఉండాలి.అట్లాంటి వాడే నాకు ప్రియమయిన భక్తుడు.
Subscribe to:
Posts (Atom)