Thursday 17 October 2024

మయ్యావేశ్య మనో యే మాం

శ్రీ భగవానువాచ... మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే। శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః॥2॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సమాథానం ఇస్తున్నాడు.సతతం,నిర్వికారంగా నన్నే మనసులో కొలవాలి.మనసు పరిపరి విథాలుగా ప్రక్కకు పోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను ఉపాసన చెయ్యాలి.ఎవరైతే వారి మనసులలో నన్ను సదా నిలుపు కుంటూ,ఉపాసన చేస్తారో,అలాంటి భక్తులే శ్రేష్టమయిన యోగులు.

Wednesday 16 October 2024

ఏవం సతతయుక్తా యే

అర్జున ఉవాచ... ఏవం సతత యుక్తా యే భక్తాస్త్వాంపర్యుపాసతే। యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః॥1॥ శ్రీనద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము..భక్తి యోగము ఇంక భక్తి యోగము మొదలవుతుంది.అర్జునుడు కృష్ణుడిని అడుగు తున్నాడు.కొంతమంది ఒక ఆకారాన్ని పూజిస్తారు.ఇంకొంత మంది నిరాకారాన్ని పూజిస్తారు.ఈ రెండు రకాల మనుష్యులలో ఎవరు గొప్పవారు?సగుణ స్వరూపాన్ని ఉపాసన చేసే వాళ్ళు యోగవిదులు అవుతారా?లేక నిర్గుణబ్రహ్మాన్ని ధ్యానించేవాళ్ళు మోక్షానికి దగ్గర అవుతారా?

Tuesday 15 October 2024

మత్కర్మ కృన్మత్పరమో

మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ!॥55॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు కొస మెరుపుగా ఇలా చెప్పాడు.అర్జునా,కాబట్టి నా కోసమే కర్మలు చెయ్యి.నన్నే నమ్ముకో.నా మీదే భక్తి ప్రపత్తులు పెంచుకో.అప్పుడు నువ్వు నన్ను పొందగలవు.ఇది నేను నీ ఒక్కడికే చెప్పటం లేదు.ఈ అనంత విశ్వంలో వుండే సమస్త ప్రాణి కోటికి చెపుతున్నాను.ఈ విశ్వంలో నా కొరకే కర్మలు చేస్తూ,నన్నే నమ్ముకొని,నాయందే భక్తితో చరిస్తూ.నిస్సంగుడైనవాడు మటుకే నన్ను పొందగలడు.ఈ విషయం గుర్తు పెట్టుకో.

Monday 14 October 2024

భక్త్యా త్వనన్యయా శక్య

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోఽర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప॥54॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అందరూ నన్ను ఎలా తెలుసుకోవాలి అని పరితపిస్తుంటారు.నా విశ్వరూపం చూడాలంటే ఏమేమి చెయ్యాలి అని తహ తహ లాడుతుంటారు.నాలో ప్రవేశించే మార్గాలు వెతుకుతుంటారు.అనన్యమయిన భక్తి మార్గమే వీటన్నిటినీ సాధంచే ఏకైక సాధనం.

Sunday 13 October 2024

నాహం వేదైర్న తపసా

నాహం వేదైర్న తపసా నదానేన న చేజ్యయా। శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా॥53॥ శ్రీ మద్భగవద్గీత.... ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.నీకు దక్కిన ,నీవు చూడగలిగిన నా ఈ విశ్వరూపము అనేది చిన్నా చితక విషయం కాదు.ఆషామాషీ వ్యవహారం అసలే కాదు.ఈ అపూర్వ అవకాశం అనేది నాలుగు వేదాలు చదివినా దక్కదు.ఎన్ని పూజలు చేసినా దొరకదు.ఒంటి కాలి పైన నిలుచుకొని ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసినా అనుగ్రహించదు.అంతటి అపురూపమయిన అవకాశం నీకు దక్కింది.

Saturday 12 October 2024

సుదుర్దర్శమిదం రూపం

శ్రీ భగవానువాచ... సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ। దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః॥52॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడుతో అతను ఎంత అదృష్టవంతుడో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు నా విశ్వరూపం చూపించాను కదా!అది చూడగలగటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.అది అంత తేలికగా,సులభంగా అందరికీ దక్కదు.నా ఈ విశ్వరూపాన్ని చూసి తరించాలని దేవతలు,మునులు జన్మ అంతా పరితపిస్తుంటారు.కానీ నేను నీకు ఆ సౌలభ్యం కల్పించాను.

Friday 11 October 2024

దృష్ట్వేదం మానుషం రూపం

అర్జున ఉవాచ.... దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన! ఇదానీమస్మి సంవృత్త స్సచేతాః ప్రకృతిం గతః॥51॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము అర్జునుడికి చాలా స్ధిమితంగా వుంది.ఇంకా చాలా సంతోషంగా వుంది.ఈ విషయాన్ని కృష్ణుడితో ఇలా పంచుకుంటున్నాడు.హే జనార్దనా!నీ విశ్వరూపం చూసిన తరువాత,నిన్ను మాములుగా చూస్తుంటే నాకు చాలా హాయిగా వుంది.చాలా ప్రశాంతంగా వుంది.సౌమ్యంగా వుండే నీ ఈ మానవరూపం నా కళ్ళకు చాలా ఇంపుగా కనిపిస్తుంది.నా మనసు ఇప్పుడు కుదుట పడింది.ఇంతసేపటికి నా ప్రాణం స్ధిమిత పడింది.