Monday, 31 March 2025

శరీరం యదవాప్నోతి

శరీరం యదవాప్నోతి యచ్తాప్యుత్ర్కా మతీశ్వరః। గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్॥8॥ శ్రీమగ్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఎంత సుందరంగా వివరిస్తున్నాడో చూడు.అర్జునా!జీవుడికి దేహం వుంటుంది కదా.మనము చాలా జన్మలు ఎత్తాల్సి వుంటుంది కదా.అలా జన్మలు మారేటప్పుడు శరీరాలు మార్చాల్సి వస్తుంది.మనంపాత,చినిగిన బట్టలు విప్పి కొత్తవి,మంచివి వేసుకున్నట్లు.ఒక పూదోట మీదుగా గాలి వీస్తే,ఆ పూల సువాసనను కూడా కొంచెం పట్టుకు పోతుంది,పోతూ పోతూ.అచ్చం అలాగే ఇక్కడ కూడా.జీవుడు క్రొత్త శరీరం లోకి వెళ్ళేటప్పుడు,వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకుని పోతున్నాడు.

Saturday, 29 March 2025

మమైవాంశో జీవలోకే

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః। మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥7॥ శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జునా!నేను ఆదిమధ్యాంతరహితుడిని కదా.పురాతనమయిన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిణమించింది.ఆ జీవుడే ఈ చరాచరజగత్తు,ప్రకృతిలోని వికారాలు అయిన జ్ఞానేంద్రియ పంచకాన్ని,మనస్సును కూడా ఆకర్షిస్తున్నాడు.అంటే నేను విశ్వమంతా వ్యాపించ్ వున్నాను.నన్ను దాటుకుని ఎవరూ ,ఎక్కడికీ పోలేరు.కానీ మాయామోహంలో చిక్కుకుని వుంటారు చాలా మటుకు.

Friday, 28 March 2025

న తద్భాసయతే సూర్యో

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః। యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ॥6॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి పూస గుచ్చినట్లు వివరంగా చెబుతున్నాడు.గురువు పిల్లవాడికి చెప్పేటప్పుడు సంధులు,సమాసాలతో,కఠినమయిన పదజాలంతో చెప్పకూడదు.చిన్న చిన్న పదాలతో,వాడికి అర్థం అయ్యేలాగా,భయపడకుండా నేర్చుకునేలా,వాడికి నేర్చుకునేదానికి ఉత్సాహం నింపేలాగా చెప్పాలి.ఇక్కడ కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు. అర్జునా!పరమపదం అంటే చెబుతాను,విను.మనం సూర్యుడు,చంద్రుడు ప్రపంచానికి వెలుగు నిస్తాయి అనుకుంటాము కదా!అవి పరమపదాన్ని ప్రకాశింపలేవు.అంటే కోటానుకోట్ల సూర్యులు,చంద్రులు కూడా దాని ప్రకాశం ముందర ఆగలేవు,తూగలేవు.ఆ మోక్షం,ఆ పరమపదం పొందితే మరల వెనుకకు రానవసరం లేదు. మనం భూమి మీద పుట్టామంటే మరల మరల జన్మలు వుంటాయి.అవి ఇప్పటి మన జన్మ కంటే ఉచ్ఛమయినవా,నీచమయినవా అనేది మన కర్మలను బట్టి వుంటుంది.కానీ ఆ భగవంతునిలో కైవల్యం పొందితే ఈ జన్మల జోలికి పోనక్కరలేదు.అలాంటి స్వయం ప్రకాశమానమయినది భగవంతుని పరమపదం.

Thursday, 27 March 2025

నిర్మానమోహా జితసంగదోషాః

నిర్మానమోహా జితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్యైర్విముక్తా స్సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్॥5॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి విడమరచి చెబుతున్నాడు.అర్జునా!నేను చెప్పే ముక్తి ఎలా సంపాదించాలో వివరిస్తాను.దురహంకారము,దుస్సంగము,దురూహలను దరిచేరనివ్వకూడదు.అంటే గర్వము పనికిరాదు.దుష్టులతో సాంగత్యము వద్దనే వద్దు.దురాలోచనల జోలికి అసలు వెళ్ళవద్దు.కోరికలను దరిచేర నివ్వకు.లాభం,నష్టం,కోపం,తాపం,సుఖం,దుఃఖం....ఇలాంటి ద్వంద్వాలను విసర్జించాలి.అప్పుడు మాత్రమే జ్ఞానులు బ్రహ్మజ్ఞాన నిష్టతో మోక్షం పొందగలుగుతారు.

Wednesday, 26 March 2025

తతః పదం తత్పరిమార్గతవ్యం

తతః పదం తత్పరిమార్గతవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ॥4॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనుష్యులు వైరాగ్యంతోటి సంసారమనే వృక్షాన్ని ఛేదించాలి అని చెప్పాను కదా!మనం సాధన చెయ్యాలి.ఎలా చెయ్యాలంటే దేనిని పొందితే దీనిలోకి రామో...అలా చెయ్యాలి.అంటే కైవల్యం,పరమపధం పొందితే ఇలాంటి ఇహలోకం లోకి రానవసరం లేదు కదా!ఆ మోక్షం,ముక్తి పొందితే,అనాది అయిన ఈ చరాచర ప్రపంచం ఎవరు సృష్టించారో,ఎవరివలన సాగుతుందో,ఎవరివలన యావత్ సృష్టి అంతం అవుతుందో,ఆ పరమాత్మ సన్నిథిలో శరణు పొందవచ్చు.ఈ భావంతో సాధన చెయ్యాలి.

Tuesday, 18 March 2025

న రూప మస్యేహ తథోపలభ్యతే

న రూప మస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ ధృఢేన ఛిత్వా॥3॥ శ్రీమద్భగవద్గీత ...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో సాధ్యాఽసాధ్యాల గురించి చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఈ సంసారంలో వుండే ప్రాణులు అశ్వత్థవృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఎందుకంటే ఈ వృక్షం ఆది,మధ్య,అంతాలు లేకుండా వుంటుంది.దీని వ్రేళ్ళు ఎక్కడికక్కడ బాగా నాటుకోని వుంటాయి.ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం తోటే మానవుడు ఛేదించగలడు.వేరే ఉపాయం,దారి లేదు.

Monday, 17 March 2025

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః। అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే॥2॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఈ అశ్వత్థ వృక్షము అని చెప్పాను కదా.దాని కొమ్మలు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణముల వల్ల విస్తరించి వుంటుంది.ఇంద్రియార్థాలు చిగురులులాగ కలిగి వుంటుంది.ఈ కొమ్మలు క్రిందికీ,మీదికీ వ్యాపించి,విస్తరించి వుంటాయి.కానీ మనుష్యలోకంలో దీనికి క్రిందికి పోయే వ్రేళ్ళుకూడావుంటాయి.ఎందుకంటే ఇక్కడ అవి కూడా సకానకర్మలచే బద్ధములై వుంటాయి కాబట్టి.

Thursday, 13 March 2025

ఊర్ధ్వమూల మధశ్శాఖం

శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము... పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీభగవానువాచ... ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహు రవ్యయం। ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్॥1॥ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అశ్వత్థ వృక్షము ఒకటి వుంది అని చెప్పబడుతుంది.అది మామూలు చెట్టులాగ కాదు.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలు ఏమో కిందికి ఉంటాయి.వేదాలలోని వాక్యాలే దానికి ఆకులు.దానికి నాశనం అనేది లేనే లేదు.ఆ వృక్షం గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు అని అర్థం చేసుకో.

Monday, 10 March 2025

బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహం

బ్రహ్మణోహి ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ॥27॥ శ్రీమద్భగవద్గీతాఽసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగోనామ చతుర్దశోఽధ్యాయః కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ సృష్టిలో ప్రతిదాని వెనుక,ముందర,పక్కన,లోపల,బయట...అంతా నేనే నిండి ఉన్నాను.నా ప్రమేయం లేకుండా చిన్న పరమాణువు కూడా అటుఇటు కదలలేదు.పరబ్రహ్మకు,అవినాశనమయిన మోక్షానికీ,ధర్మానికీ,సత్ చిత్ ఆనంద రూపైక నిరాకార బ్రహ్మానికీ అన్నింటికీ నేనే మూలాధారుడిగా వున్నాను.సులభంగా చెప్పాలంటే అన్నిటికీ కర్త,కర్మ,క్రియ నేనే.ఇవన్నీ అవినాశనము అని ఎందుకు చెబుతున్నానో విను.ముక్తి,ధర్మం,సచ్చిదానందం,నిరాకారమయిన బ్రహ్మం....ఇవన్నీ శాశ్వతమయినవి.వీటికి పుట్టుక,చావులేవు.చావులేదు అంటే నాశనం కావు అనే కదా అర్థం.నిరాకారము అన్నప్పుడు రూపం ఎక్కడనుంచి వస్తుంది?అంటే వాటి వునికి మనం గ్రహించగలము మనసుతో.కానీ తాకలేము,చూడలేము,వినలేము,రుచి కనుగొనలేము.కాబట్టి ఆదిమధ్యాంత రహితుడు నేనని అర్థం చేసుకో.

Thursday, 6 March 2025

మాం చ యోఽవ్యభిచారేణ

మాం చ యోఽవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే॥26॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాలను అతిక్రమించేదానికి సులభమయిన మార్గం చెబుతున్నాడు.అర్జునా!నీకు అర్థం కావటంలేదు కదా?ఇంత కష్టమయిన ప్రక్రియ ఎలా మానవుడికి సాథ్యం అవుతుంది అని.నేనొక చిన్న చిట్కా చెప్తాను.గ్రహించు. నిత్యమూ నన్నే నిశ్చలమయిన భక్తితో సేవిస్తేచాలు.ఆ మానవుడికి త్రిగుణాలను ధిక్కరించే స్థితప్రజ్ఞత చేకూరుతుంది.అతను త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు.

Tuesday, 4 March 2025

ప్రకాశం చ ప్రవృత్తిం చ

శ్రీభగవానువాచ.... ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి॥22॥ ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్టతి నేంగతే॥23॥ సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః॥24॥ మానావమానయో స్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే॥25॥ శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము ఎప్పుడూ అర్థం చేసుకోవాలి అనే తపన వుండే వాళ్ళకే అనుమానాలు వస్తాయి.అర్జునుడు తన అనుమానాలు బయచ పెట్టగానే కృష్ణుడు సంతోషించాడు.విడమరచి చెప్పడం మొదలు పెట్టాడు.హే అర్జునా!గుణాతీతుడు ఎవడు,ఎలా ఉంటాడో చెబుతాను,విను. ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా!వాటికి సంబంథించిన,వ్యక్తరూపాలు అయిన ప్రకాశం,ప్రవృత్తి,మోహాలు సంప్రాప్తమయినా ద్వేషించకుండా ఉండాలి.అవి దక్కకపోయినా,వాటికోసం వెంపర్లాడకుండా వుండగలగాలి.నిర్వికారంగా,సాక్షిమాత్రుడుగా వుండాలి.గుణధర్మపరమయిన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించకుండా ఉండాలి.వాటివాటి స్వస్వభావతను గ్రహించి సుఖదుఃఖాలను రెండింటినీ సమభావంతో చూడాలి.తనకుతానే సుప్రతిష్టుడు అయి మట్టి,రాయి,బంగారాలను సమభావంతో చూడగలగాలి.ప్రియమైనా,అప్రియమైనా ఒకే రకంగా స్వీకరించాలి.ధీరుడుగా ఉంటూ నిందలు అయినా,మెచ్చుకోలుఅయినా,బ్రహ్మరథం పట్టినా,అవమానించినా,శత్రువులు అయినా,మిత్రులు అయినా సమభావంతో స్వీకరించాలి.సర్వకాల సర్వావస్థలయందు సమబుద్ధితో వుండి,నిస్సంకల్పుడుగా ఉండాలి.ఇలా వుండగలిగిన వాళ్ళను గుణాతీతుడు అంటారు.

Sunday, 2 March 2025

కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్

అర్జున ఉవాచ... కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణా నతివర్తతే॥21॥ శ్రీమద్భగవద్గీత... చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము అర్జునుడికి తల తిరిగిపోతుంది.అన్నీ అర్థం కాని అనుమానాలే.అందుకని మొహమాటానికి పోకుండా కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!నువ్వేమో త్రిగుణాలు అన్నావు.మళ్ళా వాటిని అతిక్రమిస్తే పరమపథం అంటున్నావు.ఈ సత్త్వరజస్తమో గుణాలను ఎవరు అతిక్రమించగలరు?వాళ్ళు ఎలా ఉంటారు? వారి గుణగణాలు,లక్షణాలు ఎలా ఉంటాయి?వారి ఆచారవ్యవహారాలు ఏ రీతిలో ఉంటాయి?అసలు మానవుడు ఈ మూడుగుణాల పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడగలతాడు?నాకు ఈ ప్రశ్నలకన్నిటికీ సవివరంగా సమాథానం చెప్పాలి అని వేడుకున్నాడు అర్జునుడు.