Friday, 28 March 2025

న తద్భాసయతే సూర్యో

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః। యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ॥6॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి పూస గుచ్చినట్లు వివరంగా చెబుతున్నాడు.గురువు పిల్లవాడికి చెప్పేటప్పుడు సంధులు,సమాసాలతో,కఠినమయిన పదజాలంతో చెప్పకూడదు.చిన్న చిన్న పదాలతో,వాడికి అర్థం అయ్యేలాగా,భయపడకుండా నేర్చుకునేలా,వాడికి నేర్చుకునేదానికి ఉత్సాహం నింపేలాగా చెప్పాలి.ఇక్కడ కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు. అర్జునా!పరమపదం అంటే చెబుతాను,విను.మనం సూర్యుడు,చంద్రుడు ప్రపంచానికి వెలుగు నిస్తాయి అనుకుంటాము కదా!అవి పరమపదాన్ని ప్రకాశింపలేవు.అంటే కోటానుకోట్ల సూర్యులు,చంద్రులు కూడా దాని ప్రకాశం ముందర ఆగలేవు,తూగలేవు.ఆ మోక్షం,ఆ పరమపదం పొందితే మరల వెనుకకు రానవసరం లేదు. మనం భూమి మీద పుట్టామంటే మరల మరల జన్మలు వుంటాయి.అవి ఇప్పటి మన జన్మ కంటే ఉచ్ఛమయినవా,నీచమయినవా అనేది మన కర్మలను బట్టి వుంటుంది.కానీ ఆ భగవంతునిలో కైవల్యం పొందితే ఈ జన్మల జోలికి పోనక్కరలేదు.అలాంటి స్వయం ప్రకాశమానమయినది భగవంతుని పరమపదం.

No comments:

Post a Comment