Thursday 12 September 2024

యచ్చాపహాసార్థ మసత్కృతోఽసి

యచ్చాపహాసార్థ మసత్కృతోఽసి విహార శయ్యాసన భోజనేషు ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహ మప్రమేయమ్॥42-11 విశ్వరూప సందర్శన యోగము మనం మన మిత్రులతో ఎలా వుంటాము?సరదా సరదాగా వుంటాము.తమాషాలు పడుతూ వుంటాము.తన్ను కుంటాము,మళ్ళీ అంతలోనే క్షమాపణలు చెప్పుకుంటాము.మళ్ళీ ఒకటై పోతాము.స్నేహితుల మథ్యలో ఎవరైనా దూరితే వాళ్ళు వెర్రి వెంగళప్పలు అయి పోతారు. కృష్ణార్జునులు కూడా అంతే.మంచి స్నేహితులు.దానికి తోడు బావా బావమరుదుల సంబంథం.ఇక చెప్పాలనా వాళ్ళ అన్యోన్యత! ఇప్పుడు అర్జునుడు అదే అంటున్నాడు కృష్ణుడితో.కృష్ణా!నేను నీ తోటి బోజనాలు చేసే సమయంలో,విహారానికి వెళ్ళినప్పుడు,నిద్రకు ఉపక్రమించేటప్పుడు,ఇలా చాలా సార్లు చాలా సందర్భాలలో తమాషాలు పడ్డాను.నీతో పరిహాసాలాడాను.మనం పదిమందిలో వున్నప్పుడూ ఎక్కిరించాను.ఒంటరిగా మనం మటుకే వుండేటప్పుడూ ఎకచకాలాడాను.నీవు ఇంత గొప్ప మహాత్ముడివని అప్పట్లో నాకు తెలియదు.కాబట్టి నా ఈ నోటి తుత్తరకు,నోటిదూలకు క్షమించు.

Wednesday 11 September 2024

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమదాత్ప్రణయేన వాపి॥41-21 విశ్వరూప సందర్శన యోగము మనము స్నేహితులతో చాలా చనువుగా వుంటాము.ఒరేయ్,రేయ్ అనుకుంటాము.ఏమే,మేయ్ అనుకుంటాము.పేర్లు,ముద్దు పేర్లు పిలుచుకుంటాము.కులాలతో పిలుచుకుంటాము.పొట్టి,పొడుగు,తెలుపు,నలుపు ...ఇలా ఎలాగైనా పిలుచుకుంటాము.అది ఎదుటి వాళ్ళను తక్కువ చేయటం కాదు.అతి చనువు మీద చేస్తాము.ఉన్నట్టుండి ఆ స్నేహితులు మనకంటే చాలా గొప్ప వాళ్ళు,చాలా ఎత్తులో వున్నారు అని తెలుస్తే ఒక్క సారిగా ఖంగు తింటాము.వాళ్ళను ఎలా పలకరించాలో అర్థంకాదు.ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే వుంది.ఇన్ని రోజులు కృష్ణుడిని ప్రేమ వల్లనో,పొరపాటు వల్లనో,అతి చనువుతోనో ఎట్లంటే అట్లా పిలిచేవాడు.ఒక సారి కృష్ణా అని పిలిస్తే,ఇంకోసారి యాదవా అని పిలిచేవాడు.మరొకసారి సఖా అని సంబోధించేవాడు.ఇట్లా చాలా మాములుగా నోటికి ఎలా పిలవాలనిపిస్తే అట్లా పిలిచాడు.అప్పుడంతా అతనికి కృష్ణుడి గొప్పతనం తెలీదు.ఇప్పుడు అతనికి తన మునుపటి చర్యలు ఇబ్బందికరంగా వున్నాయి.

Tuesday 10 September 2024

వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః

వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే॥39-11 విశ్వరూప సందర్శన యోగము మన ఇంట్లో మనమే గొప్ప.వీధి లో పెద్ద మనిషి వెనక పది ఇరవై మంది వుంటారు.చిన్న పాటి నాయకుడి వెనక వందల్లో వుంటారు.రాష్ట్ర స్థాయి వాళ్ళకు లక్షల్లో,అంచర్జాతీయ స్థాయి వాళ్ళకు కోట్లలో వుంటారు. మరి విశ్వవ్యాపకుడిని నమ్ముకుని ఇంకెంత మంది వుండాలి?!!! ఇక్కడ అర్జునుడు అదే అంటున్నాడు.హే కృష్ణా!ఈ ప్రపంచం మొత్తం నీ తోనే వుంది.నీ లోనే వుంది.నువ్వుఅంతా తెలిసినవాడవు.అందరూ తెలుసుకోవలసిన వాడవు.అందరికీ కావాలసినవాడవు.నువ్వు ఆదిదేవుడవు!పురాణపురుషుడవు!జగదాధారుడవు!పరంధాముడవు! యముడు,వాయువు,అగ్ని,వరుణుడు,బ్రహ్మ,సూర్యుడు,చంద్రుడు...అందరూ నువ్వే!బ్రహ్మను కన్న తండ్రివి కూడా నువ్వే! అటువంటి నీకు సాష్టాంగ దండ ప్రమాణాలు.నీకు అనేకానేక నమస్కారాలు.తిరిగి తిరిగి నమస్కారాలు సమర్పిస్తున్నాను.స్వామీ!దయయుంచి స్వీకరించు.

Saturday 7 September 2024

కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్

కస్మాచ్చ తే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస! త్వమక్షరం సదసత్తత్పరం యత్॥37-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు కృష్ణుడిని పొగుడుతున్నాడు.అతని గొప్పదనంతెలిసింది.తనకు దిశా నిర్దేశం చేసేది అతనే అని అర్ధం అయింది. మహాత్మా!నీవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలపురుషుడవు.నీకు నమస్కరించని వాళ్ళు ఎవరు వుంటారు?హే అనంతా!హే జగన్నివాసా!సత్తువు,అసత్తువు రెండింటికీ మూల కారణం నీవే.నిశ్చల మైనది,శాశ్వతనైనది సత్తు.మార్పునకు లోనయ్యేది,అశాశ్వతనైనది అసత్తు.

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్॥33-11 విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా! నేను చెప్పేది అర్థం అవుతుందా?యుద్ధానికి సమాయత్తం కా!శత్రు సంహారం చెయ్యి.ఈ అఖండ భూమండలాన్ని అనుభవించు.కౌరవ సైన్యం,వారి తట్టు వాళ్ళందరూ ఇంతకు ముందే నా చేత చంప బడ్డారు అని భావించు.నీవు నిమిత్తమాత్రుడివి అని అర్థం చేసుకో.అలానే భావించు.నీ కర్తవ్యం నీవు పూర్తి చెయ్యి.అఖండ కీర్తిని,విజయలక్ష్మిని చేజిక్కించుకో!

కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో

కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః॥32-11 విశ్వరూప సందర్శన యోగము మనకు కోపం వస్తే ఏమి చేస్తాము?ఊగి పోతాము.అందులో ఎదుటి వాడు తప్పు చేస్తున్నాడు,దాని వలన మనం నష్ట పోతున్నాము అంటే ఇంక చెప్పనక్కరలేదు.ఒక రాగాన మామూలు కాలేము.నరసింహావతారంలో కూడా హిరణ్యకశిపుడిని చంపగానే,ఆ దేవుడే వెంటనే మామూలు కాలేక పోయాడు కదా! ఇక్కడ కూడా అంతే.మంచి వాళ్ళైన పాండవులకు అన్యాయం జరుగుతుంది.ధర్మం కుంటుపడుతుంది.అధర్మం రెక్కలు విచ్చుకుని స్వైరవిహారం చేస్తుంది.మరి భగవంతుడికి కోపంరాదా!ధర్మరక్షణ చెయ్యాల్సిన సమయంరాలేదా?కాలేదా? అందుకే కృష్ణుడు అర్జునుడికి సమాధానం ఇస్తున్నాడు.ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాల స్వరూపుడిని నేను.ప్రస్తుతం దుష్ట సంహారానికి పూనుకువ్నాను.నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే సరే!చెయ్యక పోయినా సరే.నువ్వు తప్ప మీ ఉభయ పక్షాలలో ఏ ఒక్కరూ మిగులుతారనేది మిథ్య.అసంభవం.ఈ దుష్టులనందరినీ సంహరించేదాకా నేను నిద్రపోను.

Friday 6 September 2024

అఖ్యాహి మే కో భవానుగ్రరూపో

అఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తుతే దేవవర!ప్రసీద విజ్ఞాతు మిచ్ఛామి భవంత మాద్యం న హి ప్రజానామి తవ ప్రవత్తిమ్॥31-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడికి దిక్కు తోచడంలేదు.మంటలలోకి దూకే మిడతల దండులా సమస్త రాజవంశం లోని వీరులందరూ విశ్వరూపం యొక్క అనంత ముఖాలలోకి దూసుకు పోతున్నారు.ఆయన యొక్క భీకరమయిన రూపం చూసి జగత్తు అంతా తపించి పోతుంది.సర్వ లోకాలనూ మింగేస్తున్నాడు.అర్జునుడు వేడుకుంటున్నాడు. ఓ దేవదేవా!నీకు దండ ప్రమాణాలు చేస్తున్నాను.నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.ఇంత భయంకర స్వరూపుడవు అయిన నువ్వు ఎవరివి?దయచేసి నువ్వెవరో చెప్పు.నీ వివరాలన్నీ చెప్పు.ఇంత కోపం దేనికి?ఇంతటి ఉగ్రరూపం దాల్చేదానికి కారణాలు ఏంది?ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?నీ ఈ ప్రవర్తనకు అర్ధం,పరమార్ధం నా బుర్ర గ్రహించలేక పోతున్నది.

Thursday 5 September 2024

యథా నదీనాం బహవోఽంబువేగాః

యథా నదీనాం బహవోఽంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి॥28-11 విశ్వరూప సందర్శన యోగము పిల్ల కాలువలు నదిలో కలుస్తాయి.నదులన్నీ సముద్రం లో ఏకమవుతాయి.ఇది వాటి సహజ గుణం.అలానే మనమందరమూ ఆపరబ్రహ్మ నుండే పుట్టాము.మళ్ళీ ఆ విశ్వేశ్వరుడిలోకే లయమవుతాము. ఇక్కడ అర్జునుడు చూస్తుంటే,సమస్త రాజలోకమూ ఆ విశ్వకర్మ యొక్క భయంకరమయిన ముఖాగ్ని లోపలికి పొర్లి పోతుంది.దాంట్లో అనేక మంది రాజులు వున్నారు.కౌరవులుఅందరూ వున్నారు.భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు,ఇంకా చాలా మంది యోధులూ వున్నారు.ఆఖరికి పాండవుల పక్షంలోని వీరులుకూడా చాలా మంది కనిపించారు.

Wednesday 4 September 2024

దంష్ట్రా కరాళాని చ తే ముఖాని

దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస॥25-11 విశ్వరూప సందర్శన యోగము మాములుగా చాలా మందికి చీకటి అంటే భయం. కొన్ని సార్లు నిశబ్దంగా వున్నప్పుడు వంటింట్లో పళ్ళెం చెయ్యి జారి కింద పడినా గుండె ఝల్లు మంటుంది మనకు.ఇలా చాలా మందికి చాలా రకాల భయాలు వుంటాయి.కొన్ని సార్లు ఎదుటి వాళ్ళ భయాలు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి.ఇక్కడ అర్జునుడు విశ్వరూపం చూసి భయపడకుండా వుంటాడా,ఎంత వీరుడు,శూరుడు,విక్రమార్కుడైనా!! ఆ విశ్వరూపానికి భయంకరమైన కోరలు,దంతాలు వున్నాయి.ఆ ముఖాలు అన్నీ కాలాగ్నిలా,అగ్ని గోళాలు లాగా వెలిగి పోతున్నాయి.అన్నేసి వున్న ఆ ముఖాలు,కాళ్ళు,చేతులు,ఉదరాలు,ఆయుధాలు,భగ భగ మండే నేత్రాలు..... వీటన్నిటినీ ఒక్కసారిగా చూసేటప్పటికి అర్జునుడు ఖంగు తిన్నాడు,భయపడి పోయాడు. భగవంతుడా,విశ్వేశ్వరా! నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది.నన్ను కాపాడు స్వామీ!నన్ను కరుణించు జగత్ రక్షకా!అని వేడుకుంటున్నాడు.

Monday 2 September 2024

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితా స్తథాఽహం॥23-11 విశ్వరూప సందర్శన యోగము మనం నలుగురు పిల్లలని కని,పెంచి,పెద్ద చెయ్యాలంటే,నానా అగచాట్లు పడతాము.మన రెండు చేతులా సంపాదించినా చాలదు.మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ కష్టపడినా చాలదు.అందుకని ఒక్కరు ముద్దు,ఇద్దరు చాలు,ఆ పై ఇక వద్దనే వద్దు అని భీష్మించుకుంటాము.కానీ భగవంతుడు అలా అనుకోలేడు కదా!ఈ సృష్టి మొత్తం అతనే పుట్టించి,పెంచి,పోషించి,మళ్ళీ లయం చెయ్యాలి కదా!మరి అతనికి ఎన్ని చేతులు,కాళ్ళు,నోళ్ళు వుండాలి?ఎంత బలంగా వుండాలి?ఎంత నిష్టగా,నిరంతరం పాటు పడుతూ వుండాలి? అర్జునుడికి విశ్వరూపంలో అదే కనిపిస్తుంది.విశ్వ రూపానికి అనేక ముఖాలు వున్నాయట.అనేక నేత్రాలు,చేతులు,తొడలు,పాదాలు,కోరలు,ఉదరాలు వున్నాయి.మొత్తానికి అంతా చాలా భయానకంగా వుంది చూసేదానికి.ఇదంతా చూడటానికి సమస్త లోకాలు భయం తో వణికి పోతున్నాయి.వాటన్నిటితోటి అర్జునుడు కూడా భయభ్రాంతుడు అవుతున్నాడు.

Sunday 1 September 2024

అనాది మధ్యాంత మనంతవీర్య

అనాది మధ్యాంత మనంతవీర్య మనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్॥19-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు ఇంకా ఇంకా చూస్తున్నాడు.చూస్తూనే వున్నాడు.ప్రతిదీ కొత్త కొత్తగా వుంది.అత్యద్భుతంగా వుంది.అదంతా చెప్పేదానికి ఆయనకు మాటలు రావటంలేదు,చాలటం లేదు.అయినా అన్నీ చెప్పేదానికి,నెమరు వేసుకుంటున్నాడు. భగవంతుడి విశ్వరూపం ఆదిమధ్యాంతరహితంగా వుంది.అంటే దానికి మొదలు,మధ్య,అంతం కనిపించడంలేదు,అసలు లేదు.అపరిమితమయిన శక్తి కలిగి వుంది.అది అనంత బాహువులతో కూడి వుంది. సూర్యుడు,చంద్రుడే దానికి కళ్ళుగా మిరిమిట్లు గొలుపుతున్నాయి.దాని ముఖం ప్రజ్వలిస్తున్న అగ్నిలా ప్రకాశిస్తున్నది.తన తేజస్సుతో సమస్త విశ్వాన్నీ తపింపచేస్తున్నది.సూది మొన మోపేందుకు కూడా వీలు లేనంతగా,చోటు లేనంతగా దిక్కులన్నింటా నిండి వుంది.ముల్లోకాలను చుట్టుముట్టి వుంది.ఆ మహోగ్రరూపాన్ని చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి.కానీ నేను అర్థం చేసుకుంటున్నాను.

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్॥15-11 విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు తన విశ్వరూపం చూపించగానే మొదట అర్జునుడు అవాక్కైనాడు.నోట మాట రాలేదు.గొంతు గద్గదమైపోయింది.శరీరం పైనరోమాలు నిక్కబొడుచుకువ్నాయి.శరీరం పులకించింది.ఆశ్చర్యం,ఆనందం ముప్పిరిగొన్నాయి.మౌనంగా రెండు చేతులు జోడించి,మనస్పూర్తిగా నమస్కారం చేసుకున్నాడు.ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది? కొంచెం సేపటికి తనకు తానే తేరుకుని ఇలా అంటున్నాడు.హే భగవాన్!నీ ఈ రూపం దివ్యమైనది.అతి మానుషంగా వుంది.దీనికి ఆది అంతం చెప్పనలవి కాకుండా వుంది.నీ విశ్వరూపంలో నాకు చాలా చాలా కనిపిస్తున్నాయి.ఇక్కడ నాకు సమస్త దేవ గణాలు కనిపిస్తున్నాయి.భూతగణాలు కనిపిస్తున్నాయి.పద్మంలో కూర్చుని వున్న చతుర్ముఖుడైన,సృష్టికర్త బ్రహ్మ కనిపిస్తున్నాడు.మహర్షులు కనిపిస్తున్నారు.పన్నగులు కనిపిస్తున్నారు.