Wednesday, 31 July 2024
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే//8-4 జ్ఞాన యోగము
బలహీనులు,మంచివాళ్ళు,అనాధలు ఎప్పుడూ ఏకాకులు కాదు.దైవం,అంటే ప్రకృతి వాళ్ళకు ఎప్పుడూ బాసటగా నిలుస్తుంది.ఈ విషయం అర్థం కాలేదు అంటే మనం మూర్ఖులమని తేట తెల్లమవుతుంది.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అని అనుకుంటాము కదా కష్టాలలో ఉన్నప్పుడు,ఎవరి చేయూత దొరకనప్పుడు.దేవుడు అంటే ప్రకృతి.అది నిరంతరం,అనంతరం,శాశ్వతం అయినది.అది మన వెంటే ఉంటుంది,మనలని సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతూ ఉంటుంది.
కృషుడు ఇక్కడ అదే అంటున్నాడు.మంచి వాళ్లను రక్షించేదానికి,దుష్టులను తుదముట్టించడానికి,ధర్మాన్ని నిలపెట్టడానికి,ప్రతి యుగం లోనూ ఏదో ఒక రూపంలో అవతరిస్తూ వుంటాను.
యదా యదా హి ధర్మస్య
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహం//7-4 జ్ఞాన యోగము
ప్రకృతి ఎప్పుడూ తనను తాను రక్షించుకుంటుంది.మనం దాని సమతుల్యతకు భగ్నం కలిగిస్తే ,అది దాని మూడో కన్ను తెరిచి విధ్వంసం సృష్టిస్తుంది.విలయ తాండవం చేస్తుంది.అప్పుడు మనం ఎంత లబో దిబో మన్నా లాభం లేదు.పరిగెత్తడానికి ఏ చోటు మిగిలి వుండదు,తల దాచుకునే దానికి ఏ కప్పూ ఉండదు.ధర్మం నశిస్తే నాశనం ఖాయం.అధర్మం,అరాచకం పెరిగితే లెక్క సరిచూసుకుంటుంది ఈ ప్రకృతి.ఇక్కడ కృష్ణుడు ప్రకృతికి పరాకాష్ఠ గా చెప్పుకుంటున్నాడు.అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోను,ఒప్పుకోను,తాట తీస్తాను అంటున్నాడు.
కామ ఏష క్రోథ ఏష
కామ ఏష క్రోథ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం//37-3 కర్మ యోగము
మనిషిని అథఃపాతాళానికి తొక్కేసేది మనలో ఉండే రజోగుణమే.రజోగుణము అంటే కోరికలు మనసుని,మనిషిని చుట్టుముట్టటమే.రజోగుణం నుంచి కోరికలు,కామము పుడతాయి.కోరికలు,కామము తీరకపోతే మనలో అసహనం పెరుగుతుంది.అసహనం నుంచి కోపం పుట్టుకువస్తుంది.ఈ కోరికలకూ,కామానికి అదుపు,ఆజ్ఞ ఉండవు.ఆది,అంతం ఉండదు.ఎప్పుడూ మనిషిని అవి ప్రకోపిస్తూ ఉంటాయి.మనిషికి ఎప్పటికీ ఇంక చాలు,ఇంత చాలు అనే తృప్తి,సంతోషం ఉండదు.ఇంకా కావాలి,ఇంకా అనుభవించాలి,ఇంకా సుఖపడాలి అనే దుగ్థ ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది.ఈ కోపాలు,తాపాలే మనుష్యుల చేత నికృష్ఠపు పనులు చేయిస్తూ వుంటాయి.మనిషి మేధస్సు ని పక్క దోవ పట్టిస్తూ ఉంటాయి.అన్ని పాపాలకు మూల కారణం ఈ రజోగుణమే.
మనం ఎంత తెలివితేటలు గల వాళ్లమైనా,మనలో ఎంత జ్ఞానం నిబిడీకృతం అయివున్నా ఈ ఒక్క బలహీనత మనలని ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది.పొగ చేత నిప్పు,మురికి చేత అద్దం,మావి చేత పిండం కప్పబడి ఉంటాయి కదా.అలాగే మనలో ఉండే జ్ఞానాన్ని ఈ కామం కప్పేస్తుంది.కాబట్టి మనం కోపతాపాలను వశం చేసుకోవాలి.అవి మితిమీరకుండా సహనం,సంయమనం పాటించాలి.
Tuesday, 30 July 2024
శ్రేయాన్ స్వధర్మో విగుణః
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః//35-3 కర్మయోగము
తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము అని అంటారు కదా పెద్దలు.ఇక్కడ కూడా అదే ప్రస్తావిస్తున్నారు.మనకు సంబంధం లేని పనిని మనం ఎంత నైపుణ్యంతో చేసినా లాభం లేదు.ముందర మనలను మనం ఉద్ధరించుకోవాలి.విమానం లో ఎక్కినప్పుడు కూడా వాళ్ళు ఏమి చెబుతారు? ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే,ముందర ఎవరికి వాళ్ళు క్షేమం చూసుకోండి.తరువాత పక్క వాళ్ళకు సహాయం చేయండి అని చెప్తారు.జీవితంలో ఎప్పుడూ కూడా స్వధర్మం చాలా ముఖ్యం.కొన్ని తప్పు ఒప్పులు ఉన్నా,నైపుణ్యం లేకుండా చేసినా,ఎప్పటికీ మన బాగోగులు,మంచి చెడ్డ మనమే చూసుకోవటం ఉత్తమము.మన ధర్మాన్ని ఆచరిస్తూ అశువులు బాసినా మంచిదే.ఇంకొకళ్ల విషయాలలో అనవసరంగా తల దూర్చి,తన్నులు తినడం వృథా.ఎవరి ఇంట్లో అయినా గొడవలు పడుతుంటే,మనం మధ్యలో దూరి సూక్తిముక్తావళి చెబితే ఏమీ అంటారు?మొదట నీ బతుకు నువ్వు చూసుకో అంటారు.మన మంచి కోసం చెబుతున్నారు అని సానుకూలంగా తీసుకోరు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పనులు మనమే చేసుకోవటం ఉత్తమము.
కర్మేంద్రియాణి సంయమ్య
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే//6-3 కర్మయోగము
మనలో చాలా మంది ఈ కోవకు చెంది ఉంటారు.పైకి చాలా మంచిగా కనిపిస్తారు.ఇంత మంచి తట్టుకోలేము అనిపిస్తుంది.కానీ లోపల చెడు ఆలోచనలతో ఉంటారు.ఇక్కడ ఇలాంటి వాళ్ళ ప్రస్తావన ఉంది.ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహిస్తూ కూడా,ఆ ఇంద్రియ విషయాల గురించే ఆలోచిస్తారో,వాళ్లను డాంబికులు అంటారు.అంటే వాళ్ళు పైకి ఒక రకంగా,లోపల అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటారు.వాళ్ల ఆలోచనలకూ,చేసే పనులకూ పొంతన ఉండదు.ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి.ఎప్పుడు వాళ్ల అసలు బుద్ధి బయట పెడతారో తెలియదు.ఒక రకంగా వీళ్ళు బయట ప్రపంచాన్ని మోసం చేసేవాళ్ళు.
ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శమ్ కాదు.ఎవరైతే మనసు చేత ఇంద్రియాలను లోబరుచుకొని,ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తారో,వాళ్ళే మహానుభావులు,ఉత్తములు.ఇలాంటివారిని మనం ఆదర్శం గా తీసుకోవాలి.
ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనామ్ ప్రాప్య విముహ్యతి
స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి//72-2 సాంఖ్యయోగము
మనము మామూలుగా మనుష్యులను గమనిస్తుంటాము.ఎవరికైతే కోరికలు తక్కువ ఉంటాయో వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.మనం వాళ్లని అల్ప సంతోషులు అంటాము.చిన్నదానికే సంతోషంగా ఉంటారు.పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్లకు.అహంకారము,కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ మనలో అసహనం,అసంతృప్తి పెరుగుతూ ఉంటాయి.అవి లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాము.ఇంకో విషయం ఏందంటే తన మన అని కాకుండా అందరినీ ఒకేలా చూడగలగడం.మన అనుకునే కొద్దీ మన వాళ్ళకు అంతా మంచి జరగాలి,వేరే వాళ్ళు ఏమైపోయినా పరవాలేదు అనిపిస్తుంది.అప్పుడు ప్రాణి కోటి పైన సమభావం ఎక్కడ ఉంటుంది?కాబట్టి కోరికలు,అహంకారము వదిలిపెట్టగలగాలి.మమకారాన్ని త్యజించాలి.అలా ఉండగలిగినప్పుడే మనం శాంతిని పొందగలము.శాంతి అంటే అమ్మాయి అనుకునేరు.మనశ్శాంతి గురించి నేను మాట్లాడేది.దీనినే బ్రాహ్మీస్ధితి అంటారు.ఈ బ్రాహ్మస్థితి పొందిన వాళ్లు మోహము అనే జలతారు మాయలో పడరు.ఈ జ్ఞానాన్ని ఎవరు మరణకాలం లోపల సాధిస్తారో వాళ్లు బ్రహ్మనిర్వాణపధాన్ని దక్కించుకుంటారు.
బ్రహ్మ నిర్వాణ పధం అంటే ఏమో అని భయపడే పనిలేదు.అంత్య కాలం లో మనం అది పొందలేదు,మనకు ఇది దక్కలేదు,ఇంకా బాగుంటే బాగుండేది,ఇంకేదో సాధించి వుంటే బాగుండేది అనే అసంతృప్తులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోగలగటం.ఎవరూ శాశ్వతం కాదు. మనతోటే ప్రపంచం ఆగిపోవటం లేదు.అది నిరంతరం సాగిపోతుంటుంది.మనం ఈ భూమి పైకి వచ్చాము.మంచి మనసుతో,ప్రతిఫలాపేక్ష లేకుండా మన విధులను నిర్వర్తించాము.మన కాలం అయిపోయింది.ప్రశాంతంగా వెళ్ళిపోదాము.ఈ భావన ఉంటే చాలు.
Monday, 29 July 2024
అపూర్యమాణ మచలప్రతిష్ఠం
అపూర్యమాణ మచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే
స శాంతి మాప్నోతి న కామ కామీ//70-2 సాంఖ్యయోగము
సముద్రము గంభీరంగా వుంటుంది.తన లోకి ఎన్ని నీళ్ళు వచ్చినా భయపడదు.కలత చెందదు.చెలియలికట్ట దాటదు.అన్నిటినీ తనలోనే దాచుకుంటుంది,ఇముడ్చుకుంటుంది.అంత పెద్దసముద్రమే తన పరిధి దాటకుండా జాగ్రత్త పడుతుంది.మరి అల్పులమయిన మనం కొంచెం అయినా దానిని చూసి నేర్చుకోవాలి కదా.మన పరిమితులు ఏందో తెలుసుకుని బ్రతకాలి కదా.సముద్రం లాగానే స్ధితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చి చేరుతున్నా కలత చెందడు.భయపడడు.చపలచిత్తుడు కాకుండా స్థిరంగా ఉంటాడు.అంటే చలించదు,నిశ్చలంగా వుంటాడు.భోగాలకు అలవాటు పడకుండా జాగ్రత్త పడుతాడు.
అంటే మనిషి ఎప్పుడూ తన పరిమితి,పరిధి దాటకుండా ఉండాలి.అతి ఎప్పుడూ మానాలి.అది అసలు మంచిది కాదు.మన పరిస్థితి ఏంది,మన తాహతు ఏంది,మనము ఎక్కడ వున్నాము,ఎవరితో ఉన్నాము,ఎలా ఉన్నాము...అన్నీ ఆలోచించుకోవాలి ఒక అడుగు వేసేముందు.మనం చేసే పని మనకు చెడు చేయకూడదు,ఎడిటి వాళ్ళకు చెడు చేయకూడదు,పర్యావర్ణానికి హాని కలగకుండా చూసుకోవాలి.
క్రోధాద్భావతి సమ్మోహః
క్రోధాద్భావతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ప్రణశ్యతి// 63-2 సాంఖ్యయోగము
మనిషికి ఉండే అవలక్షణాలన్నిటి లోకి కోపం అనేది చాలా పెద్ద అవలక్షణం.అన్ని పాపాలకి అదే మూల కారణం.మనిషి మృగం అయ్యేది దాని వల్లే.విచక్షణ కోల్పేయేది దాని వల్లే.సర్వనాశనం అయ్యేది దాని వల్లే.ఇన్ని అనర్ధాలకు కారణం అయిన దానిని మనం దూరం పెట్టలేదా?కనీసం ప్రయత్నం చేయలేమా?ప్రయత్నం లో సఫలం కాలేమా?
కోపం వల్ల వివేకం కోల్పోతాము.అవివేకులం అవుతాము.అంటే మంచి చెడుల విశ్లేషణ చేయలేము.వావి వరసలు మర్చిపోతాము.పెద్ద చిన్న అనే అవగాహన కోల్పోతాము.అవివేకం వలన బుద్ధి పని చేయదు.ఇంతకు ముందు జరిగిన విషయాలు,మంచి చెడులు మర్చిపోతాము.నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాము.దీని పర్యావసానంగా బుద్ధి తప్పు దోవ పడుతుంది.మనం చేసేపని పైన మనకు పట్టు వుండదు.నిగ్రహం కోల్పోతాము.ఒక స్థాయిలో మనం ఆగాలన్నా ఆగలేము.అన్యాయం జరిగిపోతుంది.అరిష్టం జరిగిపోతుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి లాభం?మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఉండదు.జీవితాంతం కూర్చుని ఏడ్చినా పరిష్కారం ఉండదు.అదే నష్టం మన వల్ల వేరే వాళ్లకు జరిగితే ,ఆ పాపం ఎన్ని జన్మలెత్తినా పోదు.మన వాళ్లందరికీ అంటుకుంటుంది.సర్వ నాశనం అయిపోతాము.కాబట్టి కోపాన్ని నిగ్రహించుకునేదానికి సర్వ శక్తులూ వినియోగించుకోవాలి.
కర్మణ్యే వాధికారస్తే
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి//47-2---సాంఖ్యయోగము
మనకందరికీ యావ ఎక్కువ.ఏదైనా పని చేస్తే మనకేంది లాభం?ఓకవేళ లాభం వుంది అంటే ఎంత లాభం?ఎంతో కొంత వుంది అంటే ఇంకొంచెం పెరిగే ఆస్కారం వుందా?అసలు మొత్తం లాభం నాకే రావాలి.దాంట్లో ఇంకెవరికీ భాగం ఉండకూడదు అని అనుకుంటాము.కానీ ఇక్కడేమో కర్మలు చేయటమే మన పని.దాని పైన మనకు ఎలాంటి అధికారం లేదు.దాని వల్ల కలిగే లాభాలకు ఆశ పడొద్దు.అసలు ఆ లాభాలు మనకు వద్దనే వద్దు అంటున్నారు.ఇది సాధ్యమా?కానీ గీత మనలని సాధ్యం చేసుకోమంటుంది.లేకపోతే పుట్టినప్పటినుంచి పోయే దాకా ప్రతిదీ వ్యాపారం అయిపోతుంది.బంధాలు అనుబంధాలు ఉండవు.ప్రేమలు,అభిమానాలు ఉండవు.మనసుకి ప్రశాంతత వుండదు.ఎంత సేపు ఏదో ఒకటి సాధించాలని పరుగెత్తుతూనే వుంటాము.జీవితానికి ఒక అర్థం పరమార్ధం ఉండదు.జీవితం లో ప్రశాంతత ఉండాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతుండాలి.పనులు చేస్తుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి.లాభమయినా నష్టమయినా ఒకే రకంగా తీసుకోగలగాలి.మనము చేసేపని మంచిదయితే మంచి ఫలితాలు ఉంటాయి.చెడు పనులు అయితే చెడు ఫలితాలు ఉంటాయి.గర్వానికి పోకూడదు. మనం నిమిత్త మాత్రులము అనే విషయము సర్వ కాల సర్వావస్థల యందు గుర్తు పెట్టుకోవాలి.
కృష్ణుడు ఏమి చెప్తున్నాడంటే,ఫలితం పైన హక్కు లేదని అసలు పనులు చేయడం ఆపొద్దు.నీ విధులు నీవు సక్రమంగా నిర్వర్తించు.లాభాపేక్షతో పనులు చేయవద్దు.
Saturday, 27 July 2024
జాతస్య హి ధ్రువో
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే న త్వం సోచితు మర్హసి//27-2
కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.పుట్టినది గిట్టక మానదు.మరణించినది మళ్లీ పుట్టక మానదు.ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.దీనిని ఎవరూ ఆపలేరు.ఇలా తప్పించ శక్యం గాని ఈ చావు పుట్టుకల గురించి మనము తలలు బాదుకోవాల్సిన పనిలేదు.ఈ విషయాన్ని గురించి దిగులు పడటం మానేయాలి.ఈ విషయాన్ని మన బుర్రల్లోకి ఎక్కించుకోవాలి.
నైనం ఛిన్దంతి శస్త్రాణి
నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః//23-2
ఈ ఆత్మ భలే తమాషాగా వుంటుంది.చావు పుట్టుకలు లేవు.అంతేనా?ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని దగ్గర.దీన్ని మనం చింపి పారేయలేము.కాలుస్తామా అంటే ఉహూ కాల్చలేము.సరే,కనీసం నీళ్లలో నానబెడతామా అంటే అలా కూడా నానదు.చించలేము,కాల్చలేము,తడపలేము,కనీసం ఎండ పెడదామా అంటే అట్లా కూడా ఎండను అంటుంది.ఇంకెట్లా దీనితోటి మనము వేగేది?మనము ఏమి అడిగినా,ఏమి చేసినా దాని సమాధానం ఒక్కటే.నేను నిత్యము,నేను సత్యము.ఇంకేమి చేస్తాము ఒప్పుకోక!
వాసాంసి జీర్ణాని యధా విహాయ
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ//22-2
ఈ శ్లోకం సాంఖ్య యోగము లోనిది.కృష్ణుడు అర్జునుడికి శరీరానికి ఆత్మకు వుండే వ్యత్యాసం చెబుతున్నాడు.దేహాలు నశిస్తాయి కానీ ఆత్మ నశించదు.అది నిత్యమయినది.దానికి చావు పుట్టుకలు లేవు.ఈ ఆత్మ ఎవరినీ చంపదు,ఎవరి చేత చంపబడదు.దీనికి పెరుగుదల తరుగుదల ఉండవు.మనం బట్టలు వేసుకుంటాము.అవి చిరిగిపోయి,మాసిపోతే మన మన తాహతుని బట్టి వాటిని వదిలేస్తాము.కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతాము.ఆత్మ కూడా శరీరము క్షీణించగానే,నిరుపయోగము అవగానే ఆ శరీరాన్ని మొహమాటం లేకుండా వదిలేస్తుంది.కొత్త దేహం లోకి ప్రవేశిస్తుంది.దానికి పాత శరీరం పైన కానీ.కొత్త శరీరం పైన కానీ మోహము వుండదు.
Thursday, 25 July 2024
క్లైబ్యం మాస్మగమః పార్థ
క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే
క్షుద్రమ్ హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప//
ఈ శ్లోకం భగవద్గీత లోని సాంఖ్యయోగము అనే ద్వితీయ అధ్యాయము లోని మూడవ శ్లోకము.అర్జునుడు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు.యుద్ధం. చెయ్యాలా,చెయ్యకూడదా?చేస్తే ఏంటి?చెయ్యకపోతే ఏంటి?అసలు మనసు మొద్దు బారిపోయి వుంది.విచక్షణ చేసుకోలేకపోతున్నాడు.అప్పుడు తన మిత్రుడు అయిన కృష్ణుడితో మొరపెట్టుకున్నాడు దారి చూపమని.
మనలో ఎవరైనా స్థాణువులా మొద్దు బారిపోతే మనం ఏమి చేస్తాము?పట్టశక్యం కాని కోపం,దుఃఖం,మూర్ఖత్వంలో వుంటే పెద్ద వాళ్ళు ఏమీ చేస్తారు?వాళ్లను స్పృహలోకి తెప్పించడానికి చెంప పైన చెళ్లున ఒకటి ఇస్తారు.ఇక్కడ కృష్ణుడు కూడా అదే పని చేస్తున్నాడు.అంటే కొట్టాడు అని కాదు.అయ్యో!నాయనా!అలాగా!పోనీలే పాపం!అని ఊరుకోలేదు.ఒక నిజమైన మంచి స్నేహితుడిలాగా అర్జునుడిని ప్రస్తుత పరిస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.కర్తవ్యవిముఖుడు అయిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసే పనిలో పడ్డాడు.దానికి అవసరమైన సామ దాన దండోపాయాలనుఉపయోగించడానికి వెనుకాడ లేదు.
నువ్వు యోధుడివి.ప్రస్తుతం యుద్ధం చేసేదానికి వచ్చావు.రణరంగం లో నిలుచుకుని ఉన్నావు.ఇప్పుడు.మీనమేషాలు లెక్క పెట్టేది ఏంది?ఇప్పుడు పౌరుషం పోగొట్టుకునేది ఏంది?ఇది నీకు తగని పని.ముఖ్యమయిన సమయం లో ఈ మానసిక దుర్బలత నీకు అచ్చిరాదు.మంచిది కాదు.దీనిని ఎవరూ సమర్ధించరు.ఈ పిరికితనాన్ని,సందిగ్ధాన్ని వదిలి పెట్టు.తెలివిగా ఆలోచించు.
మనం కూడా కొన్ని కొన్ని సమయాలలో ఒక మంచి పని చేసేదానికి అనవసరంగా భయపడుతుంటాము.ఇది మనకు తగినదా?అసలు మొదలు పెడితే పూర్తి చెయ్యగలమా?మనకు అంత సమర్థత,తాహతు వుందా అని మనకు మనమే భయపడుతుంటాము.కానీ నిజానికి మనం చెయ్యగలం,మనలో ఆ సమర్థత,కార్యదక్షత ఉంటుంది.కానీ ఆ కాన్ఫిడెన్స్,మనపై మనకు నమ్మకం వుండదు. అలాంటప్పుడు మన వాళ్లు ఒక కేటలిస్ట్ లాగా ఒక మంచి మాట చెప్పి,వెన్ను తట్టి మనలను ప్రోత్సహిస్తారు.వాళ్ల ఋణం మనం ఎప్పటికీ మర్చిపోలేము.ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునుడి విషయం లో చేస్తున్నది అదే.
కాబట్టి మనం కూడా ఎవరైనా ఒక మంచిపని,నలుగురికి పనికి వచ్చేపని చేసేదానికి తటపటాయిస్తూ వుంటే,వాళ్లను భుజం తట్టి ప్రోత్సాహం ఇద్దాము.
Wednesday, 24 July 2024
మహాపాపాది పాపాని
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళ మంభసా//
మనము తెలిసో తెలియకో చాలా పాపాలు చేస్తాము.ఇగ్నోరన్స్ ఈస్ నో ఎక్స్యూజ్ ఇన్ లా.అంటే మనమెవ్వరమూ తెలియదు అని ఆ భగవంతుడి కళ్లలోనుంచి తప్పు చేసి తప్పించుకోలేము.ఇంక తెలిసి చేసే పాపాల విషయానికి వస్తాము.చాలా మటుకు మనకు ఏమీ కాదు,ఎవరూ చూడటం లేదు,ఇది చాలా చిన్న తప్పు,వేరే వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనము చేసేది అసలు తప్పే కాదు,పరిస్ధితుల ప్రభావం వల్ల చేస్తున్నాము కానీ మాకు ఇష్టమయి కాదు....ఇలా మనకు మనమే మభ్యపెట్టుకుంటూ,తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది.ఇంక తప్పు చేస్తున్నామనే భావన కూడా వుండదు.అది కూడా హ్యూమన్ రైట్స్ లో ఒక భాగం అనుకునే స్థితికి చేరుకుంటాము.
అందుకే ఈ పద్యం రాశారు.ఏమని అంటే తామరాకు నీళ్లలో వున్నా,ఆ తడి దానికి అంటదు.అలాగే భగవద్గీత పారాయణం చేసేవారికి ఎటువంటి మహాపాపాలు అంటవు.ఇది మనకు విడ్డూరంగా అనిపిస్తుంది మొదటి సారి విన్నప్పుడు.కానీ దీంట్లో నిజం వుంది.ఎందుకంటే పారాయణం అంటే ఊరికినే బట్టీ పట్టినట్లు చదవటం కాదు.దాంట్లోని ప్రతి పదానికి,శ్లోకానికీ,అధ్యాయానికీ అర్థం పరమార్ధం తెలుసుకుంటూ పోవాలి.అప్పుడు మనలో మనం చేసేది తప్పా,ఒప్పా అనే అంతర్మథనం మొదలవుతుంది.తప్పు అని తెలిసిన తరువాత మనపైన మనకే జుగుప్స కలుగుతుంది. ఆ అపరాధ భావం తొలగాలంటే ఏమి చెయ్యాలి?మనసు నిష్కల్మషంగా,నిర్మలంగా,ప్రశాంతంగా వుండాలంటే ఏమి చెయ్యాలి అనే శోధన మొదలవుతుంది.అంటే మనము పాపప్రక్షాళనకు నడుము బిగిస్తాము.మంచి కార్యాలు చేస్తాము.మంచిగా మాట్లాడుతాము.మంచిగా ఆలోచిస్తాము.ఎదుటివాళ్ల మంచి కోరుతాము.దాంట్లోనే మన సంతోషం వెదుక్కుంటాము.అందరినీ సమానంగా చూడటం మొదలుపెడతాము.ఎవరినీ నొప్పించము.సర్వే జనాహ్ సుఖినో భవంతు అని మనసా వాచా కర్మణా ఆచరిస్తాము.
కాబట్టి మనము తెలిసి తెలియక చేసే తప్పులకు పరిష్కారం దొరుకుతుంది.మన జీవన విధానం మారుతుంది.సంఘానికి మంచి చేసే తలపు వస్తుంది.అది కార్యాచరణలో పెట్టే పట్టుదల వస్తుంది.
ఇన్ని లాభాలు వున్నాయి కాబట్టే గొప్ప గొప్ప వాళ్లందరూ భగవద్గీతను నమ్ముకొని వున్నారు.
Tuesday, 23 July 2024
గీతా కల్పతరుమ్ భజే
గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాస వివర్థితం శ్రుతిశిరోబీజమ్ ప్రబోధాంకురం
నానాశాస్త్ర రహస్యశాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితం
కృష్ణామ్ఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదంజ్ఞానినం//
భగవద్గీత అనేది ఒక కల్పవృక్షం సహస్ర మానవాళికి.నేను ఆ కల్పతరువును సేవిస్తున్నాను.ఈ కల్పవృక్షాన్ని ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు నాటాడు.వేదవ్యాసుడు ఆ మొక్కనుపెంచిపోషించాడు.ఈ వృక్షానికి బీజం ఉపనిషత్తులు.దాని అంకురం,అంటే మొలకఆత్మప్రబోధము.వివిధ శాస్త్రముల యొక్క రహస్యాలు,మూలాలు దాని శాఖలు.శాఖలు అంటే కొమ్మలు.శాంతి,సహనము,వైరాగ్యము,ప్రేమలు అనే మంచి గుణాలుఈ చెట్టుయొక్క చిగురుటాకులు.మన మనసులలో శ్రీకృష్ణభగవంతుడు పైన వుండే భక్తిశ్రధ్ధలు ఈ చెట్టు నుంచివిరజిల్లే పూలసుగంధాలు.జ్ఞానులు దీనిని మోక్షానికి మార్గము అని గాఢంగా నమ్ముతారు.
చేతో భృంగ!భ్రమసి వృధా భవ
చేతో భృంగ! భ్రమసి వృధా భవ
మరు భూమౌ విరసాయమ్
పిబ పిబ గీతా మకరందం
మురరిపు ముఖ కమల భవాడ్యమ్//
మన మనసు ఒక తుమ్మెదలాంటిది.కవి ఇలా అంటూన్నాడు.మనసు అనబడే ఓ తుమ్మెదా!సంసారమనబడే ఈ మరుభూమిలో ఎందుకువృధాగా తిరుగుతున్నావు?ఇది రసహీనమయినది.ఇక్కడ సంచరించడం వలన మనిషికి ఏ మాత్రం లాభములేదు.పోదామురా.మురహరి అయిన ఆ శ్రీకృష్ణుని ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీత అనే తేనెను త్రాగుదాము.మన జన్మలనుసార్ధకం చేసుకుందాము.భగవద్గీత అనే ఆ రసామృతం ఎంత తాగినా తనివి తీరదు.కానీ ఒక చుక్క తాగినా మనకు మోక్షం లభిస్తుంది.
Friday, 19 July 2024
న కాంక్షే విజయం కృష్ణా
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ/
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా//
ఈ శ్లోకం భగవద్గీతలో ఒకటవఅధ్యాయం,అర్జున విషాదయోగం లో వస్తుంది.అర్జునుడుదిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు.మంచేదో,చెడేదో తెలియని వ్యవహారం.అసలు తను యుద్ధభూమికి ఎందుకొచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి.అప్పుడుకృష్ణుడుతో తన దీనావస్థను మొరపెట్టుకుంటాడు.తను తన మనసులో పడేఆవేదన,అతలాకుతలంగా,గందరగోళంగా రకారకాలుగా మూగే ఆలోచనలు కృష్ణుడికి చెప్పేస్తాడు.ఆ ధోరణిలోనే ఈ మాటలు అంటాడు.
కృష్ణా,నేను ఈ యుద్ధం చెయ్యాలనుకోవటం లేదు.చేసినా గెలవాలనుకోవటం లేదు.నాకు ఈ రాజ్యం వద్దు.దానివల్ల సమకూరే సుఖాలు వద్దు.తుచ్ఛమయిన ఈ లాభాలకోసం నేను నా వాళ్ళను చంపుకునే దౌర్భాగ్యస్థితిలో లేను.నాకు చాలా దిగులు,విచారంగా ఉండి.మనసంతా వైరాగ్యం నిండిపోయింది.నాకు అసలు ఇలాంటి జీవితమే వద్దు.
నాకు భవిష్యత్తు అంతా అగమ్యగోచరం గా ఉంది.ఈ కష్టాన్నించి నన్ను గట్టెక్కించు అని అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు.
ఇక్కడ అర్జునుడు కృష్ణుడిలో దేవుడిని చూడలేదు. ఒక నమ్మకమయిన,ప్రియమయిన మిత్రుడినే చూసాడు.మనం కూడా చాలా సందర్భాలలో ఇంట్లో వాళ్ళకంటే,మన అనుకునే మన ఫ్రెండ్స్ కే మన కష్టసుఖాలు,సంతోషాలు,దుఃఖాలు,భయాలు,అనుమానాలు చెప్పుకుంటాము.ఎందుకంటే వాళ్ళు మనలని ఎక్కిరించరు,అర్థం చేసుకుంటారని ఒక గట్టి నమ్మకం.ఆ నమ్మకం తోటే అర్జునుడు కూడా ఇక్కడ తన మనసులో కలిగే భావాలన్నిటినీ ఏకరువు పెట్టాడు.
గీత వల్ల లాభాలు
గీత.....శ్రీకృష్ణ భగవానుని దూత
గీత......వ్యాస మునీంద్రుని వ్రాత
గీత.....వేదమంత్రముల మ్రోత
గీత....అహంకారాదులకు కోత
గీత....దివ్యజ్ఞానమునకు దాత
గీత....అసురస్వభావమునకు వాత
గీత....దైవీసంపదకు నేత
గీత...పరమార్థదృష్టికి మాత
గీత...రాగధ్వేషములకు మూత
గీత....కైవల్యపథమునకు సీత
గీత..ప్రణవనాదమునకు గాత
గీత...భావసాగరమునకు ఈత
గీత...ముముక్షుజనులకు ఊత
గీత...ప్రకృతి సామ్రాజ్యమునకు జేత
గీత...ధర్మ్యామృతమునకు పోత
Subscribe to:
Posts (Atom)