Thursday 25 July 2024

క్లైబ్యం మాస్మగమః పార్థ

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే క్షుద్రమ్ హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప// ఈ శ్లోకం భగవద్గీత లోని సాంఖ్యయోగము అనే ద్వితీయ అధ్యాయము లోని మూడవ శ్లోకము.అర్జునుడు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు.యుద్ధం. చెయ్యాలా,చెయ్యకూడదా?చేస్తే ఏంటి?చెయ్యకపోతే ఏంటి?అసలు మనసు మొద్దు బారిపోయి వుంది.విచక్షణ చేసుకోలేకపోతున్నాడు.అప్పుడు తన మిత్రుడు అయిన కృష్ణుడితో మొరపెట్టుకున్నాడు దారి చూపమని. మనలో ఎవరైనా స్థాణువులా మొద్దు బారిపోతే మనం ఏమి చేస్తాము?పట్టశక్యం కాని కోపం,దుఃఖం,మూర్ఖత్వంలో వుంటే పెద్ద వాళ్ళు ఏమీ చేస్తారు?వాళ్లను స్పృహలోకి తెప్పించడానికి చెంప పైన చెళ్లున ఒకటి ఇస్తారు.ఇక్కడ కృష్ణుడు కూడా అదే పని చేస్తున్నాడు.అంటే కొట్టాడు అని కాదు.అయ్యో!నాయనా!అలాగా!పోనీలే పాపం!అని ఊరుకోలేదు.ఒక నిజమైన మంచి స్నేహితుడిలాగా అర్జునుడిని ప్రస్తుత పరిస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.కర్తవ్యవిముఖుడు అయిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసే పనిలో పడ్డాడు.దానికి అవసరమైన సామ దాన దండోపాయాలనుఉపయోగించడానికి వెనుకాడ లేదు. నువ్వు యోధుడివి.ప్రస్తుతం యుద్ధం చేసేదానికి వచ్చావు.రణరంగం లో నిలుచుకుని ఉన్నావు.ఇప్పుడు.మీనమేషాలు లెక్క పెట్టేది ఏంది?ఇప్పుడు పౌరుషం పోగొట్టుకునేది ఏంది?ఇది నీకు తగని పని.ముఖ్యమయిన సమయం లో ఈ మానసిక దుర్బలత నీకు అచ్చిరాదు.మంచిది కాదు.దీనిని ఎవరూ సమర్ధించరు.ఈ పిరికితనాన్ని,సందిగ్ధాన్ని వదిలి పెట్టు.తెలివిగా ఆలోచించు. మనం కూడా కొన్ని కొన్ని సమయాలలో ఒక మంచి పని చేసేదానికి అనవసరంగా భయపడుతుంటాము.ఇది మనకు తగినదా?అసలు మొదలు పెడితే పూర్తి చెయ్యగలమా?మనకు అంత సమర్థత,తాహతు వుందా అని మనకు మనమే భయపడుతుంటాము.కానీ నిజానికి మనం చెయ్యగలం,మనలో ఆ సమర్థత,కార్యదక్షత ఉంటుంది.కానీ ఆ కాన్ఫిడెన్స్,మనపై మనకు నమ్మకం వుండదు. అలాంటప్పుడు మన వాళ్లు ఒక కేటలిస్ట్ లాగా ఒక మంచి మాట చెప్పి,వెన్ను తట్టి మనలను ప్రోత్సహిస్తారు.వాళ్ల ఋణం మనం ఎప్పటికీ మర్చిపోలేము.ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునుడి విషయం లో చేస్తున్నది అదే. కాబట్టి మనం కూడా ఎవరైనా ఒక మంచిపని,నలుగురికి పనికి వచ్చేపని చేసేదానికి తటపటాయిస్తూ వుంటే,వాళ్లను భుజం తట్టి ప్రోత్సాహం ఇద్దాము.

No comments:

Post a Comment