Friday 19 July 2024

న కాంక్షే విజయం కృష్ణా

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ/ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా// ఈ శ్లోకం భగవద్గీతలో ఒకటవఅధ్యాయం,అర్జున విషాదయోగం లో వస్తుంది.అర్జునుడుదిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు.మంచేదో,చెడేదో తెలియని వ్యవహారం.అసలు తను యుద్ధభూమికి ఎందుకొచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి.అప్పుడుకృష్ణుడుతో తన దీనావస్థను మొరపెట్టుకుంటాడు.తను తన మనసులో పడేఆవేదన,అతలాకుతలంగా,గందరగోళంగా రకారకాలుగా మూగే ఆలోచనలు కృష్ణుడికి చెప్పేస్తాడు.ఆ ధోరణిలోనే ఈ మాటలు అంటాడు. కృష్ణా,నేను ఈ యుద్ధం చెయ్యాలనుకోవటం లేదు.చేసినా గెలవాలనుకోవటం లేదు.నాకు ఈ రాజ్యం వద్దు.దానివల్ల సమకూరే సుఖాలు వద్దు.తుచ్ఛమయిన ఈ లాభాలకోసం నేను నా వాళ్ళను చంపుకునే దౌర్భాగ్యస్థితిలో లేను.నాకు చాలా దిగులు,విచారంగా ఉండి.మనసంతా వైరాగ్యం నిండిపోయింది.నాకు అసలు ఇలాంటి జీవితమే వద్దు. నాకు భవిష్యత్తు అంతా అగమ్యగోచరం గా ఉంది.ఈ కష్టాన్నించి నన్ను గట్టెక్కించు అని అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిలో దేవుడిని చూడలేదు. ఒక నమ్మకమయిన,ప్రియమయిన మిత్రుడినే చూసాడు.మనం కూడా చాలా సందర్భాలలో ఇంట్లో వాళ్ళకంటే,మన అనుకునే మన ఫ్రెండ్స్ కే మన కష్టసుఖాలు,సంతోషాలు,దుఃఖాలు,భయాలు,అనుమానాలు చెప్పుకుంటాము.ఎందుకంటే వాళ్ళు మనలని ఎక్కిరించరు,అర్థం చేసుకుంటారని ఒక గట్టి నమ్మకం.ఆ నమ్మకం తోటే అర్జునుడు కూడా ఇక్కడ తన మనసులో కలిగే భావాలన్నిటినీ ఏకరువు పెట్టాడు.

No comments:

Post a Comment