Wednesday, 24 July 2024

మహాపాపాది పాపాని

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళ మంభసా// మనము తెలిసో తెలియకో చాలా పాపాలు చేస్తాము.ఇగ్నోరన్స్ ఈస్ నో ఎక్స్యూజ్ ఇన్ లా.అంటే మనమెవ్వరమూ తెలియదు అని ఆ భగవంతుడి కళ్లలోనుంచి తప్పు చేసి తప్పించుకోలేము.ఇంక తెలిసి చేసే పాపాల విషయానికి వస్తాము.చాలా మటుకు మనకు ఏమీ కాదు,ఎవరూ చూడటం లేదు,ఇది చాలా చిన్న తప్పు,వేరే వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనము చేసేది అసలు తప్పే కాదు,పరిస్ధితుల ప్రభావం వల్ల చేస్తున్నాము కానీ మాకు ఇష్టమయి కాదు....ఇలా మనకు మనమే మభ్యపెట్టుకుంటూ,తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది.ఇంక తప్పు చేస్తున్నామనే భావన కూడా వుండదు.అది కూడా హ్యూమన్ రైట్స్ లో ఒక భాగం అనుకునే స్థితికి చేరుకుంటాము. అందుకే ఈ పద్యం రాశారు.ఏమని అంటే తామరాకు నీళ్లలో వున్నా,ఆ తడి దానికి అంటదు.అలాగే భగవద్గీత పారాయణం చేసేవారికి ఎటువంటి మహాపాపాలు అంటవు.ఇది మనకు విడ్డూరంగా అనిపిస్తుంది మొదటి సారి విన్నప్పుడు.కానీ దీంట్లో నిజం వుంది.ఎందుకంటే పారాయణం అంటే ఊరికినే బట్టీ పట్టినట్లు చదవటం కాదు.దాంట్లోని ప్రతి పదానికి,శ్లోకానికీ,అధ్యాయానికీ అర్థం పరమార్ధం తెలుసుకుంటూ పోవాలి.అప్పుడు మనలో మనం చేసేది తప్పా,ఒప్పా అనే అంతర్మథనం మొదలవుతుంది.తప్పు అని తెలిసిన తరువాత మనపైన మనకే జుగుప్స కలుగుతుంది. ఆ అపరాధ భావం తొలగాలంటే ఏమి చెయ్యాలి?మనసు నిష్కల్మషంగా,నిర్మలంగా,ప్రశాంతంగా వుండాలంటే ఏమి చెయ్యాలి అనే శోధన మొదలవుతుంది.అంటే మనము పాపప్రక్షాళనకు నడుము బిగిస్తాము.మంచి కార్యాలు చేస్తాము.మంచిగా మాట్లాడుతాము.మంచిగా ఆలోచిస్తాము.ఎదుటివాళ్ల మంచి కోరుతాము.దాంట్లోనే మన సంతోషం వెదుక్కుంటాము.అందరినీ సమానంగా చూడటం మొదలుపెడతాము.ఎవరినీ నొప్పించము.సర్వే జనాహ్ సుఖినో భవంతు అని మనసా వాచా కర్మణా ఆచరిస్తాము. కాబట్టి మనము తెలిసి తెలియక చేసే తప్పులకు పరిష్కారం దొరుకుతుంది.మన జీవన విధానం మారుతుంది.సంఘానికి మంచి చేసే తలపు వస్తుంది.అది కార్యాచరణలో పెట్టే పట్టుదల వస్తుంది. ఇన్ని లాభాలు వున్నాయి కాబట్టే గొప్ప గొప్ప వాళ్లందరూ భగవద్గీతను నమ్ముకొని వున్నారు.

No comments:

Post a Comment