Wednesday, 31 July 2024
కామ ఏష క్రోథ ఏష
కామ ఏష క్రోథ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం//37-3 కర్మ యోగము
మనిషిని అథఃపాతాళానికి తొక్కేసేది మనలో ఉండే రజోగుణమే.రజోగుణము అంటే కోరికలు మనసుని,మనిషిని చుట్టుముట్టటమే.రజోగుణం నుంచి కోరికలు,కామము పుడతాయి.కోరికలు,కామము తీరకపోతే మనలో అసహనం పెరుగుతుంది.అసహనం నుంచి కోపం పుట్టుకువస్తుంది.ఈ కోరికలకూ,కామానికి అదుపు,ఆజ్ఞ ఉండవు.ఆది,అంతం ఉండదు.ఎప్పుడూ మనిషిని అవి ప్రకోపిస్తూ ఉంటాయి.మనిషికి ఎప్పటికీ ఇంక చాలు,ఇంత చాలు అనే తృప్తి,సంతోషం ఉండదు.ఇంకా కావాలి,ఇంకా అనుభవించాలి,ఇంకా సుఖపడాలి అనే దుగ్థ ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది.ఈ కోపాలు,తాపాలే మనుష్యుల చేత నికృష్ఠపు పనులు చేయిస్తూ వుంటాయి.మనిషి మేధస్సు ని పక్క దోవ పట్టిస్తూ ఉంటాయి.అన్ని పాపాలకు మూల కారణం ఈ రజోగుణమే.
మనం ఎంత తెలివితేటలు గల వాళ్లమైనా,మనలో ఎంత జ్ఞానం నిబిడీకృతం అయివున్నా ఈ ఒక్క బలహీనత మనలని ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది.పొగ చేత నిప్పు,మురికి చేత అద్దం,మావి చేత పిండం కప్పబడి ఉంటాయి కదా.అలాగే మనలో ఉండే జ్ఞానాన్ని ఈ కామం కప్పేస్తుంది.కాబట్టి మనం కోపతాపాలను వశం చేసుకోవాలి.అవి మితిమీరకుండా సహనం,సంయమనం పాటించాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment