Tuesday 30 July 2024

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనామ్ ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి//72-2 సాంఖ్యయోగము మనము మామూలుగా మనుష్యులను గమనిస్తుంటాము.ఎవరికైతే కోరికలు తక్కువ ఉంటాయో వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.మనం వాళ్లని అల్ప సంతోషులు అంటాము.చిన్నదానికే సంతోషంగా ఉంటారు.పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్లకు.అహంకారము,కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ మనలో అసహనం,అసంతృప్తి పెరుగుతూ ఉంటాయి.అవి లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాము.ఇంకో విషయం ఏందంటే తన మన అని కాకుండా అందరినీ ఒకేలా చూడగలగడం.మన అనుకునే కొద్దీ మన వాళ్ళకు అంతా మంచి జరగాలి,వేరే వాళ్ళు ఏమైపోయినా పరవాలేదు అనిపిస్తుంది.అప్పుడు ప్రాణి కోటి పైన సమభావం ఎక్కడ ఉంటుంది?కాబట్టి కోరికలు,అహంకారము వదిలిపెట్టగలగాలి.మమకారాన్ని త్యజించాలి.అలా ఉండగలిగినప్పుడే మనం శాంతిని పొందగలము.శాంతి అంటే అమ్మాయి అనుకునేరు.మనశ్శాంతి గురించి నేను మాట్లాడేది.దీనినే బ్రాహ్మీస్ధితి అంటారు.ఈ బ్రాహ్మస్థితి పొందిన వాళ్లు మోహము అనే జలతారు మాయలో పడరు.ఈ జ్ఞానాన్ని ఎవరు మరణకాలం లోపల సాధిస్తారో వాళ్లు బ్రహ్మనిర్వాణపధాన్ని దక్కించుకుంటారు. బ్రహ్మ నిర్వాణ పధం అంటే ఏమో అని భయపడే పనిలేదు.అంత్య కాలం లో మనం అది పొందలేదు,మనకు ఇది దక్కలేదు,ఇంకా బాగుంటే బాగుండేది,ఇంకేదో సాధించి వుంటే బాగుండేది అనే అసంతృప్తులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోగలగటం.ఎవరూ శాశ్వతం కాదు. మనతోటే ప్రపంచం ఆగిపోవటం లేదు.అది నిరంతరం సాగిపోతుంటుంది.మనం ఈ భూమి పైకి వచ్చాము.మంచి మనసుతో,ప్రతిఫలాపేక్ష లేకుండా మన విధులను నిర్వర్తించాము.మన కాలం అయిపోయింది.ప్రశాంతంగా వెళ్ళిపోదాము.ఈ భావన ఉంటే చాలు.

No comments:

Post a Comment