Thursday, 29 August 2024
అనేక వక్త్ర నయనం
అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనం
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్॥10-11
అనుకోకుండా మనకు మంచి జరిగితే అందరూ ఏమంటారు?నక్క తోక తొక్కాడు రా వీడు అని అంటారు కదా!ఇక్కడ సంజయుడిది కూడా అలాంటి అదృష్టమే!మహా మహులు,హేమాహేమీలు,గురువులు,యోగులు ఎంత మంది వున్నా,అర్జునుడితో పాటు ఆయనకు కూడా భగవంతుడి విశ్వ రూపం చూసే అదృష్టం దక్కింది.
పిల్లి పిల్లి తన్నుకుంటే మధ్యలో కోతి లాభ పడిందట!అలాగే పాండవులు,కౌరవులు తన్నుకుంటే,సంజయుడు లాభ పడ్డాడు.ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.ఆయన మామూలు గుడ్డి కాదు.బిడ్డల పైన అతి ప్రేమతో మంచి చెడ్డ విచక్షణ కోల్పోయిన అంథత్వం.
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఆ విశ్వ రూపం అనేక ముఖాలతో వుందట.అనేక నేత్రాలతో వుందట.అద్భుతాకారాలతో,దివ్యాభరణాలతో విరాజిల్లుతున్నదట!దివ్యమైన ఆయుధాలు,వస్త్రాలు,పూలమాలలు,సుగంధాలు,లేపనాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుందట!
న తు మాం శక్యసే దృష్టుమ్
న తు మాం శక్యసే దృష్టు మనేనైవ స్వచక్షుషా
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్॥8-11
విశ్వరూప సందర్శన యోగము
మనం మాములుగా కనిపించేవి చూస్తాము.మరీ చిన్న చిన్న చీమలు,చీకటీగలు చూడాలంటే కళ్ళు చికిలించి మరీ చూస్తాము.కళ్ళకు కనిపించని సూక్ష్మ ప్రాణులని చూడాలంటే మైక్రోస్కోప్ వాడుతాము.దూరంవి చూడాలంటే బైనాక్యులర్స్ వాడుతాము.చీమ మనమొత్తం ఆకారాలను ఒకేసారిగా చూడలేదు కదా!
మరి బ్రహ్మాండం అంతా నిండి,వ్యాపించి వుండే ఆపరబ్రహ్మను మనము మామూలు కళ్ళతో చూడడం ఎలా సాథ్యం?మనం చాలా సార్లు గుడిలో దేవుడి ముందర నిలుచుకుని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటాము.ఆ విగ్రహాన్ని ఒక్క క్షణం కంటే ఎక్కువ చూడము.ఎందుకు?
మనం మన మనో నేత్రం తో చూడాలని ఉబలాట పడతాము.కళ్ళతో చూస్తే తనివి తీరదు.జ్ఞాన నేత్రంతో చూసి ఆయనకు దగ్గర అవాలని అనుకుంటాము.
ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో అదే అంటున్నాడు.నువ్వు నా విశ్వరూపాన్ని మామూలు చక్షువులతో చూడలేవు.కాబట్టి నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను.దాని సహాయంతో నా పరిపూర్ణ
రూపాన్ని చూడగలుగుతావు.అంటే మనసుతో చూడూ,జ్ఞాన నేత్రం తో చూడు అని ఆయన అర్థం.ఆ జ్ఞానాన్ని ఆయన అర్జునుడికి ఇచ్చాడు అని అర్థం.
Wednesday, 28 August 2024
మన్యసే యది తచ్ఛక్యం
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టు మితి ప్రభో
యోగేశ్వర!తతోమే త్వం దర్శయాత్మాన మవ్యయమ్॥4-11
విశ్వరూప సందర్శన యోగము
అర్జునుడు,కృష్ణుడు అంత దాకా మిత్రులు,బావా-బావమరుదులు.కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంథం ఇంకా చిక్క బడింది.బలంగా తయారైంది.గురుశిష్యుల బంథం,భగవంతుడు భక్తుడి మథ్య బంథం అయింది.ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి అంటారు కదా!అది మనం అర్జునుడిలో చూడవచ్చు.ఆ భగవంతుడే నా మిత్రుడు,నా బావ అని విర్రవీగటం లేదు.కృష్ణుడి ముందు తను ఒక గడ్డి పరక అని అర్థం చేసుకున్నాడు.అందుకే కృష్ణుడిని యాచిస్తున్నాడు.
హే ప్రభూ!యోగేశ్వరా!నాకు నీ దివ్య రూపం చూడాలని వుంది.అది చూసే యోగం,భాగ్యం,అర్హత నాకు వున్నాయని నీవు మనస్పూర్తిగా నమ్మితే,దయచేసి చూపించు.నా జన్మ ధన్యం చేసుకుంటాను అని అంటున్నాడు.
మాములుగా మనకు గొప్ప వాళ్ళతో పరిచయం వుంటే విర్ర వీగుతాం.అసలు వాళ్ళ కంటే మనమే హటాటోపం చూపిస్తాము.ఇంతెందుకు?రాజకీయ నాయకులు సభలలో మన తట్టు చూసి చెయ్యి వూపినా వాళ్ళకు మనం అత్యంత సన్నిహితులం అని చెప్పుకుంటాము.ఎందుకంటే అడిగే వాళ్ళుండరు కదా!మనం ఏది చెపితే అది నమ్మే గొర్రెలు వుంటారు కదా!కాబట్టి మనం అతి తగ్గించుకుని,మితంగా,పరిమితంగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
ఎంతలో వుండాలో అంతలో వుండటం నేర్చుకోవాలి.
Tuesday, 27 August 2024
ద్యూతం ఛలయతామస్మి
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహం॥
తన గురించి ఇంకా ఇలా చెపుతున్నాడు కృష్ణుడు.పంచకాలు,అంటే చెడ్డ పనులలో జూదంని నేను.తేజోవంతులలోని తేజాన్ని నేను.విజయం పొందే వాళ్ళలోని విజయాన్ని నేను.కృషి చేసే వాళ్ళ ప్రయత్నబలాన్ని నేను.సాత్త్వికులలోని సత్త్వగుణాన్ని నేను.
అంటే మంచి చెయ్యాలన్నా,చెడు చెయ్యాలన్నా దాని వెనుక వుండే ప్రేరణ అతనే.చెడు లో కూడా వున్నాను,మంచిలో కూడా వున్నాను అంటే ఆయన దృష్టిలో రెండూ సమానమే.అందుకనే మంచి అనగానే నెత్తిన పెట్టుకోడు,చెడు అనగానే తుద ముట్టించడు.నిదానంగా గమనిస్తాడు.మనకు తగిన సమయం ఇస్తాడు మారేదానికి చెడు మార్గం నుంచి మంచిగా మారేదానికి,మంచి తనాన్ని కొస వరకు నిలబెట్టుకునేదానికి.ఆయన పెట్టే ఈ పరీక్ష లో మనం నెగ్గేదానికి ప్రయత్నించాలి.ఏదైనా వూరికేరాదు కదా!అమృతం కోసం దేవతలే ఎంత కష్ట పడ్డారు?సాగర మథనం చేసారు కదా!అప్పుడు కూడా మొదట్లోనే వచ్చేయలేదు కదా!ఒకటొకటి వచ్చి,హాలాహలం కూడా వచ్చింది కదా!దానితో నిరాశ పడకుండా,ఇంకా చిలికారు కాబట్టి ఆఖరున అమృతం వచ్చింది.
మనం కూడా అంతే.ఆరంభ సూరత్వం కాకుండా,కష్టాలు వచ్చినా,నష్టాలు వచ్చినా,అలుపెరగకుండా దైవ చింతన,భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని,మన కర్మలని మనం నిష్కల్మషంగా,నిర్వికారంగా చేసుకుంటూ ముందుకు పోవాలి.
Monday, 26 August 2024
అక్షరాణా మకారోఽస్మి
అక్షరాణా మకారోఽస్మి ద్వంద్వస్సామాసికస్య చ
అహమేవాక్షయః కాలోధాతాఽహం విశ్వతోముఖః॥33-10
విభూతి యోగము
మనం చాలా సార్లు కళ్ళద్దాలు కళ్ళకే పెట్టుకుంటాము.కానీ వాటికోసం ఇల్లంతా వెతుకుతాము.ఇంట్లో అందరి పైన విసుక్కుంటాము.అందరినీ వెతకమంటాము.వాళ్ళు కిసుక్కున నవ్వి,నీ కళ్ళకే వున్నాయి చూసుకో అంటారు.సిగ్గు పడి పోతాము.ఇంత అస్తాఇస్తం ఏంది మనకు అని ఆశ్చర్యపోతాము.
భగవంతుడిని మనము కనుక్కోవటం కూడా అలాంటిదే.ఏంది?భగవంతుడు ఎక్కడ వున్నాడు?ఎక్కడా కనిపించడు,మళ్ళీ నమ్మాలి అంటాడు.వినపడడు,కనపడడు,అసలు వున్నాడో లేదో తెలియదు,కానీ గాఢంగా నమ్మాలి అంటారు,ఎలా?
మనం మన చుట్టూరా వెతుకుతాము.దేవుడు సర్వాంతర్యామి కదా!కాబట్టి నిదానం గా మనలో కూడా చూసుకోవాలి కదా.అంతర్ముఖంగా,అంతర్మథనం చేసుకోవాలి కదా!పరమాత్మ అందరిలో వుంటాడు అంటే మనలో కూడా వున్నట్టే కదా!అంత చిన్న తర్కం మనం ఎందుకు మర్చి పోతాము?మనలో కూడా భగవత్ అంశ వుందంటే,మనలని మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలి,కాపాడుకోవాలి!
భగవంతుడు ప్రాణి కోటిలోనే కాదు,ఇంకా ఈ రకాలుగా కూడా వున్వాడు.అక్షరాలలో అ కారంగా వున్నాడు.సమాసాలలో ద్వంద్వ సమాసం లా వువ్నాడు.వాశనం లేని కాలం అతను.సర్వ కర్మలకు ఫలప్రదాత అతను.సృష్టికి మొదలు,మధ్య,కొస అతనే!వారీ
వీరి వాదాలు,వాదనలు,ప్రశ్నలు,సమాథానాలు...అన్నీ
ఆ పెద్దాయనే!
Friday, 23 August 2024
ఆయుధానా మహం వజ్రం
ఆయుధానా మహం వజ్రం ధేనూనామస్మి కామధుక్
ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః॥28-10
విభూతి యోగము
భగవంతుడు అన్నింటా వుంటాడు,అన్నిట్లో వుంటాడు అంటే మనం నమ్మము కదా!కానీ ఆయనే చెపుతున్నాడు.ప్రాణం వున్న వాటిల్లోనే కాదు,ప్రాణం లేని వాటిల్లో,ఒకప్పుడు ప్రాణం వుండి ఇప్పుడు లేని వాటిల్లో కూడా వుంటాడు.అంతేనా! మన భావాలలో,మన భావ ప్రకటనలలో,మన చర్యలలో,మన గుణగణాలలో,మన భావోద్వేగాలలో,మన సంతానోత్పత్తిలో...ఇలా అన్నింటా వుంటాడు ఆ మహామహుడు.
ఆయుధాలలో వజ్రాయుధం అతను.గోవులలో కామధేనువు అతను.ప్రజలలో సంతానోత్పత్తి కారకులలో మన్మధుడు అతను.అంటే ఆ ప్రేరణకు బీజం వేసేది అతను.సర్పాలలో వాసుకి అతను.ఈ చరాచర జగత్తులో అన్నింటా అతనే వున్నాడు.అతనే పోషిస్తున్నాడు.అతనే పాలిస్తున్నాడు.అతనే లాలిస్తున్నాడు.
ఆదిత్యానామహం విష్ణుః
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ॥21-10
విభూతి యోగము
కృష్ణుడు చెప్పుకొస్తున్నాడు తను ఏ ఏ రూపాలలో వుంటాడో.ఆదిత్యులలో విష్ణువుగా వున్నాడు.వెలుగును పంచే జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడు అతనే.మరుద్గణాలలో మరీచి అతనే.నక్షత్రాలలో చంద్రుడు అతనే.ఇవేనా?కాదు,కాదు.ఇంకా వేదాలలో సామవేదం అతనే.దేవతలలో ఇంద్రుడు అతనే.పంచేంద్రియాలలో మనసు అతనే.సమస్త ప్రాణి కోటిలోని చైతన్య స్రవంతి అతనే.అతను ఏ ఏ విభూతులలో ప్రకటిత మవుతాడో మానవ మాత్రులం లెక్క కట్ట లేము,చెప్పలేము.సర్వ వ్యాపకుడు,సర్వేశ్వరుడు అనేది అందుకే కదా!
Thursday, 22 August 2024
అహమాత్మా గుడాకేశ
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥20-10
విభూతి యోగము
కృష్ణుడు అర్జునుడికి సమాథానం ఇస్తున్నాడు.నీ అనుమానాలు అన్నీ తీరుస్తాను.అన్ని ప్రాణుల అంతరంగాలలో వుండే ఆత్మ ఎవరనుకున్నావు?నేనే!ప్రాణులను పుట్టించేది,పెంచేది,తుదకు గిట్టించేది నేనే.సృష్టి,స్థితి,లయకారకుడిని నేనే.అ నుంచి అః వరకు నేనే.నేను లేని ప్రాణి ఈ జగత్తులో లేదు.అంతా నాలోనే వుంది.నేను అంతటా వున్నాను.
పరం బ్రహ్మ పరం ధామ
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్॥12-10
విభూతి యోగము
మనమే ఒకరికి బిడ్డ,ఇంకొకరికి తోడబుట్టిన వాళ్ళం,మరొకరికి స్నేహితులం,మరింకొకరికి జీవిత భాగస్వాములం,మన బిడ్లలకు తల్లి/తండ్రి అవుతాము.మరి జగద్వ్యాపకుడు,సర్వేశ్వరుడు అయిన పరబ్రహ్మకు ఇంకెన్ని నామాలు,బంథాలు,అనుబంథాలు వుంటాయి?
అర్జునుడు అదే అడుగుతున్నాడు.
కృష్ణా!అందరు ఋషులు,నారదుడు,అసిత దేవలులు(మనువులు),వ్యాసుడు,మిగిలిన వాళ్ళందరూ నువ్వే పరమాత్మవు అని అంటున్నారు.అంతేనా!ఇంకా నువ్వు పరంథాముడవనీ,ఆదిదేవుడవనీ,శాశ్వతుడివనీ,దివ్యుడవనీ,జన్మ లేనివాడవనీ,సర్వవ్యాపివనీ,సర్వేశ్వరుడవనీ....ఇంకా చాలా,చాలా అంటున్నారు.నువ్వు కూడా అదే అంటున్నావు.
నువ్వు ఏఏ రూపాలలో భౌతికంగా వున్నావో నాకు చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు.
Saturday, 17 August 2024
తేషాం సతతయుక్తానాం
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తే॥10-10 విభూతి యోగము
భగవంతుడిని మనం నిశ్చలమయిన మనసు తో నిత్యం సేవించాలి.అలాంటి వారికే అతన్ని పొందగలిగే జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు.ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదు కదా!
వారికి మంచి చేస్తాడు.వాళ్ళ పైన తన కరుణా దృష్టిని ప్రసరిస్తాడు.అతను వాళ్ళ మస్తిష్కంలో వుండి జ్ఞాన మార్గంలో నడిచేలా చేస్తాడు.అజ్ఞానమనే చీకటిని పారదోలుతాడు.
Friday, 16 August 2024
బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః
బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమశ్శమః
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయ మేవ చ॥
4-10 విభూతి యోగము
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటాము కదా.అది అక్షరాలా నిజం.మనలో వుండే బుద్ధి,జ్ఞానం,మోహరాహిత్యం,ఓర్పు,సత్యం,శమదమాది ఇంద్రియ నిగ్రహం,ఆనందం,ఆవేదన,పుట్టడం,పుట్టక పోవడం,భయం,నిర్భయత,అహింస,సమదృష్టి,దానగుణం,తపస్సు,కీర్తి,అపకీర్తి....ఇలా మనలో వుండే ప్రతి భావానికి,మనం చేసే ప్రతి పని వెనక ప్రేరణ,మర్మం,అర్థం,పరమార్థం,అన్నీ ఆయనే.మనం నిమిత్తమాత్రులం,అంతే.
మన్మనాభవ మద్భక్తో
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః॥34-9
రాజవిద్యా రాజగుహ్య యోగము
భగవంతుడు ఇలా చేయమని చెబుతున్నాడు.మనం మన మనసులను ఆయన యందే నిలపాలి.అతని భక్తులం కావాలి.అతనినే సేవించాలి.అతనినే నమ్మాలి.అతనికే నమస్కరించాలి.అతని యందే దృష్టి నిలపాలి.
అంటే నిష్ట,నిబద్ధత,నిర్మలత్వం,నిర్మోహంతో నిరాకారుడు,నిశ్చలుడు అయిన ఆ పరబ్రహ్మను నమ్ముకుంటే,కొలిస్తే,తప్పక మనకు దక్కుతాడు.
Thursday, 15 August 2024
పత్రం పుష్పం ఫలం తోయం
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః॥28-9
రాజవిద్యా రాజగుహ్య యోగము
మన అమ్మలు బిడ్డలనుంచి ఏమి కోరుకుంటారు? ఒక చిక్కటి చిరు నవ్వు.అంతేగా!నోరంతా అమాయకంగా తెరిచి,ఎంగిలి పూస్తూ పెట్టే చిట్టి ముద్దులు.బుడి బుడి నడకలు,బుల్లి బుల్లి మాటలు! వాళ్ళకు హిమాలయాలు ఎక్కినంత ఆనందం ఇస్తాయి.
భగవంతుడు కూడా అంతే!మనల్ని కొండలు పిండి చేయమని చెప్పడు.సముద్రంలోని నీరు నంతా ఔపోసన పట్టమనడు. మనం మన శక్తి కొద్ది ఆకు ఇచ్చినా సంతోషపడతాడు.పువ్వు ఇస్తే మహదానందపడతాడు.పండు ఇస్తే ఇక ఆ ఆనందానికి హద్దులు వుండవు.నీళ్ళిచ్చినా తృప్తి పడతాడు.నిజంగా భగవంతుడు అల్ప సంతోషి.మన భక్తి,మన శ్రద్థ,మన నమ్మకం చూస్తే మురిసి పోతాడు.మన జీవితాలను బాగు పరుస్తాడు.మనం మంచి మార్గం లో నడిచేలా చేస్తాడు.
అనన్యాశ్చింతయంతో మాం
అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥22-9
రాజవిద్యా రాజగుహ్య యోగము
బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులను అంటి పెట్టుకోని వుంటారు.వాళ్ళ ప్రేమాభిమానాలు,సహాయసహకారాలు లేకుండా స్వంతంగా బతకలేరు.కాబట్టి అన్ని వేళలలో అమ్మనాన్నలను నమ్ముకుంటారు.అలా అని కూడా తెలియని అమాయకత్వం లోవుంటారు.
అలాగే సమస్త మానవాళికి తల్లి తండ్రి ఆ భగవంతుడే కదా!కాబట్టి మనమందరమూ అతనినే నమ్ముకుందాము.అతని ధ్యానం లో వుందాము.అతని సేవలోనే తరిస్తాము.మానవ సేవే మాధవసేవ కాబట్టి అందరికీ మంచి చేద్దాము.మన మంచి చెడ్డ ఆయనే చూసుకుంటాడు.బిడ్డలు అమ్మ పక్కలో ఎంత నిశ్చింతగా పడుకుంటారు!మనమూ ఆయనను నమ్ముకుంటే అంతే నిశ్చింతగా వుండవచ్చు.
Tuesday, 13 August 2024
పితాఽహమస్య జగతో
పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ॥17-9
రాజవిద్యా రాజగుహ్య యోగము
ఈ విశ్వాని కంతటికీ భగవంతుడే తల్లీ,తండ్రీ,ధాతా,త్రాతా.కర్మఫలదుడూ అతనే.తెలుసుకోదగినవాడూ అతనే.పవిత్రుడూ అతనే,ప్రణవస్వరూపుడూ అతనే.ఋగ్వేదమూ,సామవేదమూ,యజుర్వేదమూ,అధర్వణవేదమూ....అన్నీ అతనే.
ఈ సృష్టిని సమతుల్యంగా వుంచేవాడు.మనం కోరిన కోర్కెలు తీర్చేవాడు.మనం జీవితంలో ఎవరిగురించి అయినా తెలుసుకోవాలి అంటే,మొట్ట మొదట తెలుసుకోవాలసింది ఇతని గురించే.ఇతని కంటే పవిత్రుడు ఎవరూ లేరు.సృష్టికి మూలం ఇతడే.నాలుగు వేదాలనీ ఔపోసన పట్టింది ఇతనే.ఈబ్రహ్మాండానికి నాయకుడు ఇతనే.
మయా తత మిదం సర్వం
మయా తత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః॥4-9
రాజవిద్యా రాజగుహ్య యోగము
భగవంతుడు నిరాకారుడు.కానీ ఈ సృష్ఠి అంతా వ్యాపించి వున్నాడు.ఈ చరాచర జగత్తు మొత్తము అతని యందే వుంది.కానీ వాటిలో అతను వుండడు.అతనే ఈ సమస్త సృష్టిని పెంచి పోషిస్తూ వుంటాడు.కానీ ఈ ప్రాణికోటి అతనిని అంటిపెట్టుకుని వుండదు.అన్ని చోట్ల వ్యాపించే వాయువు ఆకాశంలోనే వుంటుంది.అలాగే జీవకోటి మొత్తం భగవంతుడిలోనే లీనమై వుంటుంది.
భగవంతుడంతటి వాడే,అన్నీ తన గుప్పెటలో వున్నా,తటస్ధంగా వున్నాడు.అంటీ,ముట్టనట్టు వున్నాడు.ఈతత్త్వాన్నే తామరాకు మీద నీటి బొట్టు చందం అంటాము.తామరాకు నీళ్ళలోనే వుంటుంది.కానీ నీటి బిందువులు దాని పైన పడ్డా తడవదు.మనము కూడా అలాగే ప్రాపంచిక విషయాలలో వున్నా ఆసక్తి పరమాత్మ పైనే నిలపాలి.
Monday, 12 August 2024
కవిం పురాణ మనుశాసితార
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్॥9-8 అక్షర పరబ్రహ్మ యోగము
భగవంతుడు ఇందుగల డందులేడని సందేహము వలదు అని చదువుకున్నాము కదా! అతను సర్వ్యాంతర్యామి,సర్వ వ్యాపకుడు.ఈ శ్లోకంలో కూడా అదే చెపుతున్నారు.ఆపరమాత్మ కవి,పురాణపురుషుడు,జగన్నియామకుడు,పరమాణువు కంటే చిన్న రూపం కలవాడు,అఖిల సృష్ఠికి ఆథారభూతుడు,విజ్ఞానగని,అజ్ఞానేతరుడు మరియు పరమాత్మ.
మన అంత్య కాలంలో ఈమహామహుని భక్తిభావంతో పూజిస్తే ముక్తి పొందేదానికి అర్హులం అవుతాము.
Sunday, 11 August 2024
అధిభూతం క్షరో భావః
అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతం
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర॥4-8
అక్షర పరబ్రహ్మ యోగము
భగవంతుడు ఇంకా ఇలా చెబుతున్నాడు.నాశనమయే పదార్ధాన్ని అధిభూతం అంటారు.దాంట్లో ఉత్కృష్టుడిని నేను.అధిదైవం అంటే మనం పూజించే అందరు దేవతలలోకి ఆజ్యుడు నేనే.ఈ ప్రకృతిలోని సమస్త భూతకోటిలో అంతర్లీనంగా వుండే ,అన్ని యజ్ఞాలకు మూలపురుషుడిని నేనే.
అంటే కర్త,కర్మ,క్రియ అన్నీ నేనే.మీరందరూ నా అంశలే.ఈ సృష్టి,స్ధితి,లయలకు మూలకారణం నేనే. ప్రతిదీ నాతో మొదలు అయి,నాతో ముగుస్తుంది.కాబట్టి నన్ను అర్ధం చేసుకుంటే చాలు.ముక్తి లభిస్తుంది.
అక్షరం బ్రహ్మ పరమం
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే
భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః॥3-8 అక్షర పరబ్రహ్మ యోగము
కృష్ణుడు సవివరంగా అర్జునిడికి అనుమానాలు తీరుస్తున్నాడు.బ్రహ్మము అంటే నాశనము లేనిది.అన్నిటికంటే చాలా గొప్పది.అంటే సర్వోత్కృష్టమైనది.ప్రకృతి పరంగా,ప్రకృతి కి సంబంధమయిన స్వభావాలు,గుణగణాలే అధ్యాత్మంఅంటే.భూతోత్పత్తికి అయిన ఘటనమే కర్మం అంటే.
Saturday, 10 August 2024
కిం తద్బ్రహ్న కి మధ్యయాత్మం
కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥1-8
అక్షర పరబ్రహ్మ యోగము
కృష్ణుడు చెప్పేది అర్జునుడికి ఒక్క ముక్క అర్థం కావటం లేదు.అసలే అయోమయం లోవున్నాడు.ఈయన ఏమో పెద్ద పెద్ద మాటలు చెపుతున్నాడు.అందుకే అడుగుతున్నాడు.బ్రహ్మము అంటే ఏంది?అధ్యాత్మమంటే ఏమిటి?కర్మ అంటున్నావు.అధిభూతం అంటున్నావు.అధిదైవం అంటున్నావు.నాకంతా అగమ్యగోచరంగా ఉంది.నిదానంగా వివరించు అనిఅడుగుతున్నాడు.
మనము కూడా అంతే కదా.రెండో ఎక్కం నేర్చుకునే వాళ్ళకు పదిహేడో ఎక్కం ఏం అర్ధంఅవుతుంది?.బిక్క మొహం వేస్తాము కదా!
Friday, 9 August 2024
జరా మరణ మోక్షాయ
జరా మరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలం॥29-7 విజ్ఞాన యోగము
మనిషిని ఎక్కువ భయపెట్టేది ఏంది?మరణం,ముసలితనం.ఆ భయం నుంచి బయటపడాలి అంటే ఏమి చెయ్యాలి మనం?సుఖదుఃఖాలను సమంగా తీసుకోగలగాలి.తామరాకు మీద నీటి బొట్టు చందంగా అన్ని కర్మలు చేస్తున్నా వాటి ఫలితాల పైన ఎలాంటి మోహం లేకుండా వుండగలగాలి.అధిభూతము,అధిదైవము,అధియజ్ఞములకు మూలము అయిన ఆపరమేశ్వరుని ఆశ్రయించి సేవించాలి.అప్పుడు మరణం శరీరానికే కానీ,ఆత్మకు కాదు అని తేటతెల్లమవుతుంది.అప్పుడే మనం కర్మ తత్త్వాన్నీ,పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాము.
చతుర్విధా భజంతే మాం
చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16-7 విజ్ఞాన యోగము
నాలుగు రకాల మనుష్యులు భగవంతుడిని తెలుసుకోవాలని తాపత్రయ పడతారు.నమ్ముతారు.అతనిని సేవిస్తూ తరిస్తారు.వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాము.కష్టాలలో ఉండేవాళ్ళు,ఏ దిక్కూ లేని వాళ్ళు దేవుడిని నమ్మి,సేవిస్తారు.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటాము కదా మనము.జ్ఞాన పరంగా ఆసక్తి,అన్వేషణ చేసే వర్గం.వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి శోధిస్తూ,సాధిస్తూ ఉంటారు.ఇంకా,ఇంకా తెలుసుకోవాలి అనే తపనతో రగిలి పోతుంటారు.వీళ్ళు భగవంతుడి గురించి తెలుసుకుని,సేవిస్తూ ఉంటారు.మూడో రకం మనుష్యులు ఎవరంటే సంపదలు కోరుకునే వాళ్ళు.వీళ్ళు జ్ఞాన సంపద కంటే,భౌతిక సంపదల కోసం ప్రాకులాడే వాళ్ళు.నాలుగో రకం,జ్ఞానులు. వీళ్ళు అన్నీ కూలంకషంగా తెలుసుకుని,పరిశోధించి,ఆ తరువాత మనసా వాచా నమ్మి భగవంతుడిని సేవలో ధన్యం అవుతారు.భగవంతుడికి కూడా వీళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం.
Thursday, 8 August 2024
న మాం దుష్కృతినో మూఢాః
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః
మాయ యాఽపహృతజ్ఞానాః ఆసురం భావ మాశ్రితాః॥15-7 విజ్ఞాన యోగము
ఈ విశ్వం అంతా సత్త్వ,రజస్తమో గుణాల చేత నిండా మునిగివుంది.కాబట్టి ఎవరూ భగవంతుడిని తెలుసుకోలేక పోతున్నారు.రాక్షస భావాలు కలిగిన వాళ్ళు,కుయుక్తి కలిగిన మేథావులు,మూర్ఖులు,బుద్ధి,జ్ఞానం లేని వాళ్ళు,నీచమయిన ప్రవృత్తి కలిగిన వాళ్ళు...వీరెవరూ తల క్రిందులుగా తపస్సు చేసినా ముక్తిని పొందలేరు.అసలు వాళ్ళు ప్రయత్నించరు కూడా.
అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్
అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం
జీవ భూతాం మహాబాహో య యేదమ్ ధార్యతే జగత్//5-7 విజ్ఞాన యోగము
భగవంతుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అపరా అనే ఈ ప్రకృతి హేయమయినది.అంటే తక్కువ,నీచము అని అర్థం వస్తుంది.ఎందుకంటే ఇది మాయా మొహాలతో నిండి వుంది.ఇక్కడ కోరికలకు అంతం ఉండదు.కోపాలకు అంతం ఉండదు.జీవరూపమయిన ఈ విశ్వాన్ని అంతా భరించేది భగవంతుడి పరా ప్రకృతి.ఈ ప్రకృతి చాలా ఉత్కృష్టమయినది.చాలా గొప్పది.మానవుడు ముందర ఈ విషయాన్ని తెలుసుకోవాలి.మనలని భరించేవాడు ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు.అతడే మనకు తల్లి,తండ్రి,గురువు,దైవము.అతన్ని నమ్ముకుంటే,అతన్ని ఆశ్రయిస్తే,అతన్ని ధ్యానిస్తే ముక్తికి సోపానం వేసిన వాళ్ళము అవుతాము.
మనుష్యాణాం సహస్రేషు
మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే
యతతా మపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వతః॥3-7 విజ్ఞాన యోగము
ఒక పోటీ జరుగుతుంది అనుకుందాము.పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మొదట రారు కదా!వెనక పడేదానికి సవా లక్ష కారణాలు వుంటాయి.సత్తా వున్నా ఆ క్షణం బుర్ర,శరీరం పని చెయ్యవు.కొంత మందికి పరిస్థితులు కలసిరావు.
అలాగే మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళలో కూడా అందరూ కూడా సాథించలేరు.వెయ్యి మందిలో ఒక్కరే మోక్షం కోసరము ప్రయత్నిస్తున్నాడు.అటువంటి వేయి మంది యతులలో ఏదో ఒకరే భగవంతుడిని తెలుసుకోగలుగుతున్నారు.కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి.
Tuesday, 6 August 2024
చంచలం హి మనః కృష్ణ
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్థృఢమ్
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్॥34-6 ఆత్మ సంయమ యోగము
మనకు అందరికీ వచ్చే అనుమానమే అర్జునిడికీ వచ్చింది.కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!ఈ జీవ కోటితో వుండే ఈ ప్రపంచంలో గాలిని మనం నియంత్రించలేము కదా!అలాగే నిత్యం చలించేది,అతి బలవత్తరనైనదీ అయిన మన మనస్సుని నియంత్రిచడం సాథ్యం కాని పని కదా!
మరి అలాంటప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఎలా వీలు అవుతాయి?
దానికి కృష్ణుడు ఇలా సమాథానం చెబుతున్నాడు.నిజమే.కానీ మనిషి తలచుకుంటే సాథించలేనిది ఏమీ వుండదు కదా!ఇవన్నీ అభ్యాసం తోటి సాధించవచ్చు.ఇంద్రియాలను అదుపులో వుంచుకుంటూ,వైాగ్యం అభ్యసిస్తే మనసు పైన పట్టు తెచ్చుకోవచ్చు.
సర్వ భూతస్థ మాత్మానం
సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతాని చాత్మని
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః॥29-6 ఆత్మ సంయమ యోగము
యోగయుక్తుడైన వాడు అన్ని ప్రాణులను సమంగా చూడటం నేక్చుకుంటాడు.ప్రతి ప్రాణిలోను తనను,తనలో అన్ని ప్రాణులను చూసుకుంటాడు.అన్ని ప్రాణులలో భగవంతుడినీ,భగవంతుడిలోనే అన్ని ప్రాణులనూ చూస్తాడు.అంటే ప్రకృతి లో మమేకమై పోతాడు.తను వేరే అనుకోడు.సమస్త ప్రాణికోటిలో తను ఒకడు తప్ప,ఇంకే ఇతర ప్రత్యేకతలు తనకు లేవని తెలుసుకుంటాడు.
నాత్యశ్న తస్తు యోగోఽస్తి
నాత్యశ్న తస్తు యోగోఽస్తి నా చై కాంత మనశ్నతః
నా చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున//16-6 ఆత్మ సంయమ యోగము
మనకు ఇంకా చాలా మెళకువలు చెప్పారు.ఏ విషయం లోనూ అతి పనికి రాదు.అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అంటారు కదా తరచూ.మనం వాళ్ళ మాటలు పెడ చెవిన పెట్టకూడదు.ఉదాహరణకు తిండి గురించి మాట్లాడుకుందాము.కొంత మంది ఆబగా ఎంత పడితే అంత,ఏది పడితే అది తింటూనే ఉంటారు.అడ్డు ఆపు వుండనే ఉండవు.ఇంకో వర్గం ఉంటుంది.వీళ్ళు అవసరానికి కూడా తినరు.ఎప్పుడూ కడుపు మాడ్చుకుంటూ ఉంటారు.శలభాల లాగా ఉంటారు ఎండుకొనిపోయి.రెండూ మంచిది కాదు.మితాహారమే ముద్దు.అలాగే కుంభకర్ణుడి సోదర సోదరీమణులు ఉంటారు.వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మనకు భోజనాల సమయం అయిపోయి ఉంటుంది.తొందరగా లేయమంటే మాకు తెలుసులే,ఏమీ పని లేదు కాబట్టే పండుకుంటున్నాము అంటారు.అర్థ రాత్రి ,అపరాత్రి దాక పండుకోరు.ఒక నియమము,నిబద్ధత ఉండవు.ఇంకొకళ్ళు నిద్ర భద్ర లేకుండా జాగారాలు చేస్తుంటారు.సమయానికి నిద్ర పోవటం కూడా శరీరానికి కావాలి.దేని లోను అతి లేకుండా మన శరీరానికి అన్నీ మంచిగా అలవాటు చెయ్యాలి.మనం చేసేపనులు కూడా ఆలోచించుకుని,మంచి అవగాహనతో పూర్తి చెయ్యాలి.మరీ నత్త నడకన చేయకూడదు,అలాగని తొందర తొందరగా చేశామంటే చేశాము అని పూర్తి చేయకూడదు.ఇలా ప్రతి విషయం లోనూ నియంత్రణ,అవగాహన ఉన్న వాళ్ళకే యోగం సిద్ధిస్తుంది.ఈ యోగం అనేది అన్ని రకాల దుఃఖాలకు మందు లాగ పని చేస్తుంది.అంటే కష్టాలనుంచి కాపాడుతుంది.
Monday, 5 August 2024
ప్రశాంతాత్మా విగతభీః
ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14-6 ఆత్మ సంయమ యోగము
యోగాభ్యాసం ఎలా చెయ్యాలి?ఎవరికైనా తెలుసా?కృష్ణుడు చెబుతున్నాడు.నేర్చుకుందాము.మొట్ట మొదటగా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి.భయాందోళనకు గురి కాగూడదు.ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు.బ్రహ్మచారి అంటే ఏక భుక్తం,భూశయనం చెయ్యాలి అని.ఇలా ఎందుకు అన్నారో గమనిద్దాము.ముప్పూటలా తింటుంటే ఏమవుతుంది?గురక పెట్టి నిద్ర వస్తుంది.భుక్తాయాసం వస్తుంది.కూర్చుంటే లేవలేము,పడుకుంటే లేచి కూర్చోలేము.అదే రోజుకి ఒక్క పూట తింటే,కడుపు కర కర లాడుతుంటుంది,చలాకీ గా ఉంటాము.పట్టు పరుపుల పైన పడుకుంటే ఏమవుతుంది?సుఖపడాలి అనిపిస్తుంది.ఏమేమో కోరికలు చుట్టుముడతాయి.మనపై మనకు నియంత్రణ తప్పుతుంది.నేలపైన పండుకుంటే చలి,వేడి తగులుతుంటుంది ఒంటికి.ఒంటి కింద నేల గట్టిగా తగులుతుంటుంది.ఒళ్ళు నిజంగా కష్టపడితే గానీ నిద్ర రాదు.కాబట్టి మనం బ్రహ్మచర్యం పాటించాలి.మనసుని,ఇంద్రియాలను కట్టడి చేసి,భగవంతుడి మీద దృష్టి నిలిపి యోగాభ్యాసం చేస్తే అది ఫలిస్తుంది.ఊరికినే ముక్కు మూసుకుని,కళ్ళు మూసుకుని నేను యోగాభ్యాసం చేస్తున్నాను అని జబ్బలు చరుచుకోకూడదు.మొదట ఇంద్రియ నిగ్రహణ కావాలి.
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః॥8-6 ఆత్మ సంయమ యోగము
యోగి అంటే ఎవడు?ఈ లోకం లో వుండే ప్రతిదాన్నీ సమానంగా చూసేవాడు.అంటే మనుష్యులా,జంతువులా,చెట్లు పుట్టలా అనే కాదు.ఈ గాలి,ఈ నీరు,ఆ కొండలు,కోనలు,వాగులు,వంకలూ అన్నీను.ఈ సృష్టి లో ప్రతిదీ అద్భుతమే.ప్రాణం ఉన్నజీవులు అయినా,ప్రాణం లేని వస్తు వాహనాలు అయినా,పంచభూతాలు అయినా అన్నీ ఒకటే.అన్నిటినీ మనం సమానంగా చూడటం నేర్చుకోవాలి,మన వాళ్ళకు అర్థం అయ్యేలా నేర్పాలి.అలా చూడగలిగినప్పుడే మనలో కోపం తాపం పోతాయి.సహనం పెరుగుతుంది.అవగాహన పెరుగుతుంది.ఎందుకంటే మన అనుకుంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాము,పరాయి అనుకుంటే ఇంకో రకంగా ఆలోచిస్తాము.అర్థం చేసుకోవడం లో చాలా తేడా ఉంటుంది.
అందుకనే శత్రువులు అయినా,మిత్రులు అయినా,తటస్థంగా ఉండే వాళ్ళు అయినా,నిరాసక్తంగా ఉండేవాళ్ళు అయినా,మంచి మనసు ఉండేవాళ్ళు అయినా,కోపిష్టులు అయినా,బంధువులు అయినా,పరాయి వాళ్ళు అయినా,సాధువులు అయినా,దుర్మార్గులు అయినా...అందరినీ ఒకే రకంగా సమ దృష్టితో చూడాలి.ఇది సాధించాలి అంటే మనకు నిగ్రహం ఉండాలి.అది అభ్యాసం తో వస్తుంది.అంతఃకరణ శుద్ధి తో వస్తుంది.ఈ రోజు అనుకున్నాము అంటే రేపు పొద్దుటికే రాదు.నిరంతర కృషి ఉండాలి.ఇలా సమ బుద్థి కల వాళ్లను యోగిశ్రేష్ఠులు అంటారు.ఈ రోజు నుంచి మొదలెడదామా,ఆ మంచి మార్గం లో పయనించేదానికి?
ఉద్థరే దాత్మనాఽఽత్మానం
ఉద్థరే దాత్మనాఽఽత్మానం నాత్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః॥5-6 ఆత్మ సంయమ యోగము
మనల్ని ఎవరో ఉద్ధరిస్తారు అనుకోవటం పొరపాటు.ఎప్పుడూ మనలను మనమే ఉద్ధరించుకోవాలి.ఎందుకంటే మనలో మనకే ఆ సంకల్పం లేకపోతే ఎవరు ఎన్ని విధాల మనకు చేయూత నివ్వాలన్నా మనము గ్రహించము.అంటే మన మట్టి బుర్ర లోకి ఎక్కదు.మనకే తెలియాలి,ఎక్కడో మనం పప్పులో కాలేస్తున్నాము అనే విషయము.ఈ ఊబిలో నుంచి ఎట్లా బయట పడాలి అనే ఆరాటం రావాలి.ఆ మొదటి చైతన్యం మనలో పుట్టుకొస్తే,వంద మంది మనకు సహాయం చేసేవాళ్లు దొరుకుతారు.మనం ఎప్పుడూ అథోగతి పాలు కాకూడదు.అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని పెద్దలు అంటారు కదా.అందుకని తప్పు మార్గం లోకి అసలు వెళ్ళ కూడదు.వెళ్ళి ,వెనక్కి రావాలంటే ఒక్కోసారి జీవిత కాలం కూడా సరిపోదు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి.ఆత్మకు ఆత్మయే మిత్రువు,ఆత్మయే శత్రువు కూడా.ఆ విషయం తెలుసుకుని,జాగ్రత్తగా నడుచుకోవాలి.ఎందుకంటే నిగ్రహం ఉండేవాళ్ళకు ఆత్మ బంధువు లాగా ఉంటుంది.అదే నిగ్రహం లేని వాళ్ళకు శత్రువుగా మారుతుంది.
Saturday, 3 August 2024
అనాశ్రితః కర్మ ఫలం
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
స సన్న్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చా క్రియః//1-6 ఆత్మ సంయమ యోగము
మనం చేసే ప్రతి పని పైన మోహం మానుకోవాలి.ఈ పని చేయడం మన విధి,కాబట్టి చేస్తున్నాము,అంతే అనుకోవాలి.ప్రతిఫలం పైన ఆశతో చేయకూడదు.అలాంటి వాళ్ళనే యోగులు అంటారు.చాలా మంది సన్న్యసించడం అంటే అన్నీ మానేయడం అనుకుంటారు.కానీ అది కానే కాదు.మనం పనులు మానేసినంత మాత్రాన సన్యాసులం కాము.అది ఒట్టి భ్రమ.మనసులో అది చెయ్యాలి,ఇది చెయ్యాలి,ఏదో సాధించాలి,ఇంకేదో తుదముట్టించాలి,ఇలాంటి ఆలోచనలనుంచి బయట పడటమే యోగము.ఈ క్రమం లో మన విధులను పరిపూర్ణంగా నిర్వర్తించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం శ్చక్షుశ్చైవాంతరే భ్రువోః
ప్రాణా పానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ॥27-5 కర్మ సన్న్యాస యోగము
కోప తాపాలను నియంత్రించుకోవటానికి ధ్యానము,యోగము చాలా ఉపయోగపడతాయి.అది ఎలా చెయ్యాలో,అభ్యశించాలో కూడా ఇక్కడ మనకు చెప్పారు.రోజువారీ ప్రాపంచిక విషయాలను కొద్ది సేపు పక్కన పెట్టాలి.దృష్టిని,అంటే మన చూపును భ్రూమధ్యమం,అంటేరెండు కళ్ళు,అనగా భృకుటి మధ్యలో కేంద్రీకరించాలి.మనం మన నాసిక,అంటే ముక్కుతో గాలి పీలుస్తాము కదా.ఆ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలను ఎక్కువ తక్కువ లేకుండా సమంగా ఉండేలా చూసుకోవాలి.అంటే గాలి పీల్చడం,అదే రకంగా గాలిని వదలడం ఒకే రకంగా వుండేలా చూసుకోవాలి.మనసు,బుద్ధిని మన నియంత్రణ లోకి తెచ్చుకోవాలి.పనిలో పనిగాకోపం,తాపం,భయం,కోరికలు,అసహనం,అసంతృప్తిలాంటి వాటిని విడిచి పెట్టేదానికి మన వంతు కృషి మనం చెయ్యాలి.మనసుని,బుద్ధిని నియంత్రించడానికి డానికి ఈ ధ్యానం,యోగం చాలా చాలా పనికి వస్తాయి.
Friday, 2 August 2024
కామక్రోధ వియుక్తానాం
కామ క్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్//26-5 కర్మసన్న్యాస యోగము
కామం అంటే అంతులేని కోరికల పుట్టలు.క్రోధంఅంటే నిగ్రహించుకోలేని కోపతాపాలు.వీటి రెండింటినీ మనం ఎంత త్వరగా విదిలించుకుంటే ఒంటికి,మనసుకు అంత మంచిది.అలా మనం చేయగలిగితే మనకు ఆత్మజ్ఞానం చేకూరినట్లే.యోగులము,సన్యాసులము అయినట్లే మానసికంగా.అప్పుడు సర్వావస్థ,సర్వకాలాల యందు,మన చుట్టూరా బ్రహ్మానందమే పొందగలుగుతాము.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః//18-5 కర్మసన్న్యాస యోగము
మనము ఈ సృష్టిని అంతా ఒకే రకంగా చూడటం నేర్చుకోవాలి.ఇక్కడ ఏదీ ఎక్కువ కాదు,ఏదీ తక్కువ కాదు.అంతా మన దృష్టి లోపమే.ప్రాణం ఉన్నవి అయినా,లేనివి అయినా ఒకటే.విద్య,వినయము గల వాళ్ళు,చదువురాని,చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు,గోవు,కుక్క,ఏనుగు,చెట్టు,పుట్ట,వాగులు,వంకలు,కొండలు,కోనలు,అన్నిటినీ సమంగా చూడటం నేర్చుకోవాలి.ఇలా సర్వ ప్రాణికోటిని సమంగా చూడగలిగే వాడినే పండితుడు అంటారు.
జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి
జ్ఞేయస్స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే//3-5 కర్మసన్న్యాస యోగము
నిజమైన సన్న్యాసి ఎవరు అనుకుంటున్నారు?కోపం,తాపం లేని వాడు.అసూయ,అసంతృప్తి లేని వాడు.అహంకారం,అదే అంతా నేనే,నేనే గొప్ప మిగిలిన వారందరికంటే అనే భావము మన పతనానికి తొలి మెట్టు.ఈ మెట్టు ఎక్కామంటే ,జారుడు మెట్లపైన కాలు పెట్టినట్లే.పాచి పట్టిన మెట్టు పైన కాలు పెడితే ఏమౌతుంది?మధ్యలో ఆగాలన్నా ఆగలేము.జారుడు బండ పైనుంచి జారినట్లు ఏకంగా నేలపైన కుదేలు అవుతాము.ఈ అహంకారము కూడా మన వినాశనానికి నాందీప్రస్థావన అవుతుంది.హామ్లెట్ లో టు బి ఆర్ నాట్ టు బి థట్ ఈస్ ది క్వశ్చన్ అనే ప్రముఖమయిన వాక్యం ఉంటుంది.మనం ప్రతి క్షణం అలా డోలాయమానం లో ఉండకూడదు.మనకు ఏమి కావాలి,మనం ఏమి చేస్తున్నాము,మనం ఎలా చెయ్యాలి అనే నిర్దిష్టమయిన ప్రణాళిక ఉండాలి.గాలివాటం లాగా ఏ క్షణానికి ఎలా అనిపిస్తే అలా చేయకూడదు.మనకు అంటూ ఒక గమ్యం ఉండాలి.దానిని ఎలా చేరుకోవాలి అనే ప్రణాళిక ఉండాలి.ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయగలిగే నైపుణ్యం,నిబద్ధత ఉండాలి.
కాబట్టి రాగధ్వేషాలు ,ద్వంద్వభావన లేని వాళ్ళు మాత్రమే ఈ కర్మ బంధాల నుంచి సులువుగా బయట పడతారు.
Thursday, 1 August 2024
అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి
అజ్ఞశ్చా శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః//40-4 జ్ఞానయోగము
మనము కర్మేంద్రియాలను జయించి శ్రద్ధ,సహనాలతో సాధన చేస్తే జ్ఞానాన్ని పొందుతాము.అదే శ్రద్ధ,జ్ఞానం లేని వాడి పరిస్థితి ఏంది?నిత్యం అపనమ్మకం,సందేహాలతో మగ్గి పోయేవాడి దుస్థితి ఏంది?జీవితంలో ఏదీ నమ్మని వాడి గతి అగమ్యగోచరమే.ఇలాంటి మనస్తత్వం వున్నవాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు.ఇహానికీపరానికీ...రెంటికీ చెడ్డ రేవడి అవుతారు.అలాంటివాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.తమని తాము ఉద్ధరించుకోలేని వాళ్ళు ఎదుటివాళ్ళను ఏమీ ఉద్ధరిస్తారు?ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు?కాబట్టి మనమందరమూ ఈ గాడిలో పడకుండా,మెలకువగా మనలని మనము ఉద్ధరించుకోవాలి.మంచి దారిలో నడవాలి.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిహ్
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా//24-4. జ్ఞానయోగము
ఈ లోకం లో ప్రతిదీ బ్రహ్మమయం.అంటే ప్రకృతి కి సంబంధించిందే.మనం దానిని మనసా వాచా కర్మణా నమ్మాలి.ఎందుకంటే మనం యజ్ఞాలలో యజ్ఞగుండం లో నెయ్యి వేసేదానికి వాడే గరిటెలలో బ్రహ్మం ఉంటుంది.హోమానికి వాడే వస్తువులు,ద్రవ్యాలు బ్రహ్మ.మనం వెలిగించే అగ్ని బ్రహ్మ.యజ్ఞం లో ఆహుతి ఇచ్చేవాడు బ్రహ్మ.ఆహుతి స్వీకరించేవాడు బ్రహ్మ.అంటే ఈ జగత్తు అంతా బ్రహ్మమయం.అంతా నేనే అనుకునే అహం నుంచి బయటపడాలి.మనం నిమిత్త మాత్రులము అనే స్పృహలో ఉండాలి.అలా అనుకునేవాడు ఆ బ్రహ్మాన్ని పొందుతాడు.అంటే కైంకర్యం అవుతాడుబ్రహ్మత్వం లో.
యదృచ్ఛా లాభ సంతుష్టో
యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమ సిద్ధావ సిద్థౌచ కృత్వాపి నా నిబధ్యతే//22-4 జ్ఞాన యోగము
మనిషికి తృప్తి అనేది ఉండాలి.జీవితాంతం ఏదో కావాలి,ఇంకేదో కావాలి అంటూ పరుగులు తీస్తూ ఉండకూడదు ఎండమావుల వెనక.మనకు దక్కిన దానితో తృప్తి చెందడం నేర్చుకోవాలి.ఎంత సేపూ వాళ్ళకు అది వుందే,మనకు లేదే?మనం ఎదుటి వాళ్ళ కంటే ఒక మెట్టు ఎక్కువుగా లేము అని ఎప్పుడూదిగులు పడకూడదు.మన పరిస్థితి ఏంది,మన సత్తా ఏంది అనే అవగాహనతో మన ప్రయత్న లోపం లేకుండా ముందుకు పోవాలి.ఎంత సేపూ అనుమానిస్తూ వుండకూడదు.మనల్ని మనం అనుమానించడం మానుకోవాలి,ఎదుటి వాళ్ళను అనుమానించడం మొదలుపెట్టకూడదు.మన పైన మనకు నమ్మకం ఉండాలి.ఎదుటివాళ్ళ పైన భరోసా ఉండాలి.కోపతాపాలకు ఆస్కారం ఇవ్వకూడదు.ఎందుకంటే మనం కోపతాపాలకు బానిస అయ్యాము అంటే ఇవి మన జీవితాలతో చెడుగుడు ఆడుకుంటాయి.దేనికీ పనికి రాకుండా చేస్తాయి.ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని అనుకరిస్తూ,అనుసరిస్తూ ముందుకు పోతుండాలి.ఆ పని జరిగినా,జరగకపోయినా కలత చెందకూడదు.రెండిటినీ సమంగా తీసుకోవాలి.మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏందంటే మన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నలోపము ఉండకూడదు,అంతే.మన మనస్సు ఏ చట్రం లోనూ ఇరుక్కోకూడదు.తామరాకు పైన నీటి బిందువు లాగా మనం నిర్వికారంగా,అన్నిటినీ సమానంగా తీసుకోవాలి.అప్పుడు మనం ఎలాంటి భవబంధాలలో ఇరుక్కోకుండా వుంటాము.
కాబట్టి ఇలా ఉండే దానికి ప్రయతించాలి మనమందరము.
Subscribe to:
Posts (Atom)