Tuesday 27 August 2024

ద్యూతం ఛలయతామస్మి

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహం॥ తన గురించి ఇంకా ఇలా చెపుతున్నాడు కృష్ణుడు.పంచకాలు,అంటే చెడ్డ పనులలో జూదంని నేను.తేజోవంతులలోని తేజాన్ని నేను.విజయం పొందే వాళ్ళలోని విజయాన్ని నేను.కృషి చేసే వాళ్ళ ప్రయత్నబలాన్ని నేను.సాత్త్వికులలోని సత్త్వగుణాన్ని నేను. అంటే మంచి చెయ్యాలన్నా,చెడు చెయ్యాలన్నా దాని వెనుక వుండే ప్రేరణ అతనే.చెడు లో కూడా వున్నాను,మంచిలో కూడా వున్నాను అంటే ఆయన దృష్టిలో రెండూ సమానమే.అందుకనే మంచి అనగానే నెత్తిన పెట్టుకోడు,చెడు అనగానే తుద ముట్టించడు.నిదానంగా గమనిస్తాడు.మనకు తగిన సమయం ఇస్తాడు మారేదానికి చెడు మార్గం నుంచి మంచిగా మారేదానికి,మంచి తనాన్ని కొస వరకు నిలబెట్టుకునేదానికి.ఆయన పెట్టే ఈ పరీక్ష లో మనం నెగ్గేదానికి ప్రయత్నించాలి.ఏదైనా వూరికేరాదు కదా!అమృతం కోసం దేవతలే ఎంత కష్ట పడ్డారు?సాగర మథనం చేసారు కదా!అప్పుడు కూడా మొదట్లోనే వచ్చేయలేదు కదా!ఒకటొకటి వచ్చి,హాలాహలం కూడా వచ్చింది కదా!దానితో నిరాశ పడకుండా,ఇంకా చిలికారు కాబట్టి ఆఖరున అమృతం వచ్చింది. మనం కూడా అంతే.ఆరంభ సూరత్వం కాకుండా,కష్టాలు వచ్చినా,నష్టాలు వచ్చినా,అలుపెరగకుండా దైవ చింతన,భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని,మన కర్మలని మనం నిష్కల్మషంగా,నిర్వికారంగా చేసుకుంటూ ముందుకు పోవాలి.

1 comment: