Tuesday 6 August 2024

నాత్యశ్న తస్తు యోగోఽస్తి

నాత్యశ్న తస్తు యోగోఽస్తి నా చై కాంత మనశ్నతః నా చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున//16-6 ఆత్మ సంయమ యోగము మనకు ఇంకా చాలా మెళకువలు చెప్పారు.ఏ విషయం లోనూ అతి పనికి రాదు.అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అంటారు కదా తరచూ.మనం వాళ్ళ మాటలు పెడ చెవిన పెట్టకూడదు.ఉదాహరణకు తిండి గురించి మాట్లాడుకుందాము.కొంత మంది ఆబగా ఎంత పడితే అంత,ఏది పడితే అది తింటూనే ఉంటారు.అడ్డు ఆపు వుండనే ఉండవు.ఇంకో వర్గం ఉంటుంది.వీళ్ళు అవసరానికి కూడా తినరు.ఎప్పుడూ కడుపు మాడ్చుకుంటూ ఉంటారు.శలభాల లాగా ఉంటారు ఎండుకొనిపోయి.రెండూ మంచిది కాదు.మితాహారమే ముద్దు.అలాగే కుంభకర్ణుడి సోదర సోదరీమణులు ఉంటారు.వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మనకు భోజనాల సమయం అయిపోయి ఉంటుంది.తొందరగా లేయమంటే మాకు తెలుసులే,ఏమీ పని లేదు కాబట్టే పండుకుంటున్నాము అంటారు.అర్థ రాత్రి ,అపరాత్రి దాక పండుకోరు.ఒక నియమము,నిబద్ధత ఉండవు.ఇంకొకళ్ళు నిద్ర భద్ర లేకుండా జాగారాలు చేస్తుంటారు.సమయానికి నిద్ర పోవటం కూడా శరీరానికి కావాలి.దేని లోను అతి లేకుండా మన శరీరానికి అన్నీ మంచిగా అలవాటు చెయ్యాలి.మనం చేసేపనులు కూడా ఆలోచించుకుని,మంచి అవగాహనతో పూర్తి చెయ్యాలి.మరీ నత్త నడకన చేయకూడదు,అలాగని తొందర తొందరగా చేశామంటే చేశాము అని పూర్తి చేయకూడదు.ఇలా ప్రతి విషయం లోనూ నియంత్రణ,అవగాహన ఉన్న వాళ్ళకే యోగం సిద్ధిస్తుంది.ఈ యోగం అనేది అన్ని రకాల దుఃఖాలకు మందు లాగ పని చేస్తుంది.అంటే కష్టాలనుంచి కాపాడుతుంది.

No comments:

Post a Comment