Thursday 31 October 2024
యస్మాన్నోద్విజతే లోకో
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః।
హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః॥15॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి తన మనసులో మాట చెపుతున్నాడు.అర్జునా!నాకు అందరి కంటే ఎవరు ఇష్టమో తెలుసా?అతను లోకంలోని ప్రాణికోటిని భయభ్రాంతులకు గురి చేయకూడదు.అట్లా అని తాను కూడా లోకానికి భయపడకూడదు.సుఖదుఃఖాలకు,ఆనందం,ద్వేషం,అసూయలకు అతీతంగా ఉండాలి.భయాందోళనలకు దూరంగా ఉండాలి.చిత్తచాంచల్యానికి ఆమడ దూరంలో ఉండాలి.ఇలాంటి మోహ,తామస గుణరహితుడు నా మనసుకు దగ్గర అవుతాడు.
Wednesday 30 October 2024
అద్వేష్టా సర్వభూతానాం
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ।
నిర్మమో నిరహంకారః సమ దుఃఖసుఖః క్షమీ॥13॥
సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా ధృడనిశ్చయః।
మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః॥14॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!సర్వభూతాలయందు కోపం,ద్వేషం లేకుండా వుండాలి.సాటి ప్రాణి మీద మైత్రినీ,దయను పాటిస్తూ ఉండాలి.మన శరీరం మీద,మన ఇంద్రియాల మీద మమకారం లేకుండా ఉండాలి.సుఖానికీ,దుఃఖానికీ అతీతంగా ఉండగలగాలి.ఓర్పు,సహనమూ ఉండాలి.సర్వకాల సర్వావస్ధలయందు సంతోషంగా ఉండాలి.సదా నిర్మల మయిన మనసుతో ఉండగలగాలి.సంకల్పబలంతో,ధృడనిశ్చయంతో మనసునీ,బుద్ధినీ నాయందు కేంద్రీకరించాలి.ఈ సుగుణాలు అన్నీ ఉండే భక్తుడు నాకు ప్రియమయిన వాడు.
Tuesday 29 October 2024
శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్
శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే।
ధ్యానాత్కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరమ్॥12॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు చెపుతున్నాడు.అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది.జ్ఞానం కంటే ధ్యానం గొప్పది.జ్ఞానం,ధ్యానం కంటే కర్మఫలత్యాగం శ్రేష్టమయినది.మనది అనుకున్నది ఏదీ మనము సహజంగా ఒదులుకునే దానికి ఒప్పుకోము.ఆ భావనకే వణికి పోతాము.అలాంటిది మనం కష్టపడి సాథించుకున్నది వేరే వాళ్ళకు ధారాదత్తం చేయటం సామాన్యమయిన విషయం కాదు.ఆ త్యాగ బుద్ధిని అలవరుచుకుంటే మనలని మించిన వాళ్ళు ఉండరు.ఈ త్యాగం వలన మనసుకు శాంతి చేకూరుతుంది.చివరకు ముక్తికి సోపానం అవుతుంది.
Monday 28 October 2024
అథైతదప్యశక్తోఽసి
అధైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః।
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్॥11॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు ఎంత భక్త సులభుడో ఇక్కడ అర్థం అవుతుంది.అర్జునుడితో అంటున్నాడు.అర్జునా! నిశ్చల భక్తితో మనసు లగ్నం చెయ్యలేవు.అభ్యాస యోగంతో నన్ను పొందలేవు.దైవీ కర్మలను చెయ్యలేవు.అలాంటప్పుడు మనో నిగ్రహంతో నన్ను శరణు పొందు.నీవు చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నాకే అర్పించు.నాశరణు జొచ్చిన వాళ్ళను నేను వదులుకోను.
Sunday 27 October 2024
అభ్యాసేఽప్య సమర్థోఽసి
అభ్యాసేఽప్య సమర్థోఽసి మత్కర్మ పరమోభవ।
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి॥10॥
శ్రీమద్భగవద్గీత.... ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇంకో కిటుకు కూడా చెపుతున్నాడు.అర్జునా!నీకు ఒకవేళ నిశ్చలభక్తితో మనసును లగ్నం చేయటం చేతకాలేదు.దిగులు పడవద్దు.అభ్యాసయోగంతో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి.అదీ చేతకాలేదు అనుకో అప్పుడు ఇంకో మార్గం కూడా చెపుతాను.నాకు సంబంధమయిన దైవకార్యక్రమాలు చెయ్యి.శ్రద్ధగా చెయ్యాలి సుమా!అలా శ్రద్ధ పెట్టి నాకు సంబంథించిన కార్యక్రమాలు చేస్తే ఖచ్ఛితంగా సిద్ధి పొందుతావు.
Friday 25 October 2024
అథ చిత్తం సమాధాతుం
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం।
అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ॥9॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇంకో మార్గం కూడా చెపుతున్నాడు.అర్జునా!నిశ్చలమయిన భక్తి వుండాలి.ఆ నిశ్చలమయిన భక్తితో మనస్సును లగ్నం చెయ్యాలి.ఇది అంత సులభం కాదు.అలాంటప్పుడు ఏమి చెయ్యాలో చెపుతా విను.అభ్యాసం అనేది చాలా కీలకమైనది.అభ్యాస యోగంతో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి.సఫలీకృతుడవు అవుతావు.ఏది అయినా మనం అభ్యాసంతో సాథించవచ్చు.
Thursday 24 October 2024
మయ్యేవ మన ఆధత్స్వ
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ।
నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయః॥8॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తియోగము
కృష్ణుడు అర్జునుడికి అర్థం అయ్యేలాగా సరళంగా చెపుతున్నాడు.అర్జునా!నువ్వు నా యందు మనసును లగ్నం చెయ్యి.అలాగే పనిలో పనిగా బుద్థిని కూడా నా మీదే ఉండేలా చూసుకో.ఇప్పుడు ఇంక నన్ను ధ్యానించటం మొదలు పెట్టు.అప్పుడు ఇక ఎల్లప్పుడూ నా యందే ఉంటావు.దానిలో ఇంక ఎలాంటి అనుమానాలు,సంశయాలు లేనే లేవు.
Tuesday 22 October 2024
యేతు సర్వాణి కర్మాణి
యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే॥6॥
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్।
భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసామ్॥7॥
శ్రీ మద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు చెబుతున్నాడు.పార్థా!అందరూ వాళ్ళు చేసే ప్రతిపని యొక్క ఫలాలను నాకు అర్పించాలి,అందించాలి.నన్నే పరమావధిగా నిర్ణయించుకోవాలి.నన్ను ఏకాగ్రచిత్తంతో ధ్యానించాలి.ఈసంసారమనే సముద్రం మృత్యురూపమయినది.కాబట్టి ఈ సంసారమనే సాగరాన్ని సులభంగా దాటుకుని,తరించేటట్లు చేస్తాను.నేను శాశ్వతంగా ఉండేవాడిని.నాకు జరామరణాలు లేవు.అట్లాంటి నన్ను పొందేలా చేస్తాను.
Sunday 20 October 2024
సంనియమేంద్రియగ్రామం
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః।
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః॥4॥
క్లేశోఽధిరతరస్తేషాం అవ్యాక్తాసక్త చేతసాం।
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి రవాప్యతే॥5॥
శ్రీమద్భగవద్గీత....ద్వాదశాధ్యాయము
భక్తియోగము
కృష్ణుడు అదే చెప్తున్నాడు.విగ్రహారధన అయినా,లేక నిరాకార బ్రహ్మను పూజించినా ఫలితమొక్కటే.సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమయినది.అంటే నిర్గుణోపాసన యొక్క సాథన సామాన్యం కాదు.చాలా కష్టమయినది.దాని ఉపాసన చాలా కఠినమయినది.అవ్యక్తమయిన ఆ నిర్గుణ బ్రహ్మ మామూలు మనుష్యులకు వల్లకాదు.అంటే దేహంపైన మోహం వుండేవాళ్ళు నిరాకారమయిన బ్రహ్మతత్త్వాన్ని అర్థం చేసుకోలేరు.కాబట్టి అది దక్కటం కష్టం.ఒకరకంగా చెప్పాలంటే దుర్లభం.
Friday 18 October 2024
యే త్వక్షర మనిర్దేశ్యం
యే త్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే।
సర్వత్రగ మచింత్యం చ కూటస్థ మచలం ధృవం॥3॥
సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః।
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః॥4॥
కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అవ్యక్తమయిన నా రూపాన్ని ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో,వాళ్ళు ద్వంద్వాతీతులు అవుతారు.సర్వభూతరహితులు అవుతారు.అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి వుంటారు.మనసునకు,వాక్కునకూ కనిపించనిదీ,గోచరంకానిదీ,సర్వత్రా వ్యాపించి వుండేదీ,మాయాకారణమూ,అచలమూ,నిత్యసత్యమూ అయిన నిరాకారబ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు నన్నే పొందుతారు.అంటే ఏ రకంగా పూజించినా భగవంతుడు భక్తులను కరుణిస్తాడు.దగ్గరకు తీసుకుంటాడు.మార్గాలు వేరైనా గమ్యంఒకటే కాబట్టి,ఫలితం ఇద్దరుకీ ఒకేలాగే దక్కుతుంది.
Thursday 17 October 2024
మయ్యావేశ్య మనో యే మాం
శ్రీ భగవానువాచ...
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।
శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః॥2॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సమాథానం ఇస్తున్నాడు.సతతం,నిర్వికారంగా నన్నే మనసులో కొలవాలి.మనసు పరిపరి విథాలుగా ప్రక్కకు పోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను ఉపాసన చెయ్యాలి.ఎవరైతే వారి మనసులలో నన్ను సదా నిలుపు కుంటూ,ఉపాసన చేస్తారో,అలాంటి భక్తులే శ్రేష్టమయిన యోగులు.
Wednesday 16 October 2024
ఏవం సతతయుక్తా యే
అర్జున ఉవాచ...
ఏవం సతత యుక్తా యే భక్తాస్త్వాంపర్యుపాసతే।
యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః॥1॥
శ్రీనద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము..భక్తి యోగము
ఇంక భక్తి యోగము మొదలవుతుంది.అర్జునుడు కృష్ణుడిని అడుగు తున్నాడు.కొంతమంది ఒక ఆకారాన్ని పూజిస్తారు.ఇంకొంత మంది నిరాకారాన్ని పూజిస్తారు.ఈ రెండు రకాల మనుష్యులలో ఎవరు గొప్పవారు?సగుణ స్వరూపాన్ని ఉపాసన చేసే వాళ్ళు యోగవిదులు అవుతారా?లేక నిర్గుణబ్రహ్మాన్ని ధ్యానించేవాళ్ళు మోక్షానికి దగ్గర అవుతారా?
Tuesday 15 October 2024
మత్కర్మ కృన్మత్పరమో
మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః
నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ!॥55॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
కృష్ణుడు కొస మెరుపుగా ఇలా చెప్పాడు.అర్జునా,కాబట్టి నా కోసమే కర్మలు చెయ్యి.నన్నే నమ్ముకో.నా మీదే భక్తి ప్రపత్తులు పెంచుకో.అప్పుడు నువ్వు నన్ను పొందగలవు.ఇది నేను నీ ఒక్కడికే చెప్పటం లేదు.ఈ అనంత విశ్వంలో వుండే సమస్త ప్రాణి కోటికి చెపుతున్నాను.ఈ విశ్వంలో నా కొరకే కర్మలు చేస్తూ,నన్నే నమ్ముకొని,నాయందే భక్తితో చరిస్తూ.నిస్సంగుడైనవాడు మటుకే నన్ను పొందగలడు.ఈ విషయం గుర్తు పెట్టుకో.
Monday 14 October 2024
భక్త్యా త్వనన్యయా శక్య
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోఽర్జున
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప॥54॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అందరూ నన్ను ఎలా తెలుసుకోవాలి అని పరితపిస్తుంటారు.నా విశ్వరూపం చూడాలంటే ఏమేమి చెయ్యాలి అని తహ తహ లాడుతుంటారు.నాలో ప్రవేశించే మార్గాలు వెతుకుతుంటారు.అనన్యమయిన భక్తి మార్గమే వీటన్నిటినీ సాధంచే ఏకైక సాధనం.
Sunday 13 October 2024
నాహం వేదైర్న తపసా
నాహం వేదైర్న తపసా నదానేన న చేజ్యయా।
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా॥53॥
శ్రీ మద్భగవద్గీత.... ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.నీకు దక్కిన ,నీవు చూడగలిగిన నా ఈ విశ్వరూపము అనేది చిన్నా చితక విషయం కాదు.ఆషామాషీ వ్యవహారం అసలే కాదు.ఈ అపూర్వ అవకాశం అనేది నాలుగు వేదాలు చదివినా దక్కదు.ఎన్ని పూజలు చేసినా దొరకదు.ఒంటి కాలి పైన నిలుచుకొని ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసినా అనుగ్రహించదు.అంతటి అపురూపమయిన అవకాశం నీకు దక్కింది.
Saturday 12 October 2024
సుదుర్దర్శమిదం రూపం
శ్రీ భగవానువాచ...
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః॥52॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడుతో అతను ఎంత అదృష్టవంతుడో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు నా విశ్వరూపం చూపించాను కదా!అది చూడగలగటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.అది అంత తేలికగా,సులభంగా అందరికీ దక్కదు.నా ఈ విశ్వరూపాన్ని చూసి తరించాలని దేవతలు,మునులు జన్మ అంతా పరితపిస్తుంటారు.కానీ నేను నీకు ఆ సౌలభ్యం కల్పించాను.
Friday 11 October 2024
దృష్ట్వేదం మానుషం రూపం
అర్జున ఉవాచ....
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన!
ఇదానీమస్మి సంవృత్త స్సచేతాః ప్రకృతిం గతః॥51॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
అర్జునుడికి చాలా స్ధిమితంగా వుంది.ఇంకా చాలా సంతోషంగా వుంది.ఈ విషయాన్ని కృష్ణుడితో ఇలా పంచుకుంటున్నాడు.హే జనార్దనా!నీ విశ్వరూపం చూసిన తరువాత,నిన్ను మాములుగా చూస్తుంటే నాకు చాలా హాయిగా వుంది.చాలా ప్రశాంతంగా వుంది.సౌమ్యంగా వుండే నీ ఈ మానవరూపం నా కళ్ళకు చాలా ఇంపుగా కనిపిస్తుంది.నా మనసు ఇప్పుడు కుదుట పడింది.ఇంతసేపటికి నా ప్రాణం స్ధిమిత పడింది.
Thursday 10 October 2024
ఇత్యర్జునమ్ వాసుదేవస్తథోక్త్యా
సంజయ ఉవాచ----
ఇత్యర్జునమ్ వాసుదేవస్తథోక్త్యా
స్వకం రూపం దర్శయామాస భూయః
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా॥50॥శ్రీ మద్భగవద్గీత
ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
కురుక్షేత్రంలో జరిగేదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెపుతున్నాడు కదా!ఇప్పుడు ఇలా చెప్పుకొస్తున్నాడు.ధృతరాష్ట్రా!శ్రీ కృష్ణుడు పై విథంగా అర్జునుడిని అనునయించాడు.ఈ జగత్తు అంతా భయపడేటటువంటి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.అర్జునుడికి అలవాటు అయిన తన పూర్వ రూపం సంతరించుకున్నాడు.ఇప్పుడు సౌమ్యంగా కనిపిస్తున్నాడు.సాధారణంగా వున్నాడు.భయపడిపోయిన అర్జునుడిని ఓదారుస్తున్నాడు.అప్పుడు ఏమైందో చెపుతాను విను.
Wednesday 9 October 2024
మా తే వ్యథా మా చ విమూఢభావో
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోర మీదృజ్మమేదం
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య॥49॥శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!నన్ను ఈ భయంకరమైన రూపంలో చూసి భయపడవద్దు.తత్తర బిత్తర కావద్దు.చపలచిత్తుడవు కావద్దు.దిగులు పడవద్దు.దుఃఖితుడవు కావద్దు.నేను నీకు థైర్యం ఇస్తున్నాను.మాములువాడివి కా.స్వస్థుడివి అవు.నీకు భయం కలిగించని నా పూర్వరూపం లోనే నీకు కనిపిస్తాను.నీకు ప్రేమ కలిగించే విథంగానే నాబాహ్యరూపం వుంటుంది.నీవు ఏమాత్రం చింతించకు.
Tuesday 8 October 2024
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవం రూపశ్శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర॥48॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.హే కురువీరా!వేదాలు చదివినంత మాత్రాన ఎవరూ నా ఈ విశ్వరూపాన్ని చూడలేరు.అలా అని వాదాలు చేసినా లాభం లేదు.క్రతువులు చేసినా,కర్మలనాచరించినా ఎవరికీ వల్లకాదు.దానాలు చేసినా,దారుణ తపస్సులు చేసినా నేను కనికరించను.ఆఅదృష్టం నీ కొక్కడికే దక్కింది.నా ఈరూపాన్ని మాత్రం ఈ లోకంలో నువ్వు తప్ప ఇతరులెవరూ చూడలేకపోయారు.
మయా ప్రసన్నేన తవార్జునేదం
శ్రీ భగవానువాచ....
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మ యోగాత్
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్॥47॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము...
విశ్వరూప సందర్శన యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడిని కరుణించాడు.ఇలా మంచిగా,అనునయంగా చెబుతున్నాడు.అర్జునా!నీ మీద నాకు ఎంతో ప్రేమ వుంది.అందుకనే నీ మీద కరుణతో నా యోగశక్తి ప్రభావం చేత అనంత తేజోభరితమయిన నా ఈ విశ్వరూపాన్ని నీకు చూపించాను.నీకు ఈ విషయం తెలుసా?నా ఈ రూపాన్ని చూసేదానికి దేవతలు,యోగులు పరితపిస్తుంటారు.కానీ వారెవరికీ సాథ్యం కాలేదు.ఇంత వరకూ నా ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప ఇంకవ్వరూ చూడలేదు.
Monday 7 October 2024
కిరీటినం గదినం చక్రహస్తం
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం త థైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో!భవవిశ్వమూర్తే!॥11॥
శ్రీమద్భగవద్గీత..ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
అర్జునుడు తన ప్రియసఖుడిని తనకు అలవాటు అయిన రూపంలో చూడాలనుకుంటున్నాడు.లేకపోతే ఆదగ్గరతనం,ఆ సఖ్యత అనుభవించలేక పోతున్నాడు.అందుకనే ఇలా బతిమలాడుకుంటున్నాడు.కృష్ణా!నేను నిన్ను మాములుగా కిరీటం,గద,చక్రాలతో చూడాలనుకుంటున్నాను.ఓవిశ్వరూపా!ఓ సహస్రబాహో!చతుర్భుజాలతో,నీ మామూలు రూపంతో నాకు దర్శనమివ్వు.నన్ను అలాఆనందింపచెయ్యి.
Sunday 6 October 2024
అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే
త దేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస॥45॥
శ్రీ మద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము..
విశ్వరూప సందర్శన యోగము
మనము మాములుగా గుడికి పోతే ఏమి చేస్తాము?ఒక్కసారి దేవుడిని చూస్తాము.తరువాత మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుని,మన కోర్కెలు కోరుకుంటాము.ఎక్కువ మంది వుండి,గర్భగుడిలో ఎక్కువ సేపు వుండలేక పోతే దిగులు పడతాము.కానీ ఖాళీగా వున్నా ఎక్కువ సేపు చూస్తూ వుండలేము.
ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అదే.అందుకే కృష్ణుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు.స్వామీ!ఇంతకు ముందెప్పుడూ నీ ఈ రూపం చూడలేదు.ఇంత అద్భుతమైన రూపాన్ని ఎక్కడా ఎప్పుడూ కనీ,విని ఎరుగ లేదు.ఇదంతా చూసి నా మనసు ఆవేశంతో కలవరపడుతుంది.ఓదేవాది దేవా!నా మీద దయ వుంచు.నువ్వు నీ పూర్వరూపాన్ని సంతరించుకో.నా ఈవిన్నపం మన్నించు.నీ పూర్వరూపాన్ని పొంది నన్ను అనుగ్రహించు.
Saturday 5 October 2024
తస్మాత్ప్రణమ్య ప్రణి ధాయకాయం
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహ మీశ మీడ్యం
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్॥44॥
శ్రీమద్భగవద్గీత--ఏకాదశాధ్యాయము--విశ్వరూప సందర్శన యోగము
మనము మాములుగా ఏమి చేస్తాము?మన అనుకునే వాళ్ళను ఒకలా చూస్తాము,పరాయి అనుకునే వాళ్ళను ఇంకోలా చూస్తాము.మన వాళ్ళకు అంతా మంచిని ఆపాదిస్తాము.ఎదుటి వాళ్ళ మాటలను,చేష్టలను భూతద్దంలో పెట్టి తప్పొప్పులు వెదుకుతాము.
అందుకే అర్జునుడు ఇలా అంటున్నాడు.స్వామీ!నీకు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాను.ఒక తండ్రి తన బిడ్డ తప్పును ఎలా క్షమిస్తాడో అలా నా తప్పులు క్షమించు.ఒక స్నేహితుడు తన మిత్రుడి తప్పులను ఎలా అర్థం చేసుకుని,సర్దుకుంటాడో అలా నేను చేసిన తప్పులను సర్దుకో.ఒక ప్రియుడు తన ప్రియురాలి విషయంలో,ఆమె చేసిన తప్పులను అసలు తప్పులుగానే మనసుకు తీసుకోడో,అలా నా తప్పులను అసలు లెక్కలోకి తీసుకోవద్దు.
ఇలా తన తప్పులను మనసుకు తీసుకోవద్దు అని బతిమలాడుతున్నాడు.
Thursday 3 October 2024
పితాఽసి లోకస్య చరాచరస్య
పితాఽసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్య ప్రతిమప్రభావ!॥43॥
శ్రీ మద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము 11
అర్జునుడికి చిన్న చిన్నగా అర్థం అవుతుంది.కృష్ణుడు సామాన్యుడు కాదు,అసమాన్యుడు అని.అందుకే తన మనసులో భావాలను ఇలా వ్యక్తపరుస్తున్నాడు.హే కృష్ణా!ఈ జగత్తుకు నీవే తండ్రివి.నీవే పూజనీయుడివి.అగ్ర తాంబూలం తాసుకునే దానికి అర్హుడివి.ఆది గురువువు నీవు.నీకు సరి సమానమైనవాడు ఈ ముల్లోకాలలో ఎవరూ కానరావటం లేదు.నీకు సరి సమానమైన వాడే లేడంటే,నీకంటే గొప్పవాడు,నీకంటే అధికుడు ఇంకెక్కడ వుంటాడు?
Subscribe to:
Posts (Atom)