Monday, 30 June 2025

పంచైతాని మహాబాహో

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే। సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్॥13॥ అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్। వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!సాంఖ్య శాస్త్రము ఏమి చెబుతుందో కూడా తెలిసుకుందాము మనము.అన్ని కర్మలకూ కారణం ఏందో ఈ శాస్త్రం మనకు విశదీకరిస్తుంది.శరీరం,అహంకారం,పంచేంద్రియాలు,ప్రక్రియాపరమైన వివిధ కార్యాలు,పరమాత్మ....అనబడే ఈ అయిదే,సమస్త కర్మలకూ కారణాలు అని సాంఖ్య శాస్త్రము చెబుతుంది.

Sunday, 29 June 2025

అనిష్ట మిష్టం మిశ్రం చ

అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్। భవ త్యత్యాగీనాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్॥12॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ఞుడు అర్జునుడికి కర్మఫలాల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము ఇప్పుడు రకరకాల కర్మల గురించి,త్యాగాల గురించి చెప్పుకున్నాము కదా!ఇక కర్మ ఫలాల గురించి మాట్లాడుకుందాము.ఇష్టానిష్ట మిశ్రమములు అని కర్మ ఫలాలు మూడు రకాలు ఉన్నాయి.కామన గల వారికి ఆ ఫలాలు,ఫలితాలు పరలోకంలో అందుతాయి.అదే మనము కర్మ ఫలత్యాగుల గురించి మాట్లాడుకుందాము.కర్మ ఫలత్యాగులకు యెప్పుడూ ఆ ఫలితాలు తగులవు.అంటే అంటవు.తామరాకు మీద నీటి బొట్టు చందాన ఉంటుంది.

Saturday, 28 June 2025

న హి దేహభృతా శక్యం

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః। యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిదీయతే॥11॥ శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు భగవంతుడు.ఆయనకు మానవుల బలాలు,బలహీనతలు అన్నీ క్షుణ్ణంగా చెలుసు.ఆయన అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!దేహధారులకు కర్మలను అన్నిటినీ విడవటం అసాథ్యం.అది కూడని పని అని నాకూ తెలుసు.అందువల్ల నేను ఏమి చెబుతానో విని అర్థం చేసుకో.కర్మలను వదలడం పూర్తిగా మానవమాత్రులకు కుదరదు కాబట్టి,కనీసం కర్మఫలాన్ని వదులుకోగలగాలి.అలా కర్మఫలాన్ని వదలగలిగిన వాడే త్యాగి అని నా భావము.

Friday, 27 June 2025

న ద్వేష్ట్య కుశలం కర్మ

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే। త్యాగీ సత్త్వ సమావిష్టో మేధావీ ఛిన్న సంశయః॥10॥ శ్రీ మద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాత్త్విక త్యాగము గురించి విడమరచి చెబుతున్నాడు.ఎందుకంటే మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలి,అర్థం అయ్యేలా,మనసుకు హత్తుకునేలా చెప్పాలి.మనము కూడా ఆచరిద్దాము అనే తృష్ణ ఎదుటివారిలో కలిగేలా చెప్పాలి. అర్జునా!సత్త్వ గుణ ప్రధానంగా ప్రతి ఒక్కరూ వర్థమానులు కావాలి.అలా కావాలంటే మొదట ఆసక్తిని,ఫలాన్ని విడిచి కర్మలు చేయటానికి శ్రీకారం చుట్టాలి.ఇలా ప్రతి నిత్యం చేస్తూ,ఆత్మ జ్ఞానం పొందాలి.ఈ యజ్ఞంలో ఎలాంటి అనుమానాలకూ,సందేహాలకూ తావు ఇవ్వకూడదు.అలాంటి సందేహరహితుడు,ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషించడు.అంతేనా?అలాగే సుఖాలను ఇచ్చే కర్మలనూ ఆమోదించడు,ఇష్టపడడు.నిర్వికారంగా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు పోతాడు.

Thursday, 26 June 2025

కార్యమిత్యేవ యత్కర్మ

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున। సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః॥9॥ శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి త్యాగం అనేది సరిగ్గా ఎలా చేయాలో వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు తామస,రాజస యోగాల గురించి చెప్పాను కదా!అలాగే వాటి వల్ల ఫలితం కూడా శూన్యం అని చెప్పాను కదా!ఇప్పుడు నీకు నేను సాత్త్విక త్యాగం గురించి చెబుతాను.ప్రతి ఒక్కరూ అది పాటిస్తే మంచిది.మానవుడు అనే ప్రతి జీవి శాస్త్రాలు చెప్పిన కర్మలను చేయాలి.అది తప్పించుకపనేదానికి కుదరదు.కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది.మనము ఆ కర్మలయందు ఆసక్తి లేకుండా చేయగలగాలి.అంటే నిర్వికారంగా అన్నమాట.మనము చేసే కర్మలవలన మనకు సంక్రమించే ఫలితం పైన ఎలాంటి ఆశలు పెంచుకోకూడదు.అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయగలగటం నేర్చుకోవాలి.ఇలా ఆసక్తినీ,కర్మఫలాన్నీ విడవగలిగి,సత్కర్మలు చేయగలగాలి.అలాంటి త్యాగాన్నే సాత్త్విక త్యాగము అంటారు.

Wednesday, 25 June 2025

దుఃఖమిత్యేవ యత్కర్మ

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్। స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్॥8॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!మూర్ఖత్వంతో చేసే త్యాగం తామస త్యాగం అని చెప్పాను కదా.ఇప్పుడు ఇంకో రకం త్యాగం గురించి చెబుతాను,విను.ఇక్కడ వీళ్ళు ఎక్కడ శరీరం అలుస్తుందో అని కలత చెందుతుంటారు.అందుకని శరీరకష్టానికి భయపడి వారు చేయాల్సిన కర్మలను చేయడం మానివేస్తారు.అంటే త్యాగం ముసుగులో పని దొంగలు అన్నమాట!దీనినే రాజస త్యాగము అంటారు.ఇలాంటి త్యాగాల వలన ఫలితం శూన్యము.కాబట్టి ఎవరమూ మన మన విధులను,చేయాల్సిన కర్మలను మానకూడదు.

Tuesday, 24 June 2025

నియతస్య తు సన్న్యాసః

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే। మోహాత్తస్య పరిత్యాగ స్తామసఽ పరికీర్తితః॥7॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏది మంచో,ఏది కాదో ఓపికగా,నిదానంగా,అర్థం అయ్యేలా వివరిస్తున్నాడు.అర్జునా!ఎప్పుడూ ప్రతి ఒక్కరికీ విద్యుక్త కర్మలు,ధర్మాలు కొన్ని నిర్దేశితంగా ఉంటాయి.మానవుడు వాటినన్నిటినీ శ్రద్ధగా ఆచరించాలి.త్యాగం అన్నారని ఆ విద్యుక్త కర్మలను ఎప్పుడూ విడనాడకూడదు.అలాంటి త్యాగము ఎప్పటికీ న్యాయం,ధర్మము కాదు.ఎలాంటి శాస్త్రీయమయిన విశ్లేషణ,అవగాహన లేకుండా,పర్యవసానాలు ఆలోచించకుండా చేసే త్యాగము మూర్ఖత్వము అవుతుంది.దానినే తామస పరిత్యాగము అంటారు.

Monday, 23 June 2025

ఏతాన్యపి తు కర్మాణి

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ। కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్॥6॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు యజ్ఞము,దానము,తపము విడవకుండా చెయ్యాలని చెప్పాను కదా!అవి కూడా ఎలా చెయ్యాలో చెబుతాను విను.మనము చేసే ఏ కర్మలలోనూ ప్రతిఫలము ఆశించకూడదు.ఆశ,బంథము,మమకారము,లోభము,లాలస లేకుండా చేయగలగాలి.అంటే ఆ యజ్ఞాది కర్మలు అన్నిటినీ కూడా కర్తృత్వమమకారము,ఫలాపేక్షలు విడిచిపెట్టి చెయ్యాలి.అలానే చేయాలనేది నా నిశ్చితమయిన అభిప్రాయము.

Sunday, 22 June 2025

యజ్ఞదానతపః కర్మ

యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్। యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్॥5॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము చిన్నప్పుడు బడిలో మన ఉపాధ్యాయులు మనకు ఎలా నేర్పిస్తారు?ఒకటికి పది సార్లు చెప్పిస్తారు.ఇంకో ఇరవై సార్లు పలక మీద దిద్దిస్తారు.వంద సార్లు చదివి ఒప్ప చెప్పమంటారు.మా గురువు అయితే అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్నా,లేపి అడిగితే ఒక్క తప్పుకూడా లేకుండా,గడగడా చెప్పగలగాలి.అలా కంఠస్తం చెయ్యాలి అనేవారు. ఈ విషయం మనందరికంటే ఆది గురువుకే ఇంకా బాగా తెలుస్తుంది కదా!అందుకనే ఆయన మంచి విషయాలను మరీ మరీ,ఒకటికి పది సార్లు చెబుతున్నాడు అర్జునుడికి.ఎందుకంటే మంచి విషయాలు పదే వినాలి,చదవాలి,వ్రాయాలి,అర్థం చేసుకోవాలి,మననం చేసుకోవాలి,ఆచరణలో పెట్టాలి.అంటే మన జీవిత విధానంలోకి అన్వయించుకోవాలి.ఎందుకంటే మనలో ఎంత మంది ఏక సంతగ్రాహులుఉంటారు?ఉన్నా మంచి విషయాలను అర్థం చేసుకుని,మననం చేసుకుంటూ,వారి జీవితాలలో అన్వయించుకుంటారు?కాబట్టి సాథన అవసరము. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మరలా మరలా చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!నేను చెప్పే యాగము,దానము,తపస్సు అనే మూడు కర్మలను జీవితంలో ఎప్పుడూ విడనాడ కూడదు.అవి మన జీవిత విథానంలో మమేకం అయిపోవాలి.ఎందుకంటావా?ఎందుకంటే అవి మనసును కల్మష రహితంగా తయారు చేస్తాయి.చిత్తశుద్థిని కలిగిస్తాయి.ప్రశాంతతను పొందేలా చేస్తాయి.

Saturday, 21 June 2025

నిశ్చయం శరణు మే తత్ర

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ। త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ స్సంపకీర్తితః॥4॥ శ్రీకృష్ణుడికి అర్జునుడు అంటే అమితమైన అభిమానము,సద్భావము.అందుకే అర్జునుడిని భరతసత్తమ,పురుషవ్యాఘ్రము అని పిలుస్తున్నాడు.అంటే కృష్ణుడి దృష్టిలో అర్జునుడు ఎంతో ఉత్తముడు,వీరుడు,శూరుడు,ధైర్యము కలవాడు.అందుకే అతనిని పురుషులలో పులి,ఉత్తముడు అని మెచ్చుకోలుగా పిలుచుకుంటున్నాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ పురుషవ్యాఘ్రమా!ఇప్పుడే మనము యజ్ఞ,దాన తపస్సులను ఎప్పుడూ మానవుడు విడనాడ కూడదని అనుకున్నాము కదా.అందులో త్యాగం గురించి చెప్పాలంటే,దానిలో మూడు రకాలు ఉంటాయి.

Friday, 20 June 2025

త్యాజ్యం దోషవది త్యేకే

త్యాజ్యం దోషవది త్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః। యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే॥3॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!కర్మలు అన్నీ మనలని కట్టి పడవేసే బంధనాలు అని.కాబట్టి వాటిని వదిలి వేయడమే మంచిది,ఉత్తమమయిన మార్గము అని కొందరు అంటారు.ఇంకొందరు ఇలా కూడా చెబుతారు.యజ్ఞము,దానము,తపస్సు అనేవి జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన నియమాలు,కార్యాలు.కావున వాటిని ససేమిరా ఎప్పుడూ విడువకూడదు అని మరింకొందరు చెబుతారు.

Thursday, 19 June 2025

కామ్యానాం కర్మణాం న్యాసం

శ్రీ భగవానువాచ.... కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః। సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః॥2॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము గురువుకు ఎప్పుడూ శిష్యులకు మంచి మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది.అందునా,ఆ శిష్యులు ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన కనబరచినప్పుడు చాలా ఆత్మానందం పొందుతారు.మరింత ఉత్సాహంతో ఇంకా చాలా చాలా కొత్త విషయాలు చెప్పిస్తారు.ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడి పరిస్థితి కూడా అలానే ఉంది.అర్జునుడు త్యాగము,సన్న్యాసము గురించి ఇంకా వివరించమనగానే శ్రీకృష్ణుడు చాలా ఆనందించాడు.రెట్టింపు అయిన ఉత్సాహంతో చెప్పడం ప్రారంభించాడు. అర్జునా!మొదట వీటి రెండింటి గురించి పండితులు ఏమని అనుకుంటారో చెబుతాను విను.కామ్య కర్మలను మాని వేయడమే సన్న్యాసము అనుకుంటారు.కర్మ ఫలాలను విడిచి పెట్టడమే త్యాగమని నమ్ముతారు,చెబుతారు.

Wednesday, 18 June 2025

సన్న్యాసస్య మహాబాహో

అర్జున ఉవాచ... సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్। త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన॥1॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంత సేపూ చెప్పినదంతా వినమ్రంగా,శ్రద్ధాసక్తులతో విన్నాడు.ఇప్పుడు తనకు వచ్చిన అనుమానాలను బయటపెడుతున్నాడు.హే కృష్ణా!అసలు సవ్న్యాసము అంటే ఏమిటి?త్యాగము అంటే ఏమిటి!వీటన్నిటి వివిధ రకాలు,స్వరూపాలు ఏమిటి?ఇవంతా ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలని నా మనసు కుతూహల పడుతుంది.కావున నాకు వీటన్నిటి గురించి వివరంగా విశదీకరించు అని కోరుతున్నాడు.

Tuesday, 17 June 2025

అశ్రద్ధయా హుతం దత్తం

అశ్రద్ధయా హుతం దత్తం తప స్తప్తం కృతం చ యత్। అసది త్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ॥28॥ ఇతి శ్రీ మద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశాధ్యాయః!!!!! శ్రీమద్భగపద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇక అసత్ గురించి చెప్పి ఈ అధ్యాయము ముగిస్తున్నాడు.ఓ అర్జునా!హే పార్ధా!మనము ఏ పని చేసినా ఆ పని పైన ఇష్టము,నమ్మకము,శ్రద్ధ,నిష్ట,నియమాలు ఉండితీరాలి.కానీ అలా కాకుండా,లెక్కలేనితనంగా,అయిష్టంగా,అసంపూర్తిగా,అసంతృప్తిగా,అవగాహన లేకుండా,అశ్రద్ధగా,అతిశయంతో చేసే ఏ కార్యానికీ సత్ఫలితం దక్కదు.ఇలా శ్రద్ధారహితంగా చేసే హోమం,దానం,తపస్సు,మరియు ఇతర కర్మలు అన్నీ అసత్ గానే చెప్పబడతాయి.వాటి వలన ఎవరికీ ఎలాంటి ఉపయోగము ఉండదు.అలాంటి కర్మల వలన ఇహ పరలోకాలలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.అంటే అలా చేసినా ఒకటే,చేయకపోయినా ఒకటే.పెద్ద తేడా ఏమీ ఉండదు.

Monday, 16 June 2025

సద్భావే సాధుభావే చ

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే। ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే॥26॥ యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే। కర్మచైవ తదర్థీయం స దిత్యే వాభిదీయతే॥27॥ శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓం,తత్ పదాలు,శబ్దాల విశిష్టత వివరించాడు.ఇప్పుడు ఇక సత్ అనే శబ్దం గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!పార్థా!నీకు ఓం మరియు తత్ ల విశిష్టత బాగా అర్థం అయింది కదా!అలాగే సత్ అనే శబ్దం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సత్ అనే శబ్దం మాములుగా అస్తిత్వము,శ్రేష్టము అనే అర్థాలలో వాడబడుతుంది.సత్ అంటే నిజము,నిత్యము,సత్యము కూడా అనుకోవచ్చు. ఇకపోతే యాగాలలో,దానాలు చేసేటప్పుడు,తపస్సులలో ముఖ్య ఉద్దేశ్యము ఆ పరబ్రహ్మను చేరుకోవాలనే కదా!అలాంటి నిశ్చలమయిన,నిష్ఠ పరమాత్మను గూర్చి చేసే యాగాలు,దానాలు,తపస్సులు,సమస్త కర్మలు కూడా సత్ అని చెప్పబడుతున్నాయి.

Sunday, 15 June 2025

తది త్యనభిసంధాయ

త ది త్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః। దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః॥25॥ శ్రీమద్భగవద్గీత...।సప్త దశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఇప్పుడు ఓంకారం ఎలా,ఎందుకు,ఎప్పుడు వాడుతారో చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తత్ గురించి చెప్పుకుందాము.తత్ అంటే అది అని అర్థము.మోక్షకామములను తత్ అని శబ్దోచ్ఛారణ పూర్వకంగా పిలుస్తారు యోగులు,సన్యాసులు మరియు తాపసులు.ఎలాంటి ప్రయోజనాలు కోరకుండా చేసే యజ్ఞాలు,దానాలు,తపోకర్మలు అన్నీ తత్ అనే శబ్దోచ్ఛారణ పరస్పరంగా చేయబడుతున్నాయి.వాడబడుతున్నాయి.

Saturday, 14 June 2025

తస్మాదో మిత్యుదాహృత్య

తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః। ప్రవర్తంతే విధానోక్తా స్సతతం బ్రహ్మవాదినామ్॥24॥ శ్రీమద్భగవద్గీత...సప్త దశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓంకారం యొక్క విశిష్టతను వివరిస్తున్నాడు.అర్జునా!నీకు నేను ఓం తత్ సత్ గురించి,వాటి విశిష్టత గురించి ఇప్పుడే చెప్పాను కదా!వీటన్నిటిలోకి ఓం శబ్దం యొక్క ప్రాముఖ్యం చాలా ఉంది.దీనికీ కారణం ఉంది.ఈ సృష్టి మొత్తం ఓంకార నాదంతో మొదలు అయింది.కావున దీనికి చాలా విలువ,విశేషత ఉన్నాయి.దానిని మన పూర్వీకులు అందరూ నిశితంగా గుర్తించారు.కాబట్టే బ్రహ్మజ్ఞుల యాగాలు,దానాలు,తపస్సులు,ఇతర అనుష్టాన కర్మలు అన్నీ ఓంకార పూర్వకంగానే అనుష్ఠింపబడతాయి.

Thursday, 12 June 2025

ఓం తత్సదితి నిర్దేశో

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృతః। బ్రాహ్మణాస్తేన వేదశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా॥23॥ శ్రీమద్భగవద్గీత...సప్తగశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓం,తత్,సత్ అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలుగా నిర్దేశించ బడినాయి.ఆ నిర్దేశాల వలనే వేదాలు,యజ్ఞాలు,బ్రాహ్మణులు కల్పించ బడటం జరిగింది. ఓం అనేది బీజాక్షరం.ఓంకారం తోటే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది.కాబట్టి ఆ ఉచ్ఛారణ,ఆ అక్షరమూ మనకు చాలా పవిత్రమయినది.ఓం తత్సత్ అంటే సర్వోచ్ఛమయిన వాస్తవికత.అదే నిజం.ఏది వాస్తవికమయినదో అదే నిజం,అదే సంపూర్ణం.భగవంతుడే నిత్యమూ,సత్యమూ కాబట్టి ఆతని స్పృహలో ఉండాలి ప్రతి ఒక్కరూ.

Wednesday, 11 June 2025

ఆదేశకాలే యద్దాన

అదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే। అసత్కృత మనజ్ఞాతం తత్తామస ముదాహృతమ్॥22॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు ఇప్పుడిపుడే సాత్త్విక,రాజస దానాల గురించి ప్రస్తావించాడు.ఇక మిగిలినది తామస దానము.దాని గురించి కూడా అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస దానాలు ఎలా ఉంటాయో అవగాహనకు వచ్చింది కదా.ఇప్పుడు ఇక తామస దానం గురించి చెబుతాను,విను.ఇక్కడ దానం చేసేవారిలో లెక్క లేనితనం,ఆ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యభావం అడుగడుగునా మనకు గోచరిస్తుంటుంది.దేశకాల పాత్రల గురించి అవగాహన లేమి ఉంటుంది.దానంతీసుకునే వారి పైన చులకన భావం,అగౌరవము ఉంటాయి.దేశకాల పాత్రల గురించి మంచిగా తెలుసుకుని,దానికి తగిన రీతిలో దానం చెయ్యాలనే స్పృహ ఉండనే ఉండదు.దానం చెయ్యాలా?చేసాము!అని చేతులు దులుపుకొని పోయే మనస్తత్త్వం ప్రస్ఫుటమవుతుంటుంది.ఇన్ని అవలక్షణాలతో చేసే దానాన్నే తామస దానం అంటారు.

యత్తు ప్రత్యుపకారార్థం

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః। దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతమ్॥21॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్కీకృష్ణుడు ఇప్పుడే సాత్త్విక దానంగురించి చెప్పాడు.ఇప్పుడు ఇక రాజసదానం ఎలా వుంటుందో వివరిస్తున్నాడు.అర్జునా!నీకు సాత్త్వికదానం గురించి చెప్పాను కదా.ఇప్పుడు రాజస దానం గురించి వివరిస్తాను.ఇక్కడ అన్నీ చేస్తారు.కానీ ఆ నిష్కపటం,నిర్మలత్వం,నిర్మోహం ఉండవు.ప్రతిఫలం కోరుకుంటారు అడుగడుగునా.మనం వాళ్ళకు ఇంత చేస్తే,ప్రత్యుపకారంగా వారి నుంచి మనము ఎంత ఆశించవచ్చు అని బేరీజు వేసుకుంటారు.దానం స్వీకరించే వాళ్ళ దగ్గరే కాకుండా,సంఘం నుంచీ కూడా.పేరు ప్రఖ్యాతులు,గౌరవ మర్యాదలు కోసం తహ తహలాడుతారు.ఇలా చేయటం వలన వాళ్ళకు కష్టమయినా వెనుకాడకుండా,ముందుకు పోతారు.దానం తీసుకున్న వాళ్ళు వారికి అణిగి మణిగి ఉండాలనుకుంటారు.వీళ్ళ గుణగణాలు,దాతృత్వం గురించి ఊరూరా కథలు కథలుగా చెప్పుకోవాలి అని కోరుకుంటారు.దీనినే రాజస దానం అని అంటారు.

Tuesday, 10 June 2025

దాతవ్యమితి యద్దానం

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే। దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్॥20॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి యజ్ఞము,తపస్సుల గురించి వివరించాడు.ఇప్పుడు దానాలలో రకాల గురించి చెబుతున్నాడు.ఓ అర్జునా!పుణ్యస్థలాలలో దానం చేయటము అనే ప్రక్రియ కర్తవ్యము అనుకోవాలి ప్రతి ఒక్కరూ.దానం చేయమన్నారు కదా అని ఏదో ఒకటి ఇచ్చేసి,చేతులు దులిపేసుకో కూడదు.మనము చేసే దానము దేశకాల పాత్రలకు అనుగుణంగా,అనుసరించి ఉండాలి.అంటే వివరంగా చెబుతాను విను.ఆ ప్రాంతంలో వారికి ఏది అవసరమో కనుక్కొని ఇవ్వగలగాలి.అంటే మనము చేసేది వారికి ఉపయోగ పడాలి.అలాగే కాలానికి సరిపోయేటట్లుగా.అంటే చలికాలంలో దుప్పటి ఇస్తే పనికి వస్తుంది.ఎండా కాలంలో నీరు,నీడ,గాలి అవసరము.కాబట్టి చలివేంద్రాలు,ఎండ నుంచి కాపాడుకునేదానికి,ఉక్క నుంచి ఉపశమనానికి ఉపకరణాలు సమకూర్చడం లాంటివి.అలానే అవసరంచూసి,అవసరము అయినవారికి చేయాలి.అపాత్ర దానం చేయకూడదు.అలా సహాయ సహకారాలు అందిచడంలో మనము ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు.మనకు ఉపయోగము పొందేవారి నుంచి ఎలాంటి ఉపయోగము,లాభము ఉండకూడదు.ఇలా చేసే దానాలను సాత్త్వికమయిన దానం అంటారు.

Monday, 9 June 2025

మూఢగ్రాహేణాత్మనో

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః। పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్॥19॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు ఇంత సేపూ సాత్త్విక తపస్సు గురించి,రాజస తపస్సు గురించి చెప్పాడు.ఇప్పుడు ఇక తామస తపస్సు గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక,రాజస తపస్సులు ఎలా ఉంటాయో అర్థం అయింది కదా.ఇప్పుడు ఇంక తామస పరమయిన తపస్సు గురించి వివరిస్తాను.ఇది ఎంత సేపూ ఎలా ఎదుటివారికి ఏ ఏ రీతులలో హాని చేయగలము అనే దురుద్దేశంతోనే ఉంటుంది.ఈ క్రమములో వారిని వారే హింసించుకునేదానికి కూడా వెనుకాడరు.సమయాసమయాలు,ఇంగితము,విచక్షణ ఏమీ ఆలోచించరు.ఎంత సేపూ మూర్ఖపు పట్టుదలలకు పోయి వారిని వారే నాశనం చేసుకోవటం కాకుండా ఎదుటి వారినీ,అయినవారిని కూడా ఇబ్బందికి గురి చేస్తూ బాధ పెడుతుంటారు.ఇలాంటి మూర్ఖపు పట్టుదలలకు పోయి చేసే తపస్సునే తామసిక మయిన తపస్సు అంటారు.అర్జునా!ఈ మార్గంలో ఎప్పుడూ పయనించకు.

Sunday, 8 June 2025

సత్కారమానపూజార్థం

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్। క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధృవమ్॥18॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయవిభాగయోగము కృష్ణుడు అర్జునుడికి మొదట సాత్త్వికమయిన తపస్సు గురించి చెప్పాడు కదా.ఇప్పుడు రాజస తపస్సు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!ఇక మనము రాజస తపస్సు గురించి మాట్లాడు కుందాము.వీరు ఎప్పుడూ పరుల నుండి గుర్తింపు ఆశిస్తుంటారు.దాని కారణంగా గౌరవం ఎక్కడెక్కడ దొరుకుతుందా అని అన్వేషిస్తూ ఉంటారు.మనలను ఎదుటివారు సత్కరించాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటారు.వారి ఆలోచనలకు తగినట్లుగానే వారి కార్యాచరణ ఉంటుంది.అదే!పరులనుండి గౌరవ సత్కారాలు ఆశిస్తూ,డంబంతో చేసే తపస్సునే రాజస తపస్సు అంటారు.మనము ఎలా చేస్తామో,దాని ఫలితాలు కూడా అలానే ఉంటాయి కదా!కాబట్టి వీరు చేసే పనులకు సంబంధించి ఫలితం కూడా అల్పంగా,అంతంత మాత్రంగానే ఉంటుంది.

Saturday, 7 June 2025

శ్రద్ధయా పరయా తప్తం

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః। అఫలాకాంక్షిభిర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతే॥17॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి క్లుప్తంగా సాత్త్విక తపస్సు గురించి చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే ప్రతిపనిలోనూ ప్రతిఫలం ఆశించకూడదు.మనసును నిర్మలంగా,నిశ్చలంగా ఎల్లప్పుడూ ఉంచుకోగలగాలి.చేసే ప్రతి పనిని శ్రద్ధాసక్తులతో చేయాలి.ఈ మూడు కార్యాలను నియమ నిష్ఠలతో ఆచరించడమే మూడు రకాల సాత్త్విక తపస్సు అంటారు.సాత్త్వికమంటే ఇంతకంటే వేరే ఇంకేమీ లేదు.

Friday, 6 June 2025

మనః ప్రసాదస్సౌమ్యత్వం

మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః। భావసంశుద్ధి రిత్యేత త్తపో మానసముచ్యతే॥16॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంతకు ముందు శరీరం తో చేసే తపస్సు,మాటలు అదే వాక్కుతో చేసే తపస్సు గురించి చెప్పాడు కదా!ఇప్పుడు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతున్నాడు. అర్జునా!ఇప్పుడు నేను నీకు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతాను.శ్రద్ధగా విను.మన మనసు నిశ్చలంగా ఉండాలి.మాటలలో,చేతలలో లాగే భావరూపకంగానూ మృదుత్వం ఉండాలి.మౌనం ముఖ్యంగా ఉండాలి.ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మనము మనలని విశ్లేషించుకునే సమయం,సందర్భం దొరుకుతుంది.చెడు ఆలోచనలనుంచి బయటపడాలి.అప్పుడే కదా మన అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది. నిశ్చలమయిన మనస్సు,మృదుత్వం,మౌనము,శుద్ధమయిన అంతఃకరణము కలిగి ఉండటానినే మనసుతో చేసే తపస్సు అంటారు.

Wednesday, 4 June 2025

అనుద్వేగకరం వాక్యం

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్। స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే॥15॥ శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంక వాక్కులతో చేసే తపస్సు గురించి అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపూ మనము ఏమి మాట్లాడుకున్నాము?ఆహారపు అలవాట్లు,శరీరంతో చేసే తపస్సు,యజ్ఞాలలో రకాల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు ఇంక వాక్కులతో చేసే తపస్సు ఎలా ఉంటుందో చెబుతాను,విను.మన మాట తీరు ఎదుటివారు బాధ పడేలాగా ఉండకూడదు.సత్యమే ఎల్ల వేళలా మాట్లాడాలి.అవీ ఎలా ఉండాలంటే,వినసొంపుగా,ప్రియంగా,మనసుకు హత్తుకునేలా ఉండాలి.వేదభ్యాసం చేయాలి.వీటినే వాక్కులతో చేసే తపస్సు అంటారు.

Tuesday, 3 June 2025

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్। బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే॥14॥ శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తపస్సు ఏ ఏ రకాలుగా ఆచరించ వచ్చో వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపు మనము వివిధ రకాలు అయిన యజ్ఞాల గురించి మాట్లాడు కున్నాము కదా!ఇప్పుడు తపస్సులలో రకాల గురించి నీకు వివరంగా చెబుతాను.మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించు.ఇప్పుడు నీకు నేను శరీరంతో చేసే తపము గురించి చెబుతాను.మనము దేవతలను,బ్రాహ్మణులను,గురువులను,పెద్దలను పూజించాలి.శుచి,శుభ్రత పాటించాలి.మన జీవన శైలిలో సరళత్వం గోచరించాలి.విశృంఖలత్వం లేకుండా బ్రహ్మచర్యం పాటించాలి.ఇతర ప్రాణుల పైన హింస విడనాడి అహింసా మార్గంలో పయనించాలి. ఇక ముఖ్యంగా ఆర్జవము పాటించాలి.అంటే మనసులో కల్మషం లేకుండా ఉండాలి.మనసులో ఒకటి,బయటకు ఇంకొకటిగా ఉండకూడదు.నిజాన్ని నిర్భయంగా,నిస్సందేహంగా చెప్పగలగాలి.రాముడికి లాగా ఒకటే మాట,ఒకటే బాణం లాగా ఉండాలి.ద్వంద్వాతీతంగా ఉండాలి.అంటే అటు ఇటుగా కాకుండా,ఒకటే మంచి దారిలో నడవాలి. ఇలా ఉండగలగటాన్ని శరీరంతో చేసే తపస్సు అంటారు.

Monday, 2 June 2025

విధిహీనమసృష్టాన్నం

విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్। శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే॥13॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తామస యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు మనము తామస యజ్ఞం గురించి మాట్లాడుకుందాము.తామసులు ప్రతిపనిని మౌళికంగా శ్రద్ధా,నిష్టా,నియమాలు లేకుండా చేపడతారు.శాస్త్రాన్ని అనుసరించి చేయరు.కాబట్టి ఏ కోశానా శాస్త్రవిధి కానరాదు.యజ్ఞం కాగానే అన్నదానం చేయటం సర్వత్రా శుభదాయకం.కానీ వీరు ఆ జోలికి పోరు.మంత్రం యొక్క పవిత్రత గుర్తించి ఆచరించరు.యజ్ఞ యాగాదులు చేసిన పిదప వచ్చిన వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం ఆచరణ యోగ్యం.కానీ వీరు దానిని ససేమిరా ఆచరించరు. అంటే పద్ధతి ప్రకారం ఏదీ చేపట్టరు.చేసే ప్రతి పనినీ అహంకార పూరితంగా,అజ్ఞానంతో,లెక్కలేనితనంతో చేస్తారు.