Sunday, 22 June 2025
యజ్ఞదానతపః కర్మ
యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్॥5॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
చిన్నప్పుడు బడిలో మన ఉపాధ్యాయులు మనకు ఎలా నేర్పిస్తారు?ఒకటికి పది సార్లు చెప్పిస్తారు.ఇంకో ఇరవై సార్లు పలక మీద దిద్దిస్తారు.వంద సార్లు చదివి ఒప్ప చెప్పమంటారు.మా గురువు అయితే అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్నా,లేపి అడిగితే ఒక్క తప్పుకూడా లేకుండా,గడగడా చెప్పగలగాలి.అలా కంఠస్తం చెయ్యాలి అనేవారు.
ఈ విషయం మనందరికంటే ఆది గురువుకే ఇంకా బాగా తెలుస్తుంది కదా!అందుకనే ఆయన మంచి విషయాలను మరీ మరీ,ఒకటికి పది సార్లు చెబుతున్నాడు అర్జునుడికి.ఎందుకంటే మంచి విషయాలు పదే వినాలి,చదవాలి,వ్రాయాలి,అర్థం చేసుకోవాలి,మననం చేసుకోవాలి,ఆచరణలో పెట్టాలి.అంటే మన జీవిత విధానంలోకి అన్వయించుకోవాలి.ఎందుకంటే మనలో ఎంత మంది ఏక సంతగ్రాహులుఉంటారు?ఉన్నా మంచి విషయాలను అర్థం చేసుకుని,మననం చేసుకుంటూ,వారి జీవితాలలో అన్వయించుకుంటారు?కాబట్టి సాథన అవసరము.
అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మరలా మరలా చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!నేను చెప్పే యాగము,దానము,తపస్సు అనే మూడు కర్మలను జీవితంలో ఎప్పుడూ విడనాడ కూడదు.అవి మన జీవిత విథానంలో మమేకం అయిపోవాలి.ఎందుకంటావా?ఎందుకంటే అవి మనసును కల్మష రహితంగా తయారు చేస్తాయి.చిత్తశుద్థిని కలిగిస్తాయి.ప్రశాంతతను పొందేలా చేస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment