Friday, 20 December 2024

ఇదం జ్ఞానముపాశ్రిత్య

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః। సర్గేఽపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ॥2॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఈ జ్ఞాన యోగమును ఎవరు ఆచరిస్తారో,వాళ్ళందరూ తప్పకుండా నా స్వరూపాన్ని పొందుతారు.జననమరణాలకు అతీతంగా వుండే మోక్షాన్ని పొందుతారు.వాళ్ళు ప్రళయకాలంలో భయాందోళనలకు లోనవరు.అంటే శరీరం అంత్య దశలో కూడా నిర్మల చిత్తంతో వుండగలుగుతారు.

Wednesday, 18 December 2024

పరంభూయః ప్రవక్ష్యామి

శ్రీమద్భగవద్గీత...చకుర్దశాధ్యాయము గుణత్రయవిభాగయోగము శ్రీభగవానువాచ.... పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం। యద్ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః॥1॥ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.నేను జ్ఞానం గురించి ఇంతకు ముందు కొంత చెప్పి వున్నాను.అన్ని రకాల జ్ఞానాలలోకి అత్యంత ఉత్తమ మైన జ్ఞానం ఏదంటే,పరమజ్ఞానం అని నేను చెబుతాను.ఈ జ్ఞానం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న మునులందరూ ముక్తులు అయ్యారు.పరమపదాన్ని పొందారు.మోక్షం సంపాదించారు.ఆ జ్ఞానం గురించి మరలా నీకు నేను చెబుతాను.

Tuesday, 17 December 2024

క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం

క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞానచక్షుషా। భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్॥35॥ ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశాధ్యాయః శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ముందర మనం క్షేత్రము,క్షేత్రజ్ఞుడు మధ్య తేడా తెలుసుకో గలగాలి.వికార సహితమయిన ఈ ప్రకృతి నుండి ముక్తి పొందే మార్గం కనుక్కోవాలి.అంటే,సర్వభూతాలకు సహజ సిద్థంగా వుండే వికారాలు,మాయా బంథాలనుంచి బయటపడే మార్గం,తమ తమ జ్ఞాన నేత్రాలతో చూడగలగాలి.అలా ప్రామాణికంగా చూడగల మహాత్ములు ఆ పరబ్రహ్మ,పరమాత్మను చూడగలుగుతారు,చేరుకోగలుగుతారు.అంటే ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞులను చూడగలిగే కళ్ళనే మనం జ్ఞానం అని అంటాము.ఎందుకంటే జ్ఞానం పరమాత్మ సాక్షాత్కారానికి తొలి మెట్టు.

Monday, 16 December 2024

యథా ప్రకాశయత్యేకః

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః। క్షేత్రంక్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత॥34॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి సులభతరంగా అర్థం కావాలి అని శతవిథాల ప్రయత్నిస్తున్నాడు.హే అర్జునా!హే భరతశ్రేష్టా!సూర్యుడు ఒక్కడే కదా ఉండేది. కానీ ఆయన ఈ జగత్తునంతా ప్రకాశింప చేస్తున్నాడు కదా!అలాగే క్షేత్రజ్ఞుడు అయిన పరమాత్మ క్షేత్రములు అయిన సర్వ దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు.వాటిని చేతనత్వముతో నింపుతున్నాడు.

Sunday, 15 December 2024

యథా సర్వగతం సౌక్ష్మాత్

యథా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యత్। సర్వత్రావస్థితో దేహే తథాఽఽత్మా నోపలిప్యతే॥33॥ శ్రీమద్భగవద్గీతా...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా ఆకాశం అంతటా వ్యాపించి వుంటుంది అని.కానీ అది సూక్ష్మభావం వలన దేనినీ అంటదు.సరిగ్గా ఈ గుణం మనదేహంలో వుండే ఆత్మకు కూడా వర్తిస్తుంది.అలా ఎలా?ఎందుకు?అని అంటావా?చెబుతా విను.ఆత్మ అనేది గుణాలకు అతీతమయినది.కాబట్టి అది వివిథ శరీరాలలో ఉన్నా,వాటి గుణాలు ఏవీ దానికి లిప్యంకావు.అంటే అంటనే అంటవు.

Friday, 13 December 2024

అనాదిత్వాన్నిర్గుణత్వాత్

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాఽయ మవ్యయః। శరీరస్థోఽపి కౌంతేయ!న కరోతి న లిప్యతే॥32॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి అర్థం అయేలా చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!పరమాత్మ అనేదానికి పుట్టుక లేదు.ఎలాంటి వికారాలు,వాసనలు,గుణగణాలు లేవు.అది మన దేహంలో ఉంటుంది.పరమాత్మ నిర్వికారంగా,నిరామయంగా,చావు పుట్టుకలు లేని,అవినశ్వరమయిన కారణంగా అది దేహంలో వున్నా కర్తృత్వంగానీ,కర్మఫలంగానీ అంటకుండా ఉంటుంది.ఇవేవి దానికి అంటవు,ఉండవు.

యదా భూతపృథగ్భావం

యదా భూతపృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి। తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా॥31॥ శ్రీమద్భగవద్గీత....త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!మొదట మనం అన్ని భూతాలను ఆత్మపరంగా చూడటం నేర్చుకోవాలి.ఈసృష్టిలో వుండే ప్రతి అణువు పరమాత్మ నుండే పుట్టిందని గ్రహించాలి.అంతేకాదు.అవన్నీ కూడా ఆత్మగతమై,సర్వత్రా నిండి వున్నాయని అర్థం చేసుకోవాలి.ఇదంతా జీర్ణించుకున్న మానవుడే బ్రహ్మత్వాన్ని పొందగలడు.ఈ మహనీయమయిన దశ మానవుడికి ఎప్పుడు ప్రాప్తిస్తుందో,ఆ క్షణంలోనే బ్రహ్మలో ఐక్యంకాగలడు.

Thursday, 12 December 2024

ప్రకృత్త్యెవ చ కర్మాణి

ప్రకృత్త్యెవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః। యః పశ్యతి తథాఽఽత్మానం అకర్తారం స పశ్యతి॥30॥ శ్రీమద్భగవద్గీత....త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి సులభంగా రెండు ముక్కలలో చెబుతున్నాడు.అర్జునా!మొదట అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.ఆత్మకు కర్తృత్వము అనేది లేదనే విషయం బుర్రకు ఎక్కించుకోవాలి.ఆత్మ అనేది ఎవరి ఆధీనంలో ఉండదు అని ముందు గ్రహించాలి.ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని.

Wednesday, 11 December 2024

సమం పశ్యన్ హి సర్వత్ర

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం। న హినస్త్యాత్మనాఽఽత్మానం తతో యాతి పరాం గతిమ్॥29॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ద్రష్ట అనేవాడి గురించి ఇప్పుడు చెప్తాను,తెలుసుకో.ద్రష్ట అని ఎందుకు అన్నానంటే,ఆ పురుషుడు సర్వత్రా సమభావంతో స్థితుడు అయిన పరమేశ్వరుడిని సమానంగా చూడగలుగుతాడు.అలాంటివాడు తనను తాను ఎప్పుడూ వినష్ట పరుచుకోడు.ఎందుకంటే ఎలా వుండేదానిని అచ్చం అలాగే చూస్తాడు.దానికి ఎక్కువ తక్కువలు ఆపాదించడు.కాబట్టి అతను పరమగతిని పొందుతాడు.

Monday, 9 December 2024

సమం సర్వేషు భూతేషు

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం। వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి॥28॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు చెపుతున్నాడు.అర్జునా! భగవంతుడు అనేవాడు సర్వ భూతాలలోనూ సమంగా ఉంటాడు.అతనికి ఒకరు ఎక్కువ,ఇంకొకరు తక్కువా కాదు.ఒకటి ఎక్కువ,ఇంకొకటి తక్కువా కాదు.ఆ భూతాలు నశించినా తాను మటుకు నాశనం కాడు.అంటే సర్వ ప్రాణికోటి నశించినా,తాను మాత్రం అజరామరంగా,శాశ్వతంగా ఈ చరాచర సృష్టి ఉన్నంత వరకూ ఉంటాడు.అలాంటి పరమేశ్వరుడిని చూడగలిగినవాడు మాత్రమే నిజమైన ద్రష్ట.

Saturday, 7 December 2024

యావత్సంజాయతే కించిత్

యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమం। క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ॥27॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి చెపుతున్నాడు.అర్జునా!ఈచరాచరజగత్తు మొత్తం స్థావర జంగమమయినది.ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం నుంచి జనించినదే.స్థావరం అంటే ఒకేచోట నిలబడి ఉండేది.జంగమం అంటే కదలిక ఉండేది అని అర్థం.ఈ విషయాన్ని నువ్వు ముందు తెలుసుకోవాలి.

Friday, 6 December 2024

అన్యే త్వేవ మజానంతః

అన్యే త్వేవ మజానంతః శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే। తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః॥26॥ శ్రీమద్భగవద్గీత..।త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మతత్త్వము అనేది అందరికీ సులభంగా అర్థం కాదు కదా!అలా స్వతహాగా అర్థంచేసుకోలేని కొందరు తత్త్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు.ఇలా ఆత్మతత్త్వం గురించి తెలియకపోయినా,మనసా,వాచా,కర్మణా అభ్యాసం చేసేవారు కూడా మృత్యురూపమయిన సంసారము నుంచి తరిస్తారు.ఇందులో ఎలాంటి అనుమానంలేదు.

Thursday, 5 December 2024

ధ్యానే నాత్మని పశ్యంతి

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మాన మాత్మనా। అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే॥25॥శ్రీమద్భగవద్గీత...క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము త్రయోదశాధ్యాయము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొందరు ఆపరమాత్మను పరిశుద్థమయిన సూక్ష్మ బుద్థితో హృదయంలో చూస్తున్నారు.కొందరు యోగ ధ్యానంతో చూస్తున్నారు.మరి ఇంకొందరు జ్ఞానయోగం సహాయంతో చూస్తున్నారు.ఇంకొక వర్గం నిష్కామయోగంను ఆశ్రయించి,దాని ద్వారా పరమాత్మను దర్శిస్తున్నారు.ఇలా ప్రతి ఒక్కరూ వారి వారికి తగిన రీతిలో,పరంథాముడిని చేరేదానికి కృషి చేస్తున్నారు.

Tuesday, 3 December 2024

య ఏవం వేత్తి పురుషం

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ। సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే॥24॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇలా అందరూ జీవుని గురించి,గుణాలతో వున్న ప్రకృతి గురించి తెలుసుకోవాలి.ఇలా అన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు ఎలాంటి కర్మలను చేసినా తిరిగి జన్మించడు.అంటే మోక్షం సంపాదిస్తాడు.

Monday, 2 December 2024

ఉపద్రష్టానుమంతా చ

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః। పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః॥23॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!భగవంతుడు మన దేహంలోనే ఉంటాడు.అతనినే పరమాత్మ అని అంటాము.కానీ దేహానికి అతీతుడు.ఆ విశ్వేశ్వరుడు,పరంథాముడు,పరమాత్మ స్వతంత్రుడు.ఈ జగత్తుకంతా అనుకూలంగా అనుమతిని ఇచ్చేవాడు.ఈ విశ్వంలో జరిగే ప్రతి చిన్న కదలికకు కూడా సాక్షిమాత్రుడు.సర్వ జగత్తును పోషించేవాడు,పాలించేవాడు.ఈ సృష్టికి అంతా యజమాని అతనే.ఈ చరాచర జగత్తును అంతా పర్యవేక్షిస్తుంటాడు.అతడు దివ్య భోక్త.

Sunday, 1 December 2024

పురుషః ప్రకృతిస్థో హి

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్। కారణం గుణసంగోఽస్య సదసద్యోని జన్మసు॥22॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి సవివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈజీవుడు అనే వాడు ఉన్నాడు కదా!వాడు ప్రకృతికృత దేహగతుడు.అంటే ఈప్రకృతి ఇచ్చిన దేహం కలవాడు.అయినాకూడా అదే ప్రకృతిచే ఉత్పాదితాలు అయిన గుణాలవలన సుఖదుఃఖాలు,ఇతరమయిన క్లేశాలు అనుభవిస్తున్నాడు.వివిధ,పలు రకాల యోనులందలి జన్మలకు గుణ సంగమమే కారణము.అంటే ప్రకృతి మన దేహాలకు కారణభూతము అవుతుంది.అలాగే మనలో పుట్టే రకరకాల గుణాల వల్ల ఉత్పన్నమయే సుఖదుఃఖాలకూ కారణభూతము అవుతుంది.