Saturday, 31 May 2025

అభియంధాయ తు ఫలం

అభిసంధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్। ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసమ్॥12॥ శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజస యజ్ఞం గురించి వివరిస్తున్నాడు.హే అర్జునా!భరతులలో శ్రేష్టుడా!నా ఈ మాటలు విని అర్థం చేసుకో!మాములుగా మనం ఏ పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి.గొప్పలకు పోయి సమాజం లో,తనవారిలో గుర్తింపుకోసం చేయకూడదు అని చెప్పాను కదా!కానీ ఫలాపేక్షతో కానీ,డాంబికానికి గానీ యజ్ఞం చేసే వర్గం ఉంటుంది.అలా చేయబడే యజ్ఞాన్ని రాజస యజ్ఞంగా భావించు,గ్రహించు.

Friday, 30 May 2025

అఫలాకాంక్షి భిర్యజ్ఞో

అఫలా కాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే। యష్టవ్య మేవేతి మన స్సమాధాయ స సాత్త్వికః॥11॥ శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!ఇప్పుడు నీకు నేను సాత్త్విక పరమయిన యజ్ఞం గురించి చెబుతాను.మనసు పెట్టి విని అర్థం చేసుకో.ఏది అయినా మనం మనసు పెట్టి,శాస్త్రాన్ని అనుసరించి చెయ్యాలి.అందునా యజ్ఞం అంటే నిష్ట నియమాలుకూడా అవసరము.సమాహిత చిత్తంతో చేయాలి.అంటే మనము చేసే ఏ పని కూడా మన ఒక్కరికే కాదు అందరికీ మంచి చేకూరేలా ఉండాలి.ఎంత సేపూ ఇది చేస్తే నాకేంటి?అనే భావన లేకుండా ప్రతి ఫలం ఆశించకుండా చేయాలి.ఇలా ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞాన్నే సాత్త్విక యజ్ఞం అంటారు.

Thursday, 29 May 2025

యాతయామం గతరసం

యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్। ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్॥10॥ శ్రామద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తామసుల యొక్క ఆహారపు అలవాట్లు గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక తామసులు ఇష్టంగా ఏమేమి తింటారో మాట్లాడుకుందాము.వాళ్ళకు జాము క్రితం వండినది నచ్చుతుంది.అది శక్తి ఇచ్చేది కాకపోయినా,సారహీనమయినా సరే!చెడిపోయి,దుర్వాసన వస్తూ,పాచిపోయిన ఆహారం నచ్చుతుంది.ముందరరోజు వండినది,వేరేవాళ్ళు తినగా మిగిలినది,అపవిత్రమయినది,అశుద్ధమయినదీ అయిన ఆహారం తామసులకు ప్రీతిని ఇస్తుంది.సహజంగా నిన్న,మొన్న వండిన ఆహార పదార్థాలకు ఇలాంటి గుణాలు ఉంటాయి.

Wednesday, 28 May 2025

కట్వామ్ల లవణాత్యుష్ణ

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః। ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః॥9॥ శ్రీమద్భగవద్గీత..।।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజసులకు ఏది ప్రీతికరమో చెబుతున్నాడు.వాటి పర్యవసానం కూడా చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక రాజసులు ఎలాంటి ఆహారం ఇష్ట పడతారో చెబుతాను.వాళ్ళు చేదు,పులుపు,ఉప్పులు,కారాలు ఎక్కువగా ఇష్టపడతారు.ఇంకా అతివేడి,అతి కారం,ఎండి పోయినవి,దాహంకలిగించే ఆహారమంటే మక్కువ చూపిస్తారు.వీటిని వాళ్ళు ఇష్టంగా తింటారు.ఈ ఆహారపు అలవాట్ల వలన కార్యక్రమేణ పరిణామావస్థలో దుఃఖాన్నీ,వ్యాకులతను మూటకట్టుకుంటారు.ఇవి చాలా మటుకు రోగకారకాలు.కాబట్టి రోగాల బారిన పడుతుంటారు.

Tuesday, 27 May 2025

ఆయు స్సత్త్వ బలారోగ్య

ఆయు స్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః। రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారా స్సాత్త్వికా ప్రియాః॥8॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్వికమయిన ఆహారపు అలవాట్లగురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నీకు నేను ఇప్పుడు సాత్త్విక పరమయిన ఆహారపు అలవాట్లు గురించి చెపుతాను.వాటిని ఆకళింపు చేసుకో.సాత్త్విక మయిన ఆహారం మన ఆయువుని వృద్ధి చేస్తుంది.అంతే కాదు సుమా!మనలో ఉత్సాహాన్ని నింపుతుంది.బలాన్ని పెంచుతుంది.ఆరోగ్యాన్ని సర్వ వేళలా కాపాడుతుంఒది.సుఖాన్ని,ప్రీతిని పెంపొందిస్తుంది.ఆ ఆహారం రుచికరంగా ఉంటుంది.చమురు కలిగి ఉంటుంది.పుష్టిని కలిగిస్తుంది.అలాంటి ఆహారమే సాత్త్వికమయిన ఆహారము.

Monday, 26 May 2025

కర్శయన్త శ్శరీరస్థం

కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః। మాం చై వాన్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్॥6॥ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః। యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు॥7॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము శ్రీకృష్ఞుడు అర్జునుడికి మనకు ఉండవలసిన ఆహారపు అలవాట్లను కూడా చెబుతున్నాడు.దీనితో అర్థం అవుతుంది కదా శ్రీకృష్ణుడు ఎంత నిదానంగా,ఓపికగా,అర్థం అయ్యేలా,అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెబుతున్నాడో!ఆసుర స్వభావం కలవారు వారితో బాటే నన్ను కూడా క్షోభ పెడతారు అని చెప్పాను కదా!వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చెబుతాను.అలాగే వారి తపస్సు,దానం చేసే ప్రక్రియలు కూడా ఎలా ఉంటాయో చెబుతాను.ఎందుకంటే ఇవన్నీ కూడా తమ తమ గుణాలను అనుసరించే ఉంటాయి.వాటిని కూడా విను. అన్నం ఉడికిందా లేదా అనేదానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోతుంది కదా!అలానే ఒక మనిషి స్వభావం వారి ప్రతి కదలికలో,హావభావాలలో ఎదుటివారికి తెలిసిపోతుంది.ఒక నవ్వు,ఒక చూపు,ఒక పలుకు చాలు.

Sunday, 25 May 2025

అశాస్త్రీయ విహితం ఘోరం

అశాస్త్ర విహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః। దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః॥5॥ కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః। మాం చై వాన్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్॥6॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునా!శాస్త్రం మనలని కొన్ని చేయమంటుంది .ఇంకొన్నిటికి దూరంగా ఉండమంటుంది.పదే పదే వద్దని వారిస్తుంటుంది.వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని,మనకు అన్వయించుకోవాలి.శాస్త్ర నిషిద్ధాలు అయిన తపస్సులను,దారుణమయినటువంటి కర్మలను చేయకూడదు.అలాంటి దుష్కర్మలు చేసేవారు దంభాహంకార కామరాగాలతో కూడిన వారు అవుతారు.వాళ్ళు వాళ్ళ శరీరాలను,ఇంద్రియాలను కష్టపెడతారు.అది అంతటితో ఆగిపోదు.చివరకు వారి వారి శరీరాలలో ఉండే నన్నుకూడా క్షేభ పెడతారు.ఇలా చేసే వారందరూ అసుర స్వభావం కలవారే.ఆ విషయాన్ని గ్రహించు.

Saturday, 24 May 2025

యజన్తే సాత్త్వికా దేవా

యజన్తే సాత్త్వికా దేవా న్యక్షరక్షాంసి రాజసాః। ప్రేతా న్భూత గణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః॥4॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సర్వ ప్రాణికోటికీ భగవంతుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు మానవాకారంలో శ్రీకృష్ణుడుగా జన్మించి,సహవాసి అయిన అర్జునుడితో యుద్ధభూమిలో నిలబడి ఇలా అంటున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడే మూడు రకాలు అయిన శ్రద్ధలగురించి ప్రస్తావించాను కదా!అవే సాత్త్విక,రాజస,తామస శ్రద్ధలు.అలా ఎందుకు ఆ ఆ శ్రద్దలు అలా ఉత్పన్నమవుతాయో చెబుతాను,విను.సహజంగా సాత్త్వికులు దేవతలను పూజిస్తారు.కాబట్టి వారికి సాత్త్వికమయిన శ్రద్ధలు అలవరుతాయి.అదే రాజసులు యక్షరాక్షసాదులని పూజిస్తారు.కావున వారికి రాజస పరమయిన శ్రద్ధలు ఏర్పడతాయి.చివరికి తామసుల గురించి చెప్పుకుందాము.వీరు భూతప్రేతాలను పూజించేదానికి మక్కువ చూపిస్తారు.అలాగే వాటిని పూజిస్తుంటారు.తదనుగుణంగా వారికి తామస శ్రద్ధలు ఉత్పన్నమవుతాయి.

Friday, 23 May 2025

సత్త్వానురూపా సర్వస్య

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత। శ్రద్ధామయోఽయం పురుషో యో య చ్ఛ్రద్ధ స ఏవ సః॥3॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఓ భారతా!సర్వప్రాణికోటికి అంతఃకరణమనేది ఒకటి ఉంటుంది కదా!వారి వారి అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ అనేది పుడుతుంది.శ్రద్ధ లేనివాడు అసలు ప్రాణులలో లేనేలేడు.ఒకడిలో శ్రద్ధ అనేది ఏరూపంలో,ఏమాత్రంగా ఎలా ఉంటుందో,వాడూ అలాంటి వాడే అవుతాడు.శ్రద్ధ అంటే ఒక విషయం పైన మనకు ఉండే నమ్మకం,నిష్ట,నియమాలు.మనకు దేని పైన అయినా నమ్మకం ఉంటేనే కదా దానిని ఆచరిస్తాము.కాపాడుకుంటాము.చెడిపోకుండా చూసుకుంటాము.చెడగొట్టకుండా ఉంటాము.ఈ కార్యాలనే నిష్ట,నియమాలు అంటాము.

Thursday, 22 May 2025

త్రివిధా భవతి శ్రద్ధా

శ్రీ భగవానువాచ... త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా। సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు॥2॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి వచ్చిన అనుమానాలన్నిటినీ ఓపికగా విన్నాడు.ఇంక సందేహ నివృత్తి చేసేదానికి నడుము బిగించాడు.అర్జునా!ఈ ఆత్మలు మనష్యులు చిరుగిన బట్టలు మార్చినట్లుగా శరీరాలను మారుస్తాయి అని చెప్పాను కదా!కాబట్టి ఎవరికి వారికి వారి వారి పూర్వజన్మల వాసనలు ఉంటాయి.ఆ పూర్వజన్మల వాసనలను అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్త్విక,రాజస,తామస గుణాలు,లేక వాటి పట్ల శ్రద్ధ,మక్కువ ఏర్పడతాయి.వాటిని అన్నిటి గురించి చెబుతాను,విను.

Wednesday, 21 May 2025

యే శాస్త్ర విధి ముత్సృజ్య

అర్జున ఉవాచ... యే శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః। తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వ మాహో రజస్తమః॥1॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము కృష్ణుడు చెప్పిందంతా అర్జునుడు మనసు లగ్నం చేసి విన్నాడు.మంచి విద్యార్ధులకే అనుమానాలు వస్తాయి.ఎందుకంటే వాళ్ళలో గురువు చెప్పేదంతా ఆకళింపు చేసుకోవాలనే తపన ఉంటుంది.ఆ క్రమంలోనే అనుమానాల దొంతరలు బయటపడతాయి.వీటన్నిటికీ గురువు అనేవాడు ఓపికగా సందేహ నివృత్తి చేయాలి.అప్పుడే ఆగురుశిష్యుల బంధం బలపడుతుంది.శిష్యుడు మంచిగా ఎదిగేదానికి దోహద పడుతుంది. ఇక్కడ కూడా అలాగే అర్జునుడు తనకు వచ్చిన అనుమానాలు,సందేహాలను అన్నిటినీ కృష్ణుడి ముందు ఉంచుతున్నాడు. కృష్ణా!హే యాదవా!శాస్త్ర విధులను అందరూ సరిగ్గా నిర్వర్తించలేరు కదా!ఒక్కొక్కసారి అతిక్రమించాల్సి వస్తుంది కదా!అతిక్రమిస్తారు కూడా.అలా శాస్త్ర విధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు ఏ కోవలోకి వస్తారు?వారు సాత్త్వికులా,రాజసులా లేక తామసులా?వారి ఆచరణ ఎలాంటిది?

Tuesday, 20 May 2025

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ। జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి॥24॥ శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగోనామ షోడశోఽధ్యాయః!!!! శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్దునుడికి ఇలా సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు దైవాంశలో పుట్టిన వారి గుణగణాలు,ఆసురీ అంశతో పుట్టిన వారి గుణగణాలు విఫులంగా విశదీకరించాను కదా!యుక్తాయుక్త విచక్షణకు ప్రతి ఒక్కరికీ వేదశాస్త్రాలే ప్రామాణికాలు.కాబట్టి అందరూ వాటిలో చెప్పబడిన ధర్మాలనే గ్రహించాలి.ఆ ధర్మాలకు అనుగుణంగా మన కర్మలను పాటించాలి.వాటిని ఎప్పుడూ అతిక్రమించకూడదు.ఇది నా హితవు. ఇట్లు ఉపనిషత్తు,బ్రహ్మవిద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీ కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అనే పదహారవ అధ్యాయము సమాప్తము అయినది!!!!

Monday, 19 May 2025

య శ్శాస్త్రవిధి ముత్సృజ్య

య శ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః। న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్॥23॥ శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఖరాఖండిగా ఈ విషయం చెబుతున్నాడు.అర్జునా!వేదశాస్త్రాలు అనేవి సర్వ మానవ కోటికి ప్రామాణికాలు.అవి చెప్పిన మాటలోనే,బాటలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవటం సర్వమానవాళికి ఉత్తమం.వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు.అంతా మా ఇష్టం.మాకు నచ్చినదే చేస్తాము,నచ్చినట్లే ఉంటాము అనుకునే స్వేచ్ఛాచార పరాయణులు కొందరు ఉంటారు.వాళ్ళకు అథోగతి అనివార్యం.వాళ్ళ దుష్కర్మలకు శాంతి దక్కే మార్గమేలేదు.ఇంక మోక్షం ఊసు ఎత్తే అర్హత ఎక్కడనుంచి వస్తుంది?కాబట్టి మంచి మార్గంలో నడవటం అలవాటు చేసుకుందాము.

Sunday, 18 May 2025

ఏతైర్వి ముక్తః కౌంతేయ

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రి భిర్నరః। ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాంగతిః॥22॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా విశదీకరిస్తున్నాడు.పరీక్షలో ప్రతి తప్పుకు _మార్కులు ఉన్నాయి అంటే తప్పులు రాయకుండా ఉంటేనే కదా కనీసం సున్నా వచ్చేది.ఆ తరువాత సరిగా వ్రాసిన జవాబులకు +లో మార్కులు వచ్చేది.అలాగే ఇక్కడ కూడా.కౌంతేయా!మానవుడు ముందు నరకానికి రాచమార్గాలు అయిన కామాన్ని,క్రోథాన్ని,లోభాన్ని విడనాడాలి.వేరే గత్యంతరము లేదు.అవి విసర్జిస్తేకానీ మనసు తపస్సు,యోగము వైపుకు మనసు మరలదు.తపస్సు,యోగములను అకుంఠిత దీక్షతో పాటిస్తేకానీ ఆత్మజ్ఞానం కలుగదు.ఆత్మజ్ఞానం కలిగితేకానీ మోక్షం పొందలేడు.కాబట్టి వీటిని అన్నిటినీ ఒకదాని తరువాత ఇంకొకటి చేపట్టి మన మార్గం సుగమం చేసుకోవాలి,మోక్షం పొందాలి.

Saturday, 17 May 2025

త్రివిధం నరకస్యేదం

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః। కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేత త్త్రయం త్యజేత్॥21॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి హితం చెబుతున్నాడు.అర్జునా!ఆసురీ స్వభావం కలవారి గుణగణాలు,వారి పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పాను కదా!కౌంతేయా!కామము,క్రోథము,లోభము అనేవి మూడూ నరకద్వారాలు.మనము చెడు మార్గంలో వేసే ప్రతి అడుగు మనలను ఆనరకానికి చేరువ చేస్తుంటుంది.మనము తప్పు చేసిన ప్రతి సారీ ఇంకొక సారి ఇలా జరగదు లే అని మనలను మనం మభ్య పెట్టుకుంటుంటాము.కానీ అదే చిలికి చిలికి గాలి వాన అవుతుంది.కాబట్టి మనము ఏదారిలో నడవాలి,ఏదారిలో ఉన్నాము అనే స్పృహతో ఉండాలి.ఎందుకంటే ఈ కామక్రోథ మదలోభాలు ఆత్మజ్ఞాన నాశనకారకాలు.మాములుగానే మనము మాయలో కప్పబడి ఉంటాము.దానికి తోడు ఇవన్నీ కలిసి వచ్చాయంటే మనలను సర్వనాశనం నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుర్గుణాలను విడిచి పెట్టాలి.

Friday, 16 May 2025

ఆసురీం యోనిమాపన్నా

ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని। మా మప్రాప్త్యెవ కౌంతేయ తతో యాన్త్యధమాం గతిమ్॥20॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!కౌంతేయా!ఇందాక నేను చెప్పినటువంటి మూర్ఖులను ఈ జన్మలోనే కాదు,ఏజన్మలోను బాగుపరచలేము.ఎందుకంటే అలాంటి మూర్ఖులు ప్రతి జన్మలోనూ ఆసుర శరీరాలనే పొందుతారు.అకృత్యాలనే చేస్తుంటారు.ఎప్పటికీ నన్ను చేరుకోలేరు.అంతకంతకూ ఇంకా దిగజారిపోతూ నీచమయిన యోనులలో పడిపోతుంటారు.అంటే హీనమయిన జన్మలను పొందుతుంటారు.

Thursday, 15 May 2025

తానహం ద్విషతః కృూరా

తానహం ద్విషతః కృూరా న్సంసారేషు నరాధమాన్। క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు॥19॥ శ్రీమద్భగవద్గీత... షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఆసురీ స్వభావం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారు ఎప్పుడూ విర్రవీగుతూ ఉంటారు కదా!ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతాను,విను.ఆది మధ్యాంత రహుడిని అయిన నన్ను తుస్కారంగా,లెఖ్ఖ లేని తనంగా నాయందు ద్వేషంగా,కృూరంగా ప్రవర్తించే ఆసురీ స్వభావంకలవారికి మళ్ళీ మళ్ళీ నీచమయిన ఆసురీ జన్మలనే కలుగ జేస్తాను.ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలకు,ఘోరాలకూ అంతమనేది ఉండదు.

Wednesday, 14 May 2025

ఆత్మ సంభావితాః స్తబ్ధా

ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః। యజంతే నామయజ్ఞైస్తే దమ్భేనా విధిపూర్వకమ్॥17॥ అహంకారం బలం దర్పం కామం క్రోథం చ సంశ్రితాః। మామాత్మ పరదేహేషు ప్రద్విషన్తోఽభ్యసూయకాః॥18॥ శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా! ఈ ఆసురీ స్వభావం గలవారికి ఆత్మస్తుతి,అతిశయం,ఐశ్వర్యమత్తతా ఎక్కువగా ఉంటుంది.దాని కారణంగా తరచూ శాస్త్రాన్ని ఉల్లంఘిస్తుంటారు.అంటే అతిక్రమిస్తుంటారు అన్నమాట.కానీ పేరుకోసం,గొప్పలకోసంప్రాకులాడుతుంటారు.కాబట్టి డాంబికంగా యాగాలు,యజ్ఞాలు చేస్తుంటారు.వీళ్ళకు లేని దుర్గుణాలు అంటూ ఏమీ ఉండవు.కామం,క్రోధం,అహంకారం,బలం,దర్పం ఇత్యాదులు వీరి చెంతనే సదా ఉంటాయి.అసూయాపరులు అయి ఉంటారు.వాళ్ళలో ఉండేదీ నేనే!మిగిలిన వారిలో ఉండేది నేనే!ఇంత సుస్థిరుడుగా ఉన్న నన్ను గుర్తించరు.నన్ను తిరస్కరిస్తారు.ఇదే వారి అజ్ఞానానికి,అహంకారానికీ పరాకాష్ఠ.

ఇదమద్య మయా లబ్ధం

ఇదమద్య మయా లబ్ధ మిదం ప్రాప్స్యే మనోరథమ్। ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్॥13॥ అసౌ మయా హతశ్శత్రు ర్హనిష్యే చాపరానపి। ఈశ్వరోహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ॥14॥ ఆఢ్యోఽభి జనవా నస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా। యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః॥15॥ అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః। ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ॥16॥ శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కలవారికి అభిజాత్యం ఎక్కువ ఉంటుంది.ఎంత సేపూ ఏదో ఒక యావలో ఉంటారు.వారి ఆలోచనలు ఎలా ఉంటాయో చెబుతాను,చూడు.ఇది నాకు లభించింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది.ఇంకా ఈ మాత్రం వస్తుంది.ఇంక ఎంత వస్తే బాగుంటుంది.ఈ శత్రువును చంపాను.కలుగుల్లో ఉన్న శత్రువులనందరినీ చంపేస్తాను.శత్రుశేషం లేకుండా పోతుంది.నేను సర్వాధికారిని.నేనే గొప్ప.నా కంటే తోపు ఇంకెవరూ లేరు.నేనే అందరికంటే బలవంతుడిని.అనుకుంటే ప్రతి ఒక్కరినీ తుక్కు తుక్కు చేయగలను.పోనీలే అని వదిలేస్తున్నాను.నా అంత సుఖ పురుషుడు ఇంకోడు లేడు.అందరి కంటే నేనే ధనవంతుడిని.స్వర్గసుఖాలు,సర్వభోగాలు అనుభవిస్తున్నాను.నన్ను ఎదిరించే మగాడు లేడు,ఇక పుట్టబోడు.నాకు ఏ విషయం లోనూ సమ ఉజ్జీ లేడు.యాగాలు చేస్తాను.దానాలు చేస్తాను.నా పేరు,నా గొప్పదనం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది.ఆనందం అంతా నా సొత్తే! ఇలా ఎంత సేపూ నేను,నా అనే దుగ్థలో మునిగి తేలుతూ ఉంటారు.అనేక వికారాలతో కూడిన వికలిత మనస్కులు అవుతారు.ఎంత సేపూ కామోప భోగాలలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.ఆఖరున నరకానికి చేరుతారు.

Tuesday, 13 May 2025

చింతా మపరిమేయాం చ

చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః। కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాఽ॥11॥ ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః। ఈహంతే కామభోగార్ధ మన్యాయే నార్ధసంచయాన్॥12॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారి గురించి ఇంకా చెబుతాను,విను.వీళ్ళు ఎప్పుడూ కామం,క్రోథంలను విడిచి పెట్టరు.అవి కూడా వీరిని విడిచి పెట్టవు.వాటి కబంథ హస్తాలలో వీళ్ళు చిక్కుకుని వుంటారు.ప్రాపంచిక మయిన విషయాలే జీవిత పరమావథిగా,పురుషార్థంగా భావిస్తారు.వాటిని అనుభవించడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు.దాని కోసం నిత్యం అక్రమ మార్గాలలో ధనం సంపాదించే పనిలో పడతారు.జీవితాంతం నిత్యమూ ఆశాపాశాల ఊబిలో చిక్కుకుని,బయట పడలేక గిల గిల లాడుతుంటారు.వారికి కామక్రోధాలు అనే సుడిగుండాల నుంచి బయట పడే మార్గమే ఉండదు .వాళ్ళుకూడా బయటపడాలని కోరుకోరు.

Sunday, 11 May 2025

కామ మాశ్రిత్య దుష్పూరం

కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమాన మదాన్వితాః। మోహాత్గృహీత్వాఽసద్గ్రహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః॥10॥శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గల వారి గురించి ఇంకా చెబుతాను, విను.వీళ్ళు ఎప్పుడూ కామాన్ని ఆశ్రయిస్తారు.దాని కారణంగా దంభం,దురభిమానము ఎక్కువగా వుంటుంది.అంటే గర్వం,మదం,భేషజం ఎక్కువగా ఉంటాయి.మదపూరితులై ఉంటారు.ఎప్పుడూ మూర్ఖపు పట్టుదలలతో అల్లాడుతూ ఉంటారు. వారు చేసే పనులు సహేతుకమా,కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు.ఇలా మూర్ఖపు పట్టుదలలకు పోయి అపవిత్రతా దీక్షితులు అవుతుంటారు.తప్పు పనులు చేస్తుంటారు.ఆ తప్పుడు మార్గంలోనే వెళుతుంటారు.

Saturday, 10 May 2025

ఏతాం దృష్టి మవష్టభ్య

ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః। ప్రభవ న్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః॥9॥ శ్రీమద్భగవద్గీత..।షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఆసురీ స్వభావం గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కల వారు ఉన్నారే!వారంతా అల్ప బుద్ధి కలిగిన వాళ్ళు.వాళ్ళ వలన ప్రపంచానికి పైసా లాభం లేదు.వాళ్ళ ఉనికి నిష్ప్రయోజకం,అంతే.వారి పనులు వలన లోకానికి ఇసుమంత అయినా లాభం ఉండదు.అంతేనా?వాళ్ళు చేసే తప్పులు,ఘాతుకాల వలన ప్రపంచానికి హాని జరుగుతుంది.అన్నీ మానవాళికి నష్టం కలిగే పనులు చేయటంలో సిద్థహస్తులు.

Wednesday, 7 May 2025

అసత్య మప్రతిష్ఠం తే

అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్। అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్॥8॥ శ్రీమద్భగవద్గీత..షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఈ ఆసురీ స్వభావంకల వారి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావంకల వారు ఈ ప్రపంచం అంతా మిధ్య అంటారు.అంతేనా?ఈ జగత్తు అంతా అస్థిరం అని కూడా అంటారు.దేవుడు,దైవం అనే వాళ్ళు ఎవరూ లేరని బల్ల గుద్ది మరీ చెబుతారు.సృష్టికి మూల కారణం స్త్రీ పురుష సంయోగం తప్ప ఇంకొకటి కాదు,లేదు అని నొక్కి వక్కాణిస్తారు.కామం తప్ప ఇక వేరే ఏ కారణాలు లేవని గట్టిగా నమ్ముతారు.

Tuesday, 6 May 2025

ప్రవృత్తిం చ నివృత్తిం చ

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః। న శౌచం నాపి చాఽచారో న సత్యం తేషు విద్యతే॥7॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ముందర నీవు ఈ విషయం తెలుసుకోవాలి.ఆసురీ స్వభావం గలవారికి కర్మాకర్మ విచక్షణ ఉండదు.అంటే తప్పు ఒప్పుల తేడా వుండదు.ఏది అనిపిస్తే అది చేసే దూకుడు స్వభావం ఉంటుంది.ఒక్క క్షణం ఆగి మనం చేసే పని వలన ఎవరికైనా ఇబ్బంది,హాని జరుగుతుందాలేదా అని ఆలోచించరు.చివరికి వాళ్ళకే చెడు జరిగినా ఖాతరు చెయ్యరు.శుచిత్వం,సత్యం,సదాచారం అనేవి దివిటీ పెట్టి వెతికినా కానరావు.అంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా అన్నమాట!

Monday, 5 May 2025

దౌ భూతసర్గౌ లోకేఽస్మి

దౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ। దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు॥6॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలోని ప్రాణులంతా రెండు రకాలు.ఒకటో రకం దైవ స్వభావంతో ఉంటారు.రెండో రకం ఆసుర స్వభావంతో ఉంటారు.నేను నీకు దైవీ స్వభావంగురించి వివరంగా అర్థం అయేలా చెప్పాను.అలాగే ఆసుర స్వభావంగురించి కూడా చెబుతాను.

Sunday, 4 May 2025

దైవీ సంపద్విమోక్షాయ

దైవీ సంపద్విమోక్షాయ నిబంధా యాసురీ మతా। మా శుచ స్సంపదం దైవీ మభిజాతోఽసి పాండవ॥5॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఓ పాండవ మధ్యమా!ఓ అర్జునా!మనలో ఉండే దైవీ సంపద మనకు మోక్షం దక్కేలా చేస్తుంది.అదే ఆసురీ సంపత్తి సంసార బంధానిని కలిగిస్తాయి.అర్జునా!నువ్వు ఏమీ భయపడే పనిలేదు.ఎందుకంటే నువ్వు దైవీ సంపత్తిని జన్మించావు.మనము ఏ ఏ యోనుల నుంచి పుడతామో దానిని బట్టే మన జీవితము ఏ పంధాలో నడుస్తుంది అనేది మౌళికంగా అర్థమవుతుంది.

Friday, 2 May 2025

దంభో దర్పోఽభిమానశ్చ

దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ। అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్॥4॥ శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి రాక్షస గుణాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు.అర్జునా!రాక్షస గుణాల గురించి చెబుతాను.ఆసురీ సంపత్తి వల్ల పుట్టినవారు గర్వంతో విర్రవీగుతుంటారు.పొగరుమోతుదనం పుష్కలంగా ఉంటుంది.దురభిమానం పరాకాష్టలో ఉంటుంది.ఇంక క్రోధం,కోపం,తాపం అపరిమితంగా ఉంటాయి.పరుష స్వభావం సహజ సిద్థంగా ఉంటుంది.ఇన్ని దుర్గుణాలకు హేతుమూలమయిన అవివేకంకు కొదవు ఉండదు.ఇన్ని దుర్గుణాలు,ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నాయంటే వారు ఖచ్చితంగా రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అని అర్థం.

Thursday, 1 May 2025

అభయం సత్త్వసంశుద్థిః

శ్రీభగవానువాచ... అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యనస్థితిః। దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్॥1॥ అహింసా సత్య మక్రోధ స్త్యాగశ్శాంతి రపైశునమ్। దయా భూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రచాపలమ్॥2॥ తేజః క్షమా ధృతి శ్శౌచ మద్రోహో నాతిమానితా। భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత॥3॥ శ్రీమద్భగవద్గీత.. షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఇప్పుడు నీకు నేను ఏ ఏ గుణాలు వుండే వారిని దైవాంశ జాతులు అంటారో చెబుతాను,విను.భయం అనేది లేకుండా వుండాలి.పవిత్రమయిన అంతః కరణం ఉండాలి.ఆధ్యాతిక మయిన జ్ఞాన నిష్ట వుండాలి.దాన గుణం వుండాలి. ఆత్మనిగ్రహం ఉండాలి.యజ్ఞాచరణం వుండాలి.వేదాధ్యయనం,తపస్సు,సారళ్యం ఉండాలి.అహింస,సత్యం,కోపంలేకుండా వుండటం కావాలి.త్యాగం,శాంతి కావాలి.ఇతరుల తప్పులను ఎంచే ధోరణి లేకుండా వుండటం ముఖ్యం.మృదుత్వం,భూతదయ,నిర్లోభం ఉండాలి.అసూయ లేకుండా వుండాలి.గౌరవముల పట్ల ధ్యాస,ఆశ లేకుండా వుండాలి.పైన చెప్పిన గుణాలు అన్నీ వున్న వాళ్ళే దైవాంశ జాతులు అని తెలుసుకో.