Wednesday, 14 May 2025
ఇదమద్య మయా లబ్ధం
ఇదమద్య మయా లబ్ధ మిదం ప్రాప్స్యే మనోరథమ్।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్॥13॥
అసౌ మయా హతశ్శత్రు ర్హనిష్యే చాపరానపి।
ఈశ్వరోహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ॥14॥
ఆఢ్యోఽభి జనవా నస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః॥15॥
అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ॥16॥
శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగయోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కలవారికి అభిజాత్యం ఎక్కువ ఉంటుంది.ఎంత సేపూ ఏదో ఒక యావలో ఉంటారు.వారి ఆలోచనలు ఎలా ఉంటాయో చెబుతాను,చూడు.ఇది నాకు లభించింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది.ఇంకా ఈ మాత్రం వస్తుంది.ఇంక ఎంత వస్తే బాగుంటుంది.ఈ శత్రువును చంపాను.కలుగుల్లో ఉన్న శత్రువులనందరినీ చంపేస్తాను.శత్రుశేషం లేకుండా పోతుంది.నేను సర్వాధికారిని.నేనే గొప్ప.నా కంటే తోపు ఇంకెవరూ లేరు.నేనే అందరికంటే బలవంతుడిని.అనుకుంటే ప్రతి ఒక్కరినీ తుక్కు తుక్కు చేయగలను.పోనీలే అని వదిలేస్తున్నాను.నా అంత సుఖ పురుషుడు ఇంకోడు లేడు.అందరి కంటే నేనే ధనవంతుడిని.స్వర్గసుఖాలు,సర్వభోగాలు అనుభవిస్తున్నాను.నన్ను ఎదిరించే మగాడు లేడు,ఇక పుట్టబోడు.నాకు ఏ విషయం లోనూ సమ ఉజ్జీ లేడు.యాగాలు చేస్తాను.దానాలు చేస్తాను.నా పేరు,నా గొప్పదనం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది.ఆనందం అంతా నా సొత్తే!
ఇలా ఎంత సేపూ నేను,నా అనే దుగ్థలో మునిగి తేలుతూ ఉంటారు.అనేక వికారాలతో కూడిన వికలిత మనస్కులు అవుతారు.ఎంత సేపూ కామోప భోగాలలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.ఆఖరున నరకానికి చేరుతారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment