Thursday, 31 July 2025
ధృత్యా యయాధారయతే
ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః।
యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ!సాత్త్వికీ॥33॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ రకాల బుద్ధుల గురించి చెప్పాడు.అలాగే రకరకాల ధృతుల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ధృతి అంటే మన మాటల్లో ఓపిక అని అర్థము.ఓర్పు,సంకల్పబలము,నిగ్రహము,ధైర్యము,స్థిరత్వము...ఇలా చాలా అర్థాలు ఉన్నాయి.మొత్తానికి ధృతి అనేది మన మనోసంకల్పము,మనోబలమును,మనోధైర్యాన్ని సూచిస్తుంది.కృష్ణుడు అర్జునుడితో చెపుతున్నాడు.హే పార్థా!హే అర్జునా!సాత్త్విక ధృతి గురించి చెపుతాను,విను ..విని ఆకళింపు చేసుకో!మనసు,ప్రాణము,ఇంద్రియాలు ఉన్నాయి కదా!వాటన్నిటికీ వాటివాటి వృత్తులు,ప్రవృత్తులు ఉంటాయి కదా!వాటన్నిటినీ సరి అయిన మార్గములో నిగ్రహించ గలగాలి.మన లక్ష్యసాధనలో ఏదీ పక్కదారి పట్టకుండా,చెదిరిపోకుండా,నియంత్రణ చేయగలిగే పట్టుదలను సాత్త్విక ధృతి అని అంటారు.
Wednesday, 30 July 2025
అధర్మం ధర్మమితి యా
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాఽఽవృతా।
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్థ!తామసీ॥32॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ఞుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!ఇప్పుడిప్పుడే మనము సాత్త్విక,రాజస బుద్ధుల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు నీకు ఇంక తామస బుద్ధి యొక్క పూర్వాపరాలు వివరిస్తాను.ఈ తామస బుద్ధి అనేది ఉందే,అది అంతా అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉంటుంది.అందుకే మామూలుగా వక్రబుద్ధి అని కూడా అంటుంటాము.దేనినీ సవ్యంగా,న్యాయపరంగా,మంచిగా ఆలోచించదు.అధర్మాన్ని ధర్మపథంలాగా అన్వయించుకుంటుంది.ఏ విషయము అయినా సీదా సాదాగా తీసుకోదు.వక్రంగా,అపసవ్యంగా ఆలోచిస్తుంది,గ్రహిస్తుంది.ఇలాంటి విపరీతమయిన భావజాలం కలిగి ఉండేదే తామస బుద్ధి అంటే!
Sunday, 27 July 2025
యయా ధర్మమధర్మం
యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ।
అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థ!రాజసీ॥31॥
శ్రీమద్భగవద్గీత..అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఇప్పుడిప్పుడే అర్జునుడికి సాత్వికబుద్ధి గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక రాజస బుద్ధి గురించి చెప్పటం మొదలుపెట్టాడు.హే పార్థా!హే అర్జునా!సాత్విక బుద్ది అంటే ఎలా ఉంటుందో అర్థం అయింది కదా!రాజస బుద్ధి ఎలా ఉంటుందో చెబుతాను విను.ధర్మము-అధర్మము,కార్యము-అకార్యము..ఇలా ద్వంద్వాలు ఉన్నాయి కదా!వీటి అసలు అయిన జ్ఞానాన్నీ, అర్థాన్ని గుర్తించటంలో పప్పులో కాలు వేస్తారు.అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట!తపొప్పుల విశ్లేషణలో చతికిలా పడతారు.ఇలాంటి బుద్ధిని రాజస బుద్ధి అని అంటారు.
Thursday, 24 July 2025
ప్రవృత్తిం చ నివృత్తిం చ
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే।
బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి స్సా పార్ధ!సాత్త్వికీ॥30॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తీరికగా,ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునుడికి ఇప్పుడు తను రణరంగం మధ్యలో ఉన్నాననే స్పృహ లేనే లేదు.ఎందుకంటే కృష్ణుడు చెప్పే విషయాల పైన అంత లీనమైపోయి వింటున్నాడు.లోకంలో ఉండే సమయం అంతా వాళ్ళిద్దరే పంచుకున్నట్లుగా ఉంది!అర్జునా!నీకు ఇప్పుడు నేను సాత్విక బుద్ధి గురించి వివరిస్తాను.ధర్మము-అధర్మము,ప్రవృత్తి-నివృత్తి,కర్తవ్యము-అకర్తవ్యము,భయము-అభయము,బంధనము-మోక్షము...ఈ ద్వంద్వాలను అన్నిటినీ సుస్పష్టంగా తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటమే సాత్త్విక బుద్ధి.
Wednesday, 23 July 2025
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు।
ప్రోచ్యమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ॥29॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తల గురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక రకరకాల బుద్ధుల గురించి వివరించబోతున్నాడు.హే అర్జునా!హే ధనంజయా!నీకు కర్తల గురించి ఇప్పుడే చెప్పాను కదా!ఇంక రకరకాల బుద్ధుల గురించి కూడా విశదీకరిస్తాను.మంచిగా,మనసు పెట్టి విను.మనుష్యుల బుద్ధి అందరికీ ఒకేలాగా ఉండదు.గుణ భేదాల కారణంగా మూడు రకాలుగా విభజించ బడింది.అలాగే ధృతి కూడా!ధృతి అంటే చెబుతాను,విను.ధృతి అంటే స్థైర్యం అని అర్థం.ఒక లక్ష్యాన్ని ఛేదించేదానికి కావలసిన స్ధైర్యం,ధైర్యం,ఓర్పు,ధృఢత్వం...వీటన్నిటినీ కలిపి ధృతి అని అంటారు.
Tuesday, 22 July 2025
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే॥28॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు సాత్త్విక,రాజస కర్తల గురించి చెప్పాను కదా!ఇంక మనము తామస కర్తల గురించి చెప్పుకుందాము.వీళ్ళకు ధైర్యము ఉండదు.ఆత్మస్ధైర్యము అసలే ఉండదు.మూర్ఖపు పట్టుదలలు,అభిమానాలు సదా ఆవహించి ఉంటాయి.మోసాలకు పాల్పడే గుణం పుష్కలంగా ఉంటుంది.ఎంత సేపూ దిగేడుస్తూ ఉంటారు ఎదుటి వారి ఆనందం చూసి,తమ ఓటమి తలచుకుంటూ.సమయపాలన అసలు పాటించరు.వృధాగా కాలయాపన చేసేదానికి ముందు వరసలో ఉంటారు.ఏ పనినీ ఇష్టంగా,మనసు పెట్టి చేయరు.ఇలా పని చేసేవాడిని తామస కర్త అని అంటారు.
Monday, 21 July 2025
రాగీ కర్మఫలప్రేప్సుః
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః।
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః॥27॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.అర్జునా!మనం ఫలాపేక్ష మాని,స్థిర చిత్తంతో కర్మలను ఆచరించేవాడు సాత్త్విక కర్త అని మాట్లాడుకున్నాము కదా!అలానే రాజస కర్త ఎలా ఉంటాడో చెబుతాను విను.ఇక్కడ తను చేసే ప్రతి పని యొక్క ఫలితం,అదే లాభనష్టాలు తనకే దక్కాలి అనే మానసిక స్థితిలో ఉంటాడు.అణువణువునా అహంకారము,అభిమానము,లోభగుణము తొణికిస లాడుతుంటాయి.తను అనుకున్న పని తను అనుకున్నట్లే జరగాలి అనే తపనలో హింసాపరుడు అవుతాడు.తన పని త్వర త్వరగా జరిగి పోవాలి అనే ఆదుర్దాలో శుచిని పాటించడు.అశుచిగా చేస్తుంటాడు.సుఖం వస్తే ఎగిరి గంతులేసి ఊరంతా సంబరాలు చేయడం,దుఃఖం వస్తే ముసుగేసుకుని,మూలన కూర్చొని దిగేడవడము చేస్తుంటాడు.అంటే ఫలితాలకు అలా విపరీతంగా చలిస్తూ ఉంటాడు.రెండిటినీ ఒకే రకంగా తీసుకోగలిగే స్ధిరచిత్తం, సమన్వయ శక్తి ఉండదు.ఇలాంటి నేపధ్యంలో కర్మలు ఆచరించే వారిని రాజస కర్త అని అంటారు.
Friday, 18 July 2025
ముక్తసంగోఽనహంవాదీ
ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తాసాత్త్విక ఉచ్యతే॥26॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు వివిధ రకాల జ్ఞానాలు,కర్మల గురించి చెప్పాడు.ఇప్పుడు అర్జునుడికి కర్తల గురించి చెబుతున్నాడు.అర్దునా!మనం మూడు రకాల జ్ఞానములు,కర్మల గురించి ప్రస్తావించుకున్నాము కదా!ఇప్పుడు నీకు కర్తల గురించి కూడా చెబుతాను.మనసు పెట్టి విను.కర్త అంటే పని చేసేవాడు అని అర్థం కదా.సాత్త్విక కర్త ఎలా ఉండాలో,ఎలా ఉంటాడో చెబుతాను.మొట్ట మొదటగా అతను ఫలాపేక్షను వదిలి పెట్టాలి.అహంకారము ఇసుమంత కూడా ఉండకూడదు.తను చేసే కర్మల యొక్క ఫలితంలోని మంచి చెడ్డలకు తొణకకుండా,బెణకకుండా ఉండాలి.అంటే పర్యవసానము మనకు అనుకూలమా,ప్రతికూలమా అనే మీమాంస వదిలి పెట్టాలి.అంటే ఎలాంటి వికారాలకూ లోను కాకుండా,మనకు నిర్దేశించిన కార్యాలను మనసా,వాచా నిర్వర్తించాలి.ఆ కార్య నిర్వహణలో ఎలాంటి అనుకోని కష్ట నష్టాలు వచ్చినా,ఎదుర్కునే మానసిక స్థిరత్వం అలవరచుకోవాలి.చెయ్యాల్సి వచ్చిందే రామచంద్రా!అని విసుక్కుంటూ చేయకూడదు.మన కర్తవ్యాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేపట్టాలి.దాని పర్యవసానం మనకు అనుకూలంగా ఉంటుందా,ప్రతికూలంగా ఉంటుందా అనే విషయంగా తర్జన భర్జనలను వదిలేసి,ఫలితం ఏమైనా ఊపు,ఉత్సాహంగా,నమ్మకంతో కార్య నిర్వహణ చేయాలి.అలాంటి వాడిని సాత్త్విక కర్త అని అంటారు.
Thursday, 17 July 2025
అనుబంధం క్షయం హింసా
అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్।
మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముచ్యతే॥25॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస కర్మలగురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక తామస కర్మ గురించి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అంటే ఫలాపేక్ష,రాగద్వేషాలకు అతీతంగా చేసేవి,రాజస కర్మలు అంటే కర్మఫలాసక్తి,అహంకారాలతో చేసేవి అని చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తామస కర్మల గురించి మాట్లాడుకుందాము.ఇక్కడ వ్యవహారం అంతా గొడ్డొచ్చి చేలో పడినట్లు ఉంటుంది.ఒక పని చేసే ముందు మంచి చెడ్డా ఆలోచించరు.కష్ట నిష్టూరాలను పరిగణలోకి తీసుకోరు.కామ రాగ మోహాలకు లోనై,మానసిక పరిపక్వత లేకుండా,మూర్ఖంగా కర్మలను ఆచరిస్తారు.ఇలాంటి వాటినే తామస కర్మలు అని అంటారు.
Tuesday, 15 July 2025
యత్తు కామేప్సునా కర్మ
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః।
క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్॥24॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక కర్మల గురుంచి ఇప్పుడే చెప్పాడు.ఇంక ఇప్పుడు రాజస కర్మల గురించి ప్రస్తావిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అనేవి ఫలాపేక్ష రహితంగా చెయ్యాలని అర్థం అయింది కదా!ఇప్పుడు మనము రాజస కర్మల పూర్వాపరాలు మాట్లాడుకుందాము.ఇక్కడ వీరు చేసే ప్రతి పని దాని వలన వచ్చే లాభం గురించి బేరీజు వేసుకుని చేస్తారు.లాభం లేకపోతే పూచిక పుల్ల కూడా తీసి ప్రక్కన పెట్టరు.అహంకారానికి,గర్వానికి పోయి చేస్తారు.ఆ పనులు వారికి ఎంత కష్టమయినా గొప్పల కోసం చేస్తారు.అంటే అందరూ ఆహా!ఓహో! అని తమ గురించి అనుకోవాలనే తపన నరనరాన కనిపిస్తూ ఉంటుంది.ఇలా కర్మ ఫలాసక్తితో,అహంకార అభిమానాలతో చేసే మిక్కిలి కష్ట సాధ్యమయిన పనులను రాజస కర్మలు అని అంటారు.
Monday, 14 July 2025
నియతం సంగరహితం
నియతం సంగరహిత మరాగద్వేషతః కృతమ్।
అఫలప్రేప్సునా కర్మ యత్త త్సాత్త్విక ముచ్యతే॥23॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి మూడు రకాల ధర్మాల గురించి వివరించాడు.అర్జునా!ఇప్పుడు అర్థము అయిందా,మొదటగా ఫలాపేక్షను వదలగలగాలి మానవుడు అని. ఫలాపేక్షను వదిలి పెట్టి,అభిమానము,రాగము,ద్వేషము అనే భావాలకు దూరంగా,అతీతంగా ఉండాలి.ఎందుకంటే ఆ మనోస్థితిలో ఉండి చేసే విధిహిత కర్మలే సాత్త్విక మయిన కర్మలు.అంటే మన మానసిక ధృఢత్వాన్ని అంచెలంచెలుగా పెంచుకోవాలి.ఎందుకంటే స్థితప్రజ్ఞత అనేది అనుకోగానే రాదు.దానికోసం మనము సాథన చేయాలి.
Sunday, 13 July 2025
యత్తు కృత్స్నవదేకస్మి
యత్తుకృత్స్నవదేకస్మి న్కార్యే సక్తమహైతుకమ్।
అతత్త్వార్థవదల్పం చ త త్తామస ముదాహృతమ్॥22॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక జ్ఞానం,రాజస జ్ఞానం గురించి చెప్పాడు.ఇంక తామస జ్ఞానం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు సాత్త్విక,రాజస జ్ఞానాలగురించి చెప్పాను కదా!తామస జ్ఞానంఅనేది ఏ రీతిలో ఉంటుందో కూడా తెలుసుకో!ఈ కోవకు చెందిన వారు ఏది చూసినా,అదే అంతా సర్వస్వం అనుకుంటారు.ఒక దేహాన్ని చూసినా,ఒక వస్తువును చూసినా దాని చుట్టూరా భ్రమిస్తుంటారు.ఈ రకంగా తలచే తత్త్వ విరుద్ధము అయిన జ్ఞానాన్నే తామస జ్ఞానము అని అంటారు.అంటే ఒక రకంగా చెప్పాలంటే బావిలో కప్పలాగా అన్నమాట.వారి ప్రపంచము చాలా చిన్నది.ఒక మనిషిని కానీ,ఒక వస్తువును చూస్తే,దాని చుట్టూరానే వాళ్ళ ఆలోచనలు,కర్మలు,క్రియలు తిరుగుతుంటాయి.వాటినిదాటి విశాల విశ్వం,విశ్వంభరుడు గురించి తెలుసుకునే సమయం,జిజ్ఞాస,ఆలోచన వాళ్ళకు ఉండవు,అంటవు.
Saturday, 12 July 2025
పృథక్త్వేన తు యద్ జ్ఞానం
పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్।
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్॥21॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడే చెప్పాడు కదా అన్ని భూతాలలో ఉండే ఆత్మ ఒకటే అని గ్రహించ గలిగే జ్ఞానము సాత్త్విక జ్ఞానము అని.ఇప్పుడు ఇంక రాజస జ్ఞానము గురించి చెబుతున్నాడు.అర్జునా!రాజస జ్ఞానము అంటే ఏందో చెబుతాను విను.ఇక్కడ విడివిడిగా కనిపించే భూతాలు చాలా లెక్కకు మిక్కిలి ఉంటాయి కదా!వాటన్నిటిలోనూ ఆత్మలు కూడా వేరు వేరుగా ఉంటాయని అనుకోవడమే రాజస జ్ఞానము అని అంటారు.
Friday, 11 July 2025
సర్వభూతేషు యేనైకం
సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే।
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్॥20॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్దునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే చెప్పుకున్నాము కదా జ్ఞానము,కర్మ,కర్త మూడేసి రకాలుగా ఉంటాయి అని.ఇప్పుడు మనము సాత్త్విక మయిన జ్ఞానము గురించి మాట్లాడుకుందాము.భూతాలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా!అన్నీ వేరు వేరుగా కనిపిస్తుంటాయి కదా?కానీ నీకు ఈ విషయం తెలుసా?అన్నిటిల్లోనూ నాశనం లేనిది,మార్పు లేనిది ఒకటి ఉంటుంది.అదే ఆత్మ!ఆ ఆత్మను గ్రహించ గలగటము అనేది చాలా పెద్ద ప్రక్రియ.ఈ వేరు వేరుగా కనపడే అన్ని భూతాలలోనూ అవినాశము,మార్పు లేక ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్త్విక జ్ఞానము.
Thursday, 10 July 2025
జ్ఞానం కర్మ చ కర్తా చ
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథాచ్ఛృణు తాన్యపి॥19॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
గురువుకు ఎంత ఓపిక ఉండాలి,ఎంత విషయ పరిజ్ఞానము ఉండాలి,దానిని శిష్యుని పరిణితికి తగినట్లుగా ఎలా విశదీకరించాలి అనేది మనకు శ్రీకృష్ణుడిని చూస్తే అర్థం అవుతుంది.అతను అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!జ్ఞానము,కర్మ,కర్త అనేవి సాంఖ్యా శాస్త్రము ప్రకారము మూడేసి విధాలుగా ఉన్నాయి.వాటిని కూడా నీకోసం వివరంగా విశదీకరిస్తాను.మనసు పెట్టి అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.
Wednesday, 9 July 2025
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః॥18॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలు,వాటి ప్రోత్సాహకాలు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!రకరకాలు అయిన కర్మలను ప్రోత్సాహ పరచే కారణాలు మూడు ఉన్నాయి.అవి జ్ఞానము,జ్ఞేయము మరియు పరిజ్ఞాత.అలాగే కర్మ సంగ్రహము కూడా మూడు విధాలు ఉన్నాయి.అవి కర్త,కర్మ మరియు సాధనము.
జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానము,విచక్షణ,పాండిత్యము.జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయము అని అర్థము.పరిజ్ఞాత అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థము.
Monday, 7 July 2025
యస్య నాహం కృతో భావో
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే।
హత్వాపి స ఇమాం ల్లోకాన్న హంతి న నిబధ్యతే॥17॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా మంచిగా అర్థం కావాలని తాపత్రయ పడుతున్నాడు.అందుకే ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనిషికి కర్తృత్వం పట్ల మమకారం ఉండకూడదు.అహం అనేది అసలే ఉండకూడదు.అంటే అంతా నేనే చేస్తున్నాను,అంతా నాదే,అంతా నా చెప్పు చేతల్లో ఉంది అనే భావన,అహంకారము.ఎందుకంటే ఇవంతా మన అజ్ఞానానికి కొండ గుర్తులు.
కాబట్టి కర్తృత్వం పట్ల అహం లేని వాడూ,నేనే చేస్తున్నా అని అనుకునే అజ్ఞానం లేని వాడు చాలాగొప్ప.అతను ఈ లోకంలో అందరినీ తుద ముట్టించినా,ఆ పాపం అతనికి అంటదు.ఎందుకంటే అతని చర్యల్లో ప్రతిఫలాపేక్ష ఉండదు.స్వలాభం ఉండదు.అతను లోక కల్యాణం కోసమే చేస్తాడు కాబట్టి.
Friday, 4 July 2025
తత్రైవం సతి కర్తారం
తత్రైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః।
పశ్య త్యకృతబుద్ధిత్వా న్న స పశ్యతి దుర్మతిః॥16॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొన్ని పచ్చి నిజాలు ఉంటాయి.మనము వాటిని ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా నిత్యము,సత్యము అయిన వాటిలో మార్పులు,చేర్పులు ఉండవు.మనము చేసే సమస్త కర్మలకూ ఆ అయిదే కారణము అనేది సత్యము,నిత్యము.కానీ బుద్ధి పరిపక్వత లేని వాడు అలా ఆలోచించడు,నమ్మడు.అన్నిటికీ కారణభూతుడు తానే అనే భ్రమలో,అహంకారంతో ఊగిసలాడుతుంటాడు.అపరిపక్వంగా ఆలోచించేవాడే అలా ఉంటే దుష్టబుద్ధి గలవారు,చెడుభావాలు కలవారు ఇంక ఎంతలా ఆలోచిస్తారో మన ఊహకే అందదు.
కాబట్టి మానవుడు అహంకారము,కామము,క్రోధము వదలక పోతే సన్నార్గములోకి రాలేడు అనేది ముమ్మాటికీ నిజము.
Thursday, 3 July 2025
శరీరవాజ్ఞ్మనోభి ర్యక్కర్మ
శరీరవాజ్ఞ్మనోభి ర్యత్కర్మ ప్రారభతే నరః।
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః॥15॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి బాగా అర్థం కావాలని ఇంకా విపులంగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిజానికి నేను పైన చెప్పినట్లు శరీరం,అహంకారం,ఇంద్రియాలు,ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు,పరమాత్మ ...ఈ అయిదే కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నాయి.మనస్సు,వాక్కు,శరీరాలతో మనము చేసే ప్రతి ఒక్క గొప్పపనికి,నీచము అయిన పనికి ఈ అయిదే కారణాలు అని మర్చిపోవద్దు.కానీ అందరికీ ఈ విషయం అర్థం కావాలంటే బుద్ధి పరిపక్వత చెంది ఉండాలి కదా!అది అందరికీ ఉండదు కదా!బుద్ధి పరిపక్వత చెందనివాడూ,చెడుభావాల సుడిగుండంలో ఇరుక్కుపోయినవాడూ ఈ సాంఖ్య శాస్త్రాన్ని ససేమిరా నమ్మడు.అన్నిటికీ కర్త,కర్మ,క్రియ తానే అని భావిస్తూ,అజ్ఞానంలో మునిగి తేలుతుంటాడు.ఆ మాయలో మనిషి ఉన్నంతకాలం,అహంకారం అణువణువునా తొణికిసలాడుతుంటుంది.అతడు ఇక అంతా నేనే,నన్ను మించినవాడు లేడు ఈ ముల్లోకాలలో లేనే లేడు అనే మిడి మిడి జ్ఞానంతోనే సంచరిస్తూ ఉంటాడు.
Wednesday, 2 July 2025
అధిష్ఠానం తథా కర్తా
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!మనస్సు,వాక్కు,శరీరాలతో మనిషి చేసే సమస్తము అయిన ఉచ్ఛ నీచ కర్మలకూ ఈ అయిదే కారణము.మనము గొప్ప పనులు చేసినా కారణం అవే.అలాగే నీచ,నికృష్టమయిన పనులు చేసినా ఆ అయిదే కారణము.ఆ అయిదు ఏందో మళ్ళీ చెబుతాను నీ కోసం,విను.అవి శరీరము,అహంకారము,పంచేంద్రియాలు,ప్రక్రియాపరము అయిన వివిధ కార్యాలు,పరమాత్మ.
Subscribe to:
Comments (Atom)