Friday, 18 July 2025

ముక్తసంగోఽనహంవాదీ

ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః। సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తాసాత్త్విక ఉచ్యతే॥26॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు వివిధ రకాల జ్ఞానాలు,కర్మల గురించి చెప్పాడు.ఇప్పుడు అర్జునుడికి కర్తల గురించి చెబుతున్నాడు.అర్దునా!మనం మూడు రకాల జ్ఞానములు,కర్మల గురించి ప్రస్తావించుకున్నాము కదా!ఇప్పుడు నీకు కర్తల గురించి కూడా చెబుతాను.మనసు పెట్టి విను.కర్త అంటే పని చేసేవాడు అని అర్థం కదా.సాత్త్విక కర్త ఎలా ఉండాలో,ఎలా ఉంటాడో చెబుతాను.మొట్ట మొదటగా అతను ఫలాపేక్షను వదిలి పెట్టాలి.అహంకారము ఇసుమంత కూడా ఉండకూడదు.తను చేసే కర్మల యొక్క ఫలితంలోని మంచి చెడ్డలకు తొణకకుండా,బెణకకుండా ఉండాలి.అంటే పర్యవసానము మనకు అనుకూలమా,ప్రతికూలమా అనే మీమాంస వదిలి పెట్టాలి.అంటే ఎలాంటి వికారాలకూ లోను కాకుండా,మనకు నిర్దేశించిన కార్యాలను మనసా,వాచా నిర్వర్తించాలి.ఆ కార్య నిర్వహణలో ఎలాంటి అనుకోని కష్ట నష్టాలు వచ్చినా,ఎదుర్కునే మానసిక స్థిరత్వం అలవరచుకోవాలి.చెయ్యాల్సి వచ్చిందే రామచంద్రా!అని విసుక్కుంటూ చేయకూడదు.మన కర్తవ్యాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేపట్టాలి.దాని పర్యవసానం మనకు అనుకూలంగా ఉంటుందా,ప్రతికూలంగా ఉంటుందా అనే విషయంగా తర్జన భర్జనలను వదిలేసి,ఫలితం ఏమైనా ఊపు,ఉత్సాహంగా,నమ్మకంతో కార్య నిర్వహణ చేయాలి.అలాంటి వాడిని సాత్త్విక కర్త అని అంటారు.

No comments:

Post a Comment