Tuesday, 30 September 2025
సంసార సాగరం ఘోరం
సంసార సాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యోనరః।
గీతాభ్యాసం సమాసాద్య పారంయాతి సుఖేన సః॥
మనిషికి జీవితంలో ఏదో ఒకటి సాథించాలని ఉంటుంది సహజంగా.సంసారంని ఈదలేని మహాసాగరము అంటుంటారు.కాబట్టి అది సునాయాసంగా దాటగలగటం ఒక యజ్ఞం లాంటిది.అది సాథించడం జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు చాలా మంది.అది సులువుగా సాథించేదానికి ఒక చిన్న చిట్కా ఉంది.అదే గీతాభ్యాసము!
వైష్ణవీయ తంత్రసారము దీనినే సమర్థిస్తుంది.ఏ మానవుడు దుర్భరమయిన ఈ సంసైర సాగరాన్ని తరించ దలచాడో...వాడు గీతాభ్యాసము అనే పడవ ఎక్కితే చాలు.ఆ పడవే మనలను ఒడిదుడుకులు లేకుండా,సాఫీగా ప్రశాంతంగా ఈ భవసాగరం దాటగలిగేలా చేస్తుంది.
Monday, 29 September 2025
ఆపదం నరకం ఘోరం
ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ న పశ్యతి।
నిత్యం ధారయతే యస్తుస మోక్ష మధిగచ్ఛతి॥
స్కాందపురాణంలో ఇలా చెప్పబడింది.భగవద్గీతను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తే మంచిది.ఎందుకో వివరణ ఇచ్చారు ఇక్కడ.భగవద్గీతను అధ్యయనం చేసేవారు ఇహలోకంలో కష్టాలు పడరు.అంతేనా?కాదు.పరలోకంలో కూడా నరకంబారిన పడరు.నిత్యమూ పారాయణ చేసేవారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.ఇందులో అనుమానమే లేదు.
Sunday, 28 September 2025
మల నిర్మోచనం పుంసాం
మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే।
సకృద్గీతాంభసి స్నానం సంసార మల నాశనమ్॥
మనము రోజూ స్నానంచేస్తాము.ఎందుకు?ఒంటికి అంటుకున్న దుమ్మూ,ధూళీ వదలగొట్టుకునేదానికే కదా!అదే మనసుకు పట్టిన దోషాలూ,ఘోషలూ,పాపపంకిలాలూ పోవాలంటే మనం ఇంకెంత శుభ్రంచేసుకోవాలి?వాటన్నిటికీ చెప్పిన చిన్న చిట్కానే ఈ భగవద్గీత.అదే ఈ శ్లోకంలో చెప్పబడింది.మంచి నీళ్ళతో స్నానం రోజూ చేస్తే ఒంటికి పట్టిన మురికి పోతుంది.గీతాభ్యాసము,గీతా పారాయణము అనే స్నానము మనము రోజూ చేస్తే మనసుకు పట్టిన చీడ,పీడ వదలిపోతాయి.అన్ని రకాల మాలిన్యాలకు స్వస్థి చెప్పవచ్చు.
Saturday, 27 September 2025
గీతాయాశ్చన జానాతి
గీతాయాశ్చన జానాతి పఠనం నైవ పాఠనం।
స ఏవ మానుషే లోకే మోఘకర్మకరో భవేత్॥
భగవద్గీత అనేది అన్ని వేదాల సారము.అది భగవంతుడు దయతో మానవాళికి ఇచ్చిన కానుక.అది దేవుడి గదిలో ఒక మూల పడి ఉండకూడదు.ప్రతి నిత్యం దానిని చదువుతూ ఉండాలి.దానిలోని సారాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు పోవాలి.
అందుకే చెబుతున్నారు.గీతను చదవని వాడు,బోధించని వాడు,దానిని అర్థం చేసుకోనివాడు ఈ లోకంలో వ్యర్థుడు.
గీతాయాః పుస్తకం
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే।
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై॥
ఈ భగవద్గీత అనేది మనకు దక్కడం మన పూర్వ జన్మ సుకృతం.ఈ మహద్ గ్రంథం ఎక్కడ ఉంటుందో అక్కడే అన్ని పుణ్య తీర్థాలూ,గయా ప్రయాగాదులూ ఉన్నట్లు లెక్క.ఎక్కడ ఈ శ్రీకృష్ణార్జునుల సంవాదం చదవబడుతుందో,అక్కడ ముక్కోటి దేవతలూ,మునులూ,యోగులూ,పన్నగులూ,నారదుడూ,ఉద్ధవుడూ,మిగిలిన మహానుభావులూ...అందరూ ఉన్నట్లు లెక్క.వాళ్ళందరూ ఉన్నారు అంటే మనలను ఆశీర్వదించే దానికే కదా!పుణ్య క్షేత్రాలు,పవిత్ర నదీ జలాలు ఉన్నాయి అంటే మనము పుణ్య స్నానాలు చేసినట్లే కదా!అంత పుణ్యం దక్కుతుంది మనకు.ఎక్కడ కృష్ణార్జునులు ఉంటే అక్కడ జయము,లక్ష్మీ,ఐశ్వర్యము ఉంటాయి అని చెప్పాడు కదా సంజయుడు.వారికి ప్రతీకగా ఉండే భగవద్గీత ఎక్కడ కొలవబడుతుందో,చదవబడుతుందో,ఆకళింపు చేసుకోబడుతుందో,వినబడుతుందో,పఠింపబడుతుందో అక్కడ ఖచ్చితంగా జయము,లక్ష్మి,ఐశ్వర్యము తాండవిస్తాయి.
Friday, 26 September 2025
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ॥78॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
కురుక్షేత్ర సంగ్రామం యొక్క ముగింపు ఏందో,ఎట్లా ఉంటుందో అనేది యుద్ధం మొదలు కాకుండానే సంజయుడికి కళ్ళకు కట్టినట్లు తెలిసి పోయింది.ధృతరాష్ట్రుడు శారీరకంగానే కాదు మానసికంగా కూడా గ్రుడ్డి వాడు కాబట్టి చివరాఖరుదాక కూడా తెలుసుకోలేక పోయాడు.సంజయుడు తన మనసుకు తట్టిన విషయం మొహమాటంలేకుండా,రాజు అని భయపడకుండా చెబుతున్నాడు.
ఓ ధృతరాష్ట్ర మహారాజా!నేను చెబుతున్నాను,విను.శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు.అర్జునుడు ధనుర్థారి.వీళ్ళిద్దరూ కలసి ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే జరుగుతాయి.అక్కడ లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది.అక్కడ ఎప్పుడూ గెలుపే! ఓటమి దరిదాపులకు కూడా వచ్చేదానికి వణికి చస్తుంది.అక్కడ ఐశ్వర్యము పిలవకున్నా తనే నడచి వచ్చి నట్టింట కూర్చుంటుంది.రాజా!నేను ఈ మాటలు ఆషామాషీగా అనటం లేదు.ఇది నా దృఢమయిన అభిప్రాయము.ఇది ముమ్మాటికీ నిజం!నిజం!నిజం!!!
శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్న్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః!!!!!
Thursday, 25 September 2025
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతమ్ హరేః।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః॥77॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
సంజయుడు ధృతరాష్ట్రుడికి తన ఆనందం,తన అదృష్టం గురించి పదే పదే,మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాడు.ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరటం లేదు.ఆ క్షణాలు మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తున్నాడు.గుర్తు వస్తేనే మనసు అంతా పులకరించి పోతుంది.తన అదృష్టానికి తనే దిష్టి పెట్టుకుంటున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు కదా!నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి.నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఇది కలయా,నిజమా లేక వైష్ణవ మాయా!నాకేమీ అర్థం కావడం లేదు.ఆ అద్భుతమయిన విశ్వరూపం పదే పదే నాకు కనిపిస్తుంది.నా ఆనందానికి అడ్డూ ఆపు లేవు.నా మనసు పరవశత్వంతో పుంతలు తొక్కుతూ ఉంది.నా అంత ధన్య జీవి ఈ లోకంలో ఇంకెవరూ లేరు.
Wednesday, 24 September 2025
రాజన్! సంస్మృత్య సంస్మృత్య
రాజన్! సంస్మృత్య సంస్మృత్య సంవాద మిమ మద్భుతమ్।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః॥76॥
శ్రీమద్భగవద్గీత...అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మాములుగా అద్భుతాన్ని కనినా,వినినా,అనుభవించినా జీవితం ధన్యమవుతుంది.ఇన్ని యుగాలుగా భగవద్గీతను చదివినా,వినినా ఒళ్ళు పులకరించి పోతుంది తాదాత్మ్యంతో ప్రతి ఒక్కరికీ.అలాంటిది నేరుగా శ్రీకృష్ణుడు అర్జునుడు సంవాదము విని తరించిన సంజయుడి మానసిక పరిస్థితి ఇంక ఎలా ఉండాలి?
అదే చెబుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి.ఓ రాజా!శ్రీకృష్ణార్జునుల సంవాదం మాటి మాటికీ గుర్తు వస్తున్నది.అసలు మర్చిపోలేక పోతున్నాను.నా మనసు అంతా ఉప్పొంగి పోతుంది.ఈ ఆనందం పట్టనలవి కాకుండా ఉంది.
Tuesday, 23 September 2025
వ్యాస ప్రసాదా చ్ఛృతవాన్
వ్యాస ప్రసాదా చ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతస్స్వయమ్॥75॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
సంజయుడికి ఏమీ అర్థం కావటం లేదు.అతని ఆనందానికి అవథులు లేవు.అసలు జీవితంలో ఇంత అద్భుతమయిన ఘట్టం తనకు ఎదురవుతుంది అని.అదే అంటున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!శ్రీ వ్యాస భగవానుడి దయ వలన యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు సొంతంగా,స్వమపఖంగా అర్జునుడికి చెప్పిన యోగశాస్త్రము అయిన గీతోఽపదేశాన్ని ప్రత్యక్షంగా విని,తరించే భాగ్యం నాకు కలిగింది.నాకు ఇంక జీవితంలో ఇంకేమీ వద్దు.ఈ అదృష్టం చాలు.
Sunday, 21 September 2025
ఇత్యహం వాసుదేవస్య
సంజయ ఉవాచ....
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః।
సంవాద మిమ మశ్రౌషం అద్భుతం రోమహర్షణమ్॥74॥
శ్రీమద్భగవద్గీత...।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యస యోగము
శ్రీకృష్ణుడు చెప్పిన నీతి మాటలు విని అర్జునుడు ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.అలాంటిది దేవుని కృప వలన ఆ సంభాషణ వినగలిగిన సంజయుడి మానసిక పరిస్థితి ఇంకెలా ఉంటుంది?అతని ఆనందం చెప్పనలవి కాదు.తమాయించుకుని ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు.ధృతరాష్ట్ర మహారాజా!మహాత్ములు,పుణ్యపురుషులు అయిన శ్రీకృష్ణార్జునులు చేసుకున్న ఆ పరమ పవిత్రమయిన,అత్యద్భుతమయిన సంవాదాన్ని నేను కూడా స్వయంగా వినగలిగాను.నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.నా శరీరం పులకించింది.నా జీవితం ధన్యమయింది.
Saturday, 20 September 2025
నష్టం మోహః స్మృతిర్లబ్ధా
అర్జున ఉవాచ....
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాఽచ్యుత।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ॥73॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్సాస యోగము
అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంత సేపూ చెప్పింది కళ్ళు ఆర్పకుండా,మనసునంతా లగ్నం చేసి,ఏకాగ్ర చిత్తంతో విన్నాడు.కృష్ణుడు నీకు ఏమి అర్థం అయింది?ఎంత మటుకు అర్థం అయింది అని అడగటంతో ఈ లోకం లోకి వచ్చాడు.అర్జునుడు ఇలా చెబుతున్నాడు.కృష్ణా!మాథవా!మథుసూదనా!నీవు ఎంతో ఓపికగా,ప్రేమగా,అనురాగంతో నాకు తెలియని విషయాలు,సరిగా అర్థం చేసుకోలేని విషయాలు చాలా చెప్పావు.నీ కృపాకటాక్షంవల్ల నా అజ్ఞానం సమసిపోయింది.ఇంక నాకు ఎటువంటి అనుమానాలు,శంకలూ లేవు.ఆత్మస్మృతి కలిగింది.అంటే ఆత్మజ్ఞానం కలిగింది.నాకు ఇకమీదట కర్త,కర్మ,క్రియ అన్నీ నీవే.నేను నీ నీడను మాత్రమే.నీవు ఏమి చెబితే,ఎలా చెబితే,ఎప్పుడు అని చెబితే,ఎక్కడ అని చెబితే అలాగే తు చ తప్పకుండా చేస్తాను.నేను నీ ఆజ్ఞ కోసరము శిరసు వంచి సిద్ధంగా,సమాయత్తం అయి ఉన్నాను.
Friday, 19 September 2025
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైక్తాగ్రేణ చేతసా।
కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ॥72॥
శ్రీమద్భగవద్గీత...అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మమూలుగా పాఠం చెప్పడం అయిపోగానే గురువులు పిల్లలతో ఏమి అంటారు?నేను చెప్పింది ఎంత అర్థం అయింది?బాగా అర్థం చేసుకున్నారా?మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా?ఉంటే చేతులు ఎత్తండి.ఒక్కొక్కళ్ళ అనుమానాలు తీరుస్తాను.
అచ్చం అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు.హే పార్థా!ఓ ధనంజయా!ఇంత సేపూ నేను చెప్పింది ఏంది? నిజంగా మనసు పెట్టి విన్నావా?ఏమనిపిస్తుంది నీకు? నీ అజ్ఞానం ఏమైనా తగ్గుమొఖం పట్టిందా?దాని వలన సంక్రమించే మోహం నశించిందా?న మనసుకు ఏమనిపిస్తుంది?నకు సవివరంగా సమాధానం ఇవ్వు.
Thursday, 18 September 2025
శ్రద్ధావాననసూయశ్చ
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః।
సోఽపి ముక్తశ్శుభాన్ లోకాన్ ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్॥71॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ గీతను,గీతాసారాన్నీ శ్రద్ధగా,భక్తిగా,ఆసక్తిగా చదవాలి.వినాలి.అలా చేసినవారు గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వారికి ఏ మాత్రం తీసిపోరు.అంటే అసూయ లేకుండా,శ్రద్ధాసక్తులతో ఎవరైతే వింటారో,వారు పుణ్యాత్ములు పొందే పుణ్యలోకాలను సునాయాసంగా,సులభంగా,అవలీలగా పొందగలుగుతారు.ఇందులో ఎలాంటి సందేహము లేదు.
Wednesday, 17 September 2025
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః।
జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః॥70॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనమిద్దరమూ ఇప్పుడు మాట్లాడుకున్నాము కదా!ఈ గీత జ్ఞాన,వేదాంత సారము.కాబట్టి ఎవడు అయితే ఈ గీతా పారాయణం చేస్తాడో,వాడు నాకు అత్యంత ఇష్టుడు,ఆప్తుడు.ఒక రకంగా వాడు నన్ను జ్ఞానమనే యజ్ఞంతో ఆరాధిస్తున్నాడు అని మురిసి పోతాను,సంతసిస్తాను.తన జ్ఞానాన్ని నాకు సమర్పించి ముక్తుడు అవుతున్నాడు ఆ మానవుడు.
Tuesday, 16 September 2025
న చ తస్మాన్మనుష్యేషు
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః।
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి॥69॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!నీకు చెప్పాను కదా,ఇప్పుడు నేను నీకు చెప్పిన గీతా బోధ అత్యంత రహస్యమయినది,పవిత్రమయినది,ప్రభావితమయినది అని.దీనిని జనబాహుళ్యము లోకి ఎవరు తీసుకెళతారో వారే నాకు అత్యంత ప్రియులు.ఈ గీతాశాస్త్ర ప్రచారకుడు నాకు అత్యంత ప్రముఖుడు.అతని తరువాతే ఏ భక్తుడు అయినా,ప్రియమయినవాడైనా ఈ లోకంలో నాకు.
Monday, 15 September 2025
య ఇమం పరమం గుహ్యం
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః॥68॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాల్సింది అంతా చెప్పాడు.ఇప్పుడు ముక్తాయింపు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు అతి రహస్యమయిన,అత్యంత పవిత్రమయిన గీతా శాస్త్రాన్ని బోధించాను.ఈ పరమ పవిత్రమయిన శాస్త్రాన్ని నాభక్తులు అందరికీ చేర వేయాలి.ఎవరైతే ఈ కార్యాచరణలో సఫలీకృతులు అవుతారో,వారు ఖచ్చితంగా నాకు దగ్గర అవుతారు.పరమాత్మలో లీనం అవుతారు.ఇందులో అనుమానానికీ,సంశయానికీ తావే లేదు.
Sunday, 14 September 2025
ఇదం తే నాతపస్కాయ
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి॥67॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అపాత్రదానం చేయకూడదు అని చెబుతున్నాడు.ఇంత వరకూ చాలా నిగూఢమైన విషయాలు,జ్ఞానం అర్జునుడికి చెప్పాడు కదా!ఇప్పుడు అవి ఎవరికి చెప్పకూడదో చెబుతున్నాడు.నిజమే కదా!పిచ్చోడి చేతికి మంత్ర దండం ఇస్తే ఏమి చేస్తాడు?దురుపయోగంచేస్తాడు.దానిని అపహాస్యం చేస్తాడు.దాని విలువ తగ్గిస్తాడు.నవ్వులపాలు చేస్తాడు.నవ్వుల పాలు అవుతాడు.ముఖ్యంగా అందరికీ హానీ,అన్యాయం చేస్తాడు.అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మెళకువలు చెబుతున్నాడు.హే అర్జునా!నేను నీకు ఇప్పుడు చేసిన హితబోధను అపహాస్యం చేయవద్దు.జపము,తపము చేయని వారికి చెప్పవద్దు.నా భక్తుడు కాని వాడికి చెప్పవద్దు.సేవాధర్మం పాటించని వాడికి చెప్పవద్దు.నన్ను అర్థం చేసుకోకుండా అసూయతో చూసేవాడికి,అపహాస్యం చేసేవాడికి,తప్పుగా అర్థం చేసుకునేవాడికి ఈ శాస్త్రాన్ని ససేమిరా బోధించవద్దు.ఎందుకంటావా?నీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.వృథా అవుతుంది.
Saturday, 13 September 2025
సర్వధర్మాన్ పరిత్యజ్య
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥66॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చిలకకు చెప్పినట్లు చెబుతున్నాడు.ఓ అర్జునా!ఓ ధనంజయా!నీవు అసలు ఏమీ ఆలోచించే పనిలేదు.కళ్ళు మూసుకుని నన్ను నమ్ముకో!ఈ భవసాగరాన్ని దాటిస్తాను.అన్ని ధర్మాలనూ పక్కకు పెట్టేయి.ఈ భూమండలంలో నేను తప్పిస్తే నీ హితవు కోరేవారు నా అంత ఇంకొకరు లేరు.కాబట్టి నన్నొక్కణ్ణే శరణు కోరు.నేను నిన్ను పూర్వ,ప్రస్తుత,భవిష్యత్ పాపాలనుంచి కాపాడుతాను.సర్వకాల సర్వావస్థలయందు నిన్ను రక్షిస్తాను.నీకు మోక్ష ప్రాప్తి కలిగిస్తాను.
Friday, 12 September 2025
మన్మనాభవ మద్భక్తో
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే॥65॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుఢు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.మామూలుగా గురువులు ఒకసారి చెప్పి శిష్యులను పదే పదే చదివి,అర్థం చేసుకుని,గుర్తు పెట్టుకోమంటారు.కానీ ఇక్కడ భగవంతుడు గురువుగా మారి,శిష్యుడు అయిన అర్జునుడికి పదే పదే హితోఽపదేశం చేస్తున్నాడు.అర్జునుడు ఎంత అదృష్టవంతుడో కదా!
హే అర్జునా!ఓ పార్థా!నా యందే నిశ్చలమయిన మనసుతో ఉండు.ద్వంద్వాలకు లోను కావద్దు.నన్నే అటలమయిన భక్తితో సేవించు.నన్నే పూజించి,తరించు.నాకే నమస్కరించు.నాకు ఇష్టమయినవాడివి కనుక నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.గుర్తు పెట్టుకో!నన్ను నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు.నువ్వు ఖచ్చితంగా నన్నే పొందుతావు.అంటే మోక్షం పొందుతావు అనే కదా!ఇందులో ఎలాంటి సందేహం లేదు.
Thursday, 11 September 2025
సర్వ గుహ్యతమం భూయః
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్॥64॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
భగవంతుడు ఎంతో భక్తసులభుడు.లేకపోతే ఆయన భక్తుడిని నన్ను నమ్ముకో,నీకు మంచి చేస్తాను అని బతిమాలడటం ఏంటి?
ఇక్కడ శ్రీకృష్ణుడు సరిగ్గా భక్తుడు అయిన అర్జునుడిని బుజ్జగించి,చెపుతున్నాడు.హే అర్జునా!నీవు నాకు నాకు చాలా కావలసిన వాడివి.నా వాడివి.నాకు ఆప్తుడివి.నీకు మంచి చేయటం నా ధర్మము. నీ శ్రేయస్సు కోరుకోవడం నా కర్తవ్యం.కాబట్టి నీ మంచి కోసం,శ్రేయస్సు కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను,విను.అన్ని ఉపదేశాలలోకీ ఉత్కృష్టమయిన,గోప్యమయిన నా మాటలు,ఉపదేశాలు మరలా విను.అర్థం చేసుకో!అన్వయించుకో!
Subscribe to:
Comments (Atom)