Tuesday, 30 June 2026

ఇహైవ తైర్జిత స్సర్గో

ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః। నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః॥19॥5॥ శ్రీమద్భగవద్గీత...।కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు పండితుడు అనే వాడు ఎలా ఉండాలి అని చెప్పాను?పండితుడు అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు,ఇలా ఎంత తారతమ్యము ఉన్న ప్రాణి అయినా...అన్నిటి యందు,అందరినీ సమదృష్టితో చూస్తాడు,ప్రవర్తిస్తాడు అని కదా! అలాంటి పండితుడు ఈ జన్మలోనే సంసరాన్ని జయించిన వాడు అవుతాడు.అందరినీ,అంతటినీ సమంగా చూసేవాడు ఖచ్చితంగా సర్వ సమమయిన పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు.అంటే కైవల్యం పొందుతాడు.ఇంతకంటే ఇంకేమి కావాలి,ఈ మానవ జన్మకు?

Monday, 29 June 2026

విద్యా వినయ సంపన్నే

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని। శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః॥18॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సమానత్వం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!చీమనైనా,దోమనైనా..।మనిషినైనా,మృగాన్ని అయినా సృష్టించేది ఆ పరమాత్మే కదా!మనష్యులలో తేడాలు ఆయన కల్పించిన మాయ ద్వారానే కదా!అలాంటప్పుడు అందరూ సమానమే కదా!అమ్మ మనస్తత్త్వం ఎలా ఉంటుంది?పది మంది పిల్లలు ఉంటే అందరూ ఒకేలాగ ఉండరు కదా!కానీ అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది కదా!ఒకడికి చీమిడి ముక్కులు కారుతున్నాయి అని అసహ్యించుకోదు.తన పమిటతోనే తుడుస్తుంది దగ్గరకు తీసుకుని.మెతకగా ఉండే బిడ్డకు ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తుంది.తులవగా ఉండే బిడ్డను గదమాయించి,ఆపుతుంది.ఏ బిడ్డకు,ఎప్పుడు ఏమి కావాలో,ఏమి ఇవ్వాలో అమ్మకు తెలుసు. ఎక్కడో ఉండే దేముడు,ఇక్కడే ఉండే అమ్మ బిడ్డలను సమానంగా చూస్తున్నారు కదా!మనకేమి అంత బాథ అందరినీ సమానంగా చూసేదానికి? అలా అందరినీ,అంతటినీ సమానంగా చూడగలిగే వాడే పండితుడు.అర్జునా!ఉదాహరణకు చెబుతున్నాను.విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు...ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవినీ సమదృష్టితో చూస్తాడు పండితుడు.మనమూ అలా ఎందుకు ఉండకూడదు?

Sunday, 28 June 2026

తద్బుద్ధయ స్తదాత్మానః

తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః। గచ్ఛ న్త్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి దిశానిర్దేశం యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాడు.అర్జునా!బావా!మనము మన జీవితంలో నిర్దిష్టమయిన ప్రణాలికలు పెట్టుకోవాలి.వాటి ఆచరణ కోసరం మనసా,వాచా,కర్మణా పాటు పడాలి.అప్పుడే మనం గమ్యము చేరుకోగలతాము.లేక పోతే చిల్లర గాలికి కూడా పుల్లాకు ఎలా ఎగిరిపోతుంది?ఒక గమ్యం లేకుండా,ఒక దిశా నిర్దేశం లేకుండా!ఎక్కడ,ఎలా పడుతుందో దానికే తెలియదు.అట్లా అయిపోతాయి మన బ్రతుకులు. కాబట్టి ఓ పార్థా!ముందర బ్రహ్మ జ్ఞానము పైన ఆసక్తి పెంచుకుందాము.అలా అయితే మనం మన బుద్ధినీ,మనసునీ పరమాత్మ యందే నిలపగలతాము.చిన్నగా పాపపుణ్యాలను మన వశంలో పెట్టుకోగలగాలి.అంటే చెడు చేయకుండా నియంత్రించు కోవడము,మంచిని స్పూర్తితో చేయగలగడము.అప్పుడే జన్మరహితమయిన మోక్షాన్ని పొందగలము.

Saturday, 27 June 2026

జ్ఞానేన తు తదజ్ఞానం

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః। తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్॥16॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!జీవులు స్వతహాగా ఏమీ చేయరు.కానీ వారి వారి జ్ఞానాన్ని అజ్ఞానం అనే నల్ల దుప్పటి కప్పేస్తుంది.దానిలోనుంచి చూస్తే ఏమవుతుంది?జ్ఞానమనే స్వచ్ఛమయిన తెల్లటి వెలుగు అంతా నల్లనల్లగా,అస్పష్టంగా బూజర బూజరగా కనిపిస్తుంది.అమాయకుడైన ప్రాణి అదే నిత్యమూ,సత్యమూ అనుకుంటాడు.కానీ ఆ దుప్పటి పక్కకి తీసి చూద్దాము అనే స్పృహ ఉండదు. కానీ ఆత్మజ్ఞానము పొందాలంటే ముందర అజ్ఞానము పటాపంచలు కావాలి.పూర్తిగా నాశనము కావాలి.అప్పుడు మాత్రమే మానవుడికి సూర్యసదృశమూ,అనంతకోటి వెలుగుల సమాహారము అయిన పరమాత్మ దర్శనం లభ్యమవుతుంది.

Friday, 26 June 2026

నా దత్తే కస్య చి త్పాపం

నా దత్తే కస్య చిత్పాపం న చైవ సుకృతం విభుః। అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జంతవః॥15॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము. శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుమానాలకు తావు లేకుండా ఉండేదానికోసరం శత విథాలా ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటా!ఇప్పుడే నీకు చెప్పాను కదా!కర్మ,కర్తృత్వం,తత్ఫలం అనేవి ఆత్మ ప్రేరేపణలు కావని.వాటినన్నిటినీ మాయ చేయిస్తుందని. ఇది నేను ఎందుకు చెప్పానో,ఆలోచించు.ఎందుకంటే ఆత్మ నిర్వికారమయినది.నిర్మోహం కలది.దానికి ఎలాంటి పాపాలతో కానీ,ఇంకెలాంటి పుణ్యాలతో కానీ సంబంధం ఉండదు.మరి మెలిక ఎక్కడ వస్తుందో చెబుతాను,చూడు.జీవులు యొక్క మస్తిష్కం జ్ఞానం,అజ్ఞానం అనే మాయలో కప్పబడి ఉంటాయి.కాబట్టి వారు భ్రమలో,భ్రమలలో బతుకులు సాగదీస్తుంటారు.మన పూర్వ జన్మల వాసనలు బట్టి మన ఆలోచనలు,ఆచరణలు ఉంటాయి.మనము మంచి దారిలో ముందుకు పోవాలంటే ఆ దిశగా కష్టపడాలి.చెడిపోవాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు.జారుడు బండల పైన కాలు పెట్టినట్లే!చాలా సులువు.

Thursday, 25 June 2026

న కర్తృత్వం న కర్మాణి

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః। న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే॥14॥ శ్రీమద్భగవద్గీత..కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చీటికీ,మాటికీ ఆ భగవంతుడు కారణం అని నింద తగదు.అయిన దానికీ,కాని దానికీ,చిన్న విషయానికి,పెద్ద విషయానికీ మాములుగా మనుష్యులు ఆ దేవుడు మీద తప్పంతా వేస్తుంటారు.కానీ అన్ని సమయాలలో అది సత్యం కాదు.ఎందుకంటావా?చెబుతాను,విను. మనము కర్మ,కర్తృత్వం,కర్మఫలం అనే మాటలు చెప్పుకున్నాము కదా ఇందాకటి దాకా.అవి అన్నీ పరమాత్మ ప్రమేయంతో జరగడం లేదు.అవన్నీ జీవుల స్వభావము,ప్రకృతి గుణాల వలన జరుగుతుంటాయి.అంటే ప్రధానంగా మాయయే ఆ పని చేస్తుంటుంది.ఉదాహరణకు సాత్త్వికుడు సాత్త్వికంగా ఆలోచించి,మంచి పనులు చేస్తాడు.అలానే రజోగుణము,తామస ప్రవృత్తి గలిగిన వారు వారి వారి స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు.ఈ మాయ సృష్టి కర్త ఆ భగవంతుడే!కానీ అతను వాటన్నిటికీ దూరంగా,అంటనట్లు ఉంటాడు.

Wednesday, 24 June 2026

సర్వ కర్మాణి మనసా

సర్వ కర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ। నవ ద్వారే పురే దేహే నైవ కుర్వ న్న కారయన్॥13॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్కాస యోగము. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కదా!చెప్పు చూద్దాం!నేనే చెబుతాలే,విను.అవి రెండు కళ్ళు,రెండు చెవులు,రెండు ముక్కు రంధ్రాలు,నోరు,మల,మూత్ర విసర్జన ద్వారాలు.సరేనా!మన శరీరమే ఒక నగరం అనుకో!అప్పుడు తనను తాను మానసికంగా నిగ్రహించుకున్న యోగి ఆ నగరంలోనే సుఖ శాంతులతో జీవనం గడుపుతాడు.శ్రీరామా అంటూ తాను ఏ కర్మల జోలికీ పోడు.వేరే వాళ్ళనీ పొమ్మని చెప్పడు.ఇలాంటి క్రియలకు అంతా ఆత్మనిష్ఠ,నియమము,నియంత్రణ,నిగ్రహము కావాలి.

Tuesday, 23 June 2026

యుక్తః కర్మఫలం త్యక్త్వా

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్। అయిక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే॥12॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి కొత్త కొత్త పదాలు ఆవిష్కరిస్తున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు ఇప్పుడు నైష్ఠికుడు గురించి చెబుతాను.ఒక మనిషి అచంచల దీక్ష,నియమము,నిబద్ధతతో తను పెట్టుకున్న వ్రతాలు,సిద్థాంతాలు,నియమాలు ఆచరించాలి.ఎక్కడా తడబడకూడదు.వేరేవాటిపైన దృష్టి పెట్టకూడదు.ధర్మశాస్త్రాలు,ఆశ్రమ ధర్మాలు తూచా తప్పకుండా ఆచరించాలి.అలాంటివారిని నైష్ఠికులు అని అంటారు. నైష్ఠికులు ఫలాపేక్ష లేకుండా కఠినమయిన నియమ నిబద్థతలతో,జీవిత ప్రామాణాలతో జీవనం కొనసాగిస్తారు.అలాంటి మానసిక,శారీరిక పట్టుదలతో కర్మలను ఆచరిస్తారు.కాబట్టే శాంతి పొందుతారు.అదే ఎక్కడ మోహం,కోపం,తాపం,తామసం కూడుతాయో,అక్కడ మానవుడు ఫలాపేక్షకు బందీ అవుతాడు.ఇంకేమి ఉంది?గానుగకు కట్టిన ఎద్దులాగ అక్కడక్కడే తనుచేసే కర్మలకు,కర్మఫలాలకు బద్ధుడు అవుతాడు.సంసార బంథాలకు బానిస అవుతాడు,బాథితుడు అవుతాడు,తనను తానే బంథించుకుంటాడు.

Monday, 22 June 2026

కాయేన మనసా బుద్ధ్వా

కాయేన మనసా బుద్ధ్వా కేవలై రింద్రియైరపి। యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా త్మశుద్ధయే॥11॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.బావా!అర్జునా!నేను చెప్పాను కదా యోగి అనేవాడు సంసారములో ఉన్నా చిత్తశుద్ధికోసమే కర్మలు చేస్తాడు అని.చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్లు ఉండడు అని.మళ్ళీ మళ్ళీ అదే చెబుతున్నాను.యోగులు ఫలాపేక్షను వదలి పెడతారు.కర్తృత్వాహంకారాన్ని దరిదాపులకు కూడా రానివ్వరు.వారి మనసు,బుద్ధి,ఇంద్రియాల నన్నిటినీ మనసు పవిత్రంగా,నిర్మలంగా,సంతృప్తిగా ఉండడం కోసరమే కర్మలు చేస్తారు.

Sunday, 21 June 2026

బ్రహ్మణ్యాధాయ కర్మాణి

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః। లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥10॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉదాహరణలు కూడా చెబుతున్నాడు...బాగా అర్థం కావాలని.ఆయన తపనకు జోహార్లు!అర్జునా!నాకు ఏమీ వద్దు,నాకేమీ అఖ్ఖర లేదు అనే స్థితికి మనము ఎప్పుడు వస్తాము?మనము సంతృప్తిగా ఉన్నప్పుడే కదా!ఆ సంతృప్తి మనకు ఇంద్రియ లాలస ఉన్నంత కాలము దక్కదు.మనము ప్రక్కవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తాము?వారికి మన దగ్గర ఉండేది ఎప్పుడు పంచుతాము?మన దగ్గర మనకు కావాలసిన దానికంటే ఎక్కువ ఉంటేనే కదా!మనకు అసలు ఏమీ అఖ్ఖర లేదు అంటే మనకున్నదంతా సంఘానికే కదా! మనకై మనమే మనకున్నది ఇచ్చేస్తే,పంచేస్తే...మనము వాటి పైన మోహము వదులు కున్న వారము అవుతాము.ఎదుటి వారు అడగ కుండానే ఇస్తున్నాము కాబట్టి మనమేదో గొప్పవారము,ఏదేదో సహాయము చేస్తున్నాము అనే అపోహలకు,భావనలకు దూరం అవుతాము.మనస్పూర్తిగా,ప్రతి ఫలాపేక్ష లేకుండా చేస్తాము కాబట్టి సంతృప్తిగా ఉంటాము.వారు తిరిగి మనకు సహాయం చెయ్యాలని ఆశించము,ఆరాటపడము. కాబట్టి ఓ పార్థా!అప్పుడు మనము తామరాకు పైన నీటి బొట్టులాగ అంటీ అంటనట్లు ఉంటాము.మనలను ఏ కర్మలూ బంథించలేవు.ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నాము అనుకుంటూ చేస్తూ పోతే ఏ పాపాలూ మనకు దరి చేరవు.

Saturday, 20 June 2026

నైవ కించిత్ కరోమీతి

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేతత్త్వవిత్। పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్॥8॥ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిష న్నిమిషన్నపి। ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్॥9॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి మర్మం చెబుతున్నాడు.అర్జునా!మహాబాహో!ఇందాక నేను నిష్కామ కర్మ యోగి అని చెప్పాను కదా!అతను ఏమి చేసినా చేయనట్లే!ఆయన లెఖ్ఖలో కూడికలు,తీసివేతలు ఏమీ ఉండవు.అంటే ఈ మంచి పనులకు పుణ్యం సంపాదించాడు.ఈ చెడ్డ పనులకు ఇంత పాప భారం మోస్తాడు అని.ఎందుకంటే కార్యాచరణ కంటే ముందరే అతను నిర్ణయించుకుంటాడు.నేను ఆచరించే ప్రతి పనీ ఆ యా ఇంద్రియాలు నిర్వర్తిస్తాయి.నేను మనఃపూర్వకంగా ఏమీ చేయడం లేదు.వాటి ఫలితం నాకు అఖ్ఖర లేదు...మంచి అయినా,చెడు అయినా. ఉదాహరణకు ఆ కర్మ యోగి కనినా,వినినా,తాకినా,వాసన చూసినా,నిద్రించినా,శ్వాసించినా,మాట్లాడినా...అలా ఏ పని అయినా!దీంట్లో గొప్ప ఏముంది?ప్రతి జీవి చేసేది కదా!దాంట్లో పాపాలు,పుణ్యాలు ఏంది?మళ్ళా ఆ ఫలితాలు వద్దనుకోవడం ఏంది?అని నీకనిపిస్తుంది కదా? చెబుతాను,విను. చూడడం మామూలే.కానీ ఎదుటి వాళ్ళు ఏమి చేస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు?దాని వల్ల వాళ్ళకు ఏమైనా లాభం ఉందా?మనకు ఏమైనా నష్టం ఉందా అని లెఖ్ఖలు వేస్తారు కదా,చాలామంది.అంటే దత్తి,యావ,లాభనష్టాల బేరీజులు,కోపతాపాల ప్రళయాలు,సుఖదుఃఖాల సమ్మేళనాలు...వీటన్నిటికీ దూరంగా ఉండడమే కర్మ యోగి చేసేది.

Friday, 19 June 2026

యోగయుక్తో విశుద్థాత్మా

యోగయుక్తో విశుద్థాత్మా విజితాత్మా జితేంద్రియః। సర్వ భూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే॥7॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బుజ్జగించినట్లు చెబుతున్నాడు.అర్జునా!సమవర్తిగా ఉండడం చాలా ముఖ్యము.సమస్త ప్రాణికోటిని ఒకే లాగ చూడగలగాలి.ఒకరు ఎక్కవ,ఒకరు తక్కువ కాదు.ప్రతి ఒక్క జీవిలో ఉండేది ఆ పరమాత్మ అంశమే!మనము ఎవరికంటే ఎక్కువ కాము,ఎవరి కంటే తక్కువ కాదు.కానీ నిష్కామంగా కర్మలు ఆచరించగలగాలి.శుద్థమయిన మనసు,ఆత్మ కలిగి ఉండాలి.ఇంద్రియాలను జయించి జితేంద్రియుడు కాగలగాలి.అలాంటి జ్ఞానము,జ్ఞానోదయము మనకు కలిగితే,అప్పుడు మనము ఆచరించే ఏ కర్మలూ మనలను కట్టి పడేయ లేవు.మనమూ,మన ఆత్మ స్వతంత్రులము అవుతాము.మోక్షానికి సోపానాలు వేసుకోవచ్చు,భేషుగ్గా!

Thursday, 18 June 2026

సన్న్యాసస్తు మహాబాహో

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః। యోగయుక్తో మునిర్బ్రహ్మ న్నచిరేణాధి గచ్ఛతి॥6॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి,సన్న్యాసి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!నేను ఇందాకటి నుంచీ యోగము,సన్న్యాసము అనే పదాలు వాడుతున్నాను కదా!నీకు వాటి అర్థము,వాటి మధ్య తేడా తెలుసా?చెబుతాను,విను.యోగి అనేవాడు తన గృహస్తు ఆశ్రమాన్ని విడిచి పెట్టడు.అతను ధ్యానము,యోగాభ్యాసము,ప్రాణాయమం ద్వారా మనసును,ఇంద్రియాలను నిగ్రహిస్తాడు.ద్వంద్వాలకు తావు ఇవ్వడు.ఆత్మ జ్ఞానము,మోక్షప్రాప్తి అతని లక్ష్యము. అదే సన్న్యాసి విషయానికి వస్తాము.అతను సంసారాన్నీ,భౌతిక పరమయిన ఆకర్షణలను పూర్తిగా వదలి పెడతాడు.కాషాయం ధరిస్తాడు.వీరు సంసారంతో సంబంధం పెట్టుకోరు.దూరంగా అడవులలోనో,ఆశ్రమాలలోనో నిరాడంబరమయిన జీవితం గడుపుతారు.వీరు కర్మ త్యాగం చేస్తారు.కర్మ ఫలాన్నీ త్యాగం చేస్తారు.వీరికి ఒక్కటే లక్ష్యం.అదే మోక్షప్రాప్తి! ఇప్పుడు చెప్పు,నీకు ఏమి అర్థం అయింది?నేను సులభంగా చెబుతాను.ఎవరూ యోగి కాకుండా సన్న్యాసి కాలేరు.ఒక రకంగా చెప్పాలంటే అసాథ్యమే సుమా!ఇంకో కిటుకు కూడా చెబుతాను.ముందర యోగి అయి,తరువాత సన్న్యసించిన వాడే సులభంగా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించగలడు.అంటే ఇది అంతా అంచెలంచెల మోక్షము.ముందర మనము ఇంద్రియ నిగ్రహణ నేర్చుకోవాలి.సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవాలి.మనసును ఆత్మజ్ఞానం వైపు పరుగులు తీయనివ్వాలి.ఆ తరువాత నిజమయిన సన్న్యాసం జోలికి పోవాలి.

Wednesday, 17 June 2026

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం త ద్యోగైరపి గమ్యతే। ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి॥5॥5॥ శ్రీమద్భగవద్గీత....కర్మ సవ్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయమే ఇంకో రకంగా చెబుతున్నాడు.ఆయన తపనంతా అర్జునుడు సరిగ్గా విషయం బుర్రలోకి ఎక్కించుకోవాలనే!ఇంకొకటి కాదు!అర్జునా!ఇప్పుడే మనం అనుకున్నాము కదా జ్ఞానయోగము,కర్మ యోగము అని.ఏ మార్గము ఎంచుకున్నా ఒకటే అని.ఎందుకంటే,జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మ యోగులూ పొందుతారు.మార్గాలు వేరు కానీ ఫలితం ఒక్కటే!అసలు ఈ రెంటికీ భేదం లేదు అని మనం గుర్తించాలి.అలా గ్రహించిన తదుపరి మనము దార్శనికులము అవుతాము.ఇదంతా సత్యాన్వేషణ,సత్యశోథన.ఏమైనా కొంచెం అర్థం అవుతున్నదా,బావా?

Tuesday, 16 June 2026

సాంఖ్య యోగౌ పృథగ్బాలాః

సాంఖ్య యోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః। ఏక మప్యాస్థిత స్సమ్య గుభయో ర్విందతే ఫలమ్॥4॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!భరతశ్రేష్ఠా!నీకు అనుమానం వచ్చింది కదా కర్మ త్యాగం మంచిదా?కర్మానుష్ఠానం మంచిదా?అని.నాకు తెలుసు.చెబుతాను,విను.ఏ పండితుడూ జ్ఞాన యోగము మంచిది,కర్మయోగము కాదు అనిగానీ..।లేకపోతే కర్మ యోగమే మంచిది జ్ఞాన యోగము దేనికీ పనికి రాదని చెప్పడు.అవి అసలు వేరు వేరు అని కూడా చెప్పడు.ఎందుకంటే అవి ముక్తిని పొందేదానికి రెండు మార్గాలు..।అంతే!మనము ఒక దారిని ఎంచుకుంటే ఇంకొకటి తక్కువది అని కాదు.ఇంకొక విషయం!ఏదైనా శుద్ధంగా,క్షుణ్ణంగా అర్థం చేసుకుని అవలంబిస్తే,మానవుడికి రెండింటి ఫలమూ లభిస్తుంది.చాలా లాభదాయకమయిన వ్యవహారం కదా!

Monday, 15 June 2026

జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ

జ్ఞేయ స్స నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి। నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధా త్ప్రముచ్యతే॥3॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా విఫులంగా వివరిస్తున్నాడు.అర్జునా!పార్థా!సన్న్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది?రాగ ద్వేషాలకు దూరంగా ఉండడమే కదా!అడవులకు వెళ్ళి,ముక్కు మూసుకుని,ఘోర తపస్సు చేస్తేనే సన్న్యాసం కాదు.ఎవడైతే కోప తాపాలకు,రాగ ద్వేషాలకు దూరంగా ఉంటాడో వాడే నిజమయిన సన్న్యాసి. ముందు మనలో ఉండే ప్రేమ-ద్వేషం,ధైర్యం-భయం,సంతోషం-దుఃఖం...ఇలాంటి ద్వంద్వ భావాలకు స్వస్థి చెప్పాలి.అన్నిటినీ ఒకే రకంగా చూడగలగాలి,సమన్వయం చేసుకోగలగాలి.అలా అయితేనే మానవుడు కర్మ బంధాల నుంచి విముక్తి పొందగలడు,ముక్తి కి చేరువయి భవసాగరాన్ని సులభంగా దాటగలడు.

Saturday, 13 June 2026

సన్న్యాసః కర్మ యోగశ్చ

శ్రీభగవానువాచ... సన్న్యాసః కర్మ యోగశ్చ నిశ్శ్రేయసకరా వుభౌ। తయోస్తు కర్మ సన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే॥2॥5॥ శ్రీకృష్ణుడు అర్జునుడి మాటలకు కోపం తెచ్చుకోలేదు.విసుగు పడలేదు.మంచిగా చిరు నవ్వులు చిందిస్తూ సమాథానం చెప్పాడు.నేను కర్మలు మానమని చెప్పింది నిజమే!కర్మలు చేయమని చెప్పిందీ నిజమే!కాదనను.ఎందుకంటే కర్మత్యాగము,నిష్కామ కర్మానుష్ఠానము ...ఈ రెండూ కూడా శ్రేష్ఠమయిన ప్రక్రియలే!కానీ ఈ రెండింటినీ బేరీజు వేస్తే నిష్కామ కర్మ యోగమే ఉత్తమమయినది.ఎందుకంటే పనులకు పనులూ జరిగిపోతుంటాయి.వాటి వాసనలు కర్తకు అంటవు.ఎందుకంటే ఆ కర్మలను అతను ప్రతిఫలాపేక్ష లేకుండా ఆచరిస్తాడు కాబట్టి.

Friday, 12 June 2026

సన్న్యాసం కర్మణాం కృష్ణ

అర్జున ఉవాచ... సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి। యచ్ఛ్రేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్॥1॥5॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ సన్న్యాస యోగము... అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒకటి తరువాత ఇంకొకటి చెబుతుంటే తల గిర్రున తిరుగుతుంది.కొంచెం అర్థం అయినట్లు ఉంటుంది.ఇంకొంచెం అర్థం కావడం లేదు.డోలాయమానంలో ఉన్నాడు.ఇంక ఉండబట్టలేక అడుగుతున్నాడు.బావా!కృష్ణా!ఏంది స్వామీ నీవు చెప్పేది?ఒకసారి కర్మలను వదలి పెట్టు అంటావు.ఇంతలో కర్మానుష్ఠానం చెయ్యి అంటావు.అనుమానం వద్దు అంటావు.జ్ఞానం అంటావు.సాథన అంటావు.స్థిత ప్రజ్ఞత అంటావు.కాసేపట్లో రా!లేచి రా!అంటావు.అసలు నేను ఏమి చెయ్యాలో దిక్కుతోచడం లేదు.సరిగ్గా,స్పష్టంగా చెప్పు సఖా అని అంటున్నాడు అర్జునుడు.

Thursday, 11 June 2026

తస్మాదజ్ఞాన సంభూతం

తస్మాదజ్ఞాన సంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః। ఛిత్త్వైనం సంశయం యోగ మాత్తిష్ఠోత్తిష్ఠ భారత॥42॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము.. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన యోగో నామ చతుర్థోఽధ్యాయః... శ్రీకృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు.అర్జునా!సఖా!నీవు ఇంక దిగులు పడాల్సింది,అనుమానించాల్సింది ఏమీ లేదు.ధైర్యంగా లేచి,ముందుకు పో!ఎందుకంటే జ్ఞానమనేది వజ్రాయుథం లాంటిది అని చెప్పాను కదా!ఆ జ్ఞానమనే కరవాలంతో సందేహాలు అనే తుప్పలను,కంచెలను నరుక్కుంటూ పో!నీకు తిరుగులేదు.యోగాన్ని ఆశ్రయించు.అదే నీకు సరైన మార్గం చూపుతుంది.నిన్ను ఆపేవాడు ఎవ్వడూ లేడు!లే!కదలి రా! ఇట్లు ఉపనిషత్తులు,బ్రహ్మవిద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమయిన భగవద్గీతలో జ్ఞానయోగమను నాలుగవ అధ్యాయము సమాప్తము..।

యోగ సన్న్యస్త కర్మాణం

యోగ సన్న్యస్త కర్మాణం జ్ఞానసంఛిన్న సంశయమ్। ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ॥41॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన మాటల వెనక ఉండే పరమార్థం వివరిస్తున్నాడు.అర్జునా!హే ధనంజయా!నేను మనిషికి అలసత్త్వం,అజ్ఞానం,అశ్రద్ధ,అనుమానం,అసహనం ఉండకూడదు అని చెప్పాను కదా!ఎందుకనుకుంటున్నావు?శ్రద్ధ,సహనం చాలా ముఖ్యం అని చెప్పాను కదా!ఇవన్నీ చెప్పేదానికి కారణం ఒక్కటే!మనం పరమార్థ జ్ఞానంతో కర్మలను తెలుసుకుంటాము,ప్రతిఫలాపేక్ష లేకుండా ఆచరిస్తాము.బ్రహ్మ జ్ఞానంతో సంశయ నివృత్తి చేసుకుంటాము.అట్లా చేసుకుంటే మానవుడిని ఎలాంటి కర్మలు కూడా బంధించ లేవు.

Wednesday, 10 June 2026

అజ్ఞ శ్చాశ్రద్ధధానశ్చ

అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి। నాయం లోకోఽస్తిన పరో న సుఖం సంశయాత్మనః॥40॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ ఏపనులకు దూరంగా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!మిత్రమా!ఇప్పుడు నీకు శ్రద్ధ,సహనాలతో జ్ఞానాన్ని సంపాదించవచ్చని చెప్పాను కదా!అట్లాగే మనం వేటి వేటికి దూరంగా ఉండాలో కూడా ప్రస్తావించుకుందాము.శ్రద్ధ,జ్ఞానము లేని వాడిని ఎవరూ బాగుపరచలేరు.అట్లాగే సందేహాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు,అసలు నమ్మకమనేదే లేని వాడు జీవితంలో ఏమీ సాథించలేడు.ఇంక వాళ్ళు చెడిపోకుండా,ఏమవుతారు,చెప్పు?అన్నీటికీ అనుమానం పెనుభూతమై రెంటికీ చెడ్డ రేవడి అవుతాడు.ఇట్లా ఇహంలో ప్రశాంతంగా ఉండలేడు.అటు పరంలో ఏమీ సాథించుకోలేడు.కాబట్టి ఓ అర్జునా!నీవు అశ్రద్ధ,అజ్ఞానం,అనుమానాలని దరిదాపుల్లోకి కూడా నీ జీవితంలోకి తీసుకురాకు.

Tuesday, 9 June 2026

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః। జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి॥39॥4॥ శ్రీమద్భగవద్గీత..।।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడి బుర్రలోకి తను చెప్పేది బాగా నిక్షిప్తం కావాలని పదే పదే చెబుతున్నాడు.అర్జునా!సఖా!నేను నీకు ఏమి చెప్పాను?ముందర ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అనే కదా!ఆ తరువాత ఏకాగ్ర చిత్తం సాధించాలి.అది ఎట్లా అంటావా?శ్రద్ధ,సహనాలతో ఏకగ్ర సాథన చేయవచ్చు.అంటే మనసు పట్టు తప్పకూడదు.ఒకే విషయం పైన దృష్టి పెట్టి,దానిని కైవశం చేసుకోవాలి.అలా చేసేవాడు జ్ఞానాన్ని పొందగలుగుతాడు.జ్ఞానాన్ని పొందిన కొద్ది కాలంలోనే మోక్షాన్నీ పొందగలుగుతాడు.ఎందుకంటే ఇవన్నీ ఒకదానితో ఇంకొకటి ముడిబడి ఉంటాయి.ఒక ముడి విప్పగలిగితే,ఇంకో ముడి సులభంగా విప్పవచ్చు.మొదలు పెట్టక ముందే గందరగోళంగా,మొదలు,కొస అర్థం కావడం లేదు అనిపిస్తుంది.అంటే నీకు ఏమనిపిస్తుంది?సహనము,దీక్ష,పట్టుదల,జిజ్ఞాస ఉంటే ఏమైనా సాథించ వచ్చు అనే కదా!

Sunday, 7 June 2026

న హి జ్ఞానేన సదృశం

న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే। తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి॥38॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఖచ్ఛితంగా చెబుతున్నాడు.అర్జునా!హే పార్థా!నువ్వు ఎక్కడెక్కడన్నా తిరుగు.ఏ ఏ సిద్ధాంతాలు అన్నా ముందర పెట్టు.కానీ చివరకు మిగిలే జవాబు ఒక్కటే!అదే జ్ఞానము!జ్ఞానాన్ని మించినది,శక్తివంతమయినది,బలమయినది ఈ సృష్టిలో ఇంక వేరే ఏమీ లేదు.కర్మ యోగ సిద్ధిని పొందాలి మనము ముందర.అది మన గుప్పిటలో ఉంటే కాలక్రమాన ఆ జ్ఞానమనేది మనకు మనకే తెలుస్తుంది.ఏ పుణ్య తీర్థాలకు పో అఖ్ఖర లేదు,ఏ పుణ్య నదులలో ముణగక్కర లేదు.

Saturday, 6 June 2026

యథైధాంసి సమిద్ధోఽగ్ని

యథైధాంసి సమిద్ధోఽగ్ని ర్భస్మసా త్కురుతేఽర్జున। జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా॥37॥4॥శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!హే పాండవ మథ్యమా!నీకు ఇంకా సులభంగా అర్థం అయ్యేటట్లు చెబుతాను.అగ్ని,అదే నిప్పు కట్టెలకంటుకుంటే ఏమవుతుంది?కట్టెలన్నీ కాలిపోతాయి కదా!ఒట్టి బూడిద మిగులుతుంది.అంతే కదా!ఇక్కడ కూడా అచ్ఛం అలాగే జరుగుతుంది.మనం చేసే కర్మలు,పాప కర్మలు అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో కాలి,భస్మం అయిపోతాయి.మనం స్వచ్ఛంగా బయటపడగలతాము.ఆ జ్ఞానాన్ని మనం వజ్రాయుథం లాగా మలుచుకుని జీవన సమరంలో విజయం పొంది,ముక్తి పొందగలము.

Thursday, 4 June 2026

అపి చేదసి పాపేభ్య

అపి చేదసి పాపేభ్య స్సర్వేభ్య పాపకృత్తమః। సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి॥36॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి మర్మం అంతా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభతరంగా చెబుతున్నాడు.అర్జునా!మనిషి అన్న తరువాత తప్పులూ,పాపాలూ,పాప కర్మలు చేయకుండా ఉండలేడు.అలా చేసే దానికి కారణాలు చాలా ఉండవచ్చు.అందులో అజ్ఞానం,అహంభావం ముఖ్యమయిన కారణాలు అయి ఉంటాయి.నేను నీకు ఇదే చెబుతున్నాను.నువ్వు ఎంత పాపాత్ముడవు అయినప్పటికీ జ్ఞానమనే తెప్ప సహాయం తీసుకోవాలి.అలా జ్ఞాన మార్గాన్ని ఎన్నుకుంటే ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటగలవు.లేక పోతే ఎక్కడికక్కడ మోహం,కామం,క్రోథం,లోభం,మదము..ఇలా అన్ని దుర్గుణాలూ సుడి గుండాల లాగా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి,నిర్వీర్యులను చేస్తాయి.కాబట్టి వీటిని పటాపంచలు చేసే మంత్ర దండం,జ్ఞానము,మన చేతిలో ఉంచుకోవాలి.

Wednesday, 3 June 2026

యద్ జ్ఞాత్వా న పునర్మోహం

యద్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ। యేన భూతాన్య శేషేణ ద్రక్శ్య స్యాత్మ న్యథో మయి॥35॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాన సముపార్జన ఎంత లాభదాయకమో చెబుతున్నాడు.అర్జునా!హే పాండవా!నేను ఇదంతా నీకు అనవసరంగా చెప్పడం లేదు.ఒక మనిషి జ్ఞానం సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమయిన విషయం.ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు మోహంలో పడడు.మోహం,లోభం,కామం...ఇలా తప్పుదారిలో నడవడు.నీవు నా లాగానే సమస్తాన్నీ నీలోనే చూసుకుంటావు.ఎందుకో చెప్పనా!మన ఆత్మ ఆ పరమాత్మలో భాగమే!అంటే నీవే దేవుడు,నీలోనే దేవుడు,నీ చుట్టూరా దేవుడు.అంటే అంతా అవినాభావ సంబంథం.అంతా ఒక్కటే!మనం గ్రహించాలి అంతే!

Tuesday, 2 June 2026

తద్విద్ధి ప్రణిపాతేన

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా। ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః॥34॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అణకువ,జ్ఞాన సముపార్జనల గురించి చెబుతున్నాడు.అర్జునా!అంతా నాకే తెలుసు అనే అహంభావం ముందర వీడాలి మనం.జ్ఞానం అనేది ఆషామాషీగా రాదు.మనం అంటుంటాం కదా అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది,ఏమీ లేని ఆకు ఎగెరెగిరి పడుతుంది అని.అలానే ఇక్కడ కూడా.తాత్త్వికులు,జ్ఞానయోగులు ఎక్కడున్నారు,ఎలా ఉన్నారు అని కూడా తెలియదు.మనం ఏమో ఉప్పుకప్పురంబు పద్యం నోటికి రాగానే కన్నూ మిన్నూ గానకుండా ఉంటాము.మనమే పెద్ద విజ్ఞాన గని ,ఘనాపాటి అనుకుంటాము.కాబట్టి మొట్ట మొదట అహం వదిలేయాలి.తాత్త్వికులు,జ్ఞానులు దగ్గరకు వినయంగా వెళ్ళాలి.వాళ్ళను మంచిగా సేవించీ,ప్రార్థించీ,వారి మన్నన పొంది జ్ఞానం సంపాదించుకోవాలి.

Monday, 1 June 2026

శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞాత్

శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప। సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే॥33॥4॥ శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!యజ్ఞాలు ద్రవ్యపరమయినవి,జ్ఞానపరమయ్నవి ఉన్నాయి కదా!నేను చెబుతున్నాను విను.ఓ పరంతపా!ఎప్పుడూ ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమయినది.ఎందుకంటావా?ఎందుకంటే అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తిపొందుతాయి.ప్రతి ప్రశ్నకూ ఒక పరిష్కారము ఉంటుంది.ఆ పరిష్కారానికి మార్గము చూపేదే జ్ఞానము.అంటే జ్ఞానము లేకపోతే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది.లేక పోతే అసలు ప్రశ్నే పుట్టదు.మనలో సత్యం తెలుసుకోవాలనే పిపాస ఉంటేనే కదా ప్రశ్న మొదలయ్యేది.ప్రశ్న మదిలో మెదిలితేనే కదా పరిష్కారం కోసం తపన మొదలయ్యేది.ఆ అన్వేషణకు ముగింపు జ్ఞానోదయంతోనే కదా మనకు దక్కేది.కాబట్టి జ్ఞాన సముపార్జన చాలా ముఖ్యము.