Sunday, 31 May 2026
ఏవం బహువిధా యజ్ఞా
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే।
కర్మజా న్విద్ధి తాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే॥32॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు అన్ని రకాల యాగాలు,యోగాలు గురించి చెప్పాను కదా!ఈ రకంగా చాలా యజ్ఞ కర్మలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి.అవి అన్నీ రకరకాల మానసిక,శారీరకమయమయిన కర్మాశ్రితాలే!ఈ విషయం తెలుసుకుని,సమగ్రంగా ఆచరణలో పెడితే నీవు మోక్షగామివి అవుతావు.
Friday, 29 May 2026
యజ్ఞ శిష్టా మృత భుజో
యజ్ఞ శిష్టా మృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్।
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ॥31॥4॥
శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యాగము,యజ్ఞము చేయడమనేది మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమో చెబుతున్నాడు.అర్జునా!ఓ కురుసత్తమా!ఇంత దీర్ఘంగా,ఇందాకటి నుంచి నేను యాగము,యజ్ఞము గురించి ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుందా?ఎందుకంటే యజ్ఞ శేషము అమృతము లాంటిది.దానిని పొందిన వారు,అనుభవించినవారు శాశ్వత బ్రహ్మను పొందుతారు.అదేమీ చిన్నా,చితకా విషయం కాదు.లేనిపోని తలకాయ నొప్పి నాకెందుకులే స్వామీ!నాకు ఈ యజ్ఞాలు,యగాలు అవసరం లేదు అనుకునే వారు కూడా ఉంటారు.కానీ వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతాను,విను.వాడికి ఇహ లోకమే శూన్యం.అంటే పెద్ద సున్నా!ఇక్కడికే పనికిరాకపోతే,ఇంక పరలోకము ఎక్కడుంటుంది?కూపస్థ మండూకంలాగ,చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ బతకాల్సిందే!అంతే కదా!బావిలో కప్పకు బాహ్య ప్రపంచం గురించి ఏమి తెలుస్తుంది?దాని దృష్టిలో ఆ బావే బ్రహ్మాండం!అదే స్వర్గం!అదే నరకం!
Thursday, 28 May 2026
అపరే నియతాహారాః
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి।
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః॥30॥4॥
శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిథ రకాల హోమాల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పటి వరకూ నీకు నేను ఎన్ని రకాల హోమాల గురించి చెప్పాను కదా!ఆఖరుగా ఇంకొక్క హోమం గురించి చెబుతాను.ఇక్కడ నియమితమయిన ఆహారపరులుగా ఉండాలి.ఆ స్థితిలో ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తారు.అంటే ఊపిరి బిగబట్టి ప్రాణాయామం చేసినా,నియమిత ఆహారంతో ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేసినా,ఇంద్రియ నిగ్రహమనే అగ్నిలో హోమం చేసినా....ఎవరు ఏ రకంగా వారి వారికి తగినట్లు చేసినా,వాళ్ళందరి ఉద్దేశం ఒక్కటే!వారి వారి యజ్ఞాలు,యాగాలు,హోమాల ద్వారా పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నారు.మనసు,శరీరం నిర్మలం,స్వచ్ఛం అయినప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాము అని నమ్ముతున్నారు.అది నిజం కూడా!అందుకనే ఎంత కఠినమయిన ప్రక్రియలు అయినా ఇష్టంగా,నిష్టగా,మనసు పెట్టి అవలంబిస్తున్నారు.
Wednesday, 27 May 2026
అపానే జుహ్వతి ప్రాణం
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే।
ప్రాణాపాన గతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః॥29॥4॥
శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యాగాలలో రకాలు చెబుతుంటే నోరెళ్ళ బెట్టి వింటున్నాడు.అంతా క్రొత్తగా ఉంది.శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!మిత్రమా!ఇప్పుడు నీకు ఎన్ని రకాల యజ్ఞాల గురించి చెప్పాను ఒకసారి నెమరు వేసుకుందాము.బ్రహ్మైక భావంతో ఆత్మను ఆత్మయందే హోమం చేయడం ఒక రకం.ఇంకొకటి ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేయడం.విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం.ప్రాణ వ్యాపారాలను జ్ఞాన జ్వలితమయిన ఆత్మ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేయడం.ద్రవ్య రూపమయిన యాగం,వ్రత రూపమయిన తపో యజ్ఞం,ప్రాణాయామ పరమయిన యోగ యజ్ఞం,వేదాభ్యాసాది స్వాధ్యాయ యజ్ఞం.
ఇన్ని రకాలు చెప్పుకున్నాము కదా,పార్థా!ఇవి కాక ఇంకా చాలా రకాలు ఉన్నాయి.కొందరు వాయు గమనాలను నిరోథించి,అపానంలో ప్రాణాన్నీ,ప్రాణంలో అపానాన్నీ హోమం చేస్తారు.అంటే ఏమీ లేదు అర్జునా.మనం పీల్చే గాలి,వదిలే గాలిని నియంత్రించడం.మన చెప్పు చేతల్లో పెట్టుకోవడం.
మనం ఊపిరితిత్తులలోకి గాలిని పీల్చుకుంటాము కదా,దానిని పూరకము అని అంటారు.గాలిని వదిలి పెట్టే ప్రక్రియను రేచకము అని అంటారు.లోపలికి పీల్చిన గాలిని అలానే నిలిపి పెట్టడాన్ని అంతర కుంభకము అని అంటారు.గాలిని వదిలి వేసిన తరువాత ఊపిరి తిత్తులను అలా ఖాళీగా ఉంచే ప్రక్రియను బాహ్య కుంభకము అని అంటారు.ఇదంతా సాథనతోనే సమకూరుతుంది.
Tuesday, 26 May 2026
ద్రవ్య యజ్ఞా స్తపోయజ్ఞా
ద్రవ్య యజ్ఞా స్తపోయజ్ఞా యోగయజ్ఞా స్తథాఽపరే।
స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ స్సంశితవ్రతాః॥28॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న విషయము కూడా సవివరంగా చెబుతున్నాడు.అర్జునా!పాండవ మధ్యమా!ఈ యాగాలూ,యజ్ఞాలూ అన్నీ ఒక్కటేగా ఉండవు.మనిషి మనిషికీ తనకు తగిన పరిమితులూ,పరిస్థితులూ,ఆలోచనా విథానమూ,పరిపక్వత పరిమాణం,మానసిక,శారీరిక స్థితి...ఇలా చాలా విషయాలు పరిగణలోకి ఉంటాయి.కాబట్టి వాటన్నిటికీ తగినట్లుగా యజ్ఞ యాగాదులు చాలా రకాలుగా ఉంటాయి.
కొందరు ద్రవ్య రూపమయిన యాగాన్ని అనుసరిస్తారు.ఇంకొందరు వ్రత రూపమయిన తపో యజ్ఞాన్ని అవలంబిస్తారు.మరి ఇంకొకరు ప్రాణాయామ పరమయిన యోగయజ్ఞాన్ని పాటిస్తారు.మరి ఇంకొక వర్గము వేదాభ్యాసాది స్వాధ్యాయ యజ్ఞాన్ని వాడుకలో పెడతారు.
ఈ యజ్ఞాలు,యాగాలు ఎన్ని,ఏ రకంగా చేసినా వాటి ఆంతర్యం భగవంతునిలో మమేకం కావటమే!
Monday, 25 May 2026
సర్వాణీంద్రియ కర్మాణి
సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే।
ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే॥27॥4॥
శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక దానికి మించిన ఇంకొక సమర్పణ గురించి చెబుతున్నాడు.అర్జునా!కిరీటీ!ఇప్పుడు నీకు నేను కొన్ని రకాల సమర్పణల గురించి చెప్పాను కదా!ఏంది,చెప్పు?ఒకటి...ఆత్మను ఆత్మతో హోమం చేయడం.రెండవది...ఇంద్రియ నిగ్రహంలో హోమం చేయడం.మూడవది...విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం.
ఇంకొక వర్గం ఉంది.వాళ్ళేమి చేస్తారో,చెప్పేదా?వాళ్ళు ప్రాణ వ్యాపారాలన్నిటినీ జ్ఞాన జ్వలితమయిన ఆత్మ నిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తున్నారు.ఇప్పుడు అర్థం అవుతుందా,మనము ఎక్కడ ఉన్నామో?ఆ స్థితి చేరాలంటే ఏంచేయాలో?
శ్రోఁత్రాదీ నీంద్రియాణి
శ్రోఁత్రాదీ నీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి।
శబ్దాదీ న్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి॥26॥4॥
శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి హోమాలు ఎన్ని రకాలుగా చేయవచ్చో చెబుతున్నాడు.అర్జునా!పార్థా!హోమం అంటే మాములుగా మనం ఏమనుకుంటాము?హోమగుండం చుట్టూ ఋత్విక్కులు కూర్చుని మంత్రోచ్ఛారణ చేస్తూ,హోమగుండంలో మూలికలు వేస్తూ,నెయ్యి వేస్తూ హోమాగ్ని రగులుతుండేలా చేస్తుంటారు.ఇది కాకుండా వేరే రకమైన హోమాలు కూడా ఉన్నాయి.అందులో ఇందాక నేను చెప్పాను కదా ఆత్మను ఆత్మయందే హోమం చేయటం!ఇంకొంత మంది ఇంద్రియ నిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తారు.మరి ఇంకొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తారు.
ఇలా ఎవరు ఏ రకంగా చేసినా అంతిమ లక్ష్యం ఒక్కటే!కోరికలు ఉండకూడదు.ప్రతిఫలం ఆశించకూడదు.మన ధర్మం మనం ఆచరించాలి.అంతే!
Sunday, 24 May 2026
దైవమే వాపరే యజ్ఞం
దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే।
బ్రహ్మగ్నా వపరే యజ్ఞం యజ్ఞేనై వోపజుహ్వతి॥25॥4॥
శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి సమర్పణ గురించి చెబుతున్నాడు.అర్జునా!మనలో కొంత మంది దేవతలను తృప్తి పరిచేదానికి యజ్ఞాలు చేస్తారు.సామాన్యంగా అలాంటివి అన్నీ ఆయా దేవతలను సంతృప్తి పరచి,వాళ్ళ ద్వారా లాభం పొందాలనుకునే ప్రక్రియలు.కానీ అసలు సిసలు సమర్పణ అంటే ఏందో చెబుతాను,విను.ఇందాక నేను చెప్పాను కదా ఈ సృష్ఠి అంతా బ్రహ్మమయము అని.ఆ బ్రహ్మైక భావనతో కొందరు ఉంటారు.వారికి యజ్ఞశాలలు అఖ్ఖరలేదు.యజ్ఞ గుండాలు,సామగ్రి అఖ్ఖరలేదు.మంత్ర పఠనానికి తోడు ఋత్విక్కులు అక్కరలేదు.వారు నిత్యము,సత్యము అయిన సర్వవ్యాపకుడిని బ్రహ్మైక భావంతో ఆత్మను ఆత్మయందే హవిస్సులాగ ఉపయోగించి హోమం చేసి,ఆత్మార్పణం చేసుకుంటారు.
అసలు అక్కడ నువ్వే నేను,నేనే నువ్వు అనే భావన.నేనే నేను కానప్పుడు నువ్వు నేను ఎలా అవుతాను?అంటే అంతా మిథ్యే కదా!అంటే నీ,నా అంటూ ఏమీ లేదు.అంతా శూన్యమే!అంతా ఫలభరితమే!అంతా కలిసిపోయింది.దేనినుంచీ దేనినీ విడదీయలేము.
Saturday, 23 May 2026
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా॥24॥4॥
శ్రీమద్భగవద్గీత..।।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా బ్రహ్మమయం అని చెబుతున్నాడు.అర్జునా!బ్రహ్మము అంటే అత్యున్నతమయిన శక్తి.దానికి ఒక శరీరం అంటూ ఏమీలేదు.ఈ సర్వజగత్తునీ కమ్ముకుని,నిర్దేశిస్తూ ఉంటుంది.దానినుంచి మనము దేనినీ విడదీయలేను.ఒకరకంగా చెప్పాలంటే అదే అద్వైతము .అది నిజము.అది శాశ్వతము.అది సృష్టికి మూలాథారం.అది లేని చోటు అంటూ ఏమీలేదు.
అందుకే చెబుతున్నాను.సృక్ సువాదులు బ్రహ్మ.అంటే యజ్ఞ గుండంలో నెయ్యి వేసేదానికి వాడే గరిటలు,మిగిలిన సామానులు అని అర్థం.హోమంలో వేసేదానికి వాడే ద్రవ్యాలు బ్రహ్మ.అగ్ని బ్రహ్మ.ఆహుతి ఇచ్చేవాడు బ్రహ్మ.మనం అంత సమర్పించేదీ బ్రహ్మకే.అంటే ఇచ్చే వస్తువులు,వాడే వస్తువులు,ఇచ్చేవాడు,పుచ్చుకునేవాడు అందరూ బ్రహ్మలే!అంటే సర్వం బ్రహ్మమయం.ఈ విషయం తెలుసుకున్నవాడు బ్రహ్మత్వాన్ని పొందకుండా ఎలా ఉంటాడు చెప్పు.
అంటే ఆత్మ,పరమాత్మ ఒక్కటే అనే అవగాహన అనివార్యం,అవసరం!
Friday, 22 May 2026
గత సంగస్య ముక్తస్య
గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః।
యజ్ఞా యా చరతః కర్మసమగ్రం ప్రవిలీయతే॥23॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు తిప్పి తిప్పి ఒకటే విషయం చెబుతున్నాడు.అది అవసరము కూడా!ఎందుకంటే మనవి బుర్రలు బాగానే పని చేస్తాయి.కానీ నిజంగా బుర్రలోకి,నరనరాల్లోకి ఒక విషయం జీర్ణించుకుని పోవాలంటే ఒక సారి కని,ఒక సారి విని,ఇంకొక సారి ఒప్పచెబితే సరిపోదు.పదే పదే వినాలి.పదే పదే మననం చేసుకోవాలి.పదే పదే అర్థం చేసుకోవాలి.సమన్వయం చేసుకోవాలి.అప్పుడు ఆచరణలోకి వస్తుంది.ఎప్పుడు కూడా ఇట్టా వచ్చేది అట్టానే పోతుంది.గల గల పారే నీరు భూమి లోకి పూర్తిగా,లోతుగా ఇంకదు.చుక్క, చుక్క,చుక్కకు చుక్క చిన్నగా పడుతుంటే నేల బాగా,లోతుగా తడుస్తుంది.ఆ తడి ఎక్కువ సేపు కూడా నిలుస్తుంది.పై పై పొరల్లో ఉండేది తొందరగా ఆవిరి అయిపోతుంది.
అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!మిత్రమా!మానవుడు ఫలాపేక్షను విడవాలి.బ్రహ్మ జ్ఞాన నిష్ఠాపరుడు కావాలి.ఈశ్వరుని తృప్తికి,ప్రీతికి మటుకే యజ్ఞాలు,యాగాది కర్మానుష్ఠాలు చేయాలి.ఏ కోశానా మమ,అహం అనే భావన ఇసుమంతైనా ఉండకూడదు.అట్లా కర్మలు చేస్తే పూర్వ కర్మలు కూడా నశిస్తాయి.అట్లాంటిది ప్రస్తుత కర్మలు అతనిని బంథించలేవు.అతను కడిగిన ముత్యంలాగ స్వచ్ఛం అయి తీరతాడు.
యదృచ్ఛా లాభ సంతుష్టో
యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః।
సమ సిద్థావ సిద్థౌచ కృత్వాపి న నిబధ్యతే॥22॥4॥
శ్రీమద్భగవగ్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మనము ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఇందాకటి నుంచి నేను నీకు మనిషి ఎలా ఉండాలో చెబుతున్నాను.అదే ఇంకొంచెం వివరంగా చెబుతాను.మనము మనకున్న దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి.ప్రతి దానికీ అసంతృప్తి,అనుమానం,అసహనం ఉండకుండా ఉండాలి.మనము అసూయ,ఈర్ష్య,పగ,ప్రతీకారాలను మరిచిపోవాలి.మనసులో కూడా మననం చేసుకోకూడదు.ఎందుకంటే ఈ మాత్సర్యంకి మూల కారణం అసంతృప్తి.మనకేదో అన్యాయం జరుగుతుందేమో అనే అనుమానం.మనకంటే ఎదుటివాడు మనకంటే ఎక్కువ సత్తా లేక పోయినా,మనకంటే బాగా వృద్ధిలోకి వస్తున్నాడేమో అనే శంక.వాడిని ఎలాగైనా పడగొట్టాలి,మనమే ముందుకు పోవాలి అనే పగ,ప్రతీకార్య చర్యలు,ఆబ,అత్యాశ.వీటన్నిటినీ తుడిచి పెట్టేయాలి.మనము మనము చేపట్టిన కార్యము,కర్మ సిద్ధించినా,సిద్ధించకపోయినా మనసు సమతుల్యంగా ఉండేలా సాథన చెయ్యాలి.
అంటే,తనకు లభించిన దానితో తృప్తి పడేవాడు,శంకారహితుడు,మాత్సర్యం లేనివాడు,కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు...ఏ కర్మలు చేసినా బంధాలు అనే చట్రంలో చిక్కుకోడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన వెలిగిపోతుంటాడు.
Thursday, 21 May 2026
నిరాశీ ర్యత చిత్తాత్మా
నిరాశీ ర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥21॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలో చెబుతున్నాడు.అర్జునా!సఖా!మనలో ఎవరైనా పాపకూపంలో ఇరుక్కోవాలి అనుకుంటామా?మన జీవితాలు భ్రష్టు పట్టి,నాశనం అయిపోవాలని కోరుకుంటామా?లేదు కదా!మరి అలాంటప్పుడు మనం ఏమి చెయ్యాలి?ఆ చెడు,దీన స్ధితికి రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే ప్రణాళిక,అవగాహన ఉండాలి కదా!నేను చెబుతాను,విను.
మనము తృష్ణ,అదే కోరికలు లేకుండా ఉండాలి.మనసునూ,ఇంద్రియాలను మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి.అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి.దత్తికి పోయి కనిపించిందంతా చేజిక్కించుకోవటం కాదు,అతి తక్కువలో మన జీవనం కొనసాగించగల్గేటంత సమకూర్చుకుంటే చాలు.ఈ మూడు సూత్రాలూ తు.చ.తప్పకుండా పాటిస్తే మనిషి పాప కూపంలో చిక్కుకోడు.లేకపోతే అథఃపాతాళానికి జారిపోతాడు.ఇది నేను భయపెట్టేదానికి నీకు చెప్పడం లేదు.మంచి మాటలు విని,ఆచరణలో పెట్టకపోతే ఏమి జరుగుతుందో హెచ్చరిస్తున్నాను.అంతే!
Wednesday, 20 May 2026
త్యక్త్వా కర్మఫలాసంగం
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః।
కర్మ ణ్యభి ప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః॥20॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్మలు ఎలా చెయ్యాలో చెబుతున్నాడు.అర్జునా!మనము ముందర కర్మలను ఎలాంటి ఫలితం ఆశించకుండా చేయాలి.ఎప్పుడూ అసంతృప్తిని దరిదాపుల్లోనికి రానివ్వకూడదు.మనము దేనికోసమూ ఒకరి పైన ఆథార పడకూడదు.అంటే ఉన్నదాంతో తృప్తి పడాలి.ఇలాంటి మనో వికాసంతో ఉన్నవాడు కర్మలు చేసినా,చేయనట్లే లెఖ్ఖ.అంటే కర్మల మంచి చెడ్డలు తనకు అంటవు.వాటన్నిటికీ అతీతం అతను.కాబట్టి మనము ఫలాపేక్షలేని నిత్యతృప్తుడు,నిరాశ్రయుడు లాగ ఉండాలి.
Tuesday, 19 May 2026
యస్య సర్వే సమారంభాః
యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః।
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః॥19॥4॥
శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు చిన్నగా పండితుడు అంటే ఎవడు అనే విషయానికి వచ్చాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. అర్జునా!నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా,కర్మ,అకర్మ,వికర్మలగురించి తెలుసుకోవాలని.ఇక్కడ సరిగ్గా అసలు సిసలు పండితుడు ఎవరో తెలుస్తుంది.మనము ఫలాపేక్ష రహితంగా ఉండాలి.నేను,అంతా నేనే,అంతా నాదే,నేనే కర్తను అనే అహంకారాన్ని వదులుకోవాలి.ఈ కర్తృత్వాహంకారం చాలా చెడ్డది.కాళ్ళు నేల మీద నిలువనీయదు.కళ్ళు నేలవైపు కాకుండా ఆకాశం వైపు చూసేలా చేస్తుంది.మన పతనానికి అదే బీజము.ఈ అహంకారాలన్నిటినీ భస్మం చేసే ఆయుథం ఒకటి ఉంది.అదే జ్ఞానాగ్ని.అలాంటి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ప్రక్క దోవలు పట్టడు.అతడే అసలైన పండితుడు.
కర్మణ్య కర్మ యః పశ్యేత్
కర్మణ్య కర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః।
స బుద్థిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్॥18॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి సారం బోథిస్తున్నాడు.అర్జునా!పార్థా!ఈ ప్రకృతి ఎలా చూస్తే అలా కనిపిస్తుంది.ఎలా చూడాలో అనేది మనము తెలుసుకోవాలి.నేను చెప్పే కర్మ,అకర్మ,వికర్మలను అన్నిటినీ ఒకేసారి కూలంకషంగా అధ్యయనం చేస్తే ఒక విషయం బయట పడుతుంది.ఎవడైతే కర్మలలో అకర్మలను చూస్తాడో,అకర్మలలో కర్మలను చూస్తాడో వాడే బుద్ధిమంతుడు.వాడు సర్వ కర్మలనూ ఆచరించినట్లు లెఖ్ఖ.శూన్యంలోనుంచి పుట్టింది మళ్ళీ శూన్యంలోకి చేరుతుంది.అంత మాత్రానికి ఇదంతా తెలుసుకోవడం ఎందుకు అనుకుంటున్నావా?కొలిమిలో కాల్చి సమ్మెటతో కొడితేగానీ ఇనుము సాగదు.బంగారం సుందరమయిన ఆభూషణం కాదు.మన ఆత్మలో మథనం మొదలుకావాలి.అంతా మాయ అని తెలుసుకునేదానికి ముందర అన్నిటిలో నుంచీ ప్రయాణం కొనసాగించాలి కదా!
కర్మణో హ్యపి బోద్ధవ్యం
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః॥17॥4॥
శ్రీమద్భగవద్గీత...।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు చిన్న చిన్నగా లోతుకు పోతున్నాడు.అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడే చెప్పాను కదా ఏ కర్మలు చేయాలో,ఏ కర్మలు చేయకూడదో అనే విషయంగా పెద్ద పెద్ద తలకాయలే మీమాంసలో పడుతుంటారు చాలా సార్లు అని.కాబట్టి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి?కర్మ అంటే ఏంది?అకర్మ అంటే ఏంది?వికర్మ కథా కమామిషు ఏంది?ఈ మూడు రకాల కర్మల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.మనమెప్పుడూ క్రొత్త క్రొత్త విషయాలను తెలుసుకునేదానికి అప్రమత్తంగా ఉండాలి.ఓయమ్మా!చాలా నేర్చేసుకున్నాము.ఇంక చాలులే అనుకోకూడదు.ఇదంతా నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే కర్మగతి అనేది ఆషామాషీ విషయం కాదు.చాలా గాఢమయినది.ఓపికగా,క్షణ్ణంగా తెలుసుకోవాలి.తొందరపడి,పై పైన తెలుసుకుంటే చాలులే అనే మనస్తత్త్వంతో ఉండకూడదు.
Sunday, 17 May 2026
కిం కర్మ కి మకర్మేతి
కిం కర్మ కి మకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్॥16॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్నీ చెబుతున్నాడు.చిన్నదయినా,పెద్దదయినా తేడా చూపకుండా ఓపికగా విశ్లేషిస్తూ చెబుతున్నాడు.అర్జునా!సఖా!మనము ఏఏ కర్మలు ఆచరించాలి,ఎక్కడ ఆచరించాలి,ఎంతలో ఆచరించాలి,ఎలా ఆచరించాలి,అసలు ఎందుకు ఆచరించాలి,దానికి ముందు అసలు వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించాలి?అసలు చెయ్యొచ్చా?చెయ్యకూడదా? ఈ అనుమానాలు ప్రతి ఒక్కరికీ రావడం సహజం.నేను ఒప్పుకుంటాను.ఈ అనుమానాలు సగటు మనిషికే కాదు,ఒక్కొక్క సారి పెద్ద పెద్ద పండితులు కూడా భ్రమలో చిక్కుకుంటారు.ఒక విషయం ఎంతదాక చేస్తే మంచి అనే పరిథిలోకి వస్తుంది.ఎక్కడ గీటు దాటితే చెడు అవుతుంది అనే నిర్ణయం ఎవరికి వాళ్ళే తీసుకోవాలి.ఎందుకంటే మనకు అనుమానం వచ్చి,సరైన వ్యక్తిని కలిసి,సలహా తీసుకుని పాటించే సమయానికి పుణ్యకాలం ఎప్పుడో దాటిపోయి ఉంటుంది.ఏ కార్యమయినా సరైన సమయంలో చేస్తేనే మంచి ఫలితాలు దక్కుతాయి.
అర్జునా!నీవు నా బామ్మరిదివి.నీకు చెప్పక పోతే ఇంకెవరికి చెబుతాను చెప్పు?ఏ కర్మ తత్త్వాన్ని తెలుసుకుంటే అశుభాలనుంచి నీవు ముక్తుడివి అవుతావో,అది చెబుతాను ఇప్పుడు నీకు.
Saturday, 16 May 2026
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్॥15॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!కర్మఫలం ఆశించకుండా కర్మలు చేయాలి అని ముముక్షువులు కూడా తెలుసుకున్నారు.వారందరూ కూడా నిష్కామంగా కర్మలను ఆచరించారు.పూర్వీకులు కదా మనకు మంచి మార్గం చూపించేది.కాబట్టి నీవు కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకో!నీవు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా,కర్మలను ఆచరించు.మనం చేసే ఒక మంచి పని వల్ల పది మందికి మంచి జరుగుతుంది అంటే అంతకంటే మనకు ఇంకేమి కావాలి.అంటే లోక కళ్యాణం మన పరమావథి కావాలి.నీ సొంత లాభం,నా సొంత లాభం చూడకూడదు.
Friday, 15 May 2026
న మాం కర్మాణి లిమ్పన్తి
న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మ ఫలే స్పృహా।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే॥14॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!మనంచేసే ప్రతి పనికీ ఏదో ఒక ఫలం,ఫలితమూ ఉంటాయి.ఇది జగమెరిగిన సత్యము.కానీ నాకు కర్మఫలం మీద ఆశ,ఆసక్తీ లేవు.కాబట్టి నేను ఆచరించే కర్మల ఫలం నాకు ఏ మాత్రమూ అంటదు.నా ఈ తత్త్వాన్ని ఎరిగిన వాళ్ళకు కూడా కర్మలు బంథించలేవు.ఎందుకంటే నన్ను నమ్మే వాళ్ళు నా బాటలో నడుస్తారు.నేను కర్మఫలానికి ఆమడ దూరంలో ఉంటాను అంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు.
చాతుర్వర్ణ్యం మయా సృష్టం
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః।
తస్య కర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్॥13॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఈ సృష్టికి అంతా నేనే కర్తను అని చెప్పాను కదా!గుణము,కర్మ అనే విభాగాలతో నాలుగు వర్ణాలనీ నేనే సృష్టించాను.ఈ సృష్టి,వర్ణ విభజన అన్నీ కూడా నాచేత చేయబడ్డ కర్మలే!కానీ కర్తృత్వం నాదే అయినా,నిజానికి నేను అకర్తను,అవ్యయుడిని.ఈ సూక్ష్మం నీవు అర్థం చేసుకుంటే చాలు.
మాములుగా మన మనసు మనము ఏ కర్మలు చేసినా,తామరాకు మీద నీటి బొట్టులాగ అంటకుండాఉండాలని చెబుతాము కదా!దానికి నేనే అతి పెద్ద నిదర్శనము.ఏమి చేసినా,కనీసం ఆ కర్మలు నా వల్లే జరుగుతున్నాయి అని నమ్మను.ఒప్పుకోను.నిర్వికార స్థితి అంటే అదే!
Wednesday, 13 May 2026
కాంక్షంతః కర్మణాం సిద్ధిం
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః।
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా॥12॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విథంగా వివరణ ఇస్తున్నాడు.అర్జునా!ఓ భారతా!కర్మ ఫల సిద్థికోసరం చాలా మంది దేవతారాథనలు చేస్తున్నారు.మనం చేసే పనులకు ఫలితం త్వరగా దక్కుతుంది.నీకు తెలుసా?కర్మలు త్వరగా సిద్థించడమవేది ఈ మానవలోకంలోనే సాథ్యమవుతుంది.భౌతిక పరమయిన కోర్కెలు తీర్చుకునేదానికి మానవులు చిన్న చిన్న దేవతలను పూజిస్తూ ఉంటారు.
యే యథా మాం ప్రపద్యంతే
యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్।
మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః॥11॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..।
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా,ఎంత చెట్టుకు అంత గాలి అని.దానినే పిండి కొద్దీ రొట్టె అని కూడా అంటుంటాము కదా!ఇక్కడ కూడా అచ్ఛం అదే పరిస్థితి.ఎవరు ఏ విథంగా,ఎంతగా నన్ను సేవిస్తారో,ఆ పరిమాణం,ఆ పద్థతిలోనే నా అనుగ్రహం కూడా ఉంటుంది.కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేయలేము కదా అని నీవనొచ్చు.కానీ నీ దృష్టిలో,నీ సత్తాలో నీవెంతవరకూ చేయగలతావు అనే లెఖ్ఖలు ఉంటాయి కదా!పార్థా!ఒకటి మటుకు నిజం!మానవులు అన్ని విథాలా నా మార్గాన్నే అనుసరిస్తారు,అనుసరిస్తున్నారు.ఒకరు ముందు,ఇంకొకరు తరువాత!ఒకరు కొంచెం,ఇంకొకరు ఇంకొంచెం ఎక్కువగా.అంతే!ముక్తి కావాలనుకునేవారికి ముక్తి,భుక్తి కావాలనుకునేవారికి భుక్తి చూపుతాను.భౌతికమయిన సుఖాలు కావాలంటే భోగాలు,ఆధ్యాత్మికంగా కావాలంటే కైవల్యం ప్రసాదిస్తాను.
Monday, 11 May 2026
వీతరాగ భయక్రోథాః
వీతరాగ భయక్రోథాః మన్మయా మా ముపాశ్రితాః।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః॥10॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మెల్లగా,వివరంగా చెబుతున్నాడు.అర్జునా!కిరీటీ!ఇందాకే చెప్పాను కదా ముక్తి పొందాలంటే నన్ను గుర్తించాలి,నన్ను నమ్మాలి,నన్ను ఆశ్రయించాలి అని.ముందర రాగ ద్వేషాలను,మద మాత్సర్యాలను,క్రోథ భయాలను విడిచి పెట్టాలి.మనం అన్నం తినాలంటే అట్లనే చేతులు పెట్టి,తినము కదా!ముందర కాళ్ళూ,చేతులు కడుక్కుంటాము.శుభ్రమయిన ప్రదేశంలో కూర్చుంటాము.తినే అన్నము,సాదకాలు గరిటెలతో పెట్టుకుంటాము.వెనక తినేవాళ్ళుంచారు కదా!కాబట్టి చేతులు పెట్టి వేసుకోము.ఇక్కడ కూడా అంతే.మనిషి తనకు తాను మానసికంగా తయారు కావాలి.తరువాత నన్ను ఆశ్రయించాలి.నన్నే ధ్యానించాలి.అప్పుడు అతను తపఃపునీతుడు అయి నన్ను,నా భావాన్నీ పొందుతాడు.ఏదీ సులభంగా దొరకదు.నిష్ట,నియమాలు పాటిస్తేనే దక్కేది.
Sunday, 10 May 2026
జన్మ కర్మ చ మే దివ్యం
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః।
త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోఽర్జున॥9॥5॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మోక్షానికి సులభమయిన మార్గం చెప్పకనే చెబుతున్నాడు.అర్జునా!సఖా!నేను ఈ సృష్టి ఉన్నంత కాలమూ మంచిని పరిరక్షిస్తూ ఉంటాను.చెడు ఎక్కడ,ఏమూలన దాగి ఉన్నా పట్టి,చీల్చి,చెండాడుతుంటాను.నా జన్మ,నా చేష్టలు,నా ఇష్టాయిష్టాలు తత్త్వ దృష్టితో తెలుసుకోగలగాలి.భౌతిక పరంగానే కాకుండా,విశ్లేషణాత్మకంగా తత్త్వ దృష్టితో తెలుసుకోవాలి.అలా చేయగలిగినప్పుడే మానవుడికి మరు జన్మ అంటూ ఉండదు.నేరుగా నన్నే పొందుతాడు.నన్ను పొందడం అంటే కైవల్యం సాథించినట్లే కదా!మోక్షానికి మూడు సూత్రాలు ఇవే!నన్ను తెలుసుకో,నన్ను నమ్ము,నన్ను ఆశ్రయించు.నాలో ఐక్యం చెందుతావు.
Saturday, 9 May 2026
పరిత్రాణాయ సాథూనాం
పరిత్రాణాయ సాథూనాం వినాశాయ చ దుష్కృతామ్।
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥8॥4॥
శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఇంటి పెద్ద ఎలాగుంటాడు?ఇంట్లో వాళ్ళందరికీ తలలో నాలుక లాగుంటాడు.అందరికీ మంచిగా ఉండమని చెబుతుంటాడు.ఎవరైనా తోక ఆడిస్తున్నట్లు తెలిస్తే ముందర భయం పెడతాడు.అయినా వినకపోతే తాట తీసి,ఉతికి ఆరేస్తాడు.నేనూ అంతే!ఈ సృష్టికి మొత్తం నేనే తల్లినీ,తండ్రినీ,గురువునీ!మరి నేను ఇంకెలా ఉండాలో చెప్పు?మంచి వాళ్ళను రక్షిస్తూ ఉంటాను.దుష్టులను శిక్షిస్తూ ఉంటాను.ధర్మ సంస్థాపన నా ధ్యేయము.దానికి ఎవరు అడ్డు వచ్చినా క్షమించను.తాత్సారము చేయను.కాబట్టి ఈ బృహత్ కార్యక్రమాల కోసరము ప్రతి యుగములోనూ నేను అవతరిస్తూనే ఉంటాను.
Friday, 8 May 2026
యదా యదా హి ధర్మస్య
యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత।
అభ్యుత్థాన మధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహమ్॥7॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడికి నమ్మకం కుదిరింది అర్జునుడి పైన.తను చెప్పేది అర్థం చేసుకోగలడని,తన మాటలు నమ్ముతున్నాడని.అందుకని చిన్న చిన్నగా లోతుగా చెబుతున్నాడు.అర్జునా!మిత్రమా!నాకు నేనే సృష్టించుకుని,జన్మలు ఎత్తుతూ ఉంటాను అని ఇప్పుడే చెప్పాను కదా!ఎందుకనుకుంటున్నావు?ఓ భరత శ్రేష్ఠా!అధర్మం పెరిగిన ప్రతిసారీ ధర్మం కుంటుపడుతుంది.కృంగిపోతుంది.కృంగిపోయిన ధర్మాన్ని పైకి లేపి,నిలబెట్టాలి కదా!అది ఆషామాషీ వ్యవహారం కాదు కదా!అధర్మం పెచ్చుమీరి,పేట్రేగి పోయే తరుణం వచ్చినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటాను.ఇదంతా లోక కళ్యాణం కోసం చేస్తుంటాను.ఎందుకంటే మంచి ఎప్పుడూ మసిబారకూడదు.అధర్మాన్ని పెంచి పోషించేవారిని అణగద్రొక్కాలి.
Thursday, 7 May 2026
అజోఽపి సన్నవ్యయాత్మా
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్।
ప్రకృతిం స్వా మధిష్ఠాయ సంభవా మ్యాత్మమాయయా॥6॥4॥శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు రహస్యం చెబుతున్నాడు.అర్జునా!నీ అనుమానంలో తప్పులేదు.నిజానికి సరిగ్గా అడిగావు.నిజం చెప్పాలంటే నాకు చావు పుట్టుకలు లేవు.నేను జనన మరణాలకు అతీతుడిని.సమస్త జీవ కోటికి ప్రభువును.
అయినా కూడా స్వకీయ ప్రకృతిని ఆశ్రయించి నా మాయతో నాకు నేను జన్మిస్తుంటాను.స్వకీయ అంటే నాకే సొంతము అని అర్థము.
Wednesday, 6 May 2026
బహూని మే వ్యతీతాని
శ్రీ భగవానువాచ...
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప॥5॥4॥
శ్రీమద్భగవద్గీత..జ్ఞాన యోగము..
భగవంతుడు అయిన శ్రీ కృష్ణుడికి అర్జునుడు అలా అడుగుతుంటే ముచ్చటేసింది.చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు.అర్జునా!నువ్వు ఇప్పుడు అడిగావు కదా!సూర్యుడు ఎప్పుడో పుట్టాడు.మనం ఇప్పటి వాళ్ళం అని.మరి అలాంటప్పుడు నువ్వు మునుపెన్నడో సూర్యుడికి జ్ఞాన యోగం ఎట్లా చెప్పగలవు?అని.సమాథానం చెబుతా విను.నీకు అవగాహన లేదు.కానీ నీకు,నాకు ఈ జన్మ కన్నా ముందర అనేక జన్మలు గడిచాయి.వాటన్నిటి గురించీ నాకు తెలుసు.నీకు తెలియదు ,అంతే!
Sunday, 3 May 2026
అపరం భవతో జన్మ
అర్జున ఉవాచ...
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః।
కథ మేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి॥4॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
ఎప్పుడు అయినా గురువు శిష్యుడి పైన ప్రత్యేక శ్రద్థ చూపిస్తున్నాడు అంటే గర్వ కారణమే కదా!అప్పుడు ఆ శిష్యుడు ఏమి చేస్తాడు?తను చాలా మంచి శిష్యుడిని అని గురువుకు నమ్మకం కుదిరేదానికి ఇంకా కష్ట పడతాడు.ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అచ్ఛం అదే!ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నీవు నా ప్రియ భక్తుడవు,హితుడవు అనగానే పొంగి పోయాడు.అందుకని నేనే నీకు స్వయంగా యోగము,దానిలోని మర్మాలు చెబుతాను అనగానే ఇంక ఆనందానికి హద్దు లేకుండా పోయింది.శ్రీకృష్ణుడి దగ్గర తన అనుమానాలు వెళ్ళబుచ్చాడు.
కృష్ణా!నువ్వు చెప్పేదంతా చాలా బాగుంది.కానీ నాకొక అనుమానముంది.అదేదో అడగమంటావా?సూర్యుడు నిన్నా మొన్నా పుట్టినవాడు కాదు.బహు సనాతనుడు.భూమి పుట్టక ముందునుంచి ఉన్నాడు.నువ్వో?ఈ మధ్యనే మా మధ్యనే పుట్టిన వాడివి.మనమంతా కలిసి ఆడుకున్నాము,పాడుకున్నాము.మరి నువ్వేమో క్రితం ఎప్పుడో ఈ యోగాన్ని సూర్యుడికి చెప్పాను అంటావు.నమ్మమంటావా?నాకు ఏమి నమ్మాలి?ఏమని నమ్మాలి?ఎంతని నమ్మాలి?అర్థం కావటం లేదు.నిజానికి గందరగోళంగా ఉంది.
స ఏవాయం మయాతేఽద్య
స ఏవాయం మయాతేఽద్య యోగః ప్రోక్త స్సనాతనః।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్॥3॥4॥
శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికే ఎందుకు భగవద్గీత ఉపదేశించాడు?ఎంతో మందికి ఇంకెన్నో సందర్భాలలో చెప్పి ఉండవచ్చు కదా?ఇలా మనకు అనిపిస్తుంది.మాములుగా గురువు శిష్యులకందరికీ ఒకేసారి పాఠం చెబుతాడు.అందరికీ విడి విడిగా చెప్పడు.కానీ మనిషి అన్న తరువాత ఇష్షాయిష్టాలు ఉంటాయి కదా!తనకు ఇష్టమయిన శిష్యుడికి అర్థం కాలేదు అంటే గురువు ఇంకా నిదానంగా,ప్రక్కనే కూర్చోబెట్టుకుని,విడమరచి మరీ చెబుతాడు కదా!ఇక్కడా అంతే!శ్రీకృష్ణుడు ఆ విషయమే చెబుతున్నాడు.
అర్జునా!నువ్వు నా భక్తుడవు.నా హితుడవు.నా సఖుడవు.నా బంథువు కూడా!కాబట్టి అత్యుత్తమమయిన ఆ యోగాన్ని స్వయంగా నీకు చెబుతున్నాను.
Saturday, 2 May 2026
ఏవం పరంపరా ప్రాప్తం
ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః।
స కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప॥2॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుమానం తీరుస్తున్నాడు.అర్జునా!నీకు అనుమానంగా ఉంది కదా!అంత పురాతనమయినది ఈ యోగం అంటున్నాడు,మరి నాకెందుకు తెలియదు ఇప్పటిదాకా అని.ఆ అనుమానం కూడా తీరుస్తాను.
నిజానికి ఈ జ్ఞాన యోగము పరంపరగా ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పబడుతూనే ఉంది అప్పటినుంచీ.రాజర్షులందరికీ తెలిసినదే!కానీ ఇటవలి కాలంలో దీనిని అందరూ యదాలాపంగా తీసుకున్నారు.కాబట్టి కూసింత మరుగున పడింది.అందుకనే నేను చెబుతుంటే నీకు వింతగా,క్రొత్తగా అనిపిస్తున్నది.
Subscribe to:
Posts (Atom)