Friday, 22 May 2026

గత సంగస్య ముక్తస్య

గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః। యజ్ఞా యా చరతః కర్మసమగ్రం ప్రవిలీయతే॥23॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు తిప్పి తిప్పి ఒకటే విషయం చెబుతున్నాడు.అది అవసరము కూడా!ఎందుకంటే మనవి బుర్రలు బాగానే పని చేస్తాయి.కానీ నిజంగా బుర్రలోకి,నరనరాల్లోకి ఒక విషయం జీర్ణించుకుని పోవాలంటే ఒక సారి కని,ఒక సారి విని,ఇంకొక సారి ఒప్పచెబితే సరిపోదు.పదే పదే వినాలి.పదే పదే మననం చేసుకోవాలి.పదే పదే అర్థం చేసుకోవాలి.సమన్వయం చేసుకోవాలి.అప్పుడు ఆచరణలోకి వస్తుంది.ఎప్పుడు కూడా ఇట్టా వచ్చేది అట్టానే పోతుంది.గల గల పారే నీరు భూమి లోకి పూర్తిగా,లోతుగా ఇంకదు.చుక్క, చుక్క,చుక్కకు చుక్క చిన్నగా పడుతుంటే నేల బాగా,లోతుగా తడుస్తుంది.ఆ తడి ఎక్కువ సేపు కూడా నిలుస్తుంది.పై పై పొరల్లో ఉండేది తొందరగా ఆవిరి అయిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!మిత్రమా!మానవుడు ఫలాపేక్షను విడవాలి.బ్రహ్మ జ్ఞాన నిష్ఠాపరుడు కావాలి.ఈశ్వరుని తృప్తికి,ప్రీతికి మటుకే యజ్ఞాలు,యాగాది కర్మానుష్ఠాలు చేయాలి.ఏ కోశానా మమ,అహం అనే భావన ఇసుమంతైనా ఉండకూడదు.అట్లా కర్మలు చేస్తే పూర్వ కర్మలు కూడా నశిస్తాయి.అట్లాంటిది ప్రస్తుత కర్మలు అతనిని బంథించలేవు.అతను కడిగిన ముత్యంలాగ స్వచ్ఛం అయి తీరతాడు.

No comments:

Post a Comment