Thursday, 23 April 2026

కామ ఏష క్రోథ ఏష

శ్రీభగవానువాచ....। కామ ఏష క్రోథ ఏష రజోగుణ సముద్భవః। మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణమ్॥37॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము. శ్రీకృష్ణుడికి చాలా ఆనందం వేసింది అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నతో.తన కష్టానికి ఫలితం దక్కుతున్నదని సంతృప్తి!భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాథానం చెబుతున్నాడు.అర్జునా!మనుష్యులను పాపాల తట్టుకు ఏమేమి ప్రేరేపిస్తున్నాయి అని అడిగావు కదా!చెబుతాను విను.రజోగుణము నుంచి కామము పుడుతుంది.కామము తీరితే ఇంకా కావాలనిపిస్తుంది.తీరకపోతే తీరలేదు అనే అసహనం మొదలవుతుంది.ఆ అసహనమే క్రోథానికి మూలహేతువు.అదీ కాకుండా మనిషి అనేవాడికి తృప్తి అనేది ఎప్పుడూ ఉండదు.ఒక కోరిక తీరితే ఇంకో సవాలక్ష కోరికలు పుట్టుకొస్తాయి.లేదా తనివి తీరదు.ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.ఈ కామము,క్రోథమే అన్ని అనిష్టాలకూ మూలకారణము.

Wednesday, 22 April 2026

అథ కేన ప్రయుక్తోఽయం

అర్జున ఉవాచ... అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః। అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః॥36॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు తపనకు కొంచెం ఊరట కలిగినట్లుంది.ఇంత సేపూ కృష్ణుడు ఒక్కడే ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు.అర్జునుడు అయోమయం మొహం పెట్టుకుని తత్తర బిత్తరగా ఉన్నాడు.ఇప్పుడిప్పుడే కొంచెం చలనం కనిపిస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!మానవుడు తనకు ఇష్టం లేకపోయినా,పరిస్థితుల ప్రభావానికి లోనై పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా!ఆ తప్పు దారిలో నడిచే దానికి అతనిని ఏ కారణాలు ప్రేరేపిస్తున్నాయి? శిష్యుడు గురువు చెప్పిన దానికంతా తల ఊపుతూ ఉంటే ఆ గురువుకు అర్థం కాదు....శిష్యుడికి ఎంత మాత్రం అర్థం అయింది అని.అస్సలు అర్థం అయిందా లేదా అని.శిష్యుడికి అనుమానాలు వచ్చి,ప్రశ్నిస్తే గురువుకు అవగతం అవుతుంది...శిష్యుడికి ఎంత మాత్రం అర్థం అయిందని.కృష్ణుడికి సంతోషంగా ఉంది అర్జునుడి ప్రశ్న వినగానే!

Tuesday, 21 April 2026

శ్రేయాన్ స్వధర్మో విగుణః

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్। స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః॥35॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏది యోగ్యమో,ఏది కాదో వివరిస్తున్నాడు.అర్జునా!పార్థా!సులభంగా అర్థమయ్యేలా చెబుతాను,చూడు.స్వధర్మం,పరధర్మం అని రెండు రకాలు ఉన్నాయి కదా!స్వధర్మం అనేది మనకు యుక్తమయ్యేది.మనము చేయవలసిన,ఆచరించవలసిన ధర్మము.పరధర్మము అంటే మనము కాకుండా వేరేవాళ్ళు చేయవలసినది.నాటుగా,ఘాటుగా చెప్పాలి అంటే ...కుక్క పని కుక్క,గాడిద పని గాడిద చేయాలి.అనవసరంగా అలవిమాలినవి,మనవి కానివి చేసి ఒళ్ళు,ఇళ్ళూ కాల్చుకోనవసరం లేదు.దాని వలన తలనొప్పి,శ్రమ తప్ప లాభం ఉండదు. ఎంతో నైపుణ్యంగా చేసే పరధర్మం కన్నా,గుణరహితంగా చేసినప్పటికీ స్వధర్మమే మేలు.స్వధర్మ నిర్వహణలో అలసి పోయినా,అసలే పోయినా మంచిదే!ఆమరణాంత భయావహమయిన పరధర్మానుష్ఠానం మాత్రం ఎన్నటికీ తగదు.

Monday, 20 April 2026

ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే

ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ। తయోర్నవశ మాగచ్ఛే త్తౌహస్య పరిపంథినౌ॥34॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మనం ఎక్కడ,ఏ విషయాలలో అప్రమత్తంగా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఈ ఇంద్రియాలూ,వాటికి సంబంధించిన విషయాలూ ఉన్నాయి కదా!అవి ఊరకనే ఉండవు.వీటి మథ్య రాగద్వేషాలు అనే పుల్లలు పెత్తనం చెలాయిస్తుంటాయి.సన్నగా పొగ బెట్టి,మంట రాజేస్తుంటాయి.వాటికి చిక్కి లోబడిపోయామా!ఇంక ఇంతే సంగతులు!కాబట్టి,ససేమిరా,రాగద్వేషాలను దరిదాపుల్లోకి కూడా మనం రానీయకూడదు.అప్రమత్తంగా ఉండాలి.ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు.నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే,ఇవే జ్ఞానానికి ప్రబల శత్రువులు.తస్మాత్ జాగ్రత్త!

Sunday, 19 April 2026

సదృశం చేష్టతే స్వస్యాః

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞానవానపి। ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి॥33॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అర్థం కావాలంటే అతని చేతనే జవాబులు చెప్పించాలి అనుకున్నాడు.అందుకని ఇలా మొదలు పెట్టాడు.అర్జునా!నీకు తెలుసు కదా!ప్రతి ఒక్కరూ ప్రకృతి రీత్యానే ప్రవర్తిస్తారు అని.ఎంతటి మహాజ్ఞానులు అయినా దానికి అతీతులు కారు. వాళ్ళు ఎక్కడ నుంచో పుట్టుకు రాలేదు కదా!కాబట్టి మహాజ్ఞాని అయినా అందరి లాగే ప్రవర్తిస్తాడు కానీ వేరే రకంగా కాదు కదా!అలాంటప్పుడు బలవంతంగా నిగ్రహం వలన ఏమి ఒరుగుతుంది,చెప్పు?ఏదైనా అర్థం చేసుకుని,మనస్పూర్తిగా చేస్తేనే ఒంట పడుతుంది,ఫలితం ఇస్తుంది.నువ్వేమంటావు?

Saturday, 18 April 2026

యే త్వత దభ్యసూయంతో

యే త్వత దభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్। సర్వ జ్ఞాన విమూఢాం స్తాన్ విద్ధి నష్టా నచేతసః॥32॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు తనను నమ్మకపోతే వచ్చే అనర్థాన్ని సూచిస్తున్నాడు.అర్జునా!ఎవరైనా మంచి మాటలు వింటే బాగుపడతారు.లేకపోతే భ్రష్టు పట్టిపోతారు.ఇది తిట్టడమో,శాపనార్థాలు పెట్టడమో కాదు.కటిక నిజం!ఎవరైతే అసూయకు లోను అవుతారో,అలా అయి నా మాటలను పెడచెవిన పెడతారో,వాళ్ళను భ్రష్టులుగా గుర్తించు.వాళ్ళు మూఢులు అని అర్థం చేసుకో.అంతకంటే నేను చెప్పేది ఇంకేమీ లేదు.

Friday, 17 April 2026

యే మే మతమిదం నిత్యం

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః। శ్రద్ధావన్తోఽనసూయంతో ముచ్యన్తే తేఽపి కర్మభిః॥31॥3॥శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునిడికి అర్థం అయ్యేలా చెబుతున్నాడు.అర్జునా!ఇటు చూడు.శ్రద్థావంతులు,అసూయలేనివాళ్ళుగా ఉండాలి ముందర.అట్లాంటివాళ్ళు నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి.వారు అందరూ సమస్త కర్మదోషాల నుంచీ విముక్తి పొందుతారు.ఈ విథంగా ఒక అర గంట చేస్తే చాలులే,ఒక పూటో,ఒక రోజో చేస్తే చాల్ చాలులే అనుకోకూడదు.అను నిత్యమూ అలాంటి ధృక్పథంతో ఉండాలి.

Thursday, 16 April 2026

మయి సర్వాణి కర్మాణి

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాఽధ్యాత్మ చేతసా। నిరాశీ ర్నిర్మమోభూత్వా యుధ్యస్వ విగతజ్వరః॥30॥3॥శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం బోథిస్తున్నాడు.అర్జునా!నా,నీ అనే మమకారం వదిలెయ్యాలని చెప్పాను కదా!అసలు ఏ పనీ నీ కోసం అనుకుని చేయకు.నీవు చేసే సమస్త కర్మలూ నా కోసం చెయ్యి.నాకే సమర్పించు.అది నాది,ఇది నీది.నా కది కావాలి.ఇది వద్దు.ఇలాంటి కోరికలు మానెయ్యి.అంతా నాదే,అంతా నాకే అనే అహంకారం,అహంభావము మానెయ్యి.ఏదో తప్పు చేస్తున్నాను.నాకేమీ మంచి జరగడం లేదు అనే దుఃఖాన్ని ప్రక్కన పెట్టు.మోహం నుంచి బయట పడు.వివేకవంతుడివి కా!యుద్ధం చెయ్యి.నీ కోసం చేయనక్కరలేదు.నా కోసం చెయ్యి.దాని ఫలితం..।మంచైనా,చెడు అయినా నాకే వదిలెయ్యి.

ప్రకృతే ర్గుణ సమ్మూఢాః

ప్రకృతే ర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు। తానకృత్స్న విదో మన్దాన్కృత్స్న విన్న విచాలయేత్॥29॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి ఎలా ఉంటాడో వివరిస్తున్నాడు.అర్జునా!పార్థా!మామూలుగా మనుష్యులు అందరూ మాయామోహితులు.ఒక భ్రమలో ఉంటారు.వాళ్ళు ఎప్పుడూ గుణకర్మల యందే ఆసక్తి చూపుతుంటారు.జ్ఞాని అనేవాడు వాళ్ళ బలహీనతలను అర్థం చేసుకోవాలి.ఊరికినే ఊదర కొట్టి,వాళ్ళను అయోమయంలో పడేయకూడదు.వారిని వారి మార్గాలనుంచి మరల్చ కూడదు.ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి భయభ్రాంతులను చేయకూడదు.వాళ్ళను చిన్నగా సన్మార్గంలో పెట్టి సత్కర్మలు చేసేలా ప్రోత్సహించాలి.

Wednesday, 15 April 2026

తత్త్వ విత్తు మహాబాహో

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః। గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే॥28॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్యాపదేశంగా చెబుతున్నాడు.కండబలమే కాదు,మనోబలం కూడా ముఖ్యమే అని.అందుకే ఇలా సంబోథిస్తున్నాడు.హే అర్జునా!హే మహాబాహూ!మనం కర్మల పైన ప్రేమలు పెంచుకోకూడదు.గుణకర్మల గురించి తెలిసినవాడు చలించడు.ఎందుకంటే సర్వకర్మలూ విషయాసక్తాలైన ఇంద్రియాల చర్యలు అని కనుక్కుంటాడు.కాబట్టి వారు నిరాపేక్షగా ఆ కర్మలను ఆచరిస్తారు.ఎలాంటి బంథాలూ,అనుబంథాలూ పెంచుకోరు.నిర్వికారంగా తాము చేయవలసిన కర్మలను ఆచరిస్తారు.

Tuesday, 14 April 2026

ప్రకృతేః క్రియమాణాని

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః। అహంకార విమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే॥27॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అజ్ఞానులు ఎలాంటి భ్రమలలో బ్రతుకుతుంటారో చెబుతున్నాడు.అర్జునా!హే కిరీటీ!నీకు ఇప్పుటికి అర్థం అయింది కదా ప్రకృతి యొక్క గుణాల వల్లనే సమస్తమయిన కర్మలూ నిర్వహింపబడతాయి అనే విషయం.కానీ అజ్ఞాని అలా అర్థం చేసుకోడు.అజ్ఞానికి అహంకారం,అదే బలుపు ఎక్కువ కదా!నేనే తోపు,నేనే తురుపు ముక్కను.అంతా నా వల్లనే జరుగుతుంది,అంతా నేనే చేస్తున్నాను అని భావిస్తూ ఉంటాడు.నిజంగా మూర్ఖుడు అందామా ?లేక అమాయకుడు అని అందామా?

Monday, 13 April 2026

న బుద్ధిభేదం జనయేత్

న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్। జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్॥26॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాని ఎలా ఉండాలో చెబుతున్నాడు.హే అర్జునా!జ్ఞాని అనేవాడు చాలా జాగ్రత్తగా నడచుకోవాలి.కర్మలు ఆచరించే మామూలు ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేయకూడదు.వారు కర్మల ఎడ విముఖులు కాకుండా చూసుకోవాలి.తాను కర్మలను అనుసరించి,ఆచరిస్తూ మామూలు ప్రజానీకం తప్పుదారి పట్టకుండా,మంచిగా సమన్వయం చేసుకుంటూ,వారంతా కూడా సత్ కర్మల యెడ అనురక్తిని కలిగించేలా ప్రవర్తించాలి.

సక్తాః కర్మణ్య విద్వాంసో

సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత। కుర్యా ద్విద్వాం స్తథా సక్త శ్చికీర్షు ర్లోకసంగ్రహమ్॥25॥3॥ శ్రీమద్భగవద్గీత...।కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు...ఏ రకంగా ఆలోచించినా కర్మలు చేయడం తప్పదు,తప్పించుకోలేము అని.హే అర్జునా!ఏ భరతశ్రేష్టా!కర్మలను చేయడం ఎవరికీ తప్పదు.ఏ రకంగా ఆలోచించినా చేయాల్సిందే! అజ్ఞానులు ఫలాపేక్ష కోసం కర్మలను చేస్తారు.జ్ఞానులు స్వలాభంకోసం చేయరు.ఆసక్తిరహితంగా చేస్తారు అంటే ఎలాంటి కోరికలు,ఇచ్ఛ లేకుండా చేస్తారు.కానీ లోకసంగ్రహణం కోసరము చేయవలసిన పనులు అన్నీ చేస్తూ ఉంటారు.

Sunday, 12 April 2026

ఉత్సీదేయు రిమే లోకా

ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్। సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః॥24॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను కర్మలు ఆచరించకపోతే జరిగే అనర్థాలను వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!నేను లోక కళ్యాణం కోసం కర్మలను ఆచరిస్తున్నానని చెప్పాను కదా!నేను అలా చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెబుతాను విను.నేను నాకెందుకు?నాకు ఏమీ అవసరం లేదు.నాకు ఏదీ అక్కరలేదు అనుకుంటే లోక వ్యవహారాలన్నీ స్తంభిస్తాయి.వ్యవస్థలు అన్నీ శిథిలమవుతాయి.అప్పుడు ఏమవుతుందో తెలుసా?ఆలోచించగలవా?సంకరము,కర్మభ్రష్టత్వము కలుగుతాయి.ప్రజలయొక్క ఆ దిగజారుడుకు నేనే కారణభూతుడిని అవుతాను.నేను సృష్టించిన ఈ లోకాలు,ప్రాణులు నా వల్లనే భ్రష్టు పడతారు.అంతదానికి ఈ సృజన అంతా దేనికి?ఎవరి కోసం చెప్పు. తల్లి కనగానే నా పని అయిపోయింది అని వదిలేస్తే ఏమవుతుంది ఆ బిడ్డ?ఎందుకూ పనికి రాకుండా పోతుంది.అయితే గియితే వ్యవస్థకు హానికరంగా మారుతుంది.కానీ ఆ తల్లి తన స్తన్యం ఇచ్చి,ప్రేమించి,మంచి మార్గంలో నడిపితే ఆ బిడ్డ సంఘానికి తురుపుముక్క అవుతుంది.అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నా బిడ్డలకు మార్గదర్శకం అవుతాను.

Saturday, 11 April 2026

యది హ్యహం నవర్తేయం

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః। మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్థ సర్వశః॥23॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.హే పార్థా!హే కిరీటీ!నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తాను అని చెప్పాను కదా!ఎందుకని అంటావు?యథా రాజాః తథా ప్రజాః అని నానుడి ఉంది కదా!రాజు ఎట్లా ఉంటే రాజ్యం లోని ప్రజానీకం అంతా అలానే ఉంటుంది.రాజు మంచిగా కార్య నిర్వహణ చేస్తుంటే ప్రజలు కూడా అలానే ఉంటారు.రాజు పనిదొంగ అయితే ప్రజలూ అలానే ఉంటారు.ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నేను గానీ కర్మలను విడిచి పెడితే ప్రతి ఒక్కడూ నన్నే అనుసరిస్తాడు.అంతా తిని తొంగుండే ముఠాలాగ తయారవుతారు.కాబట్టి ఒక నాయకుడు తన వారికి మార్గ దర్శకంగా ఉండాలి.అభాసు పాలు అయ్యేలా ఉండకూడదు.

న మే పార్థాస్తి కర్తవ్యం

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన। నా నవాప్త మనాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి॥22॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము.. అర్జునుడికి శ్రీకృష్ణుడు తన ఉదాహరణే ఇస్తున్నాడు.అర్జునా!పార్థా!ప్రజానీకం గొప్పవాళ్ళనే ప్రామాణికంగా తీసుకుంటుంది.వాళ్ళ అడుగు జాడల్లోనే నడచేదానికి ఇష్టపడుతుంది అని చెప్పాను కదా!నన్నే ఉదాహరణగా తీసుకో.నిజానికి ఈ మూడులోకాల్లో నేను చేయవలసిన పని అంటూ ఏమీలేదు.నాది కానిది,నాకు దక్కనిది అంటూ కూడా ఏమీ మిగిలి లేదు.నాకు అంటూ ఎలాంటి ఆశలు,అసంతృప్తులు,అసహనాలు,అభీష్టాలూ ఏమీ లేవు.అయినా కూడా నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తున్నాను.దీనివలన నీకు ఏమి అవగతమవుతుంది?నాకోసం కాకపోయినా,ఈ సృష్టి మొత్తానికీ మార్గ దర్శకంగా నిలవడం కోసరం నేను కర్మలను ఆచరిస్తున్నాను.సర్వే జనాః సుఖినో భవంతు అనే ధర్మం కోసం పాటుపడపతున్నాను.ఇప్పుడన్నా ఏమైనా అర్థం అవుతుంది అనిపిస్తుందా?

Friday, 10 April 2026

యద్య దాచరతి శ్రేష్టః

యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః। స యత్ ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే॥21॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా?మామూలు ప్రజానీకం ఉంది కదా!గొప్పవాళ్ళు ఏమి చేస్తారో అదే ఆచరించేదానికి ఇష్టపడతారు.ఎందుకంటే గొప్ప వాళ్ళ పద్థతులే కదా వాళ్ళకు ప్రామాణికం! కాబట్టి మనం అందరికీ మంచి దారి చూపించాలంటే ముందుగా ఆ మంచి దారిలో మనం నడవాలి కదా!అవునా,కాదా?

కర్మణైవ హి సంసిద్ధి

కర్మణైవ హి సిద్ధి మాస్థితా జనకాదయః। లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి॥20/3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు మానవుడి పరమావధి ఏందో చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సఖా!ఇప్పటి విషయమే కాదు నేను చెప్పేది.ఇంతకు ముందు జనక మహారాజు,తదితర రాజ ప్రభృతులు కూడా కర్మల ద్వారానే సిద్ధిని పొందారు.అసలు కొంచెం సేపు ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మాటలాడుకుందాము.మానవులగా మన కర్తవ్యం ఏంది చెప్పు?లోకకళ్యాణమే కదా!కాబట్టి ఈ యోగాలూ,మోక్షాలూ,కర్మలూ,జ్ఞానాలూ ప్రక్కన పెట్టేసి లోకసంగ్రహణార్థం మనము ఏదైనా చేయగలిగితే అంతకంటే ఉత్తమం ఇంకేముంటుంది చెప్పు.కాబట్టి అర్జునా!క్షత్రియ ధర్మం ప్రకారం నీవు లోకులను,ప్రజలను రక్షించేదానికి నడుము బిగించాలి.సమరం చేయాలి దుష్ట శక్తులతో.ఇక్కడ వాడితో చేస్తున్నామా,వీడితో చేస్తున్నామా అని కాదు.మనం సుసంపన్నమయిన,సుభిక్షమయిన పరిపాలన ప్రజలకు అందించాలంటే,ఇక్కడ పాతుకుపోయిన చెడుని నిర్మూలించాలి.కౌరవులే ఆ దుష్టశక్తులు.కాబట్టి వారిని తుదముట్టించడమే నీ విథి ఇప్పుడు.

Thursday, 9 April 2026

తస్మా దసక్త స్సతతం

తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర। అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః॥19॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు విషయం చెబుతున్నాడు.అమ్మ బిడ్డ అన్నం తినకపోతే ఏమి చేస్తుంది?అదిగో చందమామ!ఇదుగో బూచి!అని నాలుగు మంచి మాటలు చెబుతూ బిడ్డ నోట్లోకి నాలుగు ముద్దలు పోయేటట్లు చేస్తుంది కదా!అచ్చం అలానే శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి విషయం విడమరిచి,నయాన,భయానా,బుజ్జగించి నాలుగు మంచి మాటలు బుర్రలోకి చేరేలా ప్రయత్నిస్తున్నాడు. అర్జునా!కౌంతేయా!ఆత్మతృప్తుడు గురించి చెప్పాను కదా!ఎలాంటి దోషాలూ అతనికి అంటవు అని కూడా చెప్పాను కదా!నీవుకూడా అలా ఎందుకు కాకూడదు చెప్పు.ఖచ్చితంగా నిష్కాముడవు అయి నీ కర్మలను ఆచరించగలవు.ఆ నమ్మకం నాకుంది.ఆపేక్షారహితమయిన కర్మాచరణ అంటే తెలుసు కదా!అదే!మోహము,కోరికలు,కాంక్ష లేకుండా తన ధర్మాన్ని అనుసరించి కర్మలను ఆచరించడం.అప్పుడు మోక్షము కలుగుతుంది.అప్పుడు మనము మోక్షము వెనక పరుగులు తీయడం కాదు,అదే మనల్ని వెతుకుకుంటూ వచ్చి వరిస్తుంది.

Wednesday, 8 April 2026

నైవ తస్య కృతే నార్థో

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన। న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః॥18॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మరతుడు,ఆత్మతృప్తుడు,ఆత్మసంతుష్టుడు అయిన మనిషి గురించి చెబుతున్నాడు.అర్జునా!పైన చెప్పిన గుణాలు ఉన్న మానవుడు ఏమీ చేయాల్సిన పని లేదని చెప్పాను కదా!ఎందుకని అంటావ్?ఎందుకంటే అతను ఈ సృష్టిలో దేనిపైనా ఆథారపడడు.దేనియందూ ఆశ్రితుడు కాడు.అతని దృష్టిలో కర్మ చేయటం వలన ఎలాంటి లాభం లేదు.చేయకపోతే నష్టం లేదు.అతనికి ఎలాంటి దోషాలు అంటవు.ఎందుకంటే అతను నిర్వికారుడు కాబట్టి.ఆ స్థితికి చేరడం ఆషామాషీ వ్యవహారమూ కాదు.

యస్త్వాత్మరతి రేవ స్యాత్

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః। ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే॥17॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు ఎవరైతే ఏ కర్మలూ చేయ పనిలేదో కూడా చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సత్కర్మలు చేయాలి అని చెప్పాను కదా మానవుడై పుట్టిన ప్రతివాడూ!దీనికి కూడా ఒక మినహాయింపు ఉంది. ఎవడైతే ఆత్మరతుడో,ఆత్మతృప్తుడో,ఆత్మ సంతుష్టుడో...అతను పరమావథికి పరాకాష్ట లాగా అన్నమాట.ఇంక అతను చేయవలసిన కర్మలు అంటూ ఏమీ ఉండవు.ఆత్మతృప్తుడు అంటే తన ఆత్మలోనే తృప్తి పొందేవాడు.ఆత్మరతుడు అంటే ఆత్మానందంలో మునిగి తేలే జ్ఞాని లేక యోగి అని అర్థము.ఆత్మ సంతుష్టుడు అంటే ఆత్మ పరంగా సంతోషంగా,సంతృప్తిగా,సంతుష్టంగా ఉండేవాడు.అతనికి కర్మఫలం గురించి ఎలాంటి ఆలోచన,ఆదుర్దా,అసహనం,అసంతృప్తి ఉండవు.నిశ్చింతగా,ప్రసన్నంగా ఉంటాడు.

Tuesday, 7 April 2026

ఏవం ప్రవర్తితం చక్రం

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః। అఘాయు రింద్రియారామో మోఘం పార్థ స జీవతి॥16॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలను వేదాలలో ఘోషించినట్లు ఆచరించాలి అని చెబుతున్నాడు.అర్జునా!పార్థా!మనము ఈ కర్మ చట్రంలోనే ఉండాలి.దానిని ఎప్పుడూ అతిక్రమించకూడదు.అట్లా అని ఏమీ లేదు.అంతా నా ఇష్టం అని ఈ కర్మలను ఆచరించడం మానకూడదు.దానికి కారణం చెబుతాను,విను.ఈ సత్ కర్మలను ఆచరించనివాడు ఇంద్రియలోలుడు అవుతాడు.ఇంద్రియాలపైన నిగ్రహం లేనివాడు ఏమి చేస్తాడో నీకు తెలియదా?సులభంగా దారి తప్పుతాడు.తప్పులు చేస్తాడు.అవే అలవాటై పాపాలకు పూనుకుంటాడు.ఇంక దాంట్లోనే మగ్గి,మాడి, మసి అయిపోతాడు.పాపి అనే బిరుదు మూటకట్టుకుంటాడు.

Monday, 6 April 2026

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాఽక్షర సముద్భవమ్। తస్మాత్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్॥15॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా?కర్మలు వేదాల వలన సంభవించాయి.వేదాల పుట్టుక ఎక్కడ నుంచో చెప్పు?వేదాలు పరమాత్మ వలన పుట్టాయి.దీని వలన నీకు ఏమి అర్థం అయింది?బ్రహ్మము అనేది విశ్వం మొత్తమూ వ్యాపించి ఉంది.ఈ సర్వత్రా వ్యాపించిన బ్రహ్మాన్ సతతా,సర్వదా యాగాలలో నిక్షేపమై,ప్రతిష్ఠింపబడి ఉంటుంది.

అన్నా ద్భవంతి భూతాని

అన్నాద్భవంతి భూతాని పర్జన్యా దన్న సంభవః। యజ్ఞా ద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః॥14॥3॥ శ్రీమద్భగవద్గీత.।।కర్మ యోగము... శ్రీకృష్ణుడి యొక్క ఓపికకు జోహార్లు.మనం చెప్పేది సరిగ్గా ఎదుటి వాడు వినకపోయినా,విన్నా అర్థంకానట్లు మొహం పెట్టినా మనకు కోపం చిర్రెత్తుకుని వస్తుంది కదా!చట్!వీడికి ఇంక జన్మలో ఏమీ చెప్పకూడదు.సమయం అంతా శుద్ధ దండగ అని నిర్ణయించేసుకుంటాము కదా!కానీ ఇక్కడ చూడు.ఎంత ఓపికగా,అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు అర్జునుడికి వివరిస్తున్నాడో! అర్జునా!మనం బ్రతికే దానికి ఏమి చేస్తాము?అన్నం తింటాము కదా!ప్రతి జీవికి తను బ్రతికే దానికి,తన వంశాభివృద్ధికి ఆహారం కావాలి కదా!ఆ ఆహారం మనకు ఎక్కడనుంచి వస్తుంది అనుకుంటున్నావు?వర్షాలు పడితేనే కదా పంటలు పండేది.పంటలు సజావుగా పండితేనే కదా గింజలు ఇంటికి,ఆ తరువాత మన నోటికి వచ్చేది.మనము యజ్ఞం చేయటం వలన వరుణ దేవుడు కనికరించి వానలు తెప్పిస్తున్నాడు.అందువల్లే మన ఇంటిలో పుట్టి నిండుతున్నది.మనము కర్మలు చేస్తేనే కదా యజ్ఞం సుసంపన్నమయేది.

Saturday, 4 April 2026

యజ్ఞ శిష్టాశిన స్సంతో

యజ్ఞ శిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః। తే త్వఘం భుంజతే పాపా యే పచం త్యాత్మకారణాత్॥13॥3॥ శ్రీనద్భగవద్గీత..।కర్మ యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ పని అయినా స్వచ్ఛందంగా,మనసు పెట్టి చేయాలని చెబుతువ్నాడు.హే సఖా!హే అర్జునా!మానవులు యజ్ఞాలు చేసి దేవతలను తృప్తి పరచాలి,వారికి నివేదించాలి అని చెప్పాను కదా!ఎందుకంటే యజ్ఞశేషాన్ని భుజించేవారు సమస్త పాపాలనుంచీ విముక్తి చెందుతారు.అట్లా కాకుండా చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ వాళ్ళకోసరమే వండుకుని తినేవాళ్ళు పాపాల పాలు అవుతారు.ఇది శపించడమో,చెడ్డగా మాట్లాడటమో కాదు.మనము బ్రతకాలి,మనతోటే మన ప్రక్కవారు కూడా సుఖసంతోషాలుతో ఉండాలని ఆపేక్షించగలగాలి.ఎందుకంటే మనము చేసే నైవేద్యాలు నిజంగా దేవుడో,దేవతో వచ్చి తినరు.వారికంటూ చేసినవి మనం నలుగురితో పంచుకుంటాము.ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చెబుతున్నాడో తెలుసా?ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమని వాళ్ళు ఉంటారు.చేయి విదిలించినపుడు రెండు మెతుకులు క్రిందపడి,వాటిని కాకి తీసుకెళుతుందేమో అనే భయానికి.అట్లా ఉండొద్దు.సర్వే జనాః సుఖినో భవంతు అనుకోవాలని ఆయన ఆశ.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః। తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః॥12॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మయోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ ప్రజలకు ఏమి చెప్పాడో చెబుతున్నాడు.అర్జునా!పార్థా!కిరీటీ!బ్రహ్మ ప్రజలను సృష్టించాడు అని చెప్పాను కదా!ఆ తరువాత ప్రజలకు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు.యజ్ఞాలు చేయమన్నాడు.చేస్తే మంచిది అని చెప్పాడు.ఎందుకంటే యజ్ఞాలు చేస్తే దేవతలు తృప్తి పడతారు.అప్పుడు ప్రసన్నంగా ఉంటారు కాబట్టి మన కోరికలు తీరుస్తారు.అంటే వరుణ దేవుడు వానలు ఇస్తాడు.సూర్యుడు పగలు,వెలుతురు ఇస్తాడు.చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు.అగ్ని దేవుడు నిప్పును ఇస్తాడు.వారి వలన,వారిచ్చే ద్రవ్యాల వలన మనము లాభం పొందుతున్నట్లే కదా!మరి మనం కృతజ్ఞత వ్యక్తపరచాలి కదా!వారి వల్ల దక్కిన ఫలాన్ని వారికి నివేదించాలి కదా!కాబట్టి వారికి నివేదించకుండా భోగించేవాడు చోరుడు అవుతాడు.

Wednesday, 1 April 2026

దేవాన్ భావయతాఽనేన

దేవాన్ భావయతాఽనేన తే దేవా భావయంతు వః। పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ॥11॥3॥ శ్రీమద్భగవద్గీత ...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మందల వివరిస్తున్నాడు.అర్జునా!నేను చెప్పాను కదా బ్రహ్మ ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞాలను కూడా ప్రజా శ్రేయస్సు కోసం సృష్టించాడు అని.బ్రహ్మ ప్రజలకు ఇలా చెప్పాడు.మీరు యజ్ఞాలు చేయండి.వాటి ద్వారా దేవతలు తృప్తి చెందుతారు.వారు తృప్తి పొందితే మీకు తృప్తి కలిగిస్తారు.అంటే ఇచ్చుకుంటినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం లాగా అన్నమాట.మనం మంచి చేస్తే ఎదుటివాళ్ళుకూడా మనకు మంచి చేస్తారు.ఇలా సుహృద్భావంతో అన్యోన్యాచరణల ద్వారా శ్రేయస్సు పొందండి అని బ్రహ్మ ప్రజలను ఆశీర్వదించాడు.