Monday, 27 July 2026

ప్రశాంతాత్మా విగతభీః

ప్రశాంతాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థితః। మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న వివరము కూడా చెబుతున్నాడు.ఇక్కడ మనము అర్జునుడి గొప్పదనం గురించి కూడా మాట్లాడుకోవాలి.జ్ఞానభిక్ష ఇచ్చేవారు భగవంతుడితో సమానం.అందుకనే మనము గురువును భగవంతుడు కంటే గొప్పగా,ముందర వరుసలో పెడతాము.ఆయనే కదా మనలను భగవంతుడికి చేరువ చేసేది.ఇక్కడ గురువు,భగవంతుడూ ఇద్దరూ ఒకరే!గురువుకి చెప్పాలని ఉన్నా శిష్యుడు ఆ జ్ఞానబోధను స్వీకరించే పరిస్థితిలో ఉండాలి కదా!ఏంది స్వామీ!యుద్ధమూ వద్దూ,నీ సుద్దులూ,బుద్ధులూ వద్దు.అని వెళ్ళిపోలేదు.రణరంగంలో బాసింపట్టు వేయించి,ఈ బలవంతపు ముక్తాయింపులు ఏంది అని విసుక్కోలేదు.ఇవన్నీ కృష్ణుడుతో అనగలిగే చనువు,స్నేహమూ ఉంది.కానీ మంచి ఎవరు చెప్పినా,కొత్త విషయాలు చెప్పినా,మన మంచి కోరి చెప్పినా...వారికి మనం గురువు హోదా ఇవ్వాలి.అది అర్జునుడు కృష్ణుడికి ఇచ్చాడు.అతను చెప్పే ప్రతి ఒక్క అక్షరాన్ని అమృత బిందువులాగా ఆస్వాదించాడు.జుర్రుకున్నాడు.సరైన మార్గంలో ప్రవర్తించాడు.ఇక్కడ శ్రీకృష్ణుడి శ్రమ వృథా కాలేదు.చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వ్యర్థం కాలేదు.అనుకున్న ఫలితం దక్కింది. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!మనము ముందర మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.భయపడకూడదు.బ్రహ్మచర్యం పాటించాలి.మనసును అదుపులో పెట్టుకోవాలి.ధ్యాస నా పైనే పెట్టాలి.ఆ స్థితిలో యోగాభ్యాసం చేయాలి.

No comments:

Post a Comment