Monday, 21 September 2026
కామైస్తై స్తైః……Kaamesthai sthaih
కామేస్తై స్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్స్వయా॥29॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి ఎలా దేన్ని నమ్ముతాడు,దేన్ని పూజిస్తాడో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!జ్ఞాని నేను ఎవరు,ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని,నా శరణు జొచ్చుతాడు.కానీ మామూలు మనిషి ఆలోచనా విథానము,అతని పరిమితులు ఇలా ఉంటాయి.చెద పురుగులు చేవగల చెక్కని ఏమి చేస్తాయి,చెప్పు?ఎలాంటి కనికరమూ,మొహమాటం లేకుండా తెల్లవారేటప్పటికి పిండి,పిండి చేసేస్తాయి కదా!అట్లాగే కోరికలు అనేవి చెద పురుగులు లాగ.అవి మనిషి మస్తిష్కాన్ని నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టి,గుల్ల చేస్తాయి.అమాయకపు మానవుడు చేసేదానికి ఇంక ఏమి మిగిలి ఉంది?అతని కామనలు,వాంఛలు,కోరికలు ఏ దారిలో ఉంటాయో ఆ దారిలోనే అనేక నియమాలను పాటిస్తూ,పయనం సాగిస్తాడు.ఆ కోరికలు త్వరత్వరగా తీర్చుకోవాలి అనే తపనలో చిన్న చిన్న ఇతర దేవతలను ఉపాసిస్తుంటాడు.
Kaamesthai sthairhrutha jnaanaah prapadyanthe anya devathaah/
Tham tham niyamamaasdhaaya prakruthyaa niyathaa ssvayaa//20//7//
Sri madbhagavad geetha...Vijnaana yogamu....
Sri Krishna is telling Arjuna as how a common man thinks and acts.Arjuna!hey Pardha!just now I told you that Jnaani seeks my blessings.He learns about me fully and decides to serve me and pray.But that is not the case with common man.What do termites do to the strong wood?They make it into useless powder in no time.Desires of common man are termites.They atack your commin sense,propriety and all the good nature you have.Your thought process and your acts thereby become selfish and narrow minded.In their hunger and thirst to fulfill their desires they act as per their wishes without any reason or rhyme.They follow many procedures and seek the help of many other deities to get what they want.
Sunday, 20 September 2026
బహూనాం జన్మ….Bahoonaam janma
బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే।
వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః॥19॥7॥
శ్రీమద్భగవద్గీత.।।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదంతా అంత సులభం కాదు అని చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!జ్ఞాని అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా!అతడు ఆ స్థితికి చేరేదానికి రోజులు,నెలలు,సంవత్సరాలు కాదు...ఏకంగా చాలా జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.పండు పక్వానికి వస్తేనే కదా తినాలనిపించేది.అలానే భక్తుడు తన ఆరాథనలో తడిసి ముద్దయి పోవాలి.తన అస్థిత్వాన్నే మరిచి పోయి భగవంతుడే తను,తనే భగవంతుడు అన్నట్లు లీనము,విలీనము అయిపోవాలి.అప్పుడు నా కరుణా కటాక్షాలు తనకు దక్కుతాయి.అతడు వాసు దేవుడే సమస్తమూ అని గ్రహించాలి.అలా తెలుసుకుంటేనే,సతతం నా ధ్యాసలో ఉంటూ నన్నే సేవిస్తూ ఉంటాడు.కానీ అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు.
Bahoonaam janma naamanthe jnaanavaan maam prapadyathe/
Vaasudeva ssarvamithi sa mahaathmaa sudurlabhah//19//7//
Sree madbhagavadgeetha.,VIjnaana yogamu...
Sri Krishna is telling Arjuna how difficult it is to find a jnaani.Arjuna!hey friend!I told you that I like jnaani,the most.The reason is very simple.A devotee takes not just days,months,years but many births to reach that position.You see,we feel like eating only when the fruit is ripe,not when it is raw.Similarly,I like the devotee who is totally immersed in love and devotion towards me.He should learn that I am the Ultimate,everything.Only when he learns that Vaasudeva is all pervading entity,he would believe me.He would totally be my devotee.But,such full fledged devotees are rare to be found.
Saturday, 19 September 2026
ఉదారా స్సర్వ…..udaaraa ssarva
ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవమే మతమ్।
ఆస్థిత స్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్॥18॥9॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి అందరిలోకి జ్ఞాని ఎందుకు ఉత్తముడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీకు అర్థం కావడం లేదు కదా అందరిలోకి నాకు జ్ఞాని అంటే ఎందుకు అంత ఎక్కువ ఇష్టం అని?నిజానికి నేను పైన ఉదహరించిన నాలుగు రకాల మనుష్యులూ మంచి వాళ్ళే.ఉత్తములే.కాదనను.కానీ,జ్ఞాని మాత్రమూ నా ఆత్మ స్వరూపుడు.అన్ని రకాలా,అంటే మనసా వాచా కర్మణా,నన్నే పరాంగతిగా ఎన్నుకున్నాడు.నన్నే ఆశ్రయించాడు.నేను తప్ప తనకు ఇంకెవరూ అఖ్ఖరలేదు.
Vudaaraa ssarva yevaithe jnaanee thvaathmaiva me matham/
Aasdhitha ssa hi yukthaathmaa maamevaanuththamaam gathim//18॥7॥
Sree madbhagavadgeetha....Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna the reason behind special bonding towards jnaani.Arjuna!hey Kireeti!I told you about four types of people who come to me for help and have faith in me.But amongst them all,I lean towards jnaani,wiseman,more.To tell you the truth all the four types are great people.They are my devotees.They pray and have faith in me.But jnaani is my incarnation.For him I am the ultimate goal.He thinks of me all the time,he serves me all the time and talks about me all the time.There is nothing besides Me in his life.
Friday, 18 September 2026
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః——-theshaam jnaanee nithya yukthah
తేషాం జ్ఞానీ నిత్య యుక్తః ఏక భక్తిర్విశిష్యతే।
ప్రియో హి జ్ఞానినో త్యర్థ మహం స చ మమ ప్రియః॥17॥7॥
శ్రీ మద్భగవద్ గీత...విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి తనకు ఎవరు ఎక్కువ ఇష్టమో చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను ఇప్పుడు చెప్పాను కదా నాలుగు రకాల మనుష్యులు నన్ను సేవిస్తారు అని.వాళ్ళు ఆపదలో ఉన్నవారు,జిజ్ఞాసువు,సంపదలు కోరేవాడు మరియు జ్ఞానీ అని తెలుసుకున్నాము కదా!వీళ్ళల్లో నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది నీకు?నేనే చెబుతాను,విను.వీళ్ళందరిలోకి జ్ఞాని నాకు ఎక్కువ ఇష్టము.ఎందుకంటావా?ఎందుకంటే జ్ఞాని అనేవాడు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు.ఎల్లప్పుడూ నాయందే మనసు నిలుపుకుని ఉంటాడు.ధ్యాన యోగముతో నన్ను సేవిస్తాడు.అందరిలోకి అతనే శ్రేష్టుడు.అతను నన్ను ప్రేమిస్తాడు,నాకు అతడు మిక్కిలి ఇష్టుడు.
Theshaam jnaanee nithyayukthah yeka bhakthirvisishyathe/
Priyo hi jnaanino thyardha maham sa cha mama priyah//17///7//
Sri madbhavadgeetha ....Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna whom he loves among his devotees.Hey Arjuna!hey brother!I told you just now as to who love me.Amongst all my devotees I feel a special bonding and affection towards the wise and knowledgeable person.The reason behind it is simple.Jnaani knows about me fully well.He concentrates on me and thinks about me all the time.He prays and serves me through dhyaanayoga.He is the best,efficient and the most eligible devotee of mine.I too reciprocate his love and affection in the most appropriate manner.
Wednesday, 16 September 2026
చతుర్విధా భజంతే ॥॥॥chathurvidhaa bhajanthe
చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున।
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియపరుస్తున్నాడు.ఏమని?ఎవరెవరు తనను సేవిస్తారు అని.అర్జునా!భరతర్షభ!నన్ను నాలుగు రకాల మనుష్యులు సేవిస్తారు.వాళ్ళు ఎవరో వివరిస్తాను.ఆపదలలో చిక్కుకున్నవాడు అమ్మా!అని అరుస్తాడు.భగవంతుడే తనకు తల్లి,తండ్రి,గురువు,దైవము అని నమ్ముతాడు.ఏదో ఒక రూపంలో చేయూతను ఇస్తానని ఆశిస్తాడు.జ్ఞాని నన్ను సేవిస్తాడు.ఎందుకంటే తన జ్ఞాన నేత్రముతో నన్ను గుర్తిస్తాడు.నేను సర్వాంతర్యామిని,సర్వ వ్యాపకుడను అని తెలుసుకుంటాడు.కావున నాశరణు జొచ్చుతాడు.ఇక పోతే సంపదలు కోరుకునే వాడు నన్ను సేవిస్తాడు.తిట్టినా,పెట్టినా నేనే అనే విషయం వాడికి బాగా క్షుణ్ణంగా తెలుసు.జిజ్ఞాసువు జ్ఞాన పిపాసి.జ్ఞానం పూర్తిగా తెలుసుకోవాలనే అన్వేషణలో నిత్యం ఉంటాడు.జ్ఞాన సముపార్జన కోసం నన్ను సేవిస్తాడు./////
Chathurvidhaa bhajanthe maam janaa ssukruthinoarjuna/
Aartho jijnaasu rardhaardhee jnaanee cha bharatharshabha//16//7//
Sreemadbhagavadgeetha...vijnaana yogamu...
Sree Krishna is telling Arjuna what types of people worship him and want to be protected by Him.Arjuna!hey Bharatharshabha!people who are facing hardships in their lives come to me seeking help.Persons who are in search of knowledge that is profound seek my blessings.peole who want riches and wealth pray to me for fulfilment of their desires.An intelect and knowledgeable person knows and understands that I am the Supreme force behind everything.So,I am always in his prayers.These four categeries of people seek my blessings and proctection.
న మాం దుష్కృతినో మూఢాః///Na maam dushkruthino moodaah
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః।
మాయ యాఽపహృతా జ్ఞానాః ఆసురం భావ మాశ్రితాః॥15॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.ఏమని?ఎవరు పడితే వాళ్ళు తనను ఆశ్రయించలేరని.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇప్పుడే చెప్పాను కదా నన్ను శరణు జొచ్చిన వాళ్ళు మాత్రమే ఈ భవసాగరాన్ని ఈదగలుగుతారు అని.దీనికి ఇంకో మెళకువ కూడా ఉంది.ఎవరు పడితే వారు నన్ను ఆశ్రయించలేరు.వారు ఎవరో చెబుతాను,విను.రాక్షస ప్రవృత్తి,రాక్షస భావజాలము ఉండే వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉండవు.నిజంగా మేథావులు కారు,కానీ ఆ అపోహలో బతుకుతుంటారు ఒక వర్గం వాళ్ళు.వారికి నేనెప్పుడూ దక్కను.ఈ కోవలోకే ఇంకా చాలా మంది వస్తారు.దుష్కృతులు,అంటే తప్పు పనులు చేసేవాళ్ళు.వారి వలన మంచివారు మొత్తమూ బాధలు పడుతుంటారు.మూర్ఖులు ఇంకో తెగ.వీరికి విచక్షణా జ్ఞానము శూన్యము.వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించే రకము.మరి ఇంకో వర్గము నీచులు.వీరు వారు అనుకున్నది సాథించేదానికి ఎంతటి నీచానికైనా ఒడి కడతారు.వారికి ఎలాంటి విలువలు,మంచి చెడు విశ్లేషణ ఉండదు.అర్జునా!పైన పేర్కొన్నవారు ఎవరూ నా దరిదాపుల్లోకి కూడా రాలేరు.నా ఆశ్రయం కోరడమూ,దక్కించుకోవడమూ కల్లే వారికి.
॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥
Na maam dushkruthino moodaah prapadyanthe naraadhamaah/
Maaya yaaapahrutha jnaanaah aasuran bhaava maasrithaah//15//7//
Sree madbhagavadgeetha...Vijnaana yogamu...
Sri Krishna is telling Arjuna like this.Arjuna!hey Kireeti!I told you just now that those who come under my shelter alone can cross the turbulant sea of materialism.But there are ifs and buts to this prospect.Certain types of people can not come to me for shelter or help.I will explain to you about them.Those with cruel and demonish behaviour and thought process are not allowed to come near me.Similarly,there is another section who falsely think they know everything,but in reality they know nothing.There are people who indulge in bad deeds and cause hardships to the good natured people.There is another section who are fools.They do not have the distinction between good and bad.They go to any length to achieve what they want.Then there is another section who have no morals.They do not have any respect towards others or have any self respect.They can stoop down to lowest levels to have their say.
Arjuna!I abhor them and I do not allow them to come nearby.They can never come to me, seek my blessings,shelter or help.
Tuesday, 15 September 2026
దైవీ హ్యేషా గుణమయీ//daivee hyesha gunamayee
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా।
మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే॥14॥7॥
శ్రీమద్భగవద్గీత ....విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతూ,కొన్ని నిష్టుర సత్యాలు కూడా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను సృష్టించిన ఈ మాయ దివ్యమయినది,త్రిగుణాన్వితమూ అయినది.ఈ మాయ దాటడం చిన్న పిల్లల ఆట కాదు.చాలా కష్టమయిన మార్గము అనుసరించాలి.అంత సులభంగా దాటలేరు మానవులు.నన్ను నమ్మి,నా శరణు జొచ్చిన వారు మాత్రమే ఈ మాయను దాటి,తరించగలుగుతారు.
////:///
Daivee hyeshaa gunamayee mama maayaa durathyayaa/
Maameva ye prapadyanthe maayaamethaam tharanthi the//14//7//
Sree madbhagavadgeetha....vijnaana yogamu...
Lord Sree Krishna is telling Arjuna about himself.Hey Arjuna!hey Pardha!I am the One who created Maya.Maya is celestial and is composed of three traits.It is never easy to cross these emotions and get over them.To say the least,it is practically impossible.But,there is always a solution to each and every problem.Is it not?Those who have belief in me and who come to me with trust and prayers can definitely cross this churning and turbulant ocean of misery and hardships.
Monday, 14 September 2026
త్రిభి ర్గుణమయై ర్భావైః
త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్సర్వ మిదం జగత్।
మోహితం నాభి జానాతి మామేభ్యః పర మవ్యయమ్॥13॥7॥
శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు వ్యవహారం చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!త్రిగుణాలు ఉన్నాయి అని చెప్పాను కదా!అవి నా సృజనే అని కూడా చెప్పాను కదా!ప్రపంచం మొత్తమూ ఈ సత్త్వరజస్తమో గుణాల భావాలతో సమ్మోహనము కాబడుతుంది.దాని పర్యవసానం ఎలా ఉంటుంది?ఏమి ఉంటుంది చెప్పు?అంతా గలబా గలబా!గందరగోళం!అంతే కదా!ఈ పరిస్థితులలో సర్వాతీతుడను,శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోవడమే గగనమవుతున్నది.అందరూ దిక్కులు చూస్తున్నారు.ఏ దిక్కు మొక్కాలో తెలియక!
Sunday, 13 September 2026
యే చైవ సాత్త్వికా భావా
యే చైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చయే।
మత్త ఏ వేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి॥12॥7॥
శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను లేనిదే ఈ విశ్వం లేదు అని చెబుతున్నాడు.ఈ విశాల విశ్వంలోని ప్రతి అణువు తనదే,తన యందే ఉంది.ప్రతి చిన్న శ్వాస కానీ,అనుభూతి,భావ పరంపర కూడా అతని సృజనే అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!మనకు తెలుసు కదా గుణాలు ఎన్ని రకాలు అని.అవే సత్త్వ గుణము,రజో గుణము,తమో గుణములు.వాటి వాటి సంబంధించిన భావావేశాలు అన్నీ కూడా నా కల్పనే!అవన్నీ కూడా మానవుడిలో నా వల్లనే కలుగుతాయి.ఆ త్రిగుణాలు నా చెప్పు చేతల్లో ఉంటాయి,సర్వదా.కానీ నేను వాటన్నిటికీ అతీతమై ఉన్నాను.కాబట్టి వాటికి నేను కట్టుబడను,వాటి చేత చిక్కను.
Saturday, 12 September 2026
బలం బలవాతాం చాహం
బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్।
ధర్మా విరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ॥11॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తన్ను ఇంకొన్ని విథాలుగా ప్రస్ఫుటమవుతాడో చెబుతున్నాడు.అర్జునుడిని సంబోథించడంలో కూడా అర్జునుడిపైన తనకున్న మక్కువ,అర్జునుడి గురించి తను ఏమనుకుంటున్నాడో తెలియకనే తెలుస్తుంది.భరత అంటే భరత వంశము.ఋషభ అంటే ఎద్దు.అది శక్తికి,గొప్పతనానికీ ప్రతీక.శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడు భరతవంశంలో ఋషభం లాగ శ్రేష్టుడు,గొప్పవాడు అని పొగుడుతున్నాడు.అర్జునా!ఓ భరతర్షభ!బలవంతులలో ఉండే కామరాగాలు లేని బలాన్ని నేను.ఈ సమస్త సృష్టిలో ఉండే ప్రతి జీవి లోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.అనుభూతి పరంగా నేనే ఉంటాను,అవ్యయ పరంగా నేనే ఉన్నాను.అంటే గర్వము,అహంకారము లేకుండా ధర్మబద్ధమయిన శక్తి సామర్ధ్యాలకు ప్రతీక నేను.అలాగే సృష్టి కార్యంగా భావించి,పవిత్రంగా ఆచరించే కామాన్ని నేను.
Friday, 11 September 2026
బీజం మాం సర్వభూతానాం
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్।
బుద్ధి ర్బుద్ధి మతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్॥10॥7॥
శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్ని ఉదాహరణలు సహేతుకంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను ఇప్పుడే చెప్పాను కదా అగ్నిలోని తేజస్సు నేనే,తాపసులలోని తపస్సు నేనే,ప్రాణులలోని ప్రాణం నేనే ఇని.ఇవే కాకుండా అన్ని ప్రాణులూ ఈ భూమి మీద బతికి బట్ట కట్టేదానికి కావలసిన మూలకారణము,అదే బీజము నేనే!బుద్ధి మంతులలోని బుద్ధి నేనే!ధైర్యవంతులలోని ధైర్యాన్ని నేనే!ఇవన్నీ నీవు తెలుసుకుంటే మంచిది.
Thursday, 10 September 2026
పుణ్యో గంధః పృథివ్యాం చ
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ।
జీవనం సర్వ భూతేషు తపశ్చాస్మి తపస్విషు॥9॥7॥
శ్రీమద్భగవద్గీత..।।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా తను ఎక్కడెక్కడ ప్రస్ఫుటమవుతాడో చెబుతున్నాడు.అర్జునా!ఓ సఖా!నేను సర్వ వ్యాపకుడిని,ఈ సృష్టిలోని అణువణువునా వ్యాపించి ఉన్నాను అని చెప్పాను కదా!ఇంకొన్ని ఉదాహరణలు చెబుతాను.భూమి యందు ఉండే సువాసన నేనే!అగ్ని యందు ఉండే తేజస్సు నేనే!సర్వ జీవ కోటి లో ఉండే ప్రాణము నేనే!తాపసులలో ఉండే తపశ్శక్తి నేనే!నేను ఏంటో చిన్నగా నీకు అర్థం అవుతుంది కదా!
Wednesday, 9 September 2026
రసోఽహమప్సు కౌంతేయ
రసోఽహమప్సు కౌంతేయ ప్రభాఽస్మి శశి సూర్య యోః।
ప్రణవ స్సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు॥8॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను సర్వ వ్యాపకుడు అని సోదాహరణంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను చెప్పాను కదా నీకు...నాలోనే విశ్వం ఉంది.విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నాను,అని.నీళ్ళలోని రుచిని నేనే!సూర్య చంద్రులు వెదజల్లే కాంతి నేనే!వేదాలలోని ఓంకార నాదాన్ని నేనే!ఆకాశం లోని శబ్దం నేనే!మానవులలో ఉండే పౌరుషం నేనే!
Tuesday, 8 September 2026
మత్తః పరతరం నాన్యత్
మత్తః పరతరం నాన్య త్కించిదస్తి ధనంజయ।
మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ॥7॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా సులభంగా పూస గుచ్చినట్లు చెబుతున్నాడు.అర్జునా!బావా!నువ్వు ముందు ఇది తెలుసుకోవాలి.అది ఏందంటే ఈ లోకంలో నాకంటే శ్రేష్టమయినది ఇంకొకటి లేదు.ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి అంతా నా చుట్టే తిరుగుతూ ఉంటుంది.దారానికి కూర్చబడిన పూసలలాగా నాయందే ఈ సమస్తమూ కూర్చబడి ఉంది.నన్ను దాటి,నా కన్ను గప్పి పరమాణువు కూడా కదలలేదు.అంతా నా కనుసన్నలలోనే జరుగుతుంది.
Monday, 7 September 2026
ఏతద్యోనీని భూతాని
ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తథా॥6॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాండము సృష్టి లయలకు తనే మూలాథారము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్ఠా!నీకు తెలుసా?సర్వభూతాలూ కూడా ఈ పరా,అపరా ప్రకృతుల నుంచే పుట్టాయి.ఈ ప్రపంచము,ఈ విశ్వము యొక్క సృష్టి నా చేతుల మీదుగానే జరిగింది.దీనిని లయము చేసేది కూడా నేనే!ఈ రెండిటి మధ్యలో ఉండే స్థితిని కూడా నేనే నడుపుతాను.అంటే ప్రతిదీ,చీమ చిటుక్కుమన్నా కూడా,నా ఆజ్ఞ లేకుండా జరగదు.ఎందుకంటే సర్వస్వానికీ కారణభూతుడను నేనే!
Saturday, 5 September 2026
అపరేయ మితస్త్వన్యాం
అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్।
జీవ భూతాం మహాబాహో య యేదం ధార్యతే జగత్॥5॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పర అపర ప్రకృతుల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!ప్రకృతి రెండు రకాలు.అవే పర మరియు అపర.అపర ప్రకృతి అంటే పంచ భూతాలు మరియు మనసు,బుద్ధి,అహంకారము కలగలిసినది.పర ప్రకృతి అంటే శరీరము తన ప్రాణము తెలుసుకో గలిగిన,నడిపించే సూక్ష్మమయిన శ్రేష్టమయిన,సత్యమయిన,శాశ్వతమయిన చైతన్యము.
మనిషి అపర ప్రకృతి కంటే ఉన్నతమయినది పర ప్రకృతి అని తెలుసుకోవాలి.ఎందుకంటే పర ప్రకృతి ఈ సమస్త విశ్వాన్నీ ధరించింది.నా ప్రకృతినే పరా ప్రకృతి అని అంటారు.
Friday, 4 September 2026
భూమి రాపోఽనలో వాయుః
భూమి రాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా॥4॥7॥
శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తను సృజించిన ప్రకృతి గురించి వివరణ ఇస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీవు నీ చుట్టూ చూస్తున్న ప్రకృతి ఎక్కడ నుంచి పుట్టింది అనుకుంటున్నావు?ఇదంతా నా సృజనే!నా ఈ ప్రకృతి ఎనిమిది భాగాలుగా విభజింప బడి ఉన్నది.భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనస్సు,బుద్ది మరియు అహంకారాలే ఆ ఎనిమిది విభాగాలు.
Thursday, 3 September 2026
మనుష్యాణాం సహస్రేషు
మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే।
యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥3॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగము,సాథన,జ్ఞానము ఊరికినే సులభంగా సంప్రాప్తించవు.ఖఠినమయిన దీక్ష,సాథన,జిజ్ఞాసలు అవసరము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను చెప్పేది వింటుంటే అంతా చాలా సులభమూ,సునాయాసమూ అనిపిస్తుంది కదా!అంత లేదు.నిజానికి ఏ వేయి మందిలో ఏ ఒక్కడికో మోక్షానికి ప్రయత్నించాలి అని అనిపిస్తుంది.అలాగ నిజంగా ప్రయత్నించే వేయి మంది యతులలో,ఏ ఒక్కడో నన్ను నిజంగా తెలుసుకో గలుగుతున్నాడు.కాబట్టి నిర్దిష్టమయిన ప్రణాళికతో ఇవి సాథన చేయాలి.
Wednesday, 2 September 2026
జ్ఞానం తేఽహం సవిజ్ఞానం
జ్ఞానం తేఽహం సవిజ్ఞాన మిదం వక్ష్యా మ్య శేషతః।
యజ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే॥2॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు.దేనికి?అత్యుత్తమమయిన జ్ఞానము బోథిస్తాను అని.అంతకంటే ఇంకేమి కావాలి,ఎవరికైనా?
అర్జునా!హే పార్థా!సంశయానికి తావు లేకుండా సంపూర్ణంగా నన్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను,అన్నాను కదా!ఆ మాట పైన నిలబడి ఉంటాను.అసలు ఏది తెలుసుకుంటే,ఇంక ఏమీ వేరే తెలుసుకోవాలసిన పని లేదో,ఆ జ్ఞానం నీకు ఉపదేశిస్తాను.అది కూడా ఆషామాషీగా చెప్పాను అంటే చెప్పాను లా కాదు.ఈ లోకములో ఉండే జ్ఞానము అంతా ఔపోసన పట్టినట్లు ఉండే అనుభవ పూర్వకమయిన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను.
Tuesday, 1 September 2026
మయ్యా సక్త మనాః పార్థ
శ్రీమద్భగవద్గీత...
సప్తమోఽధ్యాయః...విజ్ఞాన యోగః...
శ్రీ భగవానువాచ...
మయ్యా సక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు॥1॥
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇందాక చెప్పిన మాటే మళ్ళీ నొక్కి నొక్కి చెబుతున్నాడు.ఈ ప్రయత్నం అంతా తను చెప్పేది బుర్రలోకి గట్టిగా పాతుకు పోవాలనే!అర్జునా!ఓ పార్థా!ఇందాకటి మాటే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను.నా యందే మనస్సు నిలుపు.నన్నే ఆశ్రయించు.యోగరతుడవు కా!అంటే యోగమును ప్రీతితో ఆశ్రయించి,దానిలోనే మునిగి తేలడము.ఇలా చేస్తే నువ్వే కాదు ఎవరైనా సరే సరి అయిన మార్గములోకి వచ్చినట్లు లెక్క.అలాంటివాడు నిశ్శంకగానూ,సంపూర్ణంగానూ నవ్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను విను.
Subscribe to:
Posts (Atom)