Tuesday, 26 August 2025
ఇతి తే జ్ఞానమఖ్యాతం
ఇతి తే జ్ఞానమఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా।
విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు॥63॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఇంత సేపూ అలుపు,అలసట లేకుండా అర్జునుడికి బోధిస్తున్నాడు కదా!ఇంక ముక్తాయింపు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే కౌంతేయా!అతి రహస్యమైన,పరమ పవిత్రమైన జ్ఞానాన్ని అంతా నీకు సవివరంగా చెప్పాను.నేను చెప్పినదానినంతా ఒకసారి సింహావలోకనం చేసుకో!బాగా ఆలోచించు.నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తుందో,ఏది సరైన పని అని అనిపిస్తుందో,అదే చెయ్యి.నేను ఇంక నిన్ను ప్రభావితం చేయను.నీ విచక్షణను ఉపయోగించి కార్యాచరణం లోకి దిగు.నీకు నచ్చింది పాటించు.
Monday, 25 August 2025
త్వమేవ శరణం గచ్ఛ
త్వమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్॥62॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు కిటుకు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే భరతశ్రేష్టా!నేను చెప్పిన వాటికి అన్నిటికీ జవాబు,ఉపాయం ఒక్కటే ఉంది.అదే ఆ పరమాత్మను మనసా,వాచా, కర్మణా శరణు కోరటం.అతను అత్యంత దయాళువు.అతని దయ,కనికరం,ప్రేమ,వాత్సల్యం నీకు దక్కాయి అనుకో!నీవు ఖచ్చితంగా శాంతినీ,మనశ్శాంతినీ,మోక్షాన్నీ పొందగలుగుతావు.
Sunday, 24 August 2025
ఈశ్వర స్సర్వభూతానాం
ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥61॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఓ అర్జునా!దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? ఇలాంటి అనుమానాలు నీకు అస్సలు వద్దు.ఈశ్వరుడు సర్వాంతర్యామి.తన మాయ చేత సర్వభూతాలనూ కీలు బొమ్మల్లా ఆడిస్తాడు.ఆయన అన్ని ప్రాణుల హృదయాంతరాళలో సదా నివసిస్తూ ఉంటాడు.మామూలు మనుష్యులు మాయామోహంతో అంతర్ముఖంగా ఉండే ఆయనను గుర్తించలేరు.అలా కనుక్కోవాలంటే సాథన కావాలి.
Saturday, 23 August 2025
స్వభావజేన కౌంతేయ
స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్॥60॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడికి ఉండే ఓపిక,ఓదార్పు,సగటు మానవుడి మానసిక స్థితి పైన అవగాహన ఇంకెవరికీ ఉండవు.అది రణరంగం!ఆదమరిస్తే ప్రాణాలే పోతాయి.అట్లాంటి చోట అర్జునుడిని కూర్చోబెట్టుకుని,బుర్రలోకి బాగా ఎక్కాలని మంచి విషయాలు పదే పదే,ఎంతో ఓపికగా చెబుతున్నాడు.
ఓ అర్జునా!హే కౌంతేయా!మానవుడి పుట్టుక నుండి గిట్టే వరకూ ఏదో ఒక మాయామోహంలో కూరుకుని ఉంటాడు.అది సహజమే!కానీ నేను నీకు పదేపదే చెబుతున్నాను, విను.ప్రకృతి పరంగా జనితమైన ఏమాయో,భ్రాంతో నీవు యుద్ధం చేయవద్దని నిన్ను ప్రేరేపించ వచ్చు,ప్రలోభపెట్టవచ్చుగాక!కానీ తుదకు నీ సహజమైన క్షాత్ర్య ధర్మానికి నీవు కట్టుబడతావు.నీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడి యుద్ధానికి కార్యోన్ముఖుడివి అవుతావు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం నీ మనసులో ఉండే అలజడి,అనుమానం అన్నీ దూది పింజాలులాగా పక్కకి పోతాయి.నీవు స్వచ్ఛమయిన చంద్రుడిలా ప్రకాశిస్తావు.నీవు తప్పకుండా ఈ యుద్ధాన్ని చేసి తీరుతావు.నాకు నీపై ఆ నమ్మకం ఉంది.
Friday, 22 August 2025
యదహంకార మాశ్రిత్య
యదహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి॥59॥శ్రీమద్భగనద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇదే చెబుతున్నాను.దురహంకారంతో,అజ్ఞానంతో యుద్ధం మానేయాలనే ఆలోచనే నీ మస్తిష్కం లోకి రావివ్వ వద్దు.అట్లా నువ్వు అనుకున్నా,అది ఒఠ్ఠి వృథా ప్రయాస అవుతుంది.నువ్వు జన్మతః క్షత్రియుడవు.నీ క్షాత్ర ధర్మమే నిన్ను యుద్ధానికి పురిగొల్పుతుంది.నిన్ను ఆ రకంగా యుద్ధానికి వినియోగించుకుంటుంది.ఇది తధ్యము.
మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా
మచ్చిత్త స్సర్వదుర్గాణిమత్ప్రసాదా త్తరిష్యసి।
అథ చేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి॥58॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇంకా ఓపికగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిన్ను భయపెట్టేదానికి గానీ,బెదించేదానికి గానీ నేను ఇవేవీ చెప్పటం లేదు.విత్య సత్యాలు కాబట్టే చెబుతున్నాను.కాబట్టి మనసు పెట్టివిని,అర్థం చేసుకో!మామూలుగా ఈ మానవ మాత్రులు భవ సాగరం దాటాలంటే ససేమిరా కాని పని.కాబట్టి నా శరణు కోరుకో!నేను కరుణిస్తేనే, దాటశక్యం కాని సంసార దుఃఖాలన్నింటినీ సులువుగా దాటగలవు.కాదు నాకు అఖ్ఖరలేదు నీ ఆపన్నహస్తం అని గర్వానికీ,అహంభావానికీ పోతే నాశనం అవుతావు.దానిని ఎవరూ ఆపలేరు.
చేతసా సర్వకర్మాణ్యపి
చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః।
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ॥57॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు. అర్జునా!నీవు ఏమి చెయ్యాలో చెబుతాను విను.ముందరగా సర్వ కర్మలు నాకే సమర్పించు.సమబుద్ధిని ప్రసాదించే యోగాన్ని అవలంబించు.నేనే పరమగతిని అనే విషయం బాగా ఆకళింపుచేసుకో.నీ మనసును,అంతఃకరణాన్నీ నాయందు లగ్నం చేయడంలో సఫలీకృతుడవు కావాలి.అప్పుడే నీవు మోక్ష ప్రాప్తికి అర్హుడవు అవుతావు.
Thursday, 21 August 2025
సర్వకర్మాణ్యపి సదా
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః।
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్॥56॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా సులభంగా అర్థం అయ్యేలా చెబుతున్నాడు.ఓ అర్జునా!అన్ని కర్మలను ఆచరిస్తున్నా,నన్నే నమ్ముకున్న కర్మయోగి,అవినాశనమైన పరమపదాన్నే పొందుతాడు.ఎందుకంటే అతను నన్నే నమ్ముకుంటాడు.కర్మఫలాన్ని సదా నాకే సమర్పిస్తాడు.తామరాకు మీద నీటిబొట్టులాగా అతనికి ఏ కల్మషమూ అంటదు.భారం అంతా నా మీదే ఉంచి,తను సర్వదా ప్రశాంత చిత్తంతో ఉంటాడు.
Wednesday, 20 August 2025
భక్త్యా మామభిజానాతి
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్॥55॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు ఇంత దూరం,ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానో తెలుసా?నా భక్తిని పొందగలగటం ఆషామాషీ వ్యవహారంకాదు!జ్ఞానయోగ ఫలమయిన నా భక్తిని పొందినవాడు నా స్వరూప స్వభావాలను పూర్తిగా ఆకళింపు చేసుకుంటాడు.చివరకు ఆ భక్తి తత్త్వంలోనే మునుగి,తేలుతూ నాలో ఐక్యం అవుతాడు.మానవ జన్మకు అంతకంటే ఉత్కృష్టమయినది ఇంకేమి ఉంటుంది?పరమాత్మతో మమేకం కావటం అంటే మాటలా!!!!
Tuesday, 19 August 2025
వివిక్తసేవీ లఘ్వాసీ
వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయమానసః।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥52॥అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్।
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥53॥
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్॥54॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చెబుతున్నాడు.అర్జునా!నీ కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సావథానంగా విని,బుర్రలోకి ఎక్కిచ్చుకో!బ్రహ్మభావానికి అర్హత ఏమేమి అని చెప్పాను?మాయా మోహం లేకుండా,నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించాలని చెప్పాను కదా!అలాగే శబ్దాది విషయలను వదలి,రాగద్వేష రహితంగా,విరాగిగా,యేకాంతంగా,అల్పాహారిగా,మనోవాక్కాయ కర్మలను నియమబద్థం చెయ్యాలని చెప్పాను కదా!అహంకారము,దురభిమానము,దంభం,కామక్రోధాలు,మమకారాలకు దూరంగా,అతీతంగా ఉండాలని నొక్కి వక్కాణించాను కదా!
అర్జునా!ఇదంతా ఇన్ని సార్లు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో!బ్రహ్మ భావాన్ని ఒకసారి పొందితే,అంతఃకరణం శుద్ధి అవుతుంది.కాబట్టి మనిషి ఇంకేమీ కోరడు.దేనికీ దుఃఖ పడడు.సమస్త ప్రాణులయందూ సమ దృష్టి కలిగి ఉంటాడు.చివరకు జ్ఞానయోగ ఫలంగా నా భక్తిని,ముక్తిని పొందుతాడు.
Monday, 18 August 2025
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాఽఽత్మానం నియమ్య చ।
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ॥51॥
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥53॥
అహంకారం బలం దర్పం కామం క్రోథం పరిగ్రహమ్।
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥54॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!పరమాత్మను పొందాలి అంటే ఏమి చెయ్యాలో చెబుతాను అన్నాను కదా!మనసు లగ్నం చేసి విను.మాయామోహాలకు అతీతంగా ఉండాలి.నిశ్చలమయిన జ్ఞానంతో మనసును నిగ్రహించాలి.అంటే మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.ప్రపంచం అంతా శబ్దకాలుష్యంతో నిండి ఉంటుంది.ఇలా అనేక రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అవి మన మనసును చలింపచేస్తాయి.రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి.తామరాకు మీద ఉండే నీటిబొట్టులాగా,ఎల్లప్పుడూ విరాగిలాగా ఉండాలి.మనసు ఏకాగ్రత సాధించాలి అంటే ఏకాంతవాసం అవసరము.మితాహారం తీసుకోవాలి.జిహ్వచాపల్యానికి పోయి కనపడ్డదంతా నోట్లో వేసుకోకూడదు.అంటే మనం చేసేపనుల పైన మనకు నుయంత్రణ ఉండాలి.మనోవాక్కాయ కర్మలను నియమ నిబద్ధలతో ఆచరించాలి.ధ్యానయోగులం కావాలి.మనకు అహం ఎక్కువ ఉంటుంది.నాకేమి తక్కువ?అందరి కంటే నేనే గొప్ప అనే భావం బయటకు చెప్పకపోయినా,లోలోపల ఉంటుంది చాలా మటుకు.ఆ అహంకారాన్ని,ఆ అజ్ఞానాన్ని ముందు వదిలి పెట్టాలి.అలాగే అభిమానము,దంభము,దర్పము,కామక్రోధాలను వదలి పెట్టాలి.మనము బయట,లోపల ఒకే రకంగా ఉండగలగాలి.అంటే మనం బయటకు ఎలా కనిపిస్తామో,మన అంతఃకరణంలోనూ అలాగే ఉండాలి.మమకారాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అదే చాలాసార్లు అనర్థానికి హేతువు అవుతుంది.ఇలా త్రికరణ శుద్ధిగా,శాంత చిత్తంతో ఉన్నవాడే,ఉన్న నాడే బ్రహ్మభావానికి మనషి అర్హుడు అవుతాడు.
Sunday, 17 August 2025
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తధాఽఽప్నోతి నిబోధ మే।
సమాసేనైవ కౌంతేయ!నిష్ఠా జ్ఞానస్య యాపరా॥50॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నడు.హే కౌంతేయ!హే అర్జునా!నేను నైష్కర్మ్య సిద్ధి అనగానే నీకు అర్థం కాలేదు అని నాకు అర్ధం అయింది.కామక్రోథ మద లోభాలకు అతీతంగా మనము ఆచరించ వలసిన పనులు మనము చేయటమే నిష్కామ కర్మ అని అంటారు.అలా కర్మానుష్టానం చేయటం వలన సిద్ధిని పొందగలతాము.ఇలా జ్ఞాన సిద్ధిని పొందిన వాడు యే విధంగా పరమాత్మను పొందుతాడో నీకు సవివరంగా చెబుతాను.
Saturday, 16 August 2025
అసక్త బుద్ధి స్సర్వత్ర
అసక్త బుద్ధి స్సర్వత్ర జితాత్మావిగతస్పృహః।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి॥49॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఓపికగా అర్జునుడికివివరిస్తున్నాడు.అర్జునా!సిద్ధిని ఎలా పొందాలో చెబుతాను.ఎవరు పొందగలరో కూడా చెబుతాను.మొదట విషయాసక్తి ఉండకూడదు.అంటే దత్తి,యావ..అవసరానికి మించి...ఆసక్తి ఉండకూడదు.అంతఃకరణం స్వచ్ఛంగా ఉంచుకోగలగాలి.అంటే ద్వంద్వాలు ఉండకూడదు.అటా,ఇటా,ఎటో...అంటూ మనసు సందిగ్థంలో ఊగిసలాడకూడదు.తనకంటూ కోరికలు లేకుండా,సమాజం,సంఘహితంకోసం పాటుపడాలి.స్పృహారహితంగా ఉండాలి.అంటే తపన,లాలస,కాంక్ష లేకుండా ఉండాలి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానమార్గంలో నడవాలి.అప్పుడేమనము నైష్కర్మ్యసిద్ధిని పొందగలతాము.మనం పనులు చేస్తున్నా,నిర్వికారంగా,మోహాపేక్ష లేకుండా చెయ్యాలి.మోహావేశం లేకుండా,ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడే సిద్ధిని పొందగలతాము.
Friday, 15 August 2025
సహజం కర్మ కౌంతేయ
సహజం కర్మ కౌంతేయ సదోషమపి స త్యజేత్।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః॥48॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.దోషాలతో కూడుకున్నా మన స్వధర్మాన్ని మనం వదిలి పెట్టకూడదు అని చెప్పాడు కదా.అర్జునుడు అర్ధం కానట్లు బిక్క మొహం వేసాడేమో!
హే అర్జునా!హే కౌంతేయా!నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సహజకర్మలు,స్వధర్మాలు దోషాలతో ఉన్నా మనము ఎప్పుడూ విడిచి పెట్టకూడదు.ఎందుకు అని అడుగుతావా?చెబుతాను,విను.నిప్పు రాజెయ్యాలంటే,మొదలు మొదలు పొగ వస్తుంది కదా!అగ్ని నిలకడగా వ్యాపించేదాకా ఆ పొగ ఉంటుంది కదా!కట్టెలు పచ్చివి అయినా,సరిగ్గా రాజుకోక పోయినా పొగ ఉంటుంది కదా!అగ్ని పొగతో ఉన్నట్లుగానే సర్వధర్మాలూ ఏదో ఒక దోషంతో ఆవరింపబడి ఉంటాయి.కాబట్టి ఎంత సేపూ తప్పొప్పులు,దోషాలు వెతకకుండా,స్ధూలంగా జరిగే మంచికి ప్రాముఖ్యం ఇవ్వాలి.
Thursday, 14 August 2025
శ్రేయాన్ స్వధర్మో విగుణః
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥47॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మన వాళ్ళు మాములుగా అంటుంటారు కదా!కుక్క పని కుక్క,గాడిద పని గాడిద చెయ్యాలని!శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖంగా మనందరికి కూడా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!ఉత్తమ విథులతో చేసే పరధర్మానుష్ఠానం కంటే దోషభూయిష్టమయినా కూడా స్వధర్మాన్ని ఆచరించమే శ్రేయస్కరము,ఉత్తమము.చాలా సార్లు మనము రెంటికీ చెడ్డ రేవడి లాగా తయరు అవుతాము.అక్కడా ఇమడలేము,ఇక్కడా ఉండలేము.మనకు అన్వయించే ధర్మాన్ని నమ్ముకోవడమే ఎప్పటికైనా మంచిది.
Wednesday, 13 August 2025
యతః ప్రవృత్తిర్భూతానాం
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందతి మానవః॥46॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సావధానంగా వివరిస్తున్నాడు.అర్జునా!ఇంత సేపూ నేను స్వాభావిక కర్మల ఆచరణ గురించి చెప్పాను కదా!దాని వల్ల లాభం కూడా చెబుతాను విను.ఈ లోకంలో అన్ని ప్రాణులను ఎవరు పుట్టిస్తారు?వాళ్ళ ఎదుగుదల,కర్మలను,లయాన్ని ఎవరు నిర్దేశిస్తారు?ఎవరు ఈ ముల్లోకాలనూ నిండి ఉన్నాడు?ఆ పరమాత్మయే కదా!
మానవుడు తనకు విధింపబడిన కర్మల ద్వారా ఆ పరమాత్మను ఆరాధన చెయ్యాలి.అలా చేస్తే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిని పొందుతారు.అలాగే కైవల్యాన్నీ పొందుతారు.
Tuesday, 12 August 2025
స్వే స్వే కర్మణ్యభిరతః
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః।
స్వకర్మనిరత స్సిద్ధిం యథా విందతి తచ్ఛృణు॥45॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నేను ఇప్పుడు నీకు మూడు రకాల కర్మల గురించి చెప్పాను కదా!దాని వల్ల ఏమి అర్థం అవుతుంది?అంటే మనము మన మన స్వభావ సిద్థమైన కర్మల పట్ల శ్రద్ధాసక్తులు కనబరచాలి.వాటికి అనుగుణంగా,ప్రతిఫలాపేక్షను వదలి ప్రవర్తించాలి.అలా ప్రవర్తించే ప్రతి మానవుడూ జ్ఞానమును సమకూర్చుకుంటాడు.అలాగే సిద్ధి,బుద్ధి పొందుతాడు.ఇందులో లేశమాత్రము అయినా అనుమానము లేదు.మోక్షానికీ,కైవల్యానికీ ఇదే మార్గము.
Monday, 11 August 2025
కృషి గోరక్ష వాణిజ్యం
కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్।
పరిచార్యాత్మకం కర్మశూద్రస్యాపిస్వభావజమ్॥44॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణ,క్షత్రియ కర్మల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు వైశ్యులు,శూద్రుల కర్మల గురించి తెలుసుకుందాము.వ్యవసాయము,గోవుల రక్షణ,వ్యాపారము వైశ్యులకు స్వభావ కర్మలు.అలాగే సేవావృత్తి,సేవాతత్త్వం శూద్రులకు స్వభావ కర్మలు.
Sunday, 10 August 2025
శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం
శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్॥43॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి క్షత్రియ కర్మల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణకర్మల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు క్షత్రియ కర్మల గురించి తెలుసుకుందాము.శౌర్యము అనగా శూరత్వము,పరాక్రమము,ధైర్యము అని అర్ధము.ఇది క్షత్రియులకు పుష్కలంగా ఉండవలసిన గుణము.అలాగే తేజస్సు,ధైర్యము అవసరము చాలా ఉంది.ఇకపోతే పిరికితనము అనేది కనుచూపు మేరల్లో ఉండకూడదు.యుద్ధంలో వెన్ను చూపి,పలాయనం చిత్తగించే గీర,అదే ఆలోచనా సరళి,అస్సలు దరిచేరనీయకూడదు.ధర్మపూర్వకము అయిన దానం చేసే గుణము ఉండాలి.ప్రభువు అనగా రాజు,పాలించేవాడు,స్వపరిపాలిన అందించేవాడికి ఉండే అన్ని శక్తులు,సద్గుణాలు ఉండాలి.ఇవన్నీ స్వభావతః క్షత్రియ కర్మలు.
Saturday, 9 August 2025
శమో దమ స్తప శ్శౌచం
శమో దమ స్తప శ్శౌచం క్షాంతి రార్జవమేవ చ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్॥42॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ వర్ణాలకు సంబంధించిన కర్మల గురించి వివరించేదానికి ఉపక్రమించాడు.అర్జునా!స్వభావ సిద్ధమయిన గుణాలననుసరించి వివిధ వర్ణాలుగా విభజన జరిగింది అని చెప్పాను కదా!ఇప్పుడు వారికి నిర్దేశించిన కర్మలను చెబుతాను,విను.ఇంద్రియ (పంచేంద్రియాలు,మనసు)నిగ్రహణ,తపస్సు,శౌచం,క్షమ,ఋజు వర్తనం,శాస్త్ర జ్ఞానం,అనుభవ జ్ఞానం,ఆస్తిక్యత ....ఇలాంటి మంచి గుణాలు,సంపత్తులు స్వభావతః బ్రాహ్మణ కర్మలు.మన మనసు,మాట,కర్మలు అన్నీ ఒకే తాటి పైన ఉండడమే ఋజు వర్తనము అంటే.మనలో దేవుని ఉనికి పైన విశ్వాసము,ఇహ పర లోకాల గురించిన అవగాహనలను ఆస్తిక్యము అని అంటారు.శౌచము అనేది అందరికీ చాలా ముఖ్యమయినది.ఎందుకంటే ధర్మదేవతకు ఉన్న నాలుగు పాదాలలో శౌచము ఒకటి అని ధర్మరాజు చెప్పాడు.శౌచం అంటే శుచి,శుభ్రత అని అర్ధము.మన పరిసరాలు ఒక్కటే కాదు,మన శరీరాన్ని,మనసును,మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
Friday, 8 August 2025
బ్రాహ్మణ క్షత్రియవిశాం
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః॥41॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఒక్కొక్కరికి స్వభావ సిద్థంగా కొన్ని కొన్ని గుణాలు అలవరతాయి.ఆ గుణాలను అనుసరించి వారికి కర్మలను వేరు వేరుగా విభాజించడం జరిగింది.సంఘంలో వారిని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులుగా విభజించడం జరిగింది.
Thursday, 7 August 2025
న తదస్తి పృథివ్యాం వా
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః।
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్వా త్రిభిర్గుణైః॥40॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ప్రతి విషయానికీ నేను సాత్త్విక,రాజస,తమోగుణాలు,భావాలు,సుఖాలు అంటూ చెబుతున్నాను.అంటే ఈ భూమి పైన పుట్టిన ప్రతిజీవీ ఈ మూడింటిలోని ఏదో ఒక చట్రంలో ఇమిడి ఉంటుంది.ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలు.ఇవేవీ కాకుండా,వీటికి అతీతంగా ఏదీ కూడా ఎక్కడా మనకు కానరాదు.ఈ పరిస్థితి ఒక్క భూలోకంలోనే కాదు,స్వర్గలోకంలో,దేవతలలో కూడా కనిపిస్తుంది.
Tuesday, 5 August 2025
యదగ్రే చానుబంధే చ
యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః।
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతమ్॥39॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస సుఖాల గురుంచి వివరించాడు.ఇంక తామస సుఖం మిగిలి ఉంది.ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస సుఖాలు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక తామస సుఖం గురించి చెప్పుకుందాము.ఇక్కడ మొదలు,ఆఖరు... అంతా మోహజనకంగా ఉంటుంది.నిద్ర,అలసత్త్వము,ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది.ఎక్కడా ప్రశాంత చిత్తంతో,ఆలోచించి చేయడం అనే ప్రణాలిక,మనసు,తెలివి ఉండవు.ఇలా అడ్డూ,ఆపూ లేకుండా,విచక్షణా రహితంగా పొందే సుఖాన్నే తామస సుఖం అని అంటారు.ఇది ఆఖరుకు దుఃఖభాజనము అవుతుంది.
విషయేంద్రియ సంయోగాత్
విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమం।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్॥38॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక సుఖం గురించి చెప్పాడు.ఇప్పుడు రాజస సుఖం గురించి చెబుతున్నాడు.అర్జునా!మొదట్లో కష్టతరంగా ఉండి,నిరంతర సాధనతో అనంతమయిన ఆనందాన్ని ఇచ్చేది సాత్త్విక సుఖం అని చెప్పాను కదా!ఇప్పుడు రాజస సుఖం గురించి మాట్లాడుకుందాము.రాజస సుఖం అనేది ప్రధానంగా ఇంద్రియ సంయోగం వలన పుడుతుంది.మొదట అంతా రంజుగా,అమృత తుల్యంగా ఉంటుంది.కానీ,పోనుపోను విషతుల్యంగా మారుతుంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త!
Monday, 4 August 2025
సుఖం త్విదానీం త్రివిధం
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ।
అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి॥36॥
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమం।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్॥37॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా మూడు రకాలు అయిన ధృతుల గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక మూడు రకాల సుఖాలను గురించి వివరించేదానికి సమాయత్తం అయ్యాడు.
హే భరత శ్రేష్టా!హే అర్జునా!నీకు ధృతి అంటే ఏమిటి?దానిలో రకాలు బాగా అర్థముఅయ్యాయి కదా!మనము ఇప్పుడు సుఖాలు,వాటిల్లో రకాలు గురించి చర్చించుకుందాము.నీకు ఎక్కడ అయినా అనుమానం వస్తే సంశయ నివృత్తి చేసుకో!
సుఖాలు స్థూలంగా మూడు రకాలు.వాటిల్లో మొదట నీకు సాత్త్విక సుఖం గురించి వివరిస్తాను.ఇది మొదట్లో విషతుల్యంగా ఉంటుంది.దుఃఖ భాజకంగా కూడా ఉంటుంది.ఇంత కష్టం,ఇంత నష్టం అవసరమా ?అని కూడా అనిపిస్తుంది.కానీ అభ్యాసం చేసేకొద్దీ సులభతరమవుతుంది.తినగ తినగ వేప తియ్యనగును అంటారు కదా!అలాగ!మనము మొదట్లో కష్టము,బాధాజనకము,దుఃఖ కారకము అనుకునేవి...చిన్న చిన్నగా అభ్యాసం చేసే కొద్దీ సులభతరం అవుతూ వస్తాయి.ఒకటొకటిగా ఇబ్బందులు తొలగి పోతుంటాయి.చివరకు వచ్చేటప్పటికి ఎనలేని ఆనందాన్నీ,ఆత్మ తృప్తినీ ఇస్తాయి.ఆ అమృతమయము అయిన బుద్ధితో జన్మించేదే సాత్త్విక సుఖము.
Saturday, 2 August 2025
యయా స్వప్నం భయం శోకం
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ।
న విముంచతి దుర్మేధా ధృతి స్సా పార్థ!తామసీ॥35॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక ధృతి,రాజస ధృతి గురించి చెప్పాడు.ఇంక మిగిలింది తామస ధృతి కదా!దాని గురించి చెప్పడం మొదలు పెట్టాడు.హే పార్థా!హే అర్జునా!నేను నీకు చెప్పిన సాత్త్విక,రాజస ధృతులు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక ఇప్పుడు తామస ధృతి గురించి చర్చించు కుందాము.ఇక్కడ ముఖ్యంగా మూర్ఖపు పట్టుదలలు కానవస్తుంటాయి.ఒక విషయాన్ని సవ్యంగా ఆకళింపు చేసుకునే సమన్వయం అసలే ఉండదు.స్వప్నం,భయం,శోకం,విషాదం,గర్వం...ఇలా ఒకటి కాదు,సవా లక్ష కారణాలకు చలిస్తూ,ప్రభావితమవుతుంటారు.సానుకూల స్పందన కరవౌతుంటుంది.ఇన్ని అపసవ్యాలు ఉన్నా కూడా,తమ తమ మూర్ఖపు పట్టుదలలను వదిలి పెట్టరు.ఇలాంటి దాన్నే తామస ధృతి అంటారు.
Friday, 1 August 2025
యయాతు ధర్మకామార్థాన్
యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ!రాజసీ॥34॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!మనము ఇప్పుడు మనో ఇంద్రియ నిగ్రహణ సాత్త్విక ధృతి అని మాట్లాడుకున్నాము కదా!అలాగే రాజస ధృతి గురించి నీలో అవగాహన పెంచుతాను,విను.ఇక్కడ అంతా పంతాలు,పట్టింపులు ఎక్కువగా,ప్రధాన పాత్ర వహిస్తాయి.ఈ పని చేస్తే లాభం ఎంత?ప్రతిఫలం మొత్తం నాకే దక్కుతుందా?లేక ఇతరులతో పంచుకోవాలా?అంతా చేస్తే నాకేంటి?అనే భావజాలం ఎక్కువ కనిపిస్తుంది.ధర్మార్ధకామాల యందు అధికంగా పట్టుదల ఉంటుంది.దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది?ధర్మం చేస్తే నాకేమి గిట్టుబాటు అవుతుంది?అంటే చేసే ప్రతి పనిలో లాభనష్టాల బేరీజు వేసుకుంటూ,ముందుకు పోతుంటారు.ఇలా అహంభావంతో,పట్టుదలలతో ఆలోచించడమే రాజస ధృతి.
Subscribe to:
Posts (Atom)