Monday, 18 August 2025

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాఽఽత్మానం నియమ్య చ। శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ॥51॥ వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః। ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥53॥ అహంకారం బలం దర్పం కామం క్రోథం పరిగ్రహమ్। విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥54॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!పరమాత్మను పొందాలి అంటే ఏమి చెయ్యాలో చెబుతాను అన్నాను కదా!మనసు లగ్నం చేసి విను.మాయామోహాలకు అతీతంగా ఉండాలి.నిశ్చలమయిన జ్ఞానంతో మనసును నిగ్రహించాలి.అంటే మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.ప్రపంచం అంతా శబ్దకాలుష్యంతో నిండి ఉంటుంది.ఇలా అనేక రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అవి మన మనసును చలింపచేస్తాయి.రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి.తామరాకు మీద ఉండే నీటిబొట్టులాగా,ఎల్లప్పుడూ విరాగిలాగా ఉండాలి.మనసు ఏకాగ్రత సాధించాలి అంటే ఏకాంతవాసం అవసరము.మితాహారం తీసుకోవాలి.జిహ్వచాపల్యానికి పోయి కనపడ్డదంతా నోట్లో వేసుకోకూడదు.అంటే మనం చేసేపనుల పైన మనకు నుయంత్రణ ఉండాలి.మనోవాక్కాయ కర్మలను నియమ నిబద్ధలతో ఆచరించాలి.ధ్యానయోగులం కావాలి.మనకు అహం ఎక్కువ ఉంటుంది.నాకేమి తక్కువ?అందరి కంటే నేనే గొప్ప అనే భావం బయటకు చెప్పకపోయినా,లోలోపల ఉంటుంది చాలా మటుకు.ఆ అహంకారాన్ని,ఆ అజ్ఞానాన్ని ముందు వదిలి పెట్టాలి.అలాగే అభిమానము,దంభము,దర్పము,కామక్రోధాలను వదలి పెట్టాలి.మనము బయట,లోపల ఒకే రకంగా ఉండగలగాలి.అంటే మనం బయటకు ఎలా కనిపిస్తామో,మన అంతఃకరణంలోనూ అలాగే ఉండాలి.మమకారాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అదే చాలాసార్లు అనర్థానికి హేతువు అవుతుంది.ఇలా త్రికరణ శుద్ధిగా,శాంత చిత్తంతో ఉన్నవాడే,ఉన్న నాడే బ్రహ్మభావానికి మనషి అర్హుడు అవుతాడు.

No comments:

Post a Comment