Saturday, 23 August 2025

స్వభావజేన కౌంతేయ

స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా। కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్॥60॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడికి ఉండే ఓపిక,ఓదార్పు,సగటు మానవుడి మానసిక స్థితి పైన అవగాహన ఇంకెవరికీ ఉండవు.అది రణరంగం!ఆదమరిస్తే ప్రాణాలే పోతాయి.అట్లాంటి చోట అర్జునుడిని కూర్చోబెట్టుకుని,బుర్రలోకి బాగా ఎక్కాలని మంచి విషయాలు పదే పదే,ఎంతో ఓపికగా చెబుతున్నాడు. ఓ అర్జునా!హే కౌంతేయా!మానవుడి పుట్టుక నుండి గిట్టే వరకూ ఏదో ఒక మాయామోహంలో కూరుకుని ఉంటాడు.అది సహజమే!కానీ నేను నీకు పదేపదే చెబుతున్నాను, విను.ప్రకృతి పరంగా జనితమైన ఏమాయో,భ్రాంతో నీవు యుద్ధం చేయవద్దని నిన్ను ప్రేరేపించ వచ్చు,ప్రలోభపెట్టవచ్చుగాక!కానీ తుదకు నీ సహజమైన క్షాత్ర్య ధర్మానికి నీవు కట్టుబడతావు.నీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడి యుద్ధానికి కార్యోన్ముఖుడివి అవుతావు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం నీ మనసులో ఉండే అలజడి,అనుమానం అన్నీ దూది పింజాలులాగా పక్కకి పోతాయి.నీవు స్వచ్ఛమయిన చంద్రుడిలా ప్రకాశిస్తావు.నీవు తప్పకుండా ఈ యుద్ధాన్ని చేసి తీరుతావు.నాకు నీపై ఆ నమ్మకం ఉంది.

No comments:

Post a Comment