Friday, 21 November 2025
పశ్యైతాం పాండుపుత్రాణాం
పశ్యైతాం పాండు పుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్।
వ్యూఢాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా॥3॥1॥
సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో జరిగేది కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాడు.
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు.ఆచార్యా!దృపద నందనుడు అయిన ధృష్టద్యుమ్నుడు తెలుసు కదా!అదే మీ శిష్యుడు భలే బుద్ధిశాలి!అతను వ్యూహాకారంగా తీర్చిన పాండవ సైన్యాన్ని పరికించండి.
Wednesday, 19 November 2025
దృష్ట్వా తు పాండవానీకం
సంజయ ఉవాచ....
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా।
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్॥2॥1॥
సంజయుడు ధృతరాష్ట్రుడి ఆదుర్దా అర్థం చేసుకునినాడు.ప్రశాంతంగా చెబుతున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!ఇరు వైపులా రెండు సేనలు తమ తమ బలాలూ,బలగాలతో సంసిద్ధంగా ఉన్నాయి.ఇంకొంచెం సేపట్లో యుద్ధం మొదలవుతుంది అనగానే నీ కొడుకు అయిన దుర్యోధనుడు ఒకసారి పాండవుల సైన్య వ్యూహాన్ని చూసాడు.తమ ఆచార్యులు అయిన ద్రోణుడిని సమీపించి ఇలా అన్నాడు.
ప్రధమ అధ్యాయము -అర్జున విషాద యోగము…ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధృతరాష్ట్ర ఉవాచ...
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ॥1॥
కురు క్షేత్ర యుద్ధంకి అన్ని సన్నాహాలూ అయిపోయాయి.పోరు సలిపేదానికి ఇరు వర్గాలూ రణభూమి చేరుకున్నాయి.ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కదా!కనిపించదు.రణరంగానికి వెళ్ళి యుద్ధం చేయలేడు.కానీ ఏమవుతుందో అనే ఆదుర్దా,గెలవాలనే ఆకాంక్ష మనిషిని నిలువనీయవు కదా!యుద్ధభూమిలో జరిగేవి జరిగినట్లు,కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగేదానికోసరం ,సంజయుడికి దివ్యదృష్టి కలిగించడం జరిగింది.దాని ఆసరాతో సంజయుడు మందిరంలో ధృతరాష్ట్రుడి పక్కనే కూర్చుని,యుద్ధం ఎలా జరుగుతుందో చెప్పేదానికి ఉపక్రమించాడు.
ఈ లోపలే ధృతరాష్ట్రుడికి తొందర!తన కొడుకులు దాయాదులతో తేల్చుకునేదానికి పోరు బాట పట్టారు కదా!అందుకే అడుగుతున్నాడు.
సంజయా!ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేదానికి సమకూడుకున్నారు కదా అందరూ!నా తరఫున నా బిడ్జలు,దుర్యోధనాదులు,ఆవలి తట్టున పాండవులు యేమి చేశారు?
Tuesday, 18 November 2025
భగవద్గీత పారాయణ మొదలు
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥1॥
ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవేనమః॥2॥
ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్।
వాసుదేవమ్ జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్॥3॥
ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే।
నమో వైబ్రహ్మ నిథయే వాసిష్ఠాయ నమో నమః॥4॥
ఓం నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్॥5॥
Sunday, 16 November 2025
మాహాత్మ్య మేతద్ గీతాయా
మాహాత్మ్య మేతద్గీతా యా మయా ప్రోక్తం సనాతనమ్।
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్॥23॥
గీతా మాహాత్మ్యం సంపూర్ణమ్!
మనందరి భగవంతుడు మరలా నొక్కి చెబుతున్నాడు.భగవద్గీత అతి పురాతనము అయినది.నాచే వచింపబడింది.ఈ మాహాత్మ్యము భగవద్గీత పఠనానంతరం పారాయణం చేయాలి.అలా చేసే మానవుడు దీని యందు చెప్పబడిన ఫలితాలు అన్నీ తప్పకుండా పొందుతాడు.ఇది నా మాట!
భగవద్ గీతా మాహాత్మ్యము సంపూర్ణము!
Friday, 14 November 2025
ఏతాన్మాహాత్మ్య సంయుక్తం
ఏతాన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః।
సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్॥22॥
భగవంతుడు మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నాడు.ఎవరైతే గీతా శాస్త్రముతో పాటుగా గీతా మహత్మ్యము కూడా చదువుతారో వారు ధన్యులు.వారు పైన ఉదహరించిన రీతిగా గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు.అంతే కాకుండా మోక్షప్రాప్తికూడా సాథిస్తారు
గీతాయాః పఠనం కృత్వా
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్।
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః॥21॥
భగవంతుడు అయిన నారాయణుడు భూదేవికి చెబుతున్నాడు.ఓ భూదేవి!ప్రతి ఒక్కరూ భగవద్గీతను పారాయణం చేయాలి.దానితో పాటే ఈ మహాత్మ్యంకూడా చదవాలి.లేకపోతే ఆ పారాయణ వ్యర్థమవుతుంది.దాని ఫలము,ఫలితమూ ఆయాసమే కానీ ఫలదాయకము కాదు.
Wednesday, 12 November 2025
గీతామాశ్రిత్య బహవో
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః।
నిర్దూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదమ్॥20॥
భగవంతుడు భూదేవికి ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!నీకు ఈ విషయం తెలుసా!జనకుడు,ఇంకా చాలా మంది మహనీయులు గీతను ఆశ్రయించారు.ఒక రకంగా చెప్పాలంటే ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఆశ్రయించడం మూలానే వారు తమ పాపాలను ప్రక్షాళనం చేసుకోగలిగారు.పరమ పవిత్రమయిన పరమ పదాన్ని సునాయాసంగా పొందగలిగారు.
Tuesday, 11 November 2025
గీతార్థం ధ్యాయతే నిత్యం
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః।
జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్॥19॥
మనుష్యులు పొద్దున లేచి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు.ఈ పనులు చేసేవాళ్ళు గీతాపఠనానికి అర్హులు,ఇంకోరు కాదు అని ఏమీ లేదు.ఎటువంటి కర్మాచరణులు అయినా సరే ప్రతిదినమూ సార్ధకంగా గీతాపారాయణ చేయవచ్చు.అలా చేసే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు.జ్ఞానవంతులు అవుతారు.చివరకు పరమపదాన్ని చేరుకుంటారు.
Sunday, 9 November 2025
గీతార్థ శ్రవణాసక్తో
గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా।
వైకుంఠం సమ వాప్నోతి విష్ణునా సహమోదతే॥18॥
విష్ణువు చెబుతున్నాడు.భూదేవీ!జీవితంలో ఎన్ని పాపాలు చేసినా సరే!భగవద్గీతను అర్థ యుక్తంగా వినేదానికి,చదివేదానికి శ్రద్థ,జిజ్ఞాస చూపిస్తే చాలు.వాడు ఖచ్చితంగా వైకుంఠాన్ని పొందుతాడు.అక్కడ విష్ణువు అనుభవించేవన్నీ తనూ అనుభవిస్తాడు.
అంటే దీని అర్థం చెబుతాను.భగవద్గీతా పఠనం సర్వపాప ప్రక్షాళనం చేస్తుంది.భగవద్గీతను నమ్ముకుంటే సరాసరి మోక్షానికి దారి కనుక్కున్నట్లే!
Saturday, 8 November 2025
గీతాభ్యాసం పునః కృత్వా
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమామ్।
గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్॥17॥
భగవంతుడు అయిన శ్రీహరి ఇంకా ఇలా చెబుతున్నాడు.భగవద్గీత పారాయణము చేస్తూ మరణించిన వారు మరలా మనుష్య జన్మనే పొందుతారు అని చెప్పాను కదా!వారు మళ్ళీ మళ్ళీ జన్మలలో కూడా గీతాధ్యయనం కొనసాగిస్తారు.చివరకు మోక్షం ప్రాప్తం అవుతుంది.గీతను స్మరిస్తూ మరణించినవారు ఖచ్చితంగా సద్గతి పొందుతారు.
Friday, 7 November 2025
చంద్రలోక మవాప్నోతి
చంద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధృవమ్।
గీతాపాఠ సమాయుక్తో మృతోమానుషతాం వ్రజేత్॥16॥
భగవంతుడు భూదేవితో అంటున్నాడు.భూదేవీ!నీకు ఇంకా ఈ విషయం తెలుసా!అసలు నేను ఈ భగవద్గీత వల్లనే స్థిరుడుగా ఉన్నాను.భగవద్గీతలోనే,దాని సారంలోనే నేను నివసిస్తున్నాను.దీని మూలంగానే,దాని ఆధారంగానే,దీని పద్థతి ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను.
కాబట్టి గీతాధ్యయనం చేస్తూ మరణించినవారు మరలా ఉత్తమమయిన మానవ జన్మనే పొందుతారు.ముందర చెప్పినట్లు గీతలో కొసరంత రోజూ చదువుకుంటున్నా చంద్రలోకంలో పదివేల సంవత్సరాలు ఉంటారు.
Thursday, 6 November 2025
గీతాయాః శ్లోక దశకం
గీతాయాః శ్లోక దశకం సప్త పంచ చతుష్టయమ్।
దౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః॥15॥
భగవంతుడు ఎంత దయామయుడు!ప్రార్థించే మనసు ముఖ్యం అని ఎరిగినవాడు.అందుకే ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!రోజుకు పది శ్లోకాలు చదివినా చాలు.అలాగే యేడు గానీ,ఐదు గానీ రెండుగానీ,తుదకు ఒక్కటికానీ,అదీ వీలు కాకపోతే కనీసం సగము శ్లోకము,భగవద్గీత లోనిది,ప్రతి దినమూ భక్తితో చదివితే చాలు.
అలా చదివే వాళ్ళు పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో ఉంటారు.
అధ్యాయ శ్లోక పాదం వా
అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః।
సయాతి నరతాం యావన్మనుకాలం వసుంథరే॥14॥
భూదేవీ!ఇంకా ఇది కూడా చెబుతాను విను.అధ్యాయంలోని నాలుగో వంతు చదివినా రోజూ,మంచే జరుగుతుంది.ప్రతి నిత్యమూ భగవద్గీతలోని ఒక అధ్యాయములోని నాలుగవ వంతు పఠించినా,పారాయణము చేసినా ఒక మన్వంతరము మొత్తమూ మానవ జన్మనే పొందుతారు.సృష్టిలో మానవ జన్మ ఉత్తమమయినది అని అంటారు కదా!
Tuesday, 4 November 2025
ఏకాధ్యాయంతు యోనిత్యం
ఏకాధ్యాయంతు యోనిత్యం పఠతే భక్తి సంయుతః।
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్॥13॥
భగవంతుడి అభిప్రాయము ఏందంటే మనము ఒక పని చేసేటప్పుడు ఉండాల్సిన నియమనిష్ఠలు,భక్తిభావము,సత్సంకల్పము సరిగ్గా,సజావుగా ఉండాలి అని.
అందుకే చెబుతున్నాడు.ఓ భూదేవీ!రోజుకు ఒక అధ్యాయము అయినా మనస్పూర్తిగా,ధ్యాసగా పఠించినా ఫలితము దక్కుతుంది.రోజూ ఒక్క అధ్యమైనా పఠించి,పారాయణ చేసేవాళ్ళు రుద్రలోకాన్ని పొందుతారు.ప్రమద గణాలతో చేరి,స్థిర నివాసము ఏర్పరుచుకుంటారు.
Monday, 3 November 2025
యోష్టాఽదశ జపేన్నిత్యం
యోష్టాఽదశ జపేన్నిత్యం నరో విశ్చల మానసః।
జ్ఞానసిద్ధిం చ స లభతే తతో యాతి పరంపదమ్॥10॥
భగవంతుడు భూదేవితో అంటున్నాడు.ఓ భూదేవీ!ఎవరు అయితే ప్రతిరోజూ గీతా పారాయణము చేస్తారో,వారు ఇహంలో బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు.అంతేకాకుండా అంత్యంలో మోక్షాన్ని పొందుతారు.ఇందులో ఢోకా లేదు.
త్రిభాగం పఠమానస్తు
త్రిభాగం పఠమానస్తు గంగాస్నాన ఫలం లభేత్।
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్॥12॥
భగవంతుడు అయిన శ్రీహరి భూదేవికి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!భగవద్గీతలోని ఆరు అధ్యాయాలు,అదే మూడవ వంతు పారాయణము చేస్తే గంగలో స్నానము చేసిన ఫలము దక్కుతుంది.గంగ మనకు పుణ్యనది కదా!అలా కాకుండా మూడు అధ్యాయాలు,అదే ఆరవ భాగం పారాయణ చేస్తే సోమయాగ ఫలం లభిస్తుంది.
Sunday, 2 November 2025
పాఠేఽసమర్థ స్సంపూర్ణే
పాఠేఽసమర్థ స్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్।
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః॥11॥
భగవంతుడికి మానవుల అశక్తత బాగా తెలుసు.అందుకే చెబుతున్నాడు.ఓ భూదేవీ!మానవులు గీతాపారాయణము సంపూర్ణంగా చేయలేకపోతున్నాము,ఎలా?అని దిగులు పడనక్కరలేదు.
పూర్తిగా గీతా పారాయణ చేసే శక్తి,సమయం,ఇతరత్రా కారణాలు లేకపోయినా,సగము పారాయణ చేసినా ఫలితము దక్కుతుంది.సగము పారాయణ చేసుకున్న వారికి గోదాన పుణ్యము లభిస్తుంది.
హిందూ సంప్రదాయంలో గోవుకు చాలా మహత్మ్యము ఉంది.అలాంటి గోవును దానము చేసిన ఫలము అంటే సామాన్యము కాదు.
Saturday, 1 November 2025
చిదానందేన కృష్ణేన
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోఽర్జునమ్।
వేదత్రయీ పరానందా తత్త్వార్థ జ్ఞానమంజసా॥9॥
భగవద్గీత అనేది ఆషామాషీగా తీసుకునే గ్రంథరాజము కాదు.ఇందులో మూడు వేదాల సారము ఇమిడి ఉంది.సత్ చిత్ ఆనందము,మోక్షానికి మార్గము చూపేది,దీని సారము.మనిషికి కావలసిన,అవసరమయిన తత్త్వాలగురించి వివరంగా చెప్పబడి ఉంది.
ఇలా మనసును ప్రక్షాళన చేసే అన్ని విషయాలు క్రోడీకరించబడిన ఈ గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి నోట అర్జునుడికి ఉపదేశించబడింది.కాబట్టి సర్వ మానవాళికి ఇది శిరోథార్యము.
Subscribe to:
Comments (Atom)