Monday, 23 March 2026
ఇంద్రియాణాం హి చరతాం
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽను విధీయతే।
త దస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి॥67॥2॥
శ్రీమగ్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే పనులు,మన కోరికలు సామాన్యమయినవా,చెప్పు?ప్రతి ఒక్కటీ అంతకు మించి అన్నట్లు ఉంటుంది.విషయాలలో ఇంద్రియాలు ఎట్లా ప్రవర్తిస్తాయి,చెప్పు?అవి చెప్పినట్లు మనసు జీ హుజూర్ అంటూ అనుసరించింది అనుకో,ఇంక అంతే సంగతులు,చిత్తగించవలెను అన్నట్లు తయారవుతుంది.నీకు ఒక ఉదాహరణ చెబుతాను.మనము నావలో ప్రయాణం చేస్తున్నాము.ఉన్నట్లుండి హోరుగాలి వీస్తుంది.అప్పుడు ఏమవుతుంది?పడవ మన చెప్పు చేతల్లో ఉండదు.గాలి ఎటు మళ్ళిస్తే అటు ఊగిపోతుంది.దారి తప్పి పోతుంది.తీరం సజావుగా చేరదు.మన నియంత్రణలో ఏమీ ఉండదు.చంచల మయిన మనసు యతుల బుద్ధిని కూడా హరించేస్తుంది.కాబట్టి మనము ఇంద్రియాలను మన చెప్పుచేతల్లో పెట్టుకోవటం శ్రేయస్కరం అన్ని వేళలా!
Sunday, 22 March 2026
నాస్తి బుద్ధి రయుక్తస్య
నాస్తి బుద్ధి రయుక్తస్య న చా యుక్తస్య భావనా।
న చా భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్॥66॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు చెట్టును ఇంకో తట్టునుంచి నరుక్కొస్తున్నాడు.అర్జునా!ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అర్థమైందా?నేను దానినే ఇంకో రకంగా చెబుతాను విను.మనిషిని బలహీన పరిచేవి ఇంద్రియాలు కదా!కనిపించిందంతా కావాలంటాయి.ఇష్టం లేకపోతే వాటి ఉనికి,ఊసూ మన ముందరకు రాకూడదు అనిపిస్తుంది.కాబట్టి ముందుగా ఇంద్రియాలను మన గుప్పెట్లో పెట్టుకోవాలి.ఇష్టమయినవి దక్కాయి అని భాంగ్రా నృత్యం చేయకూడదు.ఇష్టం లేని వాటిని భరించలేమని అఘాయిత్యం చేయకూడదు.అలా మనలను మనం నియంత్రించుకోలేక పోతే స్థిర బుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది చెప్పు?స్థిర బుద్ధి లేకపోతే ఆత్మ వివేకము ఎక్కడ నుంచి వస్తుంది?పరమార్థ చింతన,అదే భగవంతుడి పైన ధ్యాస,ఎక్కడ నుంచి వస్తాయి మనకు?ఈ రెండూ లేని వాడికి శాంతి అనేది అందని ద్రాక్ష పండులాగే కదా!శాంతి అనే పదానికే దిక్కూ దివాణం లేకపోతే సుఖమెలా దక్కుతుంది?సుఖం అనే పదము సుదూర తీరాలకు ప్రయాణమై పోతుంది.
ప్రసాదే సర్వదుఃఖానాం
ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యో పజాయతే।
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి॥65॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సఖా!సూక్ష్మంలో మోక్షం అంటారు కదా!ఇది అదే!మనము మన మనసును నిర్మలంగా పెట్టుకోగలిగితే చాలు.చిక్కు ముడి విప్పినట్లు అన్ని సమస్యలూ వాటంతట అవే సర్దుకుంటాయి.మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది చెప్పు?కోపాలూ,కాపాలూ లేనప్పుడు.ఆశలూ,అసహనాలూ,అసంతృప్తులూ లేనప్పుడు.అంతే కదా!మనసు నిర్మలంగా ఉంటే సుఖదుఃఖాలు ఉండవు.నశిస్తాయి.ఎగిరెగిరీ పడబళ్ళేదు.అథఃపాతాళానికీ కృంగిపోబళ్ళేదు కనుక.అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్త్వాన్ని పొందుతుంది.దీనికి ఢోకా లేదు.
Saturday, 21 March 2026
రాగద్వేష వియుక్తైస్తు
రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్।
ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి॥64॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చిలకకి చెప్పినట్లు చెబుతున్నాడు.అర్జునా!మన వ్యవహారం ఎలా ఉండాలో చెప్పేదా?తామరాకు పైన నీటిబొట్టులాగ ఉండాలి.అంటే నీటి బొట్టు తామరాకు పైన ఉన్నా దానిని నిజంగా అతుక్కుని ఉండదు.సన్నని,పల్చని మైనపు పొర ఆకు పైన ఉంటుంది.దాని వలన నీటి బిందువు స్వేచ్ఛగా,స్వచ్ఛంగా ఆకు మీద ఎలా అయినా కదులుతుంది.అలానే మనం కూడా విషయాలను అనుభవిస్తున్నా,కర్మలను ఆచరిస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవాలి.ఇంద్రియ నిగ్రహం ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి.అప్పుడే మనము మన మనసును మన ఆధీనంలో ఉంచుకోగలము.మన మనసు ఎప్పుడు మన స్వాధీనంలో ఉంటుందో,అప్పుడే మనము నిర్మల మనస్కులము కాగలము.లేక పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్లు ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఉంటాము.
క్రోధా ద్భవతి సమ్మోహః
క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః।
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి॥63॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు తన చెలికాడు అయిన అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!చెలికాడా!నీకు శృంఖల చర్య,అదే గొలుసు కట్టు చర్య అంటే తెలుసు కదా!ఒక పని మొదలు పెడితే అక్కడితో ఆగకుండా,మన ప్రమేయం లేకుండానే,మనకు ఊపిరి పీల్చుకునే అవథి కూడా ఇవ్వకుండా వెనువెంటనే జరిగి పోతుంటాయి కొన్ని పనులు.మనము నిర్ఘాంతపడి చూస్తూ ఉండాల్సిందే.ఎందుకంటే ఆ పరిణామాలను మనము ఆపలేము.ఇక్కడ నేను చెప్పబోయేది అదే.మనకు కోపం వస్తుంది.దాంట్లో ఆశ్చర్యం ఏముంది?మామూలే కదా!మనిషి అన్నాక ఆ మాత్రం కోపతాపాలు ఉండవా?అని మనలని మనం సమర్థించుకుంటాము.ఇదే మనము చేసే మొదటి తప్పు.ఎందుకంటే కోపం వస్తే మనము విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాము.విచక్షణ లేదు అంటే ముచ్చటగా అవివేకమనే కదా అర్థం!ఒకటి కొంటే ఒకటి ఉచితం కాదు.ఒకటి కొంటే పది ఉచితం లాగా కలుపుకుని వస్తాయి ఇక్కడ.ఎందుకంటే అవివేకంతో పాటు స్మృతిభ్రంశం అంటుకుంటుంది.అంటే మతి మరుపు.ఇంతకు ముందు మనము నేర్చుకున్న మంచి చెడ్డా,పెద్దా చిన్నా,తప్పూ ఒప్పూ అన్నీ చిటికెలో మాయమవుతాయి.దీని పర్యవశానం ఏందంటే బుద్ది చెడుతుంది.చెడ్డ ఆలోచనలు,చెడ్జ తలపులు,చెడ్డ పనులకు మొగ్గు చూపుతాము.ఒకసారి సద్బుద్ధిని కోపమనే చెదపురుగు తొలిచిందనుకో,ఇంకేముంది?సర్వం నాశనమే!పురుషుడు అథోగతికి జారిపోతాడు.
Friday, 20 March 2026
ధ్యాయతో విషయాన్ పుంసః
ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూప జాయతే।
సంగా త్సంజాయతే కామః కామాత్ క్రోధోఽభి జాయతే॥62॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి విడమరిచి చెబుతున్నాడు.కౌంతేయా!కిటుకు అంతా ఇంద్రియ నిగ్రహంలోనే ఉంది.ఎందుకంటవా?మామూలుగా మనిషి ఇంద్రియాల సహాయంతోటే అన్ని విషయాల పైన ఆసక్తి,అనురాగం,మోహం,కామం పెంచుకుంటాడు.మనము కోరుకున్నది దక్కకపోతే అసహనం,అసంతృప్తి,చివరకు కోపం,క్రోథం ...వీటికి లోనయి,బానిసలం అవుతాము.ఆ చిక్కుముడి నుంచి బయట పడలేము.అక్కడక్కడే గింగిరాలు తిరుగుతుంటాము.
తాని సర్వాణి సంయమ్య
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః।
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥61॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము చెయ్యాల్సిన పని ఏందో చెప్పనా?మనము ముందర ఈ ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.అవి ఆడమన్నట్లు మనం ఆడకూడదు.అలుసు అయిపోతాము.ఎల్లప్పుడూ మన ఆసక్తి అంతా ఆత్మ పైనే ఉండాలి.అట్లా ఎవరు అయితే వాళ్ళ ఇంద్రియాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటారో,వారి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది.అసలు నిగ్రహమే లేని వారికి స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది?గాలి ఎటు మళ్ళితే అటు పోతుంటారు.
Subscribe to:
Comments (Atom)