Wednesday, 3 December 2025
తస్య సంజనయన్ హర్షం
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్॥12॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము
పొగడ్తలకు లొంగని వాళ్ళు,పొంగని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు.దానికి ఎవరం అతీతులం కాదు.
దుర్యోధనుడు భీష్ముడు మన నాయకుడు,అందరం కలసి ఆయనను రక్షించుకోవాలి అనగానే మనసు హాయిగా అయింది.ఎప్పుడైనా ఇచ్చుకోమ్మా వాయనం అంటే పుచ్చుకోమ్మా వాయనం అంటారు కదా!
అట్లాగే దుర్యోధనుడు తనను సంతోషపెట్టాడు కాబట్టి తను కూడా దుర్యోధనుడికి సంతోషం కలుగచేయాలనుకున్నాడు.అందుకని సింహనాదం చేసాడు.నలు దిక్కులు పిక్కటిల్లేలాగా భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు.
Tuesday, 2 December 2025
అయనేషు చ సర్వేషు
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః।
భీష్మ మేవాభి రక్షంతు భవంత స్సర్వ ఏవ హి॥11॥1॥
శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు ముక్తాయింపుగా తమ వైపు వారు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.ఇప్పుడు అందరికీ విషయం అర్థం అయింది కదా!మనవైపు వీరులు ఎక్కువ మంది ఉన్నారు.మనవైపు ఎక్కువ అక్షోహిణుల సైన్యం ఉంది.కాబట్టి మనకే గెలుపు అవకాశాలు ఎక్కువ.అలా అని ప్రత్యర్థి బలాలు మనము తక్కువ అంచనా వేయకూడదు.
కాబట్టి మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలలో అప్రమత్తంగా ఉండండి.అసలు మీకు కేటాయించబడిన ప్రదేశాలను విడవకుండా జాగరూకతతో ఉండండి.మనకందరికీ నాయకుడు వృద్ధ పితామహుడు భీష్ముడు.అతనికి అన్ని వైపుల నుంచి రక్షణ కవచంలా ఉండి కాపాడటం మీ ధర్మం!
అపర్యాప్తం తదస్మాకం
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్॥10॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము..
దుర్యోధనుడు ధైర్యంగా చెబుతున్నాడు.గురుపుంగవా!మన సైన్యం భీష్ముడుచే రక్షింపబడుతూ ఉంది.మన సైన్యం అపరిమితంగా ఉంది.పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది.వారిది పరిమితమైన సైన్యము.
నిజమే!కౌరవుల దగ్గర పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది.పాండవుల తట్టు ఏడు అక్షౌహిణుల సైన్యం ఉంది.
Monday, 1 December 2025
అన్యేచ బహవశ్శూరాః
అన్యే చ బహవ శ్శూరాః మదర్థే త్యక్త జీవితాః।
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః॥9॥1॥
శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు తన తరఫున యుద్ధానికి సన్నధులు అయిన వీరుల గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు.మహనీయులైన ద్రోణాచార్యా!నేను ఉటంకించిన వారు ఒక్క వీరులే కాదు.నా కోసరము తమ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టగల సమర్థులు.అందరూ అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతులు.వీరే కాకుండా ఇంకా చాలా మంది శూరులు యుద్ధ విద్యా విశారదులు మన తరఫున మన వైపు ఉన్నారు.
Subscribe to:
Comments (Atom)