Tuesday, 25 August 2026

ప్రాప్య పుణ్యకృతాం లోకా

ప్రాప్య పుణ్య కృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః। శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభి జాయతే॥41॥6॥ శ్రీమద్భగవద్గీత....ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు లాంటి మంచి మిత్రులు అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!అయినా మనము కూడా అదృష్టవంతులమే!ఎందుకంటారా?శ్రీకృష్ణుడితో పాటూ అర్జునుడు కూడా మనకు మిత్రుడు అయిపోయాడు కదా!మనము అడగవలసిన ప్రశ్నలు అన్నీ మన తరఫున అతనే అడిగేస్తున్నాడు.మనకు ఆ శ్రమ కూడా తప్పించేసాడు.అర్జునుడి ప్రశ్నలకు సమాథానంగా శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ సఖా!మంచి పనులు సగంలో అసంపూర్తిగా మానేస్తే ఎలా అని కదా నీ అనుమానం?ఏమీ దిగులు పడవలసిన పని లేదు.యోగ భ్రష్టుడు కూడా పుణ్యాత్ములు పొందే ఉత్తమ లోకాలు పొందుతాడు.చాలా కాలం అక్కడ నివసిస్తాడు.ఆ తరువాత సదాచారులు అయిన ధనిక కుటుంబంలో జన్మిస్తాడు.అంటే తన దీక్ష పూర్తి కాలేదు కాబట్టి పునర్జన్మ ఉంటుంది.అతను పూర్వ జన్మలో చేసిన పుణ్యకార్యాల కారణంగా మంచి మనుషుల మధ్య పుడతాడు.పూర్వ జన్మ వాసనలు ఉంటాయి కాబట్టి తాను ఎక్కడ వదలి పెట్టాడో పూర్వ జన్మలో.....అక్కడ నుంచి ముందుకు సాగుతాడు.అందుకే కదా పడ్డవాడు ఎప్పుడూ చెడ్జవాడు కాడు అని పెద్దలు అంటారు.వాడికీ ఒక మంచి రోజు వస్తుంది.

No comments:

Post a Comment