Monday, 9 December 2024
సమం సర్వేషు భూతేషు
సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం।
వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి॥28॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు చెపుతున్నాడు.అర్జునా! భగవంతుడు అనేవాడు సర్వ భూతాలలోనూ సమంగా ఉంటాడు.అతనికి ఒకరు ఎక్కువ,ఇంకొకరు తక్కువా కాదు.ఒకటి ఎక్కువ,ఇంకొకటి తక్కువా కాదు.ఆ భూతాలు నశించినా తాను మటుకు నాశనం కాడు.అంటే సర్వ ప్రాణికోటి నశించినా,తాను మాత్రం అజరామరంగా,శాశ్వతంగా ఈ చరాచర సృష్టి ఉన్నంత వరకూ ఉంటాడు.అలాంటి పరమేశ్వరుడిని చూడగలిగినవాడు మాత్రమే నిజమైన ద్రష్ట.
Saturday, 7 December 2024
యావత్సంజాయతే కించిత్
యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమం।
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ॥27॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి చెపుతున్నాడు.అర్జునా!ఈచరాచరజగత్తు మొత్తం స్థావర జంగమమయినది.ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం నుంచి జనించినదే.స్థావరం అంటే ఒకేచోట నిలబడి ఉండేది.జంగమం అంటే కదలిక ఉండేది అని అర్థం.ఈ విషయాన్ని నువ్వు ముందు తెలుసుకోవాలి.
Friday, 6 December 2024
అన్యే త్వేవ మజానంతః
అన్యే త్వేవ మజానంతః శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే।
తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః॥26॥
శ్రీమద్భగవద్గీత..।త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మతత్త్వము అనేది అందరికీ సులభంగా అర్థం కాదు కదా!అలా స్వతహాగా అర్థంచేసుకోలేని కొందరు తత్త్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు.ఇలా ఆత్మతత్త్వం గురించి తెలియకపోయినా,మనసా,వాచా,కర్మణా అభ్యాసం చేసేవారు కూడా మృత్యురూపమయిన సంసారము నుంచి తరిస్తారు.ఇందులో ఎలాంటి అనుమానంలేదు.
Thursday, 5 December 2024
ధ్యానే నాత్మని పశ్యంతి
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మాన మాత్మనా।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే॥25॥శ్రీమద్భగవద్గీత...క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
త్రయోదశాధ్యాయము
కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొందరు ఆపరమాత్మను పరిశుద్థమయిన సూక్ష్మ బుద్థితో హృదయంలో చూస్తున్నారు.కొందరు యోగ ధ్యానంతో చూస్తున్నారు.మరి ఇంకొందరు జ్ఞానయోగం సహాయంతో చూస్తున్నారు.ఇంకొక వర్గం నిష్కామయోగంను ఆశ్రయించి,దాని ద్వారా పరమాత్మను దర్శిస్తున్నారు.ఇలా ప్రతి ఒక్కరూ వారి వారికి తగిన రీతిలో,పరంథాముడిని చేరేదానికి కృషి చేస్తున్నారు.
Tuesday, 3 December 2024
య ఏవం వేత్తి పురుషం
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ।
సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే॥24॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇలా అందరూ జీవుని గురించి,గుణాలతో వున్న ప్రకృతి గురించి తెలుసుకోవాలి.ఇలా అన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు ఎలాంటి కర్మలను చేసినా తిరిగి జన్మించడు.అంటే మోక్షం సంపాదిస్తాడు.
Monday, 2 December 2024
ఉపద్రష్టానుమంతా చ
ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః॥23॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!భగవంతుడు మన దేహంలోనే ఉంటాడు.అతనినే పరమాత్మ అని అంటాము.కానీ దేహానికి అతీతుడు.ఆ విశ్వేశ్వరుడు,పరంథాముడు,పరమాత్మ స్వతంత్రుడు.ఈ జగత్తుకంతా అనుకూలంగా అనుమతిని ఇచ్చేవాడు.ఈ విశ్వంలో జరిగే ప్రతి చిన్న కదలికకు కూడా సాక్షిమాత్రుడు.సర్వ జగత్తును పోషించేవాడు,పాలించేవాడు.ఈ సృష్టికి అంతా యజమాని అతనే.ఈ చరాచర జగత్తును అంతా పర్యవేక్షిస్తుంటాడు.అతడు దివ్య భోక్త.
Sunday, 1 December 2024
పురుషః ప్రకృతిస్థో హి
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్।
కారణం గుణసంగోఽస్య సదసద్యోని జన్మసు॥22॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి సవివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈజీవుడు అనే వాడు ఉన్నాడు కదా!వాడు ప్రకృతికృత దేహగతుడు.అంటే ఈప్రకృతి ఇచ్చిన దేహం కలవాడు.అయినాకూడా అదే ప్రకృతిచే ఉత్పాదితాలు అయిన గుణాలవలన సుఖదుఃఖాలు,ఇతరమయిన క్లేశాలు అనుభవిస్తున్నాడు.వివిధ,పలు రకాల యోనులందలి జన్మలకు గుణ సంగమమే కారణము.అంటే ప్రకృతి మన దేహాలకు కారణభూతము అవుతుంది.అలాగే మనలో పుట్టే రకరకాల గుణాల వల్ల ఉత్పన్నమయే సుఖదుఃఖాలకూ కారణభూతము అవుతుంది.
Subscribe to:
Posts (Atom)