Thursday, 29 August 2024
అనేక వక్త్ర నయనం
అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనం
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్॥10-11
అనుకోకుండా మనకు మంచి జరిగితే అందరూ ఏమంటారు?నక్క తోక తొక్కాడు రా వీడు అని అంటారు కదా!ఇక్కడ సంజయుడిది కూడా అలాంటి అదృష్టమే!మహా మహులు,హేమాహేమీలు,గురువులు,యోగులు ఎంత మంది వున్నా,అర్జునుడితో పాటు ఆయనకు కూడా భగవంతుడి విశ్వ రూపం చూసే అదృష్టం దక్కింది.
పిల్లి పిల్లి తన్నుకుంటే మధ్యలో కోతి లాభ పడిందట!అలాగే పాండవులు,కౌరవులు తన్నుకుంటే,సంజయుడు లాభ పడ్డాడు.ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.ఆయన మామూలు గుడ్డి కాదు.బిడ్డల పైన అతి ప్రేమతో మంచి చెడ్డ విచక్షణ కోల్పోయిన అంథత్వం.
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఆ విశ్వ రూపం అనేక ముఖాలతో వుందట.అనేక నేత్రాలతో వుందట.అద్భుతాకారాలతో,దివ్యాభరణాలతో విరాజిల్లుతున్నదట!దివ్యమైన ఆయుధాలు,వస్త్రాలు,పూలమాలలు,సుగంధాలు,లేపనాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుందట!
న తు మాం శక్యసే దృష్టుమ్
న తు మాం శక్యసే దృష్టు మనేనైవ స్వచక్షుషా
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్॥8-11
విశ్వరూప సందర్శన యోగము
మనం మాములుగా కనిపించేవి చూస్తాము.మరీ చిన్న చిన్న చీమలు,చీకటీగలు చూడాలంటే కళ్ళు చికిలించి మరీ చూస్తాము.కళ్ళకు కనిపించని సూక్ష్మ ప్రాణులని చూడాలంటే మైక్రోస్కోప్ వాడుతాము.దూరంవి చూడాలంటే బైనాక్యులర్స్ వాడుతాము.చీమ మనమొత్తం ఆకారాలను ఒకేసారిగా చూడలేదు కదా!
మరి బ్రహ్మాండం అంతా నిండి,వ్యాపించి వుండే ఆపరబ్రహ్మను మనము మామూలు కళ్ళతో చూడడం ఎలా సాథ్యం?మనం చాలా సార్లు గుడిలో దేవుడి ముందర నిలుచుకుని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటాము.ఆ విగ్రహాన్ని ఒక్క క్షణం కంటే ఎక్కువ చూడము.ఎందుకు?
మనం మన మనో నేత్రం తో చూడాలని ఉబలాట పడతాము.కళ్ళతో చూస్తే తనివి తీరదు.జ్ఞాన నేత్రంతో చూసి ఆయనకు దగ్గర అవాలని అనుకుంటాము.
ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో అదే అంటున్నాడు.నువ్వు నా విశ్వరూపాన్ని మామూలు చక్షువులతో చూడలేవు.కాబట్టి నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను.దాని సహాయంతో నా పరిపూర్ణ
రూపాన్ని చూడగలుగుతావు.అంటే మనసుతో చూడూ,జ్ఞాన నేత్రం తో చూడు అని ఆయన అర్థం.ఆ జ్ఞానాన్ని ఆయన అర్జునుడికి ఇచ్చాడు అని అర్థం.
Wednesday, 28 August 2024
మన్యసే యది తచ్ఛక్యం
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టు మితి ప్రభో
యోగేశ్వర!తతోమే త్వం దర్శయాత్మాన మవ్యయమ్॥4-11
విశ్వరూప సందర్శన యోగము
అర్జునుడు,కృష్ణుడు అంత దాకా మిత్రులు,బావా-బావమరుదులు.కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంథం ఇంకా చిక్క బడింది.బలంగా తయారైంది.గురుశిష్యుల బంథం,భగవంతుడు భక్తుడి మథ్య బంథం అయింది.ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి అంటారు కదా!అది మనం అర్జునుడిలో చూడవచ్చు.ఆ భగవంతుడే నా మిత్రుడు,నా బావ అని విర్రవీగటం లేదు.కృష్ణుడి ముందు తను ఒక గడ్డి పరక అని అర్థం చేసుకున్నాడు.అందుకే కృష్ణుడిని యాచిస్తున్నాడు.
హే ప్రభూ!యోగేశ్వరా!నాకు నీ దివ్య రూపం చూడాలని వుంది.అది చూసే యోగం,భాగ్యం,అర్హత నాకు వున్నాయని నీవు మనస్పూర్తిగా నమ్మితే,దయచేసి చూపించు.నా జన్మ ధన్యం చేసుకుంటాను అని అంటున్నాడు.
మాములుగా మనకు గొప్ప వాళ్ళతో పరిచయం వుంటే విర్ర వీగుతాం.అసలు వాళ్ళ కంటే మనమే హటాటోపం చూపిస్తాము.ఇంతెందుకు?రాజకీయ నాయకులు సభలలో మన తట్టు చూసి చెయ్యి వూపినా వాళ్ళకు మనం అత్యంత సన్నిహితులం అని చెప్పుకుంటాము.ఎందుకంటే అడిగే వాళ్ళుండరు కదా!మనం ఏది చెపితే అది నమ్మే గొర్రెలు వుంటారు కదా!కాబట్టి మనం అతి తగ్గించుకుని,మితంగా,పరిమితంగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
ఎంతలో వుండాలో అంతలో వుండటం నేర్చుకోవాలి.
Tuesday, 27 August 2024
ద్యూతం ఛలయతామస్మి
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహం॥
తన గురించి ఇంకా ఇలా చెపుతున్నాడు కృష్ణుడు.పంచకాలు,అంటే చెడ్డ పనులలో జూదంని నేను.తేజోవంతులలోని తేజాన్ని నేను.విజయం పొందే వాళ్ళలోని విజయాన్ని నేను.కృషి చేసే వాళ్ళ ప్రయత్నబలాన్ని నేను.సాత్త్వికులలోని సత్త్వగుణాన్ని నేను.
అంటే మంచి చెయ్యాలన్నా,చెడు చెయ్యాలన్నా దాని వెనుక వుండే ప్రేరణ అతనే.చెడు లో కూడా వున్నాను,మంచిలో కూడా వున్నాను అంటే ఆయన దృష్టిలో రెండూ సమానమే.అందుకనే మంచి అనగానే నెత్తిన పెట్టుకోడు,చెడు అనగానే తుద ముట్టించడు.నిదానంగా గమనిస్తాడు.మనకు తగిన సమయం ఇస్తాడు మారేదానికి చెడు మార్గం నుంచి మంచిగా మారేదానికి,మంచి తనాన్ని కొస వరకు నిలబెట్టుకునేదానికి.ఆయన పెట్టే ఈ పరీక్ష లో మనం నెగ్గేదానికి ప్రయత్నించాలి.ఏదైనా వూరికేరాదు కదా!అమృతం కోసం దేవతలే ఎంత కష్ట పడ్డారు?సాగర మథనం చేసారు కదా!అప్పుడు కూడా మొదట్లోనే వచ్చేయలేదు కదా!ఒకటొకటి వచ్చి,హాలాహలం కూడా వచ్చింది కదా!దానితో నిరాశ పడకుండా,ఇంకా చిలికారు కాబట్టి ఆఖరున అమృతం వచ్చింది.
మనం కూడా అంతే.ఆరంభ సూరత్వం కాకుండా,కష్టాలు వచ్చినా,నష్టాలు వచ్చినా,అలుపెరగకుండా దైవ చింతన,భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని,మన కర్మలని మనం నిష్కల్మషంగా,నిర్వికారంగా చేసుకుంటూ ముందుకు పోవాలి.
Monday, 26 August 2024
అక్షరాణా మకారోఽస్మి
అక్షరాణా మకారోఽస్మి ద్వంద్వస్సామాసికస్య చ
అహమేవాక్షయః కాలోధాతాఽహం విశ్వతోముఖః॥33-10
విభూతి యోగము
మనం చాలా సార్లు కళ్ళద్దాలు కళ్ళకే పెట్టుకుంటాము.కానీ వాటికోసం ఇల్లంతా వెతుకుతాము.ఇంట్లో అందరి పైన విసుక్కుంటాము.అందరినీ వెతకమంటాము.వాళ్ళు కిసుక్కున నవ్వి,నీ కళ్ళకే వున్నాయి చూసుకో అంటారు.సిగ్గు పడి పోతాము.ఇంత అస్తాఇస్తం ఏంది మనకు అని ఆశ్చర్యపోతాము.
భగవంతుడిని మనము కనుక్కోవటం కూడా అలాంటిదే.ఏంది?భగవంతుడు ఎక్కడ వున్నాడు?ఎక్కడా కనిపించడు,మళ్ళీ నమ్మాలి అంటాడు.వినపడడు,కనపడడు,అసలు వున్నాడో లేదో తెలియదు,కానీ గాఢంగా నమ్మాలి అంటారు,ఎలా?
మనం మన చుట్టూరా వెతుకుతాము.దేవుడు సర్వాంతర్యామి కదా!కాబట్టి నిదానం గా మనలో కూడా చూసుకోవాలి కదా.అంతర్ముఖంగా,అంతర్మథనం చేసుకోవాలి కదా!పరమాత్మ అందరిలో వుంటాడు అంటే మనలో కూడా వున్నట్టే కదా!అంత చిన్న తర్కం మనం ఎందుకు మర్చి పోతాము?మనలో కూడా భగవత్ అంశ వుందంటే,మనలని మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలి,కాపాడుకోవాలి!
భగవంతుడు ప్రాణి కోటిలోనే కాదు,ఇంకా ఈ రకాలుగా కూడా వున్వాడు.అక్షరాలలో అ కారంగా వున్నాడు.సమాసాలలో ద్వంద్వ సమాసం లా వువ్నాడు.వాశనం లేని కాలం అతను.సర్వ కర్మలకు ఫలప్రదాత అతను.సృష్టికి మొదలు,మధ్య,కొస అతనే!వారీ
వీరి వాదాలు,వాదనలు,ప్రశ్నలు,సమాథానాలు...అన్నీ
ఆ పెద్దాయనే!
Friday, 23 August 2024
ఆయుధానా మహం వజ్రం
ఆయుధానా మహం వజ్రం ధేనూనామస్మి కామధుక్
ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః॥28-10
విభూతి యోగము
భగవంతుడు అన్నింటా వుంటాడు,అన్నిట్లో వుంటాడు అంటే మనం నమ్మము కదా!కానీ ఆయనే చెపుతున్నాడు.ప్రాణం వున్న వాటిల్లోనే కాదు,ప్రాణం లేని వాటిల్లో,ఒకప్పుడు ప్రాణం వుండి ఇప్పుడు లేని వాటిల్లో కూడా వుంటాడు.అంతేనా! మన భావాలలో,మన భావ ప్రకటనలలో,మన చర్యలలో,మన గుణగణాలలో,మన భావోద్వేగాలలో,మన సంతానోత్పత్తిలో...ఇలా అన్నింటా వుంటాడు ఆ మహామహుడు.
ఆయుధాలలో వజ్రాయుధం అతను.గోవులలో కామధేనువు అతను.ప్రజలలో సంతానోత్పత్తి కారకులలో మన్మధుడు అతను.అంటే ఆ ప్రేరణకు బీజం వేసేది అతను.సర్పాలలో వాసుకి అతను.ఈ చరాచర జగత్తులో అన్నింటా అతనే వున్నాడు.అతనే పోషిస్తున్నాడు.అతనే పాలిస్తున్నాడు.అతనే లాలిస్తున్నాడు.
ఆదిత్యానామహం విష్ణుః
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ॥21-10
విభూతి యోగము
కృష్ణుడు చెప్పుకొస్తున్నాడు తను ఏ ఏ రూపాలలో వుంటాడో.ఆదిత్యులలో విష్ణువుగా వున్నాడు.వెలుగును పంచే జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడు అతనే.మరుద్గణాలలో మరీచి అతనే.నక్షత్రాలలో చంద్రుడు అతనే.ఇవేనా?కాదు,కాదు.ఇంకా వేదాలలో సామవేదం అతనే.దేవతలలో ఇంద్రుడు అతనే.పంచేంద్రియాలలో మనసు అతనే.సమస్త ప్రాణి కోటిలోని చైతన్య స్రవంతి అతనే.అతను ఏ ఏ విభూతులలో ప్రకటిత మవుతాడో మానవ మాత్రులం లెక్క కట్ట లేము,చెప్పలేము.సర్వ వ్యాపకుడు,సర్వేశ్వరుడు అనేది అందుకే కదా!
Subscribe to:
Posts (Atom)