Thursday, 16 October 2025
త్రయోదశి అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము.
శ్లోకము....
గీతా త్రయోదశాధ్యాయ ముద్గిరన్తమనారతమ్।
తతస్తచ్ఛ్రవణాదేవ ముక్తా శ్వపచవిగ్రహాత్॥
పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది.ఆమె ఎప్పుడూ తప్పుదోవలో నడుస్తూ,దురాచారిణిగా వ్వవహరించేది.దాని పర్యవసానంగా,మరుజన్మ లో ఛండాల స్త్రీగా పుట్టింది.అప్పట్లో జృంభకా దేవాలయము ఉండేది.అదేవాలయంలో వాసుదేవుడు అనే అతను నిత్యమూ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము పారాయణ చేస్తుండేవాడు.ఈ ఛండాలి నిత్యమూ అతనినోట ఆ అధ్యాయము వింటూ ఉండేది.దాని ప్రభావము వలన ఆ జన్మలోనే సద్గతి పొందగలిగింది.
Wednesday, 15 October 2025
ద్వాదశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తి యోగము.దీని పారాయణ ఫలము రహోజ్ఞానము మరియు దివ్య శక్తులు.
పూర్వము ఒక రాజు ఉండేవాడు.అతని కుమారుడు లక్ష్మీ దేవి ఆదేశానుసారం ఒక వ్యక్తిని ఆశ్రయించాడు.అతని పేరు సిద్థ సమాథి.అతనిని రాకుమారుడు ఒక ఉపకారము కోరాడు.అయ్యా!నా తండ్రి ఒకమారు అశ్వమేథయాగము తల పెట్టాడు.యాగము మథ్యలో అశ్వము తప్పిపోయింది.ఎక్కడ వెతికినా కనిపించలేదు.కాలక్రమేణా మా తండ్రి కూడా మరణించాడు.స్వామీ!గుర్రము దొరకక పోతే అశ్వమేథ యాగము పూర్తికాదు.అది సుసంపన్నము కాకపోతే మా తండ్రికి సద్గతులు ప్రాప్తించవు.కాబట్టి ఆ గుర్రము విషయము కనుక్కుని చెప్పేది.నాకు దక్కేలా చేసేది.
అప్పుడు అతను తన శక్తి చేత దేవతలను పిలిపించాడు.ఆ అశ్వమును ఇంద్రుడు అపహరించి,దాచి ఉంచాడు.కాబట్టి ఆ దేవతలను ఆ అశ్వము తీసుకు రమ్మని పురమాయించాడు.వారి చేత ఆ రాజకుమారుడికి ఆ అశ్వాన్ని ఇప్పించాడు.
రాజ కుమారుడికి భలే ఆశ్చర్యము వేసింది.ఇంత దివ్యశక్తి మీకు ఎలా చేకూరింది అని అడిగాడు.దానికి సిద్థసమాథి ఇలా జవాబిచ్చాడు.
శ్లోకము......
గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యహతన్ద్రితః।
తేన శక్తిరియం రాజన్ మయాప్రాప్తాస్తి జీవితమ్॥
ఓ రాజా!నేను భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని అనునిత్యమూ పారాయణ చేస్తుంటాను.దాని ప్రభావము వలననే నాకు ఈ శక్తి సమకూరింది.
Tuesday, 14 October 2025
ఏకాదశ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము.ఈ అధ్యాయము పారాయణము చేస్తే రాక్షస పీడా నివారణము కలుగుతుంది.
శ్లోకము....
నిష్కర్మతయా ప్రాపుస్తే పరమం పదమ్।
ఏకాదశస్య సామర్ధ్యా దధ్యాయస్య భవిష్యతి॥
పూర్వము ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు.వాడి దురాగతాలకు అంతూ పొంతు ఉండేదే కాదు.ఊరి ప్రజలు విసుగెత్తి పోయారు.గ్రామాధికారులు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు.వీధులలో పడుకునేవారిని భక్షించవచ్చు.కానీ ఇండ్లలోకి వచ్చి హింసించి చంపకూడదు.ఈ విషయము తెలియని వారు ఆరుబయట పడుకుని ఆ రాక్షసుడికి బలి అవుతూ ఉండేవారు.ఒకరోజు సునందనుడు అనేవాడు ఆ ఊరి మీదుగా తీర్థయాత్రలకని పోతుండినాడు.ఆ రాత్రికి అక్కడే ఆగి విశ్రాంతి తీసుకుని,తెల్లవారు ఝామున బయలుదేరాలి అనుకున్నాడు.ఆ రాత్రి కూడా రాక్షసుడు వచ్చాడు.సునందనుడిని తప్ప మిగిలిన అందరినీ చంపి,తినిపోయాడు.
పొద్దున్నే ఆ ఊరిలో వాళ్ళు,హాయిగా అరుగు పైన పడుకుని నిద్ర పోతున్న సునందనుడిని చూసారు.చాలా ఆశ్చర్యపోయారు.అతనిని మంచిగా సాగనంపారు.ఆ గ్రామ పెద్దలు రాక్షసుడి దగ్గరకు వెళ్ళారు.ఇలా అడిగారు.రాత్రి నువ్వు వచ్చావు.మన ఒప్పందం ప్రకారము ఆరుబయట నిద్ర పోయేవాళ్ళని చంపి తిన్నావు.సునందనుడిని మాత్రము ఎందుకు వదలి పెట్టావు?
దానికి ఆ రాక్షసుడు ఇలా జవాబు చెప్పాడు.వాడెవడో ఎప్పుడూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము చదువుతూ ఉంటాడట!వాడి దరిదాపుల్లోకి వెళ్ళగలిగే దానికి కూడా నా శక్తి సామర్ధ్యాలు చాలలేదు.నా శక్తి యుక్తులు వాడి దగ్గర పని చేయలేదు.
ప్రజలకు ఇంక కిటుకు అర్ధమయింది,వాళ్ళను వాళ్ళు కాపాడుకునేదానికి.ఆ గ్రామంలో అందరూ క్రమం తప్పకుండా రోజూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము పారాయణము చేయటం మొదలుపెట్టారు.ఇంక రాక్షసుడు చేసేది ఏమీ లేక తట్టా బుట్టా సర్దుకుని,అక్కడినుంచి పలాయనము చిత్తగించాడు.
Monday, 13 October 2025
భాగవత రచన
సూతుడు చెప్పిన విషయాలు అన్నీ శౌనకాది మునులు అందరూ శ్రద్థగా విన్నారు.వారందరూ ముక్త కంఠంతో అడిగారు.నారదుడి మాటలు విన్న తరువాత వ్యాస మహర్షి ఏమి చేశాడు అని.
సూతుడు వారికి ఇలా సమాథానం ఇచ్చాడు.పరమ పవిత్ర మయిన సరస్వతీ నది ఉంది కదా!దానికి పడమటి దిక్కున ప్రశాంత వాతావరణంలో,బదరీ వృక్ష సముదాయముతో కూడిన వనము ఉంది.ఆ వనంలో శమ్యాప్రాసమనే ఆశ్రమము ఉన్నది.అది చాలా ప్రసిద్ధమయినది.వ్యాసుడు ఆ ఆశ్రమము ఎంచుకున్నాడు.భక్తి ప్రపత్తులు కలిగిన మనసుతో,మనసును ఈశ్వరుని ఆధీనంలో ఉంచాడు.తనకు తెలియకుండానే నిర్మల మనస్కుడు అయ్యాడు. ఇంక సమస్త ధర్మాలకూ,భక్తిప్రపత్తులకు నిలయము అయిన భాగవత రచనకు ఉపక్రమించాడు.దానిని దీక్షతో రచించాడు.తన ఈ రచనను తన కుమారుడు అయిన శుకమహర్షి చేత చదివించాడు.
ఆ మాటలకు శౌనకుడు అడిగాడు.శుకుడు నిర్వాణ తత్పరుడు.అతడు సమస్త విషయములయందు ఉపేక్ష కలిగిన వాడు.అతడు భాగవతము ఎందుకు నేర్చుకున్నాడు?సూతుడు ఈ ప్రశ్నకు ఇలా సమాథానం చెప్పాడు.మహర్షీ!నిరపేక్షులు అయిన మునులు కూడా విష్ణువును కీర్తిస్తూ ఉంటారు.ఎందుకంటే ఏమి చెపుతాము?విష్ణుదేవుని మహిమ అంటే ఆషామాషీ కాదు.అదీ కాకుండా శుకమహర్షికి శ్రీహరి గుణాల వర్ణన యందు ఆసక్తి,అనురక్తి ఉన్నాయి.కాబట్టి భాగవతాన్ని చదివాడు.ఇంకో విషయము కూడా చెబుతాను.వేదాల కంటే కూడా భాగవతమే ముక్తి మార్గాన్ని సులువుగా నేర్పిస్తుంది.
వీటన్నిటికీ తోడు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని ముక్తి మార్గము బోథింపమని ప్రార్ధించాడు.ఒక రాజర్షి నిస్సిగ్గుగా అలా బతిమలాడేటప్పటికి,మనసు కరగి భాగవతము చెప్పాడు.
దశమ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని పదవ అధ్యాయము విభూతి యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే అనంత మయిన భగవంతుడి కృపా కటాక్షాలు దక్కుతాయి.ఆ దేవదేవుడి సహాయ సహకారాలు లభ్యమవుతాయి.
దశమాధ్యాయ మాహాత్మ్యాత్తత్వజ్ఞానం సుదుర్లభమ్।
లబ్ధమే తేన మునినా జీవన్ముక్తిరియం తథా॥
పూర్వ కాలంలో ఒకప్పుడు బ్రహ్మ దేవుని వాహన జాతికి చెందిన హంస ఒకటి ఉండేది.ఒకసారి ఒక పద్మలత ద్వారా భగవద్గీత యొక్క పదవ అధ్యాయము వినింది.ఇంక ఎప్పుడూ దాని గురించే ఆలోచించేది.మరు జన్మలో అది ఒక బ్రాహ్మణుడి లాగా పుట్టింది.పూర్వ జన్మ జ్ఞానము కలిగి ఉండింది.దాని ప్రభావము చేత ఎప్పుడూ భగవద్గీతలోని పదవ అధ్యాయము స్మరించుకుంటూ ఉండేవాడు.దాని ప్రభావము వలన శివుడు ఎప్పుడూ అతని వెన్నంటే ఉండేవాడు.
ఈ విషయం వాళ్ళూ వీళ్ళూ చెప్పడం కాదు.స్వయానా శివుడే భృంగీశ్వరుడితో చెప్పాడు.
నవమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ప్రతిగ్రహణ పాప నాశనము దక్కుతుంది.
పూర్వము ఒకరాజు ఉన్నాడు.అతను ఒకసారి ఒక విప్రుడికి కాలపురుషుడి దానము చేసాడు.ఆ విగ్రహము నుంచి చండాల దంపతులు ఆవిర్భవించారు.వారు ఆ బ్రాహ్మణుడిని బాధించడం మొదలు పెట్టారు.తక్షణమే విష్ణు పార్షదులు అక్కడికి వచ్చారు.వచ్చీరాగానే ఆ చండాల దంపతులను తరిమి కొట్టి,బ్రాహ్మణుడిని కాపాడారు.రాజు దీనినంతా గమనించాడు.స్వామీ!ఏమి ఈ మాయ! అని బ్రాహ్మణోత్తముడిని అడిగాడు.
అప్పుడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు.
గీతాయానవమాధ్యాయం జపామి ప్రత్యహం నృప।
నిస్తీర్ణాశ్చా పదస్తేన కుప్రతి గ్రహ సంభవాః॥
గీతాయానవమాధ్యాయ మంత్రమాలా మయాస్మృతా।
తన్మాహాత్మ్య మిదం సర్వం త్వమవేహి మహీపతే॥
అంటే ఇలా చెప్పాడు.ఓ రాజా!నేను రోజూ క్రమం తప్పకుండా భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము పారాయణ చేస్తాను.దాని మహాత్మ్యం నీకు కూడా అర్ధం అయింది కదా!నేను తీసుకునే ఇలాంటి దానాల వలన కలిగే పాపం ఆ పుణ్యం వలన సమసిపోతుంది.
Sunday, 12 October 2025
అష్టమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము.దీని పారాయణ ఫలము సర్వ విధ దుర్గతి నాశనము.
శ్లోకము
......
జపన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియః।
సంతుష్ఠ వా నహందేవి తదీయ తపసా భృశమ్॥
పూర్వము భావశర్మ అని ఒకడు ఉన్నాడు.వాడు పరమ భ్రష్టాచారుడు.అందుకని వాడు తరువాత జన్మలో తాటి మాను అయి పుట్టాడు.అచ్చం వీడి లాగే ఇంకో జంట ఉన్నారు.వారు కుమతి-కుశీవలుడు.వీళ్ళు చేయని పాప కర్మలు అంటూ ఏమీ మిగలలేదు.అంతటి దుష్కర్ములు.వాళ్ళు మరు జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టారు.ఒక రోజు వాళ్ళు ఇద్దరూ తాడి చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నారు.వాళ్ళకు ఆ జన్మ అంటే విసుగు వచ్చింది.అప్పుడు భార్య భర్తని అడిగింది.ఏమయ్యా!ఎప్పటికీ మన బతుకులు ఇంక ఇంతేనా?మనకు ఈ బ్రహ్మ రాక్షసత్వము ఎప్పుడు పోతుంది?
దానికి అతను చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు.ఓయీ!ఇదంతా అంత సులభం కాదు.మనము కర్మ వీడి,ఆధ్యాత్మ బుద్ధితో నడచుకోవాలి.బ్రహ్మము గురించి తెలుసుకోవాలి.అప్పుడు మనకు ఈ దుర్దశ వీడుతుంది.మనము అనుకునేటట్లే ఆమెకు తన భర్త చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.సహజమే కదా ఆ జన్మకు.మళ్ళీ ఇలా అడిగింది.కిం తత్ బ్రహ్మ?కిమధ్యాత్మం?కిం కర్మ పురుషోత్తమ?
బ్రహ్మ ఏంది?అధ్యాత్మం ఏంది?ఏం పనులు గురించి మాట్లాడు తున్నావు?ఆమె ఈ మాటలు మామూలుగానే అడిగింది తన భర్తను.కానీ అవి భగవద్గీతలోని ఎనిమిదవ అథ్యాయములోని మొదటి శ్లోకములోని అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి పలికిన పలుకులు.ఆ శ్లోకము లోని మొదటి పాదము ఉచ్ఛరించినట్లు అయింది.అది పలకగానే వారి బ్రహ్మరాక్షసత్వము పోయి మామూలుగా అయ్యారు.వారు తాటి చెట్టు క్రింద కూర్చుని ఉన్న కారణంగా తాటి చెట్టుకు కూడా ముక్తి లభించింది.ఇలా ముగ్గురికీ ఉత్తమ గతి ప్రాప్తించింది.
ఆ మొదటి శ్లోకము....
అర్జున ఉవాచ....
కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ।
అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥8-1
Saturday, 11 October 2025
సప్తమ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము.దీని పారాయణము వలన సమస్త జీవజాత సంసార తరణము సంప్రాప్తిస్తుంది.
పూర్వము శంకు కర్ణుడు అని ఒకడు ఉండేవాడు.అతను ఒకరోజు పని మీద ప్రక్క ఊరికి వెళ్ళాడు.ఎంతకీ తిరిగి రాడే!అతని కొడుకులకు తండ్రి గురించి ఆదుర్దా అయిపోయింది.వాళ్ళు ఒక సిద్ధుడి దగ్గరకు వెళ్ళారు.తమ తండ్రి జాడ చెప్పమని బతిమలాడారు.ఆ సిద్ధుడు తన దివ్యదృష్టితో అంతా కనుక్కున్నాడు.ఇలా చెప్పనారంభించాడు.నాయనా!మీ తండ్రి మరణించి చాలా రోజులు అయింది.అతను బతికి ఉన్నప్పుడు చాలా సంపాదించాడు.సంపాదించినది మొత్తం ఒక చోట భద్రపరిచాడు.ప్రాణం పోయినా,డబ్బు మీద మమకారం,మోహము వదులుకోలేక పోయాడు.అందుకని తరువాత జన్మలో పాముగా పుట్టాడు.పాముగా ఇప్పుడు ఆ నిథికి కాపలా కాస్తున్నాడు.మీకు చూపిస్తా రండి అని చెప్పి వాళ్ళను అక్కడకు తీసుకెళ్ళాడు.వాళ్ళు ఆ దృశ్యం చూసి చాలా బాథ పడ్డారు.మా తండ్రికి ఏంది ఈ నికృష్టపు జన్మ అని.మా తండ్రిని ఈ దీనమయిన,హేయమయిన దుస్థితి నుంచి ఉద్ధరించే మార్గము ఉంటే చెప్పమని వేడుకున్నారు.
అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పాడు.
శ్లోకము....
గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయమ్।
జన్తోర్జరామృత్యు దుఃఖ నిరాకరణ కారణమ్॥
శ్లోకము...
సప్తమాధ్యాయ జపతో ముక్తిభాజోఽభవంస్తతః।
దేవమిష్ట తమం జ్ఞాత్వా నిర్వాహణార్పిత బుద్ధయః॥
పురాణాలలో ఇలా చెప్పబడి ఉంది.కాబట్టి అనుష్ఠాన పూర్వకంగా మీరు గీతలోని ఏడవ అధ్యాయము పారాయణ చేయండి.ఆ ఫలమును మీ తండ్రికి ధారపోయండి.
ఈ మాటలు విన్న వారు ఆ సిద్ధుడికి నమస్కరించి ఇండ్లకు వెళ్ళారు.పద్ధతిగా సిద్ధుడు చెప్పినట్లు చేసారు.వాళ్ళ తండ్రికి పరమపదము ప్రాప్తించేదానికి దోహద పడ్డారు.
Friday, 10 October 2025
షష్టాధ్యాయము…ఫలము
భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము.పేరుకు తగినట్లే ఈ అధ్యాయము పారాయణ చేస్తే దివ్య తేజఃప్రాప్తి సిద్ధిస్తుంది.
పూర్వము జనశ్రుతుడు అనే రాజు ఉండేవాడు.అతడు మంచి ధర్మాత్ముడు.ఒకరోజు ఆరాజు డాబా పైన పండుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.ఆ సమయంలో ఆకాశంలో ఒక హంసల గుంపు అటు మీదగా పోతూ ఉండింది.ఆగుంపులో ఒక హంస దుందుడుకుగా ప్రవర్తించింది.అది గమనించిన ముసలి హంస ఇలా మందలించింది.ఓ కుర్ర హంసా!ఏంది నీ వ్యవహారం?మనము ధర్మాత్ముడు అయిన రాజు దరిదాపుల్లో వెళుతున్నాము.అంత దుడుకుతనం పనికిరాదు.మట్టూ మర్యాద కొంచెం నేర్చుకో!
ఈ హంస మాటలకు కుర్ర హంస నసుగుతూ,గునుస్తూ ఈ మాటలు అనింది.ఓ యబ్బో!ఈ రాజు ఏమైనా రైక్వుడా?ఆయనకంటే ఎక్కవ తేజోవంతుడాయే!ఇంక ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టాలి మనమందరమూ!ఇలా ఎగతాళి,అవహేళన,అపహాస్యం చేసింది.
రాజు ఆ మాటలన్నీ విన్నాడు.ఒకింత ఆశ్చర్యము కూడా వేసింది.చారులను పిలిపించాడు.రైక్వుడు అనే వాడిని కనుక్కుని తీసుకు రమ్మన్నాడు.చారులు అన్ని చోట్లా వెతికారు.ఉత్త చేతులకో తిరిగి వచ్చారు.వారు రాజుకు ఇలా విన్నవించుకున్నారు.హే రాజా!మేము బాగా వెతికాము.ఆ పేరుతో ఎవరూ మాకు దొరకలేదు.కానీ కాశీ దేశం లోని శ్రీ మాణిక్యేశ్వరాలయము దగ్గర ఒక మహాతేజస్సు ఉండే అతను కనిపించాడు.అతని పేరు రైక్వుడు అని వాళ్ళూ వీళ్ళూ అంటే విన్నాము.అతనిని వెంట పెట్టుకుని వచ్చే ధైర్యము చేయలేక పోయాము.
రాజు ఈ మాటలు వినగానే మందీ మార్బలముతో,కానుకలు పట్టుకుని ఆ తేజస్వి దగ్గరకు బయలుదేరాడు.అతనిని దర్శించుకున్నాడు.అంతట ఇలా విన్నవించుకున్నాడు.ఓ మహానుభావా!నీవు దేనినీ ప్రాశించవూ,మరి ఇంక దేనినీ ఆశించవూ!నీవు ఇంత తేజోవంతుడివి ఎలా అయ్యావు?ఆ కథా కమామిషు నాకు వివపరించేది.
దానికి చిరునవ్వుతో రైక్వుడు ఇలా సమాథానం ఇచ్చాడు.రాజా!నీవు అంటున్న ఆ తేజస్సో,ఓజస్సో,నాకు ఏమీ తెలియదు.అవి ఎట్లా వచ్చాయో,ఎందుకు వచ్చాయో అస్సలు తెలియదు.నాలో ఏమైనా విశిష్టంగా కనిపించింది అంటే నేను అనుకునే కారణం బహుశ ఇది అయి ఉండవచ్చు.నేను నిత్యమూ భగవద్గీతలోని ఆరవ అధ్యాయమ క్రమం తప్పకుండా పారాయణము చేస్తాను.అంతే!ఇదంతా బహుశ దాని మహాత్మ్యమే ఉండి ఉంటుంది.అతను ఇలా అన్నాడు.
శ్లోకము....
గీతానాం షష్ఠమధ్యాం జపామిప్రత్యహం నృపయమ్।
తేనైవ తేజోరాశి ర్మేసురాణామపి దుస్సహః॥
Thursday, 9 October 2025
పంచమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము.దీని ఫలితము అమోఘము.జ్ఞానశూన్యులు అయిన పశుపక్ష్యాదులు కూడా తరిస్తాయి.
ఆ కథ ఏందో విందాము.పూర్వము అరుణ,పింగళుడు అని భార్యా భర్తలు ఉండేవారు.ఎప్పుడూ అడ్డూ ఆపూ లేకుండా గొడవలు,తగవులూ పడుతూ కాపురము చేస్తూ ఉండేవారు.ఆ తరువాత జన్మలో వారు చిలుక,గ్రద్దలాగా పుట్టారు.పూర్వ జన్మ విరోధము కారణంగా,వారికి తెలియకుండానే మళ్ళీ ఈ జన్మలోకూడా ఎప్పుడూ ఘర్షణ పడుతుండే వాళ్ళు.ఒకసారి ఇలా కొట్టుకుంటూ ఒక నర కపాలంలో పడి మరణించాయి.ప్రాణాలు పోగానే విష్ణుపాలకులు వచ్చి వారిని వైకుంఠం తీసుకుని పోయేదానికి ప్రయత్నించారు.అప్పుడు ఆ చిలుక,గ్రద్ద వాళ్ళను ఇలా అడిగారు.స్వామీ!పొద్దున లేస్తే తన్నుకోవటమూ,కొట్టుకోవటము తప్ప ఇంకోటి చెయ్యలేదు మేము.ఎంత సేపూ పాపపు ఆలోచనలు,పాపపు పనులులోనే జీవితాలు గడచిపోయాయి.అలాంటి మాకు ఈ వైభోగము ఏంది?ఈ అదృష్టం ఎందుకు?
అప్పుడు ఆ వైష్ణవులు చిరునవ్వుతో ఇలా సమాథానం ఇచ్చారు.అమాయకులు మీరు.పాప పుణ్యాలు అనేవి మీ దేహాలకే కానీ,మీ ఆత్మలకు లేదు.అదీ కాకుండా,మీ శరీరాలు ఒక నరుడు పుర్రెలో పడ్డాయి కదా!ఆ పుర్రె ఎవరిది అనుకుంటున్నారు?అతను నిత్యమూ భగవద్గీతలోని పంచమ అధ్యాయము పారాయణము చేసిన పుణ్యాత్ముడు.అతను సంపాదించిన పుణ్యములో ఒక ఇసుక రేణువు అంత పుణ్యము మీకు దక్కింది అతని పుర్రెలో పడిన కారణంగా.అందుకే మీకు ఈ వైకుంఠవాసభోగము.ఇలా చెప్పి వారిని ఆకాశమార్గంలో వైకుంఠానికి తీసుకెళ్ళారు.
చతుర్థ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని చతుర్ధ అధ్యాయము జ్ఞాన యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే చెడు ఆలోచనలు మనలను చుట్టు ముట్టడం ఆగిపోతుంది.ఏమైనా శాపాలు పూర్వజన్మలోనో,ఈ జన్మలోనో తగిలి ఉంటే వాటికి విరుగుడు అయి శాప విమోచనము కలుగుతుంది.
శ్లోకము....
నిత్యమాత్మరతస్తుర్యం జపత్యధ్యాయమాదరాత్।
తదభ్యాసాదదుష్టాత్మా నద్వంద్వైరభిభూయతే॥
పూర్వము సత్యతపుడని ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.ఇంద్రుడు అతని తపస్సును చెరపాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉండే అప్సరసలను పంపించాడు ఆ ఋషి దగ్గరకు.పాపం ఆ అప్సరసలు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు వెళ్ళి ఋషికి తపోభంగం కలిగించారు.ఇంకేముంది?సత్యతపుడు కోపంగా వాళ్ళను అక్కడే రేగి చెట్లుగా పడి ఉండండి అని శపించాడు.ముని ఇచ్చిన కారణంగా ఆ అప్సరసలు అక్కడే బదరీవృక్షాలుగా మారి,నిలబడి పోయారు.
కొన్నాళ్ళకు ఆ జమిలి,రేగుచెట్ల నీడకోసం భరతుడు అనేవాడు వచ్చాడు.అతను ప్రశాంతంగా ఉంది అనుకుని భగవద్గీత నాలుగో అధ్యాయము,అదే జ్ఞాన యోగము పారాయణము చేసుకున్నాడు.ఆ మహిమ కారణంగా అప్సరసలు తమ పూర్వ స్థితికి వచ్చారు.వారికి శాపవిముక్తి కలిగింది.వాళ్ళు భరతుడికి ధన్యవాదాలు చెప్పారు.గీతా మహిమను కొనియాడారు.అలా వారు తిరిగి దేవలోకం బయలుదేరారు.
Wednesday, 8 October 2025
తృతీయ అధ్యాయము..ఫలము
తత్రాధ్యాయం సగీతాయాస్తృతీయం సంజజాపహ॥
భగవద్గీతలోని తృతీయ అధ్యాయము కర్మ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే పాపనాశనముఅవుతుంది.దానితో బాటు ప్రేతత్వ విముక్తి కూడా కలుగుతుంది.
పూర్వము జడుడు అనేవాడు ఒకడు ఉన్నాడు.వాడి కులాచారము అస్సలంటే అసలు పాటించేవాడు కాదు.దురాచారాలకు పాలపడుతుండేవాడు.ఇలాగే అడ్డూ ఆపూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు.డబ్బులకు కక్కుర్తి పడిన దొంగలు కొందరు అతనిని దోచుకుని,ఒక చెట్టు క్రింద హతమార్చారు.జడుడు పాపాల పుట్టగా ఉన్నాడు కదా బతికినన్ని రోజులు!అందుకని ప్రేతాత్మ అయి ఆ చెట్టుపైనే ఉంటూ వచ్చాడు.కొంతకాలము తరువాత అతని కొడుకు కాశీకి బయలుదేరాడు.మార్గమధ్యంలో అలసిపోయి,ఆ చెట్టిక్రిందనే సేదతీరాడు.యధాలాపంగా భగవద్గీత తెరచి మూడవ అధ్యాయము పఠించాడు.అలా పారాయణము పూర్తికాగానే జడుడికి ప్రేతరూపము పోయింది.దివ్యరూపముతో విమానము ఎక్కి స్వర్గానికి పయనమయ్యాడు.అలా పోతూ పోతూ తన కొడుకుని ఉద్దేశించి ఇలా అన్నాడు.నాయనా!కుమారా!నీవు భగవద్గీత మూడవ అధ్యాయము చదవటం వలన నా ప్రేతత్వము పోయి,దివ్యరూపము చేకూరింది.స్వర్గానికి కూడా పోతున్నాను.ఇది చాలా శక్తివంతమయిన అధ్యాయము.కాబట్టి నీవు క్రమం తప్పకుండా అనునిత్యం పారాయణ చెయ్యి.నీ జీవితము ధన్యమవుతుంది.జడుడు ఇలా తన కొడుకును ఆశీర్వదించి,స్వర్గానికి పయనమయినాడు.
Tuesday, 7 October 2025
ద్వితీయ అధ్యాయము…ఫలము
శ్లోకము..
శిక్షిత స్తేన పూతాత్మా పఠన్నధ్యాత్మ మాదరాత్।
ద్వితీయమాససాదోచ్చైః నిరవద్యం పరంపదమ్॥
ద్వితీయ అధ్యాయము అంటే సాంఖ్య యోగము.దీని పారాయణ ఫలం ఆత్మజ్ఞానము.
పూర్వము దేవశర్మ అని సదాచార సంపన్నుడు ఉన్నాడు.అతనికి ఆత్మజ్ఞానము సమకూర్చుకోవాలి అనే తపన ఉండేది.అతను ఒక సాథువును ఆశ్రయించాడు.ఆ సాధువు దేవశర్మను మిత్రవంతుడు అనే మేకలను కాచుకునే మేకల కాపరి వద్దకు పంపాడు.దేవశర్మ సరే అని ఆ మేకలకాపరి దగ్గరకు వెళ్ళి విషయము చెప్పాడు.అప్పుడు మిత్రవంతుడు ఇలా చెప్పసాగాడు.అయ్యా!ఒకరోజు అలవాటుగా మేకలను కాచుకుంటూ ఉన్నాను.ఇంతలో ఒక పులి అక్కడకు వచ్చింది.దానికి భయపడి కాపరులము తలా ఒక దిక్కుకు పరుగులు తీసాము.మేకలు కూడా చెల్లా చెదురుగా పరిగెత్తాయి.కానీ దిక్కుతోచని కొన్ని మేకలు అక్కడక్కడే పరుగులు తీస్తూ ఆ పులికి చిక్కాయి.ఆశ్చర్యం!ఆ పులి ఆ మేకలను చంపి తినలేదు.మేకలు కూడా దానితో సఖ్యంగా వ్యవహరించాయి.నాకు చాలా ఆశ్చర్యమేసింది.అది ప్రకృతి విరుద్థంకదా!ఎంత ఆలోచించినా బుర్రకు ఏమీ అర్థం కాలేదు.ఇక లాభం లేదనుకుని అక్కడే ఉన్న వృద్థ మర్కటాన్ని అడిగాను.అప్పుడు ఆ ముసలి కోతి ఇలా జవాబు ఇచ్చింది.ఓ మిత్రవంతుడా!విను.పూర్వము యోగీంద్రుడు ఒకడు ఉన్నాడు.అతను శిలా ఫలకాల పైన గీత రెండవ అధ్యాయము చెక్కించాడు.అ ఫలకాలను సుకర్మ అనే అతనికి ఇచ్చాడు.సుకర్మ ఇక్కడే,ఈ ప్రదేశం లోనే ఆ రెండవ అధ్యాయాన్ని పారాయణము చేసేవాడు.అలా అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.అంతటి గొప్ప సిద్థ పురుషుడు నడయాడిన స్థలంలో పులిమేకలు కలసి మెలసి ఉండటంలో ఆశ్చర్యము ఏముంది?
మిత్రవంతుడు ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు.ఆ వానరము సూచనలు సలహాలు విని నేను కూడా నిత్యం ఈ శిలా ఫలకాల పైన ఉండే ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను.ఈ మాటలకు దేవశర్మ కూడా ఆనంద భరితుడు అయ్యాడు.అతను కూడా అక్కడే ఉంటూ రెండవ అధ్యాయము పారాయణము చేసుకునేవాడు.కాలక్రమేణ అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.
Monday, 6 October 2025
ప్రధమ అధ్యాయము …ఫలము
పద్మ పురాణంలో అంతర్గతంగా భగవద్గీత పారాయణం చేస్తే చేకూరే ఫలము,ఫలితము గురించి ప్రస్తావన ఉంది.
ప్రధమ అధ్యాయము పారాయణం చేస్తే పూర్వ జన్మ స్మృతులు,పాపనాశనము,తదుపరి మంచి జన్మ దక్కుతాయి.
శ్లోకము....
తస్మాదధ్యాయమాద్యం యఃపఠేత్ శ్రుణుతే స్మరేత్।
అభ్యసేత్తస్యనభవేత్ భవాంభోధిర్దురుత్తరః॥
పూర్వము సుశర్మ అని ఒకడు ఉండేవాడు.వాడు చెయ్యని భ్రష్టు పని అంటూ ఏదీ ఈ భూమి మీద మిగల లేదు.మరణించిన తరువాత మళ్ళీ ఎద్దుగా పుట్టాడు.ఒకానొక రోజు ఆ ఎద్దు పర్వత ప్రాంతాలలో బరువులు మోస్తూ,నేలకూలింది.భయంకరమయిన మరణ యాతన అనుభవిస్తూ ఉండింది.ఆ దారిలో వస్తూ పోతూ ఉండే వాళ్ళందరూ దాని కష్టం చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు.కానీ నిస్సహాయంగా ఉన్నారు.వాళ్ళలో ఒక వేశ్య ఉండింది.దాని బాధ చూసి,చలించిపోయింది.మనస్పూర్తిగా దేవుడికి ఇలా దణ్ణం పెట్టుకుంది.హే భగవంతుడా!నా జన్మలో నేను ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ ఫలం అంతా ఈ ఎద్దుకు సంక్రమించేలా చేయి.దానికి సద్గతి కలిగేలా చూడు స్వామీ!
ఆమె ద్వారా చేకూరిన పుణ్యం వలన ఆ ఎద్దు మరు జన్మలో బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు.పూర్వ జన్మ స్మృతి వలన ఆ వేశ్య ఇంటికి పోయాడు.నీ వలన నాకు ఇంత ఉత్కృష్టమయిన జన్మ దక్కింది.నీవు నాకు ధారబోసిన పుణ్యం ఏంది అని ఆమెను అడిగాడు. ఆమె నాకు తెలియదు అనింది.
ఆమె దగ్గర ఒక పెంపుడు చిలక ఉంది.అది బ్రహ్మ జ్ఞానిని చూసి ఇలా చెప్పడం మొదలు పెట్టింది.అయ్యా!మొదట్లో నేను ఒక ముని ఆశ్రమములో తిరుగుతూ ఉండేదానిని.ఆ ఋషి క్రమము తప్పకుండా రోజూ భగవద్గీత మొదటి అధ్యాయము పారాయణము చేసేవాడు.అది విని విని నాకు కూడా వచ్చేసింది.ఇంతలో విథి నన్ను ఈమె దగ్గరికి తీసుకుని వచ్చింది.నా అలవాటుకొద్దీ నేను రోజూ భగవద్గీత పారాయణము చేసుకునేదాన్ని.నా మీద ఉండే అలవిమాలిన ప్రేమవలన ఈమె శ్రద్థగా రోజూ వినేది.దాని వలన వచ్చిన పుణ్యమే ఆమె నీకు థారపోసింది.
బ్రహ్మజ్ఞాని ఆ చిలుక మాటలకు అవాక్కయ్యాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.ఔరా!భగవద్గీతలోని ప్రధమ అథ్యాయము వింటేనే ఇంత పుణ్యం దక్కేటట్లయితే,పూర్తి భగవద్గీతా పారాయణం అనునిత్యం చేస్తే ఇంకెంత పుణ్యం దక్కుతుంది!!!???ఆమెకూడా ఈ విషయం తెలుసుకొని తబ్బిబ్బయింది.ఆ ఇద్దరూ అప్పటినుంచి అనునిత్యమూ ప్రథమ అథ్యాయము,అర్జున విషాద యోగము పఠిస్తూ,పారాయణ చేస్తూ ఉన్నారు.జన్మాంతరమున కైవల్యం పొందారు.
Saturday, 4 October 2025
సప్త శ్లోకీ గీత
ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్।
యః ప్రయాతి త్యజన్దేహం సయాతి పరమాం గతిమ్॥8-13
స్థానే హృషీకేశ తనప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్య తేచ।
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః॥11-36
సర్వతః పాణి పాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్।
సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి॥13-14
కవిం పురాణ మనుశాసితారమణోరణీయాంస మనుస్మ రేద్యః।
సర్వస్య ధాతార మతిన్త్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్॥8-9
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్।
ఛంధాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥15-1
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ।
వేదైశ్త సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15-15
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు।
మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః॥9-34
హే అర్జునా!ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మపరమైన ఓం అనే మహా మంత్రాన్ని ధ్యానించాలి.సదా నన్నే స్మరిస్తూ ఉండాలి.అలాంటి అవస్థలో దేహత్యాగం చేసేవాడు పరమ పదాన్ని సునాయాసంగా పొందుతాడు.8-13
అర్జునుడు భగవంతుని విశ్వరూపం చూసి ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే హృషీకేశా!నీ గుణగణాల కీర్తనలతో ప్రపంచం అంతా ఆనందిస్తుంది.రాక్షసులు ఏమో భయంతో వణికి పోతున్నారు.ఎటు పోవాలో తెలియక నలుదిక్కులకూ పరుగులు తీస్తున్నారు.మునులు,సిద్థులు అవథులు దాటిన ఆనందంతో నీకు నమస్సుమాంజలులు అర్పిస్తున్నారు.11-36
అత్యుత్తమమయిన జ్ఞానమే పరబ్రహ్మము.ఎటు చూసినా కాళ్ళు,చేతులు ,ముఖాలు,చెవులూ కలిగి అది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది.13-14
భగవంతుడు అనేవాడు కవి,పురాణపురుషుడు.అతను ఈ జగత్తును అంతా నియమించిన వాడు.అణువు కంటే సూక్ష్మం అయినవాడు.అయినా సర్వ జగత్తునూ పాలించేవాడు.ఈసృష్టి మొత్తం అతని పైనే ఆథారపడి ఉంది.వేయి సూర్యులకంటే ఎక్కవ వెలుగునిచ్చేవాడు.అజ్ఞానపు అంథకారాన్ని తొలగించేవాడు.ఆపరమాత్మను మనము ఆరాధించాలి.అప్పుడు ఖచ్చితంగా ఆ పరమాత్మనే పొందగలుగుతాము.8-9
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఒక అశ్వత్థ వృక్షము ఉంది.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలేమో క్రిందికి ఉంచాయి.వేదాను వాకాలను ఆకులుగా కలిగి ఉంటుంది.దానికి నాశనము అనేది లేదు.ఆ వృక్షము గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు.15-1
శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!అందరిలో నేనే ఉన్నాను.ఎలా అనుకున్నావు?వారి అంతరాత్మలాగా నిబిడీకృతమై ఉంటాను.మనషిలో కనిపించే జ్ఞాపకం,జ్ఞానము,మరపు...ఇలా ప్రతి ఒక్క గుణము నా వల్లనే కలుగుతున్నాయి.నేను ఎవరనుకున్నావు?నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.వేదవేత్తను కూడా నేనే.సమగ్రంగా చెప్పాలంటే కర్త,కర్మ,క్రియలు నేనే.నన్ను మించి ఇంకేమీ లేదు.15-15
శ్రీకృష్ణుడు ముక్తాయింపుగా ఈ సూచన,సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు ఒక చిన్న చిట్కా చెబుతాను.నువ్వు నాయందే మనసు నిలిచేటట్లు చేసుకో.నా భక్తుడివి అయ్యేదానికి నడుము బిగించునన్నే సేవించి తరించు.నన్నే నమ్ముకో!నాకే నమస్కారము చెయ్యి.నాయందే నీ దృష్టి నిలిచేలా చేసుకో!అంటే ఒక రకంగా నాతోటి మమేకం అవ్వాలి అని చెబుతున్నాడు.ఇలా చేస్తేనే నన్ను పొందగలవు.పరమపదమూ పొందగలవు.
Thursday, 2 October 2025
గీతతో నా స్నేహం
నేను చిన్నప్పుడు మా బాబు(నాన్న)రోజూ స్నానంచేసి వచ్చి దేవుడి ముందర భగవద్గీత చదవడం చూసేదాన్ని.నేను మొట్ట మొదటి సారి నా తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు దానిని పట్టుకుని ఒక్క శ్లోకం కూడుకుంటూ చదివాను ఒక్కొక్క పదం.తరువాత చిన్నగా అలవాటు అయి ఇప్పుడు రోజూ గీత మొత్తం చదివే స్థితికి వచ్చాను.నాకు గీత ఏమనిపిస్తుందో చెబుతాను.
తప్పు ఎవరు చేసినా తప్పే.ఒప్పు ఎవరు చేసినా ఒప్పే.మన బిడ్డ చేసాడని తప్పు ఒప్పు కాదు.ఇష్టం లేని వారు చేస్తే ఒప్పు తప్పుకాదు.ధర్మానికి తన మన అని ఉండదు.దాని దారిలోకి మనము రావాలి కానీ మన దారిలోకి అది రాదు.భగవద్గీత మొత్తమూ మనుష్య సంబంధాలు...అదే తల్లిదండ్రులు,భార్యాబిడ్డలు,తోడబుట్టినవాళ్ళు,బంధుజనం గురించి చెప్పదు.మానవుడు సమస్త ప్రాణికోటితో ఎలా నడచుకోవాలో చెబుతుంది.సంయమనం పాటించమంటుంది.పిరికితనం,భయం వద్దంటుంది.తప్పు చేస్తే భయపడాలి.కాబట్టి ఆ తట్టే వెళ్ళ వద్దు అంటుంది.ఫలాపేక్ష లేకుండా సమాజహితం కోసం పాటుపడమంటుంది.కామక్రోధలోభమదమాత్సర్యాలకు దూరంగా ఉండమంటుంది.
గొప్పవాళ్ళ మాటల్లో గీత
గొప్ప గొప్ప వాళ్ళు గీతను తమ జీవితాలలో భాగం చేసుకున్నారు.గీతను తమ జీవితగమనంలో అడుగడుగునా అన్వయించుకుంటూ ముందుకు సాగారు.జీవిత సమరంలో సఫలీకృతులు అయ్యారు.
మహాత్మా గాంధీ ఇలా చెప్పుకొచ్చాడు.ఎన్ని ఒడుదుడుకులు జీవితంలో ఎదురైనా ఒక్కసారి భగవద్గీత చదివితే చాలు.ముఖం పైకి చిరునవ్వు మనకు తెలియకుండానే వస్తుంది.అనేకానేక కష్టాల నుండి,సమస్యల నుంచీ,సందేహాల నుంచీ ఈ భగవద్గీతే నన్ను కాపాడి,ఉద్ధరించింది.
వినోబా భావే అయితే ఇలా అంటారు.పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంత ముఖ్యం?అవి బిడ్డ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి.అట్లాంటి తల్లి చనుబాలకంటే కూడా భగవద్గీత మనిషి ఎదుగుదలకు సహాయకారి.సంపూర్ణమయిన ఎదుగుదల...బుద్ధికీ,మనోవికాసానికీ,సంయమనము పాటించేదానికి ఉపయోగ పడుతుంది.
మదన్ మోహన్ మాళవ్యగారు అయితే ఇది అసలు మత గ్రంధము కానే కాదు.విశ్వమానవాళికి పనికి వచ్చే ధర్మభాండాగారము.ఇప్పటిదాకా ప్రపంచవాజ్మయంలో ఇంతకంటే గొప్పగ్రంధం ఇంకొకటి పుట్టలేదు అని అన్నారు.
మథుసూదన సరస్వతి అయితే ఇంకా బాగా విశ్లేషణ చేసారు.గీ అనగా త్యాగము.త అనగా తత్త్వము.అంటే భగవద్గీత మనకు త్యాగివై తత్త్వజ్ఞుడివి కావాలని బోధిస్తుంది.మనకు త్యాగము...కర్మఫలత్యాగము,తత్త్వము...ఆత్మస్పృహ..ఆత్మజ్ఞానము,పరిపక్వత వేర్పిస్తుంది.
లోకమాన్య తిలక్ ఈ మహా గ్రంధం గురించి ఈ విధంగా నొక్కి వక్కాణించారు.మనిషిగా జన్మ నెత్తినవాడు ఏమి చెయ్యాలి,ఏమేమి చేయకూడదో తాత్విక దృష్టితో విశ్లేషణ చేస్తూ,బోధించే గ్రంథము.కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితకాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంధము.
స్వామి వివేకానంద శ్రీకృష్ణుడి పలుకులు,భగవద్గీత ద్వారా,మనకు ఏమి చెప్పాడో విందాము.పిరికి తనం నరకంకన్నా హీనమయినది,హేయమయినది.జీవితం రణరంగం లాంటిది.ధైర్యంగా సాగాలి ముందుకు.
గీత అనేది ఏరి,కూర్చిన పుష్ప గుచ్ఛం లాంటిది.చక్కగా,సుందరంగా,సమన్వయంగా అల్లిన పూలమాల లాంటిది.ఈ గీత అత్యంత నైపుణ్యంతో కూర్చిన ధర్మసూక్ష్మాల సముచ్చయము.జీవితంలో ఉన్నత శిఖరాలు అథిరోహించాలి అనే తపన ఉండే ప్రతివాడూ తప్పకుండా గీతోపదేశాన్ని అధ్యయనము చేయాలి.ఇంతకంటే మంచి సాధనము ఇంకొకటి లేదు.
గీతా గంగా చ గాయత్రీ
గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృదిస్థితే।
చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే॥
గీత యొక్క గొప్పదనం మహాభారత గ్రంథంలో కూడా ఉటంకించారు.గీత,గంగ,గాయత్రీ,గోవింద అనే ఈ నామాలు మనకు పరమ పవిత్రమయినవి.భగవద్గీత మహాత్మ్యము మనము చెప్పుకున్నాము కదా!అన్ని నదీ జలాలలోకి గంగ పవిత్రమయినది.నేరుగా శివుడి జటాజూటం నుంచి భూమిపైకి ఉరకలేస్తూ సాగే జీవనది.గాయత్రీ మంత్రము ఎంత పవిత్రమయిన మంత్రమో అందరికీ తెలుసు.అలాగే గోవింద నామము.ప్రముఖంగా ఈ కలియుగంలో గోవింద గోవింద అనే నామము యొక్క ప్రాశస్త్యము మనందరికీ తెలుసు.గ కారముతో మొదలు అయే ఈ నాలుగు నామాలను విడవకుండా సతతమూ తలుస్తూ ఉండాలి.అలాంటి వారికి పునర్జన్మ అనేది ఉండదు అని ప్రగాఢ నమ్మకము.పునర్జన్మ లేదంటే పరమపదము మనకు దక్కినట్లే కదా!
Wednesday, 1 October 2025
భగవద్గీతా కించి దధీతా
భగవద్గీతా కించి దధీతా
గంగాజలలవ కణికాపీతా।
సకృదపి యేనమురారి సమర్చా
తస్య కరోతి యమోపినచర్చా॥
నువ్వు నేనూ కాదు,జగద్గురు శంకరాచార్యులవారు కూడా తను రచించిన భజగోవిందమ్ లో భగవద్గీత యొక్క గొప్పదనం చెప్పారు.ఆయన ఇదే చెప్పారు.మనము జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీకృష్ణుడిని,ఆ మురారిని ధ్యానం చేసుకోవాలి.ఒక్క చుక్క అయినా పవిత్రమయిన గంగాజలాన్ని తాగాలి.ఒక్కసారి అయినా కళ్ళ కద్దుకుని భగవద్గీతలోని ఒక్క శ్లోకమయినా శ్రద్ధగా చదవాలి.పైన చెప్పిన ఈ పనులు క్షణకాలమయినా మనస్పూర్తిగా చేస్తే మనము పుణ్యాత్ములకోవలోకి చేరిపోతాము.అప్పుడు యముడు కూడా మన దరిదాపుల్లోకి తచ్చాడేదానికి భయపడతాడు.
Subscribe to:
Comments (Atom)