Friday, 10 October 2025

షష్టాధ్యాయము…ఫలము

భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము.పేరుకు తగినట్లే ఈ అధ్యాయము పారాయణ చేస్తే దివ్య తేజఃప్రాప్తి సిద్ధిస్తుంది. పూర్వము జనశ్రుతుడు అనే రాజు ఉండేవాడు.అతడు మంచి ధర్మాత్ముడు.ఒకరోజు ఆరాజు డాబా పైన పండుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.ఆ సమయంలో ఆకాశంలో ఒక హంసల గుంపు అటు మీదగా పోతూ ఉండింది.ఆగుంపులో ఒక హంస దుందుడుకుగా ప్రవర్తించింది.అది గమనించిన ముసలి హంస ఇలా మందలించింది.ఓ కుర్ర హంసా!ఏంది నీ వ్యవహారం?మనము ధర్మాత్ముడు అయిన రాజు దరిదాపుల్లో వెళుతున్నాము.అంత దుడుకుతనం పనికిరాదు.మట్టూ మర్యాద కొంచెం నేర్చుకో! ఈ హంస మాటలకు కుర్ర హంస నసుగుతూ,గునుస్తూ ఈ మాటలు అనింది.ఓ యబ్బో!ఈ రాజు ఏమైనా రైక్వుడా?ఆయనకంటే ఎక్కవ తేజోవంతుడాయే!ఇంక ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టాలి మనమందరమూ!ఇలా ఎగతాళి,అవహేళన,అపహాస్యం చేసింది. రాజు ఆ మాటలన్నీ విన్నాడు.ఒకింత ఆశ్చర్యము కూడా వేసింది.చారులను పిలిపించాడు.రైక్వుడు అనే వాడిని కనుక్కుని తీసుకు రమ్మన్నాడు.చారులు అన్ని చోట్లా వెతికారు.ఉత్త చేతులకో తిరిగి వచ్చారు.వారు రాజుకు ఇలా విన్నవించుకున్నారు.హే రాజా!మేము బాగా వెతికాము.ఆ పేరుతో ఎవరూ మాకు దొరకలేదు.కానీ కాశీ దేశం లోని శ్రీ మాణిక్యేశ్వరాలయము దగ్గర ఒక మహాతేజస్సు ఉండే అతను కనిపించాడు.అతని పేరు రైక్వుడు అని వాళ్ళూ వీళ్ళూ అంటే విన్నాము.అతనిని వెంట పెట్టుకుని వచ్చే ధైర్యము చేయలేక పోయాము. రాజు ఈ మాటలు వినగానే మందీ మార్బలముతో,కానుకలు పట్టుకుని ఆ తేజస్వి దగ్గరకు బయలుదేరాడు.అతనిని దర్శించుకున్నాడు.అంతట ఇలా విన్నవించుకున్నాడు.ఓ మహానుభావా!నీవు దేనినీ ప్రాశించవూ,మరి ఇంక దేనినీ ఆశించవూ!నీవు ఇంత తేజోవంతుడివి ఎలా అయ్యావు?ఆ కథా కమామిషు నాకు వివపరించేది. దానికి చిరునవ్వుతో రైక్వుడు ఇలా సమాథానం ఇచ్చాడు.రాజా!నీవు అంటున్న ఆ తేజస్సో,ఓజస్సో,నాకు ఏమీ తెలియదు.అవి ఎట్లా వచ్చాయో,ఎందుకు వచ్చాయో అస్సలు తెలియదు.నాలో ఏమైనా విశిష్టంగా కనిపించింది అంటే నేను అనుకునే కారణం బహుశ ఇది అయి ఉండవచ్చు.నేను నిత్యమూ భగవద్గీతలోని ఆరవ అధ్యాయమ క్రమం తప్పకుండా పారాయణము చేస్తాను.అంతే!ఇదంతా బహుశ దాని మహాత్మ్యమే ఉండి ఉంటుంది.అతను ఇలా అన్నాడు. శ్లోకము.... గీతానాం షష్ఠమధ్యాం జపామిప్రత్యహం నృపయమ్। తేనైవ తేజోరాశి ర్మేసురాణామపి దుస్సహః॥

No comments:

Post a Comment