Tuesday, 14 October 2025

ఏకాదశ అధ్యాయము….ఫలము

భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము.ఈ అధ్యాయము పారాయణము చేస్తే రాక్షస పీడా నివారణము కలుగుతుంది. శ్లోకము.... నిష్కర్మతయా ప్రాపుస్తే పరమం పదమ్। ఏకాదశస్య సామర్ధ్యా దధ్యాయస్య భవిష్యతి॥ పూర్వము ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు.వాడి దురాగతాలకు అంతూ పొంతు ఉండేదే కాదు.ఊరి ప్రజలు విసుగెత్తి పోయారు.గ్రామాధికారులు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు.వీధులలో పడుకునేవారిని భక్షించవచ్చు.కానీ ఇండ్లలోకి వచ్చి హింసించి చంపకూడదు.ఈ విషయము తెలియని వారు ఆరుబయట పడుకుని ఆ రాక్షసుడికి బలి అవుతూ ఉండేవారు.ఒకరోజు సునందనుడు అనేవాడు ఆ ఊరి మీదుగా తీర్థయాత్రలకని పోతుండినాడు.ఆ రాత్రికి అక్కడే ఆగి విశ్రాంతి తీసుకుని,తెల్లవారు ఝామున బయలుదేరాలి అనుకున్నాడు.ఆ రాత్రి కూడా రాక్షసుడు వచ్చాడు.సునందనుడిని తప్ప మిగిలిన అందరినీ చంపి,తినిపోయాడు. పొద్దున్నే ఆ ఊరిలో వాళ్ళు,హాయిగా అరుగు పైన పడుకుని నిద్ర పోతున్న సునందనుడిని చూసారు.చాలా ఆశ్చర్యపోయారు.అతనిని మంచిగా సాగనంపారు.ఆ గ్రామ పెద్దలు రాక్షసుడి దగ్గరకు వెళ్ళారు.ఇలా అడిగారు.రాత్రి నువ్వు వచ్చావు.మన ఒప్పందం ప్రకారము ఆరుబయట నిద్ర పోయేవాళ్ళని చంపి తిన్నావు.సునందనుడిని మాత్రము ఎందుకు వదలి పెట్టావు? దానికి ఆ రాక్షసుడు ఇలా జవాబు చెప్పాడు.వాడెవడో ఎప్పుడూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము చదువుతూ ఉంటాడట!వాడి దరిదాపుల్లోకి వెళ్ళగలిగే దానికి కూడా నా శక్తి సామర్ధ్యాలు చాలలేదు.నా శక్తి యుక్తులు వాడి దగ్గర పని చేయలేదు. ప్రజలకు ఇంక కిటుకు అర్ధమయింది,వాళ్ళను వాళ్ళు కాపాడుకునేదానికి.ఆ గ్రామంలో అందరూ క్రమం తప్పకుండా రోజూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము పారాయణము చేయటం మొదలుపెట్టారు.ఇంక రాక్షసుడు చేసేది ఏమీ లేక తట్టా బుట్టా సర్దుకుని,అక్కడినుంచి పలాయనము చిత్తగించాడు.

No comments:

Post a Comment