Monday, 6 October 2025

ప్రధమ అధ్యాయము …ఫలము

పద్మ పురాణంలో అంతర్గతంగా భగవద్గీత పారాయణం చేస్తే చేకూరే ఫలము,ఫలితము గురించి ప్రస్తావన ఉంది. ప్రధమ అధ్యాయము పారాయణం చేస్తే పూర్వ జన్మ స్మృతులు,పాపనాశనము,తదుపరి మంచి జన్మ దక్కుతాయి. శ్లోకము.... తస్మాదధ్యాయమాద్యం యఃపఠేత్ శ్రుణుతే స్మరేత్। అభ్యసేత్తస్యనభవేత్ భవాంభోధిర్దురుత్తరః॥ పూర్వము సుశర్మ అని ఒకడు ఉండేవాడు.వాడు చెయ్యని భ్రష్టు పని అంటూ ఏదీ ఈ భూమి మీద మిగల లేదు.మరణించిన తరువాత మళ్ళీ ఎద్దుగా పుట్టాడు.ఒకానొక రోజు ఆ ఎద్దు పర్వత ప్రాంతాలలో బరువులు మోస్తూ,నేలకూలింది.భయంకరమయిన మరణ యాతన అనుభవిస్తూ ఉండింది.ఆ దారిలో వస్తూ పోతూ ఉండే వాళ్ళందరూ దాని కష్టం చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు.కానీ నిస్సహాయంగా ఉన్నారు.వాళ్ళలో ఒక వేశ్య ఉండింది.దాని బాధ చూసి,చలించిపోయింది.మనస్పూర్తిగా దేవుడికి ఇలా దణ్ణం పెట్టుకుంది.హే భగవంతుడా!నా జన్మలో నేను ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ ఫలం అంతా ఈ ఎద్దుకు సంక్రమించేలా చేయి.దానికి సద్గతి కలిగేలా చూడు స్వామీ! ఆమె ద్వారా చేకూరిన పుణ్యం వలన ఆ ఎద్దు మరు జన్మలో బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు.పూర్వ జన్మ స్మృతి వలన ఆ వేశ్య ఇంటికి పోయాడు.నీ వలన నాకు ఇంత ఉత్కృష్టమయిన జన్మ దక్కింది.నీవు నాకు ధారబోసిన పుణ్యం ఏంది అని ఆమెను అడిగాడు. ఆమె నాకు తెలియదు అనింది. ఆమె దగ్గర ఒక పెంపుడు చిలక ఉంది.అది బ్రహ్మ జ్ఞానిని చూసి ఇలా చెప్పడం మొదలు పెట్టింది.అయ్యా!మొదట్లో నేను ఒక ముని ఆశ్రమములో తిరుగుతూ ఉండేదానిని.ఆ ఋషి క్రమము తప్పకుండా రోజూ భగవద్గీత మొదటి అధ్యాయము పారాయణము చేసేవాడు.అది విని విని నాకు కూడా వచ్చేసింది.ఇంతలో విథి నన్ను ఈమె దగ్గరికి తీసుకుని వచ్చింది.నా అలవాటుకొద్దీ నేను రోజూ భగవద్గీత పారాయణము చేసుకునేదాన్ని.నా మీద ఉండే అలవిమాలిన ప్రేమవలన ఈమె శ్రద్థగా రోజూ వినేది.దాని వలన వచ్చిన పుణ్యమే ఆమె నీకు థారపోసింది. బ్రహ్మజ్ఞాని ఆ చిలుక మాటలకు అవాక్కయ్యాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.ఔరా!భగవద్గీతలోని ప్రధమ అథ్యాయము వింటేనే ఇంత పుణ్యం దక్కేటట్లయితే,పూర్తి భగవద్గీతా పారాయణం అనునిత్యం చేస్తే ఇంకెంత పుణ్యం దక్కుతుంది!!!???ఆమెకూడా ఈ విషయం తెలుసుకొని తబ్బిబ్బయింది.ఆ ఇద్దరూ అప్పటినుంచి అనునిత్యమూ ప్రథమ అథ్యాయము,అర్జున విషాద యోగము పఠిస్తూ,పారాయణ చేస్తూ ఉన్నారు.జన్మాంతరమున కైవల్యం పొందారు.

No comments:

Post a Comment