Thursday, 2 October 2025

గొప్పవాళ్ళ మాటల్లో గీత

గొప్ప గొప్ప వాళ్ళు గీతను తమ జీవితాలలో భాగం చేసుకున్నారు.గీతను తమ జీవితగమనంలో అడుగడుగునా అన్వయించుకుంటూ ముందుకు సాగారు.జీవిత సమరంలో సఫలీకృతులు అయ్యారు. మహాత్మా గాంధీ ఇలా చెప్పుకొచ్చాడు.ఎన్ని ఒడుదుడుకులు జీవితంలో ఎదురైనా ఒక్కసారి భగవద్గీత చదివితే చాలు.ముఖం పైకి చిరునవ్వు మనకు తెలియకుండానే వస్తుంది.అనేకానేక కష్టాల నుండి,సమస్యల నుంచీ,సందేహాల నుంచీ ఈ భగవద్గీతే నన్ను కాపాడి,ఉద్ధరించింది. వినోబా భావే అయితే ఇలా అంటారు.పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంత ముఖ్యం?అవి బిడ్డ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి.అట్లాంటి తల్లి చనుబాలకంటే కూడా భగవద్గీత మనిషి ఎదుగుదలకు సహాయకారి.సంపూర్ణమయిన ఎదుగుదల...బుద్ధికీ,మనోవికాసానికీ,సంయమనము పాటించేదానికి ఉపయోగ పడుతుంది. మదన్ మోహన్ మాళవ్యగారు అయితే ఇది అసలు మత గ్రంధము కానే కాదు.విశ్వమానవాళికి పనికి వచ్చే ధర్మభాండాగారము.ఇప్పటిదాకా ప్రపంచవాజ్మయంలో ఇంతకంటే గొప్పగ్రంధం ఇంకొకటి పుట్టలేదు అని అన్నారు. మథుసూదన సరస్వతి అయితే ఇంకా బాగా విశ్లేషణ చేసారు.గీ అనగా త్యాగము.త అనగా తత్త్వము.అంటే భగవద్గీత మనకు త్యాగివై తత్త్వజ్ఞుడివి కావాలని బోధిస్తుంది.మనకు త్యాగము...కర్మఫలత్యాగము,తత్త్వము...ఆత్మస్పృహ..ఆత్మజ్ఞానము,పరిపక్వత వేర్పిస్తుంది. లోకమాన్య తిలక్ ఈ మహా గ్రంధం గురించి ఈ విధంగా నొక్కి వక్కాణించారు.మనిషిగా జన్మ నెత్తినవాడు ఏమి చెయ్యాలి,ఏమేమి చేయకూడదో తాత్విక దృష్టితో విశ్లేషణ చేస్తూ,బోధించే గ్రంథము.కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితకాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంధము. స్వామి వివేకానంద శ్రీకృష్ణుడి పలుకులు,భగవద్గీత ద్వారా,మనకు ఏమి చెప్పాడో విందాము.పిరికి తనం నరకంకన్నా హీనమయినది,హేయమయినది.జీవితం రణరంగం లాంటిది.ధైర్యంగా సాగాలి ముందుకు. గీత అనేది ఏరి,కూర్చిన పుష్ప గుచ్ఛం లాంటిది.చక్కగా,సుందరంగా,సమన్వయంగా అల్లిన పూలమాల లాంటిది.ఈ గీత అత్యంత నైపుణ్యంతో కూర్చిన ధర్మసూక్ష్మాల సముచ్చయము.జీవితంలో ఉన్నత శిఖరాలు అథిరోహించాలి అనే తపన ఉండే ప్రతివాడూ తప్పకుండా గీతోపదేశాన్ని అధ్యయనము చేయాలి.ఇంతకంటే మంచి సాధనము ఇంకొకటి లేదు.

No comments:

Post a Comment