Thursday, 9 October 2025

చతుర్థ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని చతుర్ధ అధ్యాయము జ్ఞాన యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే చెడు ఆలోచనలు మనలను చుట్టు ముట్టడం ఆగిపోతుంది.ఏమైనా శాపాలు పూర్వజన్మలోనో,ఈ జన్మలోనో తగిలి ఉంటే వాటికి విరుగుడు అయి శాప విమోచనము కలుగుతుంది. శ్లోకము.... నిత్యమాత్మరతస్తుర్యం జపత్యధ్యాయమాదరాత్। తదభ్యాసాదదుష్టాత్మా నద్వంద్వైరభిభూయతే॥ పూర్వము సత్యతపుడని ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.ఇంద్రుడు అతని తపస్సును చెరపాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉండే అప్సరసలను పంపించాడు ఆ ఋషి దగ్గరకు.పాపం ఆ అప్సరసలు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు వెళ్ళి ఋషికి తపోభంగం కలిగించారు.ఇంకేముంది?సత్యతపుడు కోపంగా వాళ్ళను అక్కడే రేగి చెట్లుగా పడి ఉండండి అని శపించాడు.ముని ఇచ్చిన కారణంగా ఆ అప్సరసలు అక్కడే బదరీవృక్షాలుగా మారి,నిలబడి పోయారు. కొన్నాళ్ళకు ఆ జమిలి,రేగుచెట్ల నీడకోసం భరతుడు అనేవాడు వచ్చాడు.అతను ప్రశాంతంగా ఉంది అనుకుని భగవద్గీత నాలుగో అధ్యాయము,అదే జ్ఞాన యోగము పారాయణము చేసుకున్నాడు.ఆ మహిమ కారణంగా అప్సరసలు తమ పూర్వ స్థితికి వచ్చారు.వారికి శాపవిముక్తి కలిగింది.వాళ్ళు భరతుడికి ధన్యవాదాలు చెప్పారు.గీతా మహిమను కొనియాడారు.అలా వారు తిరిగి దేవలోకం బయలుదేరారు.

No comments:

Post a Comment