Thursday, 26 December 2024

మమ యోని ర్మహద్బ్రహ్మ

మమ యోని ర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం/ సంభవ న్నర్వభూతానాం తతో భవతి భారత॥3|| శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగయోగము భగవంతుడు అయిన కృష్ణుడు అర్జునుడికి అభిమానంతో చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!త్రిగుణాత్మకము అయిన మాయ అనే ప్రకృతి నాకు గర్భస్థానము.ప్రకృతిలో క్షేత్రబీజాలను నాటి సర్వ ప్రాణి కోటినీ సృష్టిస్తాను.అంటే ప్రకృతి గర్భం అయితే నేను బీజము అయి సర్వ సృష్టికి మూలకారణం అవుతున్నాము.

Friday, 20 December 2024

ఇదం జ్ఞానముపాశ్రిత్య

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః। సర్గేఽపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ॥2॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఈ జ్ఞాన యోగమును ఎవరు ఆచరిస్తారో,వాళ్ళందరూ తప్పకుండా నా స్వరూపాన్ని పొందుతారు.జననమరణాలకు అతీతంగా వుండే మోక్షాన్ని పొందుతారు.వాళ్ళు ప్రళయకాలంలో భయాందోళనలకు లోనవరు.అంటే శరీరం అంత్య దశలో కూడా నిర్మల చిత్తంతో వుండగలుగుతారు.

Wednesday, 18 December 2024

పరంభూయః ప్రవక్ష్యామి

శ్రీమద్భగవద్గీత...చకుర్దశాధ్యాయము గుణత్రయవిభాగయోగము శ్రీభగవానువాచ.... పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం। యద్ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః॥1॥ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.నేను జ్ఞానం గురించి ఇంతకు ముందు కొంత చెప్పి వున్నాను.అన్ని రకాల జ్ఞానాలలోకి అత్యంత ఉత్తమ మైన జ్ఞానం ఏదంటే,పరమజ్ఞానం అని నేను చెబుతాను.ఈ జ్ఞానం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న మునులందరూ ముక్తులు అయ్యారు.పరమపదాన్ని పొందారు.మోక్షం సంపాదించారు.ఆ జ్ఞానం గురించి మరలా నీకు నేను చెబుతాను.

Tuesday, 17 December 2024

క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం

క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞానచక్షుషా। భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్॥35॥ ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశాధ్యాయః శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ముందర మనం క్షేత్రము,క్షేత్రజ్ఞుడు మధ్య తేడా తెలుసుకో గలగాలి.వికార సహితమయిన ఈ ప్రకృతి నుండి ముక్తి పొందే మార్గం కనుక్కోవాలి.అంటే,సర్వభూతాలకు సహజ సిద్థంగా వుండే వికారాలు,మాయా బంథాలనుంచి బయటపడే మార్గం,తమ తమ జ్ఞాన నేత్రాలతో చూడగలగాలి.అలా ప్రామాణికంగా చూడగల మహాత్ములు ఆ పరబ్రహ్మ,పరమాత్మను చూడగలుగుతారు,చేరుకోగలుగుతారు.అంటే ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞులను చూడగలిగే కళ్ళనే మనం జ్ఞానం అని అంటాము.ఎందుకంటే జ్ఞానం పరమాత్మ సాక్షాత్కారానికి తొలి మెట్టు.

Monday, 16 December 2024

యథా ప్రకాశయత్యేకః

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః। క్షేత్రంక్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత॥34॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి సులభతరంగా అర్థం కావాలి అని శతవిథాల ప్రయత్నిస్తున్నాడు.హే అర్జునా!హే భరతశ్రేష్టా!సూర్యుడు ఒక్కడే కదా ఉండేది. కానీ ఆయన ఈ జగత్తునంతా ప్రకాశింప చేస్తున్నాడు కదా!అలాగే క్షేత్రజ్ఞుడు అయిన పరమాత్మ క్షేత్రములు అయిన సర్వ దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు.వాటిని చేతనత్వముతో నింపుతున్నాడు.

Sunday, 15 December 2024

యథా సర్వగతం సౌక్ష్మాత్

యథా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యత్। సర్వత్రావస్థితో దేహే తథాఽఽత్మా నోపలిప్యతే॥33॥ శ్రీమద్భగవద్గీతా...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా ఆకాశం అంతటా వ్యాపించి వుంటుంది అని.కానీ అది సూక్ష్మభావం వలన దేనినీ అంటదు.సరిగ్గా ఈ గుణం మనదేహంలో వుండే ఆత్మకు కూడా వర్తిస్తుంది.అలా ఎలా?ఎందుకు?అని అంటావా?చెబుతా విను.ఆత్మ అనేది గుణాలకు అతీతమయినది.కాబట్టి అది వివిథ శరీరాలలో ఉన్నా,వాటి గుణాలు ఏవీ దానికి లిప్యంకావు.అంటే అంటనే అంటవు.

Friday, 13 December 2024

అనాదిత్వాన్నిర్గుణత్వాత్

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాఽయ మవ్యయః। శరీరస్థోఽపి కౌంతేయ!న కరోతి న లిప్యతే॥32॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి అర్థం అయేలా చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!పరమాత్మ అనేదానికి పుట్టుక లేదు.ఎలాంటి వికారాలు,వాసనలు,గుణగణాలు లేవు.అది మన దేహంలో ఉంటుంది.పరమాత్మ నిర్వికారంగా,నిరామయంగా,చావు పుట్టుకలు లేని,అవినశ్వరమయిన కారణంగా అది దేహంలో వున్నా కర్తృత్వంగానీ,కర్మఫలంగానీ అంటకుండా ఉంటుంది.ఇవేవి దానికి అంటవు,ఉండవు.

యదా భూతపృథగ్భావం

యదా భూతపృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి। తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా॥31॥ శ్రీమద్భగవద్గీత....త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!మొదట మనం అన్ని భూతాలను ఆత్మపరంగా చూడటం నేర్చుకోవాలి.ఈసృష్టిలో వుండే ప్రతి అణువు పరమాత్మ నుండే పుట్టిందని గ్రహించాలి.అంతేకాదు.అవన్నీ కూడా ఆత్మగతమై,సర్వత్రా నిండి వున్నాయని అర్థం చేసుకోవాలి.ఇదంతా జీర్ణించుకున్న మానవుడే బ్రహ్మత్వాన్ని పొందగలడు.ఈ మహనీయమయిన దశ మానవుడికి ఎప్పుడు ప్రాప్తిస్తుందో,ఆ క్షణంలోనే బ్రహ్మలో ఐక్యంకాగలడు.

Thursday, 12 December 2024

ప్రకృత్త్యెవ చ కర్మాణి

ప్రకృత్త్యెవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః। యః పశ్యతి తథాఽఽత్మానం అకర్తారం స పశ్యతి॥30॥ శ్రీమద్భగవద్గీత....త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి సులభంగా రెండు ముక్కలలో చెబుతున్నాడు.అర్జునా!మొదట అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.ఆత్మకు కర్తృత్వము అనేది లేదనే విషయం బుర్రకు ఎక్కించుకోవాలి.ఆత్మ అనేది ఎవరి ఆధీనంలో ఉండదు అని ముందు గ్రహించాలి.ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని.

Wednesday, 11 December 2024

సమం పశ్యన్ హి సర్వత్ర

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం। న హినస్త్యాత్మనాఽఽత్మానం తతో యాతి పరాం గతిమ్॥29॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ద్రష్ట అనేవాడి గురించి ఇప్పుడు చెప్తాను,తెలుసుకో.ద్రష్ట అని ఎందుకు అన్నానంటే,ఆ పురుషుడు సర్వత్రా సమభావంతో స్థితుడు అయిన పరమేశ్వరుడిని సమానంగా చూడగలుగుతాడు.అలాంటివాడు తనను తాను ఎప్పుడూ వినష్ట పరుచుకోడు.ఎందుకంటే ఎలా వుండేదానిని అచ్చం అలాగే చూస్తాడు.దానికి ఎక్కువ తక్కువలు ఆపాదించడు.కాబట్టి అతను పరమగతిని పొందుతాడు.

Monday, 9 December 2024

సమం సర్వేషు భూతేషు

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం। వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి॥28॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు చెపుతున్నాడు.అర్జునా! భగవంతుడు అనేవాడు సర్వ భూతాలలోనూ సమంగా ఉంటాడు.అతనికి ఒకరు ఎక్కువ,ఇంకొకరు తక్కువా కాదు.ఒకటి ఎక్కువ,ఇంకొకటి తక్కువా కాదు.ఆ భూతాలు నశించినా తాను మటుకు నాశనం కాడు.అంటే సర్వ ప్రాణికోటి నశించినా,తాను మాత్రం అజరామరంగా,శాశ్వతంగా ఈ చరాచర సృష్టి ఉన్నంత వరకూ ఉంటాడు.అలాంటి పరమేశ్వరుడిని చూడగలిగినవాడు మాత్రమే నిజమైన ద్రష్ట.

Saturday, 7 December 2024

యావత్సంజాయతే కించిత్

యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమం। క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ॥27॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి చెపుతున్నాడు.అర్జునా!ఈచరాచరజగత్తు మొత్తం స్థావర జంగమమయినది.ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం నుంచి జనించినదే.స్థావరం అంటే ఒకేచోట నిలబడి ఉండేది.జంగమం అంటే కదలిక ఉండేది అని అర్థం.ఈ విషయాన్ని నువ్వు ముందు తెలుసుకోవాలి.

Friday, 6 December 2024

అన్యే త్వేవ మజానంతః

అన్యే త్వేవ మజానంతః శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే। తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః॥26॥ శ్రీమద్భగవద్గీత..।త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మతత్త్వము అనేది అందరికీ సులభంగా అర్థం కాదు కదా!అలా స్వతహాగా అర్థంచేసుకోలేని కొందరు తత్త్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు.ఇలా ఆత్మతత్త్వం గురించి తెలియకపోయినా,మనసా,వాచా,కర్మణా అభ్యాసం చేసేవారు కూడా మృత్యురూపమయిన సంసారము నుంచి తరిస్తారు.ఇందులో ఎలాంటి అనుమానంలేదు.

Thursday, 5 December 2024

ధ్యానే నాత్మని పశ్యంతి

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మాన మాత్మనా। అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే॥25॥శ్రీమద్భగవద్గీత...క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము త్రయోదశాధ్యాయము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొందరు ఆపరమాత్మను పరిశుద్థమయిన సూక్ష్మ బుద్థితో హృదయంలో చూస్తున్నారు.కొందరు యోగ ధ్యానంతో చూస్తున్నారు.మరి ఇంకొందరు జ్ఞానయోగం సహాయంతో చూస్తున్నారు.ఇంకొక వర్గం నిష్కామయోగంను ఆశ్రయించి,దాని ద్వారా పరమాత్మను దర్శిస్తున్నారు.ఇలా ప్రతి ఒక్కరూ వారి వారికి తగిన రీతిలో,పరంథాముడిని చేరేదానికి కృషి చేస్తున్నారు.

Tuesday, 3 December 2024

య ఏవం వేత్తి పురుషం

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ। సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే॥24॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇలా అందరూ జీవుని గురించి,గుణాలతో వున్న ప్రకృతి గురించి తెలుసుకోవాలి.ఇలా అన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు ఎలాంటి కర్మలను చేసినా తిరిగి జన్మించడు.అంటే మోక్షం సంపాదిస్తాడు.

Monday, 2 December 2024

ఉపద్రష్టానుమంతా చ

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః। పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః॥23॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!భగవంతుడు మన దేహంలోనే ఉంటాడు.అతనినే పరమాత్మ అని అంటాము.కానీ దేహానికి అతీతుడు.ఆ విశ్వేశ్వరుడు,పరంథాముడు,పరమాత్మ స్వతంత్రుడు.ఈ జగత్తుకంతా అనుకూలంగా అనుమతిని ఇచ్చేవాడు.ఈ విశ్వంలో జరిగే ప్రతి చిన్న కదలికకు కూడా సాక్షిమాత్రుడు.సర్వ జగత్తును పోషించేవాడు,పాలించేవాడు.ఈ సృష్టికి అంతా యజమాని అతనే.ఈ చరాచర జగత్తును అంతా పర్యవేక్షిస్తుంటాడు.అతడు దివ్య భోక్త.

Sunday, 1 December 2024

పురుషః ప్రకృతిస్థో హి

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్। కారణం గుణసంగోఽస్య సదసద్యోని జన్మసు॥22॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి సవివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈజీవుడు అనే వాడు ఉన్నాడు కదా!వాడు ప్రకృతికృత దేహగతుడు.అంటే ఈప్రకృతి ఇచ్చిన దేహం కలవాడు.అయినాకూడా అదే ప్రకృతిచే ఉత్పాదితాలు అయిన గుణాలవలన సుఖదుఃఖాలు,ఇతరమయిన క్లేశాలు అనుభవిస్తున్నాడు.వివిధ,పలు రకాల యోనులందలి జన్మలకు గుణ సంగమమే కారణము.అంటే ప్రకృతి మన దేహాలకు కారణభూతము అవుతుంది.అలాగే మనలో పుట్టే రకరకాల గుణాల వల్ల ఉత్పన్నమయే సుఖదుఃఖాలకూ కారణభూతము అవుతుంది.

Sunday, 24 November 2024

కార్య కారణకర్తృత్వే

కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే। పురుషః స్సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే॥21॥శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ప్రకృతి దేహేంద్రియాల కర్తృత్వాలకు హేతువుగా చెప్పబడుతున్నది.అలాగే సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు హేతువుగా చెప్పబడుతున్నాడు.

Friday, 22 November 2024

ప్రకృతిం పురుషం చైవ

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావసి। వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్॥20॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అర్జునుడికి అర్థం అయేటట్లు చెప్పేదానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఈ ప్రకృతి,పురుషుడు అనేవి సృష్టిలో ఎప్పటినుంచి ఉన్నాయో ఎవరూ చెప్పలేరు.అవి ఎవరూ చెప్పలేనంత,ఎవరూ ఊహించలేనంత అనాదివి.ఆ విషయం ముందు అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.మనం నిత్యం చూసే,అనుభవించే దేహేంద్రియ వికారాలు,త్రిగుణాలు,సుఖదుఃఖాదులు అన్నీ ఈ ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి.అన్నిటి పుట్టుకకూ ఈ ప్రకృతే మూలాథారం.

Thursday, 21 November 2024

ఇతి క్షేత్రం తథా జ్ఞానం

జ్యోతిషామపి తద్జ్యోతిః తమసః పర ముచ్యతే। జ్ఞాయం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్॥18॥ ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః। మద్భక్త ఏత ద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే॥19॥ శ్రీమద్భగవద్గీత... త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!ఈ పరబ్రహ్మము అనేది సూర్యుడికి,అలాగే అగ్నికి కూడా తేజస్సును ఇస్తుంది.అది చీకటికి అందనంతగా,అల్లంతదూరంలో ఉంటుంది.దానినే జ్ఞానం అని అంటారు.అదే జ్ఞేయం.అనగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన,తెలుసుకోదగిన విషయం అని అర్థం.ఈ పరబ్రహ్మని జ్ఞానంతో మాత్రమే పొందగలము.సర్వ ప్రాణికోటి యొక్క హృదయాంతరాళలో అంతర్యామిగా ఉండేది ఈ పరబ్రహ్మమే. అర్జునా!ఇప్పుడు నీకు క్షేత్రము,జ్ఞానము,జ్ఞేయము గురించి సవివరంగా,సంగ్రహంగా చెప్పాను.ఈ మూడింటి గురించి తెలుసుకున్నవాడే నాకు భక్తుడై,మోక్షాన్ని పొందగలడు.

Tuesday, 19 November 2024

అవిభక్తం చ భూతేషు

అవిభక్తం చ భూతేషు విభక్త మివ చ స్థితం। భూతభర్తృ చ తర్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ॥17॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఆ పరమాత్మ ఆకాశంలాగా అఖండమై ఉంటుంది.పరిపూర్ణమై ఉంటుంది.అయినా కూడా చరాచర జగత్తులోని సర్వ భూతాలలోనూ విభక్తమయినదానిలాగా కనపడుతుంది.అంటే వేరు చేయలేనిదిగా,సర్వప్రాణికోటితో మమేకమై ఉంటుంది.అదే సర్వ భూతాలను పోషిస్తుంది.అలానే దిగమ్రింగుతుంది.మరల పునఃసృష్టి చేసేది కూడా అదే.అంటే ఈ సృష్టి అంతా ఆ పరమాత్మ చెప్పు చేతల్లో ఉంది.

Monday, 18 November 2024

బహిరంతశ్చ భూతానాం

బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ। సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్॥16॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము అర్జునుడికి కృష్ణుడు ఓపికగా,అర్థం అయ్యేలా చెబుతున్నాడు.అర్జునా!ఈ పరబ్రహ్మము అనేది అన్ని భూతాలకు లోపల ఉంటుంది.అంతేకాదు! ఇది సర్వభూతాలకూ బయటకూడా ఉంటుంది.చరాచర స్వరూపం అదే.అయినా దానిని తెలుసుకోవడం అసాధ్యము.ఎందుకంటే అది అత్యంత సూక్ష్మమయినది.దానిని అథ్యయనం చేసి ,అర్థం చేసుకుని,గుర్తించిన వారికి అతి చేరువలో ఉంటుంది.అజ్ఞానులకు,మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడేవారికి అందనంత దూరంలో ఉంటుంది.

Saturday, 16 November 2024

సర్వేంద్రియ గుణాభాసం

సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం। అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ॥15॥ శ్రీమద్భగవద్గీత... త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఆ పరబ్రహ్మత్వం అనేది వుందే,అది ఎవరికీ అంత సులభంగా అర్థం కాదు.అది సర్వేంద్రియాలలో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది.కానీ కలవదు.దేనితో కలిసి వుండకపోయినా,అన్నిటినీ ధారణపోషణలు చేస్తూ ఉంటుంది.నిర్గుణమై ఉండి కూడా గుణాలను అనుభవించేది అదే.ఈ విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి,తెలుసుకోవాలి.

Thursday, 14 November 2024

సర్వతః పాణిపాదం తత్

సర్వతః పాణిపాదం తత్ సర్వతోఽక్షి శిరోముఖం। సర్వత శ్శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి॥14॥ శ్రీమగ్భగవద్గీత....త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు ఈ ప్రకారం వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడు నేను సనాతనమయిన పరబ్రహ్మము అని చెప్పాను కదా.దానికి ఎటు చూసినా కాళ్ళు,చేతులు,తలలు,ముఖాలు,చెవులు ఉంటాయి.అది ఈ విశ్వం మొత్తం శాఖోఽపశాఖలుగా వ్యాపించి ఉంటుంది.అది లేని ప్రదేశం ఈ భూమండలంలో ఎంత వెదికినా కానరాదు.

Wednesday, 13 November 2024

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వాఽమృత మశ్నుతే। అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నా స దుచ్యతే॥13॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు తెలుసుకునేదానికి ఏది యోగ్యమయినదో చెబుతాను.అలాగే దేనిని తెలుసుకుంటే మోక్షం సమకూరుతుందో కూడా చెబుతాను.అది సనాతనమైన పరబ్రహ్మము.దానిని సత్పదార్థమని చెప్పలేము.అలాగని అసత్పదార్థమనికూడా చెప్పలేము.

Monday, 11 November 2024

అసక్తి రనభిష్వంగః

అసక్తి రనభిష్వంగః పుత్రదారగృహాదిషు। నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు॥10॥ మయి చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణీ। వివిక్తదేశ సేవిత్వం అరతి ర్జనసంసది॥11॥ అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనం। ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోఽన్యథా॥12॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు చెపుతున్నాడు.అర్జునా!భార్య,పుత్రులు,ఇంకా ఇంట్లో ఉండే మిగిలిన సభ్యులు,ఇల్లు,వాకిలి,పొలము,పుట్రల పైన మమకారము పెంచుకోకూడదు.శుభాన్ని,అశుభాన్ని సమంగా చూడగలగాలి.అన్ని రకాల ఆలోచనలు,ఆక్రోశాలు,అనుమానాలు,అసహనాలు,ఆవేదనలు వదిలి నా యందు అనన్యమయిన భక్తి కలిగి ఉండాలి.ఏకాంతవాసం చెయ్యాలి.జన సమూహాలకు దూరంగా ఉండాలి.నిరంతరం ఆత్మజ్ఞానం,తత్త్వజ్ఞానం,ఆత్మశోధనల విచారణ చేస్తూఉండాలి.పైన ఉదహరించినవి అన్నీ కలిపి జ్ఞానం అని చెప్తారు.దీనికి విభిన్నంగా,అడ్డంగా ఉండేవి అన్నీ అజ్ఞానానికి ప్రతీకలు అంటారు.

అమానిత్వమదంభిత్వం

అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం। ఆచార్యోపాసనం శౌచం స్థైర్య మాత్మవినిగ్రహః॥8॥ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ। జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనమ్॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!అభిమానము,డంబము లేకుండా ఉండాలి.అహింస,ఓర్పు,కపటం లేకుండా ఉండటం కావాలి.గురుసేవ,శుచిత్వం,నిశ్చలత,ఆత్మ నిగ్రహం అతి ముఖ్యం.ఇంద్రియ విషయాలపై వైరాగ్యం పెంచుకోవాలి.అహంకారం,అహంభావం మచ్చుకైనా కానరాకుండా ఉండాలి.చావుపుట్టుకలను సమంగా చూడగలగాలి.వృద్థాప్యం,వ్యాధుల వలన వచ్చే వ్యథలకు అతీతంగా ఉండాలి.సంసార జీవనంలో మనకు ఎదురయ్యే ఒడుదుడుకులను,సుఖదుఃఖాలను నిమిత్తమాత్రంగా స్వీకరించ గలగాలి.

Sunday, 10 November 2024

మహాభూతా న్యహంకారో

మహాభూతా న్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ। ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియ గోచరాః॥6॥ ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః। ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్॥7॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి వివరణగా చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!పంచభూతాలు,అహంకారం,బుద్ధి,మూలప్రకృతి,కర్మేంద్రియాలు,జ్ఞానేంద్రియాలు,మనస్సు అనేవి క్షేత్రమని చెప్పబడే విషయాలు.ఇవి కాకుండా ఇంద్రియ విషయాలు అయిన శబ్దం,స్పర్శ,రూపం,రసం,గంథాలు,ఇచ్ఛాద్వేషాలు,సుఖదుఃఖాలు,దేహేంద్రియ సమూహం కూడా కేత్రానికి సంబంథించినవే.ఇకపోతే తెలివి,ధైర్యం కూడా ఇదే కోవకు చెందుతాయి.పైన ఉదహరించినవి అన్నీ కూడా క్షేత్రమని క్లుప్తంగా చెప్పబడింది. అంటే మన శరీరానికి ,మనసుకు,మస్తిష్కానికీ సంబంథం ఉన్న ప్రతి విషయం క్షేత్రమే.కాబట్టి దీనికి సంబంథించిన ప్రతి చిన్న విషయం మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.

Saturday, 9 November 2024

ఋషిభి ర్బహుధా గీతం

ఋషిభి ర్బహుధా గీతం ఛందోభిర్విథైః పృథక్। బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుః మద్భిర్వినిశ్తితైః॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు ఇలా చెపుతున్నాడు.అర్జునా!ఋషులు క్షేత్రం అంటే ఏంది,క్షేత్రజ్ఞం అంటే ఏంది అని చెప్పారు.వాటి గుణగణాలు,స్వరూపాలు,స్వభావాలను అనేక రకాలుగా వివరించారు.బ్రహ్మసూత్రాలు వాటిల్లో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే విపులంగా అన్నిటినీ వివరించాయి.

Friday, 8 November 2024

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్। స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు॥4॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి సవివరంగా చెప్పేదానికి ఉపక్రమించాడు.అర్జునా!నీకు చాలా అనుమానాలు ఉన్నాయని నాకు తెలుస్తూ వుంది.నీకు క్షేత్రం ఎటువంటిదో చెబుతాను.దానికి ఎలాంటి ఆకార వికారాలు ఉన్నాయో కూడా వివరిస్తాను.అవి అసలు దేనివల్ల,ఏ విధంగా కలుగుతున్నాయో కూడా చెబుతాను.ఎవరిని క్షేత్రజ్ఞుడు అంటారో చెబుతాను.వాడు ఎవడు,ఎటువంటివాడు,ఎలా ఉంటాడు,ఎలా వ్యవహరిస్తాడు అనేది విశదీకరిస్తాను.

Thursday, 7 November 2024

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి

క్షేత్రజ్ఞం చాపి మాంవిద్ధి సర్వ క్షేత్రేషు భారత! క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ॥3॥ శ్రీనద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు ఇలా అంటున్నాడు.అన్ని క్షేత్రాలలోను నేను ఉంటాను.అంటే ఈ భూమి మీద వుండే ప్రతి ప్రాణిలోను నేను నివసిస్తాను.కాబట్టి నేనే ఆ క్షేత్రజ్ఞుడిని అని తెలుసుకో!ఈ దేహం,దీని ప్రవర్తనను నిర్దేశించే నన్ను తెలుసుకునే ప్రయత్నంచెయ్యి.క్షేత్రం అనే దేహాన్ని,దాని దిశానిర్దేశం చేసే క్షేత్రజ్ఞుడు అయిన నన్ను కనుక్కోవడమే నిజమయిన జ్ఞానము.అదే యదార్థ జ్ఞానమని నా ప్రగాఢ నమ్మకం.

Wednesday, 6 November 2024

ఇదం శరీరం కౌంతేయ

శ్రీభగవానువాచ.... ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమి త్యభిధీయతే। ఏతద్యోవేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥2॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చెపుతున్నాడు.కౌంతేయా!మనకున్న ఈ దేహాన్ని క్షేత్రం అని అంటారు.ఈ క్షేత్రం గురించి తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు.

Tuesday, 5 November 2024

ప్రకృతిం పురుషః చైవ

అర్జున ఉవాచ... ప్రకృతిం పురుషః చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ। ఏతద్వేదితు మిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ॥1॥ శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అర్జునుడికి అనుమానంవచ్చింది.కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా! ప్రకృతి అంటే ఏంది?పురుషుడు అంటే ఏంది?క్షేత్రము అంటే అర్థం కావటం లేదు.క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు?జ్ఞానము అంటే ఏందో చెప్తావా? జ్ఞేయముకు అర్థం విశదీకరిస్తావా?

Monday, 4 November 2024

యే తు ధర్మ్యామృతమిదం

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే। శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేఽతీవ మే ప్రియాః॥20॥ ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోఽధ్యాయః కృష్ణుడు చెపుతున్నాడు.అర్జునా!నేను చెప్పాను కదా ధర్మాన్ని ఎలా అనుష్టించాలో.ఇది కష్టమే కానీ ఆచరించాలి.దీనిని విశ్వసించాలి.నన్నే నమ్మి ఉపాసన చెయ్యాలి.పైన పేర్కొన్న విథివిథానాలను నమ్మి,ఆచరించేవాడు నాకు మిక్కిలి ప్రియమయిన భక్తుడు. ఇట్లు ఉపనిషత్తు,బ్రహ్మవిద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమయిన భగవద్గీతలో భక్తియోగమను పండ్రెండవ అధ్యాయము సమాప్తము.

Sunday, 3 November 2024

సమశ్శత్రౌ చ మిత్రే చ

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః। శీతోష్ణ సుఖ దుఃఖేషు సమ స్సంగ వివర్జితః॥18॥ తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్। అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః॥19॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.శత్రువులు అయినా,మిత్రువులు అయినా మనం ఒకేలాగా చూడగలగాలి.ఆఖరికి మనంఅందరం ఒకటే కదా!మనలని గౌరవించినా,అవమానపరిచినా సహేతుకంగానే తీసుకోవాలి.చలి అయినా వేడి అయినా సమంగా చూడాలి.ఎండైనా,వానైనా ఒకేలాగా భావించాలి.కష్టాలను,సుఖాలను జీవితంలోకి ఒకేరకంగా స్వీకరించాలి.సుఖాలు వస్తే అంతా మనగొప్పే అని అనుకొని గర్వానికి పోవడం,కష్టాలు వస్తేఅంత వేరేవాళ్ళ తప్పు అని నిందవేసి కృంగిపోవటం మానుకోవాలి.కోరికల చిట్టాను బాగా తగ్గించాలి.కోరికలకు దూరంగా,వీలయితే అసలు లేకుండా ఉండాలి.మనంఅల్ప సంతోషులుగా ఉండాలి.అంటే దొరికిన దానితో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి.మౌనమే ఆభరణంగా ఉండాలి.స్థిరంగా ఉండాలి.సుస్థిరచిత్తంతో ఉండాలి.ఇలాంటి భక్తుడే నాకు ఇష్టుడు,ప్రియుడు.

Saturday, 2 November 2024

యో న హృష్యతి న ద్వేష్టి

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి। శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య స్స మే ప్రియః॥17॥ శ్రీమద్భగవద్గీత..ద్వాదశాధ్యాయము భక్తియోగము భగవంతుడు ఇలా చెపుతున్నాడు.అర్జునా!నాకు లెక్కలు వేసుకునే వాళ్ళు వద్దు.ఏమి లెక్కలు అని అడుగుతావా? చెపుతాను విను.సంతోషం దుఃఖంకి లెక్కలు వేసుకోకూడదు.ఇది శుభం,అది అశుభం అని వ్యత్యాసం చూపించకూడదు.ఏది సుముఖం,ఏది వ్యతిరేకం అనే తేడాలు,గణనం వేసుకోకూడదు.ఈ లెక్కలలో ఎవరికి నూటికి సున్నా వస్తుందో,వారే నాకు ప్రియమయిన భక్తులు.అంటే మన జీవితాలలోకి తొంగిచూసే ప్రతి విషయాన్ని మనస్పూర్తిగా స్వీకరించగలగాలి.ఇది ఎక్కువ,అది తక్కువ,ఇది కష్టం,అది ఇష్టం అని వేరువేరుగా చూడకూడదు.

Friday, 1 November 2024

అనపేక్షః శుచిర్ధక్షః

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః। సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః॥16॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!నా భక్తుడు ఎలాంటి కోరికలు లేనివాడు అయివుండాలి.అంతేనా!అతని మనస్సు కూడా అద్దంలాగా తేటతెల్లంగా ఉండాలి.పరిశుద్ధమయిన మనసు కలిగి ఉండాలి.సమర్థవంతంగా ఉండగలగాలి.ఇన్ని వున్నా తటస్థంగా ఉండగలగటం నేర్చుకోవాలి.దిగులు,విచారం,అన్యాసక్తంగా ఉండకూడదు.వ్యాకులమయిన మనసుతో ఉండకూడదు.ఎలాంటి ఫలితం ఆశించకుండా తన కర్మలను,కర్తవ్యాలను చేసుకుంటూ పోతుండాలి.అంటే కర్మఫల,కర్తృత్వఫల రహితుడుగా ఉండాలి.అట్లాంటి వాడే నాకు ప్రియమయిన భక్తుడు.

Thursday, 31 October 2024

యస్మాన్నోద్విజతే లోకో

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః। హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః॥15॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు అర్జునుడికి తన మనసులో మాట చెపుతున్నాడు.అర్జునా!నాకు అందరి కంటే ఎవరు ఇష్టమో తెలుసా?అతను లోకంలోని ప్రాణికోటిని భయభ్రాంతులకు గురి చేయకూడదు.అట్లా అని తాను కూడా లోకానికి భయపడకూడదు.సుఖదుఃఖాలకు,ఆనందం,ద్వేషం,అసూయలకు అతీతంగా ఉండాలి.భయాందోళనలకు దూరంగా ఉండాలి.చిత్తచాంచల్యానికి ఆమడ దూరంలో ఉండాలి.ఇలాంటి మోహ,తామస గుణరహితుడు నా మనసుకు దగ్గర అవుతాడు.

Wednesday, 30 October 2024

అద్వేష్టా సర్వభూతానాం

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ। నిర్మమో నిరహంకారః సమ దుఃఖసుఖః క్షమీ॥13॥ సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా ధృడనిశ్చయః। మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః॥14॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!సర్వభూతాలయందు కోపం,ద్వేషం లేకుండా వుండాలి.సాటి ప్రాణి మీద మైత్రినీ,దయను పాటిస్తూ ఉండాలి.మన శరీరం మీద,మన ఇంద్రియాల మీద మమకారం లేకుండా ఉండాలి.సుఖానికీ,దుఃఖానికీ అతీతంగా ఉండగలగాలి.ఓర్పు,సహనమూ ఉండాలి.సర్వకాల సర్వావస్ధలయందు సంతోషంగా ఉండాలి.సదా నిర్మల మయిన మనసుతో ఉండగలగాలి.సంకల్పబలంతో,ధృడనిశ్చయంతో మనసునీ,బుద్ధినీ నాయందు కేంద్రీకరించాలి.ఈ సుగుణాలు అన్నీ ఉండే భక్తుడు నాకు ప్రియమయిన వాడు.

Tuesday, 29 October 2024

శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్

శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే। ధ్యానాత్కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరమ్॥12॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు చెపుతున్నాడు.అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది.జ్ఞానం కంటే ధ్యానం గొప్పది.జ్ఞానం,ధ్యానం కంటే కర్మఫలత్యాగం శ్రేష్టమయినది.మనది అనుకున్నది ఏదీ మనము సహజంగా ఒదులుకునే దానికి ఒప్పుకోము.ఆ భావనకే వణికి పోతాము.అలాంటిది మనం కష్టపడి సాథించుకున్నది వేరే వాళ్ళకు ధారాదత్తం చేయటం సామాన్యమయిన విషయం కాదు.ఆ త్యాగ బుద్ధిని అలవరుచుకుంటే మనలని మించిన వాళ్ళు ఉండరు.ఈ త్యాగం వలన మనసుకు శాంతి చేకూరుతుంది.చివరకు ముక్తికి సోపానం అవుతుంది.

Monday, 28 October 2024

అథైతదప్యశక్తోఽసి

అధైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః। సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్॥11॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు ఎంత భక్త సులభుడో ఇక్కడ అర్థం అవుతుంది.అర్జునుడితో అంటున్నాడు.అర్జునా! నిశ్చల భక్తితో మనసు లగ్నం చెయ్యలేవు.అభ్యాస యోగంతో నన్ను పొందలేవు.దైవీ కర్మలను చెయ్యలేవు.అలాంటప్పుడు మనో నిగ్రహంతో నన్ను శరణు పొందు.నీవు చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నాకే అర్పించు.నాశరణు జొచ్చిన వాళ్ళను నేను వదులుకోను.

Sunday, 27 October 2024

అభ్యాసేఽప్య సమర్థోఽసి

అభ్యాసేఽప్య సమర్థోఽసి మత్కర్మ పరమోభవ। మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి॥10॥ శ్రీమద్భగవద్గీత.... ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇంకో కిటుకు కూడా చెపుతున్నాడు.అర్జునా!నీకు ఒకవేళ నిశ్చలభక్తితో మనసును లగ్నం చేయటం చేతకాలేదు.దిగులు పడవద్దు.అభ్యాసయోగంతో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి.అదీ చేతకాలేదు అనుకో అప్పుడు ఇంకో మార్గం కూడా చెపుతాను.నాకు సంబంధమయిన దైవకార్యక్రమాలు చెయ్యి.శ్రద్ధగా చెయ్యాలి సుమా!అలా శ్రద్ధ పెట్టి నాకు సంబంథించిన కార్యక్రమాలు చేస్తే ఖచ్ఛితంగా సిద్ధి పొందుతావు.

Friday, 25 October 2024

అథ చిత్తం సమాధాతుం

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం। అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ॥9॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇంకో మార్గం కూడా చెపుతున్నాడు.అర్జునా!నిశ్చలమయిన భక్తి వుండాలి.ఆ నిశ్చలమయిన భక్తితో మనస్సును లగ్నం చెయ్యాలి.ఇది అంత సులభం కాదు.అలాంటప్పుడు ఏమి చెయ్యాలో చెపుతా విను.అభ్యాసం అనేది చాలా కీలకమైనది.అభ్యాస యోగంతో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి.సఫలీకృతుడవు అవుతావు.ఏది అయినా మనం అభ్యాసంతో సాథించవచ్చు.

Thursday, 24 October 2024

మయ్యేవ మన ఆధత్స్వ

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ। నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయః॥8॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తియోగము కృష్ణుడు అర్జునుడికి అర్థం అయ్యేలాగా సరళంగా చెపుతున్నాడు.అర్జునా!నువ్వు నా యందు మనసును లగ్నం చెయ్యి.అలాగే పనిలో పనిగా బుద్థిని కూడా నా మీదే ఉండేలా చూసుకో.ఇప్పుడు ఇంక నన్ను ధ్యానించటం మొదలు పెట్టు.అప్పుడు ఇక ఎల్లప్పుడూ నా యందే ఉంటావు.దానిలో ఇంక ఎలాంటి అనుమానాలు,సంశయాలు లేనే లేవు.

Tuesday, 22 October 2024

యేతు సర్వాణి కర్మాణి

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః। అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే॥6॥ తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్। భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసామ్॥7॥ శ్రీ మద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము కృష్ణుడు చెబుతున్నాడు.పార్థా!అందరూ వాళ్ళు చేసే ప్రతిపని యొక్క ఫలాలను నాకు అర్పించాలి,అందించాలి.నన్నే పరమావధిగా నిర్ణయించుకోవాలి.నన్ను ఏకాగ్రచిత్తంతో ధ్యానించాలి.ఈసంసారమనే సముద్రం మృత్యురూపమయినది.కాబట్టి ఈ సంసారమనే సాగరాన్ని సులభంగా దాటుకుని,తరించేటట్లు చేస్తాను.నేను శాశ్వతంగా ఉండేవాడిని.నాకు జరామరణాలు లేవు.అట్లాంటి నన్ను పొందేలా చేస్తాను.

Sunday, 20 October 2024

సంనియమేంద్రియగ్రామం

సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః। తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః॥4॥ క్లేశోఽధిరతరస్తేషాం అవ్యాక్తాసక్త చేతసాం। అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి రవాప్యతే॥5॥ శ్రీమద్భగవద్గీత....ద్వాదశాధ్యాయము భక్తియోగము కృష్ణుడు అదే చెప్తున్నాడు.విగ్రహారధన అయినా,లేక నిరాకార బ్రహ్మను పూజించినా ఫలితమొక్కటే.సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమయినది.అంటే నిర్గుణోపాసన యొక్క సాథన సామాన్యం కాదు.చాలా కష్టమయినది.దాని ఉపాసన చాలా కఠినమయినది.అవ్యక్తమయిన ఆ నిర్గుణ బ్రహ్మ మామూలు మనుష్యులకు వల్లకాదు.అంటే దేహంపైన మోహం వుండేవాళ్ళు నిరాకారమయిన బ్రహ్మతత్త్వాన్ని అర్థం చేసుకోలేరు.కాబట్టి అది దక్కటం కష్టం.ఒకరకంగా చెప్పాలంటే దుర్లభం.

Friday, 18 October 2024

యే త్వక్షర మనిర్దేశ్యం

యే త్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే। సర్వత్రగ మచింత్యం చ కూటస్థ మచలం ధృవం॥3॥ సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః। తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః॥4॥ కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అవ్యక్తమయిన నా రూపాన్ని ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో,వాళ్ళు ద్వంద్వాతీతులు అవుతారు.సర్వభూతరహితులు అవుతారు.అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి వుంటారు.మనసునకు,వాక్కునకూ కనిపించనిదీ,గోచరంకానిదీ,సర్వత్రా వ్యాపించి వుండేదీ,మాయాకారణమూ,అచలమూ,నిత్యసత్యమూ అయిన నిరాకారబ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు నన్నే పొందుతారు.అంటే ఏ రకంగా పూజించినా భగవంతుడు భక్తులను కరుణిస్తాడు.దగ్గరకు తీసుకుంటాడు.మార్గాలు వేరైనా గమ్యంఒకటే కాబట్టి,ఫలితం ఇద్దరుకీ ఒకేలాగే దక్కుతుంది.

Thursday, 17 October 2024

మయ్యావేశ్య మనో యే మాం

శ్రీ భగవానువాచ... మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే। శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః॥2॥ శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము భక్తి యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సమాథానం ఇస్తున్నాడు.సతతం,నిర్వికారంగా నన్నే మనసులో కొలవాలి.మనసు పరిపరి విథాలుగా ప్రక్కకు పోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను ఉపాసన చెయ్యాలి.ఎవరైతే వారి మనసులలో నన్ను సదా నిలుపు కుంటూ,ఉపాసన చేస్తారో,అలాంటి భక్తులే శ్రేష్టమయిన యోగులు.

Wednesday, 16 October 2024

ఏవం సతతయుక్తా యే

అర్జున ఉవాచ... ఏవం సతత యుక్తా యే భక్తాస్త్వాంపర్యుపాసతే। యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః॥1॥ శ్రీనద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము..భక్తి యోగము ఇంక భక్తి యోగము మొదలవుతుంది.అర్జునుడు కృష్ణుడిని అడుగు తున్నాడు.కొంతమంది ఒక ఆకారాన్ని పూజిస్తారు.ఇంకొంత మంది నిరాకారాన్ని పూజిస్తారు.ఈ రెండు రకాల మనుష్యులలో ఎవరు గొప్పవారు?సగుణ స్వరూపాన్ని ఉపాసన చేసే వాళ్ళు యోగవిదులు అవుతారా?లేక నిర్గుణబ్రహ్మాన్ని ధ్యానించేవాళ్ళు మోక్షానికి దగ్గర అవుతారా?

Tuesday, 15 October 2024

మత్కర్మ కృన్మత్పరమో

మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ!॥55॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు కొస మెరుపుగా ఇలా చెప్పాడు.అర్జునా,కాబట్టి నా కోసమే కర్మలు చెయ్యి.నన్నే నమ్ముకో.నా మీదే భక్తి ప్రపత్తులు పెంచుకో.అప్పుడు నువ్వు నన్ను పొందగలవు.ఇది నేను నీ ఒక్కడికే చెప్పటం లేదు.ఈ అనంత విశ్వంలో వుండే సమస్త ప్రాణి కోటికి చెపుతున్నాను.ఈ విశ్వంలో నా కొరకే కర్మలు చేస్తూ,నన్నే నమ్ముకొని,నాయందే భక్తితో చరిస్తూ.నిస్సంగుడైనవాడు మటుకే నన్ను పొందగలడు.ఈ విషయం గుర్తు పెట్టుకో.

Monday, 14 October 2024

భక్త్యా త్వనన్యయా శక్య

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోఽర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప॥54॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అందరూ నన్ను ఎలా తెలుసుకోవాలి అని పరితపిస్తుంటారు.నా విశ్వరూపం చూడాలంటే ఏమేమి చెయ్యాలి అని తహ తహ లాడుతుంటారు.నాలో ప్రవేశించే మార్గాలు వెతుకుతుంటారు.అనన్యమయిన భక్తి మార్గమే వీటన్నిటినీ సాధంచే ఏకైక సాధనం.

Sunday, 13 October 2024

నాహం వేదైర్న తపసా

నాహం వేదైర్న తపసా నదానేన న చేజ్యయా। శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా॥53॥ శ్రీ మద్భగవద్గీత.... ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.నీకు దక్కిన ,నీవు చూడగలిగిన నా ఈ విశ్వరూపము అనేది చిన్నా చితక విషయం కాదు.ఆషామాషీ వ్యవహారం అసలే కాదు.ఈ అపూర్వ అవకాశం అనేది నాలుగు వేదాలు చదివినా దక్కదు.ఎన్ని పూజలు చేసినా దొరకదు.ఒంటి కాలి పైన నిలుచుకొని ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసినా అనుగ్రహించదు.అంతటి అపురూపమయిన అవకాశం నీకు దక్కింది.

Saturday, 12 October 2024

సుదుర్దర్శమిదం రూపం

శ్రీ భగవానువాచ... సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ। దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః॥52॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడుతో అతను ఎంత అదృష్టవంతుడో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు నా విశ్వరూపం చూపించాను కదా!అది చూడగలగటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.అది అంత తేలికగా,సులభంగా అందరికీ దక్కదు.నా ఈ విశ్వరూపాన్ని చూసి తరించాలని దేవతలు,మునులు జన్మ అంతా పరితపిస్తుంటారు.కానీ నేను నీకు ఆ సౌలభ్యం కల్పించాను.

Friday, 11 October 2024

దృష్ట్వేదం మానుషం రూపం

అర్జున ఉవాచ.... దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన! ఇదానీమస్మి సంవృత్త స్సచేతాః ప్రకృతిం గతః॥51॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము అర్జునుడికి చాలా స్ధిమితంగా వుంది.ఇంకా చాలా సంతోషంగా వుంది.ఈ విషయాన్ని కృష్ణుడితో ఇలా పంచుకుంటున్నాడు.హే జనార్దనా!నీ విశ్వరూపం చూసిన తరువాత,నిన్ను మాములుగా చూస్తుంటే నాకు చాలా హాయిగా వుంది.చాలా ప్రశాంతంగా వుంది.సౌమ్యంగా వుండే నీ ఈ మానవరూపం నా కళ్ళకు చాలా ఇంపుగా కనిపిస్తుంది.నా మనసు ఇప్పుడు కుదుట పడింది.ఇంతసేపటికి నా ప్రాణం స్ధిమిత పడింది.

Thursday, 10 October 2024

ఇత్యర్జునమ్ వాసుదేవస్తథోక్త్యా

సంజయ ఉవాచ---- ఇత్యర్జునమ్ వాసుదేవస్తథోక్త్యా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా॥50॥శ్రీ మద్భగవద్గీత ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కురుక్షేత్రంలో జరిగేదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెపుతున్నాడు కదా!ఇప్పుడు ఇలా చెప్పుకొస్తున్నాడు.ధృతరాష్ట్రా!శ్రీ కృష్ణుడు పై విథంగా అర్జునుడిని అనునయించాడు.ఈ జగత్తు అంతా భయపడేటటువంటి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.అర్జునుడికి అలవాటు అయిన తన పూర్వ రూపం సంతరించుకున్నాడు.ఇప్పుడు సౌమ్యంగా కనిపిస్తున్నాడు.సాధారణంగా వున్నాడు.భయపడిపోయిన అర్జునుడిని ఓదారుస్తున్నాడు.అప్పుడు ఏమైందో చెపుతాను విను.

Wednesday, 9 October 2024

మా తే వ్యథా మా చ విమూఢభావో

మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోర మీదృజ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య॥49॥శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా!నన్ను ఈ భయంకరమైన రూపంలో చూసి భయపడవద్దు.తత్తర బిత్తర కావద్దు.చపలచిత్తుడవు కావద్దు.దిగులు పడవద్దు.దుఃఖితుడవు కావద్దు.నేను నీకు థైర్యం ఇస్తున్నాను.మాములువాడివి కా.స్వస్థుడివి అవు.నీకు భయం కలిగించని నా పూర్వరూపం లోనే నీకు కనిపిస్తాను.నీకు ప్రేమ కలిగించే విథంగానే నాబాహ్యరూపం వుంటుంది.నీవు ఏమాత్రం చింతించకు.

Tuesday, 8 October 2024

న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః

న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర॥48॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.హే కురువీరా!వేదాలు చదివినంత మాత్రాన ఎవరూ నా ఈ విశ్వరూపాన్ని చూడలేరు.అలా అని వాదాలు చేసినా లాభం లేదు.క్రతువులు చేసినా,కర్మలనాచరించినా ఎవరికీ వల్లకాదు.దానాలు చేసినా,దారుణ తపస్సులు చేసినా నేను కనికరించను.ఆఅదృష్టం నీ కొక్కడికే దక్కింది.నా ఈరూపాన్ని మాత్రం ఈ లోకంలో నువ్వు తప్ప ఇతరులెవరూ చూడలేకపోయారు.

మయా ప్రసన్నేన తవార్జునేదం

శ్రీ భగవానువాచ.... మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మ యోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్॥47॥ శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము... విశ్వరూప సందర్శన యోగము శ్రీకృష్ణుడు అర్జునుడిని కరుణించాడు.ఇలా మంచిగా,అనునయంగా చెబుతున్నాడు.అర్జునా!నీ మీద నాకు ఎంతో ప్రేమ వుంది.అందుకనే నీ మీద కరుణతో నా యోగశక్తి ప్రభావం చేత అనంత తేజోభరితమయిన నా ఈ విశ్వరూపాన్ని నీకు చూపించాను.నీకు ఈ విషయం తెలుసా?నా ఈ రూపాన్ని చూసేదానికి దేవతలు,యోగులు పరితపిస్తుంటారు.కానీ వారెవరికీ సాథ్యం కాలేదు.ఇంత వరకూ నా ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప ఇంకవ్వరూ చూడలేదు.

Monday, 7 October 2024

కిరీటినం గదినం చక్రహస్తం

కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం త థైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో!భవవిశ్వమూర్తే!॥11॥ శ్రీమద్భగవద్గీత..ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు తన ప్రియసఖుడిని తనకు అలవాటు అయిన రూపంలో చూడాలనుకుంటున్నాడు.లేకపోతే ఆదగ్గరతనం,ఆ సఖ్యత అనుభవించలేక పోతున్నాడు.అందుకనే ఇలా బతిమలాడుకుంటున్నాడు.కృష్ణా!నేను నిన్ను మాములుగా కిరీటం,గద,చక్రాలతో చూడాలనుకుంటున్నాను.ఓవిశ్వరూపా!ఓ సహస్రబాహో!చతుర్భుజాలతో,నీ మామూలు రూపంతో నాకు దర్శనమివ్వు.నన్ను అలాఆనందింపచెయ్యి.

Sunday, 6 October 2024

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే త దేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస॥45॥ శ్రీ మద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము.. విశ్వరూప సందర్శన యోగము మనము మాములుగా గుడికి పోతే ఏమి చేస్తాము?ఒక్కసారి దేవుడిని చూస్తాము.తరువాత మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుని,మన కోర్కెలు కోరుకుంటాము.ఎక్కువ మంది వుండి,గర్భగుడిలో ఎక్కువ సేపు వుండలేక పోతే దిగులు పడతాము.కానీ ఖాళీగా వున్నా ఎక్కువ సేపు చూస్తూ వుండలేము. ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అదే.అందుకే కృష్ణుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు.స్వామీ!ఇంతకు ముందెప్పుడూ నీ ఈ రూపం చూడలేదు.ఇంత అద్భుతమైన రూపాన్ని ఎక్కడా ఎప్పుడూ కనీ,విని ఎరుగ లేదు.ఇదంతా చూసి నా మనసు ఆవేశంతో కలవరపడుతుంది.ఓదేవాది దేవా!నా మీద దయ వుంచు.నువ్వు నీ పూర్వరూపాన్ని సంతరించుకో.నా ఈవిన్నపం మన్నించు.నీ పూర్వరూపాన్ని పొంది నన్ను అనుగ్రహించు.

Saturday, 5 October 2024

తస్మాత్ప్రణమ్య ప్రణి ధాయకాయం

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహ మీశ మీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్॥44॥ శ్రీమద్భగవద్గీత--ఏకాదశాధ్యాయము--విశ్వరూప సందర్శన యోగము మనము మాములుగా ఏమి చేస్తాము?మన అనుకునే వాళ్ళను ఒకలా చూస్తాము,పరాయి అనుకునే వాళ్ళను ఇంకోలా చూస్తాము.మన వాళ్ళకు అంతా మంచిని ఆపాదిస్తాము.ఎదుటి వాళ్ళ మాటలను,చేష్టలను భూతద్దంలో పెట్టి తప్పొప్పులు వెదుకుతాము. అందుకే అర్జునుడు ఇలా అంటున్నాడు.స్వామీ!నీకు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాను.ఒక తండ్రి తన బిడ్డ తప్పును ఎలా క్షమిస్తాడో అలా నా తప్పులు క్షమించు.ఒక స్నేహితుడు తన మిత్రుడి తప్పులను ఎలా అర్థం చేసుకుని,సర్దుకుంటాడో అలా నేను చేసిన తప్పులను సర్దుకో.ఒక ప్రియుడు తన ప్రియురాలి విషయంలో,ఆమె చేసిన తప్పులను అసలు తప్పులుగానే మనసుకు తీసుకోడో,అలా నా తప్పులను అసలు లెక్కలోకి తీసుకోవద్దు. ఇలా తన తప్పులను మనసుకు తీసుకోవద్దు అని బతిమలాడుతున్నాడు.

Thursday, 3 October 2024

పితాఽసి లోకస్య చరాచరస్య

పితాఽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్య ప్రతిమప్రభావ!॥43॥ శ్రీ మద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము 11 అర్జునుడికి చిన్న చిన్నగా అర్థం అవుతుంది.కృష్ణుడు సామాన్యుడు కాదు,అసమాన్యుడు అని.అందుకే తన మనసులో భావాలను ఇలా వ్యక్తపరుస్తున్నాడు.హే కృష్ణా!ఈ జగత్తుకు నీవే తండ్రివి.నీవే పూజనీయుడివి.అగ్ర తాంబూలం తాసుకునే దానికి అర్హుడివి.ఆది గురువువు నీవు.నీకు సరి సమానమైనవాడు ఈ ముల్లోకాలలో ఎవరూ కానరావటం లేదు.నీకు సరి సమానమైన వాడే లేడంటే,నీకంటే గొప్పవాడు,నీకంటే అధికుడు ఇంకెక్కడ వుంటాడు?

Thursday, 12 September 2024

యచ్చాపహాసార్థ మసత్కృతోఽసి

యచ్చాపహాసార్థ మసత్కృతోఽసి విహార శయ్యాసన భోజనేషు ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహ మప్రమేయమ్॥42-11 విశ్వరూప సందర్శన యోగము మనం మన మిత్రులతో ఎలా వుంటాము?సరదా సరదాగా వుంటాము.తమాషాలు పడుతూ వుంటాము.తన్ను కుంటాము,మళ్ళీ అంతలోనే క్షమాపణలు చెప్పుకుంటాము.మళ్ళీ ఒకటై పోతాము.స్నేహితుల మథ్యలో ఎవరైనా దూరితే వాళ్ళు వెర్రి వెంగళప్పలు అయి పోతారు. కృష్ణార్జునులు కూడా అంతే.మంచి స్నేహితులు.దానికి తోడు బావా బావమరుదుల సంబంథం.ఇక చెప్పాలనా వాళ్ళ అన్యోన్యత! ఇప్పుడు అర్జునుడు అదే అంటున్నాడు కృష్ణుడితో.కృష్ణా!నేను నీ తోటి బోజనాలు చేసే సమయంలో,విహారానికి వెళ్ళినప్పుడు,నిద్రకు ఉపక్రమించేటప్పుడు,ఇలా చాలా సార్లు చాలా సందర్భాలలో తమాషాలు పడ్డాను.నీతో పరిహాసాలాడాను.మనం పదిమందిలో వున్నప్పుడూ ఎక్కిరించాను.ఒంటరిగా మనం మటుకే వుండేటప్పుడూ ఎకచకాలాడాను.నీవు ఇంత గొప్ప మహాత్ముడివని అప్పట్లో నాకు తెలియదు.కాబట్టి నా ఈ నోటి తుత్తరకు,నోటిదూలకు క్షమించు.

Wednesday, 11 September 2024

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమదాత్ప్రణయేన వాపి॥41-21 విశ్వరూప సందర్శన యోగము మనము స్నేహితులతో చాలా చనువుగా వుంటాము.ఒరేయ్,రేయ్ అనుకుంటాము.ఏమే,మేయ్ అనుకుంటాము.పేర్లు,ముద్దు పేర్లు పిలుచుకుంటాము.కులాలతో పిలుచుకుంటాము.పొట్టి,పొడుగు,తెలుపు,నలుపు ...ఇలా ఎలాగైనా పిలుచుకుంటాము.అది ఎదుటి వాళ్ళను తక్కువ చేయటం కాదు.అతి చనువు మీద చేస్తాము.ఉన్నట్టుండి ఆ స్నేహితులు మనకంటే చాలా గొప్ప వాళ్ళు,చాలా ఎత్తులో వున్నారు అని తెలుస్తే ఒక్క సారిగా ఖంగు తింటాము.వాళ్ళను ఎలా పలకరించాలో అర్థంకాదు.ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే వుంది.ఇన్ని రోజులు కృష్ణుడిని ప్రేమ వల్లనో,పొరపాటు వల్లనో,అతి చనువుతోనో ఎట్లంటే అట్లా పిలిచేవాడు.ఒక సారి కృష్ణా అని పిలిస్తే,ఇంకోసారి యాదవా అని పిలిచేవాడు.మరొకసారి సఖా అని సంబోధించేవాడు.ఇట్లా చాలా మాములుగా నోటికి ఎలా పిలవాలనిపిస్తే అట్లా పిలిచాడు.అప్పుడంతా అతనికి కృష్ణుడి గొప్పతనం తెలీదు.ఇప్పుడు అతనికి తన మునుపటి చర్యలు ఇబ్బందికరంగా వున్నాయి.

Tuesday, 10 September 2024

వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః

వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే॥39-11 విశ్వరూప సందర్శన యోగము మన ఇంట్లో మనమే గొప్ప.వీధి లో పెద్ద మనిషి వెనక పది ఇరవై మంది వుంటారు.చిన్న పాటి నాయకుడి వెనక వందల్లో వుంటారు.రాష్ట్ర స్థాయి వాళ్ళకు లక్షల్లో,అంచర్జాతీయ స్థాయి వాళ్ళకు కోట్లలో వుంటారు. మరి విశ్వవ్యాపకుడిని నమ్ముకుని ఇంకెంత మంది వుండాలి?!!! ఇక్కడ అర్జునుడు అదే అంటున్నాడు.హే కృష్ణా!ఈ ప్రపంచం మొత్తం నీ తోనే వుంది.నీ లోనే వుంది.నువ్వుఅంతా తెలిసినవాడవు.అందరూ తెలుసుకోవలసిన వాడవు.అందరికీ కావాలసినవాడవు.నువ్వు ఆదిదేవుడవు!పురాణపురుషుడవు!జగదాధారుడవు!పరంధాముడవు! యముడు,వాయువు,అగ్ని,వరుణుడు,బ్రహ్మ,సూర్యుడు,చంద్రుడు...అందరూ నువ్వే!బ్రహ్మను కన్న తండ్రివి కూడా నువ్వే! అటువంటి నీకు సాష్టాంగ దండ ప్రమాణాలు.నీకు అనేకానేక నమస్కారాలు.తిరిగి తిరిగి నమస్కారాలు సమర్పిస్తున్నాను.స్వామీ!దయయుంచి స్వీకరించు.

Saturday, 7 September 2024

కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్

కస్మాచ్చ తే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస! త్వమక్షరం సదసత్తత్పరం యత్॥37-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు కృష్ణుడిని పొగుడుతున్నాడు.అతని గొప్పదనంతెలిసింది.తనకు దిశా నిర్దేశం చేసేది అతనే అని అర్ధం అయింది. మహాత్మా!నీవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలపురుషుడవు.నీకు నమస్కరించని వాళ్ళు ఎవరు వుంటారు?హే అనంతా!హే జగన్నివాసా!సత్తువు,అసత్తువు రెండింటికీ మూల కారణం నీవే.నిశ్చల మైనది,శాశ్వతనైనది సత్తు.మార్పునకు లోనయ్యేది,అశాశ్వతనైనది అసత్తు.

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్॥33-11 విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా! నేను చెప్పేది అర్థం అవుతుందా?యుద్ధానికి సమాయత్తం కా!శత్రు సంహారం చెయ్యి.ఈ అఖండ భూమండలాన్ని అనుభవించు.కౌరవ సైన్యం,వారి తట్టు వాళ్ళందరూ ఇంతకు ముందే నా చేత చంప బడ్డారు అని భావించు.నీవు నిమిత్తమాత్రుడివి అని అర్థం చేసుకో.అలానే భావించు.నీ కర్తవ్యం నీవు పూర్తి చెయ్యి.అఖండ కీర్తిని,విజయలక్ష్మిని చేజిక్కించుకో!

కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో

కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః॥32-11 విశ్వరూప సందర్శన యోగము మనకు కోపం వస్తే ఏమి చేస్తాము?ఊగి పోతాము.అందులో ఎదుటి వాడు తప్పు చేస్తున్నాడు,దాని వలన మనం నష్ట పోతున్నాము అంటే ఇంక చెప్పనక్కరలేదు.ఒక రాగాన మామూలు కాలేము.నరసింహావతారంలో కూడా హిరణ్యకశిపుడిని చంపగానే,ఆ దేవుడే వెంటనే మామూలు కాలేక పోయాడు కదా! ఇక్కడ కూడా అంతే.మంచి వాళ్ళైన పాండవులకు అన్యాయం జరుగుతుంది.ధర్మం కుంటుపడుతుంది.అధర్మం రెక్కలు విచ్చుకుని స్వైరవిహారం చేస్తుంది.మరి భగవంతుడికి కోపంరాదా!ధర్మరక్షణ చెయ్యాల్సిన సమయంరాలేదా?కాలేదా? అందుకే కృష్ణుడు అర్జునుడికి సమాధానం ఇస్తున్నాడు.ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాల స్వరూపుడిని నేను.ప్రస్తుతం దుష్ట సంహారానికి పూనుకువ్నాను.నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే సరే!చెయ్యక పోయినా సరే.నువ్వు తప్ప మీ ఉభయ పక్షాలలో ఏ ఒక్కరూ మిగులుతారనేది మిథ్య.అసంభవం.ఈ దుష్టులనందరినీ సంహరించేదాకా నేను నిద్రపోను.

Friday, 6 September 2024

అఖ్యాహి మే కో భవానుగ్రరూపో

అఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తుతే దేవవర!ప్రసీద విజ్ఞాతు మిచ్ఛామి భవంత మాద్యం న హి ప్రజానామి తవ ప్రవత్తిమ్॥31-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడికి దిక్కు తోచడంలేదు.మంటలలోకి దూకే మిడతల దండులా సమస్త రాజవంశం లోని వీరులందరూ విశ్వరూపం యొక్క అనంత ముఖాలలోకి దూసుకు పోతున్నారు.ఆయన యొక్క భీకరమయిన రూపం చూసి జగత్తు అంతా తపించి పోతుంది.సర్వ లోకాలనూ మింగేస్తున్నాడు.అర్జునుడు వేడుకుంటున్నాడు. ఓ దేవదేవా!నీకు దండ ప్రమాణాలు చేస్తున్నాను.నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.ఇంత భయంకర స్వరూపుడవు అయిన నువ్వు ఎవరివి?దయచేసి నువ్వెవరో చెప్పు.నీ వివరాలన్నీ చెప్పు.ఇంత కోపం దేనికి?ఇంతటి ఉగ్రరూపం దాల్చేదానికి కారణాలు ఏంది?ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?నీ ఈ ప్రవర్తనకు అర్ధం,పరమార్ధం నా బుర్ర గ్రహించలేక పోతున్నది.

Thursday, 5 September 2024

యథా నదీనాం బహవోఽంబువేగాః

యథా నదీనాం బహవోఽంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి॥28-11 విశ్వరూప సందర్శన యోగము పిల్ల కాలువలు నదిలో కలుస్తాయి.నదులన్నీ సముద్రం లో ఏకమవుతాయి.ఇది వాటి సహజ గుణం.అలానే మనమందరమూ ఆపరబ్రహ్మ నుండే పుట్టాము.మళ్ళీ ఆ విశ్వేశ్వరుడిలోకే లయమవుతాము. ఇక్కడ అర్జునుడు చూస్తుంటే,సమస్త రాజలోకమూ ఆ విశ్వకర్మ యొక్క భయంకరమయిన ముఖాగ్ని లోపలికి పొర్లి పోతుంది.దాంట్లో అనేక మంది రాజులు వున్నారు.కౌరవులుఅందరూ వున్నారు.భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు,ఇంకా చాలా మంది యోధులూ వున్నారు.ఆఖరికి పాండవుల పక్షంలోని వీరులుకూడా చాలా మంది కనిపించారు.

Wednesday, 4 September 2024

దంష్ట్రా కరాళాని చ తే ముఖాని

దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస॥25-11 విశ్వరూప సందర్శన యోగము మాములుగా చాలా మందికి చీకటి అంటే భయం. కొన్ని సార్లు నిశబ్దంగా వున్నప్పుడు వంటింట్లో పళ్ళెం చెయ్యి జారి కింద పడినా గుండె ఝల్లు మంటుంది మనకు.ఇలా చాలా మందికి చాలా రకాల భయాలు వుంటాయి.కొన్ని సార్లు ఎదుటి వాళ్ళ భయాలు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి.ఇక్కడ అర్జునుడు విశ్వరూపం చూసి భయపడకుండా వుంటాడా,ఎంత వీరుడు,శూరుడు,విక్రమార్కుడైనా!! ఆ విశ్వరూపానికి భయంకరమైన కోరలు,దంతాలు వున్నాయి.ఆ ముఖాలు అన్నీ కాలాగ్నిలా,అగ్ని గోళాలు లాగా వెలిగి పోతున్నాయి.అన్నేసి వున్న ఆ ముఖాలు,కాళ్ళు,చేతులు,ఉదరాలు,ఆయుధాలు,భగ భగ మండే నేత్రాలు..... వీటన్నిటినీ ఒక్కసారిగా చూసేటప్పటికి అర్జునుడు ఖంగు తిన్నాడు,భయపడి పోయాడు. భగవంతుడా,విశ్వేశ్వరా! నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది.నన్ను కాపాడు స్వామీ!నన్ను కరుణించు జగత్ రక్షకా!అని వేడుకుంటున్నాడు.

Monday, 2 September 2024

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితా స్తథాఽహం॥23-11 విశ్వరూప సందర్శన యోగము మనం నలుగురు పిల్లలని కని,పెంచి,పెద్ద చెయ్యాలంటే,నానా అగచాట్లు పడతాము.మన రెండు చేతులా సంపాదించినా చాలదు.మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ కష్టపడినా చాలదు.అందుకని ఒక్కరు ముద్దు,ఇద్దరు చాలు,ఆ పై ఇక వద్దనే వద్దు అని భీష్మించుకుంటాము.కానీ భగవంతుడు అలా అనుకోలేడు కదా!ఈ సృష్టి మొత్తం అతనే పుట్టించి,పెంచి,పోషించి,మళ్ళీ లయం చెయ్యాలి కదా!మరి అతనికి ఎన్ని చేతులు,కాళ్ళు,నోళ్ళు వుండాలి?ఎంత బలంగా వుండాలి?ఎంత నిష్టగా,నిరంతరం పాటు పడుతూ వుండాలి? అర్జునుడికి విశ్వరూపంలో అదే కనిపిస్తుంది.విశ్వ రూపానికి అనేక ముఖాలు వున్నాయట.అనేక నేత్రాలు,చేతులు,తొడలు,పాదాలు,కోరలు,ఉదరాలు వున్నాయి.మొత్తానికి అంతా చాలా భయానకంగా వుంది చూసేదానికి.ఇదంతా చూడటానికి సమస్త లోకాలు భయం తో వణికి పోతున్నాయి.వాటన్నిటితోటి అర్జునుడు కూడా భయభ్రాంతుడు అవుతున్నాడు.

Sunday, 1 September 2024

అనాది మధ్యాంత మనంతవీర్య

అనాది మధ్యాంత మనంతవీర్య మనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్॥19-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు ఇంకా ఇంకా చూస్తున్నాడు.చూస్తూనే వున్నాడు.ప్రతిదీ కొత్త కొత్తగా వుంది.అత్యద్భుతంగా వుంది.అదంతా చెప్పేదానికి ఆయనకు మాటలు రావటంలేదు,చాలటం లేదు.అయినా అన్నీ చెప్పేదానికి,నెమరు వేసుకుంటున్నాడు. భగవంతుడి విశ్వరూపం ఆదిమధ్యాంతరహితంగా వుంది.అంటే దానికి మొదలు,మధ్య,అంతం కనిపించడంలేదు,అసలు లేదు.అపరిమితమయిన శక్తి కలిగి వుంది.అది అనంత బాహువులతో కూడి వుంది. సూర్యుడు,చంద్రుడే దానికి కళ్ళుగా మిరిమిట్లు గొలుపుతున్నాయి.దాని ముఖం ప్రజ్వలిస్తున్న అగ్నిలా ప్రకాశిస్తున్నది.తన తేజస్సుతో సమస్త విశ్వాన్నీ తపింపచేస్తున్నది.సూది మొన మోపేందుకు కూడా వీలు లేనంతగా,చోటు లేనంతగా దిక్కులన్నింటా నిండి వుంది.ముల్లోకాలను చుట్టుముట్టి వుంది.ఆ మహోగ్రరూపాన్ని చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి.కానీ నేను అర్థం చేసుకుంటున్నాను.

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్॥15-11 విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు తన విశ్వరూపం చూపించగానే మొదట అర్జునుడు అవాక్కైనాడు.నోట మాట రాలేదు.గొంతు గద్గదమైపోయింది.శరీరం పైనరోమాలు నిక్కబొడుచుకువ్నాయి.శరీరం పులకించింది.ఆశ్చర్యం,ఆనందం ముప్పిరిగొన్నాయి.మౌనంగా రెండు చేతులు జోడించి,మనస్పూర్తిగా నమస్కారం చేసుకున్నాడు.ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది? కొంచెం సేపటికి తనకు తానే తేరుకుని ఇలా అంటున్నాడు.హే భగవాన్!నీ ఈ రూపం దివ్యమైనది.అతి మానుషంగా వుంది.దీనికి ఆది అంతం చెప్పనలవి కాకుండా వుంది.నీ విశ్వరూపంలో నాకు చాలా చాలా కనిపిస్తున్నాయి.ఇక్కడ నాకు సమస్త దేవ గణాలు కనిపిస్తున్నాయి.భూతగణాలు కనిపిస్తున్నాయి.పద్మంలో కూర్చుని వున్న చతుర్ముఖుడైన,సృష్టికర్త బ్రహ్మ కనిపిస్తున్నాడు.మహర్షులు కనిపిస్తున్నారు.పన్నగులు కనిపిస్తున్నారు.

Thursday, 29 August 2024

అనేక వక్త్ర నయనం

అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్॥10-11 అనుకోకుండా మనకు మంచి జరిగితే అందరూ ఏమంటారు?నక్క తోక తొక్కాడు రా వీడు అని అంటారు కదా!ఇక్కడ సంజయుడిది కూడా అలాంటి అదృష్టమే!మహా మహులు,హేమాహేమీలు,గురువులు,యోగులు ఎంత మంది వున్నా,అర్జునుడితో పాటు ఆయనకు కూడా భగవంతుడి విశ్వ రూపం చూసే అదృష్టం దక్కింది. పిల్లి పిల్లి తన్నుకుంటే మధ్యలో కోతి లాభ పడిందట!అలాగే పాండవులు,కౌరవులు తన్నుకుంటే,సంజయుడు లాభ పడ్డాడు.ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.ఆయన మామూలు గుడ్డి కాదు.బిడ్డల పైన అతి ప్రేమతో మంచి చెడ్డ విచక్షణ కోల్పోయిన అంథత్వం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఆ విశ్వ రూపం అనేక ముఖాలతో వుందట.అనేక నేత్రాలతో వుందట.అద్భుతాకారాలతో,దివ్యాభరణాలతో విరాజిల్లుతున్నదట!దివ్యమైన ఆయుధాలు,వస్త్రాలు,పూలమాలలు,సుగంధాలు,లేపనాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుందట!

న తు మాం శక్యసే దృష్టుమ్

న తు మాం శక్యసే దృష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్॥8-11 విశ్వరూప సందర్శన యోగము మనం మాములుగా కనిపించేవి చూస్తాము.మరీ చిన్న చిన్న చీమలు,చీకటీగలు చూడాలంటే కళ్ళు చికిలించి మరీ చూస్తాము.కళ్ళకు కనిపించని సూక్ష్మ ప్రాణులని చూడాలంటే మైక్రోస్కోప్ వాడుతాము.దూరంవి చూడాలంటే బైనాక్యులర్స్ వాడుతాము.చీమ మనమొత్తం ఆకారాలను ఒకేసారిగా చూడలేదు కదా! మరి బ్రహ్మాండం అంతా నిండి,వ్యాపించి వుండే ఆపరబ్రహ్మను మనము మామూలు కళ్ళతో చూడడం ఎలా సాథ్యం?మనం చాలా సార్లు గుడిలో దేవుడి ముందర నిలుచుకుని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటాము.ఆ విగ్రహాన్ని ఒక్క క్షణం కంటే ఎక్కువ చూడము.ఎందుకు? మనం మన మనో నేత్రం తో చూడాలని ఉబలాట పడతాము.కళ్ళతో చూస్తే తనివి తీరదు.జ్ఞాన నేత్రంతో చూసి ఆయనకు దగ్గర అవాలని అనుకుంటాము. ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో అదే అంటున్నాడు.నువ్వు నా విశ్వరూపాన్ని మామూలు చక్షువులతో చూడలేవు.కాబట్టి నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను.దాని సహాయంతో నా పరిపూర్ణ రూపాన్ని చూడగలుగుతావు.అంటే మనసుతో చూడూ,జ్ఞాన నేత్రం తో చూడు అని ఆయన అర్థం.ఆ జ్ఞానాన్ని ఆయన అర్జునుడికి ఇచ్చాడు అని అర్థం.

Wednesday, 28 August 2024

మన్యసే యది తచ్ఛక్యం

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టు మితి ప్రభో యోగేశ్వర!తతోమే త్వం దర్శయాత్మాన మవ్యయమ్॥4-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు,కృష్ణుడు అంత దాకా మిత్రులు,బావా-బావమరుదులు.కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంథం ఇంకా చిక్క బడింది.బలంగా తయారైంది.గురుశిష్యుల బంథం,భగవంతుడు భక్తుడి మథ్య బంథం అయింది.ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి అంటారు కదా!అది మనం అర్జునుడిలో చూడవచ్చు.ఆ భగవంతుడే నా మిత్రుడు,నా బావ అని విర్రవీగటం లేదు.కృష్ణుడి ముందు తను ఒక గడ్డి పరక అని అర్థం చేసుకున్నాడు.అందుకే కృష్ణుడిని యాచిస్తున్నాడు. హే ప్రభూ!యోగేశ్వరా!నాకు నీ దివ్య రూపం చూడాలని వుంది.అది చూసే యోగం,భాగ్యం,అర్హత నాకు వున్నాయని నీవు మనస్పూర్తిగా నమ్మితే,దయచేసి చూపించు.నా జన్మ ధన్యం చేసుకుంటాను అని అంటున్నాడు. మాములుగా మనకు గొప్ప వాళ్ళతో పరిచయం వుంటే విర్ర వీగుతాం.అసలు వాళ్ళ కంటే మనమే హటాటోపం చూపిస్తాము.ఇంతెందుకు?రాజకీయ నాయకులు సభలలో మన తట్టు చూసి చెయ్యి వూపినా వాళ్ళకు మనం అత్యంత సన్నిహితులం అని చెప్పుకుంటాము.ఎందుకంటే అడిగే వాళ్ళుండరు కదా!మనం ఏది చెపితే అది నమ్మే గొర్రెలు వుంటారు కదా!కాబట్టి మనం అతి తగ్గించుకుని,మితంగా,పరిమితంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎంతలో వుండాలో అంతలో వుండటం నేర్చుకోవాలి.

Tuesday, 27 August 2024

ద్యూతం ఛలయతామస్మి

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహం॥ తన గురించి ఇంకా ఇలా చెపుతున్నాడు కృష్ణుడు.పంచకాలు,అంటే చెడ్డ పనులలో జూదంని నేను.తేజోవంతులలోని తేజాన్ని నేను.విజయం పొందే వాళ్ళలోని విజయాన్ని నేను.కృషి చేసే వాళ్ళ ప్రయత్నబలాన్ని నేను.సాత్త్వికులలోని సత్త్వగుణాన్ని నేను. అంటే మంచి చెయ్యాలన్నా,చెడు చెయ్యాలన్నా దాని వెనుక వుండే ప్రేరణ అతనే.చెడు లో కూడా వున్నాను,మంచిలో కూడా వున్నాను అంటే ఆయన దృష్టిలో రెండూ సమానమే.అందుకనే మంచి అనగానే నెత్తిన పెట్టుకోడు,చెడు అనగానే తుద ముట్టించడు.నిదానంగా గమనిస్తాడు.మనకు తగిన సమయం ఇస్తాడు మారేదానికి చెడు మార్గం నుంచి మంచిగా మారేదానికి,మంచి తనాన్ని కొస వరకు నిలబెట్టుకునేదానికి.ఆయన పెట్టే ఈ పరీక్ష లో మనం నెగ్గేదానికి ప్రయత్నించాలి.ఏదైనా వూరికేరాదు కదా!అమృతం కోసం దేవతలే ఎంత కష్ట పడ్డారు?సాగర మథనం చేసారు కదా!అప్పుడు కూడా మొదట్లోనే వచ్చేయలేదు కదా!ఒకటొకటి వచ్చి,హాలాహలం కూడా వచ్చింది కదా!దానితో నిరాశ పడకుండా,ఇంకా చిలికారు కాబట్టి ఆఖరున అమృతం వచ్చింది. మనం కూడా అంతే.ఆరంభ సూరత్వం కాకుండా,కష్టాలు వచ్చినా,నష్టాలు వచ్చినా,అలుపెరగకుండా దైవ చింతన,భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని,మన కర్మలని మనం నిష్కల్మషంగా,నిర్వికారంగా చేసుకుంటూ ముందుకు పోవాలి.

Monday, 26 August 2024

అక్షరాణా మకారోఽస్మి

అక్షరాణా మకారోఽస్మి ద్వంద్వస్సామాసికస్య చ అహమేవాక్షయః కాలోధాతాఽహం విశ్వతోముఖః॥33-10 విభూతి యోగము మనం చాలా సార్లు కళ్ళద్దాలు కళ్ళకే పెట్టుకుంటాము.కానీ వాటికోసం ఇల్లంతా వెతుకుతాము.ఇంట్లో అందరి పైన విసుక్కుంటాము.అందరినీ వెతకమంటాము.వాళ్ళు కిసుక్కున నవ్వి,నీ కళ్ళకే వున్నాయి చూసుకో అంటారు.సిగ్గు పడి పోతాము.ఇంత అస్తాఇస్తం ఏంది మనకు అని ఆశ్చర్యపోతాము. భగవంతుడిని మనము కనుక్కోవటం కూడా అలాంటిదే.ఏంది?భగవంతుడు ఎక్కడ వున్నాడు?ఎక్కడా కనిపించడు,మళ్ళీ నమ్మాలి అంటాడు.వినపడడు,కనపడడు,అసలు వున్నాడో లేదో తెలియదు,కానీ గాఢంగా నమ్మాలి అంటారు,ఎలా? మనం మన చుట్టూరా వెతుకుతాము.దేవుడు సర్వాంతర్యామి కదా!కాబట్టి నిదానం గా మనలో కూడా చూసుకోవాలి కదా.అంతర్ముఖంగా,అంతర్మథనం చేసుకోవాలి కదా!పరమాత్మ అందరిలో వుంటాడు అంటే మనలో కూడా వున్నట్టే కదా!అంత చిన్న తర్కం మనం ఎందుకు మర్చి పోతాము?మనలో కూడా భగవత్ అంశ వుందంటే,మనలని మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలి,కాపాడుకోవాలి! భగవంతుడు ప్రాణి కోటిలోనే కాదు,ఇంకా ఈ రకాలుగా కూడా వున్వాడు.అక్షరాలలో అ కారంగా వున్నాడు.సమాసాలలో ద్వంద్వ సమాసం లా వువ్నాడు.వాశనం లేని కాలం అతను.సర్వ కర్మలకు ఫలప్రదాత అతను.సృష్టికి మొదలు,మధ్య,కొస అతనే!వారీ వీరి వాదాలు,వాదనలు,ప్రశ్నలు,సమాథానాలు...అన్నీ ఆ పెద్దాయనే!

Friday, 23 August 2024

ఆయుధానా మహం వజ్రం

ఆయుధానా మహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః॥28-10 విభూతి యోగము భగవంతుడు అన్నింటా వుంటాడు,అన్నిట్లో వుంటాడు అంటే మనం నమ్మము కదా!కానీ ఆయనే చెపుతున్నాడు.ప్రాణం వున్న వాటిల్లోనే కాదు,ప్రాణం లేని వాటిల్లో,ఒకప్పుడు ప్రాణం వుండి ఇప్పుడు లేని వాటిల్లో కూడా వుంటాడు.అంతేనా! మన భావాలలో,మన భావ ప్రకటనలలో,మన చర్యలలో,మన గుణగణాలలో,మన భావోద్వేగాలలో,మన సంతానోత్పత్తిలో...ఇలా అన్నింటా వుంటాడు ఆ మహామహుడు. ఆయుధాలలో వజ్రాయుధం అతను.గోవులలో కామధేనువు అతను.ప్రజలలో సంతానోత్పత్తి కారకులలో మన్మధుడు అతను.అంటే ఆ ప్రేరణకు బీజం వేసేది అతను.సర్పాలలో వాసుకి అతను.ఈ చరాచర జగత్తులో అన్నింటా అతనే వున్నాడు.అతనే పోషిస్తున్నాడు.అతనే పాలిస్తున్నాడు.అతనే లాలిస్తున్నాడు.

ఆదిత్యానామహం విష్ణుః

ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ॥21-10 విభూతి యోగము కృష్ణుడు చెప్పుకొస్తున్నాడు తను ఏ ఏ రూపాలలో వుంటాడో.ఆదిత్యులలో విష్ణువుగా వున్నాడు.వెలుగును పంచే జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడు అతనే.మరుద్గణాలలో మరీచి అతనే.నక్షత్రాలలో చంద్రుడు అతనే.ఇవేనా?కాదు,కాదు.ఇంకా వేదాలలో సామవేదం అతనే.దేవతలలో ఇంద్రుడు అతనే.పంచేంద్రియాలలో మనసు అతనే.సమస్త ప్రాణి కోటిలోని చైతన్య స్రవంతి అతనే.అతను ఏ ఏ విభూతులలో ప్రకటిత మవుతాడో మానవ మాత్రులం లెక్క కట్ట లేము,చెప్పలేము.సర్వ వ్యాపకుడు,సర్వేశ్వరుడు అనేది అందుకే కదా!

Thursday, 22 August 2024

అహమాత్మా గుడాకేశ

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥20-10 విభూతి యోగము కృష్ణుడు అర్జునుడికి సమాథానం ఇస్తున్నాడు.నీ అనుమానాలు అన్నీ తీరుస్తాను.అన్ని ప్రాణుల అంతరంగాలలో వుండే ఆత్మ ఎవరనుకున్నావు?నేనే!ప్రాణులను పుట్టించేది,పెంచేది,తుదకు గిట్టించేది నేనే.సృష్టి,స్థితి,లయకారకుడిని నేనే.అ నుంచి అః వరకు నేనే.నేను లేని ప్రాణి ఈ జగత్తులో లేదు.అంతా నాలోనే వుంది.నేను అంతటా వున్నాను.

పరం బ్రహ్మ పరం ధామ

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్॥12-10 విభూతి యోగము మనమే ఒకరికి బిడ్డ,ఇంకొకరికి తోడబుట్టిన వాళ్ళం,మరొకరికి స్నేహితులం,మరింకొకరికి జీవిత భాగస్వాములం,మన బిడ్లలకు తల్లి/తండ్రి అవుతాము.మరి జగద్వ్యాపకుడు,సర్వేశ్వరుడు అయిన పరబ్రహ్మకు ఇంకెన్ని నామాలు,బంథాలు,అనుబంథాలు వుంటాయి? అర్జునుడు అదే అడుగుతున్నాడు. కృష్ణా!అందరు ఋషులు,నారదుడు,అసిత దేవలులు(మనువులు),వ్యాసుడు,మిగిలిన వాళ్ళందరూ నువ్వే పరమాత్మవు అని అంటున్నారు.అంతేనా!ఇంకా నువ్వు పరంథాముడవనీ,ఆదిదేవుడవనీ,శాశ్వతుడివనీ,దివ్యుడవనీ,జన్మ లేనివాడవనీ,సర్వవ్యాపివనీ,సర్వేశ్వరుడవనీ....ఇంకా చాలా,చాలా అంటున్నారు.నువ్వు కూడా అదే అంటున్నావు. నువ్వు ఏఏ రూపాలలో భౌతికంగా వున్నావో నాకు చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు.

Saturday, 17 August 2024

తేషాం సతతయుక్తానాం

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తే॥10-10 విభూతి యోగము భగవంతుడిని మనం నిశ్చలమయిన మనసు తో నిత్యం సేవించాలి.అలాంటి వారికే అతన్ని పొందగలిగే జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు.ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదు కదా! వారికి మంచి చేస్తాడు.వాళ్ళ పైన తన కరుణా దృష్టిని ప్రసరిస్తాడు.అతను వాళ్ళ మస్తిష్కంలో వుండి జ్ఞాన మార్గంలో నడిచేలా చేస్తాడు.అజ్ఞానమనే చీకటిని పారదోలుతాడు.

Friday, 16 August 2024

బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః

బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమశ్శమః సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయ మేవ చ॥ 4-10 విభూతి యోగము శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటాము కదా.అది అక్షరాలా నిజం.మనలో వుండే బుద్ధి,జ్ఞానం,మోహరాహిత్యం,ఓర్పు,సత్యం,శమదమాది ఇంద్రియ నిగ్రహం,ఆనందం,ఆవేదన,పుట్టడం,పుట్టక పోవడం,భయం,నిర్భయత,అహింస,సమదృష్టి,దానగుణం,తపస్సు,కీర్తి,అపకీర్తి....ఇలా మనలో వుండే ప్రతి భావానికి,మనం చేసే ప్రతి పని వెనక ప్రేరణ,మర్మం,అర్థం,పరమార్థం,అన్నీ ఆయనే.మనం నిమిత్తమాత్రులం,అంతే.

మన్మనాభవ మద్భక్తో

మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః॥34-9 రాజవిద్యా రాజగుహ్య యోగము భగవంతుడు ఇలా చేయమని చెబుతున్నాడు.మనం మన మనసులను ఆయన యందే నిలపాలి.అతని భక్తులం కావాలి.అతనినే సేవించాలి.అతనినే నమ్మాలి.అతనికే నమస్కరించాలి.అతని యందే దృష్టి నిలపాలి. అంటే నిష్ట,నిబద్ధత,నిర్మలత్వం,నిర్మోహంతో నిరాకారుడు,నిశ్చలుడు అయిన ఆ పరబ్రహ్మను నమ్ముకుంటే,కొలిస్తే,తప్పక మనకు దక్కుతాడు.

Thursday, 15 August 2024

పత్రం పుష్పం ఫలం తోయం

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః॥28-9 రాజవిద్యా రాజగుహ్య యోగము మన అమ్మలు బిడ్డలనుంచి ఏమి కోరుకుంటారు? ఒక చిక్కటి చిరు నవ్వు.అంతేగా!నోరంతా అమాయకంగా తెరిచి,ఎంగిలి పూస్తూ పెట్టే చిట్టి ముద్దులు.బుడి బుడి నడకలు,బుల్లి బుల్లి మాటలు! వాళ్ళకు హిమాలయాలు ఎక్కినంత ఆనందం ఇస్తాయి. భగవంతుడు కూడా అంతే!మనల్ని కొండలు పిండి చేయమని చెప్పడు.సముద్రంలోని నీరు నంతా ఔపోసన పట్టమనడు. మనం మన శక్తి కొద్ది ఆకు ఇచ్చినా సంతోషపడతాడు.పువ్వు ఇస్తే మహదానందపడతాడు.పండు ఇస్తే ఇక ఆ ఆనందానికి హద్దులు వుండవు.నీళ్ళిచ్చినా తృప్తి పడతాడు.నిజంగా భగవంతుడు అల్ప సంతోషి.మన భక్తి,మన శ్రద్థ,మన నమ్మకం చూస్తే మురిసి పోతాడు.మన జీవితాలను బాగు పరుస్తాడు.మనం మంచి మార్గం లో నడిచేలా చేస్తాడు.

అనన్యాశ్చింతయంతో మాం

అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥22-9 రాజవిద్యా రాజగుహ్య యోగము బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులను అంటి పెట్టుకోని వుంటారు.వాళ్ళ ప్రేమాభిమానాలు,సహాయసహకారాలు లేకుండా స్వంతంగా బతకలేరు.కాబట్టి అన్ని వేళలలో అమ్మనాన్నలను నమ్ముకుంటారు.అలా అని కూడా తెలియని అమాయకత్వం లోవుంటారు. అలాగే సమస్త మానవాళికి తల్లి తండ్రి ఆ భగవంతుడే కదా!కాబట్టి మనమందరమూ అతనినే నమ్ముకుందాము.అతని ధ్యానం లో వుందాము.అతని సేవలోనే తరిస్తాము.మానవ సేవే మాధవసేవ కాబట్టి అందరికీ మంచి చేద్దాము.మన మంచి చెడ్డ ఆయనే చూసుకుంటాడు.బిడ్డలు అమ్మ పక్కలో ఎంత నిశ్చింతగా పడుకుంటారు!మనమూ ఆయనను నమ్ముకుంటే అంతే నిశ్చింతగా వుండవచ్చు.

Tuesday, 13 August 2024

పితాఽహమస్య జగతో

పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ॥17-9 రాజవిద్యా రాజగుహ్య యోగము ఈ విశ్వాని కంతటికీ భగవంతుడే తల్లీ,తండ్రీ,ధాతా,త్రాతా.కర్మఫలదుడూ అతనే.తెలుసుకోదగినవాడూ అతనే.పవిత్రుడూ అతనే,ప్రణవస్వరూపుడూ అతనే.ఋగ్వేదమూ,సామవేదమూ,యజుర్వేదమూ,అధర్వణవేదమూ....అన్నీ అతనే. ఈ సృష్టిని సమతుల్యంగా వుంచేవాడు.మనం కోరిన కోర్కెలు తీర్చేవాడు.మనం జీవితంలో ఎవరిగురించి అయినా తెలుసుకోవాలి అంటే,మొట్ట మొదట తెలుసుకోవాలసింది ఇతని గురించే.ఇతని కంటే పవిత్రుడు ఎవరూ లేరు.సృష్టికి మూలం ఇతడే.నాలుగు వేదాలనీ ఔపోసన పట్టింది ఇతనే.ఈబ్రహ్మాండానికి నాయకుడు ఇతనే.

మయా తత మిదం సర్వం

మయా తత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః॥4-9 రాజవిద్యా రాజగుహ్య యోగము భగవంతుడు నిరాకారుడు.కానీ ఈ సృష్ఠి అంతా వ్యాపించి వున్నాడు.ఈ చరాచర జగత్తు మొత్తము అతని యందే వుంది.కానీ వాటిలో అతను వుండడు.అతనే ఈ సమస్త సృష్టిని పెంచి పోషిస్తూ వుంటాడు.కానీ ఈ ప్రాణికోటి అతనిని అంటిపెట్టుకుని వుండదు.అన్ని చోట్ల వ్యాపించే వాయువు ఆకాశంలోనే వుంటుంది.అలాగే జీవకోటి మొత్తం భగవంతుడిలోనే లీనమై వుంటుంది. భగవంతుడంతటి వాడే,అన్నీ తన గుప్పెటలో వున్నా,తటస్ధంగా వున్నాడు.అంటీ,ముట్టనట్టు వున్నాడు.ఈతత్త్వాన్నే తామరాకు మీద నీటి బొట్టు చందం అంటాము.తామరాకు నీళ్ళలోనే వుంటుంది.కానీ నీటి బిందువులు దాని పైన పడ్డా తడవదు.మనము కూడా అలాగే ప్రాపంచిక విషయాలలో వున్నా ఆసక్తి పరమాత్మ పైనే నిలపాలి.

Monday, 12 August 2024

కవిం పురాణ మనుశాసితార

కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్॥9-8 అక్షర పరబ్రహ్మ యోగము భగవంతుడు ఇందుగల డందులేడని సందేహము వలదు అని చదువుకున్నాము కదా! అతను సర్వ్యాంతర్యామి,సర్వ వ్యాపకుడు.ఈ శ్లోకంలో కూడా అదే చెపుతున్నారు.ఆపరమాత్మ కవి,పురాణపురుషుడు,జగన్నియామకుడు,పరమాణువు కంటే చిన్న రూపం కలవాడు,అఖిల సృష్ఠికి ఆథారభూతుడు,విజ్ఞానగని,అజ్ఞానేతరుడు మరియు పరమాత్మ. మన అంత్య కాలంలో ఈమహామహుని భక్తిభావంతో పూజిస్తే ముక్తి పొందేదానికి అర్హులం అవుతాము.

Sunday, 11 August 2024

అధిభూతం క్షరో భావః

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతం అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర॥4-8 అక్షర పరబ్రహ్మ యోగము భగవంతుడు ఇంకా ఇలా చెబుతున్నాడు.నాశనమయే పదార్ధాన్ని అధిభూతం అంటారు.దాంట్లో ఉత్కృష్టుడిని నేను.అధిదైవం అంటే మనం పూజించే అందరు దేవతలలోకి ఆజ్యుడు నేనే.ఈ ప్రకృతిలోని సమస్త భూతకోటిలో అంతర్లీనంగా వుండే ,అన్ని యజ్ఞాలకు మూలపురుషుడిని నేనే. అంటే కర్త,కర్మ,క్రియ అన్నీ నేనే.మీరందరూ నా అంశలే.ఈ సృష్టి,స్ధితి,లయలకు మూలకారణం నేనే. ప్రతిదీ నాతో మొదలు అయి,నాతో ముగుస్తుంది.కాబట్టి నన్ను అర్ధం చేసుకుంటే చాలు.ముక్తి లభిస్తుంది.

అక్షరం బ్రహ్మ పరమం

అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః॥3-8 అక్షర పరబ్రహ్మ యోగము కృష్ణుడు సవివరంగా అర్జునిడికి అనుమానాలు తీరుస్తున్నాడు.బ్రహ్మము అంటే నాశనము లేనిది.అన్నిటికంటే చాలా గొప్పది.అంటే సర్వోత్కృష్టమైనది.ప్రకృతి పరంగా,ప్రకృతి కి సంబంధమయిన స్వభావాలు,గుణగణాలే అధ్యాత్మంఅంటే.భూతోత్పత్తికి అయిన ఘటనమే కర్మం అంటే.

Saturday, 10 August 2024

కిం తద్బ్రహ్న కి మధ్యయాత్మం

కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥1-8 అక్షర పరబ్రహ్మ యోగము కృష్ణుడు చెప్పేది అర్జునుడికి ఒక్క ముక్క అర్థం కావటం లేదు.అసలే అయోమయం లోవున్నాడు.ఈయన ఏమో పెద్ద పెద్ద మాటలు చెపుతున్నాడు.అందుకే అడుగుతున్నాడు.బ్రహ్మము అంటే ఏంది?అధ్యాత్మమంటే ఏమిటి?కర్మ అంటున్నావు.అధిభూతం అంటున్నావు.అధిదైవం అంటున్నావు.నాకంతా అగమ్యగోచరంగా ఉంది.నిదానంగా వివరించు అనిఅడుగుతున్నాడు. మనము కూడా అంతే కదా.రెండో ఎక్కం నేర్చుకునే వాళ్ళకు పదిహేడో ఎక్కం ఏం అర్ధంఅవుతుంది?.బిక్క మొహం వేస్తాము కదా!

Friday, 9 August 2024

జరా మరణ మోక్షాయ

జరా మరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలం॥29-7 విజ్ఞాన యోగము మనిషిని ఎక్కువ భయపెట్టేది ఏంది?మరణం,ముసలితనం.ఆ భయం నుంచి బయటపడాలి అంటే ఏమి చెయ్యాలి మనం?సుఖదుఃఖాలను సమంగా తీసుకోగలగాలి.తామరాకు మీద నీటి బొట్టు చందంగా అన్ని కర్మలు చేస్తున్నా వాటి ఫలితాల పైన ఎలాంటి మోహం లేకుండా వుండగలగాలి.అధిభూతము,అధిదైవము,అధియజ్ఞములకు మూలము అయిన ఆపరమేశ్వరుని ఆశ్రయించి సేవించాలి.అప్పుడు మరణం శరీరానికే కానీ,ఆత్మకు కాదు అని తేటతెల్లమవుతుంది.అప్పుడే మనం కర్మ తత్త్వాన్నీ,పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాము.

చతుర్విధా భజంతే మాం

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16-7 విజ్ఞాన యోగము నాలుగు రకాల మనుష్యులు భగవంతుడిని తెలుసుకోవాలని తాపత్రయ పడతారు.నమ్ముతారు.అతనిని సేవిస్తూ తరిస్తారు.వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాము.కష్టాలలో ఉండేవాళ్ళు,ఏ దిక్కూ లేని వాళ్ళు దేవుడిని నమ్మి,సేవిస్తారు.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటాము కదా మనము.జ్ఞాన పరంగా ఆసక్తి,అన్వేషణ చేసే వర్గం.వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి శోధిస్తూ,సాధిస్తూ ఉంటారు.ఇంకా,ఇంకా తెలుసుకోవాలి అనే తపనతో రగిలి పోతుంటారు.వీళ్ళు భగవంతుడి గురించి తెలుసుకుని,సేవిస్తూ ఉంటారు.మూడో రకం మనుష్యులు ఎవరంటే సంపదలు కోరుకునే వాళ్ళు.వీళ్ళు జ్ఞాన సంపద కంటే,భౌతిక సంపదల కోసం ప్రాకులాడే వాళ్ళు.నాలుగో రకం,జ్ఞానులు. వీళ్ళు అన్నీ కూలంకషంగా తెలుసుకుని,పరిశోధించి,ఆ తరువాత మనసా వాచా నమ్మి భగవంతుడిని సేవలో ధన్యం అవుతారు.భగవంతుడికి కూడా వీళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం.

Thursday, 8 August 2024

న మాం దుష్కృతినో మూఢాః

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయ యాఽపహృతజ్ఞానాః ఆసురం భావ మాశ్రితాః॥15-7 విజ్ఞాన యోగము ఈ విశ్వం అంతా సత్త్వ,రజస్తమో గుణాల చేత నిండా మునిగివుంది.కాబట్టి ఎవరూ భగవంతుడిని తెలుసుకోలేక పోతున్నారు.రాక్షస భావాలు కలిగిన వాళ్ళు,కుయుక్తి కలిగిన మేథావులు,మూర్ఖులు,బుద్ధి,జ్ఞానం లేని వాళ్ళు,నీచమయిన ప్రవృత్తి కలిగిన వాళ్ళు...వీరెవరూ తల క్రిందులుగా తపస్సు చేసినా ముక్తిని పొందలేరు.అసలు వాళ్ళు ప్రయత్నించరు కూడా.

అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్

అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవ భూతాం మహాబాహో య యేదమ్ ధార్యతే జగత్//5-7 విజ్ఞాన యోగము భగవంతుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అపరా అనే ఈ ప్రకృతి హేయమయినది.అంటే తక్కువ,నీచము అని అర్థం వస్తుంది.ఎందుకంటే ఇది మాయా మొహాలతో నిండి వుంది.ఇక్కడ కోరికలకు అంతం ఉండదు.కోపాలకు అంతం ఉండదు.జీవరూపమయిన ఈ విశ్వాన్ని అంతా భరించేది భగవంతుడి పరా ప్రకృతి.ఈ ప్రకృతి చాలా ఉత్కృష్టమయినది.చాలా గొప్పది.మానవుడు ముందర ఈ విషయాన్ని తెలుసుకోవాలి.మనలని భరించేవాడు ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు.అతడే మనకు తల్లి,తండ్రి,గురువు,దైవము.అతన్ని నమ్ముకుంటే,అతన్ని ఆశ్రయిస్తే,అతన్ని ధ్యానిస్తే ముక్తికి సోపానం వేసిన వాళ్ళము అవుతాము.

మనుష్యాణాం సహస్రేషు

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే యతతా మపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వతః॥3-7 విజ్ఞాన యోగము ఒక పోటీ జరుగుతుంది అనుకుందాము.పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మొదట రారు కదా!వెనక పడేదానికి సవా లక్ష కారణాలు వుంటాయి.సత్తా వున్నా ఆ క్షణం బుర్ర,శరీరం పని చెయ్యవు.కొంత మందికి పరిస్థితులు కలసిరావు. అలాగే మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళలో కూడా అందరూ కూడా సాథించలేరు.వెయ్యి మందిలో ఒక్కరే మోక్షం కోసరము ప్రయత్నిస్తున్నాడు.అటువంటి వేయి మంది యతులలో ఏదో ఒకరే భగవంతుడిని తెలుసుకోగలుగుతున్నారు.కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి.

Tuesday, 6 August 2024

చంచలం హి మనః కృష్ణ

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్థృఢమ్ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్॥34-6 ఆత్మ సంయమ యోగము మనకు అందరికీ వచ్చే అనుమానమే అర్జునిడికీ వచ్చింది.కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!ఈ జీవ కోటితో వుండే ఈ ప్రపంచంలో గాలిని మనం నియంత్రించలేము కదా!అలాగే నిత్యం చలించేది,అతి బలవత్తరనైనదీ అయిన మన మనస్సుని నియంత్రిచడం సాథ్యం కాని పని కదా! మరి అలాంటప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఎలా వీలు అవుతాయి? దానికి కృష్ణుడు ఇలా సమాథానం చెబుతున్నాడు.నిజమే.కానీ మనిషి తలచుకుంటే సాథించలేనిది ఏమీ వుండదు కదా!ఇవన్నీ అభ్యాసం తోటి సాధించవచ్చు.ఇంద్రియాలను అదుపులో వుంచుకుంటూ,వైాగ్యం అభ్యసిస్తే మనసు పైన పట్టు తెచ్చుకోవచ్చు.

సర్వ భూతస్థ మాత్మానం

సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః॥29-6 ఆత్మ సంయమ యోగము యోగయుక్తుడైన వాడు అన్ని ప్రాణులను సమంగా చూడటం నేక్చుకుంటాడు.ప్రతి ప్రాణిలోను తనను,తనలో అన్ని ప్రాణులను చూసుకుంటాడు.అన్ని ప్రాణులలో భగవంతుడినీ,భగవంతుడిలోనే అన్ని ప్రాణులనూ చూస్తాడు.అంటే ప్రకృతి లో మమేకమై పోతాడు.తను వేరే అనుకోడు.సమస్త ప్రాణికోటిలో తను ఒకడు తప్ప,ఇంకే ఇతర ప్రత్యేకతలు తనకు లేవని తెలుసుకుంటాడు.

నాత్యశ్న తస్తు యోగోఽస్తి

నాత్యశ్న తస్తు యోగోఽస్తి నా చై కాంత మనశ్నతః నా చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున//16-6 ఆత్మ సంయమ యోగము మనకు ఇంకా చాలా మెళకువలు చెప్పారు.ఏ విషయం లోనూ అతి పనికి రాదు.అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అంటారు కదా తరచూ.మనం వాళ్ళ మాటలు పెడ చెవిన పెట్టకూడదు.ఉదాహరణకు తిండి గురించి మాట్లాడుకుందాము.కొంత మంది ఆబగా ఎంత పడితే అంత,ఏది పడితే అది తింటూనే ఉంటారు.అడ్డు ఆపు వుండనే ఉండవు.ఇంకో వర్గం ఉంటుంది.వీళ్ళు అవసరానికి కూడా తినరు.ఎప్పుడూ కడుపు మాడ్చుకుంటూ ఉంటారు.శలభాల లాగా ఉంటారు ఎండుకొనిపోయి.రెండూ మంచిది కాదు.మితాహారమే ముద్దు.అలాగే కుంభకర్ణుడి సోదర సోదరీమణులు ఉంటారు.వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మనకు భోజనాల సమయం అయిపోయి ఉంటుంది.తొందరగా లేయమంటే మాకు తెలుసులే,ఏమీ పని లేదు కాబట్టే పండుకుంటున్నాము అంటారు.అర్థ రాత్రి ,అపరాత్రి దాక పండుకోరు.ఒక నియమము,నిబద్ధత ఉండవు.ఇంకొకళ్ళు నిద్ర భద్ర లేకుండా జాగారాలు చేస్తుంటారు.సమయానికి నిద్ర పోవటం కూడా శరీరానికి కావాలి.దేని లోను అతి లేకుండా మన శరీరానికి అన్నీ మంచిగా అలవాటు చెయ్యాలి.మనం చేసేపనులు కూడా ఆలోచించుకుని,మంచి అవగాహనతో పూర్తి చెయ్యాలి.మరీ నత్త నడకన చేయకూడదు,అలాగని తొందర తొందరగా చేశామంటే చేశాము అని పూర్తి చేయకూడదు.ఇలా ప్రతి విషయం లోనూ నియంత్రణ,అవగాహన ఉన్న వాళ్ళకే యోగం సిద్ధిస్తుంది.ఈ యోగం అనేది అన్ని రకాల దుఃఖాలకు మందు లాగ పని చేస్తుంది.అంటే కష్టాలనుంచి కాపాడుతుంది.

Monday, 5 August 2024

ప్రశాంతాత్మా విగతభీః

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14-6 ఆత్మ సంయమ యోగము యోగాభ్యాసం ఎలా చెయ్యాలి?ఎవరికైనా తెలుసా?కృష్ణుడు చెబుతున్నాడు.నేర్చుకుందాము.మొట్ట మొదటగా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి.భయాందోళనకు గురి కాగూడదు.ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు.బ్రహ్మచారి అంటే ఏక భుక్తం,భూశయనం చెయ్యాలి అని.ఇలా ఎందుకు అన్నారో గమనిద్దాము.ముప్పూటలా తింటుంటే ఏమవుతుంది?గురక పెట్టి నిద్ర వస్తుంది.భుక్తాయాసం వస్తుంది.కూర్చుంటే లేవలేము,పడుకుంటే లేచి కూర్చోలేము.అదే రోజుకి ఒక్క పూట తింటే,కడుపు కర కర లాడుతుంటుంది,చలాకీ గా ఉంటాము.పట్టు పరుపుల పైన పడుకుంటే ఏమవుతుంది?సుఖపడాలి అనిపిస్తుంది.ఏమేమో కోరికలు చుట్టుముడతాయి.మనపై మనకు నియంత్రణ తప్పుతుంది.నేలపైన పండుకుంటే చలి,వేడి తగులుతుంటుంది ఒంటికి.ఒంటి కింద నేల గట్టిగా తగులుతుంటుంది.ఒళ్ళు నిజంగా కష్టపడితే గానీ నిద్ర రాదు.కాబట్టి మనం బ్రహ్మచర్యం పాటించాలి.మనసుని,ఇంద్రియాలను కట్టడి చేసి,భగవంతుడి మీద దృష్టి నిలిపి యోగాభ్యాసం చేస్తే అది ఫలిస్తుంది.ఊరికినే ముక్కు మూసుకుని,కళ్ళు మూసుకుని నేను యోగాభ్యాసం చేస్తున్నాను అని జబ్బలు చరుచుకోకూడదు.మొదట ఇంద్రియ నిగ్రహణ కావాలి.

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః॥8-6 ఆత్మ సంయమ యోగము యోగి అంటే ఎవడు?ఈ లోకం లో వుండే ప్రతిదాన్నీ సమానంగా చూసేవాడు.అంటే మనుష్యులా,జంతువులా,చెట్లు పుట్టలా అనే కాదు.ఈ గాలి,ఈ నీరు,ఆ కొండలు,కోనలు,వాగులు,వంకలూ అన్నీను.ఈ సృష్టి లో ప్రతిదీ అద్భుతమే.ప్రాణం ఉన్నజీవులు అయినా,ప్రాణం లేని వస్తు వాహనాలు అయినా,పంచభూతాలు అయినా అన్నీ ఒకటే.అన్నిటినీ మనం సమానంగా చూడటం నేర్చుకోవాలి,మన వాళ్ళకు అర్థం అయ్యేలా నేర్పాలి.అలా చూడగలిగినప్పుడే మనలో కోపం తాపం పోతాయి.సహనం పెరుగుతుంది.అవగాహన పెరుగుతుంది.ఎందుకంటే మన అనుకుంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాము,పరాయి అనుకుంటే ఇంకో రకంగా ఆలోచిస్తాము.అర్థం చేసుకోవడం లో చాలా తేడా ఉంటుంది. అందుకనే శత్రువులు అయినా,మిత్రులు అయినా,తటస్థంగా ఉండే వాళ్ళు అయినా,నిరాసక్తంగా ఉండేవాళ్ళు అయినా,మంచి మనసు ఉండేవాళ్ళు అయినా,కోపిష్టులు అయినా,బంధువులు అయినా,పరాయి వాళ్ళు అయినా,సాధువులు అయినా,దుర్మార్గులు అయినా...అందరినీ ఒకే రకంగా సమ దృష్టితో చూడాలి.ఇది సాధించాలి అంటే మనకు నిగ్రహం ఉండాలి.అది అభ్యాసం తో వస్తుంది.అంతఃకరణ శుద్ధి తో వస్తుంది.ఈ రోజు అనుకున్నాము అంటే రేపు పొద్దుటికే రాదు.నిరంతర కృషి ఉండాలి.ఇలా సమ బుద్థి కల వాళ్లను యోగిశ్రేష్ఠులు అంటారు.ఈ రోజు నుంచి మొదలెడదామా,ఆ మంచి మార్గం లో పయనించేదానికి?

ఉద్థరే దాత్మనాఽఽత్మానం

ఉద్థరే దాత్మనాఽఽత్మానం నాత్మాన మవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః॥5-6 ఆత్మ సంయమ యోగము మనల్ని ఎవరో ఉద్ధరిస్తారు అనుకోవటం పొరపాటు.ఎప్పుడూ మనలను మనమే ఉద్ధరించుకోవాలి.ఎందుకంటే మనలో మనకే ఆ సంకల్పం లేకపోతే ఎవరు ఎన్ని విధాల మనకు చేయూత నివ్వాలన్నా మనము గ్రహించము.అంటే మన మట్టి బుర్ర లోకి ఎక్కదు.మనకే తెలియాలి,ఎక్కడో మనం పప్పులో కాలేస్తున్నాము అనే విషయము.ఈ ఊబిలో నుంచి ఎట్లా బయట పడాలి అనే ఆరాటం రావాలి.ఆ మొదటి చైతన్యం మనలో పుట్టుకొస్తే,వంద మంది మనకు సహాయం చేసేవాళ్లు దొరుకుతారు.మనం ఎప్పుడూ అథోగతి పాలు కాకూడదు.అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని పెద్దలు అంటారు కదా.అందుకని తప్పు మార్గం లోకి అసలు వెళ్ళ కూడదు.వెళ్ళి ,వెనక్కి రావాలంటే ఒక్కోసారి జీవిత కాలం కూడా సరిపోదు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి.ఆత్మకు ఆత్మయే మిత్రువు,ఆత్మయే శత్రువు కూడా.ఆ విషయం తెలుసుకుని,జాగ్రత్తగా నడుచుకోవాలి.ఎందుకంటే నిగ్రహం ఉండేవాళ్ళకు ఆత్మ బంధువు లాగా ఉంటుంది.అదే నిగ్రహం లేని వాళ్ళకు శత్రువుగా మారుతుంది.

Saturday, 3 August 2024

అనాశ్రితః కర్మ ఫలం

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్న్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చా క్రియః//1-6 ఆత్మ సంయమ యోగము మనం చేసే ప్రతి పని పైన మోహం మానుకోవాలి.ఈ పని చేయడం మన విధి,కాబట్టి చేస్తున్నాము,అంతే అనుకోవాలి.ప్రతిఫలం పైన ఆశతో చేయకూడదు.అలాంటి వాళ్ళనే యోగులు అంటారు.చాలా మంది సన్న్యసించడం అంటే అన్నీ మానేయడం అనుకుంటారు.కానీ అది కానే కాదు.మనం పనులు మానేసినంత మాత్రాన సన్యాసులం కాము.అది ఒట్టి భ్రమ.మనసులో అది చెయ్యాలి,ఇది చెయ్యాలి,ఏదో సాధించాలి,ఇంకేదో తుదముట్టించాలి,ఇలాంటి ఆలోచనలనుంచి బయట పడటమే యోగము.ఈ క్రమం లో మన విధులను పరిపూర్ణంగా నిర్వర్తించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు.

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం శ్చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణా పానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ॥27-5 కర్మ సన్న్యాస యోగము కోప తాపాలను నియంత్రించుకోవటానికి ధ్యానము,యోగము చాలా ఉపయోగపడతాయి.అది ఎలా చెయ్యాలో,అభ్యశించాలో కూడా ఇక్కడ మనకు చెప్పారు.రోజువారీ ప్రాపంచిక విషయాలను కొద్ది సేపు పక్కన పెట్టాలి.దృష్టిని,అంటే మన చూపును భ్రూమధ్యమం,అంటేరెండు కళ్ళు,అనగా భృకుటి మధ్యలో కేంద్రీకరించాలి.మనం మన నాసిక,అంటే ముక్కుతో గాలి పీలుస్తాము కదా.ఆ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలను ఎక్కువ తక్కువ లేకుండా సమంగా ఉండేలా చూసుకోవాలి.అంటే గాలి పీల్చడం,అదే రకంగా గాలిని వదలడం ఒకే రకంగా వుండేలా చూసుకోవాలి.మనసు,బుద్ధిని మన నియంత్రణ లోకి తెచ్చుకోవాలి.పనిలో పనిగాకోపం,తాపం,భయం,కోరికలు,అసహనం,అసంతృప్తిలాంటి వాటిని విడిచి పెట్టేదానికి మన వంతు కృషి మనం చెయ్యాలి.మనసుని,బుద్ధిని నియంత్రించడానికి డానికి ఈ ధ్యానం,యోగం చాలా చాలా పనికి వస్తాయి.

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం

Friday, 2 August 2024

కామక్రోధ వియుక్తానాం

కామ క్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్//26-5 కర్మసన్న్యాస యోగము కామం అంటే అంతులేని కోరికల పుట్టలు.క్రోధంఅంటే నిగ్రహించుకోలేని కోపతాపాలు.వీటి రెండింటినీ మనం ఎంత త్వరగా విదిలించుకుంటే ఒంటికి,మనసుకు అంత మంచిది.అలా మనం చేయగలిగితే మనకు ఆత్మజ్ఞానం చేకూరినట్లే.యోగులము,సన్యాసులము అయినట్లే మానసికంగా.అప్పుడు సర్వావస్థ,సర్వకాలాల యందు,మన చుట్టూరా బ్రహ్మానందమే పొందగలుగుతాము.

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః//18-5 కర్మసన్న్యాస యోగము మనము ఈ సృష్టిని అంతా ఒకే రకంగా చూడటం నేర్చుకోవాలి.ఇక్కడ ఏదీ ఎక్కువ కాదు,ఏదీ తక్కువ కాదు.అంతా మన దృష్టి లోపమే.ప్రాణం ఉన్నవి అయినా,లేనివి అయినా ఒకటే.విద్య,వినయము గల వాళ్ళు,చదువురాని,చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు,గోవు,కుక్క,ఏనుగు,చెట్టు,పుట్ట,వాగులు,వంకలు,కొండలు,కోనలు,అన్నిటినీ సమంగా చూడటం నేర్చుకోవాలి.ఇలా సర్వ ప్రాణికోటిని సమంగా చూడగలిగే వాడినే పండితుడు అంటారు.

జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

జ్ఞేయస్స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే//3-5 కర్మసన్న్యాస యోగము నిజమైన సన్న్యాసి ఎవరు అనుకుంటున్నారు?కోపం,తాపం లేని వాడు.అసూయ,అసంతృప్తి లేని వాడు.అహంకారం,అదే అంతా నేనే,నేనే గొప్ప మిగిలిన వారందరికంటే అనే భావము మన పతనానికి తొలి మెట్టు.ఈ మెట్టు ఎక్కామంటే ,జారుడు మెట్లపైన కాలు పెట్టినట్లే.పాచి పట్టిన మెట్టు పైన కాలు పెడితే ఏమౌతుంది?మధ్యలో ఆగాలన్నా ఆగలేము.జారుడు బండ పైనుంచి జారినట్లు ఏకంగా నేలపైన కుదేలు అవుతాము.ఈ అహంకారము కూడా మన వినాశనానికి నాందీప్రస్థావన అవుతుంది.హామ్లెట్ లో టు బి ఆర్ నాట్ టు బి థట్ ఈస్ ది క్వశ్చన్ అనే ప్రముఖమయిన వాక్యం ఉంటుంది.మనం ప్రతి క్షణం అలా డోలాయమానం లో ఉండకూడదు.మనకు ఏమి కావాలి,మనం ఏమి చేస్తున్నాము,మనం ఎలా చెయ్యాలి అనే నిర్దిష్టమయిన ప్రణాళిక ఉండాలి.గాలివాటం లాగా ఏ క్షణానికి ఎలా అనిపిస్తే అలా చేయకూడదు.మనకు అంటూ ఒక గమ్యం ఉండాలి.దానిని ఎలా చేరుకోవాలి అనే ప్రణాళిక ఉండాలి.ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయగలిగే నైపుణ్యం,నిబద్ధత ఉండాలి. కాబట్టి రాగధ్వేషాలు ,ద్వంద్వభావన లేని వాళ్ళు మాత్రమే ఈ కర్మ బంధాల నుంచి సులువుగా బయట పడతారు.

Thursday, 1 August 2024

అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి

అజ్ఞశ్చా శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః//40-4 జ్ఞానయోగము మనము కర్మేంద్రియాలను జయించి శ్రద్ధ,సహనాలతో సాధన చేస్తే జ్ఞానాన్ని పొందుతాము.అదే శ్రద్ధ,జ్ఞానం లేని వాడి పరిస్థితి ఏంది?నిత్యం అపనమ్మకం,సందేహాలతో మగ్గి పోయేవాడి దుస్థితి ఏంది?జీవితంలో ఏదీ నమ్మని వాడి గతి అగమ్యగోచరమే.ఇలాంటి మనస్తత్వం వున్నవాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు.ఇహానికీపరానికీ...రెంటికీ చెడ్డ రేవడి అవుతారు.అలాంటివాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.తమని తాము ఉద్ధరించుకోలేని వాళ్ళు ఎదుటివాళ్ళను ఏమీ ఉద్ధరిస్తారు?ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు?కాబట్టి మనమందరమూ ఈ గాడిలో పడకుండా,మెలకువగా మనలని మనము ఉద్ధరించుకోవాలి.మంచి దారిలో నడవాలి.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిహ్

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా//24-4. జ్ఞానయోగము ఈ లోకం లో ప్రతిదీ బ్రహ్మమయం.అంటే ప్రకృతి కి సంబంధించిందే.మనం దానిని మనసా వాచా కర్మణా నమ్మాలి.ఎందుకంటే మనం యజ్ఞాలలో యజ్ఞగుండం లో నెయ్యి వేసేదానికి వాడే గరిటెలలో బ్రహ్మం ఉంటుంది.హోమానికి వాడే వస్తువులు,ద్రవ్యాలు బ్రహ్మ.మనం వెలిగించే అగ్ని బ్రహ్మ.యజ్ఞం లో ఆహుతి ఇచ్చేవాడు బ్రహ్మ.ఆహుతి స్వీకరించేవాడు బ్రహ్మ.అంటే ఈ జగత్తు అంతా బ్రహ్మమయం.అంతా నేనే అనుకునే అహం నుంచి బయటపడాలి.మనం నిమిత్త మాత్రులము అనే స్పృహలో ఉండాలి.అలా అనుకునేవాడు ఆ బ్రహ్మాన్ని పొందుతాడు.అంటే కైంకర్యం అవుతాడుబ్రహ్మత్వం లో.

యదృచ్ఛా లాభ సంతుష్టో

యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమ సిద్ధావ సిద్థౌచ కృత్వాపి నా నిబధ్యతే//22-4 జ్ఞాన యోగము మనిషికి తృప్తి అనేది ఉండాలి.జీవితాంతం ఏదో కావాలి,ఇంకేదో కావాలి అంటూ పరుగులు తీస్తూ ఉండకూడదు ఎండమావుల వెనక.మనకు దక్కిన దానితో తృప్తి చెందడం నేర్చుకోవాలి.ఎంత సేపూ వాళ్ళకు అది వుందే,మనకు లేదే?మనం ఎదుటి వాళ్ళ కంటే ఒక మెట్టు ఎక్కువుగా లేము అని ఎప్పుడూదిగులు పడకూడదు.మన పరిస్థితి ఏంది,మన సత్తా ఏంది అనే అవగాహనతో మన ప్రయత్న లోపం లేకుండా ముందుకు పోవాలి.ఎంత సేపూ అనుమానిస్తూ వుండకూడదు.మనల్ని మనం అనుమానించడం మానుకోవాలి,ఎదుటి వాళ్ళను అనుమానించడం మొదలుపెట్టకూడదు.మన పైన మనకు నమ్మకం ఉండాలి.ఎదుటివాళ్ళ పైన భరోసా ఉండాలి.కోపతాపాలకు ఆస్కారం ఇవ్వకూడదు.ఎందుకంటే మనం కోపతాపాలకు బానిస అయ్యాము అంటే ఇవి మన జీవితాలతో చెడుగుడు ఆడుకుంటాయి.దేనికీ పనికి రాకుండా చేస్తాయి.ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని అనుకరిస్తూ,అనుసరిస్తూ ముందుకు పోతుండాలి.ఆ పని జరిగినా,జరగకపోయినా కలత చెందకూడదు.రెండిటినీ సమంగా తీసుకోవాలి.మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏందంటే మన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నలోపము ఉండకూడదు,అంతే.మన మనస్సు ఏ చట్రం లోనూ ఇరుక్కోకూడదు.తామరాకు పైన నీటి బిందువు లాగా మనం నిర్వికారంగా,అన్నిటినీ సమానంగా తీసుకోవాలి.అప్పుడు మనం ఎలాంటి భవబంధాలలో ఇరుక్కోకుండా వుంటాము. కాబట్టి ఇలా ఉండే దానికి ప్రయతించాలి మనమందరము.

Wednesday, 31 July 2024

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే//8-4 జ్ఞాన యోగము బలహీనులు,మంచివాళ్ళు,అనాధలు ఎప్పుడూ ఏకాకులు కాదు.దైవం,అంటే ప్రకృతి వాళ్ళకు ఎప్పుడూ బాసటగా నిలుస్తుంది.ఈ విషయం అర్థం కాలేదు అంటే మనం మూర్ఖులమని తేట తెల్లమవుతుంది.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అని అనుకుంటాము కదా కష్టాలలో ఉన్నప్పుడు,ఎవరి చేయూత దొరకనప్పుడు.దేవుడు అంటే ప్రకృతి.అది నిరంతరం,అనంతరం,శాశ్వతం అయినది.అది మన వెంటే ఉంటుంది,మనలని సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతూ ఉంటుంది. కృషుడు ఇక్కడ అదే అంటున్నాడు.మంచి వాళ్లను రక్షించేదానికి,దుష్టులను తుదముట్టించడానికి,ధర్మాన్ని నిలపెట్టడానికి,ప్రతి యుగం లోనూ ఏదో ఒక రూపంలో అవతరిస్తూ వుంటాను.

యదా యదా హి ధర్మస్య

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహం//7-4 జ్ఞాన యోగము ప్రకృతి ఎప్పుడూ తనను తాను రక్షించుకుంటుంది.మనం దాని సమతుల్యతకు భగ్నం కలిగిస్తే ,అది దాని మూడో కన్ను తెరిచి విధ్వంసం సృష్టిస్తుంది.విలయ తాండవం చేస్తుంది.అప్పుడు మనం ఎంత లబో దిబో మన్నా లాభం లేదు.పరిగెత్తడానికి ఏ చోటు మిగిలి వుండదు,తల దాచుకునే దానికి ఏ కప్పూ ఉండదు.ధర్మం నశిస్తే నాశనం ఖాయం.అధర్మం,అరాచకం పెరిగితే లెక్క సరిచూసుకుంటుంది ఈ ప్రకృతి.ఇక్కడ కృష్ణుడు ప్రకృతికి పరాకాష్ఠ గా చెప్పుకుంటున్నాడు.అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోను,ఒప్పుకోను,తాట తీస్తాను అంటున్నాడు.

కామ ఏష క్రోథ ఏష

కామ ఏష క్రోథ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం//37-3 కర్మ యోగము మనిషిని అథఃపాతాళానికి తొక్కేసేది మనలో ఉండే రజోగుణమే.రజోగుణము అంటే కోరికలు మనసుని,మనిషిని చుట్టుముట్టటమే.రజోగుణం నుంచి కోరికలు,కామము పుడతాయి.కోరికలు,కామము తీరకపోతే మనలో అసహనం పెరుగుతుంది.అసహనం నుంచి కోపం పుట్టుకువస్తుంది.ఈ కోరికలకూ,కామానికి అదుపు,ఆజ్ఞ ఉండవు.ఆది,అంతం ఉండదు.ఎప్పుడూ మనిషిని అవి ప్రకోపిస్తూ ఉంటాయి.మనిషికి ఎప్పటికీ ఇంక చాలు,ఇంత చాలు అనే తృప్తి,సంతోషం ఉండదు.ఇంకా కావాలి,ఇంకా అనుభవించాలి,ఇంకా సుఖపడాలి అనే దుగ్థ ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది.ఈ కోపాలు,తాపాలే మనుష్యుల చేత నికృష్ఠపు పనులు చేయిస్తూ వుంటాయి.మనిషి మేధస్సు ని పక్క దోవ పట్టిస్తూ ఉంటాయి.అన్ని పాపాలకు మూల కారణం ఈ రజోగుణమే. మనం ఎంత తెలివితేటలు గల వాళ్లమైనా,మనలో ఎంత జ్ఞానం నిబిడీకృతం అయివున్నా ఈ ఒక్క బలహీనత మనలని ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది.పొగ చేత నిప్పు,మురికి చేత అద్దం,మావి చేత పిండం కప్పబడి ఉంటాయి కదా.అలాగే మనలో ఉండే జ్ఞానాన్ని ఈ కామం కప్పేస్తుంది.కాబట్టి మనం కోపతాపాలను వశం చేసుకోవాలి.అవి మితిమీరకుండా సహనం,సంయమనం పాటించాలి.

Tuesday, 30 July 2024

శ్రేయాన్ స్వధర్మో విగుణః

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః//35-3 కర్మయోగము తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము అని అంటారు కదా పెద్దలు.ఇక్కడ కూడా అదే ప్రస్తావిస్తున్నారు.మనకు సంబంధం లేని పనిని మనం ఎంత నైపుణ్యంతో చేసినా లాభం లేదు.ముందర మనలను మనం ఉద్ధరించుకోవాలి.విమానం లో ఎక్కినప్పుడు కూడా వాళ్ళు ఏమి చెబుతారు? ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే,ముందర ఎవరికి వాళ్ళు క్షేమం చూసుకోండి.తరువాత పక్క వాళ్ళకు సహాయం చేయండి అని చెప్తారు.జీవితంలో ఎప్పుడూ కూడా స్వధర్మం చాలా ముఖ్యం.కొన్ని తప్పు ఒప్పులు ఉన్నా,నైపుణ్యం లేకుండా చేసినా,ఎప్పటికీ మన బాగోగులు,మంచి చెడ్డ మనమే చూసుకోవటం ఉత్తమము.మన ధర్మాన్ని ఆచరిస్తూ అశువులు బాసినా మంచిదే.ఇంకొకళ్ల విషయాలలో అనవసరంగా తల దూర్చి,తన్నులు తినడం వృథా.ఎవరి ఇంట్లో అయినా గొడవలు పడుతుంటే,మనం మధ్యలో దూరి సూక్తిముక్తావళి చెబితే ఏమీ అంటారు?మొదట నీ బతుకు నువ్వు చూసుకో అంటారు.మన మంచి కోసం చెబుతున్నారు అని సానుకూలంగా తీసుకోరు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పనులు మనమే చేసుకోవటం ఉత్తమము.

కర్మేంద్రియాణి సంయమ్య

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే//6-3 కర్మయోగము మనలో చాలా మంది ఈ కోవకు చెంది ఉంటారు.పైకి చాలా మంచిగా కనిపిస్తారు.ఇంత మంచి తట్టుకోలేము అనిపిస్తుంది.కానీ లోపల చెడు ఆలోచనలతో ఉంటారు.ఇక్కడ ఇలాంటి వాళ్ళ ప్రస్తావన ఉంది.ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహిస్తూ కూడా,ఆ ఇంద్రియ విషయాల గురించే ఆలోచిస్తారో,వాళ్లను డాంబికులు అంటారు.అంటే వాళ్ళు పైకి ఒక రకంగా,లోపల అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటారు.వాళ్ల ఆలోచనలకూ,చేసే పనులకూ పొంతన ఉండదు.ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి.ఎప్పుడు వాళ్ల అసలు బుద్ధి బయట పెడతారో తెలియదు.ఒక రకంగా వీళ్ళు బయట ప్రపంచాన్ని మోసం చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శమ్ కాదు.ఎవరైతే మనసు చేత ఇంద్రియాలను లోబరుచుకొని,ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తారో,వాళ్ళే మహానుభావులు,ఉత్తములు.ఇలాంటివారిని మనం ఆదర్శం గా తీసుకోవాలి.

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనామ్ ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి//72-2 సాంఖ్యయోగము మనము మామూలుగా మనుష్యులను గమనిస్తుంటాము.ఎవరికైతే కోరికలు తక్కువ ఉంటాయో వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.మనం వాళ్లని అల్ప సంతోషులు అంటాము.చిన్నదానికే సంతోషంగా ఉంటారు.పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్లకు.అహంకారము,కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ మనలో అసహనం,అసంతృప్తి పెరుగుతూ ఉంటాయి.అవి లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాము.ఇంకో విషయం ఏందంటే తన మన అని కాకుండా అందరినీ ఒకేలా చూడగలగడం.మన అనుకునే కొద్దీ మన వాళ్ళకు అంతా మంచి జరగాలి,వేరే వాళ్ళు ఏమైపోయినా పరవాలేదు అనిపిస్తుంది.అప్పుడు ప్రాణి కోటి పైన సమభావం ఎక్కడ ఉంటుంది?కాబట్టి కోరికలు,అహంకారము వదిలిపెట్టగలగాలి.మమకారాన్ని త్యజించాలి.అలా ఉండగలిగినప్పుడే మనం శాంతిని పొందగలము.శాంతి అంటే అమ్మాయి అనుకునేరు.మనశ్శాంతి గురించి నేను మాట్లాడేది.దీనినే బ్రాహ్మీస్ధితి అంటారు.ఈ బ్రాహ్మస్థితి పొందిన వాళ్లు మోహము అనే జలతారు మాయలో పడరు.ఈ జ్ఞానాన్ని ఎవరు మరణకాలం లోపల సాధిస్తారో వాళ్లు బ్రహ్మనిర్వాణపధాన్ని దక్కించుకుంటారు. బ్రహ్మ నిర్వాణ పధం అంటే ఏమో అని భయపడే పనిలేదు.అంత్య కాలం లో మనం అది పొందలేదు,మనకు ఇది దక్కలేదు,ఇంకా బాగుంటే బాగుండేది,ఇంకేదో సాధించి వుంటే బాగుండేది అనే అసంతృప్తులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోగలగటం.ఎవరూ శాశ్వతం కాదు. మనతోటే ప్రపంచం ఆగిపోవటం లేదు.అది నిరంతరం సాగిపోతుంటుంది.మనం ఈ భూమి పైకి వచ్చాము.మంచి మనసుతో,ప్రతిఫలాపేక్ష లేకుండా మన విధులను నిర్వర్తించాము.మన కాలం అయిపోయింది.ప్రశాంతంగా వెళ్ళిపోదాము.ఈ భావన ఉంటే చాలు.

Monday, 29 July 2024

అపూర్యమాణ మచలప్రతిష్ఠం

అపూర్యమాణ మచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామ కామీ//70-2 సాంఖ్యయోగము సముద్రము గంభీరంగా వుంటుంది.తన లోకి ఎన్ని నీళ్ళు వచ్చినా భయపడదు.కలత చెందదు.చెలియలికట్ట దాటదు.అన్నిటినీ తనలోనే దాచుకుంటుంది,ఇముడ్చుకుంటుంది.అంత పెద్దసముద్రమే తన పరిధి దాటకుండా జాగ్రత్త పడుతుంది.మరి అల్పులమయిన మనం కొంచెం అయినా దానిని చూసి నేర్చుకోవాలి కదా.మన పరిమితులు ఏందో తెలుసుకుని బ్రతకాలి కదా.సముద్రం లాగానే స్ధితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చి చేరుతున్నా కలత చెందడు.భయపడడు.చపలచిత్తుడు కాకుండా స్థిరంగా ఉంటాడు.అంటే చలించదు,నిశ్చలంగా వుంటాడు.భోగాలకు అలవాటు పడకుండా జాగ్రత్త పడుతాడు. అంటే మనిషి ఎప్పుడూ తన పరిమితి,పరిధి దాటకుండా ఉండాలి.అతి ఎప్పుడూ మానాలి.అది అసలు మంచిది కాదు.మన పరిస్థితి ఏంది,మన తాహతు ఏంది,మనము ఎక్కడ వున్నాము,ఎవరితో ఉన్నాము,ఎలా ఉన్నాము...అన్నీ ఆలోచించుకోవాలి ఒక అడుగు వేసేముందు.మనం చేసే పని మనకు చెడు చేయకూడదు,ఎడిటి వాళ్ళకు చెడు చేయకూడదు,పర్యావర్ణానికి హాని కలగకుండా చూసుకోవాలి.

క్రోధాద్భావతి సమ్మోహః

క్రోధాద్భావతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ప్రణశ్యతి// 63-2 సాంఖ్యయోగము మనిషికి ఉండే అవలక్షణాలన్నిటి లోకి కోపం అనేది చాలా పెద్ద అవలక్షణం.అన్ని పాపాలకి అదే మూల కారణం.మనిషి మృగం అయ్యేది దాని వల్లే.విచక్షణ కోల్పేయేది దాని వల్లే.సర్వనాశనం అయ్యేది దాని వల్లే.ఇన్ని అనర్ధాలకు కారణం అయిన దానిని మనం దూరం పెట్టలేదా?కనీసం ప్రయత్నం చేయలేమా?ప్రయత్నం లో సఫలం కాలేమా? కోపం వల్ల వివేకం కోల్పోతాము.అవివేకులం అవుతాము.అంటే మంచి చెడుల విశ్లేషణ చేయలేము.వావి వరసలు మర్చిపోతాము.పెద్ద చిన్న అనే అవగాహన కోల్పోతాము.అవివేకం వలన బుద్ధి పని చేయదు.ఇంతకు ముందు జరిగిన విషయాలు,మంచి చెడులు మర్చిపోతాము.నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాము.దీని పర్యావసానంగా బుద్ధి తప్పు దోవ పడుతుంది.మనం చేసేపని పైన మనకు పట్టు వుండదు.నిగ్రహం కోల్పోతాము.ఒక స్థాయిలో మనం ఆగాలన్నా ఆగలేము.అన్యాయం జరిగిపోతుంది.అరిష్టం జరిగిపోతుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి లాభం?మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఉండదు.జీవితాంతం కూర్చుని ఏడ్చినా పరిష్కారం ఉండదు.అదే నష్టం మన వల్ల వేరే వాళ్లకు జరిగితే ,ఆ పాపం ఎన్ని జన్మలెత్తినా పోదు.మన వాళ్లందరికీ అంటుకుంటుంది.సర్వ నాశనం అయిపోతాము.కాబట్టి కోపాన్ని నిగ్రహించుకునేదానికి సర్వ శక్తులూ వినియోగించుకోవాలి.

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి//47-2---సాంఖ్యయోగము మనకందరికీ యావ ఎక్కువ.ఏదైనా పని చేస్తే మనకేంది లాభం?ఓకవేళ లాభం వుంది అంటే ఎంత లాభం?ఎంతో కొంత వుంది అంటే ఇంకొంచెం పెరిగే ఆస్కారం వుందా?అసలు మొత్తం లాభం నాకే రావాలి.దాంట్లో ఇంకెవరికీ భాగం ఉండకూడదు అని అనుకుంటాము.కానీ ఇక్కడేమో కర్మలు చేయటమే మన పని.దాని పైన మనకు ఎలాంటి అధికారం లేదు.దాని వల్ల కలిగే లాభాలకు ఆశ పడొద్దు.అసలు ఆ లాభాలు మనకు వద్దనే వద్దు అంటున్నారు.ఇది సాధ్యమా?కానీ గీత మనలని సాధ్యం చేసుకోమంటుంది.లేకపోతే పుట్టినప్పటినుంచి పోయే దాకా ప్రతిదీ వ్యాపారం అయిపోతుంది.బంధాలు అనుబంధాలు ఉండవు.ప్రేమలు,అభిమానాలు ఉండవు.మనసుకి ప్రశాంతత వుండదు.ఎంత సేపు ఏదో ఒకటి సాధించాలని పరుగెత్తుతూనే వుంటాము.జీవితానికి ఒక అర్థం పరమార్ధం ఉండదు.జీవితం లో ప్రశాంతత ఉండాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతుండాలి.పనులు చేస్తుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి.లాభమయినా నష్టమయినా ఒకే రకంగా తీసుకోగలగాలి.మనము చేసేపని మంచిదయితే మంచి ఫలితాలు ఉంటాయి.చెడు పనులు అయితే చెడు ఫలితాలు ఉంటాయి.గర్వానికి పోకూడదు. మనం నిమిత్త మాత్రులము అనే విషయము సర్వ కాల సర్వావస్థల యందు గుర్తు పెట్టుకోవాలి. కృష్ణుడు ఏమి చెప్తున్నాడంటే,ఫలితం పైన హక్కు లేదని అసలు పనులు చేయడం ఆపొద్దు.నీ విధులు నీవు సక్రమంగా నిర్వర్తించు.లాభాపేక్షతో పనులు చేయవద్దు.

Saturday, 27 July 2024

జాతస్య హి ధ్రువో

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం సోచితు మర్హసి//27-2 కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.పుట్టినది గిట్టక మానదు.మరణించినది మళ్లీ పుట్టక మానదు.ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.దీనిని ఎవరూ ఆపలేరు.ఇలా తప్పించ శక్యం గాని ఈ చావు పుట్టుకల గురించి మనము తలలు బాదుకోవాల్సిన పనిలేదు.ఈ విషయాన్ని గురించి దిగులు పడటం మానేయాలి.ఈ విషయాన్ని మన బుర్రల్లోకి ఎక్కించుకోవాలి.

నైనం ఛిన్దంతి శస్త్రాణి

నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః//23-2 ఈ ఆత్మ భలే తమాషాగా వుంటుంది.చావు పుట్టుకలు లేవు.అంతేనా?ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని దగ్గర.దీన్ని మనం చింపి పారేయలేము.కాలుస్తామా అంటే ఉహూ కాల్చలేము.సరే,కనీసం నీళ్లలో నానబెడతామా అంటే అలా కూడా నానదు.చించలేము,కాల్చలేము,తడపలేము,కనీసం ఎండ పెడదామా అంటే అట్లా కూడా ఎండను అంటుంది.ఇంకెట్లా దీనితోటి మనము వేగేది?మనము ఏమి అడిగినా,ఏమి చేసినా దాని సమాధానం ఒక్కటే.నేను నిత్యము,నేను సత్యము.ఇంకేమి చేస్తాము ఒప్పుకోక!

వాసాంసి జీర్ణాని యధా విహాయ

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ//22-2 ఈ శ్లోకం సాంఖ్య యోగము లోనిది.కృష్ణుడు అర్జునుడికి శరీరానికి ఆత్మకు వుండే వ్యత్యాసం చెబుతున్నాడు.దేహాలు నశిస్తాయి కానీ ఆత్మ నశించదు.అది నిత్యమయినది.దానికి చావు పుట్టుకలు లేవు.ఈ ఆత్మ ఎవరినీ చంపదు,ఎవరి చేత చంపబడదు.దీనికి పెరుగుదల తరుగుదల ఉండవు.మనం బట్టలు వేసుకుంటాము.అవి చిరిగిపోయి,మాసిపోతే మన మన తాహతుని బట్టి వాటిని వదిలేస్తాము.కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతాము.ఆత్మ కూడా శరీరము క్షీణించగానే,నిరుపయోగము అవగానే ఆ శరీరాన్ని మొహమాటం లేకుండా వదిలేస్తుంది.కొత్త దేహం లోకి ప్రవేశిస్తుంది.దానికి పాత శరీరం పైన కానీ.కొత్త శరీరం పైన కానీ మోహము వుండదు.

Thursday, 25 July 2024

క్లైబ్యం మాస్మగమః పార్థ

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే క్షుద్రమ్ హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప// ఈ శ్లోకం భగవద్గీత లోని సాంఖ్యయోగము అనే ద్వితీయ అధ్యాయము లోని మూడవ శ్లోకము.అర్జునుడు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు.యుద్ధం. చెయ్యాలా,చెయ్యకూడదా?చేస్తే ఏంటి?చెయ్యకపోతే ఏంటి?అసలు మనసు మొద్దు బారిపోయి వుంది.విచక్షణ చేసుకోలేకపోతున్నాడు.అప్పుడు తన మిత్రుడు అయిన కృష్ణుడితో మొరపెట్టుకున్నాడు దారి చూపమని. మనలో ఎవరైనా స్థాణువులా మొద్దు బారిపోతే మనం ఏమి చేస్తాము?పట్టశక్యం కాని కోపం,దుఃఖం,మూర్ఖత్వంలో వుంటే పెద్ద వాళ్ళు ఏమీ చేస్తారు?వాళ్లను స్పృహలోకి తెప్పించడానికి చెంప పైన చెళ్లున ఒకటి ఇస్తారు.ఇక్కడ కృష్ణుడు కూడా అదే పని చేస్తున్నాడు.అంటే కొట్టాడు అని కాదు.అయ్యో!నాయనా!అలాగా!పోనీలే పాపం!అని ఊరుకోలేదు.ఒక నిజమైన మంచి స్నేహితుడిలాగా అర్జునుడిని ప్రస్తుత పరిస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.కర్తవ్యవిముఖుడు అయిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసే పనిలో పడ్డాడు.దానికి అవసరమైన సామ దాన దండోపాయాలనుఉపయోగించడానికి వెనుకాడ లేదు. నువ్వు యోధుడివి.ప్రస్తుతం యుద్ధం చేసేదానికి వచ్చావు.రణరంగం లో నిలుచుకుని ఉన్నావు.ఇప్పుడు.మీనమేషాలు లెక్క పెట్టేది ఏంది?ఇప్పుడు పౌరుషం పోగొట్టుకునేది ఏంది?ఇది నీకు తగని పని.ముఖ్యమయిన సమయం లో ఈ మానసిక దుర్బలత నీకు అచ్చిరాదు.మంచిది కాదు.దీనిని ఎవరూ సమర్ధించరు.ఈ పిరికితనాన్ని,సందిగ్ధాన్ని వదిలి పెట్టు.తెలివిగా ఆలోచించు. మనం కూడా కొన్ని కొన్ని సమయాలలో ఒక మంచి పని చేసేదానికి అనవసరంగా భయపడుతుంటాము.ఇది మనకు తగినదా?అసలు మొదలు పెడితే పూర్తి చెయ్యగలమా?మనకు అంత సమర్థత,తాహతు వుందా అని మనకు మనమే భయపడుతుంటాము.కానీ నిజానికి మనం చెయ్యగలం,మనలో ఆ సమర్థత,కార్యదక్షత ఉంటుంది.కానీ ఆ కాన్ఫిడెన్స్,మనపై మనకు నమ్మకం వుండదు. అలాంటప్పుడు మన వాళ్లు ఒక కేటలిస్ట్ లాగా ఒక మంచి మాట చెప్పి,వెన్ను తట్టి మనలను ప్రోత్సహిస్తారు.వాళ్ల ఋణం మనం ఎప్పటికీ మర్చిపోలేము.ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునుడి విషయం లో చేస్తున్నది అదే. కాబట్టి మనం కూడా ఎవరైనా ఒక మంచిపని,నలుగురికి పనికి వచ్చేపని చేసేదానికి తటపటాయిస్తూ వుంటే,వాళ్లను భుజం తట్టి ప్రోత్సాహం ఇద్దాము.

Wednesday, 24 July 2024

మహాపాపాది పాపాని

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళ మంభసా// మనము తెలిసో తెలియకో చాలా పాపాలు చేస్తాము.ఇగ్నోరన్స్ ఈస్ నో ఎక్స్యూజ్ ఇన్ లా.అంటే మనమెవ్వరమూ తెలియదు అని ఆ భగవంతుడి కళ్లలోనుంచి తప్పు చేసి తప్పించుకోలేము.ఇంక తెలిసి చేసే పాపాల విషయానికి వస్తాము.చాలా మటుకు మనకు ఏమీ కాదు,ఎవరూ చూడటం లేదు,ఇది చాలా చిన్న తప్పు,వేరే వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనము చేసేది అసలు తప్పే కాదు,పరిస్ధితుల ప్రభావం వల్ల చేస్తున్నాము కానీ మాకు ఇష్టమయి కాదు....ఇలా మనకు మనమే మభ్యపెట్టుకుంటూ,తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది.ఇంక తప్పు చేస్తున్నామనే భావన కూడా వుండదు.అది కూడా హ్యూమన్ రైట్స్ లో ఒక భాగం అనుకునే స్థితికి చేరుకుంటాము. అందుకే ఈ పద్యం రాశారు.ఏమని అంటే తామరాకు నీళ్లలో వున్నా,ఆ తడి దానికి అంటదు.అలాగే భగవద్గీత పారాయణం చేసేవారికి ఎటువంటి మహాపాపాలు అంటవు.ఇది మనకు విడ్డూరంగా అనిపిస్తుంది మొదటి సారి విన్నప్పుడు.కానీ దీంట్లో నిజం వుంది.ఎందుకంటే పారాయణం అంటే ఊరికినే బట్టీ పట్టినట్లు చదవటం కాదు.దాంట్లోని ప్రతి పదానికి,శ్లోకానికీ,అధ్యాయానికీ అర్థం పరమార్ధం తెలుసుకుంటూ పోవాలి.అప్పుడు మనలో మనం చేసేది తప్పా,ఒప్పా అనే అంతర్మథనం మొదలవుతుంది.తప్పు అని తెలిసిన తరువాత మనపైన మనకే జుగుప్స కలుగుతుంది. ఆ అపరాధ భావం తొలగాలంటే ఏమి చెయ్యాలి?మనసు నిష్కల్మషంగా,నిర్మలంగా,ప్రశాంతంగా వుండాలంటే ఏమి చెయ్యాలి అనే శోధన మొదలవుతుంది.అంటే మనము పాపప్రక్షాళనకు నడుము బిగిస్తాము.మంచి కార్యాలు చేస్తాము.మంచిగా మాట్లాడుతాము.మంచిగా ఆలోచిస్తాము.ఎదుటివాళ్ల మంచి కోరుతాము.దాంట్లోనే మన సంతోషం వెదుక్కుంటాము.అందరినీ సమానంగా చూడటం మొదలుపెడతాము.ఎవరినీ నొప్పించము.సర్వే జనాహ్ సుఖినో భవంతు అని మనసా వాచా కర్మణా ఆచరిస్తాము. కాబట్టి మనము తెలిసి తెలియక చేసే తప్పులకు పరిష్కారం దొరుకుతుంది.మన జీవన విధానం మారుతుంది.సంఘానికి మంచి చేసే తలపు వస్తుంది.అది కార్యాచరణలో పెట్టే పట్టుదల వస్తుంది. ఇన్ని లాభాలు వున్నాయి కాబట్టే గొప్ప గొప్ప వాళ్లందరూ భగవద్గీతను నమ్ముకొని వున్నారు.

Tuesday, 23 July 2024

గీతా కల్పతరుమ్ భజే

గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్థితం శ్రుతిశిరోబీజమ్ ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్యశాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణామ్ఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదంజ్ఞానినం// భగవద్గీత అనేది ఒక కల్పవృక్షం సహస్ర మానవాళికి.నేను ఆ కల్పతరువును సేవిస్తున్నాను.ఈ కల్పవృక్షాన్ని ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు నాటాడు.వేదవ్యాసుడు ఆ మొక్కనుపెంచిపోషించాడు.ఈ వృక్షానికి బీజం ఉపనిషత్తులు.దాని అంకురం,అంటే మొలకఆత్మప్రబోధము.వివిధ శాస్త్రముల యొక్క రహస్యాలు,మూలాలు దాని శాఖలు.శాఖలు అంటే కొమ్మలు.శాంతి,సహనము,వైరాగ్యము,ప్రేమలు అనే మంచి గుణాలుఈ చెట్టుయొక్క చిగురుటాకులు.మన మనసులలో శ్రీకృష్ణభగవంతుడు పైన వుండే భక్తిశ్రధ్ధలు ఈ చెట్టు నుంచివిరజిల్లే పూలసుగంధాలు.జ్ఞానులు దీనిని మోక్షానికి మార్గము అని గాఢంగా నమ్ముతారు.

చేతో భృంగ!భ్రమసి వృధా భవ

చేతో భృంగ! భ్రమసి వృధా భవ మరు భూమౌ విరసాయమ్ పిబ పిబ గీతా మకరందం మురరిపు ముఖ కమల భవాడ్యమ్// మన మనసు ఒక తుమ్మెదలాంటిది.కవి ఇలా అంటూన్నాడు.మనసు అనబడే ఓ తుమ్మెదా!సంసారమనబడే ఈ మరుభూమిలో ఎందుకువృధాగా తిరుగుతున్నావు?ఇది రసహీనమయినది.ఇక్కడ సంచరించడం వలన మనిషికి ఏ మాత్రం లాభములేదు.పోదామురా.మురహరి అయిన ఆ శ్రీకృష్ణుని ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీత అనే తేనెను త్రాగుదాము.మన జన్మలనుసార్ధకం చేసుకుందాము.భగవద్గీత అనే ఆ రసామృతం ఎంత తాగినా తనివి తీరదు.కానీ ఒక చుక్క తాగినా మనకు మోక్షం లభిస్తుంది.

Friday, 19 July 2024

న కాంక్షే విజయం కృష్ణా

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ/ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా// ఈ శ్లోకం భగవద్గీతలో ఒకటవఅధ్యాయం,అర్జున విషాదయోగం లో వస్తుంది.అర్జునుడుదిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు.మంచేదో,చెడేదో తెలియని వ్యవహారం.అసలు తను యుద్ధభూమికి ఎందుకొచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి.అప్పుడుకృష్ణుడుతో తన దీనావస్థను మొరపెట్టుకుంటాడు.తను తన మనసులో పడేఆవేదన,అతలాకుతలంగా,గందరగోళంగా రకారకాలుగా మూగే ఆలోచనలు కృష్ణుడికి చెప్పేస్తాడు.ఆ ధోరణిలోనే ఈ మాటలు అంటాడు. కృష్ణా,నేను ఈ యుద్ధం చెయ్యాలనుకోవటం లేదు.చేసినా గెలవాలనుకోవటం లేదు.నాకు ఈ రాజ్యం వద్దు.దానివల్ల సమకూరే సుఖాలు వద్దు.తుచ్ఛమయిన ఈ లాభాలకోసం నేను నా వాళ్ళను చంపుకునే దౌర్భాగ్యస్థితిలో లేను.నాకు చాలా దిగులు,విచారంగా ఉండి.మనసంతా వైరాగ్యం నిండిపోయింది.నాకు అసలు ఇలాంటి జీవితమే వద్దు. నాకు భవిష్యత్తు అంతా అగమ్యగోచరం గా ఉంది.ఈ కష్టాన్నించి నన్ను గట్టెక్కించు అని అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిలో దేవుడిని చూడలేదు. ఒక నమ్మకమయిన,ప్రియమయిన మిత్రుడినే చూసాడు.మనం కూడా చాలా సందర్భాలలో ఇంట్లో వాళ్ళకంటే,మన అనుకునే మన ఫ్రెండ్స్ కే మన కష్టసుఖాలు,సంతోషాలు,దుఃఖాలు,భయాలు,అనుమానాలు చెప్పుకుంటాము.ఎందుకంటే వాళ్ళు మనలని ఎక్కిరించరు,అర్థం చేసుకుంటారని ఒక గట్టి నమ్మకం.ఆ నమ్మకం తోటే అర్జునుడు కూడా ఇక్కడ తన మనసులో కలిగే భావాలన్నిటినీ ఏకరువు పెట్టాడు.

గీత వల్ల లాభాలు

గీత.....శ్రీకృష్ణ భగవానుని దూత గీత......వ్యాస మునీంద్రుని వ్రాత గీత.....వేదమంత్రముల మ్రోత గీత....అహంకారాదులకు కోత గీత....దివ్యజ్ఞానమునకు దాత గీత....అసురస్వభావమునకు వాత గీత....దైవీసంపదకు నేత గీత...పరమార్థదృష్టికి మాత గీత...రాగధ్వేషములకు మూత గీత....కైవల్యపథమునకు సీత గీత..ప్రణవనాదమునకు గాత గీత...భావసాగరమునకు ఈత గీత...ముముక్షుజనులకు ఊత గీత...ప్రకృతి సామ్రాజ్యమునకు జేత గీత...ధర్మ్యామృతమునకు పోత