Sunday, 12 April 2026

ఉత్సీదేయు రిమే లోకా

ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్। సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః॥24॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను కర్మలు ఆచరించకపోతే జరిగే అనర్థాలను వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!నేను లోక కళ్యాణం కోసం కర్మలను ఆచరిస్తున్నానని చెప్పాను కదా!నేను అలా చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెబుతాను విను.నేను నాకెందుకు?నాకు ఏమీ అవసరం లేదు.నాకు ఏదీ అక్కరలేదు అనుకుంటే లోక వ్యవహారాలన్నీ స్తంభిస్తాయి.వ్యవస్థలు అన్నీ శిథిలమవుతాయి.అప్పుడు ఏమవుతుందో తెలుసా?ఆలోచించగలవా?సంకరము,కర్మభ్రష్టత్వము కలుగుతాయి.ప్రజలయొక్క ఆ దిగజారుడుకు నేనే కారణభూతుడిని అవుతాను.నేను సృష్టించిన ఈ లోకాలు,ప్రాణులు నా వల్లనే భ్రష్టు పడతారు.అంతదానికి ఈ సృజన అంతా దేనికి?ఎవరి కోసం చెప్పు. తల్లి కనగానే నా పని అయిపోయింది అని వదిలేస్తే ఏమవుతుంది ఆ బిడ్డ?ఎందుకూ పనికి రాకుండా పోతుంది.అయితే గియితే వ్యవస్థకు హానికరంగా మారుతుంది.కానీ ఆ తల్లి తన స్తన్యం ఇచ్చి,ప్రేమించి,మంచి మార్గంలో నడిపితే ఆ బిడ్డ సంఘానికి తురుపుముక్క అవుతుంది.అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నా బిడ్డలకు మార్గదర్శకం అవుతాను.

Saturday, 11 April 2026

యది హ్యహం నవర్తేయం

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః। మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్థ సర్వశః॥23॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.హే పార్థా!హే కిరీటీ!నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తాను అని చెప్పాను కదా!ఎందుకని అంటావు?యథా రాజాః తథా ప్రజాః అని నానుడి ఉంది కదా!రాజు ఎట్లా ఉంటే రాజ్యం లోని ప్రజానీకం అంతా అలానే ఉంటుంది.రాజు మంచిగా కార్య నిర్వహణ చేస్తుంటే ప్రజలు కూడా అలానే ఉంటారు.రాజు పనిదొంగ అయితే ప్రజలూ అలానే ఉంటారు.ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నేను గానీ కర్మలను విడిచి పెడితే ప్రతి ఒక్కడూ నన్నే అనుసరిస్తాడు.అంతా తిని తొంగుండే ముఠాలాగ తయారవుతారు.కాబట్టి ఒక నాయకుడు తన వారికి మార్గ దర్శకంగా ఉండాలి.అభాసు పాలు అయ్యేలా ఉండకూడదు.

న మే పార్థాస్తి కర్తవ్యం

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన। నా నవాప్త మనాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి॥22॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము.. అర్జునుడికి శ్రీకృష్ణుడు తన ఉదాహరణే ఇస్తున్నాడు.అర్జునా!పార్థా!ప్రజానీకం గొప్పవాళ్ళనే ప్రామాణికంగా తీసుకుంటుంది.వాళ్ళ అడుగు జాడల్లోనే నడచేదానికి ఇష్టపడుతుంది అని చెప్పాను కదా!నన్నే ఉదాహరణగా తీసుకో.నిజానికి ఈ మూడులోకాల్లో నేను చేయవలసిన పని అంటూ ఏమీలేదు.నాది కానిది,నాకు దక్కనిది అంటూ కూడా ఏమీ మిగిలి లేదు.నాకు అంటూ ఎలాంటి ఆశలు,అసంతృప్తులు,అసహనాలు,అభీష్టాలూ ఏమీ లేవు.అయినా కూడా నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తున్నాను.దీనివలన నీకు ఏమి అవగతమవుతుంది?నాకోసం కాకపోయినా,ఈ సృష్టి మొత్తానికీ మార్గ దర్శకంగా నిలవడం కోసరం నేను కర్మలను ఆచరిస్తున్నాను.సర్వే జనాః సుఖినో భవంతు అనే ధర్మం కోసం పాటుపడపతున్నాను.ఇప్పుడన్నా ఏమైనా అర్థం అవుతుంది అనిపిస్తుందా?

Friday, 10 April 2026

యద్య దాచరతి శ్రేష్టః

యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః। స యత్ ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే॥21॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా?మామూలు ప్రజానీకం ఉంది కదా!గొప్పవాళ్ళు ఏమి చేస్తారో అదే ఆచరించేదానికి ఇష్టపడతారు.ఎందుకంటే గొప్ప వాళ్ళ పద్థతులే కదా వాళ్ళకు ప్రామాణికం! కాబట్టి మనం అందరికీ మంచి దారి చూపించాలంటే ముందుగా ఆ మంచి దారిలో మనం నడవాలి కదా!అవునా,కాదా?

కర్మణైవ హి సంసిద్ధి

కర్మణైవ హి సిద్ధి మాస్థితా జనకాదయః। లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి॥20/3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు మానవుడి పరమావధి ఏందో చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సఖా!ఇప్పటి విషయమే కాదు నేను చెప్పేది.ఇంతకు ముందు జనక మహారాజు,తదితర రాజ ప్రభృతులు కూడా కర్మల ద్వారానే సిద్ధిని పొందారు.అసలు కొంచెం సేపు ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మాటలాడుకుందాము.మానవులగా మన కర్తవ్యం ఏంది చెప్పు?లోకకళ్యాణమే కదా!కాబట్టి ఈ యోగాలూ,మోక్షాలూ,కర్మలూ,జ్ఞానాలూ ప్రక్కన పెట్టేసి లోకసంగ్రహణార్థం మనము ఏదైనా చేయగలిగితే అంతకంటే ఉత్తమం ఇంకేముంటుంది చెప్పు.కాబట్టి అర్జునా!క్షత్రియ ధర్మం ప్రకారం నీవు లోకులను,ప్రజలను రక్షించేదానికి నడుము బిగించాలి.సమరం చేయాలి దుష్ట శక్తులతో.ఇక్కడ వాడితో చేస్తున్నామా,వీడితో చేస్తున్నామా అని కాదు.మనం సుసంపన్నమయిన,సుభిక్షమయిన పరిపాలన ప్రజలకు అందించాలంటే,ఇక్కడ పాతుకుపోయిన చెడుని నిర్మూలించాలి.కౌరవులే ఆ దుష్టశక్తులు.కాబట్టి వారిని తుదముట్టించడమే నీ విథి ఇప్పుడు.

Thursday, 9 April 2026

తస్మా దసక్త స్సతతం

తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర। అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః॥19॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు విషయం చెబుతున్నాడు.అమ్మ బిడ్డ అన్నం తినకపోతే ఏమి చేస్తుంది?అదిగో చందమామ!ఇదుగో బూచి!అని నాలుగు మంచి మాటలు చెబుతూ బిడ్డ నోట్లోకి నాలుగు ముద్దలు పోయేటట్లు చేస్తుంది కదా!అచ్చం అలానే శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి విషయం విడమరిచి,నయాన,భయానా,బుజ్జగించి నాలుగు మంచి మాటలు బుర్రలోకి చేరేలా ప్రయత్నిస్తున్నాడు. అర్జునా!కౌంతేయా!ఆత్మతృప్తుడు గురించి చెప్పాను కదా!ఎలాంటి దోషాలూ అతనికి అంటవు అని కూడా చెప్పాను కదా!నీవుకూడా అలా ఎందుకు కాకూడదు చెప్పు.ఖచ్చితంగా నిష్కాముడవు అయి నీ కర్మలను ఆచరించగలవు.ఆ నమ్మకం నాకుంది.ఆపేక్షారహితమయిన కర్మాచరణ అంటే తెలుసు కదా!అదే!మోహము,కోరికలు,కాంక్ష లేకుండా తన ధర్మాన్ని అనుసరించి కర్మలను ఆచరించడం.అప్పుడు మోక్షము కలుగుతుంది.అప్పుడు మనము మోక్షము వెనక పరుగులు తీయడం కాదు,అదే మనల్ని వెతుకుకుంటూ వచ్చి వరిస్తుంది.

Wednesday, 8 April 2026

నైవ తస్య కృతే నార్థో

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన। న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః॥18॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మరతుడు,ఆత్మతృప్తుడు,ఆత్మసంతుష్టుడు అయిన మనిషి గురించి చెబుతున్నాడు.అర్జునా!పైన చెప్పిన గుణాలు ఉన్న మానవుడు ఏమీ చేయాల్సిన పని లేదని చెప్పాను కదా!ఎందుకని అంటావ్?ఎందుకంటే అతను ఈ సృష్టిలో దేనిపైనా ఆథారపడడు.దేనియందూ ఆశ్రితుడు కాడు.అతని దృష్టిలో కర్మ చేయటం వలన ఎలాంటి లాభం లేదు.చేయకపోతే నష్టం లేదు.అతనికి ఎలాంటి దోషాలు అంటవు.ఎందుకంటే అతను నిర్వికారుడు కాబట్టి.ఆ స్థితికి చేరడం ఆషామాషీ వ్యవహారమూ కాదు.

యస్త్వాత్మరతి రేవ స్యాత్

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః। ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే॥17॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు ఎవరైతే ఏ కర్మలూ చేయ పనిలేదో కూడా చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సత్కర్మలు చేయాలి అని చెప్పాను కదా మానవుడై పుట్టిన ప్రతివాడూ!దీనికి కూడా ఒక మినహాయింపు ఉంది. ఎవడైతే ఆత్మరతుడో,ఆత్మతృప్తుడో,ఆత్మ సంతుష్టుడో...అతను పరమావథికి పరాకాష్ట లాగా అన్నమాట.ఇంక అతను చేయవలసిన కర్మలు అంటూ ఏమీ ఉండవు.ఆత్మతృప్తుడు అంటే తన ఆత్మలోనే తృప్తి పొందేవాడు.ఆత్మరతుడు అంటే ఆత్మానందంలో మునిగి తేలే జ్ఞాని లేక యోగి అని అర్థము.ఆత్మ సంతుష్టుడు అంటే ఆత్మ పరంగా సంతోషంగా,సంతృప్తిగా,సంతుష్టంగా ఉండేవాడు.అతనికి కర్మఫలం గురించి ఎలాంటి ఆలోచన,ఆదుర్దా,అసహనం,అసంతృప్తి ఉండవు.నిశ్చింతగా,ప్రసన్నంగా ఉంటాడు.

Tuesday, 7 April 2026

ఏవం ప్రవర్తితం చక్రం

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః। అఘాయు రింద్రియారామో మోఘం పార్థ స జీవతి॥16॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలను వేదాలలో ఘోషించినట్లు ఆచరించాలి అని చెబుతున్నాడు.అర్జునా!పార్థా!మనము ఈ కర్మ చట్రంలోనే ఉండాలి.దానిని ఎప్పుడూ అతిక్రమించకూడదు.అట్లా అని ఏమీ లేదు.అంతా నా ఇష్టం అని ఈ కర్మలను ఆచరించడం మానకూడదు.దానికి కారణం చెబుతాను,విను.ఈ సత్ కర్మలను ఆచరించనివాడు ఇంద్రియలోలుడు అవుతాడు.ఇంద్రియాలపైన నిగ్రహం లేనివాడు ఏమి చేస్తాడో నీకు తెలియదా?సులభంగా దారి తప్పుతాడు.తప్పులు చేస్తాడు.అవే అలవాటై పాపాలకు పూనుకుంటాడు.ఇంక దాంట్లోనే మగ్గి,మాడి, మసి అయిపోతాడు.పాపి అనే బిరుదు మూటకట్టుకుంటాడు.

Monday, 6 April 2026

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాఽక్షర సముద్భవమ్। తస్మాత్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్॥15॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా?కర్మలు వేదాల వలన సంభవించాయి.వేదాల పుట్టుక ఎక్కడ నుంచో చెప్పు?వేదాలు పరమాత్మ వలన పుట్టాయి.దీని వలన నీకు ఏమి అర్థం అయింది?బ్రహ్మము అనేది విశ్వం మొత్తమూ వ్యాపించి ఉంది.ఈ సర్వత్రా వ్యాపించిన బ్రహ్మాన్ సతతా,సర్వదా యాగాలలో నిక్షేపమై,ప్రతిష్ఠింపబడి ఉంటుంది.

అన్నా ద్భవంతి భూతాని

అన్నాద్భవంతి భూతాని పర్జన్యా దన్న సంభవః। యజ్ఞా ద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః॥14॥3॥ శ్రీమద్భగవద్గీత.।।కర్మ యోగము... శ్రీకృష్ణుడి యొక్క ఓపికకు జోహార్లు.మనం చెప్పేది సరిగ్గా ఎదుటి వాడు వినకపోయినా,విన్నా అర్థంకానట్లు మొహం పెట్టినా మనకు కోపం చిర్రెత్తుకుని వస్తుంది కదా!చట్!వీడికి ఇంక జన్మలో ఏమీ చెప్పకూడదు.సమయం అంతా శుద్ధ దండగ అని నిర్ణయించేసుకుంటాము కదా!కానీ ఇక్కడ చూడు.ఎంత ఓపికగా,అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు అర్జునుడికి వివరిస్తున్నాడో! అర్జునా!మనం బ్రతికే దానికి ఏమి చేస్తాము?అన్నం తింటాము కదా!ప్రతి జీవికి తను బ్రతికే దానికి,తన వంశాభివృద్ధికి ఆహారం కావాలి కదా!ఆ ఆహారం మనకు ఎక్కడనుంచి వస్తుంది అనుకుంటున్నావు?వర్షాలు పడితేనే కదా పంటలు పండేది.పంటలు సజావుగా పండితేనే కదా గింజలు ఇంటికి,ఆ తరువాత మన నోటికి వచ్చేది.మనము యజ్ఞం చేయటం వలన వరుణ దేవుడు కనికరించి వానలు తెప్పిస్తున్నాడు.అందువల్లే మన ఇంటిలో పుట్టి నిండుతున్నది.మనము కర్మలు చేస్తేనే కదా యజ్ఞం సుసంపన్నమయేది.

Saturday, 4 April 2026

యజ్ఞ శిష్టాశిన స్సంతో

యజ్ఞ శిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః। తే త్వఘం భుంజతే పాపా యే పచం త్యాత్మకారణాత్॥13॥3॥ శ్రీనద్భగవద్గీత..।కర్మ యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ పని అయినా స్వచ్ఛందంగా,మనసు పెట్టి చేయాలని చెబుతువ్నాడు.హే సఖా!హే అర్జునా!మానవులు యజ్ఞాలు చేసి దేవతలను తృప్తి పరచాలి,వారికి నివేదించాలి అని చెప్పాను కదా!ఎందుకంటే యజ్ఞశేషాన్ని భుజించేవారు సమస్త పాపాలనుంచీ విముక్తి చెందుతారు.అట్లా కాకుండా చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ వాళ్ళకోసరమే వండుకుని తినేవాళ్ళు పాపాల పాలు అవుతారు.ఇది శపించడమో,చెడ్డగా మాట్లాడటమో కాదు.మనము బ్రతకాలి,మనతోటే మన ప్రక్కవారు కూడా సుఖసంతోషాలుతో ఉండాలని ఆపేక్షించగలగాలి.ఎందుకంటే మనము చేసే నైవేద్యాలు నిజంగా దేవుడో,దేవతో వచ్చి తినరు.వారికంటూ చేసినవి మనం నలుగురితో పంచుకుంటాము.ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చెబుతున్నాడో తెలుసా?ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమని వాళ్ళు ఉంటారు.చేయి విదిలించినపుడు రెండు మెతుకులు క్రిందపడి,వాటిని కాకి తీసుకెళుతుందేమో అనే భయానికి.అట్లా ఉండొద్దు.సర్వే జనాః సుఖినో భవంతు అనుకోవాలని ఆయన ఆశ.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః। తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః॥12॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మయోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ ప్రజలకు ఏమి చెప్పాడో చెబుతున్నాడు.అర్జునా!పార్థా!కిరీటీ!బ్రహ్మ ప్రజలను సృష్టించాడు అని చెప్పాను కదా!ఆ తరువాత ప్రజలకు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు.యజ్ఞాలు చేయమన్నాడు.చేస్తే మంచిది అని చెప్పాడు.ఎందుకంటే యజ్ఞాలు చేస్తే దేవతలు తృప్తి పడతారు.అప్పుడు ప్రసన్నంగా ఉంటారు కాబట్టి మన కోరికలు తీరుస్తారు.అంటే వరుణ దేవుడు వానలు ఇస్తాడు.సూర్యుడు పగలు,వెలుతురు ఇస్తాడు.చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు.అగ్ని దేవుడు నిప్పును ఇస్తాడు.వారి వలన,వారిచ్చే ద్రవ్యాల వలన మనము లాభం పొందుతున్నట్లే కదా!మరి మనం కృతజ్ఞత వ్యక్తపరచాలి కదా!వారి వల్ల దక్కిన ఫలాన్ని వారికి నివేదించాలి కదా!కాబట్టి వారికి నివేదించకుండా భోగించేవాడు చోరుడు అవుతాడు.

Wednesday, 1 April 2026

దేవాన్ భావయతాఽనేన

దేవాన్ భావయతాఽనేన తే దేవా భావయంతు వః। పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ॥11॥3॥ శ్రీమద్భగవద్గీత ...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మందల వివరిస్తున్నాడు.అర్జునా!నేను చెప్పాను కదా బ్రహ్మ ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞాలను కూడా ప్రజా శ్రేయస్సు కోసం సృష్టించాడు అని.బ్రహ్మ ప్రజలకు ఇలా చెప్పాడు.మీరు యజ్ఞాలు చేయండి.వాటి ద్వారా దేవతలు తృప్తి చెందుతారు.వారు తృప్తి పొందితే మీకు తృప్తి కలిగిస్తారు.అంటే ఇచ్చుకుంటినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం లాగా అన్నమాట.మనం మంచి చేస్తే ఎదుటివాళ్ళుకూడా మనకు మంచి చేస్తారు.ఇలా సుహృద్భావంతో అన్యోన్యాచరణల ద్వారా శ్రేయస్సు పొందండి అని బ్రహ్మ ప్రజలను ఆశీర్వదించాడు.

Tuesday, 31 March 2026

సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా

సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః। అనేన ప్రసవిష్యధ్వ మేషవోఽస్త్విష్ట కామధుక్॥10॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము..। అర్జునుడికి శ్రీకృష్ణుడు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు.అర్జునా!పూర్వం ప్రజాపతి యజ్ఞాలను చేసేవాడు.యజ్ఞాలతో బాటుగానే ప్రజలను కూడా సృష్టించాడు.తను సృష్టించిన ప్రజలకు మంచి మాటలు నాలుగు చెప్పాడు.వాటిల్లో మచ్చు తునక ఇది.మీరందరూ యజ్ఞం చేయండి.దాని వలన మీరు వృద్ధి పొందుతారు.యజ్ఞాల వలన మీ కోరికలు అన్నీ సఫలమవుతాయి.యజ్ఞము అంటే సరైన అర్థం చెబుతాను.భగవంతుడికి సంబంధించిన పనులు,ఇతరులకు మేలు చేసే పనులు,ఆత్మధ్యానం...ఈ మూడింటినీ యజ్ఞము అని అంటారు.

యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర

యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః। తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచరః॥9॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!కౌంతేయా!యజ్ఞ సంబంధమయిన కర్మలు మంచివి.అవి తప్పిచ్చి మిగిలిన కర్మలన్నీ బంధన హేతువులే!అంటే ప్రతి కర్మ ఏదో ఒక రకంగా బంధాలను కూర్చడానికో,కూల్చడానికో కారణం అవుతుంది.కాబట్టి నేను చెప్పేది విను.ఫలాపేక్షను వదలిపెట్టు.పవిత్రమయిన యజ్ఞవిధిగా కర్మలను ఆచరించు.ఒక యజ్ఞం లోకకళ్యాణం కోసరం చేస్తున్నాను అనుకో.దాని వలన నీకు,నీ వాళ్ళకూ ఎంత నష్టం,ఇంకెంత లాభం అని బేరీజు వేసుకుని చేయకు.

Monday, 30 March 2026

నియతం కురు కర్మత్వం

నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః। శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః॥8॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు చిన్నగా అర్జునుడిని దారిలోకి తెచ్చేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే చెప్పాను కదా ఉత్తముడు ఎలా ఉంటాడు అని.నీకేమనిపిస్తుంది?అలా చేయగలను అనే నమ్మకం పుడుతుందా?నీవు ఇంక ఇప్పుడు ఏమి చేయాలో చెబుతాను విను.నీవు నీకు నిర్ణయించబడిన నియమిత కర్మలను ఆచరించు.వాటి వలన లాభమా,నష్టమా?ఇష్టమా?కష్టమా?ఇవన్నీ ప్రక్కన పెట్టు.నీ ధర్మాన్ని పాటించు.క్షత్రియ ధర్మం ఏంది?ప్రజలను కాపాడటం !అవసరమైతే కరవాలమెత్తి దుష్టులను సంహరించడం!నేను ఏమీ చేయను.ముసుగేసుకుని మూలన కూర్చుంటాను.అది పాపం.ఇది పుణ్యం.వీళ్ళు మనవాళ్ళు,వాళ్ళు పరాయి వాళ్ళు.ఈ ఝంఝాటకాలు మానేసెయ్యి. ఎందుకో చెప్పేదా.ఏ పనీ చేయకపోవడం వలన దేహయాత్ర చాలా దుర్భరమవుతుంది.నీకు అర్థం కావటం లేదు.

య స్త్వింద్రియాణి మనసా

యస్త్వింద్రియాణి మనసా నియ మ్యారభతేఽర్జున। కర్మేంద్రియైః కర్మయోగ మసక్త స్స విశిష్యతే॥7॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎవరిని ఉత్తముడు అని అంటారో చెబుతున్నాడు.అర్జునా!పార్థ!ఇంద్రియ నిగ్రహం కావాలి.కానీ అదొక్కటే చాలదు.మనసు చేత ఇంద్రియాలను మన వశం చేసుకోవాలి.వాటిని లోబరుచుకోవాలి.లేక పోతే కళ్ళాలు లేని గుర్రాల లాగా కోర్కెలు పరుగులు తీస్తాయి.మనము మన కర్మలను ప్రతిఫలాక్ష లేకుండా చేయగలగాలి.ఇప్పుడు అర్థమయిందా?ఎవడిని ఉత్తముడు అంటారో?ఉత్తముడు సదా సర్వదా మనసు చేత ఇంద్రియాలను లోబరచుకుని,ప్రతిఫలాక్షలేకుండా తను నిరివర్తించాల్సిన కార్యాలను,కర్మలను ఆచరిస్తుంటాడు.

Sunday, 29 March 2026

కర్మేంద్రియాణి సంయమ్య

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్। ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే॥6॥3॥ శ్రీమద్భగవద్గీత.।।కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి లోకం పోకడ గురించి చెబుతున్నాడు. అర్జునా!నీకు అసలు వ్యవహారం తెలీటం లేదు.చాలా మంది చాలా సార్లు ఏమి చేస్తారో చెబుతా,విను.వాళ్ళు కర్మేంద్రియాలను నిగ్రహించుకుంటారు.మనసులో మటుకు ఆ ఇంద్రియ విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు పగలూ రేయీ.అట్లాంటి వాడిని ఏమంటారో తెలుసా?డాంబికుడు అని అంటారు.నీవు అలా కాకూడదు సుమా!

Saturday, 28 March 2026

న హి కశ్చిత్ క్షణమపి

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్। కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః॥5॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి నగ్న సత్యం చెబుతున్నాడు.అర్జునా!నాకు నీకే కాదు.ప్రతి ఒక్కరికీ తెలుసు పనులు చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవరూ ఉండలేరు.అవి సంకల్పితమయినవి కానీ,అసంకల్పితమయినవి కానీ!ప్రకృతి ధర్మానికి,ప్రకృతి గుణాలకు బద్ధులై ప్రతివారూ కర్మలు వారి వారికి తగినట్లు చేస్తూనే ఉంటారు.

Friday, 27 March 2026

న కర్మణా మనారంభాత్

న కర్మణా మనారంభా న్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే। న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి॥4॥3॥ శ్రీమద్భగవద్గీత...।కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అర్జునా!అర్థం చేసుకునే దానికి ప్రయత్నించు.మనము చేసే పనులు,చెయ్యాల్సిన పనులు,చేయకూడని పనులు చేయక పోవడం వలన నిష్కర్మత సిద్ధించదు.అంటే ఆ పనులన్నీ మనం చేయనట్లుకాదు.అలాగని కర్మలను సన్యసించడం వలన కూడా ముక్తి లభించదు.ఎందుకంటే భౌతికంగా చేయడం కంటే ఆ కర్మల మీద కోరిక ,లాలసే ఎక్కువ ప్రమాదకరము.

లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా

శ్రీ భగవానువాచ.... లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా। జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్॥3॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము. అర్జునుడు అలా అన్నాడని శ్రీ కృష్ణుడు అగ్గి మీద గుగ్గిలం కాలేదు.అవమానం అనుకోలేదు. చిన్నగా చిరునవ్వులు చిందించాడు.అనునయంగా అర్జునుడితో అంటున్నాడు. అర్జునా!పూర్వ కాలంలో నేనే దీనిని రెండు రకాలుగా చెప్పాను.సాంఖ్యులకు జ్ఞాన యోగంగా బోధించాను.యోగులకు కర్మ యోగంగా విడమరచి చెప్పాను.

Thursday, 26 March 2026

వ్యామిశ్రేణేవ వాక్యేన

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే। త దేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయాత్॥2॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు తనకు చెప్పే మాటలు వింటుంటే అర్జునుడికి పిచ్చి రేగి పోతున్నది.ఏ ఒక్కటీ అర్థం కావటం లేదు.ఏదో కొంచెం బోథ పడుతుందిలే అని అనుకునేలోపల ఇంకాస్త ఎక్కువ గందరగోళం అనిపిస్తున్నది.ఇంక ఉండబట్టలేక శ్రీకృష్ణుడితో అంటున్నాడు.ఏంది స్వామీ?ఒక సారి మాట్లాడినట్లు ఇంకే సారి మాట్లాడవు?నీ మాటలతో నా బుర్ర గిర్రున తిరుగుతుంది.ఇంకా ఇంకా అయోమయంలో పడిపోతున్నాను.ఒక సారి జ్ఞానం గొప్పది అంటావు.అది ఒంట పట్టిచ్చుకునేలోపల కర్మ గొప్పది అని అంటావు.నువ్వే ముందర తేల్చుకో ఈ రెండింటిలో ఏది గొప్పది అని.ఆ తరువాత నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు.కప్పదాటు వ్యవహారాలు వద్దు సుమా!నాకు ఏది మంచిదో ఖచ్ఛితత్వంతో సూటిగా చెప్పు.అంటే రామబాణంలాగా సూటిగా లక్ష్యం చేరుకోవాలి.అంతేగానీ,ఊరికినే అటు త్రిప్పి,ఇటు త్రిప్పి మాటల గారడీ చేయవద్దు .

Wednesday, 25 March 2026

తృతీయోఽధ్యాయః…కర్మ యోగః..జ్యాయసీ చేత్కర్మణస్తే

అర్జున ఉవాచ.. జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్జనార్దన। తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవః॥1॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మయోగము.. అర్జునుడు శ్రీకృష్ణుని సాంగత్యంలో జ్ఞాన పిపాసి అవుతున్నాడు.శుభ పరిణామం కదా!కృష్ణా!ఇంత సేపూ నువ్వు చెప్పింది చూస్తే నాకొకటి అనిపిస్తుంది.కర్మ యోగము కన్నా జ్ఞాన యోగమే గొప్పదని నువ్వు అభిప్రాయపడుతున్నావేమో అనిపిస్తుంది.నిజమేనా?అట్లాంటప్పుడు ఘోర కర్మము అయిన ఈ యుద్ధానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు?ప్రోద్బలం చేస్తున్నావు?నన్ను నియోగిస్తున్నావు?నీ మాటలకూ,చేతలకూ తేడా ఎందుకు?

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి। స్థిత్వాఽస్యామంత కాలేఽపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి॥72॥2॥ ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపవిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్య యోగోనామ ద్వితీయోఽధ్యాయః... శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంతో సాంఖ్య యోగానికి ముక్తాయింపు చెబుతున్నాడు.అర్జునా!నేను ఇంత సేపు చెప్పింది ఈ బ్రాహ్మీ స్థితి గురించే!ఈ జ్ఞానం పొందిన వారు మోహంలో మునగరు. వారు మరణకాలంలోపల ఈ బ్రాహ్మీస్థితిని పొందగలిగితే చాలు.బ్రహ్మ నిర్వాణ పధం ని పొందగలుగుతారు. ఇట్లు బ్రహ్మ విద్య,ఉపనిషత్తు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జునుల సంవాద రూపమయిన శ్రీమద్భగవద్గీతలో సాంఖ్య యోగము అను రెండవ అధ్యాయము...

Tuesday, 24 March 2026

విహాయ కామాన్ యస్సర్వాన్

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శ్చరతి నిస్పృహః। నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి॥71॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము మొట్టమొదటగా కోరికలకు స్వస్తి చెప్పాలి.అన్ని అరిష్టాలకూ అవే కదా మూల హేతువు.అహంకారం అనేది ఇంకో పెద్ద గుదిబండ.దానిని తీసి ప్రక్కన పెట్టాలి.ఈ రెంటినీ వదలి మోహానికీ,మమకారానికీ స్వస్తి వచనాలు చెప్పాలి.ఇలా ఉండగలిగిన పురుషుడే శాంతిని,మనశ్శాంతినీ పొందగలడు.

అపూర్యమాణ మచల ప్రతిష్ఠం

అపూర్యమాణ మచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్। తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామీ॥70॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!పాండవమధ్యమా!సముద్రం చూడు!ఎంత గంభీరంగా ఉంటుంది కదా!నదీ జలాలు అన్నీ చివరకు చేరేది సముద్రమే కదా!ఓ యమ్మ!ఇన్ని నీళ్ళు నాలోకి వచ్చి కలిస్తే ఎట్లా?అని దిగులు పడుతుందా?లేదు కదా!నిబ్బరంగా ఉంటుంది కదా!చెలియలి కట్ట దాటకుండా గంభీరంగా ఉంటుంది కదా!స్థితప్రజ్ఞుడు అయినవాడు కూడా అలాగే ఉంటాడు.ఎన్ని కోర్కెలు కలిగినా గీత దాటడు.కలత చెందడు.చపలత్వంతో చంచల మనస్కుడు కాడు.భోగలాలస దరి చేరనివ్వడు.నిశ్చలంగా ఉంటాడు.అంటే సముద్రంలాగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన ధర్మం తప్పడు.మంచికి చెడుకి మథ్య లక్ష్మణగీత గీచుకుంటాడు.

యా నిశా సర్వభూతానాం

యా నిశా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ। యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః॥69॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి క్రొత్త విషయము చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇది తెలుసా?చీకటి,వెలుగు ఉన్నాయి కదా!మాములుగా మనం ఏమి చేస్తాము?వెలుగు,పగలు ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాము.చీకటి,రాత్రి సమయాలలో నిద్రావస్థలో ఉంటాము.కానీ జ్ఞాని అలా చేయడు.ఏది చీకటో దాని యందు జ్ఞాని మెలకువగా ఉంటాడు.సామాన్యులు మెలకువగా ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము.

Monday, 23 March 2026

తస్మా ద్యస్య మహాబాహో

తస్మా ద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః। ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥68॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ముక్కు సూటిగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ముసుగులో గుద్దులాటలు అక్కరలేదు.సూటిగా చెబుతాను.విషయాలనుంచి అదే విషయ లాలస నుంచి ఇంద్రియాలను మరలించడం నేర్చుకోవాలి.అలాంటి నిగ్రహ శక్తి కలవాడే స్థిత ప్రజ్ఞుడు కాగలడు.

ఇంద్రియాణాం హి చరతాం

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽను విధీయతే। త దస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి॥67॥2॥ శ్రీమగ్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే పనులు,మన కోరికలు సామాన్యమయినవా,చెప్పు?ప్రతి ఒక్కటీ అంతకు మించి అన్నట్లు ఉంటుంది.విషయాలలో ఇంద్రియాలు ఎట్లా ప్రవర్తిస్తాయి,చెప్పు?అవి చెప్పినట్లు మనసు జీ హుజూర్ అంటూ అనుసరించింది అనుకో,ఇంక అంతే సంగతులు,చిత్తగించవలెను అన్నట్లు తయారవుతుంది.నీకు ఒక ఉదాహరణ చెబుతాను.మనము నావలో ప్రయాణం చేస్తున్నాము.ఉన్నట్లుండి హోరుగాలి వీస్తుంది.అప్పుడు ఏమవుతుంది?పడవ మన చెప్పు చేతల్లో ఉండదు.గాలి ఎటు మళ్ళిస్తే అటు ఊగిపోతుంది.దారి తప్పి పోతుంది.తీరం సజావుగా చేరదు.మన నియంత్రణలో ఏమీ ఉండదు.చంచల మయిన మనసు యతుల బుద్ధిని కూడా హరించేస్తుంది.కాబట్టి మనము ఇంద్రియాలను మన చెప్పుచేతల్లో పెట్టుకోవటం శ్రేయస్కరం అన్ని వేళలా!

Sunday, 22 March 2026

నాస్తి బుద్ధి రయుక్తస్య

నాస్తి బుద్ధి రయుక్తస్య న చా యుక్తస్య భావనా। న చా భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్॥66॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు చెట్టును ఇంకో తట్టునుంచి నరుక్కొస్తున్నాడు.అర్జునా!ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అర్థమైందా?నేను దానినే ఇంకో రకంగా చెబుతాను విను.మనిషిని బలహీన పరిచేవి ఇంద్రియాలు కదా!కనిపించిందంతా కావాలంటాయి.ఇష్టం లేకపోతే వాటి ఉనికి,ఊసూ మన ముందరకు రాకూడదు అనిపిస్తుంది.కాబట్టి ముందుగా ఇంద్రియాలను మన గుప్పెట్లో పెట్టుకోవాలి.ఇష్టమయినవి దక్కాయి అని భాంగ్రా నృత్యం చేయకూడదు.ఇష్టం లేని వాటిని భరించలేమని అఘాయిత్యం చేయకూడదు.అలా మనలను మనం నియంత్రించుకోలేక పోతే స్థిర బుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది చెప్పు?స్థిర బుద్ధి లేకపోతే ఆత్మ వివేకము ఎక్కడ నుంచి వస్తుంది?పరమార్థ చింతన,అదే భగవంతుడి పైన ధ్యాస,ఎక్కడ నుంచి వస్తాయి మనకు?ఈ రెండూ లేని వాడికి శాంతి అనేది అందని ద్రాక్ష పండులాగే కదా!శాంతి అనే పదానికే దిక్కూ దివాణం లేకపోతే సుఖమెలా దక్కుతుంది?సుఖం అనే పదము సుదూర తీరాలకు ప్రయాణమై పోతుంది.

ప్రసాదే సర్వదుఃఖానాం

ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యో పజాయతే। ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి॥65॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సఖా!సూక్ష్మంలో మోక్షం అంటారు కదా!ఇది అదే!మనము మన మనసును నిర్మలంగా పెట్టుకోగలిగితే చాలు.చిక్కు ముడి విప్పినట్లు అన్ని సమస్యలూ వాటంతట అవే సర్దుకుంటాయి.మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది చెప్పు?కోపాలూ,కాపాలూ లేనప్పుడు.ఆశలూ,అసహనాలూ,అసంతృప్తులూ లేనప్పుడు.అంతే కదా!మనసు నిర్మలంగా ఉంటే సుఖదుఃఖాలు ఉండవు.నశిస్తాయి.ఎగిరెగిరీ పడబళ్ళేదు.అథఃపాతాళానికీ కృంగిపోబళ్ళేదు కనుక.అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్త్వాన్ని పొందుతుంది.దీనికి ఢోకా లేదు.

Saturday, 21 March 2026

రాగద్వేష వియుక్తైస్తు

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్। ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి॥64॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చిలకకి చెప్పినట్లు చెబుతున్నాడు.అర్జునా!మన వ్యవహారం ఎలా ఉండాలో చెప్పేదా?తామరాకు పైన నీటిబొట్టులాగ ఉండాలి.అంటే నీటి బొట్టు తామరాకు పైన ఉన్నా దానిని నిజంగా అతుక్కుని ఉండదు.సన్నని,పల్చని మైనపు పొర ఆకు పైన ఉంటుంది.దాని వలన నీటి బిందువు స్వేచ్ఛగా,స్వచ్ఛంగా ఆకు మీద ఎలా అయినా కదులుతుంది.అలానే మనం కూడా విషయాలను అనుభవిస్తున్నా,కర్మలను ఆచరిస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవాలి.ఇంద్రియ నిగ్రహం ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి.అప్పుడే మనము మన మనసును మన ఆధీనంలో ఉంచుకోగలము.మన మనసు ఎప్పుడు మన స్వాధీనంలో ఉంటుందో,అప్పుడే మనము నిర్మల మనస్కులము కాగలము.లేక పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్లు ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఉంటాము.

క్రోధా ద్భవతి సమ్మోహః

క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః। స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి॥63॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు తన చెలికాడు అయిన అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!చెలికాడా!నీకు శృంఖల చర్య,అదే గొలుసు కట్టు చర్య అంటే తెలుసు కదా!ఒక పని మొదలు పెడితే అక్కడితో ఆగకుండా,మన ప్రమేయం లేకుండానే,మనకు ఊపిరి పీల్చుకునే అవథి కూడా ఇవ్వకుండా వెనువెంటనే జరిగి పోతుంటాయి కొన్ని పనులు.మనము నిర్ఘాంతపడి చూస్తూ ఉండాల్సిందే.ఎందుకంటే ఆ పరిణామాలను మనము ఆపలేము.ఇక్కడ నేను చెప్పబోయేది అదే.మనకు కోపం వస్తుంది.దాంట్లో ఆశ్చర్యం ఏముంది?మామూలే కదా!మనిషి అన్నాక ఆ మాత్రం కోపతాపాలు ఉండవా?అని మనలని మనం సమర్థించుకుంటాము.ఇదే మనము చేసే మొదటి తప్పు.ఎందుకంటే కోపం వస్తే మనము విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాము.విచక్షణ లేదు అంటే ముచ్చటగా అవివేకమనే కదా అర్థం!ఒకటి కొంటే ఒకటి ఉచితం కాదు.ఒకటి కొంటే పది ఉచితం లాగా కలుపుకుని వస్తాయి ఇక్కడ.ఎందుకంటే అవివేకంతో పాటు స్మృతిభ్రంశం అంటుకుంటుంది.అంటే మతి మరుపు.ఇంతకు ముందు మనము నేర్చుకున్న మంచి చెడ్డా,పెద్దా చిన్నా,తప్పూ ఒప్పూ అన్నీ చిటికెలో మాయమవుతాయి.దీని పర్యవశానం ఏందంటే బుద్ది చెడుతుంది.చెడ్డ ఆలోచనలు,చెడ్జ తలపులు,చెడ్డ పనులకు మొగ్గు చూపుతాము.ఒకసారి సద్బుద్ధిని కోపమనే చెదపురుగు తొలిచిందనుకో,ఇంకేముంది?సర్వం నాశనమే!పురుషుడు అథోగతికి జారిపోతాడు.

Friday, 20 March 2026

ధ్యాయతో విషయాన్ పుంసః

ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూప జాయతే। సంగా త్సంజాయతే కామః కామాత్ క్రోధోఽభి జాయతే॥62॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి విడమరిచి చెబుతున్నాడు.కౌంతేయా!కిటుకు అంతా ఇంద్రియ నిగ్రహంలోనే ఉంది.ఎందుకంటవా?మామూలుగా మనిషి ఇంద్రియాల సహాయంతోటే అన్ని విషయాల పైన ఆసక్తి,అనురాగం,మోహం,కామం పెంచుకుంటాడు.మనము కోరుకున్నది దక్కకపోతే అసహనం,అసంతృప్తి,చివరకు కోపం,క్రోథం ...వీటికి లోనయి,బానిసలం అవుతాము.ఆ చిక్కుముడి నుంచి బయట పడలేము.అక్కడక్కడే గింగిరాలు తిరుగుతుంటాము.

తాని సర్వాణి సంయమ్య

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః। వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥61॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము చెయ్యాల్సిన పని ఏందో చెప్పనా?మనము ముందర ఈ ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.అవి ఆడమన్నట్లు మనం ఆడకూడదు.అలుసు అయిపోతాము.ఎల్లప్పుడూ మన ఆసక్తి అంతా ఆత్మ పైనే ఉండాలి.అట్లా ఎవరు అయితే వాళ్ళ ఇంద్రియాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటారో,వారి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది.అసలు నిగ్రహమే లేని వారికి స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది?గాలి ఎటు మళ్ళితే అటు పోతుంటారు.

Thursday, 19 March 2026

యతతో హ్యపి కౌంతేయ

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః। ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః॥60॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ప్రక్రియ ఎంత కష్టమో చెపుతున్నాడు.అర్జునా!హే కుంతీపుత్రా!నేను చెప్పేది ఆచరణలో పెట్టడం అనేది అంత సులువు కాదు.నిజం చెప్పాలంటే చాలా కష్టమే!ఎంత ప్రజ్ఞా పాటవాలు ఉన్నా,ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తాము.ఎందుకంటే మనసును నియంత్రించడం మన చేతిలో లేదు.మెదడు వద్దన్నా మనసు కావాలంటుంది.ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టతరమయిన క్రియ.మన మనసును చంచల పరచి,వ్యాకుల పరుస్తాయి.మన మనశ్శాంతిని హరించేస్తాయి.తప్పు అని తెలిసినా నియంత్రించలేము.ఆ కర్మలు తప్పు అనే అవగాహనే లేని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకో!ఈ కోరికలు మనల్ని ఒకచోట కుదురుగా నిలబడనీయవు,కూర్చోనీయవు.

విషయా వినివర్తంతే

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః। రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే॥59॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు వాంఛలకు దూరంగా ఉండాలి అని అన్నాను కదా!దాని వలన సగము పనే అవుతుంది.అంటే కోరికలను ఆపుకోవడము,వాటిని త్రుంచివేయడము,దూరంగా ఉండడం అనే ప్రక్రియల వలన విషయదూరుడవుతాడు,అంతే.కానీ ఆ వాసనాబలం అంత తొందరగా పోదు.బాహ్యంగా లేక బాహాటంగా ఆ కర్మలు లేక విషయాల జోలికి పోకపోయినా మనసులోనుంచి పూర్తిగా చెరిగిపోవు.వాటి ఆలోచనలు,వాటిపైన ఇచ్ఛ అనేది తొలుస్తూ ఉంటుంది,కనీసం అప్పుడప్పుడైనా.ఆ ముద్రలు అంత సులభంగా చెరగిపోవు.వీటినే వాసనలు అంటారు.మనము ఆ పరమాత్మను వీక్షించ గలిగినపుడు మటుకే ఈ వాసనాబలం పూర్తిగా తొలగిపోతుంది.మనము స్వచ్ఛముగా తయారు అవుతాము.ఆ పరాత్పరుడిని చూడగలగాలంటే నమ్మకము,దీక్ష,భక్తి,అంకితభావము...అన్నీ నిండుగా,మెండుగా ఉండాలి మనలో.

Wednesday, 18 March 2026

యదా సంహరతే చాయం

యదా సంహరతే చాయం కుర్మోఽంగానీవ సర్వశః। ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥58॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి ఏమూలనో కొంచెం అనుమానంగా ఉంది.తను చెప్పేది అర్జునుడికి సరిగ్గా అర్థం కావడం లేదేమో అని.అందుకని సోదాహరణంగా చెప్పాలని తీర్మానించుకున్నట్లు ఉన్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!తాబేలు ఎట్లుంటుంది?అస్తమానమూ ఏమి చేస్తుంది?తన శరీర అవయవాలన్నిటినీ తన లోపలకు ముడుచుకుని కూర్చుని ఉంటుంది కదా!మనము కూడా ఇంచుమించుగా అలాగే ఉండేదానికి ప్రయత్నించాలి.ఎందుకు?ఏమిటి?ఎలా?అని అంటావా?చెబుతాను విను.మనము మన ఇంద్రియాలను విషయాలనుంచి మరల్చాలి.వాటిని మన ఆథీనంలో ఉంచుకోవాలి.ఈ ఇంద్రియాలను పకడ్బందీగా మన వశంలో ఉంచుకోకపోతే వ్యవహారం అంతా తీన్ తార్ అవుతుంది.మన బుద్ధి స్ధిరంగా ఉండాలంటే ఇవన్నీ తప్పని సరి.దగ్గరి మార్గాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు ఎక్కవ కాలం.మనము ప్రతిదీ క్షుణ్ణంగా అభ్యసించాలి.వేరే దారి లేదు.

య స్సర్వత్రానభిస్నేహః

య స్సర్వత్రానభిస్నేహస్తత్త త్ప్రాప్య శుభాశుభమ్। నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥57॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థిత ప్రజ్ఞత గురించి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనకు దేని పైనా కోరికలు ఉండకూడదు.మనకు జరిగే మంచి చెడులను సమానంగా స్వీకరించాలి.తేడా చూపించకూడదు.ఎందుకంటావా?కర్తవ్యం మటుకే మనము చేయాల్సినది.దాని ఫలితం మనకు అనవసరము.అక్కరలేదు.ఆనందం దుఃఖం అనే భావాలకూ,భావనలకు అతీతంగా ఉండాలి.ఎవ్వడు అయితే పైన పేర్కొన్న విథంగా ఉంటాడో వాడి బుద్ధియే సుప్రతిష్టమయినది.ఆస్థితికి మనము చేరుకోగలిగితే మనలను తలదన్నేవాడు ఉండడు.మనము ఉత్కృష్టమయిన స్థానంలో ఉన్నట్లు లెక్క.

దుఃఖే ష్వనుద్విగ్నమనాః

దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః। వీతరాగ భయక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే॥56॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి తన సఖుడి స్థితి,దుస్థితి చూస్తుంటే చాలా బాథగా ఉంది.తన సాయశక్తులా పోరాడుతున్నాడు అర్జునుడిని ఆ పరిస్థితి నుంచి బయటపడేసేదానికి.అర్జునా!స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనే కదా నీ ప్రశ్న?నేను చెబుతున్నాను,విను.దుఃఖాలకు,కష్టాలకూ దిగులు పడకూడదు.కలత పడకూడదు.సుఖాలు తలుపు తడితే పరవశం పొందకూడదు.రెండింటినీ సమానంగా స్వీకరించగలగటం నేర్చుకోవాలి.తెలుసుకోవాలి.ఈ ప్రేమలు,ద్వేషాలూ,భయాలూ,బరువులు,కోపాలూ,తాపాలూ ..వీటన్నిటినీ ప్రక్కకు పెట్టేయాలి.అహాఁ!అసలు టోకుగా వదిలేయాలి.ఝంఝాటకాలు అస్సలు ఉండకూడదు.ఈ ప్రలోభాలన్నిటికీ ప్రభావితం కానివాడే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు.ఇదంతా నేను చెప్పటం కాదు.గొప్ప గొప్ప మహనీయులు,మునులు చెప్పే మాట.

Monday, 16 March 2026

ప్రజహాతి యదా కామాన్

శ్రీ భగవానువాచ.... ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్। ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే॥54॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... మనల్ని ఎవరైనా ఏమన్నా అడిగితే వెంటనే సమాథానం చెప్పేస్తాము.తప్పో ఒప్పో,తరువాతి విషయం.అందులో శ్రీకృష్ణుడు భగవంతుడు,సర్వాంతర్యామి.అతనికి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాథానం చెప్పడం ఒక లెఖ్ఖా?మనం అడగాలి గానీ.శ్రీకృష్ణుడికి ఒకటి అర్థం అయింది.అర్జునుడికి జిజ్ఞాస పెరిగింది.తను చెప్పింది అర్థం చేసుకోవాలనే తపన మొదలు అయింది.అదే జ్ఞానోపాసనకు అంకురార్పణ అని కృష్ణుడు చాలా సంతోషించాడు.చెప్పడం మొదలు పెట్టాడు.అర్జునా!పార్థా!ఈ రోజు నీ అనుమానాలు అన్నీ ఓపికగా తీరుస్తాను.స్థిత ప్రజ్ఞుడు ఎవరు అని కదా నీ మీమాంస?మొదట సర్వవాంఛలనూ విసర్జించాలి.అంటే కోరికలనన్నిటినీ వదలి పెట్టాలి.ఆత్మయందే తాను ఆనందిస్తూ ఉండాలి. సముద్రము తీరం దగ్గర అలలు వస్తుంటాయి ఎప్పుడూ.అదే లోపలికి,ముందుకు పోయేకొద్దీ నిర్మలంగా ఉంటుంది.ఆటూ పోట్లూ కనిపించవు.అలా మనసును ప్రశాంతంగా పెట్టుకోగలగాలి.అలా ఉండగలిగిన వాడినే స్థిత ప్రజ్ఞుడు అను అంటారు.

స్థితప్రజ్ఞస్య కా భాషా

అర్జున ఉవాచ... స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ। స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్॥54॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలు ఒక్కసారే చెపుతున్నాడు కదా!అర్జునుడికి దిమ్మ తిరిగిపోతుంది.ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.శ్రేయోభిలాషి కదా ఎంతైనా!చెప్పింది విందాము లే అనుకున్నాడు.కానీ మరీ ఇంతనా?ఒకసారి యోగము అంటాడు.వెంటనే మోక్షము అంటాడు.ఊపిరి పీల్చుకునే లోపల సమన్వయం అంటాడు.కర్మ సిద్ధాంతం అంటాడు.పిచ్చి పట్టి పోతుంది.జుట్టు పీక్కోవటం మటుకే మిగిలింది.ఇట్లా అయ్యేది కాదు అని అర్జునుడు గొంతు సవరించుకుని చిన్నగా అడగడం మొదలుపెట్టాడు. హే కృష్ణా!హే సఖా!నీవు ఏందేందో చెబుతున్నావు.ఒక్క ముక్క కూడా అవగతం కావటంలేదు.ఈ స్థిత ప్రజ్ఞుడు ఎవరు?ఎక్కడినుంచి వచ్చాడు?అతడు ఎట్లా మాట్లాడతాడు?అతని గుణగణాలేంది?లక్షణాలు ఏంది?అతని స్థితిగతులు ఏంటి?అతను ఏమి చేస్తాడు?ఎట్లా కూర్చుంటాడు?ఎట్లా నిలుచుంటాడు?ఎలా ఉంటాడు?కొంచెం నాకు అర్థం అయ్యేలా చెప్పు స్వామీ!

Sunday, 15 March 2026

శ్రుతి విప్రతి పన్నాతే

శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా। సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి॥53॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!పొద్దున లేచి మనం ఏదో ఒకటి వింటుంటాము.అందులో కొన్నిటికి తీవ్రంగా స్పందిస్తాము.కొన్నిటికి ఒక మోస్తరుగా!కానీ స్పందించక మానము.దాని వలన మన మనసు చపలత పొందితుంది.ఇది కావాలి,అది వద్దు.దీనికి దగ్గర కావాలి,దానికి దూరం కావాలి.ఇంకో విషయం గురించి పలాయనం చిత్తగించాలి అనుకుంటాము.కానీ మన మనసు,బుద్ధి వీటన్నిటికంటే ఉన్నతంగా ఆలోచించాలి.స్థిత ప్రజ్ఞత ప్రదర్శించగలగాలి.స్థిరంగా,దేనికీ చలించకుండా,చిత్త చాంచల్యం చూపకుండా ఉండగలగాలి.అప్పుడే యోగాన్ని పొందగలతావు.యోగము అంటే ఓయమ్మో అని భయపడపనిలేదు.మనసును నిర్మలంగా ఉంచుకోగలగటమే,ఆటూపోటూ అనుకోకుండా.

యదా తే మోహకలిలం

యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి। తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ॥53॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బుద్ధి కుశలత కొంచెం పెంచుకుంటే అన్ని విథాలా మంచిది అని సలహా ఇస్తున్నాడు.ఎంతైనా మిత్రుడు కదా!ఆ మాత్రం మంచీ చెడ్డా చెప్పకపోతే ఎలా? అర్జునా!నేను చెప్పినట్లు విను.ముందర ఈ మోహ పంకిలం,పాప పంకిలం నుంచి బయటపడు.అప్పుడుగానీ ఏదీ సరిగ్గా అర్థంకాదు నీకు.అసలైన దారి గోచరించదు.దాని నుంచి విడిపడినప్పుడే నీ బుద్ధిని పరిశుద్థం చేసుకోగలవు.ఇంక వేరే దగ్గర మార్గాలు లేవు.ఇప్పటికే విన్న విషయాలూ,ఇంక తదుపరి వినవలసిన విషయాలూ నుండీ బయటపడగలతావు.వైరాగ్యమనేది ఊరికే ఆషామాషీగా దక్కదు.మనకు గట్టిగా కావాలనుకున్నది ఒక్కటి దక్కకపోతేనే తీన్తార్ అవుతాము.అలాంటిది సర్వసంగ పరిత్యాగం అంటే మాటలు కాదు కదా!సతతం అభ్యాసం చేయాల్సిందే!దక్కేదాకా ఒక యజ్ఞం,దక్కిన తరువాత నిలబెట్టుకునే యత్నం.అర్థం అయిందా?

Thursday, 12 March 2026

కర్మజం బుద్ధియుక్తా హి

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః। జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛ న్త్యనామయమ్॥51॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చిలకకు చెప్పినట్లు చెబుతున్నాడు ఓపిక నశించకుండా.రామ చిలకకు రెండు పలుకులు నేర్పించాలంటే ఎంత ఓపిక కావాలి?ఎంత ప్రేమ,సున్నితత్త్వంకావాలి?ఓర్పు,సహనం కావాలి.అవి అన్నీ కృష్ణుడు తనలో రంగరించుకుని అర్జునుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అర్జునా!నేను నీకు సమబుద్ధి అలవరించుకోమని చెప్పాను కదా?ఎందుకనుకుంటున్నావు?ఎందుకంటే సమబుద్ధి కలవాడు మొట్ట మొదటగా కర్మ ఫలాన్ని ముమ్మాటికీ ఆశించడు.దానికి ప్రతిఫలంగా జన్మబంధ విముక్తుడు అవుతాడు.చూసావా?ఏమీ కోరుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే,వాటి సత్ఫలితాలు మన ముంగిట్లో వాలుతాయి.అట్లా కాకుండా ప్రతి కర్మకూ ఫలితం ఆశిస్తూ పరుగులు తీస్తే ఆయాసం,అలసట తప్ప ఇంకేమీ దక్కదు.ఒకసారి మనము జన్మ బంధ విముక్తులము అయ్యామంటే మోక్ష ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి.మనకు స్వాగత వచనాలు చెబుతాయి,ఆశీర్వాదాలు ఇస్తాయి.నా మాట నమ్ము.

Tuesday, 10 March 2026

బుద్ధి యుక్తో జహా తీహ

బుద్ధి యుక్తో జహా తీహ ఉభౌసుకృత దుష్కృతే। తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్॥50॥2॥ శ్రీమద్భగవద్గీత.।।సాంఖ్య యోగము... అర్జునుడికి కిటుకు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు.అర్జునా!తెలివి గలవాడు ఏం చేస్తాడో నీకు తెలుసా?లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చూసుకుని సమంచేసుకుంటాడు.సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాల లెక్కలను కూడా ఈ జన్మలోనే నశింపచేసుకుని జీవితమనే పలకను శుభ్రం చేసుకుంటాడు.ఎలాంటి అర్థం పర్థంలేని గీతలు ఉండకుండా.నా దృష్టిలో నువ్వు కూడా అలాంటి యోగాన్ని ఆశ్రయించి,అనుసరించి కర్మలను ఆచరిస్తే మంచిది అని నా అభిప్రాయం.నువ్వేమంటావు?

దూరేణ హ్యవరం కర్మ

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ। బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణా ఫలహేతవః॥49॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి పదే పదే చెబుతున్నాడు.అర్జునా!నిష్కామ కర్మ,అనగా ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసే పనులు,ఎప్పుడూ మంచివే!అదే ప్రతిఫలంకోరి చేసే పనులు హీనమయినవి.అట్లా ప్రతిఫలం కోరి కర్మలు చేసేవాళ్ళు అథములు అవుతారు.నీవు ఆ పనులకు దూరంగా ఉండు.నువ్వు ఆ వర్గంలో చేరకు.సమన్వయం పాటించు.సమబుద్ధి అవలంబించు.నీవు ఆధ్యాత్మిక జ్ఞానానికి పెద్ద పీట వెయ్యి.

Monday, 9 March 2026

యోగస్థః కురు కర్మాణి

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ। సిద్ధ్య సిద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥48॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... కృష్ణుడు లాంటి స్నేహితుడు మన అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!అర్జునుడికి సరి అయిన సమయంలో కర్తవ్యం బోథిస్తున్నాడు.ఏది ఒప్పు,ఏది తప్పు చెబుతున్నాడు.భయం పోగొట్టి ధైర్యం చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే ధనంజయా!హే పార్థా!మనము ముందర ద్వంద్వ వైఖరి మానుకోవాలి.లాభం,నష్టం...ఈ రెండింటినీ ఒకేలాగా చూడగలగాలి.ఏ విషయమైనా మోహము,లాలస ఉండకూడదు.యోగబద్థుడుగా అవాలి.మనము అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి అయినా,ఏ కారణం చేత అయినా సఫలం కాలేక పోయినా మనము విచారించకుండా ఉండగలగాలి.సమబుద్ధి ప్రదర్శించాలి.నియమిత కర్మలు ఆచరించాలి.నియమిత కర్మలు అంటే నిత్య కర్మలు.మన మనసు తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాలి.నిష్టగా,చిత్తశుద్ధితో మనము చేయాల్సిన కర్మలు ఆచరించాలి,కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా!

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన। మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగో స్త్వ కర్మణిః॥47॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మ సూత్రం చెబుతున్నాడు.హే పార్థా!ఓ అర్జునా!కర్మ చేయడం వరకే నీ వంతు.కర్మఫలం ఆశించడం నీ పని కాదు.నేను చేసే పనికి ఫలితం నాకే దక్కాలి అని ఆశించకు.నీకు హక్కులేదు.ఏ పని ఎప్పుడు,ఎలా,ఎంతలా,ఎక్కడ చేస్తే నాకు కావాల్సిన ఫలితం దక్కుతుంది అనే కోరికతో ఏ పనీ చేయవద్దు.నాకు లాభం లేనప్పుడు నేను ఎందుకు చెయ్యాలి ఏదైనా అని మానుకోవద్దు.ఎందుకంటే కర్మలు చేయడమే మన ధర్మము.వాటి ఫలాలకు మనము అధికారులు కాదు.

Sunday, 8 March 2026

యావానర్థ ఉదపానే

యావానర్థ ఉదపానే సర్వత స్సంప్లుతోదకే। తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥46॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి సూక్ష్మంలో మోక్షం గురించి చెబుతున్నాడు.అర్జునా!నా తట్టు చూడు.నేను చెప్పేది అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.నీరు ఎక్కడ ఉన్నా నీరే కదా!అలాగే జ్ఞానము కూడా.ఒక ఉదాహరణ చెబుతాను విను.నూతులు,చెరువులలో తక్కువ నీళ్ళు ఉంటాయి కదా,సముద్రంతో పోలిస్తే.కానీ వీటితో ఎంత ప్రయోజనము ఉందో వాటితో కూడా అంతే కదా!వేదాలలో చెప్పిన చాలా,అహాఁ,సమస్త కర్మల వలనా శాంతి దొరుకుతుంది కదా మానవుడికి.అదే శాంతి తత్త్వవేత్త అయినవాడికి తనకున్న జ్ఞానంలోనే ఇమిడి ఉంటుంది.సూక్షమా లేక స్థూలమా అనేకంటే వాటిలో ఉండే సారమునకే ఎక్కువ విలువ అని అర్థం చేసుకో.కాబట్టి అపోహలు,అనుమానాలు,అలజడులకు ఔషథం జ్ఞానము.కాబట్టి మానవుడికి జ్ఞానసముపార్జన అత్యంత కీలకం,అత్యవసరమూను.

Saturday, 7 March 2026

త్రైగుణ్య విషయా వేదా

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున। నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్॥45॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడు మంచిగా పేరు తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నాడు.అందుకని ప్రతిదీ ఓపికగా,విపులంగా వివరిస్తున్నాడు.అర్జునా!వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి.నువ్వు ఆ త్రిగుణాలకు అతీతంగా నిలబడాలి.ద్వంద్వ భావాలకు స్వస్తి చెప్పాలి.ఏదైనా సాధించాలి,సాధించిన వాటిని నిలుపుకోవాలి,అదే యోగక్షేమాలు,అనే ఆదుర్దా,దుగ్థ,అపేక్ష నిర్ద్వంద్వంగా వదులుకోవాలి.శుద్థ సత్వాన్ని అవలంబించాలి.అంటే రజోగుణము,తమోగుణము మరకలు అంటని పవిత్రమయిన సత్త్వగుణ మార్గాన్ని ఎంచుకోవాలి.బాహ్య బంధాలను విడిచి పెట్టి ఆత్మ జ్ఞానివి కావాలి.ఇదే నా కోరిక!

భోగైశ్వర్య ప్రసక్తానాం

భోగైశ్వర్య ప్రసక్తానాం తయాఽపహృత చేతసామ్। వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే॥44॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వర్గ ప్రాప్తి ఆషామాషీ వ్యవహారం కాదు అని చెబుతున్నాడు.అర్జునా!మనిషికి విషయలాలస,భోగలాలస ఎక్కువ.ఆ భోగైశ్వర్యాలను ఆశించడం మొదలు పెడితే వాటికి అంతం అంటూ ఉండదు.మొదట కోరిక మొదలవుతుంది.ఇంక వాటికోసం అనేక కర్మకాండలలో మునిగిపోతాడు మానవుడు.అన్ని కోరికలు ఉన్నవాడు ఇంక ప్రశాంతంగా,నిశ్చలమయిన మనసుతో ఏమి ధ్యానం చేయగలడు?బుద్ది నిలకడగా ఉంటుందా,ఎక్కడైనా?ఓం ఓం అంటూ మొదలు పెడతాడు.గబుక్కున పక్కింటివాడి దగ్గరనుంచి రాబట్టాల్సిన బాకీ గుర్తొస్తుంది.మళ్ళీ ఓం ఓం అని మొదలు పెడతాడు,ఏవరిని మభ్యపెట్టి తన పనులు సానుకూలం చేసుకోవాలో ఆలోచిస్తాడు.ఇంక చిత్త శుద్ధి ఎక్కడ నుంచి వస్తుంధి?

Friday, 6 March 2026

కామాత్మానః స్వర్గపరా

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదామ్। క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి॥43॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చాలా మందికి స్వర్గం దక్కాలి అనే లాలస ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా!ఆ కోరిక,కామన ఎక్కువై లెక్కకు మిక్కిలి కర్మకాండలలో మునిగి తేలుతుంటారు.ఎవరు ఏమి చెప్పినా స్వర్గ ప్రాప్తి విషయంగా,ముందు వెనకా చూసుకోకుండా,సరైన ఆలోచన,వితరణ లేకుండా చేసేస్తుంటారు.అక్కడ మనసు భగవంతుడి పైన లగ్నం చేయడం,నిబద్ధత ఉండడం ఉండవు.ఎట్లో ఒకట్ల సంపాదించేసెయ్యాలి అనే ఆరాటమూ,కోరిక తప్ప.దానికి పర్యవసానం ఏందే చెప్పమంటావా?వాళ్ళందరూ కూడా జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోతారు తప్ప,స్వర్గము,మోక్షము అనే తీరం చేరరు.

Thursday, 5 March 2026

యామిమాం పుష్పితాం వాచం

యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః। వేద వాదరతాః పార్థ నాన్య దస్తీతి వాదినః॥42॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ఎలాంటి మొహమాటం లేకుండా మానవుడి బుద్ధి ఎలా ఉంటుందో అర్జునుడికి చెబుతున్నాడు.హే అర్జునా!హే పార్థా!వివేకం లేని జ్ఞానం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు.కొందరు వేదాలు చదివేస్తారు,ఏమి చేస్తే స్వర్గం దక్కుతుంది అని.స్వర్గ ప్రాప్తి సాథన లాలసలో పడి లేస్తుంటారు.లేచేది ఏంది?ఘాటుగా మునుగుతుంటారు.దానికి మించినది లేదని తెగ వాదిస్తుంటారు.మాటలు,చేతలు తప్ప మనస్పూర్తిగా,మనసా వాచా కర్మణా పాటించరు.

Wednesday, 4 March 2026

వ్యవసాయాత్మికా బుద్ధి

వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన। బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్వయసాయినామ్॥41॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడికి శ్రీకృష్ణుడు విపులంగా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!కురునందనా!ఈ యోగంలో అన్నిటికంటే నిశ్చలమయిన బుద్ధి ఉండడం చాలా ముఖ్యం.ఎందుకంటే అది ఒక్కటే ఏక కారణంగా ప్రకాశిస్తుంది.అంటే మనసు నిశ్చలమయితే మనము సరిగ్గా ఒకే విషయం పైన దృష్టి సాధించగలము.అనుకున్నది అనుకున్నట్లు సాథించగలము.అదే నిశ్చయత్వము లేదనుకో,ఏమవుతుంది.కనిపించనివన్నీ కావాలనిపిస్తుంది.ప్రతిదీ చేయాలనిపిస్తుంది.మనసుకు నిగ్రహం ఉండదు.అన్నిటి వెనకా వెంపర్లాడుతుంటుంది.ఏది కావాలి,ఏది వదులుకోవాలి అనే ఖచ్ఛితత్వం ఉండదు.ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏందంటే నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానము అనేక భేదాలతో,అనంత ముఖాలుగా ఉంటుంది.

Tuesday, 3 March 2026

నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్య వాయో

నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే। స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్॥40॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ముందర భయం పోగొడుతున్నాడు.ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు.అర్జునా!ఈ యోగంలో అభిక్రమ నాశం లేదు.ప్రత్యవాయ దోషం కూడా అసలే లేదు.అభిక్రమము అంటే మొదలు పెట్టిన పని అని అర్థము.అంటే మనము మొదలు పెట్టే పని వృథా కాదు అని అర్థము.అలాగే ప్రత్యవాయము అంటే అసంపూర్తిగా వదలి వేయడం అని అర్థము.అంటే ఏదైనా పొరపాటు,తప్పుల వలన చేయవలసిన పని అసంపూర్తిగా ఆగి పోయింది అనుకో,అయినా కూడా ఏ పాపమూ అంటదు అని అర్థము. అంటే ఈ కర్మ యోగము ప్రకారము ఏ పని అయినా కొంచెమే చేసినా,ఆచరించినా,ఫలితము చాలా గొప్పగా ఉంటుంది.సంసార భయము నుంచి మానవుడిని ఒడ్డుకు చేరుస్తుంది.ఇక్కట్ల నుండి తప్పిస్తుంది.

ఏషా తేఽభిహితా సాంఖ్యే

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు। బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి॥39॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడితో అనునయంగా చెబుతున్నాడు.పార్థా!కిరీటీ!ఇప్పటి దాకా నేను నీకు ఆత్మ తత్త్వం గురించి చెప్పాను.అది నీకు అర్థం అయిందనే ఆశ పడుతున్నాను.ఇప్పుడు ఇంక నీకు కర్మయోగము గురించి చెబుతాను.సాంఖ్య యోగము అంటే జ్ఞాన యోగము.ఏ యోగ జ్ఞానం వలన నువ్వు కర్మ బంధాలలో ఇరుక్కోవో,ఆ విశిష్టమయిన కర్మ యోగాన్ని నీకు పరిచయం చేస్తాను.మనసు లగ్నం చేసి మంచిగా విను.

Monday, 2 March 2026

సుఖ దుఃఖే సమే కృత్వా

సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ। తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి॥38॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సహేతుకమయిన మాటలు చెబుతున్నాడు.అర్జునా!నీ భయం ఏంది,ఇప్పుడు?అయిన వాళ్ళను,పెద్దవాళ్ళను చంపడం పాపం అని కదా!కానీ నీకు తెలుసా?అన్నిటినీ సమానంగా తీసుకోవడం నేర్చుకోవాలి.నీవు సుఖ దుఃఖాలనూ,లాభాలాభాలనూ,జయాపజయాలనూ సమానంగా స్వీకరించు.ఆ మనోస్థైర్యంతో యుద్ధం చెయ్యి.దేనికీ చలించకుండా,ఎలాంటి ప్పతిఫలమూ ఆశించకుండా నీ కర్మలను నీవు నిర్వర్తించావంటే ఎలాంటి పాపమూ నిన్ను అంటదు.కడిగిన ముత్యంలాగా మెరిసిపోతావు.

Sunday, 1 March 2026

హతో వా ప్రాప్స్యసే స్వర్గం

హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్। తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః॥37//2/ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచి మాటలు చెబుతున్నాడు.అర్జునా!పాండవ మథ్యమా!ఎందుకు ఈ గందరగోళం,గలభా గలభా!ప్రశాంతంగా ఆలోచించు.నీకే అర్థమవుతుంది.యుద్ధం చేస్తూ చేస్తూ మరణించావనుకో వీరమరణం పొందావని అందరూ నిన్ను శ్లాఘిస్తారు.అంతేనా?స్వర్గం పొందుతావు.అక్కడ స్వర్గ సుఖాలూ పొందుతావు.చెడుగా ఎందుకు అనుకోవడం.యుద్ధం చేసి గెలిచావనుకో!ఈ భూలోకంలో రాజ్యాన్నీ పొందుతావు,సకల సౌభాగ్యాలూ అనుభవిస్తావు.అంటే ఎటుపోయి ఎటొచ్చినా నువ్వు సుఖపడటం ఖాయం! మరి అట్లాంటప్పుడు ఈ పనికిమాలిన తర్జన భర్జనలు ఎందుకు?యుద్థం చేస్తాను,చెయ్యాలి,గెలవాలి అని ధృఢ సంకల్పంతో లేచి నడుము బిగించు.కదన రంగంలో కదం తొక్కు.నీకు తిరుగు లేదు.విజయం నీ ముందర వచ్చి వాలుతుంది.సానుకూల ధృక్పథంతో శంఖం పూరించు.

అవాచ్య వాదాంశ్చ బహూన్

అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః। నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్॥36॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి కఠోర సత్యం వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!ప్రతిదీ నీవు అనుకున్నంత సరళం కాదు.నీవు అయిన వాళ్ళను చేజేతులా చంపుకుని పాపం మూటగట్టుకోలేను.దానికంటే అస్త్ర సన్న్యాసం ఎంతో ఉత్తమం అనుకుంటున్నావు.కానీ ప్రపంచం ఏమనుకుంటుందో?ఆ చర్యను ఎలా స్వీకరిస్తుందో నేను నీకు విపులంగా వివరిస్తాను.విను. నీ శత్రువులు నిన్ను అనరాని మాటల తూటాలతో గాయపరుస్తారు.నీవు పౌరుషం లేని వాడివని ఎద్దేవా చేస్తారు.నీ పరాక్రమాన్ని శంకిస్తారు.చావ లేని వాడు,చావలేనివాడు అని ఎకచకాలాడతారు.గేలి చేస్తారు.చిన్నచూపు చూస్తారు.అవన్నీ నీవు తమాయించుకోలేవు.అంతకంటే దుఃఖ భూయిష్టం,దుఃఖ జనకం ఇంకేమి ఉంటుంది చెప్పు?ఎంత మందికి నీవు వివరణ ఇస్తూ పోతావు?నేను వీరుడు,శూరుడు,విక్రమార్కుడినే!కానీ ఆ సమయంలో శాంతంగా ,సమన్వయంతో,పాపభీతితో,అయినవాళ్ళని పోగొట్టుకోకూడదు అనే సదుద్దేశంతో యుద్ధంనుంచి నిష్క్రమించాను అని.చెప్పినా ఎంత మంది నమ్ముతారు నీ మాటలు?ఆలోచించు బాగా.

Saturday, 28 February 2026

భయా ద్రణా దుపరతం

భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాం మహారథాః। యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్॥35॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అద్దం చూపిస్తున్నాడు.అతను యుద్థం చేయక పోతే పరిస్థితి ఎంత దీనంగా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నాడు.అయ్యో అర్జునా!జరగబోయేది నీకు అర్థం కావడం లేదు.నీవు ఇప్పుడు యుద్థం చేయకపోతే ఏమవుతుందో నేను చెబుతాను విను.ఇప్పుడు రథులు,అర్థ రథులు,మహారథులు అందరూ నిన్ను ఒక పెద్ద వీరశిరోమణి అని భావిస్తున్నారు.అది కూడా నిజమే అనుకో!కానీ నీవు యుద్థరంగం నుంచి,క్షత్రియ ధర్మం నుంచి మొహం చాటేసిన మరు క్షణం నుంచీ నీ విలువ,గౌరవము అథః పాతాళానికి త్రొక్కి వేయబడతాయి.నీకంటే బలహీనులు కూడా నిన్ను గేలి చేస్తారు,అపహాస్యం చేస్తారు.నిన్ను పిరికివాడిగా చిన్నచూపు చూస్తారు.చులకన చేస్తారు.ఆ అవమానభారం నువ్వు మోయలేవు.తట్టుకోలేవు.నిన్ను గౌరవించి మర్యాద చేసేవాళ్ళు కనుచూపు మేరలో కానరారు.ఇది నిజం.నమ్ము.

అకీర్తిం చాపి భూతాని

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్। సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే॥34॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడిని కొంచెం బెదిరించి,ఇంకొంచెం నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సన్నిహితుడి హితము కోరినపుడు సహేతుకమయిన మార్గాలు అన్నీ వెదకాలికదా!ప్రయోగించాలి కదా! అర్జునా!నీవు పెద్ద వీరుడివి.అలాంటిది చేతులు ముడుచుకుని యుద్ధం చేయకుండా మొహం చాటేస్తే లోకం ఏమనుకుంటుంది?నీవు చెప్పే కాకమ్మ కబుర్లు,శాంతి సూత్రాలు అసలు కారణం అని నమ్ముతుంది అని ఆశ పడుతున్నావా?ముమ్మాటికీ లోకం అలా ఆలోచించదు.నీవు పిరికి పందవి అని ముద్ర వేస్తుంది.ఓటమికి భయపడి అస్త్ర సన్యాసం చేసావు అంటుంది.ఈ అపకీర్తి నీవు పోయినా పోదు.ప్రజలు కథలు కథలుగా నీ చేతకానితనం అని అభివర్ణిస్తారు.నీవు అభిమాన ధనుడివి.అలాంటి నీకు ఇలాంటి అపకీర్తి శరాఘాతం కాదా?ఆత్మహత్యాసదృశం కాదా?దానికంటే మరణమే వెయ్యి రెట్టు మేలు కాదా?ఆ అవమానభారం నీవు తట్టుకోగలవా?ఛీత్కారంగా,తుస్కారంగా నీవైపు చూసే చూపులు నీవు నిలువరించగలవా?నీవే తేల్చుకో!

Friday, 27 February 2026

అథచే త్త్వమిమం ధర్మ్యం

అధచేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి। తత స్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి॥33॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నా ప్రియ నేస్తమా!నేను నీకు చెప్పాను యుద్థం అనేది క్షత్రియ ధర్మము అని.నీవు ఈ ధర్మ బద్ధమయిన యుద్థం చేయలేదు అనుకో చాలా నష్టపోతావు.అవి ఏందంటావా?చెబుతా విను.నీకు ఎంత మంచి పేరు,యశస్సు ఉంది!అదంతా క్షణంలో మటుమాయమవుతుంది.ధర్మాన్ని అనుసరించని వాడిని ఏమంటరు?ధర్మ భ్రష్టుడు అని అంటారు.అట్లాంటి పేరు తెచ్చుకోవాలని ఉందా నీకు?చెప్పు?మౌనం అర్థంగీకారం అని అంటారు కదా!కౌరవులు తప్పు త్రోవలో పోతున్నారు.ఆ విషయం తెలిసీ,వారిని అరికట్టగలిగే శక్తి ఉండి కూడా మిన్నకుంటే ఏమవుతుంది?అసలు తప్పు చేసినవాడికంటే ఎక్కువ పాపాత్ముడివి అవుతావు.అలా అథోగతి పాలు కావడం అంత అవసరమా ఇప్పుడు నీకు.చెప్పు.మాట్లాడు.సమాథానం ఇయ్యి.దుష్టులను ఉపేక్షించడం చాలా పెద్ద నేరము.

Thursday, 26 February 2026

యదృచ్ఛయా చోపపన్నం

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్। సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశమ్॥32॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తాయిలం చూపిస్తున్నాడు.అర్జునా!అందగాడా!నీవు కలలో కూడా ఊహించని అదృష్టం నీ తలుపు తడితే ఏమి చేస్తావు?ఊహలకు కూడా అందని అదృష్టం నా చెంతకు నీజంగా ఎందుకు వస్తుంది అని అనుమానంతో,భయంతో తలుపులు మూసుకునే కూర్చుంటావా?లేక ఎగిరి గంతేసి,నాకు సుడి తిరిగిందోచ్,అనుకుంటూ పరుగెత్తి తలుపు తెరిచి స్వాగతం పలుకుతావా?ఏమి చేస్తావు?ఖచ్చితంగా రెండోదే కదా!ఆ నమ్మకం నీ మీద నాకు కూడా ఉంది. ఇప్పుడు యుద్ధం కూడా అలా అయాచితంగా,మన ప్రమేయం లేకుండా,తెరుచుకున్న స్వర్గ ద్వారాలు అనుకో!ప్రతి ఒక్క రాజుకు ధర్మ సంస్థాపన కొరకు యుద్థం చేసే అవకాశం రాదు.అది నీకు దక్కింది.అడగకనే దేవుడు నీకు వరమిచ్చాడు అనుకో!ఇంతటి అదృష్టం ఎంత మంది రాజులకు దక్కుతుంది చెప్పు?వచ్చిన బంగారం లాంటి అవకాశం జారవిడుచుకోకు.సద్వినియోగం చేసుకుని కీర్తి పతాకం ఎగురవెయ్యి.ఇదే నా సలహా నీకు.నీ మంచి కోరి చెబుతున్నాను.

స్వధర్మమపి చావేక్ష్య

స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి। ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే॥31॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తన ధర్మంగురించి చెబుతున్నాడు.అర్జునా!ఆప్తమిత్రా!ఇవన్నీ వదిలేసెయ్యి.నేను చెప్పేది ఈ ఒక్కటి విను.ఈ ఆత్మలు,జీవులు అన్నీ మరచిపో.మనకంటూ ఒక ధర్మం ఉంటుంది కదా!అది నీకూ తెలుసు కదా!అది ఆచరించు.క్రొత్తగా ఏమీ చేయనక్కరలేదు.గందరగోళం,గలభా అవసరమే లేదు.నీవు క్షత్రియుడివి కదా.క్షత్రియ ధర్మం ఏంది?నువ్వే చెప్పు.యుద్ధం కదా!అదే పాటించు.ఎలాంటి అపోహలు అక్కరలేదు,అనుమానాలు అక్కర లేదు.అవగాహనా రాహిత్యం అసలు అవసరం లేదు.తలలు బద్దలు కొట్టుకో బళ్ళేదు.తల పట్టుకోనక్కరలేదు.మన ధర్మాన్ని తు చ తప్పకుండా పాటిస్తే చాలు.సంశయానికి తావు ఉండదు.ఆత్మ తృప్తి కలుగుతుంది.

Wednesday, 25 February 2026

దేహీ నిత్య మవధ్యోఽయం

దేహీ నిత్య మవధ్యోఽయం దేహే సర్వస్య భారత। తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి॥30॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా చెబుతున్నాడు.అర్జునా!అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే.అది చంపదు,చంపబడదు.అది నిత్యము.అది సత్యము.కాబట్టి అర్జునా!అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని.అసలు అవసరము లేదు.

ఆశ్చర్యవ త్పశ్యతి

ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః। ఆశ్చర్యవచ్చైన మన్య శ్శృణోతి శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్॥29॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అందరూ ఆత్మ గురించి ఏమనుకుంటారో బాగా తెలుసు.అదే అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నువ్వు ఒక్కడివే కాదు ఆత్మ గురించి గందరగోళంలో ఉండేది. ఒకడేమో ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు.ఇంకొకడేమో ఆత్మ గురించి ఆశ్చర్యంగా పలుకుతున్నాడు.మరి ఇంకొకడు నోరెళ్ళ బెట్టుకుని ఆశ్చర్యంగా ఆత్మ గురించి వింటున్నాడు. ఇట్లా ఒక సరైన అవగాహన లేకుండా చూడడం ద్వారా,చెప్పడం ద్వారా,వినడం ద్వారా ఏమీ ఒరగదు.అంటే లాభం లేదు.ఆత్మను అంత సులభంగా తెలుసుకోలేము,అర్థం చేసుకోలేము.

Tuesday, 24 February 2026

అవ్యక్తాదీని భూతాని

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత। అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా॥28॥2॥ శ్రీమద్భగనద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చావు పుట్టుకల గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!భరత శ్రేష్టా!నువ్వు నిశితంగా గమనించు.ఈ సృష్టిలోని సకల భూతాలూ పుట్టకముందు మనకు కనిపిస్తున్నాయా?లేదు కదా!కానీ ఆ జీవులు అన్నీ పుట్టిన తరువాత కనిపిస్తున్నాయి కదా!ఎందుకంటావు?ఆలోచించు ఒక్క క్షణం. ఎందుకంటే కిందటి జన్మలో ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు.చనిపోయిన పిమ్మట మరు జన్మలో ఎవరు ఏ రూపం పొందుతారో మనకెవరికీ తెలియదు గనక.అలాంటి బంధుకోటి గురించి నీవు తల పగలగొట్టుకోవడం ఎందుకు?ఈ దిగులు,విచారం,ఈ నిర్వీర్యం,నిస్సత్తువ,నిర్వికారం ఎందుకు?మనసును ప్రశాంతంగా పెట్టుకో!

Monday, 23 February 2026

జాతస్య హి ధ్రువో మృత్యుః

జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ। తస్మా దపరిహార్యేఽర్థే న త్వ వం శోచితు మర్హసి॥27॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... చెట్టును ఒక తట్టు నుంచి నరక లేక పోతే ఇంకో తట్టు నుంచి నరుక్కోని రావాలి అంటాము కదా!కృష్ణుడు తను అర్జునుడికి చెప్పాల్సింది చెప్పాడు.కానీ అతనిలో ఏమీ మార్పు కనిపిస్తున్నట్లు లేదు.అందుకని అర్జునుడి మార్గంలోనే పోయి,అర్జునుడు సత్యం గ్రహించేలా చెయ్యాలని నడుము బిగించాడు. ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీవు ఆత్మకు మనకులాగే చావు పుట్టుకలు ఉన్నాయి అని గాఢంగా నమ్ముతున్నావు కదా!సరే!అప్పుడు కూడా ఏమవుతుంది?ఒకసారి ఆలోచించు.పుట్టినది గిట్టక మానదు కదా!ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవీ చావును తప్పించుకోలేదు కదా!మరణం తరువాత మళ్ళీ పుట్టడం అనేది అంతే సహజం కదా!ఈ రెండింటిలో ఏ ఒక్కదానినీ మనం ఆపలేము కదా!మన చేతుల్లో లేని ప్రక్రియ కదా.మరి మన చేతులలో లేని,మన నియంత్రణలో లేని దాని కోసరము మనము ఇంత దుఃఖిచడం అవసరమా?నువ్వే చెప్పు.

అథ చైనం నిత్యజాతం

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్। తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి॥26॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.అర్జునా! బామ్మర్దీ!ముందర ముఖం పైన కనిపించే ఆ దిగులు,విచారమూ తుడిచేయి.నీకు అసలు వాటి అవసరము లేదు. నేను ఆత్మ గురించి చెప్పే మాటలు నమ్మ బుద్ధి కావటం లేదా?అయినా పరవాలేదు.నువ్వు ఆత్మకు అంత విషయం లేదు.దానికీ చావు పుట్టుకలు ఉన్నాయి,ఉంటాయి కూడానూ అని అనుకుంటున్నావా?సరే!అట్లానే అనుకుందాము.అప్పుడు కూడా నీవు ఇంత దిగులు పడి,దుఃఖ పడి,యాగీ చేయాల్సిన అవసరము లేదు.ముందు స్థిమిత పడు.

Saturday, 21 February 2026

అవ్యక్తోఽయ మచింత్యో

అవ్యక్తోఽయ మచింత్యోఽయ మవికార్యో య ముచ్యతే తస్మాదేవం విది త్వైనం నాను శోచితు మర్హసి॥25॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి ఇంకా చెబుతున్నాడు. అర్జునా!ప్రియ సఖా!ఆత్మని కాల్చలేము,తడపలేము,ఎండబెట్టలేము,చంపలేము అని చెప్పాను కదా! అది మన పంచేంద్రియాలకు కూడా కానరాదు.అంటే మనము తాకలేము,వినలేము,వాసన గ్రహించలేము,రుచి చూడలేము,చూడలేము,మాటలాడలేము.ఈ ఆత్మ ఇలా ఉంటుంది!అలా ఉంటుంది అని చెప్పలేము.అసలు ఎలా ఉంటుంది అని ఊహించను కూడా ఊహించలేము.దీనికి ఆకారం లేదు,ఆహార్యం అసలే లేదు.అంటే నూటికి నూరు పాళ్ళూ నిర్వికారి. ఇది ఇప్పుడు నేను నీకు చెప్పడం కాదు.అనాది నుంచీ ఆత్మ గురించి చెప్పబడే విషయాలే.ముందర ఈ ఆత్మ తత్త్వాన్ని నువ్వు తెలుసుకో,అర్థం చేసుకో.ఇంతకు మించి ఇంకొక మార్గం లేదు.ఈ విషయం నువ్వు ఆకళింపు చేసుకుంటే దుఃఖం అనేది నీ చుట్టు ప్రక్కలకు కూడా రాదు.ఆమడ దూరంలో ఎక్కడో బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తూ,వణుకుతూ ఉంటుంది.నన్ను నమ్ము.

Friday, 20 February 2026

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ। నిత్యస్సర్వగత స్స్థాణు రచలోఽయం సనాతనః॥24॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... మన పెద్దవాళ్ళు ఏమి చెబుతారు?ఏదైనా ఒకటికి పదిసార్లు అధ్యయనము చేయాలి అని.అందుకే కదా పలక పైన అక్షరాలు అన్ని సార్లు దిద్దిస్తారు!గాఢనిద్రలో లేపి అడిగినా తప్పులు చెప్పకూడదు,వ్రాయకూడదు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి పదే పదే విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాడు. హే అర్జునా!నా ప్రియ మిత్రమా!ఈ ఆత్మ అనేది ఉందే!అది మామూలు కాదు మనం రోజూ చూసే విషయం లాగ.దీనిని మనం ఛేదించలేము,భేదించలేము.అంతేనా?అంటే అదీ కాదు.దహిస్తామా అంటే అట్లానూ కాల్చి బూడిద చేయలేము.సరేలే కనీసం తడుపుదాము అనుకుంటే దానికీ మళ్ళబడుతుంది.కించిత్ కూడా తడవదు.ఇంక ఎట్లా ఏగాలి,చెప్పు.తడపలేము,పోనీలే ఎండ కడతాము అని నిర్ణయించుకున్నాము అనుకో.ఆ విషయంలో కూడా మనది తప్పటడుగు అవుతుంది.ఊహూ!ఆ విషయంలో కూడా మనము విజయము సాథించలేము. దీనికంతటికీ కారణం ఏందో తెలుసా,అర్జునా!ఈ ఆత్మ అనేది నిత్యమయినది.నిన్నా మొన్న పుట్టింది కాదు...రేపో ఎల్లుండో పోతుందిలే అనుకునేదానికి!,మన పప్పులు ఏమీ దాని దగ్గర ఉడకవు.అది సనాతనమయినది.అది నిజము.అది ఎవరి ఆధీనములో లేదు.ఎవరూ దానిని గుప్పెట్లో దాచిపెట్టలేరు.

Thursday, 19 February 2026

నైనం ఛిందంతి శస్త్రాణి

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః। న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః॥23॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే.దీనిని ఎవరూ ఏమీ చేయలేరు.ఎలాంటి అస్త్ర శస్త్రాలూ దీనిని ఛేదించలేవు,భేదించ లేవు.ఎంతటి అగ్ని కూడా దీనిని దహించలేదు.ఎక్కడి నుంచి ఎన్ని సముద్రాల నీరు తెచ్చి పోసినా తడపలేము.అది తడవదు.ఎలాంటి భీకరమయిన గాలులు కూడా దానిని ఆరబెట్టలేవు.ఎండబెట్టలేవు.మనము దానిని ఏమీ చేయలేము.అన్నిటికీ అతీతము.

Tuesday, 17 February 2026

వాసాంసి జీర్ణాని

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి। తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥22॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... బుజ్జోడి బుల్లి బొజ్జలోకి బజ్జి బువ్వ పోవాలంటే అమ్మ బహు ప్రయాస పడుతుంది కదా!ఇక్కడ మన కన్నయ్య కూడా అర్జునుడి బుర్రలోకి కూసింత జ్ఞానం ఎక్కించేదానికి కడు కటకటలు పడుతున్నాడు. అర్జునా!మనము మన బట్టలు చినిగి పోతే ఏమి చేస్తాము?అట్లనే చీలికలు,పేలికలు వేసుకుని తిరగము కదా!వాటిని తీసి పారేస్తాము కదా!మంచిగా క్రొత్త బట్టలు వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతాము కదా! ఆత్మ కూడా అచ్ఛం అలానే ఆలోచిస్తుంది,చేస్తుంది.ఈ శరీరం నిరుపయోగమవుతుందనుకో!ఈ పనికిరాని పాత శరీరం విడిచి పెడుతుంది మొహమాటం లేకుండా!ఎంచక్కా క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఎంతో సహజంగా,సునాయాసంగా!

వేదావినాశినం నిత్యం

వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్। కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్॥21॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు పరి పరివిథాలా తపిస్తున్నాడు... అర్జునుడు తను చెప్పేది అర్థం చేసుకోవాలని.అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత పని చేస్తున్నాడు.ఇంక అర్జునుడు నమిలి,మింగితే చాలు! అర్జునా!నేను చెప్పాను కదా...ఆత్మ నాశనం లేనిదని.అలాగే నిత్యము అయినది అని.ఇంకా ఇంకా దాని గురించి ఇలా చెప్పాను కదా.ఆత్మకు వృద్థి,క్షయములు లేవు.అంటే పెరగదు,తరగదు.వ్యము కానిది కూడా!ఇవన్నీ తెలిసిన నేను కానీ ఇంకొకరు కానీ వేరొకరిని చంపడానికి ఎందుకు ప్రేరేపిస్తారు అసలు?తాము మటుకు ఎందుకు,ఎవరినైనా చంపుతారు చెప్పు?ఆలోచించు నిదానంగా.

Monday, 16 February 2026

న జాయతే మ్రియతే

న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః। అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥20॥2॥ శ్రమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అర్జునుడిని చూస్తే జాలి,దయ కలగటం లేదు.కోపం వస్తుంది.అయినా అన్నీ దిగమ్రింగుకోని ఇలా అంటున్నాడు. నేస్తమా!నేల చూపులు ఏంది?ఈ నీరసం,నిస్సత్తువ ఏంది?కాళ్ళూ,చేతులు వ్రేలాడేసుకుని ఈ బేల చూపులు ఏంది?ఈ చతికిలబడటం ఏంది? ముందర లెయ్యి అసలు.మనలను చూసి నలుగురు ఉత్తేజితులు కావాలి.పదిమందికి మనం ప్రామాణికంగా నిలవాలి.బెబ్బెబ్బే అంటూ ఈ దీనాలాపనలు,బొబ్బెబ్బో అంటూ ఏడుపులు ఏంది?చలనం తెచ్చుకో!నా కళ్ళలోకి చూడు.నేను చెప్పేది మనసు పెట్టి విని,ఆకళింపు చేసుకో! ఆత్మ పుట్టేది కాదు.దానికి చావు అనేది లేదు.అట్లా అని ఒకప్పుడు ఉండి,ఇంకోకప్పుడు లేకుండా ఉండదు.ఆత్మ జనితమయినది కాదు.దానికి మార్పులు,చేర్పులు,తక్కువలు,ఎక్కువలు అంటూ ఏమీ ఉండవు.దానికి నాశనం అనేది లేదు.అది సనాతనమయినది.అది చంపదు.చావదు,చావబడదు.అది ధరించిన శరీరం నశిస్తుంది, దానికి చావు ఉంది కానీ ఈ ఆత్మకు మటుకు చావు లేదు,నాశనం అవదు.

య ఏవం వేత్తి హంతారం

య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే॥19॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి చెబుతున్నాడు.మిత్రమా!అర్జునా!నీకు ఈ విషయం తెలుసా?ఈ ఆత్మ అనేది ఉందే!అది దేనిని చంపదు.దేని చేత చంపబడదు.ఎవరైనా ఆత్మ చంపుతుంది,లేకపోతే చంపబడుతుంది అనుకుంటే...వారంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరు.ఎందుకంటే ఆత్మ వీటన్నిటికీ అతీతమయినది.ఏదీ దానిని మలినం చేయలేదు.నాశనము చేయలేదు.అది స్వచ్ఛమయినది.నిత్యమయినది.నిరామయము.

Sunday, 15 February 2026

అంత వంత ఇమే దేహా

అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః। అనాశినోఽప్రమేయస్య తల్మా ద్యుధ్యస్వభారత॥18॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడిని బుజ్జగిస్తున్నాడు.అర్జునా!ధరించబడిన దేహాలు నశిస్తాయి.దానిని ధరించిన జీవుడు,అదే ఆత్మ నాశనం కాదు.అది నిత్యమయినది.సత్యమయినది.ముందు నువ్వు ఆ విషయం తెలుసుకుని,గుర్తు పెట్టుకో.ఈ అనవసరమయిన దుఃఖాన్ని మానివెయ్యి.యుద్ధానికి నడుము బిగించి విజయమో,వీరస్వర్గమో తేల్చుకో!వెనకకు తగ్గొద్దు.

Saturday, 14 February 2026

అవినాశి తు తద్విద్ధి

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్। వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి॥17॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.సఖా!అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే!అది ఈ జగత్తు అంతా పరివ్యాప్తమయి ఉంది.అంటే వ్యాపించి ఉంది.దానికి నాశనము లేదు అని తెలుసుకో.ఈ ఆత్మ అవ్యయము.దీనిని నాశనం చేసేది,చేయగలిగేది ముల్లోకాలలో ఏదీ లేదని అర్థం చేసుకో! అసలు అవ్యయము అంటేనే నాశనము లేనిది.సర్వకాల సర్వావస్థల యందు మార్పులు,చేర్పులు లేకుండా ఉండేది.అది నిత్యమూ,సత్యమూ కూడాను.

Friday, 13 February 2026

నాసతో విద్యతే భావో

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః। ఉభయోరపి దృష్టోఽన్త స్త్వనయో స్తత్త్వదర్శిభిః॥16॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడి బుర్రలోకి తాను చెప్పేది ఎక్కాలని చాలా తాపత్రయపడుతున్నాడు.ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇటు చూడు.దేహం కలిగిన వారు అందరూ అశాశ్వతులు.ఆత్మ శాశ్వతము.దానికి లేమి అనేది లేనే లేదు.దేహాదులు అంతా మాయ,అశాశ్వతము.అదే ఆత్మ అనేది నిత్యమూ,సత్యమూ అయినది.ఇది అర్థం చేసుకో ముందు. ఈ విషయాన్ని తత్త్వజ్ఞులందరూ ఎప్పుడో తెలుసుకున్నారు.ఇది నిశ్చలమయిన,నిశ్చితమయిన సత్యము.దీనినుంచి ఎవరూ మొహం చాటు వేయలేరు.ఒప్పుకోవాలసిందే!

Thursday, 12 February 2026

యం హి న వ్యథయం త్యేతే

యం హి న వ్యథయం త్యేతే పురుషం పురుషర్షభ। సమ దుఃఖ సుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే॥15॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఇవన్నీ వదిలేసెయ్యి.సుఖాలూ,దుఃఖాలూ ప్రతి ఒకేరి జీవితంలో సర్వ సాథారణము కదా!వాటికి మనము చలించడం మానేయాలి.అవి బాథ పెట్టాయని ఏడవడం,సుఖ పెట్టాయని గెంతులు వేయడం ముందు మానుకోవాలి.అవి మనలను ఏ రకంగానూ ప్రభావితం చేయకూడదు.ఆ స్థితికి మనము చేరాలి.ఇవన్నీ దాటుకుని పోతేకానీ మనకు మోక్షానికి అర్హత సంపాదించలేము. సుఖాలనూ దుఃఖాలనూ సమానంగా స్వీకరించగలిగే స్థితికి చేరుకున్నవారే మోక్షానికి అర్హులు అవుతున్నారు.

Wednesday, 11 February 2026

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః। ఆగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత॥14॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడి ఓపికకి నిజంగా జోహార్లు!మాములుగా మన ప్రక్క వాడి కంటే మనము కొంచెము ఎక్కవ అనే భావము రాగానే మనకు కళ్ళు నెత్తికి ఎక్కుతాయి.ఎక్కువ తెలివి అనేది నిజమయినా,నిజం కాకపోయినా!అలాంటిది భగవంతుడు అయి కూడా అంత ఓపికగా,సులభంగా అర్థం అయ్యేలాగా చెబుతున్నాడు అంటే మనమంతా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి అని కొంచెం ఆలోచించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!మనము చలి అయినా,వేడి అయినా ఎట్లా తెలుసుకుంటాము?మన ఇంద్రియాల వలనే కదా!సుఖ దుఃఖాలు కూడా అంతే.ఇంద్రియాల వలనే కలుగుతాయి.ఆకాశంలో కదిలే మేఘాలలాగానే.ఈ క్షణం కనిపిస్తాయి.ప్రక్క క్షణం మాయమవుతూ ఉంటాయి.అవి అక్కడే పాతుకు పెట్టుకుని కూర్చోవు కదా!అవి శాశ్వతం కాదు.చంచలం.వస్తుంటాయి,పోతుంటాయి. ఇట్లా మనము ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు లోనయితే ఎలాగా?నీవే చెప్పు.

Monday, 9 February 2026

దేహినోఽస్మిన్ యథాదేహే

దేహినోఽస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా। తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి॥13॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ముందర అర్జునుడిని స్వాంతపరుస్తున్నాడు.చిన్నగా,అనునయంగా,ప్రేమగా చెబుతున్నాడు. అర్జునా!నేను ఎందుకు అందరమూ అన్ని కాలాలోనూ ఉంటాము అని చెబుతున్నానో గ్రహించేదానికి ప్రయత్నం చెయ్యి.మనకు ఈ శరీరం ఉంది కదా!దానివలన సహజంగా ఈ దేహానికి బాల్యం,యవ్వనము,ముసలితనము కలుగుతాయి కదా!అది నువ్వుకూడా ఒప్పుకుంటావు కదా!ఇలాగే మరో దేహాన్ని పొందడం కూడా ఇంతే సహజం.బుద్దిమంతులు సులువుగా ఈ విషయాన్ని గుర్తిస్తారు.కలవరపడరు.మోహితులు అస్సలేకారు.స్థితప్రజ్ఞత కనబరుస్తారు.నువ్వుకూడా అర్థం చేసుకుని,సమన్వయం చూపించు.

Sunday, 8 February 2026

న త్వేవాహం జాతు నాసం

న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః। న చైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... చిన్న పిల్లోడికి ఏమైనా అర్ధం కాకపోతే వేరేవాళ్ళు విసుక్కోవచ్చు.కానీ అమ్మ ఏం చేస్తుంది?పిల్లవాడిని భయపెట్టకుండా,మంచిగా,చిన్నగా,సులభంగా అర్థం అయ్యేలాగా,వాడి బుర్రకు తగినట్లు మంచిగా ప్రేమగా చెబుతుంది కదా!కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడిని భయపెట్టడం లేదు.ఇంకా సందిగ్ధంలోకి నెట్టడం లేదు.ప్రశాంత చిత్తంతో,ఓపికగా,అర్ధం అయ్యేలా చెబుతున్నాడు. అర్జునా!సఖా!నీవు ఏదో గందరగోళంలో గాబరా పడుతున్నావు.నీవు అనుకునేది ఏమీ లేదు.అంతా చాలా సునాయసంగా అర్ధం అయ్యేదే!నా మాట నమ్ముతావా? నేను,నువ్వు,నీవు చెప్పే ఈ మహారాజులు అందరూ గతంలో లేకుండా లేము.అట్లాగా అని భవిష్యత్తులో ఉండకుండా పోము.ఇప్పుడు ఉన్నాము అనే విషయం లో నీకు ఎలాంటి అనుమానం లేదు కదా! అంటే ఇది అంతా కాలచక్రం.పుడుతుంటాము,గిట్టుతుంటాము.ఎప్పుడూ ఇలానే కాలం సాగిపోతుంది.

Monday, 2 February 2026

అశోచ్యా నన్వశోచస్త్వం

శ్రీ భగవానువాచ... అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే। గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.ఇంక బలవంతంగా ఆపుకుని అర్జునుడి తట్టు మళ్ళి మాట్లాడాడు. అర్జునా!ఏందో అనర్గళంగా భాషణలు ఇచ్తేస్తున్నావు.జీవితం అంతా ఔపోసన పట్టిన జ్ఞానిలాగా మాట్లాడేస్తున్నావు. నిజం చెప్పేదా?అది ఎప్పుడూ కటువుగా ఉంటుంది.మానవుడు దేని కోసం దుఃఖించకూడదో,దాని కోసం దుఃఖిస్తూ ఉన్నావు.అంతేనా?మళ్ళీ ఇదేమీ చాలనట్లు పెద్ద ఆరిందలాగా సూక్తుల,ముక్తాయింపులు చెబుతున్నావు. నీకు అసలు ఈ విషయం తెలుసా?నిజంగా పండితులు అయినవాళ్ళు సజీవుల గురించి ఆలోచించరు.పైగా గత జీవుల గురించి దిగులు పడరు.అసలు నువ్వు ఏ ఏ విషయాలకు అయితే దిగులు పడి,దుఃఖ పడుతున్నావో వాటిగురించి లేశ మాత్రం కూడా సమయం వృథా చేయరు.దుఃఖం అనే దానిని దరిదాపులకుకూడా రానివ్వరు.

Sunday, 1 February 2026

తమూవాచ హృషీకేశః

తమూవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత। సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః॥10॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఈ విథంగా వివరిస్తున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!అర్జునుడు చాలా దీనంగా కనిపిస్తున్నాడు.రెండు సైన్యాల మధ్య అతను విషణ్ణ వదనంతో చాలా వ్యాకులంగా,నిశ్చేష్టుడు అయి రధం పైన పడిఉన్నాడు.చూసేవారికి అంతా చాలా హృదయవిదారకంగా ఉంది అతని స్థితి,పరిస్థితి.కానీ అతని బాల్య మిత్రుడు శ్రీకృష్ణుడుకు మటుకు పట్టలేనంత నవ్వుగా ఉంది.పగలబడి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.నవ్వుతూనే ఇలా అన్నాడు.

Saturday, 31 January 2026

ఏవ ముక్త్వా హృషీకేశం

సంజయ ఉవాచ... ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః। న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ హ॥9॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చారు కదా సంగ్రామం వివరాలు అన్నిటినీ ధృతరాష్ట్రుడికి చెప్పేందుకు గానూ. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.ఓ రాజా!అర్జునుడు పై విధంగా కృష్ణునితో తన మనోదౌర్బల్యాన్ని విశదపరిచాడు.ఆఖరుకు కృష్ణా నేను ఈ యుద్ధం చేయను,చేయలేను,చేయబోను అని ఖరాఖండిగా చెప్పేసాడు.శక్తి విహీనుడై అర్జునుడు రథంలో చతికిల పడ్డాడు.

Thursday, 29 January 2026

న హి ప్రపశ్యామి

న హి ప్రపశ్యామి మమాప నుద్యా ద్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణాం। అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్॥8॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు తన మిత్రుడు అయిన శ్రీకృష్ణుడికి తన మనస్సు ఉండే పరిస్థితి వివరిస్తున్నాడు.కృష్ణా!నేను దుఃఖంలో కూరుకుని పోయి ఉన్నాను.ఈ లోకంలోని ఏ విషయం కూడా నన్ను ఈ ద్వంద్వం నుంచి విముక్తి కల్పించే రకంగా కనిపించడం లేదు.నాకు ఈలోకంపైన ఏకచ్ఛత్రాధిపత్యం దక్కినా తుచ్ఛం అనిపిస్తుంది.స్వర్గాధిపత్యం దక్కినా తృణప్రాయం అనిపిస్తుంది.ఈ దుఃఖం నన్ను పీల్చి పిప్పి చేసేస్తున్నది.ఎండగట్టేస్తున్నది.ఊపిరి ఆనటం లేదు.గొంతు పిడచ కట్టుకుపోతుంది.కిం కర్తవ్యం కృష్ణా!!!????

Wednesday, 28 January 2026

కార్పణ్య దోషోప హత స్వభావః

కార్పణ్య దోషోప హత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః। యచ్ఛ్రేయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్॥7॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... అర్జునుడు ఝంఝాటకం నుంచి బయట పడాలనుకుంటున్నాడు.అందుకని కృష్ణుడిని ఒక రకంగా అర్థిస్తున్నాడు.కృష్ణా!నేను ఈ పనికి మాలిన రాజ్యలోభం,బంధులోభాలతో సతమతమవుతున్నాను.నా మనసుకు దారీ తెన్నూ..।ఏమీ గోచరించడం లేదు.ధర్మనిర్ణయం చేసుకోలేకుండా,అవస్థ పడుతున్నాను.నిన్ను అడుగుతున్నాను.నేను నీకు శిష్యుడిని.నన్ను గట్టుకు చేర్చే బాధ్యత నీదే!నా హితంకోరేవాడివి నీవు.నాకు ఏది మంచిదో నువ్వే తేల్చు.నాకు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతున్నాను అని భయమేస్తుంది.నాకు నీ ఆపన్న హస్తంకావాలి.దాని సహాయంతో నేను గట్టుకు సురక్షితంగా చేరాలి.నాకు చేయి అందించే వాళ్ళు నువ్వు తప్ప ఇంకెవ్వరూ కానరావటం లేదు.ఉన్నా నాకు అఖ్ఖర లేదు.నువ్వే కావాలి.

Tuesday, 27 January 2026

న చైతద్విద్మః

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమ యదివానో జయేయుః। యానేవ హత్వా న జిజీవిషామ స్తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః॥6॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు కృష్ణుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.కృష్ణా!ఒకటి ఆలోచించు.పోరు సల్పినపుడు విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు.యుద్ధం చేసినా మనమే గెలుస్తామనే ధీమా లేదు.అంతోసి దానికి వారిని ఎందుకు చంపాలి?ఎవరిని చంపడం వలన మనకు జీవించాలనే ఇచ్ఛే అడుగంటి పోతుందో ....అటువంటి ధార్తరాష్ట్రులే కదా మన ఎదుట శత్రు పక్షాన ఉన్నది!ఇంక ఏమని అడుగు ముందుకు వేస్తాము?

Monday, 26 January 2026

గురూ న హత్వా హి

గురూ న హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహలోకే। హత్వార్థ కామాంస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్దాన్।।5॥2॥ శ్రీమద్భగవద్గీత..।।సాంఖ్య యోగము... అర్జునుడు తన భావాలనూ,బాథలను కృష్ణుని ముందు ఏకరువు పెడుతున్నాడు.సఖా!కృష్ణా!నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవుతుంది కదా!మహానుభావులూ,వృద్ధులు అయిన భీష్ముడు,ద్రోణుడు,ఇతరులనందరినీ చంపడం ఎంత పాపం కదా!వారి తప్పులు ఎన్ని ఉన్నా కూడా!దానికంటే బిక్షమెత్తుకుంటూ నాలుగు ఇండ్లు తిరిగి కడుపు నింపుకోవడం ఎంతో ఉత్తమం కదా! అయినాకూడా అర్థకామములకోసరం గురువులను చంపడం,ఆ రక్తపుకూడు తినటం..।రామ!రామ!ఎంత ఘాతుకం! అలా సంపాదించే భోగభాగ్యాలను నేను ఎలా జీర్ణించుకోగలను?ఎలా సుఖపడుతూ అనుభవించగలను?నువ్వే చెప్పు కృష్ణా?అది సాధ్యమా?అసలు అవసరమా?

Sunday, 25 January 2026

కథం భీష్మ మహం సంఖ్యే

అర్జున ఉవాచ... కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన। ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన॥4॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు ఇలా అనుకున్నాడు.నేను భలే చెప్పాను.నా స్నేహితుడు నాతో ఏకీభవిస్తాడు.మేమిద్దరం కలిసి మిగిలిన అందరినీ మా దృక్పథంలోకి తీసుకురావచ్చు. కానీ శ్రీకృష్ణుడు విన్నాడు,కానీ ఒప్పుకోలేదు.శ్రీకృష్ణుడు అతనితో నీఆలోచనా విధానం అంతా తప్పు అనేసరికి అయోమయంలో పడ్డాడు.కానీ ఎక్కడో చిన్న ఆశ!తన దారికి కృష్ణుడు వస్తాడని! అందుకనే ఇంకా ప్రాకులాడుతున్నాడు. కృష్ణా!అది ఎట్లా కుదురుతుంది?ఎలా సాధ్యం అవుతుంది?భీష్ముడు ఎవరు?అందరికీ పితామహుడు!ఆచార్యులు అందరూ నా చిన్నప్పటి నుంచీ గురువులు కదా!వారి పైకి నేను బాణాలు ఎలా సంధించగలను?వారందరూ పూజనీయులు కదా!

Saturday, 24 January 2026

క్లైబ్యం మాస్మగమః పార్థ

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే। క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥3॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... మాములుగా మనం ఏమి చేస్తాము?మనవాళ్ళు ఎవరైనా డోలాయమానంలో ఉంటే?మనకు మనమే కొంచెం పెద్దరికం తీసుకుంటాము.మనకు తెలిసినంతలో,మన విచక్షణా పరిథికి లోబడి మంచి చెడు చెబుతాము.సరైన నిర్ణయం తీసుకోమంటాము.ప్రక్కదారిలో,తప్పుదారిలో నడవద్దుఅని హితవు చెబుతాము. అట్లాంటిది శ్రీకృష్ణుడికి తెలియని దిశా నిర్దేశమా?అతనికి తెలియని సమన్వయమా? అర్జునుడికి హితవు చెప్పనారంభించాడు. అర్జునా!ఎందుకు ఇంత గందరగోళం పడుతున్నావు?ఏదేదో ఊహించుకుని,ఇంకేదో తర్కం నీకు నువ్వు చెప్పుకుంటూ సమయం వృధా చేయకు. ఇలా నీవు పౌరుషాన్ని కోల్పోవడం నీకు అసలు తగని పని.ఎందుకు మానసికంగా డీలా పడిపోతావు?క్షుద్రమయిన హృదయ దౌర్బల్యాన్ని వదలి పెట్టు.అది నీకు తగదు.ససేమిరా నీకు వన్నె తీసుకురాదు.మనకంటూ ఒక బుద్ది,బుర్ర అనేవి ఉన్నాయి కదా!వాటిని వాడి తెలివి తెచ్చుకో!ముందర లెయ్యి!అలసత్త్వం మానుకో!

Thursday, 22 January 2026

కుతస్త్వా కశ్మల మిదం

శ్రీ భగవానువాచ... కుతస్త్వా కశ్మస మిదం విషమే సముపస్థితమ్। అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికరమర్జున॥2॥2॥ శ్రీకృష్ణుడికి బాగా అర్థం అయిపోయింది.అర్జునుడు అపరాథనాభావం అనే సుడిగుండంలో సుళ్ళు తిరుగుతున్నాడనీ!అతనిని ఆ సుడిగుండంలోనుంచి లాగి బయటపడవేయడం అంత సులువైన విషయం కాదని.కానీ దేనికైనా ముందర మనం శ్రీకారం చుట్టాలి కదా! అందుకని అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా ఉపక్రమించాడు. అర్జునా!నీవు ఏమి మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతున్నదా?మనం ఎలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నాము?ఇది ఎంతటి విషమ సమయం?ఇప్పుడు మనం మాటలలోకాకుండా చేతలలో సమాథానం చెప్పాల్సిన పరిస్థితి.నువ్వేమో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చున్నావు. నీ భావజాలము ఆర్యుల లక్షణము కాదు.కీర్తిప్రతిష్టలు తెచ్చేది అంతకంటేకాదు.కనీసం మన చర్యలవలన నరకానికి పోకుండా స్వర్గం మెట్లు ఎక్కుదామా అంటే అస్సలే వీలు కాదు.అనార్యలక్షణము,అపకీర్తికరము,అస్వర్గ్యము అనే అన్ని రకాల జాడ్యాలు కలిసిన ఈ దుఃఖం ఇప్పుడు నిన్ను ఎందుకు ఆవరించింది?

Sunday, 18 January 2026

సాంఖ్య యోగము…తం తథా కృపయా విష్ట

సంజయ ఉవాచ... తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్। విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః॥1॥2॥ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు.రాజా!శ్రీకృష్ణుడు అర్జునుడు బాధ పడటం అంతా ఓపికగా విన్నాడు.అతని ముఖంలో,మస్తిష్కంలో మార్పులను గమనించాడు. అర్జునుడు అందరూ అయ్యో పాపం!అనేలా ఉన్నాడు.అర్జునుడి హృదయం అంతా జాలి నిండి పోయి ఉంది.కళ్ళనిండా నీరు సుడులు తిరుగుతున్నాయి.హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు.

Saturday, 17 January 2026

ఏవ ముక్త్వార్జున స్సంఖ్యే

సంజయ ఉవాచ.... ఏవ ముక్త్వార్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్। విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః॥47॥1॥ ఇతి శ్రీమద్భగవద్గీతా వసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోఽధ్యాయః.... సంజయుడు ధృతరాష్రుడికి చూసినది చూసినట్లు చెబుతున్నాడు. ధృతరాష్ట్రా!అర్జునుడు తన మీమాంసను ఇలా మాటల రూపంలో బయట పెట్టాడు.శోకగ్రస్తుడు అయినాడు.కలత బారిన మనసుతో తన అస్త్రశస్త్రాలను ప్రక్కన పడేసాడు.శక్తిలేని వాడై రథం మీద అలాగే చతికిల పడ్డాడు. ఇట్లు బ్రహ్మవిద్య,ఉపనిషత్తు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమయిన భగవద్గీతలో అర్జున విషాద యోగమను మొదటి అధ్యాయము సమాప్తము.

Friday, 9 January 2026

యది మా మప్రతీకార

యది మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః। ధార్త రాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్॥46॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడు బహు గట్టి నిర్ణయము తీసుకున్నాడు.పెద్దల సలహాలు,అన్నదమ్ముళ్ళ సలహాలు అవసరం లేదనుకున్నాడు.తన బావ,తన ఆప్తమిత్రుడు,తన శ్రేయోభిలాషి ఒప్పుకుంటే చాలనుకున్నాడు.అందుకే శ్రీకృష్ణుడి ఆమోదం కోసరం తహతహలాడుతున్నాడు.ఒకరకంగా చెప్పాలంటే బ్రతిమలాడుతున్నాడు. కృష్ణా!నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది కదా!నేను ఎలాంటి ప్రతీకారమూ తీసుకోను.శస్త్ర సన్యాసం చేస్తాను.ఆ ధార్తరాష్ట్రులు నా పైకి మూకుమ్మడిగా వచ్చినా నేను చలించను.వారంతా శస్త్ర ధారులై నన్ను హింసించడానికి వచ్చినా కిమ్మనకుండా ఉంటాను.నాకు మంచి జరుగుతుందనే అనుకుంటాను.ఆ పాపపు పనులు వాళ్ళు చేస్తే చెయ్యనీ!నేనుగా ఆ పాపపంకిలంలోకి అడుగుపెట్టను,అటుగా చూడను.నువ్వేమంటావు?నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను కదా!

Wednesday, 7 January 2026

అహోబత మహత్పాపం

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్। యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః॥45॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడి దుఃఖానికి అంతం లేకుండా పోతుంది.తిరిగి తిరిగి తనను తానే నిందించుకుంటున్నాడు.దీనమైన గొంతుకతో కృష్ణుడితో ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే సఖా!మనము ఎంత హ్రస్వ దృష్టి కలవాళ్ళమో కదా!ఏదీ నిశితంగా,విస్త్రుతంగా ఆలోచించము కదా!అనుకుంటేనే ఒళ్ళంతా వణుకు పుడుతుంది.ఎంత పాపానికి ఒడి కట్టబోయాము?అదీ తుచ్ఛమయిన ఐహిక సుఖాలకోసరము.కులాచార భ్రష్టత్వానికి నాంది పలకబోయాము.ఎంత పాపం?ఎంత ఘోరం?అసలు ఇలాంటి పాపాలకు నిష్కృతి ఉంటుందా?ఎన్ని జన్మలెత్తినా ఈ పాపాలనుంచి విముక్తి ఉండదు. రాజ్యకాంక్షతో అయిన వాళ్ళని అందరినీ మట్టుబెట్టాలనుకున్నాము.హవ్వ!ఎంత పాపానికి ఒడి గట్టబోయాము?

Tuesday, 6 January 2026

ఉత్సన్న కులధర్మాణాం

ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన। నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ॥44॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... అర్జునుడు ఒక ముగింపుకు వచ్చేశాడు.అది తన చెలికాడు అయిన కృష్ణుడితో చెబుతున్నాడు.ఇక ఏమని మాట్లాడుదాము,ఎంతని మాట్లాడుదాము కృష్ణా!నాకు ఖరాఖండిగా ఇదే తడుతుంది.కులాచార భృష్టులకు నరకమే శాశ్వత నివాసం.బావా!ఇది నా సొంత తెలివితో చెప్పడం లేదు.పెద్దలు పలుమార్లు అంటుంటే విన్నాను.ఇప్పుడు రూఢిగా నమ్ముతున్నాను.

Monday, 5 January 2026

దోషై రేత్తైః కులఘ్నానాం

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః। ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః॥43॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... అర్జునుడు ఇంకా ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవుతుంది కదా!వర్ణ సంకరానికి పాల్పడేవారు,వారొక్కరే చెడిపోవటం లేదు.వారితోటివారి కులం మొత్తాన్నీ అథఃపాతాళానికి తీసుకెళుతారు.ఎలాగంటావా,కృష్ణా? ఎవరైనా సుడిగుండంలో చిక్కుకున్నారు అనుకో,సహాయం అర్థిస్తారు.మనము ఎగురుకుంటూ పోతాము సహాయం చేసేదానికి.కానీ ఆ సుడిగుండంలోకి మనము కూడా పీల్చివేయబడతాము కదా! ఇక్కడ కూడా అలానే జరుగుతుంది.ఈ వర్ణ సంకరానికి పాల్పడే కర్తలు ఉంటారు కదా!వారు చేసే పాపకార్యాల వలన అనాదిగా వచ్చే కుల,జాతి ధర్మాలకు పాతర వేయబడుతుంది.ఆ ధర్మాలు అన్నీ కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించవేయబడతయి.ఇదే అన్నిటికంటే వినాశకారి.

Sunday, 4 January 2026

సంకరో నరకాయైవ

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ। పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః॥42॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి దుఃఖం,విచారమూ క్షణ క్షణానికీ ఎక్కువ అవుతున్నాయి.ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని పోతున్నాడు.శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు.కృష్ణా!వర్ణసంకరం వలన ఎవరికి లాభం చెప్పు?అటు కర్తకూ,ఇటు కులానికీ...రెంటికీ నరకమే కదా దక్కేది.వీళ్ళు చేసే పాపపు పనుల వలన పితృదేవతలు కూడా క్షోభిస్తారు.ఎందుకంటే వారికి పిండోదకాలు పెట్టేవాళ్ళూ,తర్పణాలు వదిలేవారూ ఎవరూ మిగిలి ఉండరు కదా!చివరికి ఉండేవాళ్ళు,పుట్టబోయే వాళ్ళు,ఆఖరికీ ఎప్పుడో పోయిన పితృదేవతలు,వారి ఆత్మలు...అందరూ అధోగతులపాలవుతారు. ఇంత ఘోష,ఇంత పాపం చేయటం మనకు అవసరమా?

Saturday, 3 January 2026

అధర్మాభి భవాత్ కృష్ణ

అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః। స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః॥41॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... మామూలుగా అన్నీ బాగుంటే మనమూ బాగుంటాము.పరిస్థితులు తారుమారు అయితే మనమూ అతలాకుతలము అవుతాము.అప్పుడు జీవనం ఎలా సాగించాలి?ఎలా బ్రతకాలి అనేదే ముఖ్యం అవుతుంది.అప్పుడే మనలో ఉండే అసలు మనిషి,అసలు వ్యక్తిత్వం బయట పడతాయి.చాలా మందికి కష్టాలూ,కడగళ్ళు అంటే భయం.అందుకనే ఎవరైనా కష్టాలలో ఉంటే వారి దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోరు.అది అంటు వ్యాధి కాదు.కానీ అందరూ భయపడతారు. మన పని కావటం ముఖ్యం అనుకుంటారు.అనుసరించే మార్గం ఏదైనా పరవాలేదు అనుకుంటారు. అర్జునుడు అదే కృష్ణుడికి చెబుతున్నాడు. హే కృష్ణా!అధర్మం పెరిగితే ఏమవుతుంది?ఎవరూ మంచి బాటలో నడవాలని అనుకోరు.కులస్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు.వారు సక్రమమయిన మార్గంలో నడవక పోతే ఏమవుతుంది?వర్ణ సంకరమేగా!కులం భ్రష్టు పట్టిపోతుంది.ఆచార వ్యవహారలకు పాతర వేస్తారు.

Thursday, 1 January 2026

కులక్షయే ప్రణశ్యంతి

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః। ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభి భవత్యుత॥49॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నీకు కూడా తెలుసు కదా,కులక్షయం వలన కులాచారాలు నాశనమవుతాయి అని.కులాచారాలు భ్రష్టుపడితే కులం మొత్తం పాపపంకిలం అయిపోతుంది కదా!అధర్మం పేట్రేగిపోతుంది కదా!మంచి చెడ్డ అనే విచక్షణ కూకటి వ్రేళ్ళతో పీకివేయబడుతుంది కదా!కులము అనేది నాశనము అవుతుంది,లేక అంతరించి పోతుంది అంటే ఇక ప్రత్యామ్నాయము ఏమి ఉంది? ఈ వినాశనాన్ని ఆపేదెలా?

కథం న జ్ఞేయ మస్మాభిః

కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్। కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన॥39॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... అర్జునుడు చెబుతున్నాడు.కృష్ణా!ఇప్పుడు ఇంక తెలిసిపోయింది కదా,వాళ్ళ నుంచి ఏ రకమైన మంచీ మనం ఆశించలేమని.కనీసం మనమైనా ఏదో ఒకటి ఆలోచించాలి కదా!ఎందుకంటే కులక్షయం చేయడం వలన వచ్చే పాపం మనకు అవగతమవుతుంది.దానిని అరికట్టేదానికి మనం ఆలోచించాలి.లేదా కనీసం ఆప్రక్రియకు దూరంగా అన్నా ఉండాలి.ఇది మన కనీస ధర్మం కదా!