Wednesday, 9 April 2025

యస్మాత్ క్షరమతీతోఽహం

యస్మాత్ క్షరమతీతోఽహం అక్షరాదపి చోత్తమః। అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః॥18॥ శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు క్షరులు,అక్షరుల గురించి చెప్పాను కదా!నేను వీళ్ళందరి కంటే అతీతుడను.అలా అతీతుడను కాబట్టే లోకంలోను,వేదాలలోనూ నన్ను పరమాత్మ అని,పురుషోత్తముడు అని కీర్తిస్తుంటారు.

Tuesday, 8 April 2025

ఉత్తమః పురుషస్త్వన్యః

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః। యో లోకత్రయమావిశ్యబిభర్త్యవ్యయ ఈశ్వరః॥17॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నేను క్షరులు,అక్షరులు గురించి చెప్పాను కదా!ఈ ఇద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.ఎందుకంటే అతడే ఈ మూడు లోకాలనూ వ్యాపించి ఉన్నాడు.ఈ యావత్ సృష్టిని పోషిస్తున్నాడు.అతడు అక్షయుడు.అతడు నాశరహితుడు.అతడే సర్వాంతర్యామి.

Monday, 7 April 2025

ద్వావిమౌ పురుషౌ లోకే

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ। క్షర స్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే॥16॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఒకరు క్షరులు,ఇంకొకరు అక్షరులు.ప్రాపంచిక మయిన భూతాలన్నిటినీ క్షరులు అంటారు.కూటస్తుడు అయిన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు.

Sunday, 6 April 2025

సర్వస్య చాహం హృది సన్నివిష్టో

సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ। వేదైశ్య సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి సకలం చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అసలు విషయం చెబుతున్నాను,విను.అందరిలో నేనే అంతర్గతంగా,అంతరాత్మగా ఉన్నాను.జ్ఞాపకం,జ్ఞానం,మరపు,అవివేకం ఇలా అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి.సర్వం నేనే అయి ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను.నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.నేనే వేదవేత్తను.విశ్వంలో ప్రతిది నాలోనే పుట్టాలి,నా వల్లే ఎదగాలి,నాలోనే లయ, లీనం కావాలి.

అహం వైశ్వానరో భూత్వా

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః। ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం॥14॥ శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఈ యావత్ సృష్టిలోని సర్వ జీవుల శరీరాలలో జఠరాగ్ని రూపంలో ఉంటాను.జీవులు తినే నాలుగు రకాల ఆహారాలను ప్రాణాపాన వాయువులతో కూడి నేనే పక్వంచేస్తున్నాను. అంటే ఆ పరమాత్మ మనం తీసుకునే ఆహారం కూడా సరిగ్గా అరిగి మనకు శక్తి చేకూరేలా చేస్తున్నాడు.ఇవంతా మనం అడిగేతేనో,బతిమాలాడితేనో చేయటం లేదు.తనకు తానుగా చేస్తున్నాడు.మన మంచి చెడ్డ చూసుకుంటున్నాడు.అలాంటిది అతని శరణు కోరితే ఇంకెంత మేలు చేస్తాడో ఊహించారా?

Saturday, 5 April 2025

గామావిశ్య చ భూతాని

గామావిశ్య చ భూతాని ధారాయామ్యహమోజసా। పుష్ణామి చౌషధీ స్సర్వాః సోమో భూత్వా రసాత్మకః॥13॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుొషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!నేను నా శక్తి చేత భూమి యందు ప్రవేశించి సర్వ భూతాలను ధరిస్తున్నాను.నేనే రస స్వరూపుడు అయిన చంద్రుడు అయి అన్ని సస్యాలను పోషిస్తున్నాను.అంటే అన్నీ ఫలదాయకము అయ్యేలా కృషి చేస్తున్నాను.సులభంగా చెప్పాలి అంటే సమస్త ప్రాణి కోటి వృద్థి,అభివృద్థిలో నా ప్రమేయం అడుగడుగునా ఉంది.

Friday, 4 April 2025

యదాదిత్య గతం తేజో

యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఽఖిలం। యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్॥12॥శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అన్నిటికీ కర్త,కర్మ,క్రియలను నేనే అని అర్థం చేసుకో.ఈ సర్వ జగత్తునూ తేజోమయం చేసే వెలుగును ఇచ్చేది సూర్యుడు,చంద్రుడు అని నీకు తెలుసు కదా.నీకు ఇంకో ముఖ్యమయిన విషయం చెబుతాను.ఆ సూర్య చంద్రుల తేజస్సు నాదే.నేనే వాటికి ఆ తేజస్సును పంచాను.

యతంతో యోగినశ్చైనం

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితం। యతంతోఽప్య కృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః॥11॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!మనం ఏ పని చేసినా చిత్త శుద్థితో చేయాలి.యాంత్రికంగా చేశాము అంటే చేశాము అనే రకంగా ఉండకూడదు.సత్ఫలితం దక్కాలంటే చిల్లర వేషాలు వేయకూడదు.వంద శాతం మన మనసు,బుద్ధిని పెట్టాలి.జ్ఞాన సిద్థులు మాత్రమే ఎందుకు తెలుసుకోగలుగుతారు అంటే వారికి ఆత్మానుభూతిని పొందే అభ్యాసం ఉంటుంది కాబట్టి.అదే చిత్తశుద్థి లేని వారు ఎంత అభ్యాసం చేసినా ఫలితం శూన్యం.వారికి సృష్టి విలాసం కానరాదు.

Wednesday, 2 April 2025

ఉత్ర్కామంతం స్థితం వాపి

ఉత్ర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం। విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః॥10॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి నిజాలు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు చెప్పాను కదా!జీవుడు దేహాన్ని త్యజిస్తాడని.మళ్ళీ గుణప్రభావం వల్ల మరో దేహాన్ని పొందుతాడని.ఆ దేహంలో కొన్నాళ్ళు అనుభవిస్తాడు,మనం మాములుగా బట్టలు మార్చుకున్నట్లు.ఇలాంటి విషయాలు మూర్ఖులు అయినవాళ్ళు అర్థం చేసుకోలేరు.ఎందుకంటే వాళ్ళకు అంత పరిపక్వత వుండదు.ఎంత సేపూ భౌతికమయిన వాంఛలగురించే ఆలోచిస్తారు కావున.ఇలా ఆధ్యాత్మక పరమయిన విషయాలను జ్ఞానసిద్ధులు మాత్రమే తెలుసుకుని,అర్థం చేసుకోగలుగుతారు.

Tuesday, 1 April 2025

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ। అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే॥9॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలాగ అంటున్నాడు.అర్జునా!జీవుడు అంటే ఆత్మ అని అర్థం అవుతుందా?చెవులు,కళ్ళు,చర్మం,నాలుక,ముక్కు పంచేంద్రియాలు.మనసు వీటి పైన ఆధారపడి వుంటుంది.జీవుడు పంచేంద్రియాలను ఆశ్రయించిన మనసును సహాయంగా తీసుకుని శబ్దరూప రస స్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు.

Monday, 31 March 2025

శరీరం యదవాప్నోతి

శరీరం యదవాప్నోతి యచ్తాప్యుత్ర్కా మతీశ్వరః। గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్॥8॥ శ్రీమగ్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఎంత సుందరంగా వివరిస్తున్నాడో చూడు.అర్జునా!జీవుడికి దేహం వుంటుంది కదా.మనము చాలా జన్మలు ఎత్తాల్సి వుంటుంది కదా.అలా జన్మలు మారేటప్పుడు శరీరాలు మార్చాల్సి వస్తుంది.మనంపాత,చినిగిన బట్టలు విప్పి కొత్తవి,మంచివి వేసుకున్నట్లు.ఒక పూదోట మీదుగా గాలి వీస్తే,ఆ పూల సువాసనను కూడా కొంచెం పట్టుకు పోతుంది,పోతూ పోతూ.అచ్చం అలాగే ఇక్కడ కూడా.జీవుడు క్రొత్త శరీరం లోకి వెళ్ళేటప్పుడు,వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకుని పోతున్నాడు.

Saturday, 29 March 2025

మమైవాంశో జీవలోకే

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః। మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥7॥ శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జునా!నేను ఆదిమధ్యాంతరహితుడిని కదా.పురాతనమయిన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిణమించింది.ఆ జీవుడే ఈ చరాచరజగత్తు,ప్రకృతిలోని వికారాలు అయిన జ్ఞానేంద్రియ పంచకాన్ని,మనస్సును కూడా ఆకర్షిస్తున్నాడు.అంటే నేను విశ్వమంతా వ్యాపించ్ వున్నాను.నన్ను దాటుకుని ఎవరూ ,ఎక్కడికీ పోలేరు.కానీ మాయామోహంలో చిక్కుకుని వుంటారు చాలా మటుకు.

Friday, 28 March 2025

న తద్భాసయతే సూర్యో

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః। యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ॥6॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి పూస గుచ్చినట్లు వివరంగా చెబుతున్నాడు.గురువు పిల్లవాడికి చెప్పేటప్పుడు సంధులు,సమాసాలతో,కఠినమయిన పదజాలంతో చెప్పకూడదు.చిన్న చిన్న పదాలతో,వాడికి అర్థం అయ్యేలాగా,భయపడకుండా నేర్చుకునేలా,వాడికి నేర్చుకునేదానికి ఉత్సాహం నింపేలాగా చెప్పాలి.ఇక్కడ కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు. అర్జునా!పరమపదం అంటే చెబుతాను,విను.మనం సూర్యుడు,చంద్రుడు ప్రపంచానికి వెలుగు నిస్తాయి అనుకుంటాము కదా!అవి పరమపదాన్ని ప్రకాశింపలేవు.అంటే కోటానుకోట్ల సూర్యులు,చంద్రులు కూడా దాని ప్రకాశం ముందర ఆగలేవు,తూగలేవు.ఆ మోక్షం,ఆ పరమపదం పొందితే మరల వెనుకకు రానవసరం లేదు. మనం భూమి మీద పుట్టామంటే మరల మరల జన్మలు వుంటాయి.అవి ఇప్పటి మన జన్మ కంటే ఉచ్ఛమయినవా,నీచమయినవా అనేది మన కర్మలను బట్టి వుంటుంది.కానీ ఆ భగవంతునిలో కైవల్యం పొందితే ఈ జన్మల జోలికి పోనక్కరలేదు.అలాంటి స్వయం ప్రకాశమానమయినది భగవంతుని పరమపదం.

Thursday, 27 March 2025

నిర్మానమోహా జితసంగదోషాః

నిర్మానమోహా జితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్యైర్విముక్తా స్సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్॥5॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి విడమరచి చెబుతున్నాడు.అర్జునా!నేను చెప్పే ముక్తి ఎలా సంపాదించాలో వివరిస్తాను.దురహంకారము,దుస్సంగము,దురూహలను దరిచేరనివ్వకూడదు.అంటే గర్వము పనికిరాదు.దుష్టులతో సాంగత్యము వద్దనే వద్దు.దురాలోచనల జోలికి అసలు వెళ్ళవద్దు.కోరికలను దరిచేర నివ్వకు.లాభం,నష్టం,కోపం,తాపం,సుఖం,దుఃఖం....ఇలాంటి ద్వంద్వాలను విసర్జించాలి.అప్పుడు మాత్రమే జ్ఞానులు బ్రహ్మజ్ఞాన నిష్టతో మోక్షం పొందగలుగుతారు.

Wednesday, 26 March 2025

తతః పదం తత్పరిమార్గతవ్యం

తతః పదం తత్పరిమార్గతవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ॥4॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనుష్యులు వైరాగ్యంతోటి సంసారమనే వృక్షాన్ని ఛేదించాలి అని చెప్పాను కదా!మనం సాధన చెయ్యాలి.ఎలా చెయ్యాలంటే దేనిని పొందితే దీనిలోకి రామో...అలా చెయ్యాలి.అంటే కైవల్యం,పరమపధం పొందితే ఇలాంటి ఇహలోకం లోకి రానవసరం లేదు కదా!ఆ మోక్షం,ముక్తి పొందితే,అనాది అయిన ఈ చరాచర ప్రపంచం ఎవరు సృష్టించారో,ఎవరివలన సాగుతుందో,ఎవరివలన యావత్ సృష్టి అంతం అవుతుందో,ఆ పరమాత్మ సన్నిథిలో శరణు పొందవచ్చు.ఈ భావంతో సాధన చెయ్యాలి.

Tuesday, 18 March 2025

న రూప మస్యేహ తథోపలభ్యతే

న రూప మస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ ధృఢేన ఛిత్వా॥3॥ శ్రీమద్భగవద్గీత ...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో సాధ్యాఽసాధ్యాల గురించి చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఈ సంసారంలో వుండే ప్రాణులు అశ్వత్థవృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఎందుకంటే ఈ వృక్షం ఆది,మధ్య,అంతాలు లేకుండా వుంటుంది.దీని వ్రేళ్ళు ఎక్కడికక్కడ బాగా నాటుకోని వుంటాయి.ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం తోటే మానవుడు ఛేదించగలడు.వేరే ఉపాయం,దారి లేదు.

Monday, 17 March 2025

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః। అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే॥2॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఈ అశ్వత్థ వృక్షము అని చెప్పాను కదా.దాని కొమ్మలు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణముల వల్ల విస్తరించి వుంటుంది.ఇంద్రియార్థాలు చిగురులులాగ కలిగి వుంటుంది.ఈ కొమ్మలు క్రిందికీ,మీదికీ వ్యాపించి,విస్తరించి వుంటాయి.కానీ మనుష్యలోకంలో దీనికి క్రిందికి పోయే వ్రేళ్ళుకూడావుంటాయి.ఎందుకంటే ఇక్కడ అవి కూడా సకానకర్మలచే బద్ధములై వుంటాయి కాబట్టి.

Thursday, 13 March 2025

ఊర్ధ్వమూల మధశ్శాఖం

శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము... పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీభగవానువాచ... ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహు రవ్యయం। ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్॥1॥ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అశ్వత్థ వృక్షము ఒకటి వుంది అని చెప్పబడుతుంది.అది మామూలు చెట్టులాగ కాదు.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలు ఏమో కిందికి ఉంటాయి.వేదాలలోని వాక్యాలే దానికి ఆకులు.దానికి నాశనం అనేది లేనే లేదు.ఆ వృక్షం గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు అని అర్థం చేసుకో.

Monday, 10 March 2025

బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహం

బ్రహ్మణోహి ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ॥27॥ శ్రీమద్భగవద్గీతాఽసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగోనామ చతుర్దశోఽధ్యాయః కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ సృష్టిలో ప్రతిదాని వెనుక,ముందర,పక్కన,లోపల,బయట...అంతా నేనే నిండి ఉన్నాను.నా ప్రమేయం లేకుండా చిన్న పరమాణువు కూడా అటుఇటు కదలలేదు.పరబ్రహ్మకు,అవినాశనమయిన మోక్షానికీ,ధర్మానికీ,సత్ చిత్ ఆనంద రూపైక నిరాకార బ్రహ్మానికీ అన్నింటికీ నేనే మూలాధారుడిగా వున్నాను.సులభంగా చెప్పాలంటే అన్నిటికీ కర్త,కర్మ,క్రియ నేనే.ఇవన్నీ అవినాశనము అని ఎందుకు చెబుతున్నానో విను.ముక్తి,ధర్మం,సచ్చిదానందం,నిరాకారమయిన బ్రహ్మం....ఇవన్నీ శాశ్వతమయినవి.వీటికి పుట్టుక,చావులేవు.చావులేదు అంటే నాశనం కావు అనే కదా అర్థం.నిరాకారము అన్నప్పుడు రూపం ఎక్కడనుంచి వస్తుంది?అంటే వాటి వునికి మనం గ్రహించగలము మనసుతో.కానీ తాకలేము,చూడలేము,వినలేము,రుచి కనుగొనలేము.కాబట్టి ఆదిమధ్యాంత రహితుడు నేనని అర్థం చేసుకో.

Thursday, 6 March 2025

మాం చ యోఽవ్యభిచారేణ

మాం చ యోఽవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే॥26॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాలను అతిక్రమించేదానికి సులభమయిన మార్గం చెబుతున్నాడు.అర్జునా!నీకు అర్థం కావటంలేదు కదా?ఇంత కష్టమయిన ప్రక్రియ ఎలా మానవుడికి సాథ్యం అవుతుంది అని.నేనొక చిన్న చిట్కా చెప్తాను.గ్రహించు. నిత్యమూ నన్నే నిశ్చలమయిన భక్తితో సేవిస్తేచాలు.ఆ మానవుడికి త్రిగుణాలను ధిక్కరించే స్థితప్రజ్ఞత చేకూరుతుంది.అతను త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు.

Tuesday, 4 March 2025

ప్రకాశం చ ప్రవృత్తిం చ

శ్రీభగవానువాచ.... ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి॥22॥ ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్టతి నేంగతే॥23॥ సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః॥24॥ మానావమానయో స్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే॥25॥ శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము ఎప్పుడూ అర్థం చేసుకోవాలి అనే తపన వుండే వాళ్ళకే అనుమానాలు వస్తాయి.అర్జునుడు తన అనుమానాలు బయచ పెట్టగానే కృష్ణుడు సంతోషించాడు.విడమరచి చెప్పడం మొదలు పెట్టాడు.హే అర్జునా!గుణాతీతుడు ఎవడు,ఎలా ఉంటాడో చెబుతాను,విను. ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా!వాటికి సంబంథించిన,వ్యక్తరూపాలు అయిన ప్రకాశం,ప్రవృత్తి,మోహాలు సంప్రాప్తమయినా ద్వేషించకుండా ఉండాలి.అవి దక్కకపోయినా,వాటికోసం వెంపర్లాడకుండా వుండగలగాలి.నిర్వికారంగా,సాక్షిమాత్రుడుగా వుండాలి.గుణధర్మపరమయిన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించకుండా ఉండాలి.వాటివాటి స్వస్వభావతను గ్రహించి సుఖదుఃఖాలను రెండింటినీ సమభావంతో చూడాలి.తనకుతానే సుప్రతిష్టుడు అయి మట్టి,రాయి,బంగారాలను సమభావంతో చూడగలగాలి.ప్రియమైనా,అప్రియమైనా ఒకే రకంగా స్వీకరించాలి.ధీరుడుగా ఉంటూ నిందలు అయినా,మెచ్చుకోలుఅయినా,బ్రహ్మరథం పట్టినా,అవమానించినా,శత్రువులు అయినా,మిత్రులు అయినా సమభావంతో స్వీకరించాలి.సర్వకాల సర్వావస్థలయందు సమబుద్ధితో వుండి,నిస్సంకల్పుడుగా ఉండాలి.ఇలా వుండగలిగిన వాళ్ళను గుణాతీతుడు అంటారు.

Sunday, 2 March 2025

కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్

అర్జున ఉవాచ... కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణా నతివర్తతే॥21॥ శ్రీమద్భగవద్గీత... చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము అర్జునుడికి తల తిరిగిపోతుంది.అన్నీ అర్థం కాని అనుమానాలే.అందుకని మొహమాటానికి పోకుండా కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!నువ్వేమో త్రిగుణాలు అన్నావు.మళ్ళా వాటిని అతిక్రమిస్తే పరమపథం అంటున్నావు.ఈ సత్త్వరజస్తమో గుణాలను ఎవరు అతిక్రమించగలరు?వాళ్ళు ఎలా ఉంటారు? వారి గుణగణాలు,లక్షణాలు ఎలా ఉంటాయి?వారి ఆచారవ్యవహారాలు ఏ రీతిలో ఉంటాయి?అసలు మానవుడు ఈ మూడుగుణాల పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడగలతాడు?నాకు ఈ ప్రశ్నలకన్నిటికీ సవివరంగా సమాథానం చెప్పాలి అని వేడుకున్నాడు అర్జునుడు.

Friday, 28 February 2025

గుణానేతా నతీత్య త్రీన్

గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోఽమృత మశ్నుతే॥20॥ శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ముక్తికి మార్గం చెబుతున్నాడు.అర్జునా!దేహి అనగా బద్ధజీవుడు ఈ త్రిగుణాలను తన ఆధీనం లోకి తీసుకురాగలగాలి.వీటి పాశాలనుంచి విముక్తుడు కాగలగాలి.వీటిని సునాయాశంగా దాటగలగాలి.అతిక్రమించగలగాలి.అలాంటి జీవి జన్మ మృత్యు జరాది దుఃఖాలనుంచి బయట పడగలుగుతాడు.ముక్తికి బాటలు వేయగలుగుతాడు.ఆ పైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు.ఇందులో సందేహము లేదు.నన్ను నమ్ము.

Thursday, 27 February 2025

నాన్యం గుణేభ్యః కర్తారం

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి॥19॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి పరమ సత్యం బోధిస్తున్నాడు.అర్జునా!సర్వ సృష్టికోటిని కర్మలకు ప్రేరేపించేది ఈ త్రిగుణాలే.ఆ విషయం ముందర మనము అర్థం చేసుకోవాలి. కానీ పరమాత్మ మటుకు ఈ గుణత్రయానికి అతీతుడు అనే విషయం కూడా తెలుసుకోవాలి.ఈ విషయాలన్నిటినీ ఆకళింపు చేసుకున్న వాడే నన్ను అర్థం చేసుకునిన వాడు.వాడే నాకు దగ్గర అవుతాడు.

Wednesday, 26 February 2025

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః॥18॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఏ గుణాలు పాటిస్తే,ఏ ఫలితాలు దక్కుతాయో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఈ మూడుగుణాలగురించి చెప్పానుకదా.వాటి పర్యనసానంఎలా వుంటుందో,ఏమిటో చెబుతాను.సత్త్వగుణం ఆచరించే సాత్త్వికులకు ఉత్తమమయిన ఊర్ధ్వలోకాలు సంప్రాప్తిస్తాయి.రజోగుణం పాటించే రాజులకు మానవలోకం దక్కుతుంది.అంటే మళ్ళీ మళ్ళీ మానవజన్మమే దక్కుతుంది.మోక్షం దక్కదు.తమోగుణానికి బానిసలు అయిన తామసులకప నీచమయిన అధోగతులు కలుగుతాయి.అనగా మానవ జన్మకంటేకూడా తక్కువ అయిన పశు,పక్ష్యాదుల జన్మ దక్కుతుంది.

Tuesday, 25 February 2025

సత్త్వా త్సంజాయతే జ్ఞానం

సత్త్వా త్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ॥17॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఏ విషయం అయినా ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకుంటే కానీ బుర్రకు ఎక్కదు.ఈ విషయం కృష్ణుడికి చాలా బాగా తెలుసు.అందుకే మళ్ళీ మళ్ళీ అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!సత్త్వగుణం వలన మనిషిలో జ్ఞానం పెరుగుతుంది.అదే రజోగుణము వల్లన అయితే లోభం పెరుగుతుంది.తమోగుణం వలన మనలో అజ్ఞానానికి అంతమే ఉండదు.భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడతాయి.కాబట్టి మనము నిశితంగా ఆలోచించి,మంచి మార్గంలో ముందుకు పోవాలి.

Monday, 24 February 2025

కర్మణ సుకృతస్యాహుః

కర్మణ సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్॥16॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడిని మంచి మార్గంలో నడవమని చెబుతున్నాడు.అర్జునా! సత్త్వగుణము ఎంచుకొని ఆ మార్గంలో నడిచేదానికి ప్రయత్నించు.ఎందుకంటే,ఆ మంచి కర్మలవలన మనకు ఎలాంటి మాలిన్యం అంటని సౌఖ్యం దక్కుతుంది.అదే రాజసగుణం వలన దుఃఖం దక్కుతుంది.ఎందుకంటే మనము ప్రాపంచిక విషయ లాలసకు లోనవుతాము కదా!తామసగుణానికి సంబంధించిన కర్మలవల్ల అజ్ఞానము,అవివేకము,అలసత్త్వములకు మనము నివాస గృహం అవుతాము.

Sunday, 23 February 2025

రజసి ప్రళయం గత్వా

రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే॥5॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.రజోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఏమి జరుగుతుందో చెప్తాను విను.అలాంటి మనిషికి కర్మలయందు ఆసక్తి వుంటుంది కనుక,మరలా మానవజన్మనే పొందుతాడు.ఇప్పుడు తమోగుణము గురించి మాట్లాడుకుందాము.తమోగుణము అంటే అజ్ఞానానికి,అలసత్త్వానికి పెట్టింది పేరు.కాబట్టి తమోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణం సంభవిస్తే,ఆ ప్రాణికి పశువు,పక్షిల జన్మమే దక్కుతుంది.కాబట్టి మన ఆలోచనలు,నడవడిక,ఆత్మజ్ఞానము మనకు తరువాత దక్కబోయే జన్మలను కూడా నిర్దేశిస్తాయి.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోని మసలుకుంటే,అన్ని వేళలా ఉత్తమము.

Friday, 21 February 2025

యదా సత్త్వే ప్రవృద్ధే తు

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే॥14॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.మంచి మార్గములో నడిచే వాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.అన్ని గుణాలలోకి సత్త్వగుణము మంచిది అని నీకు నేను చెప్పాను కదా!ఆ గుణము వృద్ధిలో వున్నప్పుడు మరణం సంభవిస్తే,మనము ఉత్తమలోకాలకు పోతాము.మాములుగా బ్రహ్మ జ్ఞానులకు ఉత్తమలోక ప్రాప్తి దక్కుతుంటుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ సత్త్వగుణము అలవరుచుకుంటే మంచిది.

Tuesday, 18 February 2025

అప్రకాశోఽప్రవృత్తిశ్చ

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందనా॥13॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు కురు వంశంలో పుట్టిన, కులతిలకము అయిన అర్జునుడిని ఇలా సంబోధిస్తున్నాడు.హే కురునందనా!ఇప్పుడు ఇంక తమోగుణము గురించి మాట్లాడు కుందాము.మనలో ఈ తమోగుణము పైన లాలస పెరిగి,మోతాదు మించింది అనుకో,అప్పుడు ఈ ఈ వికారాలు మనలో మొదలు అవుతాయి.జీవితంలో ప్రకాశం,ఆశ ఉండవు.మన పనులు మనం చేసుకోవాలనే ఆకాంక్ష,ఉత్తేజం అసలే ఉండవు.అసలు సిసలు పని దొంగలం అవుతాము.ఏ పనీ చేయ బుద్ధి కాదు.సోమరితనం పుష్కలంగా వృద్ధి చెందుతుంది.ముందు వెనక ఆలోచించకుండా అపాయాలకు,ప్రమాదాలకు లోను అవుతాము.మూర్ఖత్వం ఇబ్బడి ముబ్బిడిగా పెరుగుతుంది.కాబట్టి వీటిని దరి చేరనివ్వకూడదు.

Sunday, 16 February 2025

లోభః ప్రవృత్తి రారంభః

లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ॥12॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్దునుడితో చెబుతున్నాడు.ఇప్పుడు నేను నీకు రజోగుణము గురించి చెబుతాను,విను.రజోగుణమనేది మనలో వృద్ధి అయింది అనుకో,మొదట బయటపడేది లోభత్వం.మనకు లోభగుణం,అదే పిసినారితనం అలవాటు అవుతుంది.అశాంతి మొదలు అవుతుంది.గుబులుగుబులుగా వుంటుంది.ఏ మంచి విషయం పైనా గురి కుదరదు.ఆశలు కళ్ళెంలేని గుఱ్ఱాలలాగా,మనల్ని పరుగులు పెట్టిస్తాయి.పనికిరాని పనులు,చెడు పనులు చేసేదానికి మనసు ఉవ్విళ్ళూరుతూ వుంటుంది.

Thursday, 13 February 2025

సర్వద్వారేషు దేహేఽస్మిన్

సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత॥11॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చిన్న కిటుకు చెపుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలు మనతో చెడుగుడు ఎలా ఆడుకుంటాయో చెప్పాను కదా.కానీ మనం వాటి పైన పెత్తనం సంపాదించేదానికి మొగ్గు చూపాలి.అప్పుడు మనకు మన ఇంద్రియాల పైన పట్టు దొరుకుతుంది.సరి అయిన మార్గంలో పయనిస్తాము.అందుకే చెబుతున్నాను విను.మనం మంచి మార్గం ఎన్నుకుంటే,సర్వేంద్రియ ద్వారాలు జ్ఞానరూపమయిన కాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.అప్పుడు మనలో సత్త్వగుణము వృద్ధి అయిందని ధైర్యంగా ఉండవచ్చు.

Tuesday, 11 February 2025

రజస్తమశ్చాభిభూయ

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా॥10॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో అసలు కిటుకుచెబుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలగురించి చెప్పాను.వీటి మధ్య ఇంకొక వ్వవహారము కూడా వుంది.చెబుతా విను.మన మనసుల పైన ఒక సారి రజోగుణము,తమోగుణాలను కాదని సత్త్వగుణము గెలుస్తుంది.ఇంకో సారి సత్త్వగుణము,తమోగుణాలను అణగ ద్రొక్కి రజోగుణము పై చేయి దక్కించుకుంటుంది.మరి ఇంకొక సారి సత్త్వ గుణము,రజోగుణాలని మూలకు నెట్టి,తమోగుణము మన నెత్తి మీద తైతక్కలాడుతుంది.ఇలా ఈ మూడు గుణాలు మనతో కబడ్డీ ఆడుకుంటుంటాయి.మనము ఆ గుణాలచేతిలో కీలుబొమ్మలము నిజానికి.

Sunday, 9 February 2025

సత్త్వం సఖే సంజయతి

సత్త్వం సఖే సంజయతి రజః కర్మణి భారత! జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత॥9॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు ఇంతదాకా తను చెప్పిన దానికి సారాంశం చెబుతున్నాడు.ఓ భరతశ్రేష్టా!అర్జునా!సత్త్వగుణం అనేది జీవుడిని సుఖబద్థుడిగా చేస్తుంది.రజోగుణం కర్మమార్గంలో ప్రయాణించేలా చేస్తుంది.తమోగుణం అనేది జ్ఞానాన్ని దూరం చేసి,అజ్ఞాన మార్గం వైపుకు మొగ్గేలా చేస్తుంది.దీని పర్యవసానంగా మానవుడు ప్రమాదాలకు లోనవుతాడు.ఎందుకంటే అతను తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాడు.ఎక్కడా ఆగి ఆత్మశోథన చేసుకోడు.

Saturday, 8 February 2025

తమస్త్వజ్ఞానజం విద్ధి

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం। ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత॥8॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి మూడోగుణం గురించి చెబుతున్నాడు.భరతశ్రేష్టా!అర్జునా!ఇప్పుడు నీకు మూడోగుణం గురించి విపులంగా చెప్తాను.మూడోగుణం తమోగుణం.ఈ తామసగుణం ముఖ్యంగా అజ్ఞానం నుంచి పుట్టుకొస్తుంది.తామసగుణమనేది నీచమయిన గుణము.ఇది జీవులను మాయలో పడేస్తుంది.ఒకరకమయిన భ్రాంతి,అయోమయంలో పడేస్తాయి మనలను.దీని వల్ల సోమరితనం పెరుగుతుంది.పగలు,రాత్రి తేడా లేకుండా నిద్ర ఆవహిస్తుంది.సరి అయిన అవగాహన లేక తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ పొరబాట్లు కుప్పలు తెప్పలు అయి,ఆ గందరగోళం నుంచి బయటపడే ప్రసక్తే వుండదు.కాబట్టి అజ్నానం నుంచి బయటపడాలంటే మానవుడు ముందర బద్ధకం,అతినిద్ర వదిలించుకోవాలి.ప్రతిది నాకు తెలియదు,అవసరం లేదు అనుకోకుండా నిజనిర్థారణ చేసుకోవాలి.

Friday, 7 February 2025

రజో రాగాత్మకం విద్ధి

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవః। తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్॥7॥ శ్రీమద్భగవద్గీత.....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాల గురించి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!రజోగుణం అనేది రాగమయము అయినది.అది కామము,మోహము,కాంక్ష,కోరిక,ఇష్టము....ఇలా తదితర భావాల ఆవేశం,సంపర్కముల వలన పుడుతుంది.ఈ గుణానికి లోబడిన జీవుడు ఇంక ఆ జంఝాటకం నుంచి బయట పడలేడు.సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగ అక్కడక్కడే గింగిరాలు కొడుతుంటాడు.ఇంక వాడు అది చేకూరే మార్గాలనే అన్వేషిస్తూ,ఆ ఆ కర్మలచే బద్ధుడవుతాడు.వాడికి ఇంక వేరే ప్రపంచం కానరాదు.అవసరం లేదు.

Thursday, 6 February 2025

తత్ర సత్త్వం నిర్మలత్వాత్

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం। సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ॥6॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!నేను మూడు గుణాల గురించి నీకు చెప్పాను కదా.వాటన్నిటిలోకి సత్త్వగుణం అనేది పరిశుద్ధమయినది.అది మానవుడికి జ్ఞాన ప్రకాశాన్ని ,ఆత్మ ప్రబోథాన్ని కలిగిస్తుంది.అంతేనా?కాదు.అది మనలవి పాపాలనుండి దూరం చేస్తుంది.ఆ దిశగా మనం ప్రలోభపడకుండా చేస్తుంది.ఈ గుణం మెండుగా కలిగి వున్నవారు సౌఖ్యం,జ్ఞానం అనే వాటికి కట్టుబడి వుంటారు.ఇక్కడ సౌఖ్యం అంటే ప్రాపంచిక సుఖాలు కాదు.ఆత్మ పరంగా మనం పొందే ఆనందం,తృప్తి.

Wednesday, 5 February 2025

సత్త్వం రజస్తమ ఇతి

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః। నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్॥5॥ కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ భౌతికమయిన ప్రకృతి వుంది కదా.ఇది సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణములతో కూడి వుంటుంది.జీవి స్వతహాగా నిర్వికారుడే.కానీ ఒకసారి ప్రకృతితో అతనికి సంపర్కం కలిగిందంటే,ఆ త్రిగుణాలచేత బద్ధుడు అవుతాడు.ఇదంతా మాయ అనే వల విసిరినట్లే జీవి మీదకు.

Monday, 3 February 2025

సర్వయోనిషు కౌంతేయ

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః। తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా॥4॥ కృష్ణుడు అర్జునుడుతో ఇలా అంటున్నాడు.అనేక గర్భాల నుండి జన్మించిన శరీరాలన్నిటికీ తల్లి ప్రకృతి.ఈ విషయం మర్చిపోవద్దు.అన్నింటా బీజప్రదాతను నేనే.కాబట్టి ఆ పుట్టిన సమస్త ప్రాణి కోటికి నేనే తండ్రిని.